ఆలోచనల్ని పదునెక్కించే వ్యాసాలు

జగన్‌
కొడవంటి కుటుంబరావుగారు దాదాపు ఓ డెబ్భై ఏళ్ళుగా తెలుగునాట ఒక వర్గం పాఠకులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నారు. అన్ని రంగాలలోనూ, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న అన్ని రకాల పరిణామాలనూ సూక్ష్మంగా పరిశీలిస్తూ, వాటి గురించి స్థూలంగానైనా పాఠకులతో పంచుకోకుండా ఒక్క రోజు కూడా గడవలేదాయనకు.
మానవజాతికి సంబంధించిన ప్రతి ఒక్క అంశంపైనా ఆయన దృష్టి పెట్టారు. వాటిని లోతుగా అధ్యయనం చేశారు. ఆ అధ్యయనం సారాంశాన్ని అనేక సృజనాత్మక ప్రక్రియలద్వారా పాఠకులతో పంచుకున్నారు. మనకు తెలిసి ఏ ఒక్క రచయితా రాయలేనన్ని అంశాలపై కుటుంబరావుగారు ఒక్కరే రాశారు. అవన్నీ గత ఏడు దశాబ్దాలుగా అచ్చవుతూనే వున్నాయి. ఆయన రాసిన కథలు, నవలలు, గల్పికలు, వగైరాలు ఒక ఎత్తయితే, వ్యాస ప్రక్రియ ఒక్కటీ ఒక ఎత్తు. వాటిని సబ్జెక్టుల ప్రకారం ఏర్చి కూర్చి గత పదిహేనేళ్ళుగా విరసం ప్రచురిస్తున్నది. వాటన్నిటిలోకి అత్యంత సంక్లిష్టమైన ”తాత్విక వ్యాసాలు” కొ.కు. ”వ్యాస ప్రపంచం”లో ఏడవ సంపుటిగా ఆ మధ్య వెలువడింది.
ఈ సంపుటిలోని శీర్షికలే చాలామందికి కొరకరాని కొయ్యలుగా కనిపిస్తాయి.”దయ్యాలు” గురించి రాసిన చేత్తోనే కొ.కు. ”దేవుళ్ళు”గురించీ రాశారు. మార్క్సిస్టు దృక్పథంతో మానవ జీవితాన్ని, రాజకీయాలను, కళలను, సంస్కృతిని,చరిత్రని విశ్లేషించిన కుటుంబరావుగారే, ”మార్క్సిస్టులం”అనుకునే వారు ఒప్పు కోని ”అతీతశక్తులు” గురించీ రాశారు. పైగా వాటిని ”మార్క్సిజానికి పొడిగింపు”గా ఆయన మనస్ఫూర్తిగా నమ్మారు  మార్కి ్సస్టులు ‘ఓపెన్‌ మైండ్‌’తో వీటిని అర్ధం చేసుకోవాలని వినమ్రంగా అభ్యర్ధించారు.
 ఈ పుస్తకం కూర్పు బాధ్యతలు నిర్వర్తించిన కృష్ణాబాయి, చలసాని ప్రసాద్‌ ”మార్కి ్సజానికి ఎంత మాత్రం పొసగని” కొ.కు తాత్విక ఆలోచనలను ‘మిత్ర వైరుధ్యం’గా భావించి, పాఠకుల అవగాహనకు తోడ్పడతాయనే ఆశాభావంతో యధాతధంగా ఈ గ్రంధ రూపంలో ప్రచురించారు.
 అసలు సమస్య ఇక్కడే వుంది. ‘కొ.కు రాశారు కాబట్టి విభేదించినా, వాటిని ప్రత్యేకంగా చూడడం’ ఆయనకు సరిపడని వ్యవహారం. ”అందరూ ఆలోచించండి. చర్చించండి, నా ఆలోచనలు తప్పయితే ‘ఇది తప్పు’ అని రుజువు చేయండి. లేకపోతే అసలు పట్టించుకోకండి, వీటి అవసరం ఉన్న వాళ్ళు వేరెవరైనా పట్టించుకుంటారు. అంతే తప్ప బుకాయించి నోరు మూయించే ప్రయత్నమూ వద్దు, అలా అని ఆకాశానికి ఎత్తనూ వద్దు” – ఇదీ స్థూలంగా ఈ తాత్విక చింతనపై కొ.కు. వైఖరి.
ఈ వ్యాస సంపుటిలో మొత్తం ఆరు భాగాలు ఉన్నాయి. అవి జిజ్ఞాస – మీ మాంస, మాయదారి దేవుడు, డైమెన్షన్స్‌, బుద్ది కొలత, అసాధారణ అనుభవాలు, లేఖా సంభాషణలు, చూడడానికి ఇవన్నీ వేర్వేరుగా కనిపిస్తాయి గాని నిజానికి ఇవి ఒకే తాత్విక చింతనకు వేర్వేరు మాటలు. ఒకే ఆలోచన పరంపరకు వ్యక్తీకరణలు.
కొడవటిగంటి మొదటినుంచి జిజ్ఞాసి. తనకు ఊహా తెలిసిన నాటినుంచే వైజ్ఞానిక శాస్త్రం అందించిన మహా బాహువులను అందిపుచ్చుకుని ప్రపంచాన్ని అనునిత్యం నిత్యనూతనంగా ఆవిష్కరించుకోవడానికి యత్నించిన ‘వైజ్ఞానిక భావుకుడు”ఆయన. మార్కి ్సజం అధ్యయనం వల్ల ఏర్పడిన రాజకీయ నిబద్ధతకు, ఆయనలో అంతర్గతంగా ఉన్న వైజ్ఞానిక భావుకతకు ఎప్పుడూ వైరుధ్యం లేదు. కొ.కు మార్క్సిజాన్ని ఎంత గట్టిగా నమ్మారో ఆధ్యాత్మిక శక్తులను, అతీత శక్తులనూ అంత బలంగానూ విశ్వసించారు. ఈ రెండు రకాల వ్యాపకాలకూ ఆయనపై చాలా బలీయమైన ప్రేరకాలు పని చేశాయి. ఆయన రాజకీయ దృక్పధం  మార్క్సిజం కావడానికి సామాజిక పరిస్థితులు కారణమైతే, అతీతశక్తుపై ఆయన దృష్టి పెట్టడానికి కారణం సైన్స్‌ వివరించలేని అనేక ఘటనలకు సశాస్త్రీయమైన సమాధానం కనుగొనాలన్న జిజ్ఞాస.
ఈ ”తాత్విక వ్యాసాలు”లో ఏ వ్యాసాన్ని పరిశీలించినా మనకు కనిపించే అంశం ఒక్కటే  అందరికీ అంత తేలికగా అర్ధం కాని ఏదో ఒక అంశాన్ని అందరికీ – కనీసం మేధావులకు – అర్ధం అయ్యేట్టు చెప్పడానికి కొ.కు. ప్రయత్నించారు.
 దేవుణ్ణి ఒక ”భావం” గా ”మాయదారి దేవుడు” వ్యాస పరంపరలో కొట్టి పారేసిన కొ.కు. ”దయ్యాలు లేవని భావించడం  ఈ కాలపు మూఢ నమ్మకాలలో ఒకటి” అని మొదటి వ్యాసంలోని మొదటి వ్యాకం లోనే తేల్చి పారేశాడు. ఇందులో మొదటి మాటను 1975లో అంటే, రెండవ మాటను 1934లో అన్నారు. ఈ రెండు మాటలనూ ఆయన చాలా ”స్పృహ”లో ఉండే అన్నారు. కాకపోతే  ఆయన  దేవుని గురించి మాట్లాడినప్పుడు ఆయనను సరిగానే అర్ధం చేసుకున్నవారు, అతీతశక్తుల గురించి ఆయన చర్చించినప్పుడు మాత్రం ‘అపార్ధం’ చేసుకున్నారు. అపార్ధాలన్నీ ”బుద్ది కొలత” వాద ప్రతివాదాలలో ప్రతిబింబించాయి. పత్రికాముఖంగా కొ.కుతో వాదనకు దిగదలచుకోని కొందరు మేధావులు మాత్రం  ఆయనతో ”బుద్ది కొలత”పై ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపారు. వారిలో కొందరికి కొ.కు. రాసిన లేఖలు కూడా ఈ ”తాత్విక వ్యాసాలు”లలో చోటుచేసుకున్నాయి.
వైజ్ఞానిక శాస్త్రంలో ”పరమసత్యం”గాని ”చరమ సత్యం”గానీ లేనే లేదు. కుటుంబరావుగారి జిజ్ఞాసకు ప్రాతిపదిక ఇదే. ఇందుకు కొందరు శాస్త్రవేత్తల వ్యక్తిగత అనుభవాలూ, కొందరు రచయితల సూత్రీకరణలూ ఆయన ఆలోచనలపై చాలా ప్రభావం చూపాయి. మరీ ముఖ్యంగా సర్‌ ఆలీవర్‌ లాడ్జ్‌ అనే పదార్ధ భౌతిక శాస్త్రజ్ఞుని  అనుభవాలు కొ.కు ఆలోచనలను కవ్వంతో చిలినట్టు చిలికాయి. జీవిమంతా వైజ్ఞానిక పరిశోధనలకే వెచ్చించిన సర్‌ ఆలివర్‌ లాడ్జ్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో తన కుమారుడు రేమాండ్స్‌ను కోల్పోయాడు.. మరణించిన వారితో సంభాషించగల ‘మీడియం’తో ‘సిట్టింగు’ ఏర్పాటు చేశాడు. తన కుమారునికీ, తనకూ మాత్రమే తెలిసిన విషయాలు ‘మీడియం’ద్వారా వినడం అలివర్‌ లాడ్జ్‌కి చాలా విస్మయం కలిగించింది. ఆయన జీవితంలో చాలా ‘షాక్‌’ ఇచ్చిన సంఘటన ఏమంటే ఒక మీడియం ద్వారా తన కుమారుడి ‘ఆత్మ’తో సంభాషిస్తున్న ఆలివర్‌ లాడ్జ్‌కి సౌత్‌ లాంకాషైర్‌ రెజిమెంట్‌ గ్రూప్‌ ఫోటో గురించి తెలిసింది. ఆ ఫోటో కావాలంటే పంపిస్తానని చెవ్స్‌ అనే ఒకావిడ ఆలివర్‌కి కబురు పెట్టింది. ఈ లోగా ఆలివర్‌ డిసెంబర్‌ 3, 1915న లియోనార్డ్‌ అనే మీడియంద్వారా రేమాండ్స్‌తో సంభాషిస్తూ ఫలానా రెజిమెంట్‌తో ఫోటో దిగావా అని అడిగాడు. ఆ ఫోటోలో తాను కింద కూర్చున్న సంగతి, ప్రక్కనున్న ఆఫీసర్‌ తన భుజం మీద చెయ్యి వేసిన సంగతి రేమాండ్స్‌ వివరించాడు. ఇది జరిగిన నాలుగు రోజులకు చెవ్స్‌ నుంచి వచ్చిన ఫోటోలో అంతా రేమాండ్స్‌ వివరించినట్టే ఉంది!
అప్పట్నించి ”మరణానంతర జీవితం” పై సర్‌ ఆలివర్‌కు గట్టి నమ్మకం ఏర్పడింది. ఆ తర్వాత అనేక ప్రయోగాలు నిర్వహించి, శాస్త్రజ్ఞుడైన తనకు ”కొత్త నమ్మకాలు” కలిగించిన తన కుమారుని పేర ”రేమాండ్‌, ఆర్‌ లైఫ్‌ అండ్‌ డెత్‌” అనే పుస్తకాన్ని 1916లో రాశారు. ఆ తర్వాత ”రేమాండ్‌ రివైజ్డ్‌” అని 1922లో మరో గ్రంధం ప్రచురించారు. మరి ఆరేళ్ళకు ”వై ఐ బిలీవ్‌ ఇన్‌ పర్సనల్‌ ఇమ్మోర్టాలిటీ” అనే గ్రంధాన్ని ప్రచురించారు. అంతకు ముందంతా ”మ్యాన్‌ అండ్‌ ది యూనివర్స్‌” (1908), ”సర్వైవల్‌ ఆఫ్‌ మ్యాన్‌ (1909), ”రీజన్‌ అండ్‌ బిలీఫ్‌్‌” (1910), ”లైఫ్‌ అండ్‌ మ్యాటర్‌”(1912) వంటి వైజ్ఞానిక గ్రంధాలు రాసిన సైంటిస్ట్‌ సర్‌ ఆలివర్‌ లాడ్జ్‌ తర్వాత ”మరణానంతర జీవితం”గురించీ ”అసాధారణ అనుభవాల” గురించీ పరిశోధనలు చేయడం  ఆ రోజుల్లోనే  తీవ్రమైన విమర్శలకు దారి తీసింది. ఈ పరిశోధనలను కూడా సైన్స్‌గానే ఆమోదించాలని ఆలివర్‌ లాడ్జ్‌ ప్రతిపాదించారు.
ఆలివర్‌ లాడ్జ్‌ పరిశోధనలతో పాటు గణిత శాస్త్రజ్ఞుడూ, సైన్స్‌ ఫిక్షన్‌ రచయితా అయిన ఎడ్విరన్‌ ఆచాట్‌ రాసిన ”ప్లాట్‌లాండ్‌” కూడా కొ.కును ప్రభావితం చేసింది. స్పేస్‌ అనేదే లేని ఒక విచిత్ర ప్రపంచంలో ”స్థలం”, ”కాలం”అనే ప్రాధమిక కొలతలకు అర్ధం లేకపోవడం ఈ ”ప్లాట్‌లాండ్‌”లోని విశేషం. కిందటి శతాబ్దం తొలి రోజులలో వెలువడిన ఈ నవల ఐజాక్‌ అసిమావ్‌తో సహా పెక్కు మంది సౖౖెన్స్‌ ఫిక్షన్‌ రచయితలను, శాస్త్రతజ్ఞులను ప్రభావితం చేసింది. కొ.కు. కూడా ఆ ప్రభావంలో స్థల, కాలాలకు తోడు ”బుద్ధి”ని ఒక కొలతగా ప్రతిపాదించారు.
 మనకు మాములుగా అనుభవంలోకి వచ్చే ఎన్నో అసాధారణ సంఘటనలకు ”బుద్ధి కొలత” లోనే సమాధానం దొరుకుతుందని కొ.కు. విశ్వసించారు. ఆ విశ్వాసానికి శాస్త్రీయ హోదా కల్పించడానికి ఆయన ప్రయత్నించారు. ఆయన ”తాత్విక చింతన” కనీసం ఓ పది పదిహేనేళ్ళపాటు తెలుగు నాట మేధావి వర్గానికి మనశ్శాంతి లేకుండా చేసింది. మరీ ముఖ్యంగా ఆయన రాజకీయ దృక్పధంతో ఏకీభవించేవారిని ! బ్రతికున్ననాళ్ళు ఆయన పెదవి విరిచింది కూడా ఇందుకే! ”నాతో, నా అభిప్రాయాలతో రాజకీయంగా, సాంస్కృతికంగా విభేదించేవాళ్ళకి నా ఆలోచనలు రుచించలేదంటే ఆశ్చర్యం కాదుగాని, నా రాజకీయ సాంస్కృతిక దృక్పధంతో ఆవగింజంత విభేదం కూడా లేనివారికి నా ఆలోచనలు తలకెకక్కపోవడం ఆశ్చర్యం కాదుగాని ఆవేదన కలిగిస్తున్నది” అనే వారు కొ.కు.
కొ.కు తాత్విక దృక్పధం విషయంలో, ఆయన ఆలోచనలను అర్ధం చేసుకోవడంలో మనం కనీసం రెండు తరాలు వెనుకబడి ఉన్నాం!
కొ.కు చేసిన పొరపాటు తన ఆలోచనలను తెలుగులో బహిరంగపరచటం!ఈ ఆలోచనలను ఆయన గతి తార్కిక భౌతిక వాదం పరిధిలోనే ఇంగ్లీషులో రాసి వైజ్ఞానిక ప్రపంచంలో ఆయన ఆశించిన మేర కాకపోయినా, ఆయన అభిలషిించిన పద్ధతిలో చర్చ జరిగి ఉండేది. ‘స్పేస్‌’లో ‘వంపు’ ఉందని కొన్నాళ్ళ క్రితం ఎవరైనా అంటే వైజ్ఞానిక ప్రపంచంలోనే కొందరైనా నవ్వి ఉండేవారు. కాని’స్పేస్‌”వంగి’ ఉందన్నది ఇప్పుడు సైన్స్‌ చెబుతున్న సత్యం. అలాగే కొ.కు తాత్విక ఆలోచనలలు నుంచి వచ్చిన ”బుద్ది కొలత” కూడా ”మైండ్‌”ని ఒక కొలతగా తీసుకుని చాలాకాలంగా కొన్ని ప్రయోగాలు ఒక మేరకు ఈ విభాగం క్రిందకే వస్తాయి. వీటిలో ఫేక్‌ ప్రయోగాలు కూడా చాలానే ఉందవచ్చుగాని ఆ విషయం తేలేవరకూ ”బుద్ధి”ఒక కొలతగా అంగీకరిస్తున్న వైజ్ఞానిక ప్రయోగాలు జరుగుతున్న విషయాన్ని మాత్రం అంగీకరించక తప్పదు. అవి గతితార్కిక భౌతిక వాద దృక్పధంతో జరగకపోవచ్చు. అది వేరే విషయం.
 కొ.కు. తాత్విక వ్యాసాలు, ”బుద్దికొలత” ప్రతిపాదనను ఏ మేరకు ముందుకు తీసుకు వెళ్తున్నాయన్నది ప్రశ్నార్ధం కావొచ్చు గానీ, వీటిని చదివి ఆరాయించుకునే వారెవరైనా కంప్యూటర్‌ ఇంజనీరింగుకి కావలసిన లాజికల్‌ ధింకింగుని మాత్రం తేలికగా అలవరచుకోగలరు. ఈ గ్రంధంలో ఏ వ్యాసం చదివినా పాఠకుల ఆలోచనలు ఖచ్చితంగా పదునెక్కుతాయి. అనుమానం ఉంటే వెంటనే పుస్తకం తెరిచి రుజువు చేసుకోవచ్చు.
(ఆదివారం ఆంధ్రజ్యోతి 5 డిసెంబర్‌ 2004)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to ఆలోచనల్ని పదునెక్కించే వ్యాసాలు

  1. hari.S.babu says:

    “కొ.కు చేసిన పొరపాటు తన ఆలోచనలను తెలుగులో బహిరంగపరచటం!ఈ ఆలోచనలను ఆయన గతి తార్కిక భౌతిక వాదం పరిధిలోనే ఇంగ్లీషులో రాసి వైజ్ఞానిక ప్రపంచంలో ఆయన ఆశించిన మేర కాకపోయినా, ఆయన అభిలషిించిన పద్ధతిలో చర్చ జరిగి ఉండేది.”

    చాలా బాగా చెప్పారు.ముఖ్యంగా విరసం ప్రచురణాలలో కాకుండా సైంటిష్టుల మధ్యన పెట్టి ఉంటే ఆయనకి ఎంతో గుర్తింపు వచ్చి ఉండేది.

Leave a Reply to hari.S.babu Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.