రాయలసీమ ఫ్యాక్షనిజం – స్త్రీలపై ప్రభావం

 డా|| కె శ్రీదేవి

 తెలుగు సమాజంలో రాయలసీమ భౌగోళికంగా చిన్నదయినప్పటికీ ఆ ప్రాంత జీవితం చాలా వైవిధ్యభరితంగా ఉంది. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న అనేక ప్రాంతాలు తమ తమ ప్రాంతీయ ప్రత్యేకతలను శతాబ్దాలుగా కాపాడుకుంటూ వస్తున్నాయి. ఈ ప్రత్యేకతలు రోజువారీ జీవితంలో అంత ప్రత్యేకంగా అనిపించకపోయినప్పటికీ వాటి సాహిత్య ప్రతిఫలనాలను పరిశీలించినప్పుడు అవి స్పష్టంగా తెలుస్తాయి. నిజానికి ఏ సాహిత్యమయినా మానవ అభివృద్ధిని రికార్డు చేస్తుంది. అయితే ఈ రికార్డు చేసే విధానం అన్ని ప్రాంతాలలో ఒకటిగా వుండదు. ప్రాంతానికి ప్రాంతానికి మధ్య ఉండే అనుభవ విభిన్నతే ఇందుకు కారణం. ఏ అనుభవమైనా ఆయా సామాజిక సందర్భాల నుండి, స్థితిగతులనుండి రూపొందుతుంది. ఈ స్థితిగతుల విభిన్నత కూడా సాహిత్యంలో అనివార్యంగా ప్రతిఫలిస్తుంది. ఆయా ప్రాంత రచయితలు ఈ అనుభవ విభిన్నతలను చేతనా ఫలితంగా కొన్ని సందర్భాలలో అచేతనంగా కూడా రచయితలు రికార్డు చేస్తారు. ఈ రికార్డు చేసే క్రమంలో రచయితలు ప్రదర్శించే నేర్పు, పరిశీలనలను బట్టి కూడా ఆయా ప్రాంత రచయితలను, సాహిత్యాన్ని అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో రాయలసీమ సాహిత్యాన్ని పరిశీలించినప్పుడు రాయలసీమ రచయితలు తమ ప్రాంత విభిన్నత సాహిత్యంలో ప్రవేశపెట్టడమే కాకుండా, ఆ ప్రాంత నిర్దిష్ట సమస్యలకు తమ సాహిత్య సృజనలో ముఖ్యంగా కథా సాహిత్యంలో కొంత ఆలస్యంగా ప్రారంభించినప్పటికీ తమ రచనలలో మంచి ప్రాతినిధ్యమిచ్చారు. ఏ సాహిత్యమైనా కేవలం సామాజిక సందర్భాలను, సమస్యలను ప్రతిబింబించటం ద్వారా మాత్రమే గొప్ప సాహిత్యం కాజాలదు. అయితే వాటిని నిర్దిష్ట సాహిత్యరూపంలో ఆవిష్కరించగలగాలి. ఆ విధంగా చూసినపుడు రాయలసీమ కథారచయితలు ఆ ప్రాంత జీవితాన్ని నిర్దిష్ట సమస్యలను విమర్శనాత్మకంగా ప్రతిఫలింపజేస్తూనే తమ నిర్దిష్ట సాంస్కృతిక మూలాలను గుర్తుపెట్టుకొని, ఆ విలువలు ధ్వంసమవుతున్న విషయాన్ని, ఆ ధ్వంసానికి కారణమవుతున్న అంశాలను విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గత మూడు నాలుగు దశాబ్దాలలో చోటు చేసుకున్న కొత్త సమస్యలు, గత్యంతరం లేని ఫలితంగా ఆయా సందర్భాలలో వ్యక్తులు తీసుకుంటున్న దుర్మార్గపు వైఖరులు, ఛిద్రమైపోయిన జీవితాల్ని మరింత ఛిద్రం చేస్తున్న రాజకీయ పార్టీలు, నాయకులు ఉన్న అన్ని రాయలసీమ కథకులకు ఇవి వస్తువులయినాయి. తెలుగుదేశమంతటిలో స్త్రీల సమస్యలు ఒకేరకంగా ఉన్నప్పటికీ, రాయలసీమ స్త్రీలు మరికొన్ని అదనపు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాటి ప్రభావంతో తమ జీవితంలో చోటుచేసుకున్న అదనపుభారాన్ని మోస్తున్న క్రమాన్ని రాయలసీమ రచయితలు కథాసాహిత్యంలో సృష్టించారు. అభివృద్ధికి రాయలసీమ ప్రాంతానికి మధ్య ఏదో వైరుధ్యం ఉంది. గత వంద సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాలలో జరిగిన నామమాత్రపు అభివృద్ధి కూడా అక్కడ జరగలేదు. రాయలసీమలో ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల కాలంలో తవ్వించిన చెరువులు, కాలువలు తప్ప తరువాత కాలంలో పెరిగిన జనాభా, వ్యవసాయ అవసరాల మేరకు చెరువులు తవ్వకం జరుగకపోగా వున్న చెరువులు పూడికలు తీసి పునరుద్ధరించే దిక్కులేక చాలా చెరువులు పాడైపోయాయి. చెరువులో నీరు నిలబడితే భూగర్భజలాల శాతం పెరుగుతుందనేది చిన్నపిల్లలకు కూడా తెలిసే సత్యం. అయితే వ్యవసాయంలో వచ్చిన అభివృద్ధిలో భాగంగా వచ్చిన మోటారు బావుల వలన ఒకప్పుడు సమృద్ధిగా లభించే భూగర్భజలాలు అట్టడుగుకు చేరినాయి. డబ్బుండి బోర్లు వేసుకునేవాళ్ళు వందలకు వందల అడుగుల లోతులకు బోర్లు దింపి మరీ సమృద్ధిగా పంటలు పండించుకున్నారు. వానలు రాకపోవడం, దూరదృష్టి కొరవడిన భూస్వాముల, ధనస్వామ్య పెత్తందారుల స్వార్థంతో, ధనగర్వంతో మోటర్ల సహాయంతో నిర్వహించిన వ్యవసాయం రాయలసీమ భవిష్యత్తరాలను కరువులు కాటకాలలో పడేసింది. మధ్యతరగతి, సన్నకారు రైతులంతా ఒకప్పుడు స్వతంత్ర జీవితాన్ని గడిపినవారే గ్రామాల్లో కరువుల వలన మారిన బ్రతుకు చిత్రంతో రాజీపడలేకపోయారు. అదీగాక చాలాకాలం పాలెగాళ్ళు రాయలసీమ జిల్లాలను పాలించడం వలన సంక్రమించిన దర్పాన్ని, పెత్తనాన్ని వదులుకోలేకపోయారు. వారిలో నిగూఢంగా ఉన్న ఈ భావజాలంతో చిన్న చిన్న మాటపట్టింపులకే కక్షలు, కార్పణ్యాలు పెంచుకోవడం జరిగింది. పాలెగాళ్ళ వ్యవస్థ నుంచి సంక్రమించిన భావజాలం వలన మానసికంగా కొంత కఠినమైన మనస్తత్వం కలవారుగా రూపొందటం, కరువుకాటకాల వలన ఏర్పడిన మానసిక దౌర్భల్యాన్ని అధిగమించడానికి తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం. పెత్తందారీతనాన్ని నిలబెట్టుకోవడం కోసం గుంపులు, ముఠాలు ఏర్పాటుచేసి ”పార్టీలు” కట్టడం రాయలసీమ జీవనచరిత్రలో పరిపాటి. అయితే ఈ విధంగా కక్షలతో, కార్పణ్యాలతో అట్టుడికిన రాయలసీమ గ్రామీణ జీవితంలో ”ఫ్యాక్షనిజం” కారణంగా జరుగుతున్న హత్యలు తత్ఫలితంగా స్త్రీల జీవితాల్లో ఏర్పడుతున్న ఖాళీ”ని, వాళ్ళ బ్రతుకుల్లో ఫ్యాక్షన్‌ వలన అలుముకుంటున్న చీకట్లను మానసికవేదనలను, దాన్ని అవగతం చేయించడానికి పరోక్షంగా వారు పడుతున్న అవస్థను, ఫ్యాక్షనిజాన్ని అంతం చేయించడానికి స్త్రీలు సూచించే పరిష్కారాలను, తీసుకుంటున్న నిర్ణయాలను, తద్వారా ప్రసరించే కొత్త వెలుగు మొదలైన అంశాలు తెలుగుకథా సాహిత్యంలో ప్రతిఫలించిన తీరును చర్చించటమే ఈ వ్యాసోద్దేశం. వెనుకబాటుతనపు వికృతరూపమే ”ఫ్యాక్షనిజం”. సామాజికంగా వెనుకబడిన చోట, ఆర్థికవనరులు పరిమితంగా వున్న ప్రాంతంలో ఆ వనరులపైన ఆధిపత్యంకోసం జరిగే పోరాటంలో బలపడేందుకుగాను అప్పటికే అక్కడ బలమైన సామాజిక వర్గాలు వాటిని చేజిక్కించుకోవటం కోసం, చేజిక్కిన వాటిని కాపాడుకునేందుకు చేసే దౌర్జన్యమే ఫ్యాక్షనిజం. సమాజంలో ఏ అనర్థమైనా, అన్యాయమైనా స్త్రీల జీవితాలనే ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అయితే ఈ ఫ్యాక్షనిజం ప్రతిఫలనాలు స్త్రీల జీవితంలో పరచుకున్న శూన్యాన్ని వీరు వితంతువులుగా, బాలకార్మికులుగా, దోపిడికి గురయిన వారుగా, నిరుపేదలుగా బయటికి కనిపించేవి తక్షణ ప్రతిఫలనాలు. అయితే స్త్రీల అనుభవాలు వ్యక్తీకరణ పొందలేకపోవటం వలన వారి జీవితాలలో పరచుకొన్న యాంత్రికతగాని, నిస్సహాయతగాని వెలుగు చూడలేకపోయింది. అంతవరకు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా భర్తే ప్రపంచంగా బ్రతికిన స్త్రీలకు వారు ఒక్కసారిగా ఫ్యాక్షన్‌ హత్యకు గురై భర్తను కోల్పోయినపుడు తమకు కలిగే అంతులేని శూన్యం, దానినుండి బయటపడడానికి ప్రత్యామ్నాయంగా కసి, వేదన, పగ, కోపంతో అనునిత్యం కొలిమిలా తమని తాము భగభగ మండించుకొంటూ తమ జీవితాలను తామే భస్మం చేసుకుంటూ రగిలే అగ్ని కీలలుగా జ్వలిస్తుంటారు. ఆనందం అన్న పదమే వారి జీవితాల నుండి అదృశ్యమైపోయింది. జీవితంలో తారసపడే చిన్న చిన్న ఆనందాలు సైతం ఉదాహరణకు భోజనం చేస్తున్నా కూడా దానిని ఆస్వాదించలేని బండరాళ్ళుగా ఆడవారు మారిపోతున్న వైనాన్ని, తీపికూడా చేదుగా పరిణమించిన క్రమాన్ని సామాజిక దృష్టితో తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఫ్యాక్షన్‌ నేపథ్యంలో స్త్రీల జీవితంలో పరచుకొన్న హింసను చిత్రించిన కథలను పరిశీలించడం వలన మనకు కొంతవరకు ఫ్యాక్షన్‌ ప్రతిఫలనాలు స్త్రీలనెలా ప్రభావితం చేస్తున్నాయన్న అవగాహన కలిగే అవకాశం వుంది. పాలగిరి విశ్వప్రసాద్‌ రచించిన ”చుక్కపొడిచింది” అనే కథ స్త్రీ కంఠస్వరంతో ఫ్యాక్షనిజం సృష్టిస్తున్న విధ్వంసాన్ని, హింసను ఎత్తిచూపిన మొట్టమొదటి కథ. ఈ కథలో సుజాత చదువుకున్న యువతి. ఆమె మేనత్త శారదమ్మ ఫ్యాక్షన్‌ బాధితురాలు. ఈమె భర్త తిమ్మారెడ్డి పెండ్లయిన నాలుగేండ్లకే ఫ్యాక్షన్‌ కక్షల్లో ప్రాణాలు పోగొట్టుకుంటాడు. శారదమ్మ బతుకు తన కండ్లముందే బండలుగా మారడం చూసిన సుజాత తండ్రి తన బిడ్డల్ని ఫ్యాక్షన్‌ ఉన్న ఊర్లో పెండ్లి చెయ్యడానికి కూడా ఇష్టపడడు. కానీ రవీంద్రారెడ్డి తండ్రి పట్టుబట్టి చదువుకున్న కొడుక్కు చదువుకున్న కోడలైతేనే బాగుంటుందని సుజాత తండ్రికి నచ్చజెప్పి ఆమెను కోడలిగా తెచ్చుకుంటాడు. సుజాత భర్త రవీంద్రారెడ్డి పెండ్లయిన ఆరునెలల నుండి ఉద్యోగంకోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించే లోపే పాతఫ్యాక్షన్‌ కక్ష్యలవలన తండ్రిని కోల్పోతాడు. కుటుంబ పెద్దగా వ్యవసాయం పనులు, తమ్ముళ్ళ చదువులు తండ్రి మరణంతో అయిన కోర్టుకేసులు అన్నీ తానే చూసుకోవడంతో తనకు తెలియకుండానే ఫ్యాక్షన్‌ విషవలయంలో కూరుకుపోతాడు. కానీ ప్రత్యర్థివర్గాలను ఏ మాత్రం రెచ్చగొట్టకుండా తండ్రిని చంపిన కేసువరకు మాత్రమే చూసుకుంటాడు. కాని అతని తల్లి మిగిలిన కొడుకులిద్దరినీ రెచ్చగొట్టి తన భర్తను చంపినతని చిన్న కొడుకును చంపిస్తుంది. దాంతో ప్రత్యర్థి వర్గం రవీంద్రారెడ్డిని కూడా చంపేస్తారు. సుజాత మరుదుల్దిరూ తమ అన్న చావుకు కారణమైనవారిని మట్టుపెట్టేందుకు తాము ప్రయత్నిస్తామని చెప్పినపుడు వారిని వారిస్తుంది. ఫ్యాక్షన్‌ కక్షల్ని ఇలా రావణకాష్టంలాగా రగిలించడం ఆమెకు ఇష్టంలేదు. అందుకే తన ఆస్తి పంచిస్తే తన కొడుకును పట్నం తీసుకుపోయి చదివించుకొంటూ, తానుకూడా ఏదో ఒక పనిచేసుకుని బ్రతకాలనుకుంటుంది. ఆమె నిర్ణయాన్ని ఎవరూ హర్షించరు. కానీ ఆమె పట్టు వదలకుండా తన పంతం నెగ్గించుకుంటుంది. ఈ కథ పూర్తిగా స్త్రీపాత్రల ద్వారానే ప్రదానంగా నడుస్తుంది. మూడు రకాలైన స్త్రీపాత్రల్ని రచయిత చిత్రించారు. 1. సుజాత – ఈమె చదువుకున్నది. ఫ్యాక్షనిజం అంటే ఏవగించుకుంటుంది. సున్నితమైన మనస్తత్వం కలది. పగ, ప్రతీకారం అనే ఆలోచనలు దరిచేరకుండా ప్రశాంత వాతావరణంలో తన బిడ్డ బ్రతుకును తీర్చిదిద్దాలనుకునే స్త్రీ. 2. సుజాత భర్త తల్లి పాత్ర – ఈమెకు రచయిత పేరు పెట్టలేదు. భర్త చావుకు కారణమైన వారి ప్రాణాలు తీసినంతవరకు తన కొడుకుల్ని రెచ్చగొట్టి వారిలో పౌరుషాన్ని పెంచి తన పగ తీర్చుకుంటుంది. తన కోడలు సుజాత తన కొడుకు చనిపోయినా పగ సాధించకపోవటం ఈమెకు విచిత్రంగా వుంటుంది. అందుకే ”అయినా కాలం మారిందిలే. కట్టుకున్న మొగుణ్ణి చంపినా, కడుపున పుట్టిన బిడ్డను చంపినా కోపం లేకుండా, బతికితే చాలనుకొని బతికే తరమొచ్చింది” అంటూ కోడల్ని దెప్పుతుంటుంది. 3. సుజాత మేనత్త పాత్ర – ఈమె పేరు శారదమ్మ. ఈమె భర్త తిమ్మారెడ్డి ఫ్యాక్షన్‌ లీడర్‌. పెండ్లయిన నాలుగేండ్లకే ఫ్యాక్షన్‌ హత్యకు గురవడంతో భర్తను కోల్పోయింది. అతన్ని చంపిన వారిని చంపడం కోసం భర్త తమ్ముళ్ళలో పౌరుషం వున్నది తన చిన్నమరిదికొక్కనికే అని నమ్మి అతనికి అత్తరసాలు, కజ్జికాయలు లాంటి తినుబండారాలు పెట్టి, ప్రేమగా అనునయంగా మాట్లాడుతూ అతన్ని మచ్చిక చేసుకుంటుంది. భర్త ప్రత్యర్థి వర్గం వారిని చంపడానికి బోయరాముడితో సన్నిహితంగా కూడా వుంటుంది. ఆమె తన శారీరక అవసరాల కోసం కంటే, వైరివర్గం వారిని మట్టుపెట్టడానికే తన శరీరాన్ని అతనికి ఎరగా వేస్తుంది. దాన్ని జీర్ణించుకోలేని సుజాత ”ఏం మనుషులో వీళ్ళది అజ్ఞానమో అర్థంలేని పౌరుషమో… కాకపోతే, భర్తను చంపినవాణ్ణి చంపడానికి మానాన్ని, ప్రాణాన్ని ఎరగా వేసేంత ఉన్మాదమేంది?” అంటుంది. శారదమ్మ భర్త చనిపోయిన తరువాత అతన్ని చంపించిన వారిని చంపించడం కోసమే తాను బ్రతుకుతున్నట్లుగా, ఆ పని అయిపోయిన తర్వాత అంతకు ముందు ఆమె సంసారాన్ని ముందుకు నడపటంలో చూపించిన చొరవ, ఉత్సాహం ఒక్కసారిగా సీమేతర పాఠకుల్ని చకితుల్ని చేస్తుంది. సుజాత కూడా మేనత్తను గుర్తుచేసుకొంటూ ”ఆమె భర్త తిమ్మారెడ్డి ఖూనీ అయినాక కొంతకాలం ఏం దిగులు పడిందో! ఆ తర్వాత మగరాయుడి మాదిరి ఇంటి పనులు, బయటి పనులు ఝమాయించి చేయించేది” అంటుంది. అంతకు ముందంతా తాను బతికింది అవతలి వర్గం వారిని ఖూనీ చేయించడానికే అన్నట్లుగా, అందుకోసమే తాను బ్రతికినట్లుగా ప్రవర్తించడం, పెంచుకున్న పగ చల్లారగానే తమ జీవిత పరమార్థం అయిపోయిందనుకునే ఫ్యూడల్‌ భావజాలం శారదమ్మలో స్ఫుటంగా కనిపిస్తుంది. అంతకు ముందు మగరాయుడిలా సంసారాన్ని నడిపినామె ఆ తరువాత వ్యవసాయంతోపాటు సంసారాన్నంతా మరదుల మీద వదిలిపెట్టి మిగిలిన స్త్రీల లాగానే అతిసాధారణంగా మారిపోతుంది. సమాజంలో భర్త చుట్టూ జీవితాన్ని అల్లుకున్న స్త్రీలకే గౌరవం. ఆ గౌరవాన్ని వదులుకోవటం వలన లేదా భర్త మరణాన్ని మౌనంగా భరించటాన్ని చేతగానితనంగా భావించటం ఒక ఎత్తైతే, కక్ష సాధించ%E

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.