పుస్తక సమీక్షలు

1. గోదావరి గాథలు

పుస్తకం తెరవకుండానే ముందుగా ఆకర్షించేది ముఖచిత్రం. ఒక మాతృమూర్తి ఒళ్లోపిల్లని పెట్టుకొని చిరునవ్వుతో ఎటోచూస్తున్న చిత్రం అది. ఆ మాతృమూర్తి ఒక గోండు మహిళ. బీద గిరిజన స్త్రీ. రాకితల్లి అంటారామెను. ఆమెకి ఫోటో తీయించుకోవడం అదే మొదటిసారి, అదే ఆఖరుసారి అవుతుందని ఆమెకిగాని, ఫోటో స్వయంగా తీసిన గ్రంథ రచయితకి గాని తెలియదు. ఆ తరవాత ఆమె జీవితంలో మళ్ళీ చిరునవ్వుకి నోచుకోనీయని విషాద సంఘటన గోదావరి గాథల్లో ఒకటి.

గోదావరి గాథలు కాల్పనిక కథలుకావు. రచయిత ఫణికుమార్‌ అదిలాబాద్‌ అధికారిగా ఏటూరు నాగారం, ఉట్నూరు, మొదలైన గ్రామాల్లో ఆదివాసుల మధ్య పనిచేస్తుండగా పొందిన రకరకాల అనుభూతులనూ, అనుభవాలనూ గోదావరి గాథలుగా రూపొందించారు. ఈ కథలు మొదట ఆంధ్రప్రభ దినపత్రిక సారస్వతానుబంధంలో కొన్ని వారాలపాటు ధారావాహికంగా ప్రచురితమైనాయి.

ఈ గ్రంథాన్ని పరిచయంచేస్తూ సుప్రసిద్ధ కథకులు మధురాంతకం రాజారాంగారు, గోదావరి గాథలు చీకటి కోణాలవంటి అజ్ఞాత గిరిజన ప్రాంతాలలోకి ప్రసరించిన ”కాంతికిరణాలు” అని రాశారు.

దాదాపు మూడేళ్ళ క్రితం సంభవించిన బీభత్సకరమైన గోదావరి వరదల్లో ఆదివాసులు అనుభవించిన కష్టనష్టాల తోనూ, వారికి వీలైనంత సహాయం అందించడానికి అధికారులు పడిన బాధలతోనూ అరంభమవుతాయి గోదావరి గాథలు. గాదిగూడ, రాజులమడుగు, మొదలైన గ్రామాల గురించి, వాటిలో నివసిస్తున్న వ్యక్తులగురించీ, రాచకుటుంబానికి చెందిన ఊరుపెద్ద గోండ్వానా భీష్ముడు మొదలుకొని, మారుమూల గ్రామంలో నిస్సహాయంగా దుర్భర ప్రసవ వేదనపడుతున్న సంబూ అక్కవరకూ, ఆదివాసులకు అత్యంత ఆప్తుడైనే ప్రొఫసర్‌ హేమండార్ఫ్‌, ఆయన సతీమణి, సహృదయురాలైన ఎలిజబెత్‌ మొదలుకొని సాహిత్య, లలిత కళలలో పండితుడైన సదాశివ మాస్టారు వరకూ – విభిన్న వ్యక్తుల జీవిత చిత్రాలూ, వారితో రచయితకు పరిచయమైనప్పటి విచిత్ర పరిస్థితులూ గోదావరి గాథలుగా చెప్పారు రచయిత.

క్లుప్తంగా, సరళంగా, సమ్మోహనకరంగా, కరుణా జనకంగా రాయడంలో రచయిత ప్రతిభావంతుడు. రచయిత చిత్రించిన ఆదివాసుల, గిరిజనేతరుల రసమయ జీవితాలతో బాటు, నిజాయితీపరుడైన ఉన్నతాధాకారి, సాహిత్యాభిమాని, ఛాయాచిత్ర కళాకారుడు, సున్నితమైన మనసున్నవాడూ అయిన రచయిత వ్యక్తిత్వం కూడా తొంగిచూస్తుంది ఆ గాథల్లోంచి.

ఆది వాసుల అంతరంగాన్ని, గిరిజనేతరుల దోపిడీ తత్త్వాన్నీ, తీవ్రవాదులు కల్పించే క్లిష్ట పరిస్థితుల్నీ అధికారులు ఎదుర్కొనే అవరోధాల్నీ చాకచక్యంగా సూచించారు రచయిత. సూచన ప్రాయంగా విశ్లేషించడం వల్లనేమో, ఇంకా లోతుగా తరచి, ఇంకా విపులంగా రాసిఉంటే బావుండే దనిపిస్తుంది. పుస్తకం చదివాక.

పుస్తకం చదవడం పూర్తయినా, రాకి తల్లివంటి దీన గిరిజనుల స్మృతులు వీడవు.

2. ప్రేమించడం స్త్రీ బలహీనత? కథానాయిక ‘రాజీ’

భర్త, భార్య, మరో స్త్రీ – వీరి కథ అసామాన్యమైనదేం కాదు. ప్రతి స్త్రీ తన భర్త తనకొక్కర్తెకే చెందాలని కోరుకోవడం సహజం. అటువంటిది, ఏ స్త్రీ అయినా వివాహితుణ్ణి ఎందుకు ప్రేమిస్తుంది?! వివాహితుడని తెలియక ప్రేమించవచ్చు. తెలిశాక కూడా ప్రేమిస్తుంది! పర్యవసానం మరో స్త్రీకి అన్యాయం చెయ్యడమే కాకుండా తనకు తాను అన్యాయం చేసుకుంటుంది. ఇదంతా ఎలా జరుగుతుంది? ఎందుకు కొనసాగుతుంది? భార్యాభర్తల మధ్య ప్రవేశించిన ‘మరో స్త్రీ’ మనసులో సంఘర్షణ ఏ విధంగా ఉంటుంది? ‘రాజీ’ ఒక ఉదాహరణ.

”అతనితో మాట్లాడినంత సేపూ అతను చెప్పేది నిజమనీ, అతను కల్మషంలేని మనిషనీ అనిపిస్తుంది. అతను తన పైఅధికారి అని కూడా గుర్తుండదు. అతను మాట్లాడే తీరు గుర్తురానీయదా సంగతి. తనని ఫోనుమీద కూడా మాటలలో కవ్వించి బెరుకుని పోగొట్టడానికి ప్రయత్నించినట్టు కనబడుతుంది…కానీ.. మగవాళ్ళని, ముఖ్యంగా మంచిగా కనబడే మగవాళ్ళని అంత త్వరగా నమ్మేయడం మంచిది కాదేమో!… తెలివిగా తన వివరాలన్నీ రెండు ప్రశ్నలతో రాబట్టేవాడు మొదటి పరిచయంలోనే. ఇంతలో అతని భార్య అక్కడకి రావడంతో తననావిడకు పరిచయం చేశాడు….”

ఇలా అన్నీ తెలిసే ప్రేమలో పడింది రాజీ – ‘రాజీ’ నవలలో కథానాయిక. ఈ నవల రాసినది ‘నిశ’. (1979 ప్రచురణ). ‘నిశ’ అనే కలం పేరుతో రాసినది ఎవరో మనకు తెలియవలసిన అవసరం కన్నా ‘రాజీ’ పాత్ర తన జీవితానుభవాలతో స్త్రీ పురుష సంబంధాల గురించీ, ప్రేమ, వివాహ బంధాల గురించీ, రాజకీయాల గురించీ, వీటన్నిటి మధ్యానలిగే మనుషుల మనస్సుల గురించీ చెప్పిన జీవితసత్యాలను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

”………….మంచి తనంతో తనని మోసగించుదామని ఉద్దేశం కాబోలు!

ఒక అరగంట వ్యవధి ఉంటే అరగంట, గంట వ్యవధి ఉంటే గంట తన దగ్గరకు వచ్చి కులాసాగా గడిపివెళదామని కాబోలు! తానిక్కడ ఉద్యోగం చెయ్యడానికొచ్చింది. గాని బడా బాస్‌గారి కులాసా కాలక్షేపం కోసం కాదు. అయినా అతనికెంత ధైర్యం. అలా తన ఇంటికి నదురూ, బెదురూ లేకుండా వచ్చేయడానికి! ఒక వేళ ఆ టైముకి ఆఫీసువాళ్ళెవరయినా వస్తే ఎన్ని అపవాదులు మొదలవుతాయి… ఎందుకయినా మంచిది, మొదట్లోనే తుంచేయడం శ్రేయస్కరం…అతనికింద పని చేస్తోంది కనుక తాను చచ్చినట్టు పడుంటుందనుకుంటున్నాడా ఏమిటి? అందరూ అభ్యుదయ భావాలు కలవాళ్ళే… ఇతర ఆడవాళ్లు తమ దగ్గర విచ్చలవిడిగా ఉండాలి… అంతవరకే వారి అభ్యుదయం….”

ఇలా తనలో తాను ఎంతో గింజుకుంటూనే రాజీ బాస్‌ ‘అనంత్‌’ పట్ల ఆకర్షితురాలైంది. ఆమె జ్వరంతో బాధపడుతున్నప్పుడు అతడు చూపించిన సానుభూతికి కరిగిపోయింది, ” ఇంత ఆప్యాయంగా నన్నెవరూ చూడలేదింతవరకూ” అంటూ.

అలా మొదలయిన వారి స్నేహం బలంగా అల్లుకుపోసాగింది. అప్పటి కింకా ‘ఒకరి జీవితం మరొకరికి తెలియదు. ఒకరి మనసు లొకరికి తప్పితే’.

”మీరు దగ్గరున్నంత సేపూ మీ మీద నమ్మకమే. దగ్గరలేనప్పుడు మాత్రం రకరకాల ఆలోచనలొస్తాయి” అనేది రాజీ. అంతకు ముందు అతనికి ఇంకెందరు స్త్రీలతో స్నేహ మోనన్న సందేహం , అతని భార్యని తలచుకున్నప్పుడు తను తప్పు చేస్తున్నాన్న సంకోచం అన్నీ అతని ముందు వ్యక్తపరచేది.

వాటికి అతని సమాధానం ”నీవింకా మన సమాజంలో అందరూ సామాన్యంగా అనుకునే మంచి చెడుల ఆంక్షల్ని అధిగమించలేకుండా ఉన్నావ్‌……నీతో స్నేహం అయ్యాక, మా ఆవిడమీద నాకు మరింత ఆర్ద్రత పెరిగింది. ఆవిడ అసూయకు, సంకుచిత తత్త్వానికి అప్పుడప్పుడు చిరాకనిపించినా, నిజానికి ఆవిడమీద నాకెప్పుడూ కోపం లేదు. జాలి తప్పితే. ఒకర్ని ప్రేమిస్తే మరొకర్ని ద్వేషించాలని లేదుగా! ఎన్నో ఏళ్ళుగా ఆవిడతో కలిపి బ్రతుకుతున్నాను… ఆవిడ బాగోగుల్ని చూడటం నా విధి కదా!…… కాని ఆవిడకి నా ఆలోచనల్లో పాలుపంచుకునే శక్తిలేదు…. నా అన్వేషణలో తోడివ్వలేదు……”

భార్య బాధపడుతోందని తెలిసి కూడా రాజీతో ప్రేమ వ్యవహారం ప్రారంభించాడు అనంత్‌.

భార్య ఉండగా పర స్త్రీతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న అతను రాజీతో మరో పురుషుడు స్నేహ పూర్వకంగా మాట్లాడటం చూసి సహించలేకపోతాడు! రాజీ తనకు తప్ప మరొకరికి చెందకూడాదన్న ఆవేశంతో ” నువ్వు నాకు కావాలి.. నువ్వంతా నాకు కావాలి… ముఖ్యంగా నీ శరీరం కావాలి.. నీ తలవెంట్రుకలనుంచి నీ కాలి గోరువరకూ కావాలి” అంటాడు. ఆమెని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ” నీ తెలివి, నీ పాట, అన్నీ నీ దగ్గరే పెట్టుకో… ఈ గుండెల్లో నేనున్నా లేకపోయినా నాకు ఖాతరు లేదు… నీ ప్రతి అణువూ నాకు కావాలి” అంటాడు.

అన్నీ తెలిసీ, అతను ‘తనవాడు’ కాలేడని తెలిసీ అతనితో సంబంధాన్ని కొనసాగించకుండా ఉండలేకపోతుంది రాజీ.

అతని సిద్దాంతం వేరు! ”ఆ ఉధృతం ఎల్లకాలం అలానే నిలిచిపోతుందనుకోవడం పొరపాటు. నిలిచి పోలేదని బాధపడటం అంతకంటే పొరపాటు” అని చెబుతాడు.

రాజీతో సంబంధం ఏర్పడటానికి ముందు అతనికి మరో స్త్రీ సాన్నిహిత్యం ఉండేది. ఆవిడతో ఇంకా కొంత అనుబంధం ఉంది. ” నాకావిడ మీద ప్రేమకంటే జాలేక్కువేమో. ఆవిడ నన్ను ప్రేమించినంతగా నేనామెను ప్రేమించలేకపోయాననుకుంటాను…” అని చెబుతాడు రాజీతో.

రాజీకి యువకుడైన ఒక ‘తీవ్రవాది’తో పరిచయం అవుతుంది. అతను అప్పుడప్పుడు మరో స్నేహితుడితో కలిసి రాజీ ఇంటికి వచ్చి కాస్సేపు ఇవీ అవీ ముచ్చటించి వెడుతుంటాడు. ముగ్గురూ కలిసి రాజకీయాల గురించీ, దేశపరిస్థితుల గురించీ చర్చించుకుంటూంటారు.

రాజీ పారిస్‌ వెడుతుంది, ఒక సాంస్కృతిక బృందంతో కలిసి. తీవ్రమైన అస్వస్థతతో స్వదేశానికి తిరిగి వచ్చేసరికి దేశంలో ”ఎమర్జన్సీ’ అమలులో ఉంది. రాజీ ఇంటికి అప్పుడప్పుడొచ్చే ‘తీవ్రవాది’ ఆమెకు చికిత్స చేస్తాడు. వీరిద్దరికీ గాఢమై న అనుబంధం ఉండి ఉంటుందన్న అనుమానంతో, తప్పించుకు తిరుగుతున్న ఆ తీవ్రవాది గురించి సమాచారాన్నంతా రాజీ నుంచి రాబట్టడానికి ప్రయత్నిస్తారు పోలీసులు. సర్వోదయ కార్యక్రమాన్ని చేబట్టిన రాజీ మేనమామ గురించి కూడా అనుమానించి, రాజీకి కూడా అందులో జోక్యం జోక్యం ఉందని భావించి ఆమెని జైల్లో పెడతారు.

జైలులో రకరకాల నేరాలు చేసిన స్త్రీలతో పరిచయమవుతుంది రాజీకి నేరాలు చేసి వచ్చిన స్త్రీలలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనపడదు ఆమెకి. ఆ స్త్రీలను జైలు అధికారులు కుక్కలకన్నా హీనంగా చూస్తారు. రాజీని మాత్రం శారీరకంగా హింసించకపోయినా, ఇతరు యువతీ యువకుల్ని హింసించే గదుల దగ్గరగా తీసుకుపోయి రాజీని ప్రశ్నలడిగే వారు. ”వారి కేకలు, యమబాధతో పెడుతున్న పెడబొబ్బలు” వింటుంటే ఆమెకి కడుపులో పేగులు ఉండలు చుట్టుకుపోయేవి. అదే తనకు కేటాయించిన శిక్ష అని అర్థం చేసుకుంటుంది.

అది ‘ఎమర్జెన్సీ’ ప్రభావం! అమాయకులు బలైపోతున్నారు. నాలుగు నెల్లకి రాజీని విడుదల చేశారు. ఆమె మీద నిఘామాత్రం ఉంది. ఇల్లూ, ఫోనూ అన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఆమె నిరాధారంగా మిగిలింది. ఆమె బాస్‌ (ప్రియుడు) ఊళ్ళోలేడు. అతను వస్తేగాని ఆమె ఉద్యోగం సంగతి తేలదు.

ఈలోగా ఆమె స్నేహితుడి ద్వారా ఒక ‘స్వామీజీ’తో పరిచయమవుతుంది. స్వామీజీ ఆలోచనలు రాజీని బాగా ప్రభావితం చేస్తాయి. స్వామీజీతో ‘ఎమర్జన్సీ’ గురించి చర్చించి ఎన్నో విషయాలు తెలుసుకుంటుంది.

తరవాత ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. అయినా, మళ్ళీ ఉద్యోగంలో చేరాలనుకోదు రాజీ. స్వామీజీ ఆశ్రమంలో ఉండి గిరిజనులకు సేవచెయ్యడానికి డెహ్రాడూన్‌ వెళ్లిపోవాలనుకుంటుంటుంది. ఆ సమయంలో అనంత్‌ ఊరి నుంచి వచ్చి, రాజీని కలుసుకోవడానికి వస్తున్నావని చెప్పి, మళ్ళీ తన ‘పాత స్నేహితురాలు’ రావడం వల్ల రాజీని కలుసుకోవడానికి రాలేకపోతాడు. రాజీకి తీవ్ర ఆశాభంగం కలుగుతుంది. ”తన అవసరానికి, తన కోర్కె కనుగుణంగా ఏదీ సాగదు. అతనికి వీలైనప్పుడు అతని కోర్కె అనుసారమే ఏది జరిగినా, అయినా తానేమీ చేయలేదు. నిస్సహాయంగా ఒంటరిగా బాధపడటం మినహాయించి. తన ఒంటరి తనంలో, తన నిస్సహాయతలో పాలు పంచుకునే వీలు అతనికి లేదు” అని గ్రహిస్తుంది.

” ఇలా జీవితం అంతా అతని కోసం వేచి ఉండడం, తపిస్తూ ఉండడమే. ఇదేనా జీవితం…. అతనిని మరిచిపోగలిగితే, అతని నుంచి దూరంగా వెళ్ళిపోగలిగితే…” అని ఆలోచిస్తుంది. ఒక నిశ్చయానికొచ్చి, తాత్కాలికంగా నైనా స్వామీజీ ఆశ్రమానికి డెహ్రాడూన్‌ వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి అనంత్‌కి ఉత్తరం రాస్తుంది. ”… నాకెవ్వరూ లేరనిపించింది… మీరు నాకు కావాలి. అహర్నిశలూ నాతో ఉండాలి…. మీరు నిజంగా నా దగ్గర కొచ్చిన కొద్ది క్షణాలు కూడా, ఎవరైనా వస్తారేమో, ఎవరికైనా తెలుస్తుందేమోనన్న శంక నన్ను క్రుంగదీస్తుంది. నాకలాంటి దొంగ బ్రతుకు గిట్టదు… మీతో బాహాటంగా బ్రతికే వీలు లేదు. బూటకపు బ్రతుకు బ్రతకలేను…..” అని.

దానికి సమాధానంగా……. ”జీవితంలో ఎవరికెంత వరకు ఏది ప్రాప్తమో అంతవరకు పొంది తృప్తి చెందడం మంచిది. ఆపైన ఆరాటపడటం, బాధపడటం అనవసరం…. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నీ మంచే కోరుతాను” అని రాస్తాడు అనంత్‌.

రాజీ మళ్లీ సమాధానం రాస్తుంది. అందులో ‘మీకు బంధాలు బంధాలుగా కనపడవు. వాటిని జీవితంలో గొప్ప అవకాశాలుగా తీసుకుంటారు. ఆ అవకాశాలతో, అనుభవాలతో జీవితాన్ని విస్తృతపరచుకుంటారు. ఆ ప్రయత్నంలో ఏరాయో, రప్పో అడ్డువస్తే దానిని మెలకువగా తప్పించుకుని ముందుకు సాగిపోతారు.. మీరు జీవితాన్ని అనుభవిస్తారు, ఆనందిస్తారు, నేను ఊహిస్తాను, బోల్తాపడుతూ ఉంటాను. మీలాగా… జీవితంలో కొద్దో గొప్పో రాజీపడితేనే గాని ఏ వ్యక్తి సుఖంగా బ్రతకలేడేమో!” అని రాస్తుంది.

రాజీ ఉత్తరంలో రాసిన విషయం ఒక్క ‘అనంత్‌’ లక్షణమే అనిపించదు. సామాన్యంగా చాలామంది పురుషుల స్వభావమే అంత అనితోస్తుంది. అందుకే కొందరు ఆడవాళ్లు ప్రేమించి మోసపోతూ ఉంటారు. కొందరు బోర్లాపడుతూ ఉంటారు.

3. గురిచూసి వదిలిన బాణాలు కొన్ని

           ‘గురి చూసి పాడే పాట’

ఈ స్త్రీవాద కవితా సంకలనం గురించి మూడు వివరణలిచ్చారు ప్రచురణ కర్తలు ముందుగా.

ఇందులోని పదహారుమంది స్త్రీవాద కవయిత్రుల కవితల్ని ప్రచురించడంలో అక్షరక్రమాన్ని గానీ, కాలక్రమాన్ని గానీ పాటించలేదనీ, కవితా వస్తువుని బట్టి వర్గీకరించే ప్రయత్నం మాత్రం కొంత చేశారనీ స్పష్టం చేశారు.

ఇందులో చేర్చిన ఇరవై ఆరు కవితల్లో ఒకటి ఇంగ్లీషు నుంచి అనువదితం కావడం, మరొకటి జానపద కవిత కావడం విశేషం. ఈ కవితలు మంచివనీ, స్త్రీ వాద దృక్పథంతో రాసినవి మాత్రమేననీ తాము అనుకోవడం లేదని స్పష్టీకరిస్తూ, కవయిత్రులు రాసిన కవితలతో తెలుగులో వచ్చిన మొదటి సంకలనం బహుశః ఇదేనని ప్రకటించారు. ఇంకా మంచి కవితలు వారి దృష్టికి తెస్తే, సమగ్రంగా మరో సంకలనాన్ని అచ్చు వేస్తామని హామీ ఇచ్చారు ప్రచురణ కర్తలు.

ఈ సంకలనంలో చేర్చిన స్త్రీవాద కవయిత్రులను క్లుప్తంగా పరిచయం చేశారు. సంకలనం ఆఖరున.

ఇందులోని కవితలు చాలా వరకు 1981 – 90 మధ్యకాలంలో వివిధ పత్రికల్లోనూ, ఇతరత్రా ప్రచురితమయ్యాయి. అయితే, స్త్రీ వాద కవిత్వం బాగా వెలుగులోకి వచ్చింది. 1988 నుంచే. ఈ సంకలనంలో ఒక కవిత మాత్రం (ఓల్గాది) 1972లో మొదట అచ్చయింది. ఒకటి అముద్రితం అని ప్రకటించగా మరోదానికి ఏ సమాచారమూ లేదు. ఒక దానికి ప్రచురించిన పత్రిక పేరు ఉంది గాని, తారీఖు లేదు. ఒకదానికి తారీఖు ఉందిగాని ఎందులోదో తెలియదు. పరిశోధన చేసే వారికి తప్ప తక్కిన పాఠకులకు ఇవి స్వల్ప విషయాలే కావచ్చు.

ఈ సంకలనంలోని కవితలు ”వస్తువు” ప్రకారం వర్గీకరించడం అంత నిష్ఠగా జరగకపోయినా, ప్రచురణ కర్తలు ”వస్తువు”కే ప్రాధాన్యం ఇచ్చారన్నది స్పష్టమవుతోంది. అందుచేత దీన్ని ఆ పరిధిలోనే ఎక్కువగా చూడవలసి ఉంటుంది.

ఈ కవితా సంకలనం శీర్షికకి సరిగ్గా వర్తించేది ఆఖరి కవిత – ”సంఘంలో చేరుదాం” అనే జానపద కవిత. ఇది తెలంగాణా ప్రజల్లో ఏ యే ప్రాంతాల్లో, ఎంతకాలంగా ప్రచారంలో ఉందో తెలిపితే బావుండేది. ”సంఘం” అనే ఆ వ్యవస్థ కొత్తగా ఏర్పడిందే అయి ఉంటుంది. కాబట్టి, ఈ పాట గురించి మూల వివరాలు తెలుసుకుని ప్రకటించాల్సింది.

తక్కినవన్నీ ”గురిచూసి” పాడిన ”పాట”లు కావు కానీ, గురి చూసి వదిలిన బాణాలు కొన్ని ఉన్నాయి. వాటిలో వాడిగా ఉన్నవాటిలో ప్రప్రథమంగా చెప్పుకోదగిందీ, చిన్న తుమ్ము ముల్లులా గుచ్చుకునేదీ సావిత్రి కవిత ”బందిపోట్లు”.

”పాఠం ఒప్పచెప్పక పోతే పెళ్ళి చేస్తాన”ని

పంతులుగా రన్నప్పుడే భయమేసింది.

” ఆఫీసులో నా మొగుడున్నాడు!

అవసర మొచ్చినా సెల వివ్వ” డని

అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది.

పెళ్ళంటే ”పెద్ద శిక్ష” అని

గురి చూసి గుండె లోతుల్లోకి దిగేలా వసంత కన్నబిరాన్‌ వేసిన బాణం ”నిరీక్షణ”-

నీ ఉపన్యాసాల్ని ముంచెత్తే చప్పట్ల కోసం

ఉప్పొంగిన హృదయంతో నిరీక్షణ

ఎంతో సరళంగా చప్పున బోధపడే

నీ కవితల్లోని వాస్తవికత

నా జీవిత సత్యాన్ని

ఎప్పుడైనా చూడగలుగుతుందా

అనే సంభ్రమంతో నిరీక్షణ…

ఇది సుదీర్ఘ కవిత. ఇది ఒక ప్రత్యేక పరిస్థితికి స్పందించి రాసినదైనా విశ్వజనీనమైన ఒక జీవిత సత్యానికి సమగ్ర చిత్రణ. ఓల్గా అనువాదం చదివించేదిగా ఉంది.

గురి చూసిన వాటిలో ఒకటి జయప్రభ రాసిన ”చూపులు”. కంపరం పుట్టించే పురుషుల చూపుల్ని ఎదుర్కోవడానికి ఆమె ఆవేదన, ఆశ –

” కళ్ళకే కాదు

ఈ దేశంలో ఆడదానికి

వళ్ళంతా ముళ్ళుండే రోజూ

ఎప్పుడొస్తుందా అని!

అయితే, ” ఈ దేశంలో….” అని ప్రత్యేకించ నవసరం లేదు!

మరో వాడి బాణం ఓల్గా కవిత ”మెహందీ స్త్రీల విజ్ఞప్తి”. దీనికి నేపథ్య వివరణ ఇచ్చినట్లుగానే ”పంచాది నిర్మల” గురించి రాసిన కవితకు కూడా నేపథ్య వివరణ ఇచ్చి ఉంటే బాగుండేది.

స్త్రీ వాదానికి ప్రతీకలు – ఏలూరి పార్వతి కవిత ”సిగ్గు సిగ్గు”, ఓల్గా కవిత ”గృహలక్ష్మి”, విమల కవిత ”వంటిల్లు”. పైటను తగలెయ్యాలి” అని జయప్రభ చేసిన నినాదానికిప్పుడు అగత్యం లేదు. అది కొంతమందినే పట్టుకు వేళ్ళాడుతోంది. అది లేనంత మాత్రాన ఒరిగేది లేదు.

పాటిబండ్ల రజని ”అబార్షన్‌ స్టేట్‌మెంట్‌” పాఠకుల హృదయాల్ని కదిలిస్తుంది. ఆధునిక స్త్రీ జీవితానికీ, సహజ సిద్ధమైన మాతృత్వానికీ మధ్య జరిగే సంఘర్షణకి అద్భుత చిత్రీకరణ ఈ కవిత.

”అయ్యో!

పా లింకిపోవడాని కున్నట్లు

మన సింకిపోవడానికీ

మాత్రలుంటే ఎంత బావుండు!”

ఈ ఆవేదన స్త్రీ వాదానికి విరుద్ధం అనుకోవడం పొరపాటు. ఈ సంఘర్షణ అతి సహజం.

శిలా లోలిత తన కవితలో ”సమాధిలోనైనా మరణించనీ” అని వాపోవడంలో అశావాదంతో కూడిన స్త్రీ వాదం లేదు. అలాంటిదే రావులపల్లి సునీత కవిత ”ఆత్మహత్య నా నిరసన!”

ఈ సంకలనంలో చేర్చిన ”ఆముద్రిత” కవిత శివలెంక రాజేశ్వరీ దేవి ”ద్వైతం”. ఇందులో స్త్రీ మనస్తత్వంలోని వైరుధ్య చిత్రణలో స్పష్టత, అస్పష్టత – రెండూ ఉన్నాయి.!

భర్తగా, తండ్రిగా, ఎదిగిన కొడుకుగా, ఇంకా ఎన్నో విధాలుగా స్త్రీ వాదుల బాణాలను ఎదుర్కొన్నాడు పురుషుడు ఈ సంకలనంలో.

వృద్దురాలైన తల్లిని నిర్లక్ష్యం చేసే కొడుకు గురించి రావులపల్లి సునీత రాసిన కవిత ”అమ్మ అలిగింది.”

”తెల్లారకట్ట కివతల….” జుగల్‌ బందీ”, ”స్పర్ప పరిష్వంగం” మొదలైన కవితలు చదివాక స్త్రీ వాదుల దృక్పథం తెలుస్తుంది.

అచ్చుతప్పులు మనకి అలవాటే కానీ, కవయిత్రి పేరు కొన్ని చోట్ల ”ఘంటశాల…” అనీ, కొన్ని చోట్ల ”ఘంటసాల….” అనీ పడకుండా చూడవలసింది.

ఈ కాలం రచయితలు భాషా ప్రయోగంలో ఒక కొత్త ఒరవడిని ప్రవేశపెట్టారు. ”స్నానిస్తూ”, ఆప్యాయిస్తున్న”, ”ఆత్మహత్యించుకుని” వంటి ప్రయోగాల్ని జీర్ణించుకోవడం కష్టమే!

ఆంగ్లపదాల్ని వాడటం అర్థం చేసుకుందామన్నా, ”సౌందర్య కొలబద్దలు”, ”అలంకృత గంగిరెద్దుల్ని” వంటి దుష్ట సమాసాల్ని ఆమోదించడం కష్టం. ఈనాటి వచన కవిత్వం పట్ల విముఖత ఏర్పడటానికి ఇటువంటి ప్రయోగాలు, మరింత దోహదం చేస్తున్నాయి.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 20.3.1991)

 4. ఆమె కలంకూడా అనర్గళం

‘పాతివ్రత్యం నుంచి ఫెమినిజం దాకా : ‘ఆత్మకథ’

పుస్తకం పేరు చూడగానే ”ఫెమినిజమ్‌ పాతివ్రత్యానికి వ్యతిరేకమైనదా, ఫెమినిస్టులు పతివ్రతలు కారా” అనే సందేహం కలగవచ్చు కొందరికి, కానీ, పుస్తకం చదివితే తెలుస్తుంది – పురుషాధిక్య వ్యవస్థలో స్త్రీ గృహనిర్వహణకి మాత్రమే పరిమితమైన దశ నుంచి, తన గురించీ ఇతర స్త్రీల గురించీ మొత్తం సమాజం గురించీ స్వతంత్రంగా ఆలోచించి పురుషునితో సమానంగా స్వేచ్ఛా జీవితాన్ని గడిపే దశకి ఎదగడాన్ని సూచించడమే ఈ గ్రంథ శీర్షిక ఉద్దేశం అని.

”ఈనాడు భారతదేశంలో సనాతనత్వాన్ని, మూఢ విశ్వాసాలను బలపరిచేది, పోషించేది తల్లుల హౌదాలో స్త్రీలు మాత్రమేనని గుర్తించడం అవసరం” అని రాశారు, ప్రఖ్యాత మానవతావాది వి.ఎం. తార్కుండే ఈ పుస్తకం గురించిన ప్రస్తావనలో. మన దేశంలో ఆ పరిస్థితికి దోహదం చేస్తున్న పురుషాధిక్య సమాజంలో, బాల్యవివాహాలు జరిగే రోజుల్లో పుట్టి పెరిగిన మల్లాది సుబ్బమ్మగారు ” అనాగరికదశ నుండి ఆధునికతవైపుకి” ఎన్ని కష్ట నిష్టూరాలు భరించి ఎలా జీవిత యాత్ర సాగించారో తెలియజేశారు తమ ఆత్మ కథలో.

సుబ్బమ్మగారు ఒక అనామక గృహిణి స్థానం నుంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన వక్తగా, స్త్రీ సంక్షేమాభిలాషిగా, స్త్రీ స్వేచ్ఛావాదిగా, సంఘ సంస్కర్తగా, సాహితీమూర్తిగా, హేతువాదిగా, మానవతా వాదిగా ఎలా రూపొందారో తాను తప్ప ఇంకెవ్వరూ అంత సమర్థవంతంగా తెలియజేయలేరన్నంత ఆత్మవిశ్వాసంతో, సహజసిద్ధమైన నైపుణ్యంతో రాశారు ఈ ఆత్మ కథని.

సనాతన కుటుంబవాతావరణంలో నోములూ వ్రతాలూ చేస్తూ, పిల్లలు పెద్దవాళ్లయ్యే వరకూ సంసారతాపత్రయంలో మునిగి తేలుతూ, చదువుకోవాలనే తపనతో నడివయస్సులో చదువు కొనసాగించడం, డిగ్రీ సంపాదించడం, వివిధ సాంఘిక, రాజకీయ ఉద్యమాల్లో ప్రవేశించడం, ఆంధ్ర – తెలంగాణా సంఘర్షణలో జైలుకి వెళ్లడం, వృద్ధురాలైన అత్తగారి బాధ్యత వహిస్తూనే సంఘ సంస్కర్తగా వివిధ కార్యక్రమాల్ని నిర్వహించడం సుబ్బమ్మగారి పట్టుదలనీ, కార్యదక్షతనీ తెలియజేస్తాయి. ఆడవారికి సహజంగా నగలమీద ఉండే మోజు వదిలించుకుని, స్త్రీ స్వేచ్ఛావాదిగా మూఢ విశ్వాసాలకు విరోధిగా మెళ్ళో మంగళసూత్రాలు కూడా తీసేసి నిరాడంబరంగా రూపొందడం అందరికీ సాధ్యం కాదు. సుబ్బమ్మగారు 11 సంవత్సరాల వయస్సులో వివాహం అయినప్పటి నుంచీ, 56 సంవత్సరాలుగా రామ్మూర్తి గారితో అన్యోన్య వైవాహిక జీవితం గడుపుతూ, పిల్లలూ, మనవల్తో తులతూగుతున్న ప్రచండ స్త్రీ వాది. చెట్టంత కొడుకు ప్రమాదవశాత్తూ ఆల్జీరియాలో మరణించాక నాలుగోరోజునే, తన గర్బశోకాన్ని తనలోనే ఇముడ్చుకుని, యథావిధిగా ఒక సభలో ప్రసంగించడం ఆమె ఆత్మస్థైర్యాన్నీ, కర్తవ్య పరాయణతనీ తెలుపుతుంది.

ఇది సుబ్బమ్మగారి ఆత్మకథ అయినా, మరో విధంగా, ఇది ఆంధ్రుల సామాజిక జీవనానికీ, తెలుగు స్త్రీల సామాజిక చరిత్రకీ ప్రతిబింబం.

ఈ ఆత్మకథ స్థూలంగా 12 భాగాలుగా విభజింపబడింది. ఇందులో ఆమె బాల్యజీవిత విశేషాలూ, వైవాహిక జీవిత విశేషాలూ, సాంఘిక, రాజకీయ ఉద్యమాలలో పాత్ర, సాహితీ రంగంలో కృషి, వివిధ సంస్థల స్థాపన, నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం, మొదలైన విషయాలున్నాయి. 9వ భాగంలో సుబ్బమ్మగారి భర్త రామ్మూర్తిగా గారి వ్యక్తిత్వ చిత్రణ, భార్యాభర్తల పరస్పర అవగాహనా తెలియజేస్తే, 11వ భాగంలో తన జీవిత సహచరుని విషయమైన సుబ్బమ్మగారి స్పందన, అందుకు రామ్మూర్తిగారి ప్రతిస్పందనా ప్రకటించారు.

12వ భాగం అయిన ”అనుబంధం”లో సుబ్బమ్మగారి రచనలూ, ప్రసంగాలూ, తదితర కార్యక్రమాల పట్టికలున్నాయి.

మొత్తం గ్రంథమంతా సుబ్బమ్మగారి వ్యక్తిత్వ వికాసాన్ని ఆవిష్కరించేదైనప్పటికీ, 10వ భాగంలో ”నేను నేనుగా ఎలా రూపొందాను?” జర్నలిస్టుగా, రేషనలిస్టుగా, ఫెమినిస్టుగా, హ్యూమనిస్టుగా ”నేనెలా అయ్యాను?” నేనెవరు? నా ఫిలాసఫీ ఏమిటి?” అనే ప్రశ్నలకు సమాధానంగా, సంక్షిప్తంగా తమ జీవితసారాన్ని సమీక్షించారు. తమ భవిష్యత్తు గురించీ, పాఠకులకూ, ప్రజానీకానికీ తాము ఇచ్చే సందేశం గురించీ రాశారు. ఆమె సిద్ధాంతాలూ, ఆచరణా, జీవన విధానం – ఆమెకు సంబంధించిన ఏ అంశం గురించి అయినా ఇతరులు చేసిన ప్రశంసలతో బాటు ఆమె ఎదుర్కొన్న విమర్శలను సందర్భాను సారంగా వివరించారు. అంతేకాక, ఆమె ఆత్మకథని చదివిన పాఠకుల నుంచి రాబోయే విమర్శల్ని ఊహించి ముందుగానే సమాధానాల్ని కూడా ఇచ్చారు.ఈ పుస్తకంలోతమ గురించి నిజాల్ని చెప్పడం ‘ఆత్మస్తుతి’ ఎందుకు కాదో వివరించారు. ఆమె కుటుంబ విషయాల్ని గాని, ఆర్థిక విషయాల్ని గాని, సంఘసంస్కరణ విషయాల్ని గాని, ఆమె ఆలోచనల్ని గాని – వేటినీ దాచకుండా, నిర్మొహమాటంగా, విశ్లేషణాత్మకంగా వివరించారు.

ఈ ఆత్మకథని ఒక కథలా బాల్యంతో మొదలుపెట్టినా, బాల్యవివాహం, మూఢాచారాలు, విద్యాసక్తి, కులవ్యతిరేకకృషి, కుటుంబ నియంత్రణోద్యమం, వరకట్న దురాచారాలపై చర్య, స్త్రీ విమోచన శిక్షణ నిర్వహణ, శ్రామిక మహిళ సేవ, ఇతర మహిళాభ్యుదయం కార్యక్రమాలు, మొదలైన విషయాల గురించి విడివిడిగా ప్రసంగవ్యాసాల్లా రాశారు. ప్రతి విషయాన్నీ విశ్లేషించడంలో పూర్వాపరాలను ఎన్నోసార్లు చర్వితచర్వణం చేశారు. సుబ్బమ్మ గారు తమ ఆత్మ కథా సంవిధానంలో పునరుక్తి అనివార్యమైందని ముందుగానే వెల్లడించారు. అయితే, పునరుక్తులున్నప్పటికీ విసుగనిపించదు. సుబ్బమ్మ గారి వక్తృత్వ లక్షణం ఆమె రచన వెంట పాఠకుల్ని పరుగు పెట్టిస్తుంది. జలపాతం లాంటి ఆమె భావాల ఉద్ధృతం పాఠకుల్ని ముంచివేస్తుంది. ఆమె స్వయంకృషికీ, పట్టుదలకీ సాహసానికీ, ఉత్సాహానికీ, ఉద్వేగానికీ ముగ్ధులవకుండా ఎవరైనా ఉండలేరు.

ఈ పుస్తకంలో ఆత్మకథకి ముందూ, వెనకా ప్రముఖుల ప్రశంసలతో కూడిన లేఖలూ, ప్రసంగాలూ (పుస్తకావిష్కరణ సభలో చేసినవి) జతచేయబడ్డాయి.

”సుబ్బమ్మ గారిలాంటి విదుషీమణులు లక్షకు ఒక్కరుంటే దేశ స్వరూపమే మారిపోతుంది.” అని ప్రశంసించారు నార్ల వెంకటేశ్వరరావుగారు ఒక సందర్భంలో.

ఆమె ”కటికరాతి నేలను చీల్చుకుని వినీలాకాశంలోకి తలెత్తిచూసే మొక్క….. ఆ మొక్క ఈనాడు… మహావృక్షం” అయిందనిపిస్తుందనీ,

”ఆమె స్వయంసిద్ధ” అనీ

ఆమె ఆత్మకథ ”చదివినవారికి తెలుగులో ఒడుపుగా రాయటం మాట్లాడటం అలవడుతుంది.” అనీ

” ఈ పుస్తకం చదువుతుంటే ఆమెతో మాట్లాడుతున్నట్లూ, ఆమె ” అంతరంగంతో కబుర్లు చెబుతున్నట్లూ” అనిపిస్తుందనీ,

ఆమె ”క్రియాశీలి” అనీ, ” మహావ్యక్తి” అనీ, ”అగ్నిశిఖ” అనీ ”మహిళా కంచుకంఠం” అనీ పలువురు ప్రముఖుల ప్రశంసల్ని అందుకోగలిగిన సుబ్బమ్మగారు అని విధాల అభినందనీయులు.

(సుప్రభాతం, 20 మార్చి, 1992)

5. ‘మధురాంతకం రాజారాం కథలు’

రాయలసీమలోని గ్రామీణ ప్రాంతాల అందచందాలనూ, అక్కడి మనుషుల కష్ట సుఖాలనూ కథలుగా మలిచిన వారిలో ప్రముఖులు శ్రీ మధురాంతకం రాజారాం.

రాజారాం గారి తాజా సంకలనంలో 40 కథలున్నాయి. 1958 – 1990 మధ్యలో ప్రచురితమైనవి. అయితే, వాటిని ఆ కాలక్రమంలో కూర్చలేదు. ఇందులో కొన్ని కథలు ఇంతకు ముందు వెలువడిన ఈ రచయిత కథా సంకలనాల్లో చోటు చేసుకున్నాయి.

” మధ్య తరగతి జీవితాల్ని బహు ముఖాలుగా కథలలో రూపొందించగల ప్రతిభావంతుడు” అని పాలగుమ్మి పద్మరాజు గారు రాజారాం గారిని అభివర్ణించారు. కానీ, రాజారాం గారు బడుగు వర్గాల వారి నికృష్ట జీవితాల్ని కూడా నిశితంగా పరిశీలించి రాసిన కథలున్నాయి. ‘వాన కోటు’, ‘ద్వంద్వ సమాసం’, ‘అడవిలో ధర్మ దేవత’, ‘రైలు ప్రయాణం’, ‘అజ్ఞాత వాసం’, ‘సవతి బిడ్డలు’ మంచి ఉదాహరణలు.

తమ చుట్టూ ఉన్న వివిధ జీవన స్థితి గతుల్నీ, అనేక మానవ స్వభావాల్నీ ఆసక్తితో అధ్యయనం చేసిన రాజారాం గారి కథల్లో చాలా వాటిలో ”మేస్టారు’ ఒక ముఖ్యపాత్ర. పల్లె జీవితాన్నీ, పట్నం జీవితాన్నీ ఆకళించుకున్న పాత్ర ఈ ‘మేస్టారు’ – కొన్ని కథల్లో ఉత్తమ పురుషలోనూ, కొన్ని కథల్లో ప్రథమ పురుషులోనూ దర్శనమిస్తాడు. బెత్తం పుచ్చుకునే బడిపంతులుగా కాకుండా సహృదయుడిగా, స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా, ఆత్మీయుడిగా కనిపిస్తాడు.

రాజారాం గారి కథనం ఒక విధంగా సంప్రదాయ రీతిలో ఉంటుంది. ఉప కథల్తో పిట్ట కథల్తో, మధ్య మధ్య వర్ణనలతో సావధానంగా కబుర్లు చెబుతున్నట్లుండి, కథల్లో కథ ‘చెప్పే’ పద్ధతిలో రాస్తారు రాజారాం గారు ‘రామారావు చతు ర్లోకాలు. కథలో చెప్పినట్లు ”నేపథ్య సంగీతంలో కొంత వాతావరణం. ఒకింత అనుభవం. ఇంచుక కల్పన” జోడించి చెబుతారు. హరిదాసు, బుడబుక్కలవాడు వంటి పాత్రలతో గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబపజేసే కథల్లో, పల్లెటూళ్లలోని కుటిల రాజకీయాల్నీ, ధనవంతుల ఆరాచకత్వాన్నీ చూపిస్తారు.సామాజిక జీవితంలో అడుగడుగునా ఎదురయ్యే అవినీతిని, వరకట్నాల వంటి దురాచారాల్నీ ఖండిస్తూ రాస్తారు. అవమానాలు ఎదుర్కొంటున్న స్త్రీలను సానుభూతితో చిత్రిస్తారు.

ఈ సంకలనంలోని కథలు చాలా వరకు ఒక మోస్తారు పెద్ద కథలే. అన్నిటికన్నా చిన్న కథ ‘దాగుడు మూతలు’, భార్య మూఢ విశ్వాసాన్ని భగ్నం చేసిన భర్త చమత్కారం ఇది. దీనిలోలాగే భార్యా భర్తల సంభాషణలున్న ఇతర కథల్లో కూడా సున్నితమైన సరసోక్తులున్నాయి.

రైలు ప్రయాణాలూ, బస్సు ప్రయాణాలూ ఎంత విజ్ఞానదాయకంగా ఉంటాయో, ఎన్ని అనుభవాలను సమకూర్చగలవో రాజారాం గారి కథలు నిరూపిస్తాయి. చుట్టూ ఉన్న మనుషుల మధ్య పరస్పర సహకారం, నమ్మకం ఉండటం ఎంత ముఖ్యమో తెలియజేస్తాయి ఆయన కథలు.

మనిషి సంఘజీవి. బంధు మిత్రులు లేకుండా చేసుకుని ఒంటరిగా బ్రతకడం సాధ్యం కాదని తెలియ చెబుతుంది. ‘గ్రూప్‌’ ఫోటో కథ.

పల్లెటూళ్ళో మనుషులు చదువుకోని వాళ్లయినా, బీద వాళ్లయినా ఆప్యాయతకూ, ప్రేమకు కరువు లేని వాళ్లని స్వానుభవంతో తెలుసుకుంటాడు అమెరికా నుంచి ఆంధ్ర దేశంలోని మారు మూల పల్లెకు తాతగారింటికి వచ్చిన మనవడు. మేనత్త చూపిన ఆప్యాయతకు మనను అర్ద్రమవుతుంది. పాశ్చాత్య ప్రభావానికి లోనైన వారికి కనువిప్పు కలిగించే కథ ఇది.

‘నాగరికత’ ప్రబలిన కొద్దీ గ్రామాల్లో మన పురాణ సంస్కృతి ఎలా దిగజారిపోతోందో చెప్పే కథ ‘జీవన ప్రహసనం’.

మనిషిని మనిషి నమ్ముతున్న రోజులు కావివి. జంతువులు నయం. ‘ట్రయినింగ్‌’ ఇస్తే పులిని కూడా నమ్ముతుంది మేక – అని ‘సర్కసు డేరా’ కథలో చూస్తాం.

వాస్తవం కల్పనలా మనోహరంగా ఉండదు అని తెలియచెబుతాయి – ‘చేదు నిజం’, స్వస్థానం’, కోరిన కోనలో కురవని వాన’ కథలు.

బీదవాళ్లన్నీ, అమాయకుల్నీ అన్యాయంగా దొంగతనాలు మోపి కష్టాలపాలు చేయడం సామాన్యంగా జరుగుతుంది. ఈ సత్యాన్ని వివరించిన కథలు – ‘సమ్మరానివాడు’, ‘రైలు ప్రయాణం’, నోరు లేని జీవుడు’, ‘నిజా నిజాలు’.

భార్యా భర్తల ఆర్థిక సంబంధాల్లో స్త్రీల పరిస్థితుల్లోని వైవిధ్యాన్ని చిత్రించే కథలు – ‘బ్రతుకు బాట’, ‘గాలి పటాలు’ ‘గాజు దీపాలు’, ‘వ్యవస్థ’, ‘స్పాట్‌ లైట్‌’ ‘అడిగి వచ్చిన వరం’.

వరకట్నాల సమస్యకి పరిష్కారం యువతీ యువకుల చేతుల్లోనే ఉందని తెలియజెప్పే కథలు – ‘వ్రత భంగం’, ‘కన్నె చెర’, ‘కొత్త నీరు’.

అవినీతి, అన్యాయం అన్ని చోట్లా విస్తరించా యని చెప్పే కథలు – ‘అడవిలో ధర్మ దేవత’, ‘గోదారి’, ‘అజ్ఞాతవాసం’.

అయితే, మనుషుల్లో ఇంకా మానవత్వం, నిజాయితీ నశించలే దని నిరూపించే కథలు – ‘మానవుడి విజయం’ ‘అప్పుల నరసయ్య’.

కథా వస్తువులు గంభీరమైన వైనా, కొన్ని కథలకు శీర్షికలు తమాషాగా పెట్టారు రాజారాం గారు. ఉదాహరణకు – ‘ముగ్గురు అత్తగార్లు’ – (గ్రామంలో పెత్తందార్లయిన ప్రెసిడెంటు, కరణం, మునసబు), ద్వంద్వ సమాసం – (కన్నతల్లి, పాలిచ్చిన తల్లి), ట్రంపు చీటీ’ – (పల్లె ప్రజలపై నాటకాల ప్రభావం) మొదలైనవి.

రాజారాం గారి కథల్లో ‘సర్కసు డేరా’, ఎడారి కోయిల’, ‘అడవిలో ధర్మదేవత’, ‘గ్రూప్‌ ఫోటో’, అడిగి వచ్చిన వరం’ వంటివి తెలుగు కథా సంకలనాల్లో చేర్పదగినవి ఎన్నో ఉన్నాయి.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, జూన్‌ 10 – 16, 1992)

 6. మనసు లోతులు తరచిన మునిపల్లెరాజు కథలు

క్రిందటి తరం మేధావుల ప్రశంసల్ని కూడా పొందిన ప్రౌఢకథకుడు శ్రీ మునిపల్లె రాజు. ఆయన కథలు నిండుగా, గంభీరంగా ఉంటాయి. మనుషుల అంతరాంతరాల్లోని అనేకానేక ఆలోచనల్ని అక్షరాల్లో పొదిగి, హృదయానికి హత్తుకునేట్లు ప్రదర్శించగల ప్రతిభాశాలి మునిపల్లెరాజు గారు. తమ జీవితంలో ఆరు దశాబ్దాలకుపైగా ఆర్జించిన అనుభవాలకు కళారూపాలే ఆయన కథలు. వాటిలో కొన్నిటిని 1992 లో రెండు సంపుటాలుగా వెలువరించి నేటి తరాలకూ, భావితరాలకూ అందించిన కానుకలివి.

ఈ సంపుటాల్లోని చాలా కథలకు పునాదులు ఈ శతాబ్దపు ప్రారంభదశలోని తెలుగు నేలపై ఉన్నా ఈ రచయిత కథాశిల్ప లక్షణం, కథనశైలీ ఆధునిక పాశ్చాత్య కథానికా సంప్రదాయాలకు అనుగుణమైనవే. కథనంలో కొంతవరకు చైతన్య స్రవంతి లక్షణాలు కనిపిస్తాయి. యౌవనంలో ఆయనకు కవిత్వంలో కూడా అభిరుని ఏర్పడి, కొంత కృషి చేయడం వల్ల, ఆయన కథల్లో కవితా హృదయ స్పందనలు స్పష్టమవుతాయి.

మొదటి సంపుటిలో 15 కథలున్నాయి. రెండవ సంపుటంలో 21 కథలున్నాయి – వాటితో బాటు ”నేనెందుకు రాశాను” అంటూ ఈ కథా రచయిత రాసిన ‘కథ కాని కథ’ కూడా ఉంది.

ఈ రచయిత తెనాలిలో పెరిగి ఉత్తరాది దూరప్రాంతాల్లో ఉద్యోగ రీత్యా దీర్ఘకాలం గడిపినా, మధ్యలో ఎక్కడెక్కడ ఎవరెవరితో స్నేహాలూ పరిచయాలూ ఏర్పడినా, ఏయే రంగాల్లో అనుభవాలు గడించినా, ఆయన మనస్సు ఎప్పుడూ బాల్య జీవితాన్ని ప్రభావితం చేసిన పల్లెటూరి పరిసరాలనూ, పరిస్థితులనూ విస్మరించలేదు. ఆనాటి ప్రతి స్మృతినీ వివిధ రకాలుగా మలిచి తమ కథల్లో ప్రదర్శించారు. తల్లి చూపించే ఆప్యాయతా, చిన్న వయస్సులో తండ్రిపోతే తల్లీ కొడుకులు పడే అవస్థలూ, ఆస్తుల విషయాల్లోనూ అప్పుల విషయాల్లో నూ ఆత్మీయలనుకునే కొందరు బంధువుల అసలు ప్రేమలూ, బయటపడే కుటిల మనస్తత్వాలూ, ఆదుకున్న వారితో కొనసాగే అనుబంధాలూ, అనేక ఆర్థిక మానసిక రుణానుబంధాలూ కథలుగా రూపుదిద్దుకున్నాయి ఈ కథా శిల్పి చేతుల్లో.

ముఖ్యంగా ఆకాలపు వారాలబ్బాయిల అవస్థల్ని సానుభూతితో అవగాహన చేసుకుని అటువంటి వారి నికృష్ణజీవితాల్ని తాదాత్మభావంతో కరుణార్ధ్ర హృదయంతో చిత్రించారు. వారాలబ్బాయిలే కాదు, సవతి కొడుకులూ, సవతులూ, సవతి తమ్ముళ్లూ, కార్మికులూ, బిచ్చ గాళ్లూ, భోగం స్త్రీలూ నిస్సహాయ స్థితిలో ఉన్న ఎవరైనా సరే ఈ రచయిత మదిలోనూ, కథల్లోనూ చోటు చేసుకోగలిగారు.

మనుషుల్లోని స్వార్థపూరిత దుష్టశక్తుల్ని వివిధ కోణాల్లోంచి బహిర్గతం చేయడం – సున్నితంగానూ, సూచన ప్రాయంగానూ చేస్తారు ఈ రచయిత. ఉదాహరణకి – ”పుష్పాలు – ప్రేమికులు – పశువులు ” కథలో (సంపుటి 2 ) ‘ప్రేమ’ అనుకునే స్వార్థం మనిషిని ఎలా పశువుగా మార్చగలదో, తన సుఖం కోసం ఎదుటిమనిషిని ఎలా హతమార్చగలదో సూచిస్తారు రచయిత. వర్ణించిన సంఘటనకి మనం నిర్ఘాంతపోయేటట్లు ఉంటుంది. గాని, జుగుప్సాకరంగా ఉండదు. ఆయన శైలి. అలాగే, ”శ్మశానం చిగిర్చింది” అనే కథలో తన కొడుకు దుర్మరణానికి కారకుడైన వాడి మీద కక్ష తీర్చుకోవడం స్వయంగా కాకుండా, ఒక పశువు చేత చేయించినట్లు రాయడంలో రచయిత చాకచక్యం కనిపిస్తుంది. శ్మశానంలో కొడుకు బూడిదైనచోట పచ్చని గడ్డి మొలవడం – ఆశాజనకమైన ముగింపు.

పల్లెటూరి జీవితం గురించీ, అక్కడి వ్యక్తుల మనస్తత్వాల గురించీ, వ్యవసాయరంగం గురించీ రచయితకున్న విస్తృత పరిజ్ఞానాన్ని వెల్లడించే కథల్లో ”కస్తూరి తాంబూలం” కథకి అగ్రతాంబూలం ఇవ్వాలి. అన్యాయానికి గురై, మాటలలో కరకుతనం పెంచుకుని కఠినాత్ములుగా కనిపించే వాళ్లే కొందరు అనుకోని విధంగా, ప్రాణ త్యాగానికైనా వెనుదీయని నవనీత హృదయులై ఉంటారని తెలియజెప్పే కథ ఇది. అయితే, ఈ కథని రచయిత, మొత్తంప్రథమపురుషలోనే రాసి ఉంటే కథనం మరింత బిగువుగానూ సాఫీగానూ ఉండేదేమో.

అలాగే ”తమస్సులో తపస్సులు” కథలో మొదటి భాగం అంతా గ్రామ జీవనం గురించి రచయితకున్న విస్తృత పరిజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది. అయితే, అసలు కథకి మొదటి భాగం అయిన పురాణకాలక్షేపం, దానికి పూర్వపరిచయంగా గ్రామచరిత్రా రాసి, కథని విస్తృతపరచకుండా ‘శవయాత్ర’తో ప్రారంభించి, దాన్ని చూడటానికి వెళ్ళిన ‘బక్కయాదవులు’ అన్న పేదబాలుడి మరణంతో ముగిస్తే మంచి కథానికలా బిగువుగా పదునుగా ఉండేది. ఒక మూఢాచారానికీ, మూఢ విశ్వాసానికీ బలియై మరణిస్తున్న పసివాడిలోనూ, అందుకు కారకులైన తోటి పిల్లల్లోనూ, పసివాడి తండ్రిలోనూ కూడా హేతువాద దృష్టినీ, పశ్చాత్తాపాన్నీ ప్రదర్శింప జేస్తూ రాసిన ఈ కథ కథా వస్తుపరంగా ఒక ఉత్తమ కథ.

సనాతన వైదిక ఆచారాలూ, సంప్రదాయాలూ ఈ రచయితకి వివరంగా తెలుసు. వాటిని మరపురాని కథలుగా మలిచారు. ఉదాహరణకి ‘చెప్పులదానం’. ‘మాతృదర్శనమ్‌’, ‘జ్ఞానధార’, ‘దానధార’. పరలోకప్రాప్తి చెందిన తల్లి స్మృత్యర్థం అబ్దిక కర్మజరిపే సందర్భం ప్రేమ కథగా ఎలా పరిణమించిందో ‘మాతృ దర్శనమ్‌’లో చూడవచ్చు. పాఠకుల హృదయాలను సున్నితంగా మీటే మధురమైన కథ ఇది.

”ఆమె పేరు అమ్మ” కథలో అమ్మని అత్యున్నత స్థానంలో ప్రతిష్టించారు రచయిత. అయితే ‘రాగమ్‌ నీలాంబరి” కథలో ”స్త్రీ సహజమైన అమ్మ అనూయలో అమాయకత్వపు రాక్షసత…” అనడంలో రచయిత నిష్పాక్షిక వైఖరి కనిపిస్తుంది.

స్త్రీల పట్ల రచయితకి ఉన్న సానుభూతినీ, అవగాహననీ నిరూపించే కథలు – ‘విశాఖ కనక మహాలక్ష్మి’, ‘దొడ్డమ్మవారసులు’, ‘కుడి చేయి – ‘ఎడమ చేయి’, ‘యశోదకొడుకు’, ‘సరోజ’, ‘ఆవలిపక్షం’ మొదలైనవి. వీటిలో ‘విశాఖ కనక మహాలక్ష్మి’ కథ అత్తుత్తమమైనది – వివిధ స్థాయిలోని మనుషుల్లో ఉండే మానవత్వాన్ని చూపించిన కథ ఇది. అవకాశం ఉన్నా, స్త్రీని భోగవస్తువుగా చూడకుండా, సంయమనం, మానవత్వం చూపించిన కథానాయకుని సృష్టించిన రచయిత అభినందనీయుడు.

రెండవ సంపుటిలోనివి – ‘బానిసలు’, ‘జీవితం’, ‘చిరంజీవి’ – ఇవి గంభీరముద్ర లేకుండా తేలిగ్గా ఉన్న కథలు.

వామపక్ష సిద్ధాంత ప్రభావాలున్నప్పటికీ, భారతీయ తత్త్వ చింతననీ, భావుకతనీ వదులుకోలేదు ఈ రచయిత. భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుందాయన కథల్లో. అందుకే ఈ సంపుటాలకు ముందు మాటలో – హృదయమున్న మార్క్‌ సిస్టు, జీవితం తెలిసిన సైంటిస్టు, అన్నింటినీ రంగరించగల ఆల్కెమిస్టు” అంటూ దక్షిణామూర్తిగారు, ”మానవత్వాన్ని మహితంగా ఉద్దీపింపజేసే కథలు” అంటూ రమాపతి రావు (మంజుశ్రీ) గారూ మునిపల్లె రాజు గారినీ, ఆయన కథల్నీ అభివర్ణించడం సముచితంగా ఉంది.

(ఆంధ్రప్రభ, 1.3.1993)

7. మహిళా జనజీవన సమస్యల అన్వేషణలో…

”స్త్రీకి స్త్రీయే శత్రువు” అనే నానుడిని ఎవరు ఎప్పుడు సృష్టించారో గాని, అది నిజం కాదని నిరూపిస్తూ, స్త్రీల అభ్యుదయానికీ పురోభివృద్ధికీ స్త్రీలే పోరాటం సాగిస్తూ, స్త్రీవాద ఉద్యమాన్ని స్త్రీలే నడిపిస్తున్న రోజులివి. విద్యావంతులైన స్త్రీలు అనేక విధాలుగా ఈ ఉద్యమానికి దోహదం చేస్తున్నారు. ఆంధ్రదేశంలో ఒక దశాబ్దం నుంచీ కొంత మంది మహిళలు పరిశోధనలతోనూ, ప్రచురణలతోనూ స్త్రీవాద ఉద్యమానికి ప్రాచుర్యం కలిగిస్తూ, స్త్రీలలో తమ పరిస్థితుల పట్ల తమకు సరియైన అవగాహన కలిగించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

ఆ ప్రయత్నంలో భాగంగానే 1982లో వరంగల్లులో ఆధ్యాపక వృత్తిలో ఉన్న మహిళలు ముగ్గురు పూనుకుని ”స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ”ను ఏర్పరచి, అప్పటి నుండీ తమ అధ్యయనానికి మహిళా జన జీవితాన్ని కేంద్రంగా చేసుకొని, వివిధ అంశాలపై ఎన్నో పరిశోధనా వ్యాసాలు రాసి ప్రచురిస్తూ వచ్చారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో వివిధ విద్యా విషయక శాఖలకు చెందిన ముగ్గురు మహిళలు – కాత్యాయనీ విద్మహే, జ్యోతీరాణి, శోభ గార్లు – సఖ్యతతో ఏకోన్ముఖంగా మహిళా జన జీవిత సమస్యల మూలాలను అన్వేషించి, ఒక సమగ్ర అవగాహనతో రూపొందించిన వ్యాస సంకలనాన్ని పాఠకులకు పుస్తక రూపంలో అందించారు.

ఈ అధ్యాపకులు తెలుగు విభాగానికీ, అర్థశాస్త్ర విభాగానికీ, ప్రజా పరిపాలనా విభాగానికీ చెందిన వారు కావడం వల్ల, వీరు తమ వ్యాసాలలో మన దేశంలోని స్త్రీల జీవితాన్ని – చారిత్రక, సామాజిక, ఆర్థిక, సాహితీ నేపథ్యాలనూ, ఆంతర్యాలనూ – నిశితంగా పరిశీలించారు.

ఈ గ్రంథంలో మొత్తం పదిహేను వ్యాసాలున్నాయి. ఇవి ఇంతకు ముందు వివిధ పత్రికలలోనూ, వ్యాస సంకలనాలలోనూ అచ్చయినవి. వీటిలో మహిళా జన జీవన సమస్యలు, స్త్రీల ఆర్థిక, సాంఘిక ప్రతిపత్తి, స్త్రీల విముక్తి కోసం చేసే సాంఘిక ఆర్థిక, రాజకీయ పోరాటాలు – వీటి మూలాలనూ, పునాదులనూ, నిర్మాణ క్రమాన్నీచారిత్రక విశ్లేషణ చేసిన వ్యాసాలు కొన్ని ఉండగా, వీటి నేపథ్యంలో మతతత్వం, విద్య, ఉద్యోగం అనే అంశాలు మహిళల జీవితాల్లో తెచ్చిన వివిధ పరిణామాలను ప్రత్యేకంగా పరిశీలిస్తూ రాసిన వ్యాసాలు కొన్ని ఉన్నాయి.

సతీసహగమన దురాచారానికీ, స్త్రీలపై జరిగే అత్యాచారాలకీ ఉన్న రాజకీయ, ఆర్థిక, సాంఘిక కారణాలను విశ్లేషించి చూపించారు. స్త్రీల సమస్యల్లో లైంగికతకు ఎంత మౌలిక, విస్తృత ప్రాధాన్యం ఉన్నదో తెలియజేయడానికి ప్రత్యేకం మూడు వ్యాసాలలో వివరంగా చర్చించారు.

స్త్రీల జీవితాల గురించీ, స్త్రీల సమస్యల గురించీ వివిధ కోణాల నుంచి మన సాహిత్యాన్ని ఏ విధంగా అధ్యయనం చేయవచ్చునో, ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో తెలియజెప్పే ప్రయోజనాత్మక వ్యాసం ”స్త్రీల జీవిత చరిత్ర – ఒక సాహిత్య సామాజిక ప్రక్రియ” – ఇది ఈ పుస్తకంలోని రెండ వ్యాసం.సామాజిక సమస్యల్ని చారిత్రకంగా అర్థం చేసుకోవడానికి లిఖిత సాహిత్యం ఎంతగా ఉపయోగపడుతుందో మౌఖిక జీవిత కథన ప్రక్రియ కూడా నడుస్తున్న చరిత్రను అర్ధం చేసుకోవడానికీ, గ్రంథస్తం చేయడానికీ అంతగానూ ఉపయోగపడుతుందన్న సత్యాన్ని గుర్తించి, ఈ వ్యాసకర్తలు ”నమూనా పని”గా, ధాన్యం మార్కెట్లులో పనిచేసే మరియమ్మ అనే ఒక కూలీ స్త్రీ నిత్య జీవితాన్ని వివరంగా తెలుసుకుని రాసిన వ్యాసం ఇది.

”స్త్రీలు కూడా ఉత్పత్తి కార్యకలాపాలలో పురుషులతో సమానంగా పాల్గొన్న నాడు స్త్రీలకు సమానత్వం సిద్ధిస్తుందన్న వాదన కూడా ఈ అట్టడుగు స్త్రీల జీవితాలకు వర్తించదు. వారి పేదరికం శ్రామిక వర్గపు స్త్రీలను ఇంటా బయటా మరింత దోపిడీకి గురిచేసింది…. స్త్రీలను దోపిడీకి గురిచేస్తున్న శక్తులకు ఎదుర్కొనటానికి సమాయత్తం కావలసి ఉంటుందన్న అవసరాన్ని మరియమ్మ జీవితం” ద్వారా నిరూపించారు వ్యాసకర్తలు.

తెలంగాణా రైతాంగ పోరాటంలో ఐలమ్మ పాత్రను వివరించే మరొక వ్యాసం మరో ”నమూనా”. ”తమ పోరాటాలు, తమ త్యాగాలు తమ జీవితాలనేమీ మెరుగుపరచ లేకపోయాయని” ఐలమ్మ పడిన ఆవేదన గురించి చెబుతూనే, ”స్త్రీలు ఈనాడు సమాజ పునాదులలో మార్పుకై సాగే ఉద్యమాలలో పురుషులతోపాటు భుజం భుజం కలిపి పని చేసే చైతన్యాన్ని ఐలమ్మ జీవితం నుండి పెంచుకోవాల్సి ఉంది” అని సూచిస్తారు వ్యాసకర్తలు.

శ్రామిక, గ్రామీణ స్త్రీల ఆర్థిక, సామాజిక పరిస్థితి ఆ విధంగా ఉంటే, ఉద్యోగాల ద్వారా, ఆస్తుల ద్వారా ఆర్థిక స్తోమత ఏర్పడిన స్త్రీల స్థితి గతులు ఏ విధంగా ఉన్నదీ వేరొక వ్యాసంలో విశ్లేషించారు. ఈ వ్యాసంలో ముగ్గురు ఆధునిక మధ్య తరగతి స్త్రీల జీవితాలను విశ్లేషించారు. ఈ స్త్రీలు ఉన్నత స్థాయి చదువులు చదివి పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్లు. భర్త, పిల్లలతో కూడిన వ్యష్టి కుటంబ జీవితాన్ని జీవించిన వాళ్లు. ఈ ముగ్గురి జీవితాల పరిశీలన ఫలితాలు ఇవి.

1. ఆర్థిక స్వాతంత్య్రం వల్ల లభించే ధీమా కంటే పితృస్వామిక సంస్కృతి వల్ల నాటుకు పోయిన దీనత్వమే ఆమె జీవితాన్ని నియంత్రించటం కనిపిస్తుంది. 2. విడాకుల చట్టం స్త్రీకి పురుషుని పీడ నుండి బయటకు రావటానికి ఒక అవకాశం ఇస్తున్నట్లు కనిపించినప్పటికీ అది వాస్తవానికి పురుషుడికే అటు ఇష్టం లేని భార్యను, పిల్లలను వదిలించుకోవటానికి, ఇటు కొత్త దాంపత్య సంబంధాలను ఏర్పరచుకోవటానికి ఉపయోగపడుతున్నది. స్త్రీల చదువు, సంపాదన కుటుంబంలో సమసంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉపయోగపడినా, పడకపోయినా కుటుంబ హింస నుండి బయటపడి తన బ్రతుకు తాను బ్రతకటానికి మాత్రం తప్పక ఉపయోగపడుతుంది : 3) ”వ్యక్తులుగా ఆత్మ గౌరవంతో జీవించాలనుకునే స్త్రీలు పితృస్వామిక కుటుంబ వ్యవస్థతో చేసే వంటరి పోరాటాలు కొంత వరకు కష్టమైనవే అయినా స్త్రీల జీవితాన్ని అభివృద్ధికరం గానూ, అభ్యుదయకరంగానూ మలుస్తాయి. ”

అందువల్ల ”కుటుంబంలో సమస్థాయి సంబంధాలు ఏర్పరచుకోవటానికి వీలైన ప్రాతిపదికగా స్త్రీల ఆర్థిక స్వాతంత్య్ర సూత్రం అంగీకరించబడాలంటే అందుకు ముందుగా పితృస్వామ్య సంస్కృతిపై దాడి ప్రారంభం కావాలి అంటారు వ్యాసకర్తలు. ఆ దాడికి ఎటువంటి పథకాన్ని రూపొందించుకోవాలి. ఏ యే స్థాయిల్లో దాడి జరగాలి అనే అంశాలను వివరించలేదు. అంటే, ప్రస్తుతం జరుగుతున్నట్లుగానే వ్యక్తిగతంగానూ, ఉద్యమపరంగానూ పోరాటాలు ఇంకా విస్తృతంగా కొనసాగించడమేనన్నది వ్యాసకర్తల ఉద్దేశం కావచ్చు.

స్త్రీల హక్కుల గురించి ప్రస్తావిస్తూ, కుటుంబం వల్ల కానీ, సమాజం వల్లకానీ, ప్రభుత్వం వల్లకానీ ”దేశంలో ఏ మూల ఏ వ్యక్తి పట్ల మానవ హక్కులు ఉల్లంఘించబడుతున్నా ఉపేక్ష వహించక ఉద్యమించే శక్తులకు మేధావులు అండగా నిలవాలి” అని ఉద్బోధించారు.

లైంగికత గురించి ”…తెలుగు సాహిత్యం ప్రతిఫలనాలు” అనే అంశం మీద రాసినది. ఇందులో పరిశీలించిన ప్రాచీన సాహిత్యంలో ”మనుస్మృతి”, కౌటిల్యుని ”అర్థశాస్త్రం” వాత్స్యాయునుడి ”కామసూత్రాలు”, భరతుడి ”నాట్యశాస్త్రం”, భారతంలో కొన్ని భాగాలూ, ప్రబంధాలూ ఉన్నాయి. వీటిలో పురుషాధిక్యత ఎలా పోషించబడిందో విశ్లేషించారు. ఆధునిక సాహిత్యంలో చలం రచనల్నీ, గోపీచంద్‌, కొడవటిగంటి, రంగనాయకమ్మ, వట్టి కోట ఆళ్వారుస్వామి, మహీధర రామ్మోహనరావు మొదలైన వారి కొన్ని రచనల్ని తీసుకొని పురుషాధిక్య సమాజంలో స్త్రీల హీనస్థితిని ఆయా రచయితలు ఎలా వెలుగులోకి తెచ్చారో, ఏయే సంస్కరణ భావాలను వ్యక్తం చేశారో వివరించారు.

సంచలనాత్మకమైన ”మూడు తరాలు” నవలను కూడా విశ్లేషిస్తూ, ఈ వ్యాసకర్తలు హేతు బద్ధమైన వాస్తవిక దృష్టితో, సాహిత్యంలో ప్రస్ఫుటమవుతున్న స్త్రీ వాద ధోరణులను గురించి వాఖ్యానించారు.

”స్త్రీల లైంగికత్వం విషయంలో సమాజం ‘పట్టు’ను కలిగి ఉండటం, స్త్రీ శీలం చుట్టూ బలమైన మిత్‌లు అల్లబడి ఉండటం, పాతివ్రత్యం పేర స్త్రీ పరమకిరాతక హింసకు గురికావటం అన్నీ వాస్తవాలే అయినా, వాటిని సామాజిక ఉత్పత్తి కార్యకలాపాలతోనూ, తదితర సాంస్కృతిక ఉపరితల అంశాల సంబంధాలతోనూ సాపేక్షంగా విశ్లేషించకోకుండా కేవలం బద్దలు కొట్టాలి. అన్న బలమైన కోరికతో బయలు దేరితే సరిపోదు”

”ఉన్న వాటిని బద్దలు కొట్టి మనం నిర్మించబోయే స్త్రీ పురుష సంబంధాలు ఇంతకంటే ఉన్నతమైనవిగా, మానవీయమైనవిగా ఉండేటట్లు చూసుకోకపోతే, ”బద్దలు కొట్టటం” అనే కార్యక్రమం కేవలం పురుషుడికి వ్యతిరేకంగా అతనికున్న స్వేచ్ఛలన్నీ, వాటి ఔగాముల ప్రసక్తి లేకుండా తానూ పొందాలన్న మూర్ఖపు పట్టుదలకు ఆచరణ రూపంగా ఉంటుంది. తప్పితే మరేమీ కాదు” అని తమ సంయమన దృక్పథాన్ని ప్రదర్శించారు.

” స్త్రీ పురుషులిద్దరినీ సమస్కందులుగా నిలబెట్ట గలిగిన ఉన్నత మానవీయ సంస్కృతిని పెంపొందించగల సోషలిస్టు సమసమాజ నిర్మాణం కోసం స్త్రీ పురుషులిద్దరూ కలిసి పనిచేసినప్పుడు లైంగిక స్వేచ్ఛ వాళ్లు ఒకళ్ల నొకళ్లు ఇష్టపడుతూ ఒకళ్ల కోసం ఒకళ్లు బ్రతకటానికి సాధించుకోగలిగిన గొప్ప ఆదర్శం అవుతుంది. ఈ ఆదర్శాన్ని కథా వస్తువుగా జీవితాన్ని మధిస్తూ సాహిత్యం ఇంకా రావాల్సి ఉంది” అని సూచించారు.

ఈ సందర్భంలో, ఈ వ్యాస సంపుటికి ముందు మాట రాసిన సి. శివరామకృష్ణారావు గారి సూచన విలువైనదిగాతోస్తుంది. స్త్రీ పురుష సంబంధాలు ”ప్రజాస్వామీకరణ కావాలి అని అందరూ అభిలషిస్తున్నప్పటికీ, ఆ అభిలషణీయమైన కుటుంబ సంబంధాలు ఎలా ఉండాలనే దానికి ఒక చిత్రీకరణ అత్యావశ్యకం…. అలాంటి ప్రయత్నాన్ని ఈ గ్రంథ కర్తలు చేస్తారని” ఆశిస్తున్నారాయన.

నిజమే, ఆ దృష్టితో ఆదర్శ స్త్రీ పురుష సంబంధాలను వివిధ సందర్భాల్లో వాస్తవిక, మానసిక కోణాల నుంచి చిత్రిస్తూ కథలూ, నవలలూ, నాటకాలూ, వ్యాసాలూ వస్తే మన ఆలోచనలు మనకే మరింత స్పష్టమవుతాయి.

(భూమిక, జూలై-సెప్టెంబరు, అక్టోబరు – డిశంబరు 1994)

8. సాధారణ జీవితాల అసాధారణ చిత్రణ

‘దివో స్వప్నాలతో ముఖాముఖి’

”సమాజాన్ని వెయ్యికళ్ళతో కనిపెట్ట గలిగిన వాడే సిసలైన రచయిత. అపని ఇది వరకు కొడవటిగంటి చేశాడు. ఇప్పుడు రా.వి. శాస్త్రి చేస్తున్నాడు” అన్నారు శ్రీ శ్రీ. వారితో పాటు మునిపల్లె రాజుగారు కూడా నిశ్శభ్దంగా తనదైన పద్ధతిలో ఆపనే చేస్తూ వచ్చారు మానవత్వం అనే కరదీపిక సహాయంతో.

ఈనాడు బహుళ ప్రాచుర్యం పొందుతున్న ”దళిత కథా సాహిత్యా”నికి నాలుగు దశాబ్దాల కిందటే ఆపేరు లేకుండానే పటిష్ఠమైన పునాదులు వేసిన ప్రసిద్ధ కథకుల్లో ముఖ్యులు శ్రీ మునిపల్లెరాజుగారు.

మారుమూల గ్రామాలలో బానిస బతుకులు బతికే బడుగు రైతు కూలీలనూ, నగరాల్లో ఆధునిక కర్మాగారాల్లో నలిగి పోతూ నికృష్ణ జీవితాలను గడిపే శ్రామికులనూ, రాయలసీమ దుర్భిక్షానికీ, గోదావరి వరదల ప్రభావానికీ జీవచ్ఛవాలుగా మిగిలిన వారి జీవన స్థితి గతులనూ, సమాజంలోని గౌరవ హీనులనూ, ఈ దుష్ట సమాజంలో ఇమడలేకనో, తాత్త్విక చింతనతోనో సన్యాసులైన వారి జీవిత నేపథ్యాలనూ సన్నిహితంగా గమనించి, సాటి మానవుడిగా బాధాతప్త హృదయంతో, ప్రగాఢమైన అనుభూతితో చిత్రించిన కథకులు మునిపల్లె రాజుగారు. ఈ రచయిత ప్రతిభా పాటవాలను ఈ మధ్యనే తెలుగు పాఠకులూ, తెలుగు సాహితీ సంస్థలూ సవ్యంగా గుర్తించి సన్మానించడం హర్షదాయకమైన సంఘటన.

రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఒక అర్ధ శతాబ్దం పాటు రాసిన కథలు కొన్ని 1992లో రెండు సంపుటాలుగా రావడం వల్ల ఈ రచయిత కథలకు సరియైన గుర్తింపు లభించే అవకాశం వచ్చింది. ఇది తృతీయ సంపుటం. ఆయన కథలన్నిటిలోనూ తాత్త్విక జిజ్ఞాసాస్ఫోరకమైన జీవన సంఘర్షణ ప్రదర్శితమవుతుంది. ప్రేమ కథలను రాసినా, అంతర్లీనంగా కథకుని తాత్విక ధోరణీ సామాజిక అవగాహనా రాజుగారి కథల్లోని ముఖ్య పాత్రల ప్రవర్తనలో ప్రస్ఫుటమవుతాయి. వాటిలో మానవత్వం మార్గదర్శకంగా మెరుస్తూ ఉంటుంది.

ఈ సంపుటంలో 14 కథలు ఉన్నాయి. ఇవి 1952 – 1994 మధ్యకాలంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.

వీటిలో మొదటి కథ ‘వీరకుంకుమ’. ఇది 1952లో రాయల సీమ పర్యటనలో అక్కడి దుర్భిక్ష పరిస్థితులను పరిశీలిస్తున్న సందర్భంలో విన్న కొన్ని వాస్తవ గాథల ఆధారంగా రాసిన కథ. కరువు కాటకాల్లో గర్భదరిద్రుడిగా పుట్టిన రైతుకొడుకు ప్రతాపరెడ్డి. చదువు లేనివాడు. తన కొడుకును మాత్రం ఎన్ని ఇబ్బందులున్నా, పట్నంలో చదివిస్తూ ఉంటాడు. కొడుకు స్నేహితుడు – దేశభక్తుడూ, విప్లవమూర్తీ అయినరాజు అంటే ఇష్టం. ఆ యువకుడు చావు బతుకుల్లో ఉన్నాడని కబురు తెలిసి, చూడటానికి వెళ్ళేందుకు డబ్బులేక, తమ ఇంటి బిడ్డలా పెరిగిన ముసలి ఎద్దు ”పుల్లన్న’ ని అమ్మేస్తాడు. భార్య ఆగ్రహిస్తుంది. ప్రతాపరెడ్డికి కనువిప్పు కలిగి, కసాయి వాళ్ళు తీసుకుపోతున్న పుల్లన్నని తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. డబ్బు తిరిగి ఇస్తానంటే ఒప్పుకోరు కసాయివాళ్ళు, కోపంతో అందులో ఒకడిని పొడిచి చంపుతూంటే వెనకనుంచి మరొకడు ప్రతాపరెడ్డిని చంపుతాడు. అతడి శవాన్ని కొమ్ముల మీది కెత్తుకుని ఇంటికి తీసుకుపోతుంది పుల్లన్న. భర్త గాయం మీది రక్తాన్ని తీసి నుదుట ”వీరకుంకుమ” గా ధరించి ప్రాణాలు విడుస్తుంది ప్రతాపరెడ్డి భార్య.

మధ్య తరగతి మనస్తత్వాలకు ప్రతీక ”ఉద్యోగ విరమణ” అనే కథ. ఉద్యోగం పురుషలక్షణం అనుకునే వారికీ, సంపాదనతోనే గౌరవం లభిస్తుందనుకునే వారికీ, రిటైరైన వెంటనే ఆత్మన్యూనతాభావం వేధించటం మొదలుపెడుతుంది. ఆ మనఃస్థితిలో వాస్తవ పరిస్థితుల్నీ, అసంపూర్ణ బాధ్యతల్నీ అర్థంచేసుకోలేరు. ఇంట్లో భార్యా పిల్లలూ, ఎవరు మాట్లాడినా, ఎలా ప్రవర్తించినా విపరీతార్థాలు గోచరిస్తాయి. విరక్తితో ఇల్లూ, లోకం విడిచి పెట్టే వాళ్ళుకూడా ఉంటారు. అటువంటి ఒకవ్యక్తి కథే ”ఉద్యోగ విరమణ”. ప్రాణాలు పోకుండా రక్షిస్తుంది ఒక చిన్ననాటి ప్రేమికురాలు – ప్రస్తుతం వితంతువు, డాక్టరు. అతనికి కుటుంబ సభ్యులపట్ల అవగాహన కలిగిస్తుంది. కథ సుఖాంతం.

”దంపతులు” కథ భార్యాభర్తల మధ్య మానసిక సంఘర్షణను చిత్రించే కథ. మధ్య, మరో దిక్కులేని మరదలు పిల్ల. విలువలు అందరివీ సంప్రదాయ బద్ధమైనవే. వ్యక్తం చేయలేని మనోభావాలు ముగ్గురివీ. భర్త మనస్సు తెలుసుకుని, తను ‘మరో సావిత్రి’ని అనుకుంటూ, తనకు ఎలాగూ సంతాన ప్రాప్తిలేదు కనుక, తన చెల్లెల్ని వివాహం చేసుకోమని అర్ధిస్తూ, ప్రమాణం తీసుకుని ప్రాణాలు వదుల్తుంది. ఇది 1954లో ‘తెలుగు స్వతంత్ర’లో అచ్చయిన కథ.

‘వీరులూ – వారసులూ’ విశిష్ఠమైన కథ. చేనేత కార్మికుల దుర్భర దారిద్య్రాన్నీ, స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని, తరవాత నికృష్ట స్థితికి చేరుకున్న త్యాగధనుల దైన్యాన్నీ, స్వతంత్రం వచ్చాక సమాజంలో పెచ్చు పెరుగుతున్న దుష్టశక్తుల్ని ఎదిరించి పోరాడే వీరుల సాహసకృత్యాల్నీ, దుష్టశక్తులకు బలి అయిన అమాయకపు జీవుల త్యాగాల్నీ చిత్రిస్తుంది ఈ కథ. సమాజం గురించీ, సమాజంలో చలామణి అయే నీతి, అవినీతి సూత్రాల గురించీ ఆలోచింపచేసే కథ ఇది.

భర్తనీ, పిల్లల్నీ బతికించుకోవడం కోసం వారి ఆకలి తీర్చడం కోసం గతి లేక పర పరుషులకు లొంగిపోయే స్త్రీలు ఎందరో ఉంటారు. కాని, అటువంటి స్త్రీ చేసిన పనిని త్యాగంగా గుర్తించి, ‘నీవు అన్నపూర్ణవు… నా ఆకలి తీర్చేందుకు నీ ధర్మం వదలుకొని మాతృ ధర్మం వహించావు. నీకు నమస్కరించడానికి వచ్చాను…’ అనే భర్తలు ఎంత మంది ఉంటారు ? ఈ కథలో ఉన్న అటువంటి భర్త – బతికి చెడిన ఒక చేనేత కార్మికుడు. అతని మంచి తనాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంటుంది భార్య. ఆర్థిక దుస్థితి మనుషుల్ని ఏ స్థితికి చేరుస్తుందో చూపిస్తుందీ కథ.

‘దివో స్వప్నాలతో ముఖాముఖి’ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఈ మధ్యనే అచ్చయింది. ఇది ఈ రచయిత శైలికీ, తాత్త్విక ధోరణికీ, కవితాభిమానానికీ, మనస్తత్వ పరిజ్ఞానానికీ ప్రతీక. ఇందులో రచయిత తన అంతరాత్మను అభివ్యక్తం చేసుకునే తపన కనిపించడం, ఈ కథ ప్రత్యేకత.

కథా రచనలో మునిపల్లె రాజుగారి శైలికి ఒక ప్రత్యేకత ఉంది. సంక్లిష్ట వాక్య నిర్మాణం ఆయన శైలిలో సామాన్యంగా గోచరిస్తుంది. వివిధ దృశ్యాలనూ, వివిధ అంశాలనూ, తాత్త్విక భావాలనూ ఏక పంక్తిని బంధించడం ఆయన సహజ పద్ధతి. ఈ పద్ధతి సామాన్య పాఠకుల స్థాయికి మించినది కావచ్చు. అందుకే ఆయన ‘కథకుల కథకుడు’ అనిపించుకున్నాడు.

మునిపల్లె రాజు గారు సాధారణంగా కష్ట జీవితాల గురించి సవివరంగా, అనేక ప్రకరణాలతో పెద్ద కథలు రాస్తారు. అప్పుడప్పుడు చిన్న కథలు కూడా రాశారు. ‘విప్లవ వాది’, ‘దివ్యజ్యోతి’ వంటి మంచి కథానికలు ఉన్నాయి ఈ సంపుటంలో.

తమ కథల్లో అనేక రకాల ప్రేమానుభూతిని ప్రదర్శించారు. లోకంలో ఎన్నిరకాల మానవ సంబంధాలున్నాయో అన్ని రకాల ప్రేమానుభూతుల్ని కూడా తమ కథా వస్తువుల్లో పొందుపరిచారు. ‘ప్రేమ’ అంటే ప్రేమికుల మధ్య ప్రేమ అనుకునే ఒక సామాన్య అవగాహన ఉన్న ఒక పత్రికా సంపాదకుడు ‘ఒక లవ్‌స్టోరీ రాసి పెట్టండి సార్‌’ అని కోరితే ఆ రచయిత పంపిన ప్రేమకథ (స్వాతంత్య్ర పోరాటంలో జెండాపై ప్రేమ గురించీ, పుత్ర ప్రేమ గురించీ రాసిన కథ)ని ఆ సంపాదకుడు తిరస్కరిస్తాడు. ‘నాకు లవ్‌ స్టోరీ కావాలన్నాను… ఇలాంటి తక్కువ కథనా నేనాశించింది. స్వామీ?” అంటూ ఆ కథను ఎవరికి పంపినా ఇది ‘లవ్‌స్టోరీ’ కాదన్నారుట! ఇదంతా ‘ఒక లవ్‌స్టోరీ రాసి పెట్టండిసార్‌!” అనే కథలో వస్తుంది.

మనిషి కరుణాంతరంగుడు, ప్రేమస్వరూపుడు కావాలన్నది తమ కథల్లో పరోక్షంగా మునిపల్లె రాజు గారిచ్చే సందేశం. జీవితం, వేదాంతం పడుగు పేకలుగా నేసి ప్రదర్శించిన కళారూపాలు మునిపల్లెరాజు గారి కథలు.

(అధ్యయనం, ఆంధ్రప్రభ, 24.10.94)

9. శిల్పంలో నైపుణ్యం, వస్తువులో వైవిధ్యం

      ‘ఆత్మదృష్టి – కథలు’

కథల సంఖ్యలో ఎక్కువ రాసినా, తక్కువ రాసినా వాటిలో సాహిత్యపు విలువ ఉండాలని, సమాజ చిత్రణ ఉండాలని నమ్ముతూ” ఏ జీవితం తన ”కళ్ళ ముందు కనిపించి, ఆలోచనలు మండించి, మనసుని బాధించి ఆవేశ పరుస్తుందో అదే” తన కథల్లో ప్రతిబింబింప చేశానన్నారు శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల గారు తన కథల నేపథ్యం గురించి ప్రస్తావిస్తూ. అయితే ఆమె మనస్సు ఎంత మండినా, ఆమె శైలి మాత్రం సరళంగా, సంయమనంతో కూడుకుని ఉంటుంది. ఎదుటి వారిని నొప్పించేటట్లు కాకుండా ఒప్పించేటట్లు ఉంటుంది.

ఈ సంపుటంలో ‘ఆత్మ దృష్టి’తో పాటు మొత్తం ఇరవై రెండు కథలున్నాయి. 1988 – 94 మధ్య అచ్చయినవి. అన్నీ చిన్న కథానికలు. జానకీబాల గారు కథానికా శిల్పంలో నైపుణ్యం ఉన్న రచయిత్రి. కథా వస్తువుల్లో వైవిధ్యం ప్రదర్శించగల పరిశీలన ఉందామెకు. మధ్య తరగతి వారి జీవితాలతో పాటు క్రింది వర్గం వారి జీవితాల గురించి కూడా సమాన సామర్థ్యంతో రాస్తారు. ఎదుటి వారి సమస్యల్ని అవగాహన చేసుకోవాలనే ఆసక్తీ, వారి పట్ల ఆర్ద్రత కనిపిస్తాయి ఈమె కథల్లో.

ఇందుకు ఉదాహరణలు – ‘ఆకలి’, ‘వేణీ సంహారం’, ‘అదృష్టవంతురాలు’. ‘ఆకలి’ రెండు మూడు పేజీల చక్కని ‘మినీ’ కథానిక. తన కడుపు నిండుగా ఉన్నప్పుడు ఎదుటివాడి ఆకలికి అర్థం తెలియదు. నిజమైన ఆకలిని అనుభవించిన వాడికే ఎదుటి వాడి ఆకలికి మూలమైన దుర్భర పరిస్థితులు అర్థమై హృదయం ఆర్ధ్రమై, పీడితునికి న్యాయం చేకూర్చడానికి వీలవుతుందని చూపిస్తుందీ కథానిక. అయితే, ఇందులో ఆఖరి వాక్యం అనవసరం. కథలోని అంతరార్థాన్ని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేనంత స్పష్టంగా ఉంది కథనం.

పేదవాడైనా, సంపాదన చేతకాని వాడైనా ‘పురుషాధిక్యత’కి లోటుండదు! భార్య ఎదురు తిరిగితే జుట్టు మెలేసి పట్టుకుని చావ బాదగలడు. భార్య జుట్టు తీయించేసుకుంటే సమస్య పరిష్కార మవుతుందా అని ప్రశ్నిస్తుంది ”వేణీ సంహారం’ కథ.

ఒక నిర్భాగ్యురాలి కథ ‘అదృష్టవంతురాలు’! ఎన్ని కష్టాలు ఎదురైనా ఎక్కడికక్కడే ‘అదృష్టం’ అనుకోవాలి అంటుంది సమాజం!

స్త్రీ వాదానికి మూలం ఏమిటో సూచించే కథ ‘ఆమె’ కథ. సర్య సామాన్యమైన కుటుంబం కథ – ‘భార్య’, ‘తల్లి’ అంటే బానిస కాదని తెలుసుకుని, కుటుంబంలోని వాళ్ళు తమ ప్రవర్తన మార్చుకోవలసిన అవసరాన్ని తెలిపే కథ.

ఘర్షణ పడుతున్న దంపతుల మధ్య మరింత చిచ్చు పెట్టడం కాదు, ఒకరినొకరు సరిగ్గా అర్ధం చేసుకోవడానికి దోహదం చెయ్యాలి అని చెప్పే కథ ”దీర్ఘాయుష్మాన్‌భవ!” స్త్రీ వాదులూ, స్త్రీ వాదాన్ని హేళన చేసే వారూ కూడా చదవాల్సిన కథ.

‘ఆత్మదృష్టి’ ఒక విలక్షణమైన కథ. 1974మేలో ఆలిండియా రేడియోలో ప్రసారమైన కథ. కథా వస్తువు కల్పితం. మూల కథాంశం పురుషాధిక్యతే. ఒక ఆడ ‘ఆత్మ’ ‘మగ’ కళ్ళు (మృతదేహం నుంచి తీసి ఒక అంధునికి అమర్చడానికి లాబ్‌లో సిద్దంగా ఉన్న కళ్ళు) ఈ రెండింటి మధ్యా సంభాషణతో ఈ కథ నడుస్తుంది.

ఆర్ద్రత కలిగించే సున్నితమైన కథ ‘రిటైర్‌మెంట్‌’. మగవాడి ఉద్యోగానికి రిటైర్‌మెంట్‌ ఉంటుంది. ఆడదానికీ జన్మకి వంటింటి నుంచి రిటైర్‌మెంట్‌ ఉండదు కదా. ”నేనీ పాతివ్రత్య ధర్మాన్ని నిర్వర్తించలేకపోతున్నాను” అని వాపోయే పరిస్థితి!

‘పూల నమ్మిన చోటనే……’ అనేది ఆఫీసుల్లో పనిచేసే ఆడవారి పట్ల మగవారి వైఖరిని చూపించే కథ.

ఉత్తమ పురుషలో రాసిన ఒకే ఒక్క కథ ఈ సంపుటిలో – ‘దివ్య మంగళ రూపం’ – ‘రచయిత్రి’ మనశ్శాంతిని హరించిన ఒక ప్రమాదకరమైన ‘స్నేహితురాలే’ ఆ దివ్య మంగళరూపం!

ఈ సంపుటిలో రెండు మూడు సరదాగా రాసిన కథలు కూడా ఉన్నాయి. ‘పదవికి ముప్పు’, ‘రెయిన్‌కోట్‌’ వంటివి. ‘పదవికి ముప్పు’ ఒక చిన్న ప్రాక్టికల్‌ జోక్‌! ఏమిటో ఇక్కడ చెప్పేస్తే ఎలా?

ఆఖరి కథ అయిన ‘రెయిన్‌కోట్‌’ ఒక చిరునవ్వుతో ముగుస్తూ మనకీ చిరునవ్వు తెప్పిస్తుంది.

పాఠకులకు ఆనందాన్ని కలిగించడంతో పాటు మనలో రావలసిన మార్పుకి దోహదం చేసే కథలు ఇవి.

(ఆంధ్రప్రభ, జనవరి 30, 1995)

10. సామాజిక సమస్యలపై సామాన్య దృష్టి

         ‘తులసి దళాలు’

అనేక సాహితీ ప్రక్రియలలో ఆరితేరిన ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఇల్లిందల సరస్వతీదేవిగారు కథారచనలో రెండు ”సెంచరీ”లకు పైగా చేసి, ఇంకా ‘ఫీల్డు”లో నిలబడిన సమర్థురాలు. అంతేకాదు. తెలుగులో నూరు కథల సంపుటాలు రెండు వెలువరించిన ఏకైక వ్యక్తి. ఇప్పుడు సమీక్షించేది రెండ సంపుటి. మొదటి సంపుటిలోని నూరు కథల్లో కొన్ని ఆలిండియా రేడియోలో ప్రసారితమైనవి. కొన్ని వివిధ పత్రికలలో అచ్చయినవీ. ఈ రెండవ సంపుటిలోని కథలన్నీ అముద్రితాలే.

పత్రికలలో వచ్చిన రచనలన్నీ మంచి రచనలు కాకపోవచ్చుగాని, శంఖంలో పోస్తేగాని తీర్థం కాదన్నట్లు ఏదైనా పత్రికలోనో ఏదైనా పుస్తకంలోనో అచ్చుపడితే కాని సాధారణంగా ఒక ‘రచన’గా ముద్రపడదు. అయితే ”స్వర్ణకమాలు” అనే నూరు కథల సంపుటికి ఒకే సంవత్సరం కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీల అవార్డులూ, ఇంకా ఎన్నో పురస్కారాలూ పొందిన రచయిత్రికి తమ కథలకి ఇంక పత్రికల ‘ముద్ర’ అవసరంలేదనిపించి ఉండవచ్చు. అందుకే ”తులసి దళాలు” పేరుతో ఈ ఆముద్రిత కథల సంపుటిని ప్రచురించారు. ఈ ‘తులాభారం’ 108 కథలది. ఈ కథలలో ”నాలుగింట మూడు వంతులు ఇటీవల కూర్చినవే. ఇంతకుముందు అచ్చుకానివే” అని డాక్టర్‌ పోరంకి దక్షిణామూర్తి గారి ”తెలుగు కథకు సరస్వతీ పూజ’ అనే తమ పీఠికలో అన్నారుకాని, వీటిలో నాలుగోవంతు కూడా ముందుగా అచ్చయినవి అనడానికి నిదర్శనాలు ఎక్కడా కనిపించలేదు ఈ సంపుటిలో.

సరస్వతీదేవి గారి కథల్లో తరచుగా కనిపించే పాత్రలు నర్సులూ, డాక్టర్లూ, సర్జన్లూ, తరచుగా కనిపించే దృశ్యాలు ఆస్పత్రులూ, నర్సింగ్‌ హోమ్‌లూ! వీటితో ఆమెకు కొంత ప్రత్యక్షానుభం, సాన్నిహిత్యంతో పాటు, ఆమెకు ఆ వృత్తి పట్ల గల అభిమానం కూడా ఆ పాత్ర చిత్రణలో పృస్ఫుటమవుతుంది. సరస్వతీదేవిగారికి శాసనసభ్యురాలిగా ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్నప్పుటికీ, రాజకీయాల గురించి ప్రస్తావన ఎక్కడా అంతగా కనిపించదు. మానవ కుటుంబ, సామాజిక సమస్యల్ని సామాన్య దృష్టితో పరిశీలించి రాసిన కథలివి. పత్రికలలోని వార్తలూ, పుస్తకాలలోని సమాచారాలూ, కన్నవీ, విన్నవీ, ఎన్నిటి నుంచో స్ఫూర్తి పొంది ఈ కథలను రాసినట్లు గమనించవచ్చు. అటువంటి స్ఫూర్తితో కథలు రాయడంలో, కొన్ని కథల విషయంలో ఇతి వృత్తానికి ఇచ్చిన ప్రాముఖ్యం కథా శిల్పానికి ఇవ్వలేదనిపిస్తుంది.

రచయిత్రి ఎంచుకున్న కథా వస్తువులన్నీ మధ్య తరగతి మనుషులు ఇంటా బయటా ఎదుర్కొనే సమస్యలూ, వాళ్ళ దగ్గర పనిచేసే పనివాళ్ళ సమస్యలూ మొదలైనవి. కొన్ని కథల్లో స్త్రీల విషయంలో అభ్యుదయ భావాలూ, మరి కొన్నిటిలో సంప్రదాయ బద్ధమైన భావాలూ ప్రకటించారామె. కొన్ని కథల్లో ఆధునిక స్త్రీల ప్రవర్తనను వ్యంగ్యంగా విమర్శించడం కూడా గ్రహించవచ్చు. కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారనీ, వాటివల్ల ఆమాయకులైన కొందరు పురుషుల జీవితాలు ‘వరకట్న హత్యల’ పేరుతో బలైపోతున్నాయనీ చూపించారు. కొందరు ఆధునిక స్త్రీలు విడాకులు తీసుకోవడం అసంమంజసం అని పరోక్షంగా సూచించారు. కొన్ని కథలు వాస్తవికంగా ఉన్నప్పటికీ, వాటి ముగింపు సమర్థనీయంగా లేదు.

”ఖైదీ కొమరయ్య” కథ చాలా వాస్తవికంగా, పని కుర్రవాడు కొమరయ్య పట్ల ఆర్ద్రత కలిగించేటట్లుగా ఉంది. కాని, బాలనేరస్థుల జైలులో ఉన్న కొమరయ్య అక్కడ ఇచ్చే శిక్షణతో బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తూండగా, ఆ సంగతి దాచి, కొమరయ్య చచ్చిపోయాడని అతని పాత యజమాని కొమరయ్య తల్లితో చెప్పడం, అంతేకాక, వెట్టి చాకిరీనీ, ఈ జన్మకి తీరని అప్పునీ తప్పించుకోవాలంటే ఆ తల్లిని కూడా ‘రైలు కిందపడి చచ్చిపో’మనో లేదా ఊరి నుంచి ‘పారిపో’మనో సలహా ఇవ్వడం – ఇదంతా కొమరయ్య బంగారు భవిష్యత్తు కోసమే అని సూచిస్తారు కథ ముగింపులో.

ఈ పుస్తకానికి శీర్షికగా ఉన్న ”తులసి దళాలు” అనే కథలో తెలుగుతనం లేదు. జీవన్‌లాల్‌ అనే అతను తన పెంపుడు తల్లి జ్ఞాపకార్థం తన ఆవరణలోని తామర కొలనుమధ్య కట్టిన తులసి కోటపైనా, ఆ తులసి చెట్టు దళాలపైనా ఎందుకంత భక్తి శ్రద్ధలు చూపిస్తాడో చెప్పిన అసామాన్య’ కథ ఇది.

మూగవాళ్లకు ఆధునిక వైద్య పరికరాలతో స్వరపేటికని అమర్చి మాటలొచ్చేటట్లు చేయగల జర్మన్‌ సర్జన్‌, తను విజయవంతంగా ఆపరేషన్‌ చేసిన తెలుగు పిల్ల అందానికి ముగ్ధుడై ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ”సిండరెల్లా” కథ లాంటిది ”అదృష్టరేఖ” అనే ఈ కథ.

”అంతరాత్మల నాటకాలు” అనే అవాస్తవికమైన కథలో అసలు సైకియాట్రిస్ట్‌ దేవుడే అన్న ప్రతిపాదన ఉంది. అవాస్తవికం అనిపించే మరోకథ – ”అలివేణి – కౌసల్య – శర్మ” అయితే, భర్త ఇష్టాయిష్టాలకు అనుగుణంగా నడుచుకున్నా, వ్యతిరేకంగా నడుచుకున్నా భర్త ఆ ఇద్దరు స్త్రీలనూ మోసం చేయగలడని రుజువు చేస్తుందీ కథ. ”ఆగని కృష్ణార్జునుల వివాహం”, ”ఆగిపోయిన నీల ఆదర్శ వివాహం” వంటి పాత కాలపు కథా శీర్షికలు కొన్ని ఉన్నాయి. ”అమ్మా నాకు ప్రాణంతో పుట్టే హక్కులేదా” అనే కథా శీర్షికని బట్టి, ఒక బిడ్డ తల్లిని నిలదీసి అడుగుతూ చెప్పినకథో, అడిగినట్లు చెప్పిన కథో అనే ఊహరావచ్చు. కాని, కథనం మామూలుగా రచయిత్రి చెప్పినట్లుగానే ఉంది. ”ఆరని మంటలు” కథ కొంత ఆవాస్తవికం అనిపించినా, ఆర్తికలిగించే కథ.

మొత్తం మీద ఈ కథలకు చదివించే గుణం ఉన్నప్పటికీ, వరసపెట్టి చదవడం కష్టం. ఈ కథా సంపుటాన్ని మామూలుగా సోఫా కుర్చీలోనో, వాలు కుర్చీలోనో కూర్చుని పట్టుకు చదివితే చేతులు పీకుతాయి. (1440 పేజీల బౌండ్‌ పుస్తకం కదా). ఒళ్లో పెట్టుకొని చదివితే తొడలు నెప్పెడతాయి. అంచేత పుస్తకాన్ని రైటింగ్‌ టేబుల్‌మీద పెట్టుకుని లైబ్రరీలో కూర్చుని చదివినట్లు చదవడం మంచిది. ఈసమస్యని దృష్టిలో పెట్టుకుని రచయిత్రి స్వయంగా ఒక మంచి పరిష్కారాన్ని సూచిస్తూ ఈ పుస్తకంలో ముందుగా ”న్వవిషయం”లో ఇలా రాశారు – ”పాఠకుల సౌకర్యార్థం నూట ఎనిమిది తులసిదళాల సంపుటిని మూడు భాగాలుగా అచ్చువేయిస్తున్నాను. అప్పుడు బరువులోను, ధరలోను తేలికగా ఉండగలదు. మూడు సంపుటాలూ మార్కెట్‌లో కొచ్చి ఉంటాయని ఆశిస్తున్నాను. నిజమే! ఆలాచేస్తే పాఠకులకు సౌకర్యంగా ఉంటుంది.

 (ఆంధ్రప్రభ,….95)

11. మంచి ఆలోచనలు పెంచే కథలు

దాదాపు అయిదుదశాబ్దాల నుంచీ మానవ సంబంధాలపై మంచి కథలు రాస్తున్న ప్రముఖ రచయిత బలివాడ కాంతారావు గారి రెండ కథా సంపుటం ఇది. (మొదటిది 1987లో వచ్చింది.)

ఈ సంపుటంలో ఉన్న 33 కథానికలలో చాలా వరకు 1966-91 మధ్య కాలంలో ప్రచురింపబడినవి. ఒకటి మాత్రం 1950 నాటిది. రెండు కథలకు ‘వయస్సు’ తెలియదు. ఈ కథలన్నీ ఏయే పత్రికలలో ప్రచురితమయ్యాయో తెలిపి ఉంటే బావుండేది. తెలియజేయడం అవసరం – భావి పరిశోధకుల కోసం.

కాంతారావు గారి కథలన్నీ జీవితానుభవం నుంచి ఉద్భవించినవే. ఒడిదుడుకులతోనూ, వక్రమార్గాలతోనూ, నడిచే జీవితాలను పరిశీలిస్తూ, స్వానుభవంతో, మౌలికమైన విలువలకు ప్రాధాన్యం ఇస్తూ రాసిన కథలివి. వీటిని ప్రేరణ కలిగించిన వ్యక్తులనూ, పరిస్థితులనూ, సంఘటనలనూ స్మరించుకున్నారాయన తమ ”ముందుమాట’లో ముఖ్యంగా, ‘మనిషి – పశువు’ ‘ముంగిన కథ’ అనే కథల నేపథ్యాన్ని వివరించారు.

‘ముంగినకథ’ నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ 1993 ప్రచురించిన తెలుగు కథానికల సంకలనంలో చోటు చేసుకుంది. మెడలో మువ్వలతో ఘల్లు ఘల్లుమంటూ తిరిగే పెంపుడు ముంగిస ‘బయ్యన్న’పై మనకీ మమకారం ఏర్పడి హృదయం ఆర్ధ్రమవుతుంది.’ కథ పూర్తయ్యేసరికి నీతి, అవినీతి అంటే ఏమిటో తెలియని పశువులాగా బతికిన ఒక తాగుబోతు ‘మనిషి’గా మారాక ఎటువంటి ఘాతుకానికి పూనుకున్నాడో వివరిస్తుంది. ”మనిషి – పశువు’ కథ.

సాహిత్య ఆకాడమీ (న్యూ ఢిల్లీ) 1958లో ప్రచురించిన తెలుగు కథా సంకలనం ‘ఆంధ్ర కథా మంజూష’ లోనూ, 1994లో ‘అందరికీ విద్య – రాష్ట్ర ప్రచార వేదిక’ ప్రచురించిన ‘చదువు కథలు’ అనే కథా సంకలనంలోనూ చోటు చేసుకున్న ‘పాడు లోకం పాడు మనుములూ’ కథ ఈ సంపుటంలో ఉంది. ఆడ పిల్లల్ని చదివించడం ఎంత ముఖ్యమో తండ్రి తన ఆఖరి దశలో తెలుసుకుని పశ్చాత్తాపపడడం అ కథలోని ముఖ్యాంశం.

ఉద్యోగం చేసినన్నాళ్ళూ, నీతిగా బతికి, ఉద్యోగం హోదాలో వీలయినంతగా ఇతరులకు సహాయపడి, చేసిన సహాయాన్ని మరిచిపోయి, నిశ్చింతగా, నిర్మలంగా ఉండగలిగితే ‘రిటైర్డ్‌’ జీవితం సుఖంగా సాగుతుందని చెప్పే కథ ‘సుఖ జీవనం’.ఉద్యోగ నిర్వహణకు చెందిన మరికొన్ని కథలు – గులకరాళ్ళు’ ‘అవతార పురుషులు’ ‘నెమలి సింహాసనం’. అధికారులు తమ కింది వారి పట్ల అవగాహనతో, కరుణతో మసులుకోవాలని సూచించే కథలు.

మంచి మనసున్న చాకుల్లాంటి యువకులు నిరుద్యోగులుగా మిగిలిపోయి విప్లవ మార్గాన్ని అనుసరించేలా ప్రవర్తించే ప్రభుత్వంలో భాగమైనందుకు ఎవరైనా సిగ్గుపడాల్సిన విషయం అంటారు ‘రాజదూతలూ’, ‘దేవదూతలూ’ కథలో.

”మనిషి దోచుకుంటాడు. లేక దోపిడికి గురి అవుతాడు. దోచుకున్న సంపద అది. దానితో ఇల్లు కట్టి అందులో దోపిడికి గురి అయ్యానుజ. సుఖాన్ని పొగొట్టుకున్నాను” అని పశ్చాత్తాపపడతాడొకడు ‘అదృష్టచిహ్నం’ కథలో.

”ఒక కన్నుంటే లోకం చూడటానికి చాలదా రెండో కన్ను యెదుటి వాళ్ల కోసం. దానితో దయతో నన్ను చూసి చచ్చిపోతున్న దాన్ని బతికించావు’ అంటుందొక తల్లి – దుస్థితిలో నిజమైన కొడుకులా ఆదుకున్న మనిషితో ‘ప్రతీక్ష’ కథలో.

” గడియారం లేకపోయినా కాలం గడుస్తుంది” తాను లేకపోయినా తనదనుకున్న మనిషి బతక గలదు. దేని విలువైనా ఎంత? – అని ప్రశ్న ‘విలువెంత’?

ఇంకా, పల్లెటూళ్లలో మారుతున్న పరిస్థితుల గురించీ, పాశ్చాత్య నాగరికత ప్రభావాల గురించీ, మూఢ విశ్వాసాల గురించీ, స్త్రీ పురుష సంబంధాల గురించీ కూడా కథలున్నాయి ఈ సంపుటంలో.

తమ కథలు చదివిన పాఠకులలో, ఏ ఒక్కరినైనా ఆలోచింపజేయాలన్నదే కాంతారావు గారి కోరిక. అది నెరవేరకపోవడం అంటూ ఉండదు. మంచి ఆలోచనలు పెంచే కథలు ఇవి.

(ఆంధ్రప్రభ, ఫిబ్రవరి 20, 1995)

12. ‘ఎల్లి’

ఎరుకల వాళ్ల జీవితాల గురించి రాసిన నవల ‘ఎల్లి’. పందుల్ని పెంచుతూ, మేపుతూ, అమ్ముతూ, చంపుతూ, పందులమీద ఆధారపడుతూ మధ్యమధ్య ఈతాకు బుట్టలూ, చాపలూ అల్లి అమ్ముతూ, సోదె చెబుతూ, చావుబతుకుల మధ్య కొట్టుమిట్లాడే ఒక బడుగుజాతి కథ ఇది. కథానాయిక కాకపోయినా, ఈ నవలలోని ఒక ముఖ్య పాత్ర ‘ఎల్లి’ తనతో పాటు తన కుటుంబంలోని ఆడపిల్లలు పురుషుల దుర్మార్గానికీ, సామాజిక దురాచారాలకీ ఎలా బలైపోయారో తలుచుకుంటూ బతుకీడుస్తున్న మరో ముఖ్య పాత్ర ‘మాలచ్చిమి’. పురుషపాత్రల్లో సుబ్బన్న, బిచ్చాలు, ఎంకన్న, బూసియ్య మొదలైన తండ్రులూ, భర్తలూ పురుషాధిక్యతకి వారసులైతే, జీవాలు, రాజి, దువ్వ సంప్రదాయాల్నీ అన్యాయాన్నీ ఎదిరించాలన్న తపన ఉన్న యువకులు.

ఈ ఎరుకలవాళ్ల వివాహ వ్యవస్థకి మూలం ‘ఓలి’ అనబడే కన్యాశుల్కం. ఓలి అయినా, వరకట్నం అయినా ఆర్థిక సూత్రం మీద ఆధారపడే వివాహ, కుటుంబ వ్యవస్థలు ఎంత అమానుషంగా తయారవుతాయో, దానికితోడు పురుషాధిక్యత స్త్రీల బతుకుల్ని ఎంత నిర్ధాక్షిణ్యంగా నేలపాలు చేస్తుందో, భూస్వామ్య వ్యవస్థ బడుగు జనాన్ని ఎన్నివిధాల దోపిడీకి, పీడనకీ గురిచేస్తుందో తెలియజేసే కొందరి జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపించి, తిరుగుబాటు చేయాలనే ఆలోచనకి కూడా భయపడిపోయే పిరికివాళ్లలా మగవాళ్లని ఈ వ్యవస్థ ఎలా తయారుచేస్తుందో, తిరగబడటానికి ప్రయత్నిస్తే ఏ గతి పడుతుందో చూపిస్తుందీ నవల.

ఇది ‘విరసం’ ప్రచురణ. అయినా రచయిత అరుణ వాస్తవికతకే ప్రాధాన్యం ఇస్తూ, యువత ఆవేశాన్ని కొద్దిగా చవిచూపించారే గాని, సమూహాన్ని రెచ్చగొట్టే ఉద్రిక్తతని ప్రవేశపెట్టలేదు. దళిత స్పృహతో దళిత జీవితాన్ని వివరంగా, సమర్థవంతంగా చిత్రించారు కాని, ఉద్యమోన్ముఖంగా నవలను ముగించలేదు. ఎవరో ఒకరిద్దరు యువ నాయకులు బయలుదేరి తమ చుట్టూ ఉన్న వారిలో ఉద్యమ స్ఫూర్తిని కలిగించడానికి బదులు, బడుగు వర్గానికి చెందినవారు తమ వాస్తవ పరిస్థితులను అవగాహన చేసుకుని, మానవ సంబంధాలను మెరుగుపరచుకోవాలనే సంయమన దృక్పథం కనిపిస్తుందీ రచనలో…

ఎరుకల వాళ్ల భాష వేరు. కాని ఒకటి రెండు పదాలు చొప్పున అక్కడక్కడ వాడటం తప్పించి, మొత్తం నవలంతా ఒక పల్లెటూరి మాండలిక వ్యావహారిక భాషలోనే రాశారు రచయిత. దీన్ని సంభాషణలకు పరిమితం చేసి ఉంటే చదివించే గుణం ఎక్కువయ్యేది. ఈ నవల గురించీ, రచయిత గురించీ పీఠిక గాని, పరిచయం గాని, ముందుగాని – ఆఖరునగాని లేకపోవడం కొంత అసంతృప్తిని కలిగించినా, రచయిత ఆత్మవిశ్వాసాన్నీ, రచనలోని సహజ ప్రతిభనీ ప్రదర్శిస్తోందని అంగీకరించాలి.

దళిత సాహిత్యంలో ఈ నవల కొక ప్రముఖ స్థానం ఉంటుందనడంలో సదేహం లేదు. ఎరుకల గురించి అందరికీ ఎరుక కలిగించగల నవల ఇది.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, జూలై 5-11, 1995)

13. రాజకీయ కథలు

”ఇంత వరకూ మనం వ్యక్తిగత సమస్యలనో, మనకు మాత్రమే సంబంధించినవనో, మన కుటుంబానికి పరిమితమైనవనో అనుకుంటున్న విషయాలన్నీ రాజ్యం మనమీద చాలా పకడ్పందీగా, కనపడకుండా విధించిన ఆంక్షలని మనకు అర్థమయ్యాక మన జీవితాలలో ప్రతి చిన్న విషయమూ రాజకీయమే నని తెలుస్తుంది” అంటారు ఓల్గా – తమ కథా సంపుటానికి రాసిన ‘ముందుమాట’లో.

స్త్రీవాదం అంటే ఏమిటో, దాని మూలాలు ఏమిటో, దాని గమ్యం ఏమిటో అర్థమయ్యేలా స్త్రీల జీవితాలకు సంబంధించిన అనేక అంశాలను తమ కథల్లో విడమరచి, కనువిప్పు కలిగేలా చెప్పడంద్వారా కథా సాహిత్యంలో ఒక స్పష్టమైన మలుపు తీసుకొచ్చి, స్త్రీవాద సాహిత్యానికి బలమైన బాట వేసిన రచయిత్రి ఓల్గా.

1985 నుంచి 1992 వరకూ అచ్చయిన ఓల్గా కథల్లో ఈ సంపుటంలో చేర్చిన 12 కథల్లో ప్రతి కథా ఒక కరదీపిక వంటిది.

స్త్రీ తన జుట్టుని పోషించుకోవడంలోనూ, నిర్లక్ష్యం చేయటంలోనూ ఎంతమంది పెత్తనం చేస్తారో’, ‘ఆడదాని జుట్టుమీద ఇన్ని ఆంక్షలూ, నియమాలూ, పెత్తనాలూ’ ఎందుకొచ్చాయో, ‘ఆడదాని జుట్టు నింత గట్టిగా పట్టుకున్న సమాజం ఆడదాన్ని ఇంకెంత గట్టిగా పట్టుకుంటుందో సూచిస్తారు. ఓల్గా – ‘సీత జడ’ కథలో. ఇది కథా వస్తువు దృష్ట్యా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి ‘అరికాలికింద మంటలు’ వంటి విశిష్టమైన కథ.

కుటుంబం, సమాజం స్త్రీని కళ్లుండీ చూడలేని ఆశక్తురాలిగా, తన పరిస్థితిని చూసి వాస్తవాన్ని గ్రహించలేని మూర్ఖురాలిగా ఎలా తయారుచేస్తాయో ‘కళ్లు’ అనే చిన్న కథలో చూపించారు ఓల్గా.

ఈ అంశాన్నే మరింత విస్తృత పరిధిలో చూపిస్తారు ‘ఏం చెయ్యాలి’ అనే కథలో. ఇది అన్నిటికన్నా పెద్ద కథ. కేవలం ఒక భార్యగా, తల్లిగా మిగిలిపోకుండా, పై చదువు చదివి ఉద్యోగం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకుంటుంది, ఒక గృహిణి. తన స్నేహితురాలి మనో వికాసాన్నీ, స్వేచ్ఛనీ చూసి తను కూడా స్వయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటుంది. ఒక మహిళా సమావేశంలో బీడీ కార్మిక స్త్రీ చేసిన ఉత్తేజకరమైన ఉపన్యాసాన్ని విన్నాక, తనకు సామాజిక బాధ్యత కూడా ఉందని గుర్తిస్తుంది.

‘ఆర్తి’ కథ స్త్రీవాదానికి ‘మేనిఫెస్టో’ వంటిదని ఒక సాహితీ విమర్శకురాలు అన్నదాన్ని ”అక్షరాలా” తీసుకోకపోయినా, ఆ మాటల అంతరార్థాన్ని గ్రహించటం ముఖ్యం. కుటుంబంలో ఆడపిల్లలకీ, మగపిల్లలకీ పెంపకంలో చూపించే వివక్ష సమాజం ఎంతో గౌరవిస్తున్నట్లు కనిపించే మాతృత్వానికి చట్టం విలువ నివ్వక పోవడం వంటి మౌలిక సమస్యల్ని చర్చిస్తుందీ కథ. ఆలోచిపజేసే కథ. ”జీవితమంతా లొంగుబాటేనా? నేనతనితో కలిసి ఉంటేనా వాళ్లు నా పిల్లలు. నా పిల్లలు నాకు కావాలనుకుంటే నే నతనితో కలిసి ఉండాలి. ఈ నిర్బంధం ఏమిటి? నా మాతృత్వం నా స్వతంత్రాన్ని హరించడం ఏమిటి?…. ఆ హక్కులను కాలరాసిన శక్తి ఏదైనా, ఎంత రాక్షసబలంతో కూడినదైనా దానితో తలపడతాను … రాజీ ప్రశ్నే లేదు. ఈ పోరాటం చెయ్యనిదే నాకున్న సృష్టి శక్తికి అర్థం లేదు. సార్థకత లేదు” అనుకుటుంది ‘ఆర్తి’ కథలో కథానాయిక.

శాంతియుత సహజీవనాన్ని కోరుకునే చాలా మంది ఈ స్త్రీ వాద ధోరణిని తీవ్రవాద ధోరణిగా పరిగణిస్తారు. తిరుగుబాటుని సమర్థించలేరు.

అయితే, ”ఆడవాళ్ల భాష, ఆలోచనలు, అనుభూతులు అన్నీ అణచివేతకు గురైనవే. ఈ రోజు స్త్రీగా రాయటమంటే వీటన్నిటిమీదా తిరుగుబాటు చేయడమే” అని తెలియజెబుతారు ఓల్గా. ఓల్గా కథలు ఆడా మగా, చిన్నా పెద్దా అందరూ చదవలసిన కథలు.

14. ‘జీవన కథా’ శిల్పాలు

‘మధురాంతకం రాజారాం కథలు’ 2వ సంపుటి

”గాఢమైన చిత్త శుద్ధితో, లోక కల్యాణానికి దారితీసే సందేశాలను అందించే రచనలు అరుదు”గా ఉంటున్నాయని నేటి కథారచన గురించి వ్యాఖ్యానిస్తూ, పాఠకులకూ, తోటి కథకులకూ ప్రయోజనకరంగా ఉండే కొన్ని మార్గదర్శక సూత్రాలను వివరించారు ప్రముఖ కథకులు మధురాంతకం రాజారాం గారు. తమ కొత్త కథా సంపుటానికి ”మార్గ దర్శనం” అనే శీర్షికతో ముందుమాట రాస్తూ, ఆయన ఈ వ్యాఖ్య చేశారు. సాహిత్య ఆకాడమీ అవార్డు గ్రహీత రాజా రాంగారు ఇల్యా ఎహ్రెన్‌ బర్గ్‌ రచించిన ‘రచయితా-శిల్పమూ’ అనే లక్షణ గ్రంథాన్ని మెచ్చుకుంటూ, ఆ గ్రంథాన్ని తాము మళ్లీ మళ్లీ చదువుతూనే ఉన్నామని చెప్పారు. అది కథకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంటుందన్నారు.ఈ కథా సంపుటంలో 20 కథలున్నాయి – పాతవీ కొత్తవీ కలిసి! మొదటి కథ 1974 నాటిది – తెలుగు తనాన్నీ పల్లెజీవనాన్నీ ప్రతిబింబించే ‘ఉగాదులూ ఉషస్సులూ’ అనే కథ. ఏ మంచిపని చేయడానికైనా మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకోవాలనే మూఢవిశ్వాసం ఉన్న ఒక పల్లెటూరి మనిషి ఆంతర్యంలోని అమాయకత్వాన్ని సున్నితమైన హాస్యంతో ఎత్తి చూపిస్తారు ఈ కథలో.

డబ్బుతో వచ్చే భేషజాన్ని ప్రదర్శించే స్నేహానికీ, అవగాహనా, ఆర్ద్రతా నిండిన నిజమైన స్నేహ భావానికీ మధ్య తారతమ్యాన్ని స్త్రీల మనస్తత్వాల ద్వారా చూపించిన విలక్షణమైన కథ, ఖాళీ ఘటా’.

ఆస్తి అమ్ముకుని అయినా అప్పో సప్పో చేసైనా కట్నం ఇచ్చి పెళ్ళి జరిపించాలని ఆలోచిస్తాడు తండ్రి. ”బావిలోకి దూకి అయినా చస్తాను కానీ కట్నం ఇవ్వవలసి వచ్చే పెళ్ళికి మాత్రం ఒప్పుకోను” అనే ఆత్మవిశ్వాసంతో ఉన్న చదువుకున్న ఆడపిల్ల ముందుగా ఉద్యోగ ప్రయత్నం చెయ్యాలని సూచించే మార్గదర్శకమైన కథ ”చీకటిలో చిరుదివ్వెలు”.

రాజారాం గారి కథల్లో సామాన్యంగా కనిపించే ముఖ్యవ్యక్తి ఉపాధ్యాయుడు. కానీ, ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది ఉపాధ్యాయులకి సంబంధించిన జీవిత చిత్రణలో.

ఉద్యోగ నిర్వహణలో ఏదైనా మంచి పనిని సాధించినప్పుడే నిజమైన తృప్తి కలుగుతుందని ‘గణనీయులు’ కథలో చెబుతారు. ‘మనిషన్న వాడు ఎక్కడున్నా సరే, వాడి పేరు జనాభా చిట్టాలోకి తెచ్చి తీరాలన్న’ ప్రభుత్వ ఉత్తర్వును నిజాయితీగా అమలు పరిచేదెంత మంది? కొండలు కోనల వెనక చిట్టడవిలోకి పోయి అనామకులైన గిరిజన కుటుంబాల్ని కలుసుకుని వారిపై శ్రద్ధా, ఆసక్తి చూపిన ఒక ఉపాధ్యాయయుడు గిరిజనులను ‘గణనీయులు’గా చేస్తాడు. కథ పేరు ‘గణనీయులు’,

కొడుకును కష్టపడి చదివించి తన స్కూలుకే హెడ్‌ మాస్టర్‌ అయేలా చేసి, తాను తన ప్యూన్‌ ఉద్యోగం నుండి చాకచాక్యంగా తప్పుకున్న ఒక తండ్రి కథ ‘అడిగిరాని వరాలు’. మొదట్లో ఉదాహరించిన ‘ఉగాదులూ ఉషస్సులూ’ కూడా ఉపాధ్యాయుడి అనుభవం మీదే ఆధారపడిన ఆహ్లాదకరమైన కథ.

‘ప్రియ బాంధవి’ – సుఖాంతమైన బడి పంతులి ప్రేమ కథ. వాస్తవిక సంభాషణలతో పాటు అనేక వివరాలతో నిదానంగా సాగిన కథ.

మన జీవితంలో ప్రతి సందర్భంలోనూ గూండారాజ్యం ఎలా ప్రబలుతోందో, న్యాయబద్ధులూ కష్టజీవులూ అయిన సామాన్యులు కొందరు ఆ గూండాలను ఎదిరించలేక బతుకు భయంతో ఎలా ముడుచుకుపోవాల్సి వస్తుందో తెలుస్తుంది”ముసుగు నాగమ్మ మహిడీ” కథలో. గుండెల్ని బిగపెట్టేటట్లు సాగుతుంది కథనం.

”సర్వీస్‌ రికార్డ్‌” పెద్దకథ. జీవితంలో ఎవరు చేసిన తప్పులకి ఫలితాలను ఎప్పటికో అప్పటికి, పోయేలోగా అనుభవించక తప్పదన్న గ్రహింపు కలుగచేసిన కథ. జీవితాన్ని, ‘సర్వీస్‌ రికార్డ్‌’తో పోలుస్తారు రచయిత. స్వసుఖం కన్న సమష్ఠి కుటుంబ సౌఖ్యం ప్రధానం అన్న జీవన సూత్రాన్ని బలపరచిన కథ.

రాజారాం గారి కథన శైలికీ, కథాశిల్పానికీ మంచి ఉదాహరణ ‘కల్యాణ కింకిణి’ కథ. జీవితంలో పెళ్ళి ఆశ వదులుకున్న నాగరాజు అనే మిత్రుడికి పెళ్ళికుదరడం, నాగరాజు జీవిత నేపథ్యం, మధ్య తరగతి సంసారాల పాట్లూ, ఎన్నికల సమయంలో ప్రజల అగచాట్లూ, పెళ్ళికానుకగా పద్యరత్నాలనిచ్చే ముచ్చటైన వైనం ఉన్నాయి ఈ కథలో.

ఒకే తండ్రి బిడ్డలయినా, ఇద్దరు కొడుకుల స్వభావాలూ ఒకేలా ఉండవు. వారు పెరగిన పరిస్థితుల్లో ఉన్న తేడాను బట్టి వారి స్వభావాలు కూడా రూపు దిద్దుకుంటాయని సహజంగా, వాస్తవికంగా చూపించే కథ ‘ఒకే కాడ, రెండు పువ్వులు’.

‘జీవన శిల్పం’ అనే కథకి అనుసరించిన ‘కథాశిల్పం’ ఒకే అంశం మీద కేంద్రీకృతం కావాలన్న సాధారణ సూత్రాన్ని అనుసరించకుండా, రెండు వేరు వేరు ఉదంతాలను ఒకే కథలో విడి విడిగా వివరించి, ముగింపులో సమన్వయపరిచారు. నిజజీవనంలో ప్రకృతి వికృతి లక్షణాలను ప్రదర్శించే కొందరి వల్ల సమాజానికి జరిగే మంచి చెడులను దర్శించడానికి కథనంలో ఈ విధమైన ప్రయోగం అవసరమైందని సూచించారు కథ ముగింపులో.

వ్యాపార ధోరణిలో ఒక మిత్రుడు నడుపుతున్న ఓ చెత్త పత్రికలో కూడా తన కథను అచ్చువేయించుకోలేక పోయిన ఒక మంచి కథారచయిత అనుభవమే ‘లెస్‌ లగేజ్‌ మోర్‌ కంఫర్ట్‌’ (1970 నాటిది – ఈ సంపుటంలోని ఆఖరి కథ).

1958 – 93 మధ్య ప్రచురితమైన రాజారాంగారి మంచి కథల్లోంచి ఎంపిక చేసి ఈ సంపుటంలో చేర్చిన కథలకు ‘ఫలానా’ వరసక్రమాన్ని ఎందుకు పాటించారో అనేది కూడా తమ ముందు మాటలో వివరించి ఉంటే రచయిత మనోభావాలపైనా, కథలపైనా మరి కొంత వెలుగు ప్రసరించి ఇతర కథకులకూ, పాఠకులకూ, పరిశోధకులకూ మార్గదర్శకంగా ఉండేది.

(ఆంధ్రప్రభ….1995)

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, జూలై 5-11-1995)

15. ఛిద్రమైన స్త్రీ జీవిత శకలాలు

    ‘రెక్కల గూడు’

నాలుగు సంవత్సరాల పరిమిత కాలంలోనే ప్రత్యేక సంపుటంగా వేయదగిన తొమ్మిది స్త్రీవాద కథలు రాయడం యువరచయిత బమ్మిడి జగదీశ్వరరావు ప్రతిభకీ, ప్రత్యేక దృక్పథానికీ నిదర్శనం. స్త్రీవాద కథల సంకలనమే అతని మొదటి కథా సంపుటం కావటం, దానికి ఓల్గా సిద్ధాంత పూర్వక నేపథ్యంలో విశ్లేషణాత్మకంగా, ప్రోత్సాహకరంగా ముందుమాట రాయడం ఈ సంపుటం ప్రత్యేకత.

ఇందులోని తొమ్మిది కథల్లోనూ రెండు నవలికలంత పెద్దకథలు. ఈ రెండు – స్వేచ్ఛ లేని స్త్రీల జీవితాలు ఎలా ఉంటాయో, స్త్రీలు స్వేచ్ఛని ఎలా పొందగలరో నిరూపించే కథలు. వీటిలో ‘రెక్కల గూడు’ ఒకటి. భర్త అయినా, ప్రియుడైనా స్త్రీ శరీరాన్నీ మనసునీ ఎలా శాసిస్తాడో, ఎంత స్వార్థపూరితంగా, ఎంత దారుణంగా, నిర్ధాక్షిణ్యంగా పురుషాహంకారాన్ని స్త్రీపై ప్రదర్శిస్తాడో కళ్ళకు కట్టినట్లు చూపించాడు రచయిత ‘రెక్కలగూడు’ కథలో. తిండి, గూడూ ముఖ్యం అని నమ్ముతూ, ఇంట్లో బానిసలా బతుకుతూ, పురుషుడి చేతిలో శారీరక, మానసిక హంస అనుభవిస్తున్న ఒక స్త్రీ చివరకు తెలివితెచ్చుకుని, ఆర్థిక స్వేచ్ఛ అవసరమని గుర్తిస్తుంది. భర్త గూడు వదిలి, ప్రశాంతంగా ఉండే సొంత గూడు ఏర్పాటు చేసుకుంటుంది – మరొక స్త్రీ సహకారంతో. ప్రయోజనాత్మకమైన ఈ పెద్దకథలో లైంగిక హింసని మాత్రం సవివరంగా చిత్రించడం జరిగింది. అటువంటి చర్యలను సూచనప్రాయంగా చెబితే చాలు. కొన్ని వివరాలు పాఠకుల ఊహకి వదిలిపెడితే బావుండేది. అయితే ఈ కథ లోని ప్రశంసనీయమైన అంశం – ‘మగమనిషి లేకపోతే బతుకే లేదనే ఆడజాతి’ని నిరసిస్తూ, తిండి కోసం మగవాడిపై ఆధారపడవలసిన అవసరం లేదని ఒక అనుభవజ్ఞురాలైన మహిళ చేత అనిపించడం బావుంది. ఇది స్త్రీ వాదాన్ని బలపరిచే మౌలికాంశం.

‘గొడ్డు’ అనే చిన్న కథలో భార్య శరీరం మీద తనకు ఎల్లవేళలా హక్కుందని నిరూపించడానికన్నట్లు భర్త గొడ్డులా ప్రవర్తించడం చూపాడు రచయిత. అయితే ఈ కథలో కూడా ఆ ‘గొడ్డు’ లక్షణాన్ని సవివరంగా చిత్రీకరించడం కథానాయకుడి చర్యకు అద్దంపట్టినట్లుగా ఉంది. గొడ్డులా ప్రవర్తించి, తరువాత పశ్చాత్తాపడిన భర్తని తన పసిబిడ్డతో బాటు లాలించిన స్త్రీని ఓదార్చేవాళ్ళే లేరు అంటాడు ఆఖరున కథకుడు.

నిజానికి ‘గొడ్డు’ ‘రెక్కలగూడు’ లాంటి కథల్ని రచయిత్రి ఎవరైనా రాసి ఉంటే ఎంత దుమారం రేపి ఉండేవారో కొందరు రచయితలూ పాఠకులూ. ‘నీలికథ రచయిత్రి’ గా ముద్రపడి ఉండేది.

ఈ సంపుటిలో ‘అభద్రత’ అనేది చక్కని ప్రయోజనాత్మకమైన కథ. సాంప్రదాయకంగా ఆలోచించే స్త్రీ పురుషులందరూ చదివి నేర్చుకోవలసిన అవసరం ఉంది. ఇందులో ‘తన వస్తువు’ అనగానే దాన్ని ఎంతో భద్రంగా దాచుకుంటాడు ఏ మనిషి అయినా. భార్య కూడా ఒక వస్తువుగా అమూల్యమైన వస్తువుగా సమాజంలో పరిగణింపడుతోంది. భార్యని భద్రంగా చూసుకోవడం భర్త ధర్మం. అలా భద్రంగా చూసుకోవడానికి అనువుగా ‘పతివ్రత’నీ అబల నీ చేసి పంజరంలో ఉంచుతాడు భర్త. ఆడవాళ్ళని అబలలుగా, పరాధీనురాలుగా మగవాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో కూరగాయలమ్ముకునే ఒక ఆడది తన భాషలో వాత పెట్టినట్లు చెప్పడం విన్నాక ఒక మధ్యతరగతి మొగుడికి కనువిప్పు కలుగుతుంది ‘అభద్రత’ కథలో.

మరో మంచి కథ ‘లక్కపిడతలు’. చిన్నప్పటి నుంచి పిల్లలను పెంచడంలో ఆడ, మగ వివక్ష చూపించడం వల్ల సమాజంలో వ్యక్తుల మనస్తత్వాలు ఎలా రూపొందుతాయో, పక్షపాత దృష్టి ఎలా అలవడుతుందో చూపిస్తాడు రచయిత. భార్య ఊళ్ళో లేక పోతే భర్తకి ఇరుగుపొరుగు వాళ్ళు జాలితో సహాయం చేసినట్లు భర్త ఊరికి వెడితే ఒంటరిగా ఉన్న భార్యకి సహాయం చెయ్యరు. ఇందులో అంతర్లీనంగా ఉన్న స్త్రీ పురుష వివక్ష బయటపెట్టాడు రచయిత. నిజమే కాని ఇది, తాత్కాలికం. శాశ్వాత సమస్య అయితే ఎవరూ నిత్యం వచ్చి ఆదుకోరు.

మరో ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన కథ ‘భరణం’, విడాకులు తీసుకున్న భర్త భార్యకి భరణం ఇవ్వాలి న్యాయం ప్రకారం. అలాగే భర్త చనిపోతే అతను పెన్షన్‌కు అర్హుడైతే భార్యకి పెన్షన్‌ వస్తుంది. కానీ ఆ స్త్రీకి పరపురుషుడితో ఏ మాత్రం సంబంధం ఏర్పడిందని తెలిసినా, అనుకున్నా ఆవంకతో భరణం కాని పెన్షన్‌ కాని ఇవ్వకుండానే తప్పించుకోవచ్చుట ‘లాప్రకారం’! ఆ అంశం మీద లాయర్‌తో వాదిస్తూ ఒక బాణం విసురుతుంది ఒక నిరక్షరాస్యురాలు. ”అతగాడు పెళ్లాం పిల్లల తోటి రమ్జుగున్నాడు.. ఇవతలోల్లు మనుషులు కారా? ఈలకి సీమూ నెత్తురు వుండవా?… ఎలగొకలాగ దిబ్బయిపోయి నెలకు అయిదొందలు టంచనుగిస్తాను. ఆ బాబుగాని నువ్వుగాని కాపురం సెయ్యడం మానియ్యండి సూస్తాను”. అంటుంది. ఇటువంటి అన్యాయాలను భరిస్తూ ఆడవాళ్ళు ఊరుకోకూడదనీ, ఉద్యమించాలనీ ఉద్బోధిస్తుందీ కథ. అయితే పురుషుడి మీద ఆర్థికంగా ఆధారాపడకూడదనుకుంటే భరణం అన్న ప్రసక్తే రాదేమో. ఆర్థిక స్వేచ్ఛతో పాటు ఇతర స్వేచ్ఛలు కూడా పొందే అవకాశం ఉండవచ్చు.

‘మా ఇంట్లో మహాభూతం’ అనే కథ టి.వి. సంస్కృతిని నిరసిస్తుంది స్త్రీ సంక్షేమం దృష్ట్యా. పెళ్ళి చూపులు అనే కార్యక్రమమే ఆడపిల్లలకు అవమానకరంగా ఉంటుంది చాలవరకు. అటువటి కార్యక్రమం ఎంత అమానుషంగా కూడా ఉంటుందో చూడవచ్చు ‘సరుకు’లో.

కార్మికవర్గ పోరాటాల్లో పరోక్షంగా స్త్రీలు ఎన్ని అవస్థలు పడతారో, ఎన్ని కష్టాలు ఓర్చుకుంటారో, పోరాటాల్లో ఆ స్త్రీలు కూడా ఎలా పాల్గొనవలసివస్తుందో చెబుతాడు రచయిత ఎర్రకలువ అనే పెద్ద కథలో. వర్గ పోరాటినికే ప్రాధాన్యం ఇవ్వటం వల్లనేమో, కార్మిక కుటుంబాల్లోని పురుషాధిక్యతనీ, స్త్రీలపై జరిగే హింసని ప్రవేశపెట్టలేదు ఈ రచయిత. పురుషాధిక్యత, స్త్రీలపై హింస అన్ని వర్గాల్లోనూ ఉంటుందని ఓల్గా తమ ముందు మాటలో. స్వేచ్ఛకి సంకేతంగా పక్షిని తీసుకుని, మహిళ పంజరంలో పక్షిగా ఉందని సూచిస్తూ రాసిన కథల్లో ఆ సామ్యాన్ని ప్రత్యక్షంగా చూపించిన కథ ‘ఎగిరిపోయిన పక్షి’.

మొత్తం మీద స్త్రీల పట్ల సమాజానికున్న వాస్తవ దృక్పథాన్ని తేటతెల్లంచేసి, స్త్రీలు స్వశక్తినీ, సొంత ఆలోచనల్నీ, అధికారాల్నీ పెంచుకుని స్వేచ్ఛని పొందాలని ఉద్బోధించే కథలివి. స్త్రీవాదానికి చేయూతనిచ్చే కథలు ఒక యువరచయితవి కావడం అభినందనీయం, ఆహ్వానయోగ్యం.

(వార్త, 26 ఫిబ్రవరి, 1996)

16. ‘గాంధారి’కి దృష్టినిచ్చిన సత్యవతి కథలు

           ‘ఇల్లలకగానే…’

కథా వస్తు చిత్రణలో ప్రత్యేకతనీ, కథా శిల్పంలో పరిణతినీ సాధించి, తెలుగు కథకుల్లో స్త్రీవాద రచయిత్రిగా ప్రథమ శ్రేణిలో ప్రముఖస్థానాన్ని పొందిన రచయిత్రి పి. సత్యవతి.

ఇరవై సంవత్సరాల నుంచీ కథలు రాస్తున్నా, ‘మాఘ సూర్యకాంతి’ కథ (ఇదివరకు వచ్చిన సంపుటంలోనిది) రాసిన తరవాతే రచయిత్రిగా తన కర్తవ్యాన్ని గుర్తించినట్లు చెప్పుకున్నారు సత్యవతి ఈ కథా సంపుటానికి రాసిన ముందు మాటలో. తను స్త్రీల గురించి కథలు రాయడంలో ఒక ప్రయోజనం ఉందన్న సత్యాన్ని గ్రహించాక, ‘స్త్రీ’ తప్ప మరో విషయం మీద రాయాలని అనిపించలేదంటారు ఆమె.

సత్యవతి కథల్లో సైద్ధాంతిక చర్చలూ, వాదోపవాదాలూ ఎక్కువగా ఉండవు. సూటిగా స్పష్టంగా, హృదయానికి హత్తుకునేటట్లూ, మనసుని కలచివేసేటట్లూ, నిత్య జీవితంలో ఎదురయే వాస్తవికమైన సన్నివేశాలతో ఆకట్టుకునే సంభాషణలతో పాఠకుల్ని ఆలోచింపచేసేటట్లూ ఉంటాయి. ఈ సంపుటంలోని 15 కథలూ 1989 నుంచి 1995 వరకూ వివిధ పత్రికలలో ప్రచురితమైనవి. ఈ సంపుటంలోని నాలుగవ కథకి పెట్టిన ‘ఇల్లలకగానే….’ అనే శీర్షికనే ఈ సంపుటానికి కూడా శీర్షికగా వాడటంలో, ఆ కథకి రచయిత్రి ఇచ్చిన ప్రాముఖ్యం అర్థమవుతుంది. ప్రతి స్త్రీ గృహిణిగా జీవించడం మాత్రమే ఆదర్శప్రాయం, అదే తన జీవితం అనీ అనుకోకుండా, తన వ్యక్తిత్వాన్ని కూడా నిలబెట్టుకుంటూ, ఒక సంపూర్ణ మానవిగా ఎదగడానికి ప్రయత్నించినప్పుడే కుంటుంబంలోనూ సమాజంలోను స్త్రీల పరిస్థితి మెరుగుపడుతందనీ, స్త్రీ పురుష సమానత్వం సిద్ధించగలదనీ తెలియజెబుతుందీ కథ. స్త్రీ వాదంలోని మౌలిక అంశాన్ని సూచించే కథ ఇది. ఇల్లాలు ఇల్లలకగానే ఇంటిల్లిపాదికీ పండగ అనిపిస్తుంది కానీ, ఆ యిల్లాలికి మాత్రం పండగ కాదు. రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఇల్లాలుకు అదే తన జీవితం అనుకుంటూ, చివరికి తన పేరు కూడా మరిచిపోయే ఈగలాగ తయారవకూడదని గ్రహించి, తన పేరు గుర్తు తెచ్చుకోవడానికి నానా తంటాలూపడి, చివరికి తెలుసుకుని, తన పేరు గుర్తుంచుకోవడం తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి చిహ్నం అని గ్రహించిన ఒక గృహిణి గురించి వ్యంగ్యభరితంగా రాసిన కథ ఇది.

‘స్త్రీకి స్త్రీయే శత్రువు అనిపించుకోవడానికీ, స్త్రీలు గయ్యాళులుగా మారడానికీ, అత్తలు ‘వరకట్న పిశాచాలు’గా మారడానికీ, స్త్రీలు ప్రపంచజ్ఞానం లేకుండా ఉండి పోవడానికీ, మూఢ విశ్వాసాలను అంటిపెట్టుకుని ఉండటానికీ, పురుషుని పతనానికి స్త్రీయే కారణం అనుకోవడానికీ, స్త్రీలలోని అభద్రతా భావానికీ – స్త్రీలకి సంబంధించిన అనేక అవలక్షణాలకీ పునాది పురుషాధిక్యతేనని స్పష్టంచేశారు సత్యవతి – వివిధ ఇతి వృత్తాలతో కూడిన తమ కథల్లో.

సత్యవతి కథల్లోని ముఖ్యమైన అంశం సంసారాలు చేస్తున్న స్త్రీలు నిశ్శబ్దంగా అనుభవిస్తున్న చిత్రహింస. పురుషాధిక్యతని వాళ్లు ఏ విధంగా సహిస్తున్నారో, ఏ విధంగా అడుగడుగనా సర్దుకుపోతూ అనామకంగా మిగిలిపోతున్నారో కళ్లకు కట్టినట్లు చూపిస్తారు. అంతేకాదు. సహనం నశించి, ఎప్పుడో ఒకప్పుడు ఆ ఇల్లాళ్లు తెలివి తెచ్చుకుని తిరగబడకమానరని సూచిస్తారు తమ కథల ముగింపులో. ఆ తిరగబడటం భర్తని విడిచిపెట్టి సంసారబంధాన్ని తెగతెంపులు చేసుకోవడం కాదు. తను అణగిమణగి ఉండాల్సిన అవసరంలేదనీ, బానిసలా ఇంటిల్లిపాదికీ సేవ చేస్తూ గడపాల్సిన కర్మ తనకేం లేదనీ గ్రహించి, ఆత్మస్థైర్యాన్ని పొందడమూ, ఇంట్లోవాళ్లకి కనువిప్పు కలుగజేయడమూనూ.

‘గోవు’ అనే కథలో మన దేశంలోని సగటు స్త్రీని చూడవచ్చు. సంసార పక్షంగా, వినయ విధేయతలతో గోవులా ఉండే స్త్రీకి కూడా కొమ్ములుంటాయనీ, తనకు అన్యాయం చేసినవాళ్లని ఆ కొమ్ములతో బెదిరించి వాళ్లకి బుద్ధి చెప్పవచ్చుననీ చూపిస్తారీ కథలో రచయిత్రి.

మన గృహిణులు ఎంతో మంది పాతివ్రత్యం పేరుతో గాంధారిలాగ కళ్లకు గంతలు కట్టుకుని బతుకుతున్నారు. భర్తకన్న తెలివైనదిగా సమర్థవంతమైనదిగా కనిపించడం పాతివ్రత్య లక్షణం కాదు. భర్తకి ఎన్ని లోపాలున్నా అతనికన్న తక్కువ స్థాయిలో ఉంటూ, అణగిమణగి ఉండటమే పాతివ్రత్యం అని నమ్ముతారు మనవాళ్లు. చిన్నప్పటి తన తెలివి తేటల్నీ, ఆటపాటల్నీ అన్నిటినీ మరిచిపోయి ఏళ్ల తరబడి ఇంటి చాకరీలో మునిగిపోయి, ‘గాంధారి’లా బతుకుతున్న ఒక స్త్రీకి కనువిప్పు కలిగి, తనూ ఒక వ్యక్తిగా బతకాలనీ, తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాలనీ నిర్ణయించుకుంటుంది. ‘గాంధారిరాగం’ కథలో. ‘ఇల్లలకగానే….’ అనే కథలాంటిదే ఇది కూడా.

భర్తల విజయానికి తోడ్పడటం, భర్తల విజయానికి ఆనందించడం తప్ప స్త్రీకి మరొక జీవిత పరమార్థం లేదంటుంది మన సమాజం. కాని ‘భద్రత’ అనే కథలో కథానాయిక – భర్త మరో స్త్రీ గురించి అవమానకరంగా (తన స్నేహితురాలు చెడిపోయిందని) మాట్లాడుతూంటే సహించలేక, భర్తనీ, అతని స్నేహితుణ్ణీ ఏమీ అనలేక గుండె బిగపెట్టుకుని వంటింట్లోకి వెళ్ళిపోతుంది. ”అంతకన్నా భద్రమైనచోటు ఇంకెక్కడుంది కనుక!” అనుకుంటూ. వంటింటినీ, ఇంటినీ అంటిపెటుకున్న స్త్రీకే సమాజంలో ‘భద్రత’, గౌరవం లభిస్తున్నాయని వ్యంగ్యంగా, సూచన ప్రాయంగా విమర్శిస్తారు రచయిత్రి. వివాహం చేసుకోలేకపోయిన స్త్రీని తన అవసరానికి వాడుకుంటూనే ఆమెను అగౌరవంగా చూస్తాడు పురుషుడు. ఆ పురుషుణ్ణ్ని వేలెత్తి చూపలేని నిస్సహాయతతో కూడిన నిరసన కనిపిస్తుంది.

పెళ్లికాకముందు తండ్రి నిర్ణయాల ప్రకారం, పెళ్లయాక భర్త నిర్ణయాల ప్రకారం జీవితమంతా గడిపిన స్త్రీ, ఆఖరిదశలో పిల్లల నిర్ణయాల ప్రకారం జీవితం కొనసాగించడం ఇష్టంలేక, నిశ్శబ్దంగా బతుకుని అంతం చేసుకోవాలని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని కోడలు అవగాహనతో, సానుభూతితో మార్చగలుగుతుంది ‘అరుణసంధ్య’ కథలో.

‘బదిలీ’ కథ – తన వ్యక్తిగత ప్రతిభతో వృద్ధిలోకి రావాలని కోరుకునే ఆధునిక స్త్రీ కథ. ఉద్యోగం చేసే పురుషుడికి మరో ఊరికి బదిలీ అయితే, అతను ఆ ఊరికి వెళ్ళిపోయి కుటుంబానికి దూరంగా ఉంటే ఎవరూ ఏమీ అనుకోదు. భార్య ఇక్కడ పిల్లలతో ఒంటరిగా అవస్థలుపడుతున్నా ఎవరూ ఏమీ అనుకోరు. కానీ ఉద్యోగం చేసే స్త్రీకి ప్రమోషన్‌ మీద మరో ఊరికి బదిలీ అయితే భూకంపం వచ్చినట్లు బాధపడతారు ఇంట్లో అందరూ. అక్కడొక్కర్తెవీ ఎలా ఉంటావు?

ఇక్కడ పిల్లల్ని ఎవరుచూస్తారు? ఇంతోటి ఉద్యోగం చెయ్యకపోతే గడవదా? – అంటూ అడ్డుపడబోతారు అందరూ. ఎవర్నీ లెక్క చెయ్య కుండా వెళ్ళిపోతే, అక్కడ ఎవరితోనో తిరుగుతోంది అని అభాండాలు వేస్తారు. ‘భార్యని అదుపులో పెట్టలేని చచ్చువద్దమ్మ అని తల్లిదండ్రులు కొడుకుని సతాయిస్తారు. చివరికి భర్త మనసు మార్చుకుని భార్యపక్షం వహించబట్టి ‘బదిలీ’ కథా సుఖాంతమైంది. లేకపోతే ఒకొక్కక్కపుడు విడాకుల వరకూ వెడుతుంది వ్యవహారం. స్త్రీ పురోభివృద్ధికీ, సుఖజీవనానికీ పురుషుడి సానుభూతి, సహాకారం ఎంత అవసరమో తెలియజెబుతుందీ కథ.

ఈ సంపుటిలోని కథలు చాలావరకు మధ్య తరగతి స్త్రీలకు సంబంధించినవే అయినా, బడుగువర్గానికి చెందిన స్త్రీల కథలు కూడా లేకపోలేదు. ఆకాశంబు నుండి అనేది ఈ సంపుటిలోని మొదటి కథ. నిజానికి ఏ వర్గానికైనా వర్తించే కథ ఇది. అందమైన ఆడదాని జీవితం ఆకాశం నుంచి ఆగాధంలోకి ఎలా తోయబడుతుందో, అటువంటి స్త్రీకి తోటి స్త్రీ సానుభూతి కూడా ఎలా లభించదో చూపిస్తుందీ కథ. మరో కథ ‘ఇందిర’. చిన్నపిల్లల్ని కొలువుల్లో పెట్టి వాళ్ళ సంపాదన కోసం ఆశపడతారు. తండ్రులు లేకపోతే ఇళ్లల్లో తల్లులికి అన్ని పనుల్లో సాయం చేస్తారు. ఆడపిల్లలు. గొప్పవాళ్ల ఇంట్లో పనికి కుదిరిన ఒక ‘ఇందిర’ ఎలాంటి అవస్థలు పడి, భరించలేక బికారిలా, ఇంటికి ఎలా చేరుకుందో చెప్పే ఆర్ద్రగాథ ‘ఇందిర’.

‘వెంకటేశ్వర్లు వెళ్ళిపోయాడు’ అనే కథలో బడుగువర్గంలో పుట్టి పెరిగిన వాడు కూడా ధనికుల అండ దొరకగానే తల్లిదండ్రుల్ని ఎలా నిర్లక్ష్యం చేస్తాడో, ఆ తల్లి ఎంత కుమిలిపోతుందో చూపిస్తారు రచయిత్రి.

‘పెళ్లి ప్రయాణం’ మధ్య తరగతి కుటుంబాల్లో వస్తున్న మార్పుల్ని మూడు నాలుగు తరాల బంధువుల జీవితాలు ద్వారా తెలియబరిచే విలక్షణమైన కథ. తరాల మధ్య అంతరాలూ, రకరకాల బంధువుల మనస్తత్వాలూ, అస్తి సంబంధాలూ, వాటిల్లో ఆడవాళ్లకు జరిగే అన్యాయాలూ, కట్నాల విషయాల్లో కొందరు తండ్రులు కూతుళ్లకు చేసే అన్యాయాలూ, పల్లెటూరి తండ్రుల్ని పట్నాల్లో ఉండే కొడుకులు చేసే మోసాలూ, బలవంతపు పెళ్లిళ్లూ, పెళ్లిళ్లలో జరిగే ఆర్భాటాలూ, అనవసరపు ఖర్చులూ – మొత్తం కొన్ని దశాబ్దాల మన సామాజిక, ఆర్థిక చరిత్రనంతా సూక్ష్మ రూపంలో దర్శించవచ్చు ‘కెలిడోస్కోప్‌’ లాంటి ఈ కథలో. ఎంత జాగ్రత్తగా ఆలోచించి రచయిత్రి రాశారో అంత ఓపిగ్గా చదవాల్సిన కథ.

ఈ వర్గ సమాజంలో ”పురుషుడు వ్యవస్థకి బానిస అయితే , స్త్రీ అటు వ్యవస్థకీ, ఇటు పురుషుడికీ కూడా బానిస” అంటూ నేటి పరిస్థితులను తమ కథలలో వివరించి, ”సమాజంలో పితృస్వామ్య భావాలు, పురుషాధిక్యతపోనిదే స్త్రీల సమస్యలు తీరవు” అని తమ ”ముందుమాట’లో స్పష్టం చేశారు సత్యవతి. ఆమె అభిప్రాయాన్ని కాదనలేరు హేతువాదులెవ్వరూ.

(సుప్రభాతం, 2 ఏప్రిల్‌ 1996)

17. Striking a Strident note
‘Kathora Shadjamalu: Feminist Vyasalu’

For all those who innocently wonder whether there is male domination at present in the society, this book of “harsh notes” (musical notes) will be an eye-opener. It is a collection of articles mostly contributed to the Telugu newspaper Andhra Jyoti since 1987.
These articles were originally written by the author in English and they were later, translated into Telugu by others for the Telugu column. The collection was first published in book form in 1990. The present edition includes a few more articles written and published subsequently.
While these articles deal with serious matters concerning various problems faced by women within the family and outside, they are written in a lighter vein with a subtle sense of humour and satire.
They consist of interesting anecdotes and news items along with the author’s analytical comments. There are fifty eight short articles in all, dealing with different types of male oppression on women and various atrocities committed on women. the author examines them from a feminist point of view.
The introduction to this volume is by Volga, a leading feminist writer in Telugu and a staunch advocate of women’s freedom and equality. The author has revealed that the title of the book was chosen by her from a poem in Telugu written by one of the self-designated “Adhivastavikulu” (Surrealists), in which the poet criticized the voices raised by the feminists.
According to the poet, the feminists, instead of singing melodious songs, like a nightingale in “Panchama swaram”, were now striking harsh notes (“Kathora Shadjamalu”) trying to imitate the pecock!
The book has been dedicated to her spouse “whose tone”, she says “gradually turned sweet and melodious after constantly listening to the harsh notes.
While exposing the male chauvinist attitudes and behaviour in fields as varied as ranging from routine kitchen work in the house to legal justice in courts, the author categorically states that feminism does not mean hatred towards men. She thus clarifies the prevailing misunderstanding and wrong interpretations of feminism.
The main purpose of these articles is to review and to enable people to see women’s lives from the female point of view. The traditional views of love, affection, mother-hood, marriage, family, morality, immorality, purity, obscenity, morals and laws, rights and wrongs … all are discused and re-defined in the light of the feminist movement. Vasanth Kannabiran advocates strongly the need for women to change their hitherto soft and sweet musical notes and practise using harsh notes in order to assert their individuality and to get rid of the centuries – old male domination. The direct conversational and anecodotal style of the author makes this thought provoking book all the more readable.

(A.P. Times, April 6, 1997)

18. ‘ఆడపిల్ల’

 వర్తమాన గ్రామీణ, సామాజిక, రాజకీయ పరిస్థితుల్లో ఆడ పిల్లలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాల విషయంలో రచయిత ఐతా చంద్రయ్య తన ఆదర్శ భావాలను ప్రకటిస్తూ రాసిన నవల ‘ఆడపిల్ల’.

అనుపమ అనే యువతిని అత్తా, భర్తా కలిసి ఇంకా ఇంకా కట్నం తేలేదని హింసించి, ఇంటి నుంచి వెళ్లగొట్టినా, ఆమె తన పుట్టింటి వారి సహకారంతో నిలదొక్కుకుని , చదువు కొనసాగించి, ఒక పల్లెటూరిలో టీచర్‌ ఉద్యోగంలో చేరి, చివరికి అక్కడ తనకు నచ్చిన సారయ్య అనే ఆదర్శ యువకుని పెళ్లి చేసుకోవడం ఈ నవలలోని ప్రధాన విషయం. ఆ సారయ్య మేనమామ కూతురు శారద విప్లవ సాహిత్యం పట్లా, కార్యకర్తల ఉపన్యాసాల పట్లా ఆకర్షితురాలై, కలుషితమైన సామాజిక వ్యవస్థను సమూలంగా మార్చాలనే ఆదర్శంతో ఉద్యమంలో చేరి అరణ్యంలోనూ, ‘అండర్‌ గ్రౌండ్‌’లోనూ ఉంటూ దోపిడులూ, హత్యలూ చేసి, స్వచ్ఛందంగా పోలీసులకు లొంగి పోతుంది. ఆమె అన్న నాగేందర్‌కు మాత్రం ఆలస్యంగా పశ్చాత్తాపం కలుగుతుంది. ‘పోలీస్‌ ఎన్‌ కౌంటర్‌’లో ప్రాణాలు కోల్పోతాడు. శారద (చంద్రక్క)కు మూడేళ్ల జైలు శిక్షపడుతుంది.

విప్లవకారులు అనుసరించే హింసామార్గం వల్ల సమాజానికి లాభం లేదనీ, దైవం మీద విశ్వాసం, భారతీయ సంస్కృతి పట్ల గౌరవాభిమానాలూ విడనాడకూడదనీ పరోక్షంగా ఉద్బోధిస్తారు రచయిత. ఇది ‘సోమేశ్వర్‌ సాహితీ ట్రస్టు (విశాఖపట్ణం) 1995లో నిర్వహించిన నవలల పోటీలో పురస్కారాన్ని అందుకున్నది.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 28 జూలై, 1997)

19. గజ్జె ఘల్లుమంటుంటే

ప్రేమించుకున్న యువతీయువకులు పెద్దల అనుమతి లేకుండా గుళ్లో పెళ్లి చేసుకోవడం వల్ల కలిగే పరిణామాలను తెలియజేసే నవల శారదా అశోక. వర్ధన్‌ రాసిన ఈ నవల రాగిణి వంటి కళాకారులకూ, పెళ్లి కాకుండా తల్లి అయే యువతులకూ ఒక హెచ్చరిక. చకచకా చదివించే శైలితో పాఠకులను ఆకట్టుకోగల నవల ఇది.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 28 జూలై, 1997)

20. ‘కుంతీ పుత్రిక’

శ్రీమతి శారదా అశోకవర్ధన్‌ సంఘ సంస్కరణాభిలాషతో, స్త్రీల అభ్యుదయానికి దోహదం చేసేటట్లుగా నవలలు రాసి సాహిత్య రంగంలో ప్రముఖ స్థానాన్ని పొందారు.

”సమాజం కంటే కూడా వ్యక్తిత్వం గొప్పది” అనీ, ”జీవితంలో ఒక్కటే నిజమైన విజయం – మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించగలగటం” అనీ నమ్ముతూ, అందుకు తగినట్లుగా తన జీవితాన్ని నడుపుకో గలిగిన బలమైన వ్యక్తిత్వం కలది ఈ నవలలోని కథానాయిక నీలిమ. శ్రీధర్‌ అనే యువకుణ్ని ప్రేమించి గర్భవతి అవుతుంది. అతను తన కుటుంబ సభ్యుల ప్రభావంలో పడి, మూఢ విశ్వాసాలకు లోనై, ఆమెను వివాహం చేసుకోవడానికి నిరాకరిస్తాడు. అతను మోసం చేసినందుకు బాధపడినా, ధైర్యంగా ఉద్యోగంలో చేరి ఒంటరిగా ఉంటూ కూతుర్ని కనిపెంచుతుంది. తరువాత, తన అభిప్రాయాలకు విలువ నిచ్చే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. శ్రీధర్‌ తనను ఏ పరిస్థితుల్లో నిరాకరించాడో తెలుసుకున్నాక, అపార్థాలు తొలిగి పోయాక, కూతురితో ”నువ్వు కుంతీపుత్రికవి ఎలా అవుతావమ్మా? నువ్వు ఇద్దరు తండ్రుల ముద్దుల కూతురివి” అంటుంది.

సుదీర్ఘమైనా, పదునైన సంభాషణలు రాయడం, సంభాషణల ద్వారానే సన్నివేశాలను రూపొందిస్తూ నవలను నడిపించడం, పాత్ర చిత్రణ చేయడం శారదా అశోకవర్ధన్‌ నవలలోని శిల్ప, శైలీ లక్షణాలు. ప్రకృతి వర్ణనలూ, పరిసరాల వివరాలూ, పాత్రల వస్త్రధారణా, అలంకరణల వివరాలూ విడిగా, విరివిగా లేకుండా, దాదాపు సంభాషణలతోనే నవలను రూపొందించడం వల్ల నవలను చకచకా చదివింప జేస్తూ పాత్రల్ని మన కళ్ల ముందు నిలిచేటట్లు చేయగలిగారు రచయిత్రి.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 28 జూలై, 1997)

21. ‘శ్రీ విరించి కథానికలు”

‘శ్రీవిరించి కథానికలు’ నాలుగవ సంపుటంలోని 78 పేజీలలో (232 – 309) మొత్తం తొమ్మిది కథానికలున్నాయి. కథలు పత్రికలలో వచ్చే ముందే పుస్తక రూపంలో రావడం మంచిదనీ, ”పుస్తకంలో వచ్చిన కథలను పత్రికలు ఎన్నిక చేసుకుని ప్రచురించుకునే పద్ధతి మన భాష లోనూ, బహుళ ప్రచారానికి రావడం అవసరం” అనీ ప్రచురణ కర్తల అభిప్రాయం.

జీవితంలోని క్లిష్ట సమస్యల్ని తీసుకున్నా, మనకు ఎదురయే చిన్న చిన్న సంఘటనల్ని తీసుకున్నా – దేన్నైనా మంచి కథానికగా మలచగల శిల్ప నైపుణ్యం గల రచయిత శ్రీ శ్రీవిరించి.

బరువైన, బాధాకరమైన విషయాల గురించి మరింత బరువుగా, బాధాకరంగా, విస్తారంగా రాయడమే మంచి కథ లక్షణం అని భావించే కథకులూ, కథానికా విమర్శకులూ తెలుసుకో వలసిన అంశాలున్నాయి ఈ కథానికల్లో.

మధ్య తరగతి కుటుంబీకులు కోరికలు తీర్చ లేని ఆర్థిక స్థితిగతులు – ‘తురంగ చంద్రిక’ , ‘కనకపు గట్టు’ ‘ప్రేమలూ – పెళ్లిళ్లూ’ – ‘అరూప వీక్షణం, పని మనుషుల పట్లా, మనుషుల పట్లా గౌరవం చూపించలేకపోవడం – ‘పని మనుషులు’, ఉద్యోగం చేసే భార్య, కేవలం రచనలతో సంపాదన చేసే భర్త వీరి అన్యోన్య, అపూర్వ దాంపత్యం ‘అనుభవం అపూర్వం’, ఉన్న పరిస్థితుల్లో జీవితాన్ని ఎలా కొనసాగించాలో తాత్త్విక దృష్టితో చూడ గలగడం – ‘జీవిత విస్తారం’, ‘ఆకాశాత్‌ పతితం తోయం’, ‘అనుతాపం’, వృద్ధాశ్రమంలోని వృద్ధుల స్వల్ప సంతోషాలు – ‘పుట్టిన రోజు’ వంటివి వైవిధ్యంతో కూడిన కథానిలు, సునాయాసంగా చదివించి, ఆలోచింప జేసే ఈ కథానికలు తేలిగ్గా రాసినట్లు కనిపించే లోతైన రచనలు.

(ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, 28 జూలై, 1997)

22. తెలుగు జీవన సౌరభాలు

‘అలరాస పుట్టిళ్ళు’

కల్యాణ సుంరీ జగన్ణాథ్‌ పేరు వినగానే ‘అలరాస పుట్టిళ్ళు’ కథ గుర్తుకొస్తుంది ఆమె కథలు చదివినవారెవరికైనా. అది అంత ప్రఖ్యాతి పొందిన కథ. 1962లో ‘భారతి’ ఉగాది ప్రత్యేక సంచికలో మొదట అచ్చయింది ఆ కథ. 1997లో ‘కళాసాగర్‌’ వారు ప్రచురించిన విశిష్ట సంకలనం ‘కథాసాగర్‌’లో చోటు చేసుకుంది.

సంప్రదాయానికీ, సామాజిక నీతి నియమాలకీ బలి అయిపోయిన యువతి కథ ‘అలరాస పుట్టిళ్ళు’. భర్త అంటే ఇష్టం లేకపోయినా కాపురం చేసి తీరాలనే సంప్రదాయాన్ని పాటించే రోజుల్లో, తను ప్రేమించిన వాణ్ణి మరిచిపోలేక, కట్టుకున్న భర్త నచ్చక, అత్తింటి నుంచి పారిపోయి వచ్చేసిన పిల్ల పట్ల పుట్టింట్లో పెద్దవాళ్లు ఎంత నిర్దయగా ప్రవర్తించారో, చివరికి ఆమె జీవితాన్ని ఎలా అంతం చేశారో ప్రతిభావంతంగా చిత్రించారు రచయిత్రి. ఒక జానపద గాథ చదువుతున్నట్లుగా అనిపిస్తుంది రచయిత్రి శైలి. జానపద గీతాలనూ, పల్లెటూరి తెలుగు నుడికారాలనూ వాడటం రచయిత్రికి ఇష్టం. ఆమెకి ”మనుష్యులూ, పక్షులూ మహా ఇష్టం. గతం ఎంతో ఇష్టం” ఆ లక్షణాలన్నీ అక్షరాలా కనిపిస్తాయి ఆమె కథలో.

ఈ సంపుటంలో 20 కథలున్నాయి. ఇందులోని కథలు చాలా వరకు ఇరవై ఏళ్ల క్రితం రాసినవి. భర్త మరణం తరువాత రాయడం మానేసి, ఈ మధ్యనే మళ్లీ ఆమె రెండు కథలు రాశారు. ఇంతకుముందు వచ్చిన సంపుటాల్లోని కథలతోపాటు కొత్తగా రాసిన రెండు కథలూ ఉన్నాయి ఈ సంపుటంలో.

పూర్వ వైభవం, పూర్వ సంస్కృతి, పూర్వపు విలువలూ కల్యాణ సుందరీ జగన్నాథ్‌ కథల్లో ప్రతిబింబిస్తాయి అప్పుడు రాసిన వాటిలోనూ, ఇప్పుడు రాసిన వాటిలోనూ కూడా. కానీ 1962లో రాసిన ‘అలరాస పుట్టిళ్ళు’ కథకీ, 1997లో రాసిన ‘సాకేత’ కథకీ ఇతివృత్తంలో, పాత్ర చిత్రణలో, సన్నివేశాల కల్పనలో ఎంతో తేడా ఉంది. మొదటిది దుఃఖాంతం, రెండవది సుఖాంతం. మొదటి కథలో సత్యవతి తనకి నచ్చని భర్తని వదిలేసి అత్తింటి నుండి పారిపోయి వచ్చేసి పుట్టింటి వారి పరువు ప్రతిష్ఠలకి బలిఅయిపోతుంది. ‘సాకేత’ కథలో వసుంధర ఒక ప్రేమ వ్యవహారంలో మోసపోబోయి. తెలివిగా తప్పించుకుని బయటపడి తండ్రి దగ్గరికి తిరిగివస్తుంది. వసుంధర విద్యావంతురాలు, చైతన్యవంతురాలు.

ఈ రచయిత్రి తమ కథలకు చాలావరకు ‘భగ్నప్రేమ’ని కథా వస్తువుగా తీసుకున్నారు. సంప్రదాయాల వల్ల గాని పెద్దవాళ్ల మూఢ విశ్వాసాలూ, పట్టుదలల వల్ల గాని, ‘విధి నిర్ణయం’ వల్లగాని ప్రేమికులు విడిపోవడమో, మరణించడమో జరుగుతుంది. రచయిత్రి తన ” ఆవేశానికి ప్రోద్బలం ఇచ్చిందీ, దారి చూపిందీ” థామస్‌ హార్డీ – అంటారు ఈ సంపుటానికి రాసిన ముందుమాటలో. ఈమె కథలు చాలావరకు దుఃఖాంతాలే. ఇందుకు కారణం ”జీవితంలో ఉండే కష్టాలే” అంటారామె. అవే ఆమె ”కంట్లో పడతాయి”, అవంటే ”బాధ” అంటారామె.

ఈమె కథలకు పెట్టే శీర్షికలు భావనాత్మకంగా విలక్షణంగా ఉంటాయి. ”చిరుచెమటలు, చందనం” అనే కథలో అలివేలు పల్లెటూరి పిల్ల. కామందుల కుటుంబంలో పుట్టింది. పేదవాడిని ప్రేమించింది. తండ్రి బలవంతంగా వేరే సంబంధం చూస్తుంటే, తను ప్రేమించిన సత్యంని బతిమాలుతుంది తన తండ్రి ఎదుట నిలబడి తనను వివాహం చేసుకోవాలనుకుంటున్నానని చెప్పమని. అలివేలు తండ్రి తన కోరికను తిరస్కరిస్తాడేమోననే అనుమానంతో, స్వాభిమానంతో స్వయంగా అడగడానికి సత్యం నిరాకరిస్తాడు. తండ్రి పట్టుదలకీ, ప్రియుడి పట్టుదలకీ మధ్య నలిగిపోతూ అలివేలు పడిన బాధను సున్నితంగా, కళాత్మకంగా వ్యక్తం చేస్తారు రచయిత్రి కథ ముగింపులో.

‘మాడంత మబ్బు’ ఒక అనుమానం మొగుడి గురించి రాసిన కథ. ఇది సాహిత్య అకాడమీ (న్యూ ఢిల్లీ) ప్రచురించిన ‘తెలుగు కథ’ అనే సంకలనం (1988) లో చేర్చబడింది. భర్త అనుమానం అంతకంతకు ఎలా పెరిగిందో ప్రతీకాత్మకంగా చూపించారు రచయిత్రి. ఆకాశంలో మాడంత మబ్బుతో కథ ప్రారంభమై, క్రమంగా ముసురు అధికమై, ధారాపాతంగా వర్షం కురవడంతో ఆఖరవుతుంది. పాత్రచిత్రణ, సన్నివేశాల కల్పన, వాతావరణ వర్ణన – అన్నీ చక్కగా కుదిరిన కథ.

”సముద్రజ్వాల” కూడా చెప్పుకోదగిన కథానిక. కథా నాయకుడు మహేశ్వర్‌కి స్వేచ్ఛగా, ధైర్యంగా మగవాళ్లతో కలిసి తిరిగే ఆడవాళ్లంటే ఇష్టం లేదు. కానీ ఆధునిక యువతి ఆయిన వసుంధరని గాఢంగా ప్రేమించాడు. ఆమె తండ్రి ముందు తమ పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు, అతనికి నిజాన్ని చెప్పడం అవసరమనుకుంటాడు తండ్రి. కొన్ని ఛాందస భావాలున్న మహేశ్వర్‌కి ఆ నిజం ముందుగా చెప్పడం మంచిదనుకుంటాడు. యుద్ధం జరుగుతున్న రోజుల్లో శత్రువులు వసుంధరపై అత్యాచారం జరిపారన్న సంగతి వినగానే మహేశ్వర్‌ నిర్ఘాంతపోయి, ”నాతో ముందే ఎందుకు చెప్పలేదు? మోసం! ఇది మోసం! అని అరుస్తాడు. ”చెప్పడానికి సాహసం లేకపోయింది ఇన్నాళ్లూ, కాని ఆఖరుకి చెప్పకుండా ఉండడానికి నా సంస్కారం ఒప్పలేదు.” అంటాడు వసుంధర తండ్రి. ఆయన మాటలకి మహేశ్వర్‌లో సంస్కారం మేల్కోంటుంది. పెళ్లికి ముహూర్తం పెట్టించమంటాడు.

”సాయంకాలే వనాంతే…” అనే కథలో ఒక స్త్రీ భర్తకి ‘యాక్సిడెంట్‌ అయిందని విన్నవెంటనే నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించినా, ఆమె మరణంతోనే ఒక రహస్యం వెల్లడవుతుంది – అదే ఆ కథకి ఒక కొసమెరుపు. క్లబ్బుల్లో మగవాళ్లు కొందరు ఆడవాళ్ల గురించి ఎలా చులకనగా మాట్లాడతారో, ఎలా కబుర్లు చెప్పుకుంటూ విలాసంగా కాలక్షేపం చేస్తారో చూపిస్తారు ఈ కథలో. ఈ కథ మిగిలిన వాటికన్న భిన్నంగా ఉంటుంది. శైలిలో భేదం ఉంది. ఇందులో క్లబ్‌ వాతావరణం ఉండటమే కాకుండా, ఇంగ్లీషు వాక్యాలు ఎక్కువ వాడటం, వర్ణనలూ వ్యాఖ్యానాల కన్న సంభాషణలు ఎక్కువ ఉండటం – ముఖ్యంగా మగవాళ్లు ‘గాసిప్‌’ చెయ్యడం పురుషాధిక్యతని సూచించే భర్తల సంభాషణలతో కథనం సాగడం కనిపిస్తుంది. ఈ కథ రాసి చాలా కాలం అయినా, నేటికీ ఆ సంభాషణలు వినిపిస్తూ ఉంటాయి సమాజంలో. కథా వస్తువు దృష్ట్యా ”ఎండమావులు” కథ భిన్నమైనది. నీళ్ల ఎద్దడి ఉన్నఊరి కథ. ఆ ఊళ్లో ఒక వ్యక్తి తన ఊరికోసం, ఊళ్లో వాళ్ల కోసం ఎన్ని మంచి పనులు చేసినా స్వార్థంతో చేశాడని విమర్శిస్తారు కొందరు. చివరికి తమ తప్పు తెలుసుకుని అతని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు.

ఈ సంపుటంలోని ఆఖరి కథ ”మట్టి గోడలు”. ఈ మధ్య ఒక వార పత్రికలో అచ్చయిన కథ ఇది. ఇందులో కూడా పాతకాలపు గ్రామీణ వాతావరణం కళ్లకు కడుతుంది. అనాటి మాట తీరు తెలుస్తుంది. బతికి చెడిన కుటుంబానికి చెందిన ఒక తల్లీ కొడుకులకు బడుగువర్గానికి చెందిన ఒక తండ్రీ కూతుళ్లు సహాయం చేసి ఏ విధంగా ‘రుణం’ తీర్చుకున్నారో, ఆ కొడుకుల అనుబంధాన్ని ఎలా బతికించారో చెబుతారీ కథలో. రాతిగోడల కన్న మట్టి గోడలు తక్కువైనవి కాదనీ, మట్టి గోడల మధ్య నివసించే మనుషుల్లోనే మానవత్వం ఉంటుందనీ చూపిస్తారీ కథలో.

ఇలా రకరకాల మానవ సంబంధాల్ని చిత్రిస్తూ రాసిన కథలున్నాయి ఈ సంపుటంలో. సాంప్రదాయాలూ, నమ్మకాలూ – అంటే తలవంపుల తెచ్చే అజ్ఞానాలూ, మూఢత్వాలూ, తప్పులూ తీసేస్తే – చాలా వరకూ అర్థయుక్తమైనవేనని తోస్తుంది” అని చెబుతూ ఆనాటి ఘనతలూ భాగ్యాలూ ఈ నాటి యువతీ యువకులముందరికి తేవాలని నా ఉద్దేశం” అంటారు కల్యాణ సుందరీ జగన్నాథ్‌ కథల్లో తమ కథలకు ముందుమాటగా. ఆ ఉద్దేశం ఆమె కథల్లో ప్రస్ఫుటమవుతుంది.

(ఆంధ్రజ్యోతి ………..1997)

23. ‘చింతల నెమలి’

‘చూపులు’, ‘పైటని తగలెయ్యాలి’ వంటి కవితలతో తీవ్ర స్త్రీవాదిగా పేరు పొందిన డా||జయప్రభ తన సరికొత్త కవితాసంపుటిలో మౌలికంగా సున్నితమనస్కురాలుగా, భావుకురాలుగా, తాత్త్వికజిజ్ఞాసువుగా దర్శనమిస్తారు. ‘యుద్ధోన్ముఖంగా’ ప్రారంభించిన ఆమె కవితాప్రస్థానం పరిణతమార్గాల వైపు ప్రయోగాత్మక రీతుల్లో సాగుతూ వస్తోంది. పురుషాధిక్యంపై ‘మూడోపాదం’ పెట్టి, ‘యశోధరని ‘వగపెందు’కని ఊరడిస్తూ, తనలోని ‘చింతలనెమలి’ని ఆవిష్కరిస్తున్నారిప్పుడు.

‘చింతలనెమలి’ అనే కవితాసంపుటిలోని 88 కవితల్లో 87 కవితలు గతనాలుగు సంవత్సరాల్లోనూ చాలావరకు ”రాత్రి పూట అందరూ నిద్ర పోతున్నప్పుడు తాను నిద్రపోకా, నిద్రపోలేకా”, కూర్చుని రాసినవి. అనేక సందర్భాల్లో తాను పొందిన మానసికోద్రేకాల నేపథ్యాలను సూచించడానికన్నట్లు, సంవత్సరాలూ, తారీఖులతో పాటు, ఏది ఏ వేళప్పుడు రాసినదీ తెలియజేశారు. ఆమె ప్రతివిషయంలోనూ నవ్యతను కోరుకుంటారు. ప్రాచీన ప్రతీకల్ని తీసుకున్నా వినూత్నశైలిలో వ్యక్తం చేస్తారు. ”…సీతజాగరణ లాంటి/ ఊర్మిళనిద్ర లాంటి దుఃఖంతో నేను” అంటూ ఒంటరితనాన్నీ, బాధనీ, నిద్రలేని రాత్రుల్నీ ఆర్ద్రంగా, ఆలోచనాత్మకంగా చిత్రించారు జయప్రభ అనేక కవితల్లో.

పురాణాల నుంచీ, ప్రబంధాల నుంచీ ప్రతీకలు తరచుగా తీసుకోవడం, సంస్కృతపదాలూ, సమాసాలూ వాడటంవల్ల జయప్రభ కవితాభివ్వక్తిలో గాంభీర్యాన్నీ, ప్రగాఢతనీ సాధించారు. ఈ నాటి వర్ధమాన వచనకవులు అనేక మందికి ప్రాచీనసాహిత్యంతో పరిచయం, భాషపై అధికారం అంతగా లేవు. ఈ రెండూ పుష్కలంగా ఉన్న జయప్రభలో శ్రీశ్రీ తరానికి చెందిన కవుల ప్రతిభ కనిపిస్తుంది.

జెరూసలమ్‌కి చెందిన ‘యహూదాఅమిఛాయ్‌’ అనే జ్యూయిష్‌ కవి రాసే ప్రేమకవిత్వం తనని చాలా ప్రభావితం చేసిందంటారు జయప్రభ. తన అంతశ్చేతనలోని ‘చీకటికోణాల్ని’, ‘వెలుగుపుంతల్నీ’ అక్షరబద్ధం చేసి, ‘నైరూప్యకవితాచిత్రాలను’ ప్రదర్శించారు.

‘చింతలనెమలి’లోని కవితలు చాలా వరకు అంతరంగచిత్రాలు కనుక చైతన్యస్రవంతి, మార్మికతా పెనవేసుకుని, పాఠకులను ప్రగాఢంగా ఆలోచింపజేస్తాయి. సాహితీవిమర్శకులకూ, పరిశోధకులకూ, తెలుగు అధ్యాపకులకూ కావలసినంత పని కల్పిస్తాయి!

ఆమె వాడే అలంకారాలూ, ఉపమానాలూ, వ్యక్తం చేసే అనుభూతులూ ఎవరి వాటికీ అనుకరణలు అనిపించవు. ఆమె గుండెలోతుల్లోంచీ, మేధాశక్తిలోంచీ వెలువడినవే.

”పావనగంగలో సగం కాలిన శవాల్లా/తేలుతున్న ఆలోచనలు/మస్తిష్కంలో లోపలంతా ముళ్లపాదలు/శరన్నవరాత్రుల శృంగారాన్ని/ శరీరమంతా అనుభవించి/ పూలతిన్నెలో పవ్వళించిన వేళల్లోనూ/అణగారిన అంతరాంతరాల ఘోషలు/ఏది నిజం? ఏది చిరం? ఎవరు నేను?” (‘చివరన్నది ఏది’).

మనిషిని అనాదిగా వేధిస్తున్న తాత్త్వికజిజ్ఞాస జయప్రభని కూడా ఆవహించింది. దాన్ని తనదైన రీతిలో కవిత్వీకరిస్తారు. ఆమె వేసుకున్న ‘యక్షిణీప్రశ్నలు’ కొన్ని :

”చింత పుట్టిల్లు / సంతోషమా? / శృంగార సంగమంలో / చేవ్రాలు శరీరమా? / హృదయమా? / శాంతి చిరునామా / చివరికి / యుద్ధమా?…”

ఆఖరికి ఆమే,

”జవాబు లేని కాలాన్ని దాటడానికి / పరమార్థం లేని ప్రతిధ్వనులు మోయటానికి / ధ్యానమే దారి! / నిరుపమాన నిశ్శబ్దమే దారి!!” అని తెలుసుకుంటారు.

ఆమె కవితల్లో ఉన్నది-స్త్రీగా తన అంతరంగమథనం మాత్రమే కాదు. ఎందరో స్త్రీల మనసులకి ప్రతీక ఈమె అంతరంగ చిత్రణ-

”జింకపిల్ల అనుకుని / మనం ఆశపడిన అన్ని సార్లూ మోసగిస్తూ / జానకీ!!/నీకే కాదు సుమా!/నాకు కూడా/ మాయామృగం ఒక కపట వేషధారి / ఒక విస్తీర్ణపు టెడారి!!” (‘మాయామృగం’).

రోజమేరియా రోఫీల్‌ అనే మెక్సికన్‌ కవయిత్రి రాసిన ‘జియొకొండా’ అనే కవితకి తెలుగు అనువాదం చదివి కొందరు హాహాకారాలు చేయవచ్చు. ”మిగతా దేశాల్లో కవితావసువు మీద స్త్రీల భావనాస్వేచ్ఛ ఏ రకమైన నిబంధనలనీ, నిషేధాలనీ ఒప్పుకోలేదు సుమా! అని మన మగవిమర్శక లోకానికి చెప్పటం కోసం” ఈ అనువాదకవితను తన కొత్త సంపుటంలో చేర్చినట్లు ‘ఫుట్‌నోట్‌’లో ఇచ్చిన వివరణ-విమర్శకులకు జయప్రభ ఇచ్చే సమాధానం.

తస్లీమానస్రీన్‌ని పెట్టిన చిత్రహింసకి స్పందిస్తూ. ”వీళ్లున్నారే/తస్లీమా!…గర్భంలోనే గుడి కట్టగలవాళ్లు/గరళాన్నే నైవేద్యం పెట్టగలవాళ్లు/…తల్లికి పుట్టినవాళ్లే ఉంటారు!” అంటారు వ్యంగ్యంగా.

ప్రాచీనపద్యరూపాన్ని నిరసించి, తిరస్కరించిన జయప్రభ తమ కవితల్ని ‘పద్యాలు’గానే పరిగణిస్తారు. ”ముళ్లకంపఛందం, మృతరూపం బతకదు” అంటూ కవితలు రాసినా, జయప్రభకి మాత్రాఛందస్సుపైనా, లయపైనా (‘శివుడి నెరజాణ’), ముత్యాలసరాలపైనా (‘పూలదారుల పార్థివాకృతి’) కొంత మమకారం లేకపోలేదని రుజువు చేసుకున్నారు. ‘లయ’ ఇష్టమే కాని, దాన్ని సాధించడంలో ఎటువంటి నిర్బంధాలకూ, ఆటంకాలకూ తల వంచరు. గణభంగం చేయడానికి వెనుకాడరు. ఆమెకి కవితాభివ్యక్తి, భావప్రవాహం ముఖ్యం అనిపిస్తుంది.

అనేకమంది ఇతర ఆధునిక వచనకవులు వాడినట్లు ఆంగ్లపదాలను అనవసరంగా వాడరు జయప్రభ తన కవితల్లో.

నయాగరా జలపాతం ఆమెకి ఒకప్పుడు ‘ఉగ్రవాదంలా, ఉన్మత్త రూపంలా’ కనిపించి, మరొకప్పుడు ”నీటినుంచి నింగి దాకా / ఇంద్రధనుస్సు సారించిన / నిరంతరజీవధార”లా గోచరించినట్లుగా, జయప్రభ కవితల్లో కూడా ఆ రెండు లక్షణాలూ ప్రస్ఫుటమవుతాయి.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 1 డిసెంబరు, 1997)

24. ‘వీరాజీ కథలు’

అనేక సాహితీ ప్రక్రియలలో ఆరితేరిన రచయిత వీరాజీ సమగ్రకథాసంపుటి ఇది. ఇందులో మొత్తం 40 కథలు – 1958 నుంచి 1997 వరకూ వివిధ పత్రికలలో వచ్చినవి వున్నాయి. ఈ సంపుటి బుచ్చిబాబు జన్మదినం సందర్భంగా ప్రచురితమైంది.

‘నిబద్ధత, సామాజిక స్పృహ వంటి బరువైన సూత్రాలను పట్టించుకోకుండా, తను నిత్యం చూస్తున్న, అనుభవిస్తున్న జీవితంలోంచి వివిధసన్నివేశాలనూ, మనఃప్రవృత్తులనూ తీసుకుని, వాటిని అలవోకగా చిత్రిస్తూ, ధారాళమైన శైలిలో రాసిన కథలు ఇవి.

”కథలో – ఏది చెప్పడం? ఎలా చెప్పడం? అనేవాటిలో నేను ”ఎలా చెప్పడం మీద – అంటే శిల్పంవైపే మొగ్గు చూపెడతాను….” అని రచయిత స్వయంగా చెప్పుకున్నారు. కథకుడుగానే కాకుండా, జర్నలిస్టుగా అనుభవజ్ఞుడు కనుక కథనంలో చురుకుదనం, సౌలభ్యం కనిపిస్తాయి. రకరకాల విషయాలపై చిన్న చిన్న వ్యంగ్యవాఖ్యానాలు చేస్తూ, కబుర్లు చెబుతున్నట్లుగా, చకచకా చదివించేటట్లుగా రాశారు. సంభాషణలు రాయడంలో సహజత్వాన్నీ, నేర్పునీ ప్రదర్శించారు.

వాస్తవికంగా కథలు రాసే వీరాజీకి ‘కల్పన’ అంటే ఇష్టం కాబోలు, ఆయన కథల్లోని పాత్రల పేర్లలో ‘కల్పన’ తరచుగా కనిపిస్తుంది.

నిత్యజీవితంలో, సంసారంలో కలహాలూ, కష్టాలూ, కన్నీళ్లూ, మనోవేదనలూ మొదలైన చీకటికోణాలకన్నా, ప్రేమలు, ప్రణయాలూ చిలిపి కజ్జాలూ, దంపతుల సరసాలూ, సరదాలూ మొదలైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చారు. తమ కథావస్తువుల్లో. కొట్టొచ్చినట్లు కనిపించే మరో అంశం – మొదట్లో, అంటే 1950ల చివర్లోనూ, 1960లలోనూ రాసిన కథల్లో యువతీయువకులు ‘యుక్త’ వయస్సు రాగానే ప్రేమలో పడినట్లు, లేకపోతే, పెద్దవాళ్లు పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లో చూపించడం. బి.ఏ. డిగ్రీ రాగానే మగపిల్లవాడికి వివాహానికి అర్హత వచ్చినట్లూ, ఆడపిల్లలు స్కూలు ఫైనలు వరకు చదివితే చాలు అన్నట్లు భావించడం, కొన్ని కేసుల్లో కుర్రవాడికి ఉద్యోగం లేకపోతే కాబోయే మామగారే ఉద్యోగం వేయించి పిల్లనివ్వడం, ఆడవాళ్లు పెళ్లయ్యాక ఉద్యోగాలు చేస్తే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తారనుకోవడం – ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. ( ఈ రోజుల్లో ఆడపిల్లకే డిగ్రీ వచ్చినా పెళ్లి గురించి ఆలోచించకుండా, పెద్దచదువూ, ఉద్యోగం ముఖ్యమనుకుంటున్నారు పెద్ద వాళ్ళూ, చిన్న వాళ్లూ కూడా, వరకట్న సమస్య మాత్రం అప్పటి నుండి ఇప్పటిదాకా దినదిన ప్రవర్ధమానమవుతూనే వుంది).

ఈ సంపుటంలో కథల్ని ఆకారాది క్రమంలో ప్రచురించారు. మొదటి కథ ‘అక్షింతలు’. స్నేహితుడి కూతురికి పెళ్లి సంబంధం కుదర్చడానికి ఒక కుర్రవాడి చిరునామా వెతుక్కుంటూ పోతే, చివరికి ఆ కుర్రవాడు పెళ్లిపీటల మీద కనిపిస్తాడు. అతని నెత్తిమీద అక్షింతలు వేసి రాక తప్పలేదు కథకుడికి,

‘ఎద్దులూ – బండి’ అనే కథలో కథానాయకుడికి తండ్రి పోయాక పైనబడిన

కుటుంబ బాధ్యతలతోపాటు రెండెడ్ల బండి నడిపే నారన్న చనిపోతూ తన మనవరాలి బాధ్యతని కూడ అప్పజెబుతాడు.

‘గెలుపూ – ఓటమి’, ‘గృహమే కదా స్వర్గసీమ’ అనే రెండు కథలూ సూచించేది ఒకటే – స్త్రీలు ఇల్లూ వాకిలీ చూసుకోవాలనీ, ఉద్యోగాలూ, మహిళా మండలులూ అంటూ బయటికి వెళ్లడం మొదలుపెడితే గృహిణి బాధ్యతలు సరిగ్గా నిర్వహించడం జరగదనీను. ‘గెలుపూ – ఓటమి’లో కథానాయిక, కాబోయే భర్త ‘పర్మిషన్‌’ తీసుకుని ”ఆడపిల్లల బడి”లో పని చెయ్యడానికి వెడతానంటుంది!

‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’, ‘కరివేపాకు’, ‘జవరాలి చిత్తం’, ‘పెళ్లాంతో షైరేమిటి?’ ‘ప్రియమైన ప్రియా’, ‘భోజన ప్రియుడు’ – దాంపత్య సంబంధాల గురించి రాసిన కథలు.

ప్రేమలూ, పెళ్లి సంబంధాల గురించిన కథలు – ‘ఆట కట్టు’, ‘ఒప్పందం’, ‘నళినీ లవ్‌స్టోరీ’, ‘పరిమళాపరిణయం’, ‘మంచీ – చెడ్డా’, ‘రాముని ఒల్లని సీత’, ‘సావిత్రి గ్రహించిన సత్యం’ – మొదలైనవి.

దయ్యాల గురించి రెండు కథలూ, ముష్టివాళ్ల గురించి మూడు కథలూ, మిరపకాయ బజ్జీల ‘కస్టమర్స్‌’ గురించీ, ఇలా వైవిధ్యంతో కూడుకున్న కథలు ఇంకా ఉన్నాయి ఈ సంపుటిలో. పెళ్లి కాని ఉపాధ్యాయిని పెట్టుకున్న ఆదర్శాన్నీ ‘వరకట్నం’, లాంఛనాల విషయంలో యువకులు పెట్టుకోవలసిన ఆదర్శాన్నీ సూచిస్తూ రాసిన కథలు – ‘యస్‌.మిస్‌’. ‘తెలిసిన రహస్యం’. మొత్తం మీద వీరాజీ కథలు తేలిగ్గా చదువుకుని ఆనందించదగిన కథలు.

(ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రిక, 28 సెప్టెంబరు 1998)

25. ‘మానవి’

‘మానవి’ వివాహవ్యవస్థ గురించి రాసిన ఆలోచనాత్మకమైన నవల. ఎంతోమంది గృహిణులకూ, ‘ఇతర’ స్త్రీలకూ వర్తించే నవల. సాధారణంగా వివాహ వ్యవస్థ ఎంత పాక్షికంగా సాగుతూవుంటుందో, కుటుంబసంబంధాలు ఎంత స్వార్థపూరితంగా, సంకుచితంగా ఉంటాయో తేటతెల్లం చేస్తారు ఓల్గా ఈ నవలలో. సంప్రదాయం నిర్ణయించిన సంకుచిత పరిధినుంచి, స్త్రీ ఒక సామాజికజీవిగా, మనిషిగా, మానవిగా ఎదగడాన్ని చిత్రించారు ఈ నవలలో.

భర్త, పిల్లలు, ఇల్లూతప్ప వేరే జీవితం లేదనుకుంటూ, భార్యగా, తల్లిగా, గృహిణిగా తన విధులను ఆదర్శవంతంగా నిర్వర్తిస్తూ, ఇరవైఏళ్లుగా, నిశ్చింతగా కాపురం చేస్తున్న వసంతకి హఠాత్తుగా కాళ్లకింది భూమి దిగజారిపోతున్నట్లు అనిపిస్తుంది. భర్త మరోస్త్రీని ప్రేమిస్తున్నాడని తెలియగానే, బాధపడటంతోపాటు, అవమానకరంగా భావిస్తుంది.

ఆ నిజాన్ని జీర్ణించుకోలేక, ముందుగా వదినతో చెప్పుకుని, ”నేనేం చెయ్యను? నేనా ఇల్లు వొదిలి వుండలేను” అంటూ ఏడుస్తుంది. ”నీకేం ఖర్మ ఇల్లు ఒదలడానికి, ఇలాంటివన్నీ మూణ్ణాళ్ల ముచ్చట్లే… నువ్వు తొందరపడి అతనితో తగాదా పడకు… నువ్వు కళకళ్లాడుతూ కళ్లముందు తిరుగుతుంటే ఆవిడ మీద మోజు తగ్గిపోతుంది” అని సలహా ఇస్తుంది వదిన.

స్నేహితురాళ్లు రోహిణీ, శాంతా వివాహవ్యవస్థలోని విభిన్నకోణాలను అర్థం చేసుకోమంటారు.

తనమీద సానుభూతి చూపించి, తండ్రిని మందలించి, అతన్ని మళ్లీ దారికి తీసుకొస్తుందనుకున్న పెద్దకూతురు లావణ్య, అత్తవారింట్లో తన పరువు ఏమవుతుందోననీ, ఆ రెండో స్త్రీవల్ల తండ్రి ఆస్తిలో తనకి రావలసిన భాగం ఎక్కడ రాకుండాపోతుందోననీ మాత్రమే ఆలోచిస్తుంది.

రెండవ కూతురు నవత అభ్యుదయభావాలున్నది. విద్యార్థినిగా వైజాగ్‌లో, కాలేజీ రాజకీయాల్లోప్రముఖపాత్ర వహిస్తూ ఉంటుంది. తల్లిని ఓదార్చి, తన దగ్గరికి తెచ్చుకుంటుంది తండ్రితో అనుబంధాన్ని వదులుకోకుండానే. కూతురి స్నేహితులతో స్నేహపూరితసంబంధం ఏర్పడుతున్నకొద్దీ వసంత ఆలోచనల్లో, వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది.

”ఆడదానికి జీవితంలో ఏదో ఒక రోజు మనిషిగా, మానవిగా మారాల్సినరోజు వస్తుంది… ఆరోజు వచ్చినప్పుడు అట్లా మారేశక్తి లేకపోతే, మారటానికి ఏ ఆధారమూ దొరక్కపోతే మనం సర్వనాశనం అయిపోతాం. మనమంటూ మిగలం, అందుకని మన ప్రాణాలు ధారపోసి అయినా సరే మనుషుల్లా మారటానికి కావాల్సిన శక్తి సంపాదించుకు తీరాల్సిందే” అని బోధిస్తుంది పెద్ద కూతురికి.

భర్త మరోస్త్రీని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న భార్య మనోవ్యథని అద్భుతంగా చిత్రించడంతోపాటు, ఆ ‘మరోస్త్రీ’పై సానుభూతీ, గౌరవం కలిగేలా సంభాషణలు నడిపారు రచయిత్రి.

మన సమాజంలో వివాహిత స్త్రీకి వున్న గౌరవం ఉంపుడు కత్తెలకీ, వేశ్యలకీ ఉండదు. ”స్త్రీలు ఈ రకంగా విభజింపబడటానికి కారణం వాళ్లకు పురుషులతో వున్న సంబంధాలే. ఆ ఒక్క సంబంధం కారణంగా మొత్తం సమాజం వాళ్ల వ్యక్తిత్వాన్ని నిర్ణయించగలుగుతోన్ది సమాజం.” ఈ స్త్రీపురుషసంబంధాల్లో ”ఒక్క స్త్రీనే బాధ్యురాలిని చేసి” నిందిస్తుంది సమాజం. అటువంటి స్త్రీ గురించి సానుభూతితో ఆలోచించడం, మొత్తం వివాహవ్యవస్థ గురించి కొత్తగా ఆలోచించటం అవసరమని సూచిస్తుంది ఈ నవల.

ఇష్టంలేని భార్యాభర్తలు విడాకులు తీసుకోవటం న్యాయబద్ధమైన ఈ రోజుల్లో, పాతివ్రత్యం గురించీ, జన్మజన్మల బంధం గురించీ కొత్తగా ఆలోచించవలసిన అగత్యాన్ని సూచిస్తారు రచయిత్రి. స్త్రీలు స్వశక్తినీ, ఆత్మవిశ్వాసాన్నీ పెంపొందించుకుని, కుటుంబపరిధిని దాటి, సమాజానికి కూడా ప్రేమనీ, సేవనీ అందించడంలో ఆనందం, సార్థకతా లభిస్తాయని చూపిస్తుందీ నవల.

(ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక, 23 నవంబరు 1998)

26. మనస్తత్వాల చిత్రీకరణ

‘బ్రతుకు నేర్పిన న్యాయం’

రచయితలు సాధారణంగా తమ నవలల్లో కొందరిని మంచివాళ్లుగానూ, కొందరిని చెడ్డవాళ్లుగానూ చిత్రిస్తూ ఉంటారు. కథా నాయకుడూ, కథానాయికా సాధారణంగా మంచివాళ్లే అయి ఉంటారు. కానీ నిజ జీవితంలో మంచి వాళ్లని పించుకునే కొందరిలో చెడు లక్షణాలు కొన్ని బయటపడుతూ ఉంటాయి. చెడ్డవాళ్లలా కనిపించే కొందరు కొన్ని సమయాల్లో మంచితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అటువంటి వాస్తవిక సంక్లిష్ట వ్యక్తిత్వాలను ప్రదర్శించే నవల బతుకు నేర్పిన న్యాయం. కథారయిత్రి డా.ముక్తేవి భారతి ఒక మధ్య తరగతి స్త్రీకి బతుకు నేర్పిన న్యాయాన్ని కథావస్తువుగా తీసుకుని తమ ప్రథమప్రయత్నంలోనే ఒక ఆలోచనాత్మకమైన నవల రాశారు.

వైవాహిక జీవితం గురించి అందరు ఆడ పిల్లల్లాగే కలలు కన్న సుబ్బలక్ష్మికి అభ్యుదయవాదిగా చెలామణీ అవుతున్న ఒక సంకుచిత మనస్కుడూ, స్వార్థపరుడూ భర్తగా లభించాడు. అతను శేఖరం. ఆమెకు సంసారంలో సుఖశాంతులు లేకుండా చేశాడు. తండ్రి ఆస్తికి ఏకైక వారసురాలై తనమీద పెత్తనం చెలాయిస్తుందన్న భయంతో మంచం మీద ఉన్న మామగారిని మంచి చేసుకుని ఆస్తి తనపేర రాయించుకుని, ఆయన మరణానికి కారకుడవుతాడు. సుబ్బలక్ష్మి భర్త చేసిన మోసాన్ని సహించలేక అతనితో కలిసి ఉండలేక ధైర్యం చేసి ఇల్లు విడిచి స్వతంత్రంగా వీరలక్ష్మిగా బతకడానికి బయలుదేరుతుంది. ఇక్కడే అనూహ్యమైన మలుపు తిరిగిందామె జీవితం.

ఎదురు చూడని సంఘటనలూ, వైరుధ్య పూరిత మనస్తత్వాలూ, ఆలోచనాత్మకమైన సంభాషణలతో నడుస్తుందీ నవల.

(ఆంధ్రప్రభ……….)

27. మహాశ్రమ నుంచి బాదం హల్వా దాకా

‘చిన్న పరిశ్రమలు – పెద్ద కథలు’

డా.సోమరాజు సుశీల కథా సంపుటి తెలుగు కథా సాహిత్య రంగానికి ఒక ‘ప్లెజంట్‌ సర్‌ప్రైజ్‌!’ కొత్తగా కథలు రాయడమే కాకుండా సరికొత్త కథా వస్తువుని తీసుకుని వరసగా కథలు రాస్తే అవి ఒక ప్రముఖ వారపత్రికలో ధారావాహికంగా రావడం సాధారణంగా ఎప్పుడూ జరగని సంఘటన. అంతేకాదు పురుషుల రంగంలా కనిపించే పారిశ్రామికరంగం గురించి స్వానుభవంతో ఒక రచయిత్రి రాయడం, అందులోనూ, వ్యంగ్యభరితంగా, హాస్యస్ఫోరకంగా పాఠకులను ఆకట్టుకునేలా రాయడం అసాధారణం.

పెద్దఎత్తున సాగే భారీ పరిశ్రమల మధ్య చిన్న పరిశ్రమలను నడపడం ఘనమైన వ్యాపార నౌకలు సాగే మహాసముద్రంలో చేపలకోసం చిన్న నావల్లో వెళ్లి వేటాడటం లాంటిదే. అక్కడ ప్రకృతి వైపరీత్యాలూ, పోటీలూ ఎదురైతే, పారిశ్రామికరంగంలో ప్రభుత్వాధికారులూ, బ్యాంకు అధికారులూ, దళారులూ, పెద్ద చేపల్లాంటి భారీ పారిశ్రామికవేత్తలూ అడుగడుగునా అవరోధాల్ని సృష్టించి చిన్న పరిశ్రమలను ముంచెయ్యడానికి ప్రయత్నిస్తారు.

పద్మవ్యూహం లాంటి పారిశ్రామికరంగంలో చాకచక్యంగా నెట్టుకురావడం, విజయవంతం కావడం ఒక కళ. ఇబ్బందుల్ని ఎదుర్కోవడానికి ధైర్యసాహసాలూ, పట్టుదలా మాత్రమే కాదు, జీవితాన్ని ‘స్పోర్టివ్‌’గా తీసుకోగల నేర్పూ, పరిణత మనస్తత్వం వుండాలని తెలుస్తుంది డా. సుశీల రాసిన ‘చిన్న పరిశ్రమలు – పెద్ద కథలు’ చదివితే. అంతే కాదు, ఒక స్త్రీ గృహిణిగానూ పారిశ్రామికవేత్తగానూ సమర్థ వంతంగా, వెయ్యవలసినచోట వెయ్యవలసినవారికి చురకలు వేస్తూ, సామరస్యంతో నిర్వహించే తీరుని కూడా అద్భుతంగా ఆవిష్కరించారు.

ఎదుటివారి లోపాల్ని గ్రహించడంతోపాటు తన తప్పుల్ని కూడా తెలుసుకుంటూ చాకచక్యంగా మసలుకోవడం ఈ పారిశ్రామికవేత్తకి బాగా తెలుసు. డా. సుశీల స్వానుభవంతో రాయడమేకాకుండా తన అనుభవాలను ఉత్తమ పురుషలో కథలుగా చెప్పారు. ఆ కథల్పి సరదాగా కబుర్లు చెబుతున్నట్లు చెప్పారు.

పరిశ్రమల్లోని సమస్యల గురించి ఎంత చురుకుగా సునిశితంగా చెప్పారో, తమ కుటుంబంలోని వ్యక్తుల మనస్తత్వాల గురించీ, నడవడి గురించీ కూడా అంత చలాకీగా సున్నితంగా చెప్పారు. చాలా యథాలాపంగా ఇంట్లో జరిగే సన్నివేశాలతో కథనం ప్రారంభించి క్రమంగాఉద్యోగ నిర్వహణలో (పరిశ్రమని నడపడంలో) ఎదురయ్యే చిక్కుల్లోకి పాఠకుల్ని తీసుకువెళ్లి, ఆ చిక్కుముడులను చూపించడం, ఆఖర్ని ఆ చిక్కుముళ్లని విప్పడం, లేకపోతే వాటిని చూసి విస్తుబోయేలా చేయడమో చేశారు రచయిత్రి.

ఎంతో సునాయాసంగా హాయిగా చదువుకోగల విజ్ఞానాత్మకమైన, వినోదాత్మకమైన కథలు చదివి, ‘ఓస్‌! ఈపాటి మనం రాయలేమా?! అనుకుంటారు చాలామంది. తీరా కలం పట్టుకుంటే తెలుస్తుంది- అటువంటి కథనం డైమండ్‌ చెక్కడం అంత క్లిష్టమైన పని అని. డా. సుశీల కథనంలో ఆ నైపుణ్యం, పరిణతీ కనిపిస్తాయి.

ఆమె కథలకు పెట్టే శీర్షికలలో కూడా చమత్కారం కనిపిస్తుంది- ‘మహాశ్రమ’, ‘అయినవాళ్ళం మహాప్రభో’, ‘మాయాబజార్‌’, ‘పెద్ద చేప’, ‘చదువుకుంటున్న చంద్రహారం’ ‘పావురాలకథ’, ‘స్పాన్సర్డ్‌ చప్పట్లు’ ‘నర్సిరెడ్డి చెరుకుతోట’, ‘అరుకాషుడు’ ‘మట్టిగుర్రం’, ‘బాదంహల్వా’- అన్నీ పాఠకులకు ఒక ‘ప్లెజంట్‌ సర్‌ప్రైజ్‌’నిస్తాయి. మొత్తం పన్నెండు కథలూ ఆంధ్రజ్యోతి వారపత్రిక అందించిన పన్నెండు వారాల నగలు.

ఆమె కథన శిల్పంలో ఒక ప్రయోగాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి- ‘అరుకాషుడు’ అనే కథలో ఒక గొలుసు కథని చొప్పించడం- కుటుంబంలోని వ్యక్తులందరినీ- అత్తగారి నుంచి పనిపిల్ల వరకూ- భర్త, కొడుకు, కోడలు, కొడుకు స్నేహితుడు- అందరిచేతా ప్రజాస్వామ్య పద్ధతిలో సమష్టిగా కథని నడిపించడం- అందులో రకరకాల వ్యక్తిగత వ్యావహారిక శైలుల్ని ప్రదర్శించడం రచయిత్రి ప్రతిభకి ప్రతీక.

చిన్న పరిశ్రమలు నడిపించడంలోని సాధక బాధకాల్లో ‘మహాశ్రమ’ నుంచి ‘బాదం హల్వా’ వరకూ ఉండటం- అంతా ఒక తీయని బాధ! అయితే ఇక్కడ ‘బాదం హల్వా’ నేపథ్యం వేరు! పాఠకులు చదివి ఆనందించాలి. చెప్పేస్తే ‘మజా’ పోతుంది. ఈ రోజుల్లో జీవితం అంతా ఒక ‘పట్టు’ పరిశ్రమ అయిపోయింది. ఎవరో ఒకర్ని పట్టుకుంటేగాని ఏ పనీ జరగదు! అయితే, ఈ కథా సంపుటికి ‘క్వీన్‌ బీ’ అనే పేరుతో ముందు మాటరాసిన ముళ్లపూడి వెంకటరమణ చిన్న పరిశ్రమలను నడిపే స్త్రీలను తేనెటీగలతో పోల్చారు. దానికి తగినట్టుగానే, ఆర్టిస్ట్‌ మోహన్‌ పుస్తకానికి ముఖ చిత్రాన్ని రూపొందించారు. డా.సుశీల వాడిన తెలుగు నుడికారాలనీ, అవలంబించిన వ్యంగ్య, హాస్య ధోరణినీ, ఎంచుకున్న కథా వస్తువులోని అసాధారణతనీ దృష్టిలో పెట్టుకొని, ఆమెని తెలుగు కథా సాహిత్యంలో కొందరు విశిష్ట కథకుల సరసని నిలబెట్టారు ముళ్లమూడి వెంకటరమణ. ‘నామిని’ మెచ్చిన కథలివి. తెలుగు పాఠకులకి అన్ని విధాలా కొత్తదనాన్ని రుచి చూపించే కథలివి.

(ఆంధ్రభూమి, అక్టోబరు 1, 1999)

28. విలక్షణకవి ముకుంద రామారావు

‘మరో మజిలీకి ముందు’

గత దశాబ్దంలో తెలుగు కవితావనంలో వికసించి తనదైన పరిమళాన్ని వెదజల్లుతున్న కవి ముకుంద రామారావుగారు. ఆయన తొలి కవితా సంపుటి ‘వలసపోయిన మందహాసం’. పితృహృదయాన్ని అనన్యరీతిలో ఆవిష్కరించిన కవిగా ముకుంద రామారావుగారికి గుర్తింపు తెచ్చిపెట్టింది ఆ కవితా సంపుటి. అయిదేళ్ళ తరవాత మళ్ళీ ఇప్పుడు ‘మరో మజిలీకి ముందు’ అనే మరో మైలురాయి చూస్తున్నాం.

కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలకు, మానవ సంబంధాలకు ప్రాధాన్యాన్నిస్తూ రాసిన కవితలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ సంపుటంలో కూడా. అలాగే, ఏకాంతం, ఒంటరితనం, మృత్యువు, అస్తిత్వ చింతనా- కవితా వస్తువులుగా కొనసాగాయి. వర్తమాన సమస్యలు మరికొన్ని కవితా వస్తువులు. ముకుంద రామారావు గారి రైల్వే ఉద్యోగం ఆయన కవితలపైన కొంత ప్రభావం చూపించినట్లు కనిపిస్తుంది. రైలు, ప్రయాణం వంటి వాటిని ప్రతీలుగా చేసి జీవనయానాన్ని కవిత్వీకరించారు. ఆధునిక జీవనంలో భాగాలైన కంప్యూటరైజేషన్‌, మల్టీమీడియాలు కూడా ముకుందరామారావుగారికి కవితా వస్తువులయాయి. సన్నగా పొడుగ్గా కనిపించే తారాజువ్వ లాంటిది ‘మరో మజిలీకి ముందు’ కవితా సంపుటి. చీకటి నేపథ్యంలో వెలుగురేఖల్ని ప్రదర్శిస్తుంది. చీకటి వెలుగుల జంట విన్యాసాలు కనిపిస్తాయి ఈ కవితల్లో. ‘ఉదయించే చీకటి’ అనే కవిత ఒక చక్కని ఉదాహరణ.

”దుప్పటి కింద

ఒక వెచ్చటి బద్ధకం

బయట

బాధ్యతగా

కాకులు అరుస్తుంటాయి

అమ్మో!

అంత తెల్లారినా

ఎంత చీకటో”

‘చీకటి తర్జుమా’ అనే కవితలో

”నిన్ను నా కెమేరాని చేస్తాను

నా సమస్తాంతరంగ

అనంతాకాశాల్నీ

అన్ని కోణాల్లో బంధించు

చీకటిలో నీ తర్జుమాని

వెలుగులో చూద్దాం

నేను కనిపిస్తానా అందులో” అంటారు.

జీవన మరణాల గురించి, అస్తిత్వ అన్వేషణ గురించీ రాసిన కవితలు మరింత ప్రగాఢంగా ఉంటాయి.

‘స్వయం అన్వేషణ’ అనే కవితలో

”అలల్లో

కలల్లో

అన్నింటిలో

నన్ను నేనే

వెదుక్కుంటున్నవాడిని” అనీ,

”అదిగదిగో నేనేనని

ఎందరిని చూసి

భ్రమపడ్డానో”

అని అనడంలో ‘ప్రపంచమే నేను’ అనే విశాల ధృక్పథం గోచరిస్తుంది.

మరింత తాత్వికంగా ఇలా అంటారు ముకుంద రామారావుగారు ‘ఎవరి బూడిదల్ని వారే’ అనే కవితలో

”వణుకుతున్న కొద్దీ

వణికిస్తున్న చలిలా

తలుచుకుంటున్న కొద్దీ

పోగొట్టుకున్నవాళ్ళే’,

”చావుపుట్టుకల

గృహాంతర్భాగాల్లోకి పోయి

ఎవరి బూడిదల్ని వారే

తడుముకుంటున్నారు

చీకట్లో అందరిదీ ఒకే బాధ

భేషజాలుండవు

ఆ కాస్సేపూ

స్మశానం ఒకటేనా

అందరం కలగలిసిపోయే చోటు”

ఈ కవి తాత్విక చింతనలో కొంత నిస్పృహ కూడా చోటు చేసుకుంది. ‘వైపరీత్యం’ అనే కవితలో

”పైన ఆకాశాన్ని

కింద భూమిని

దేన్నీ నమ్మాలని లేదు

ఎందుకిలా మేం

ఇంకిపోయినా

ఇంకా మట్టిలో మట్టి కాలేకపోయిన

సాక్షులం…” అంటారు.

‘ఇవి హైకూలు కావు’ అని రాసిన కవితా శకలాలు ఏ ‘కూ’లో నాకు తెలియదు గానీ, చివరి పంక్తులు భావగర్భితంగా ఉన్నాయి.

”మిగిలిన సమయం తెలిశాకే

పెరిగిపోతున్న సమయం విలువ”

ఇటువంటి భావమే ‘అవుటర్‌ సిగ్నల్‌’ అనే కవితలో కనిపిస్తుంది.

”రైల్లో అన్ని రోజులున్నా

గమ్యం చేరువైనాక

అవుటర్‌ దగ్గర

ఎంతసేపో ఎంతసేపో ఎంతసేపో”

అనడం’ వృద్ధాప్యంలో మృత్యువు కోసం ఎదురు చూసే ఆఖరి దశని ‘అవుటర్‌ సిగ్నల్‌’తో పోల్చడం గొప్పగా ఉంది.

‘నాన్న’ అనే కవితలో మరింత స్పష్టంగా చిత్రీకరించారు.

”వాకిట్లో

వాలుకుర్చీ

మా నాన్న

కదలికలన్నీ

తనకోసమనుకునే

సర్వేంద్రియాల

సమాహారం

సకల మర్యాదలతో

కూర్చోబెట్టిన

సజీవ విగ్రహం

ఎక్కడో ఏదో

కోల్పోయిన చూపుల్లో

గతం వర్తమానపు శూన్యం

దేశం నుండి

దేహం దాకా

ఆరాటంలో

మరణాన్ని

పదేపదే

ఆవాహన చేస్తున్న

వృద్ధాప్యం”

ఈ కవితలోని ఆఖరి పంక్తులు ప్రతి తండ్రికీ వర్తిస్తాయి.

”ఆ కుర్చీ ఈ నాటిదా

వాళ్ళ నాన్నది

బహుశా రేపు నాది”

కుటుంబ సంబంధాల గురించి మనసుకి హత్తుకునేలాంటి కవితలు రాశారు ముకుంద రామారావు గారు. భార్యాభర్తల సంబంధాలు, తండ్రీ పిల్లల సంబంధాలు, తాతా మనవళ్ళ అనుబంధం అన్నీ మనలో చాలా మందికి పరిచితమైనవే కానీ వాటిని కవిత్వీకరించడంలో ముకుందరామారావుగారి సునిశిత పరిశీలన, తాత్త్విక ధృకథం, చమత్కారశైలీ కనిపిస్తాయి.

‘సమాంతరయానం’ అనే కవితలో పైకి సమాంతరయానం లా కనిపించే దాంపత్య జీవితం ఎలా సాగుతుందో చూపిస్తారు.

”అతను ముందు

ఆమె వెనుక

నాలుగు అడుగులు వేసి

ఆమెకోసం ఆగుతాడు

నిట్టూరుస్తూ అతను

ఆయాసంతో ఆమె

గమ్యం చేరేవరకు అదే!

ఎంత నడిచినా

ఎవరి నడకవారిదే !

కలలు కన్నీళ్ళే

కలిసి పంచుకోలేదు

నడకమాత్రం ఎందుకు” అంటారు

అలాగే ‘సాయంసంధ్య’ అనే కవితలో

”ఎదురెదురున్నా

ఏకాంతానికి

అటువేపు ఆమె

ఇటువేపు నేను

నాలుగుపదుల వాతావరణం

ఎన్నాళ్ళైనా

ఒకే వైపుకి తిప్పుకోవాలని

ఆమె

నేను

ఆకర్షణై కొన్నాళ్ళు

పిల్లల వారధితో ఇంకొన్నాళ్ళు

తెలియనే లేదు

ఎంత తొందరగా కరిగిపోయిందో

వారథికూడా

వీలున్నపుడెపుడో

ఇరువైపులా చేరుతూ

పడవలై పోయిన పిల్లలు

ఎక్కువ భాగమిక నాలుగు గోడల్లో

ఇద్దరం ఏకాంతం

వాతావరణం

బరువెక్కుతోంది!”

అంటారాయన, గుట్టుగా ఎలా సంసారం చేస్తారో- బడుగువర్గంలో ఎలా ఉంటుందో, మధ్య తరగతిలో ఎలావుంటుందో, ఉన్నత వర్గంలో ఎలా ఉంటుందో క్లుప్తంగా చమత్కారంగా ‘మూడూ మూడే’ అనే కవితలో వర్ణించారు. గుట్టుబయట పడటాన్ని ‘పొగతో పోలుస్తూ ప్రతీకాత్మకంగా రాశారు.

తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలను కవితా వస్తువుగా తీసుకుని రాసిన కవితల్లో ఒకటి ‘మిలీనియం పిల్లలు’. ఇందులోనూ పరోక్షంగా దాంపత్యానుబంధం చిత్రితమైంది.

ముచ్చటగొలిపే ‘చిన్ని-నేనూ’ అనే కవితలో తాతా మనవళ్ళ సంభాషణ ఆర్ద్రత కలిగిస్తుంది. మానవ సంబంధాల్లో దూరాలను పెంచుతున్న సాంకేతిక పురోగతినీ, ఆర్థిక ఆకాంక్షనీ దృష్టిలో పెట్టుకుని రాసిన వ్యంగ్య కవిత ‘వెబ్‌సైట్‌’.

ఇప్పుడు మన దేశంలో అందరి దృష్టీ ఎలా ఉందో చెబుతారు. ఇలా-

”ఆశగా

ఆకాశం వైపు

అమెరికావైపు

ఆ పైని

డాలర్ల వైపు”

”అన్యోన్యం,

అక్కడ-

ఇరువురూ పరుచుకునే

డాలర్ల పరుపు మీదే”

నిజానికి, ఈ వ్యవహారం అక్కడే కాదు- అన్యోన్యం ఇక్కడ కూడా రూపాయల మీదే ఆధారపడుతుంది. అందుకే అన్ని వరకట్న సమస్యలు.

ఈ ‘వెబ్‌సైట్‌’ కవితలోని కొన్ని పంక్తులు అందరికీ తెలిసిన రహస్యాన్ని చెబుతాయి.

”ఆనందం

ఆరోగ్యం

టెలిఫోన్‌ కబుర్లలోని

అంచనాని బట్టి” అని రాశారు.

ఎందుకంటే, ఉత్తరాలు రాయడం ప్రగతి లక్షణం కాదుకదా

”ఏమీ తెలియని తన్న నుంచి

ఏదో తెలుస్తున్న తనంలోకి

ప్రవహిస్తున్న పరిణామం

నా పద్యం లాంటి పసితనం” అని ‘గుండె గువ్వ’

అనే కవితలో అన్నారు ముకుంద రామారావు గారు. ఆ పద్యం రాయడంలోనే ఆయన పరిణతి కనిపిస్తుంది. పరిణామ క్రమంలేని జీవితం నిలవనీటి గుంట లాంటిది కదా. ఇంకా ఎన్నో అంశాల మీద చెప్పుకోదగిన కవితలున్నాయి ఈ సంపుటిలో, ముకుంద రామారావుగారి కవితా ప్రస్థానంలో మరెన్నో ప్రముఖమైన మజిలీలు ముందు ముందు ఉంటాయని ఆశిస్తున్నాను.

(ఆంధ్రజ్యోతి, జూలై 8, 2000)

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో