విడాకులు పెరగడానికి కారణాలు – దాని పర్యవసానం

మల్లాది సుబ్బమ్మ
గడిచిన శతాబ్దం వరకు స్త్రీలు విడాకులు తీసుకోవడం అంటే ఎరుగరు. అదేదో మహాపాపంగా భావించేవారు. భర్తలు తన్నినా, గెంటినా, తగలేసినా ఎదురుతిరగడమే తెలియదు. పూర్వజన్మలో చేసిన పాపంవల్లనే ఇలాంటి భర్త దొరికాడని ఆ బాధలు పడితే వచ్చే జన్మలో మంచి భర్త లభిస్తాడనే నమ్మకంతో ఎన్ని కష్టాలనయినా అనుభవించేవారు. ఆనాటి సమాజంలో పురుషుడు స్త్రీని కట్టుబానిసగా చేశాడు. పురుషాహంకారంతో అణగత్రొక్కాడు. ప్రపంచ మహిళా సంవత్సరం, దశాబ్దానంతరం మహిళల్లో కొంతలో కొంత చైతన్యం, జాగృతి కలిగాయి. తమ స్వేచ్ఛా హక్కుల గురించి తాము ఆలోచించుకోగల శక్తి సామర్థ్యాలు వచ్చాయి. తాము ఆడవాళ్ళమయినంత మాత్రాన ఎందుకు లొంగిపోవాలి అనే ఆలోచనలు పెల్లుబికిపోయాయి. ఆ పరిణామంలోని ఆలోచనే ఎందుకు విడాకులు పొందరాదు? అనేది. క్రమేపి భరించలేని భర్తలకు విడాకులు యిద్దామనే ప్రేరణ కలిగింది. దానికి మూలం మావంటివారి ఆధునిక భావాలే. చావటానికి సిద్ధమైనవారిని చావవద్దు విడిపోండి అనే సలహా యిచ్చే కేంద్రాలు ఈనాడు ఎన్నో వెల్లివిరిశాయి.
విడాకులు ఎందుకు పెరుగుతున్నాయి అని ప్రశ్నిస్తున్నవారు ఇంకా లేకపోలేదు. ముచ్చటగా, ఉల్లాసంగా, సంతోషంగా వివాహమాడిన స్త్రీ పురుషులు ఎందుకు విడాకుల వైపుకు పయనిస్తున్నారు. గత్యంతరంలేక అనే సమాధానం వస్తుంది. ఇన్నాళ్ళు ఈ ప్రశ్న ఎందుకు రాలేదు? ఇపుడు ఎందుకు వస్తున్నది. పూర్వం పురుషులు భార్యలను వదిలివేసేవారు. మళ్ళీ పెళ్ళాడాలని ఉబలాటంలో విడాకులకు ప్రయత్నించి కోర్టులకు వెళ్ళేవారు. ఇపుడు స్త్రీ తరపు దాఖలు కాబడే విడాకుల అర్జీలు పెరగడంతో యీ ప్రశ్న యీ రూపంలో ఉదయించింది. మరి స్త్రీలు విడాకులను ఎందుకు కోరుకుంటున్నారు? వారికి వైవాహిక జీవితం దుర్భరమయినందున తప్పనిసరిగా విడాకులు కోరుకుంటున్నారు. విడాకులు వచ్చిన తరువాత ఎక్కువగా ఒంటరి జీవితం ఎదురవుతుందని తెలిసి దీనికి పూనుకుంటున్నారు. ఆ భర్తతో కలిసి కాపురం చేసేదానికన్నా విడాకులు పొందిన స్త్రీగా మనగలగడం తేలికని, మంచిదని భావించడంవల్లనే అందుకు ఉద్యుక్తులవుతున్నారు.
పూర్వంలోకంలో భర్తలు భార్యలను చూచే పద్ధతి మారిందా? లేక భార్యల దృక్పథం మారిందా అనేది మీమాంస. భార్యలను పరిగణించే విధానం పూర్వం రెండు లక్షణాలు కలిగి వుండేది. అవి 1. పురుషాధిక్యత 2. పురుష పెత్తనం. స్త్రీకన్నా పురుషుడు మిన్న అనే భావం ఆనాడూ ఈనాడూ వుంది. ఆనాడు ఆ భావాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు. ఈనాడు నాజూకుగా, నగిషీగా, మెత్తగా, పైకి అందంగా బహిర్గతం చేస్తున్నారు. రెండవది భర్త పెత్తనం. పూర్వం పెత్తనం స్పష్టంగా, అందరికీ తెలిసేలా సాగించేవారు. ఇపుడు స్త్రీ పురుష సమానత్వాన్ని ఆశించే వ్యక్తిగా, అంగీకరించిన మనిషిగా సంచరిస్తూ ఆచరణలో దానికి విరుద్దమైన వైఖరిని ప్రదర్శిస్తున్నారు భర్తలు. అంటే భావాలు అవే. కాకపోతే వాటి రూపాలు మారాయి. మాటలు మారాయి. మాటలకు, చేతలకు మధ్య అగాధం గోచరిస్తున్నది.
పైన చెప్పిన భావాలు పురుషాధిక్యత, పురుష పెత్తనం రెండూ ఆనాడూ యీనాడూ ప్రదర్శితమవుతున్నా ఆనాడు విడాకులకోసం స్త్రీలు పరుగెత్తలేదు. ఎందుచేత? ఆనాడు యీ రెండు భావాలను స్త్రీలు తమకు తామే ఆమోదించారు. తల్లిదండ్రుల పెంపకంవల్ల వాటిని తామూ అంగీకరించారు. వాటిని వారు ఏనాడూ ప్రశ్నించలేదు. పైగా యావత్‌ భారతదేశంలో 1953 దాకా మద్రాసు, బొంబాయి లాంటి ఉమ్మడి రాష్ట్రాలలో 1948, 1949 దాకా స్త్రీలు పురుషులు విడాకులు తీసుకునే ప్రసక్తి లేదు. కాగా బహు భార్యాత్వం అప్పటిదాకా శాసన సమ్మతం కావడం వల్ల పురుషులకు విడాకులు కోరవలసిన అగత్యం లేదు. మరో స్త్రీని రెండవ భార్యగా, మూడవ భార్యగా స్వీకరించేవారు. బాధితులయిన స్త్రీలు తమ స్థితి విధి లిఖితమని మిన్నకుండేవారు. ఇపుడు స్త్రీలకు విడాకులు కోరే అధికారం సక్రమించడంతో పరిస్థితి మారింది. అదేగాక పూర్వకాలంలో భర్త మాటలలో, నడవడిలో వంచన లేదు. నీవు స్త్రీవి, నీవు నాకన్నా తక్కువస్థాయి కలదానివి. నీవు మహిళవు నీ స్థితిగతులను చక్కదిద్దుకోలేవు అని ఘంటాపథంగా భర్తలు చెప్పేవారు. భార్యలు 98 శాతం సమ్మతించి ఊరుకునేవారు. ఆనాటి స్థితిలో వంచన లేదు, మోసం లేదు. ఈనాడు స్థితిగతులు మారాయి. పురుషులు చేపట్టే వివిధ వృత్తులను మహిళలు చేస్తున్నారు. అధికార పదవులను ఆక్రమిస్తున్నారు, సంపాదిస్తున్నారు. పురుషులతో సమధీటుగా అన్ని రంగాలలో వ్యవహరిస్తున్నారు. అంతేకాదు స్త్రీ పురుష విచక్షణ పనికిరాదనే భావాలను ప్రోదిచేసుకున్నారు. మేధాసంపత్తిని పొందారు. కనుక ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నటనో, ఏది మోసమో తెలుసుకోగల్గుతున్నారు. స్త్రీ పురుషులు సమానులని పైకి చెప్తూ ఆ మాటను ఆచరణలో వమ్ము చేస్తుంటే సహించలేకపోతున్నది ఈనాటి స్త్రీ. ”స్త్రీ పురుషులు సమానులు కాని పురుషుడు అధికుడు అని ఖురానులో చెప్పినా, ‘చర్చికి ఏసుక్రీస్తు అధిపతి, అలాగే కుటుంబానికి భర్త అధిపతి” అని క్రైస్తవ ఆప్తవాక్యం చెప్పినా సమ్మతించలేకపోతున్నది. మహిళా సంవత్సరం, తరువాత మహిళా సంవత్సరంలో మొదలయిన మహిళల జాగృతి ఇతోధికంగా పెరిగింది. వారికి వారి హక్కులు అవగతమయినాయి. భార్య వేలకు వేలు సంపాదిస్తున్నా మొత్తం జీతపు పైకం భర్తకో, లేక భర్త తల్లికో వెన్నెంటనే ముట్టచెప్పడం మామూలయింది. ఆమె సంపాదించిన ధనంలో ఒక్క పైసా కూడా ప్రాణనాధుని అంగీకారం లేనిది ఖర్చుపెట్టటానికి వీలులేదు. కుటుంబం నిర్వహించే పనులలో నూటికి తొంబది శాతం భర్తదే ఎంపిక. కాకపోతే లాంఛనప్రాయంగా ఆమె అభిప్రాయాన్ని కొందరు భర్తలు కోరుతారు. మరికొందరు అడగనుకూడా అడగరు. సంతానాన్ని ఎందరిని కనాలి అనే విషయంలో భార్యలకు స్వతంత్య్రం లేదు. కుమారుని విధిగా కనాలని శాసించే భర్తలు కోకొల్లలు. ఆమెకు తన దేహంమీద హక్కులు లేవు. ఇవన్నీ విజ్ఞతకల స్త్రీలకు, చైతన్యంకల మహిళలకు కంటగింపుగా కన్పిస్తున్నది. మోసాన్ని, అసత్యాన్ని, నటనను వారు చూస్తూ ఊరుకోలేకపోతున్నారు. అందుకే విడాకులకోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు.
మనదేశంలో మతధర్మ శాసనాలు నెలకొని వుండడంవల్ల ముస్లిం ‘లా’, క్రైస్తవ విడాకుల శాసనం లోపభూయిష్టంగా వుండడంవల్ల, హైందవ విడాకుల శాసనంకన్న అవి స్త్రీలపట్ల కఠినంగా వుండడంవల్ల ఆ మతాల మహిళలు అష్టకష్టాల పాలవుతున్నారు. ఆ శాసనాలు ఎప్పుడు ఉదారరూపం దాలుస్తాయో అప్పుడు వారి ఇక్కట్లు చాలావరకు తొలగిపోతాయి. అంతేగాక ప్రత్యేక వివాహ శాసనం క్రింద మహిళలు ఎక్కువగా వివాహమాడితే వారి యిబ్బందులు చాలవరకు తొలగిపోతాయి. హైందవ విడాకులశాసనంలో లోపాలు లేవని కాదు. కాకపోతే యితర మతాలవారి శాసనాలకన్నా కొంత మెరుగు. బాగుచేయడానికి వీలులేనట్లు వివాహరథం కుంటుపడితే విడాకులు యివ్వవచ్చని ఏ శాసనంలో ఈనాడు లేదు. అదికూడా విడాకులకు కారణభూతం అయితే స్త్రీల కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి.
విడాకుల పెరుగుదల గురించి ఆలోచించేటప్పుడు ఫలితాలను గురించి పరిశీలించాలి. విడాకులు ఎక్కువయితే కుటుంబ వ్యవస్థ దెబ్బతగులుతుందని కొంతమంది భయపడుతున్నారు.అలాంటి భయసందేహాలకు చోటు లేదు. విడాకులు పొందిన స్త్రీ పురుషులు మరలా పెళ్ళాడడానికి సిద్ధవుతున్నందువల్ల కుటుంబ వ్యవస్థ మీద వారికి యింకా నమ్మకం పోలేదని తెలుస్తున్నది. కుటుంబ వ్యవస్థ బీటలు పారుతున్నదనే వారిలో పురుషులు ఎక్కువమంది. కుటుంబం మీద తమ పట్టు తగ్గిపోతున్నదని పురుషుల భయం. ఒక అంశాన్ని స్పష్టంగా చెప్పవలసివస్తున్నది. ఏ మహిళయొక్క వ్యక్తిత్వం వికసించాలన్నా, ఆమె ప్రతిభా వుత్పత్తులు వెలువడాలన్నా స్త్రీకి వివాహమయితే ఆమె భర్త ఆమెతో సహకరించాలి. అలా అనుకూల దాంపత్యంలోనే ఆమె శక్తియుక్తులు ప్రభవిల్లుతాయి. అలాకానినాడు ఆమెకు చిక్కులే.
అవివాహిరీ, వితంతువు, విడాకులు పొందిన మహిళ వీరికి అనుక్షణం భర్త సహకరిస్తాడో లేదో, ఏమంటాడో అనే భయం లేదు. అలాంటివారు నిర్భయంగా తమ ఉద్యోగాలను చేసుకోగలరు. తమ సంపాదనను స్వేచ్ఛగా వినియోగించగలరు. తమకున్న విశ్రాంతి కాలాన్ని తమ యిష్టం వచ్చినట్లు వాడుకోగలరు. తమ వ్యక్తిత్వ వికాసానికి అడ్డువచ్చే భర్త నుండి ఏ మహిళ అయినా విముక్తిని ఆశించినందువల్ల నష్టం లేదు. కాగా విడాకులు పొందిన స్త్రీని, విడాకులివ్వబడిన మహిళను వివాహమాడటానికి పెక్కుమంది పురుషులు ముందుకు రావడం లేదు. ఈ స్థితి కొంత యిబ్బందికరంగా వున్నమాట వాస్తవం. అచిరకాలంలో ఆ స్థితి మారగలదు. భారతదేశం కొలది సంవత్సరాలలో అమెరికాలాగా మారుతుందని భయపడనక్కరలేదు. ఏ దేశపు పరిస్థితులు ఆ దేశంవి. అంతేకాదు ఏ దేశపు సంప్రదాయం, విలువలు ఆ దేశంవే. కనుక ఏదో ప్రళయం వస్తుందని ఎవరూ భయభ్రాంతులు కానక్కరలేదు.
మనోవర్తి :- బాధితులకు మనోవర్తి రెండురకాలుగా యివ్వవచ్చు. ఒకటి సివిల్‌ కోర్టులో. రెండవది క్రిమినల్‌ కోర్టులో. సివిల్‌ కోర్టులో మనోవర్తి యివ్వడం ఆలస్యమవుతుంది. దానిని రాబట్టుకోవడం కూడా చాలాకాలం పట్తుంది. కాగా క్రిమినల్‌ కోర్టులో మనోవర్తి త్వరగా వస్తుంది. అయితే భరణం మొత్తం ఒక వ్యక్తి నెలకు 500 రూపాయలకు మించదు. అది బాధాకరం. 1973లో క్రిమినల్‌ ప్రొసీజరు కోడును ఆమోదించిన మొత్తాన్ని యిపుడూ యిస్తున్నారు. అప్పటికీ యిప్పటికీ ధరలు విపరీతంగా పెరిగి జీవన ప్రమాణం బాగా పెరిగింది. ఈ మొత్తాన్ని మార్చడం అవసరం. క్రిమినల్‌ కోర్టులో నెలనెలా భరణాన్ని కోర్టువారు యిచ్చినా దానిని రాబట్టుకోవడం బాధిత స్త్రీలకు కష్టంగా వుంది. దానిని రాబట్టడానికి సత్వర అరెస్టులాంటి ఉత్తర్వులు ఉపకరించగలవు. బాధిత స్త్రీలకు నిరాదరణకు గురి అయిన బాలబాలికలకు, వృద్ధులకు భరణపు మొత్తాలు సకాలంలో చేరేటట్లు నిబంధనలను రూపొందించవలసి యున్నది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

12 Responses to విడాకులు పెరగడానికి కారణాలు – దాని పర్యవసానం

  1. srikanth says:

    ఇంత వివక్షా పూరితమైన, సత్యదూరమైన వ్యాసాన్ని ఈ మధ్య కాలములో నేను చూదవలేదు. రచయిత్రి మొదట దీని గురించి కొంత study చేసి తరువాత వ్యాసాన్ని రాసివుంటే బావుండేది.

  2. srikanth says:

    ఏక వచన ప్రయోగానికి మన్నించాలి. కావాలని చేసింది కాదు, పొరపాటుగా మాత్రమే అది జరిగింది.

  3. bhushan says:

    విడాకులు తీసుకునే స్త్రీ విషయంలో – ఆ స్త్రీ తన పోషణకీ, పిల్లలుంటే వారి పోషణకీ, విడిపోయిన భర్తనించీ మనోవర్తి పొందడం ఏ మాత్రం ఆత్మగౌరవమున్న విషయం కాదు. అది ఎవరికి వర్తిస్తుందంటే విడాకులు పొందిన స్త్రీ, పోషణకి వేరే ఏ దారీ లేకపోతే మాత్రమే జరుగుతుంది. కానీ చాలామంది చదువుకున్న స్త్రీలు విడాకులు పొందిన తరవాత కూడా, తమ పోషణకి వేరే దారి ఉన్నా కూడా, మనోవర్తి పొందుతూ వుంటారు – విడిపోయిన భర్తలదగ్గర్నించి. అతణ్ణే వొద్దనుకున్న తరవాత అతడి డబ్బులెందుకు మనకు అని అనుకోరు. కొందరు చదువుకోని స్త్రీలు మనోవర్తి సంగతి తెలిసినా “వాడి డబ్బులు వొద్దు” అని అనుకుని, పోషణకి వాళ్ళ స్వంత శ్రమ మీదే బతుకుతూ వుంటారు. చాలా మంది చదువుకున్న స్త్రీలు, పోషణకి డబ్బులున్నా మనోవర్తి పొందుతూవుంటారు. మనోవర్తి అన్నది ఆత్మగౌరవం ప్రశ్న.

  4. భర్త చనిపోయిన స్త్రీకి లేదా విడాకులు తీసుకున్న స్త్రీకి రెండవ పెళ్లి చేసుకునే హక్కు ఉన్నప్పుడు మనోవర్తి అవసరమా? మగవాడు ఇద్దరు ముగ్గురు ఆడవాళ్లని పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆడది ఒక మగవాడినే నమ్ముకోవాలి అని అనడంలాగ లేదా?

  5. ఆనంద్‌ says:

    వ్యాసం కాస్త అసమగ్రంగా వున్నా, వున్నంత వరకూ బాగానే వుంది. విషయాలేమీ తప్పుగా చెప్పినట్టు లేవు.
    శ్రీకాంత్‌ గారూ, మీరన్న వివక్ష ఏమిటో కాస్త వివరిస్తే బాగుండేది. ఈ వ్యాసం అర్థం ప్రపంచంలోని స్త్రీలందరూ ఉత్తములనీ, పురుషులందరూ దుర్మార్గులనీ కాదు. statistically చూస్తే, ఈ వ్యాసం ప్రకారం ఎక్కువ మంది స్త్రీలు పురుషుల పెత్తనానికి లోనవుతున్నారు. దుర్మార్గులైన స్త్రీలూ, చాలా చెత్తగా ప్రవర్తించే స్త్రీలూ కూడా వున్నారు. లేరని కాదు. కానీ సంఘంలో జనరల్‌ పరిస్థితిని తీసుకోవాలి. నాకు తెలుసున్నా ఒకాయన స్త్రీల పట్ల చాలా సానుభూతితో, సపోర్టింగుగా వుంటాడు. అయితే ఈయన ఇంటి పరిస్థితి చాలా వేరు. ఈయన భార్య ఒక తక్కువ స్థాయి మనిషి. చాలా నీచంగా ప్రవర్తిస్తూ వుంటుంది. విడిపోయే ధైర్యం లేక అలాగే అదే కొంపలో భార్యతో సంబంధం లేకుండా, ఆవిడ వండి పెట్టింది మాత్రం సిగ్గు పడుతూ తింటూ వుంటాడు. తన చేతకాని తనాన్ని తనే ఒప్పేసుకుంటాడు. అయినా తన భార్య స్త్రీ వర్గానికి ప్రతినిధి కాదనే అంటాడు. ప్రపంచంలో ఎక్కువ మంది స్త్రీలు అణచివేతకి గురవుతున్నారనే ఒప్పుకుంటాడు. ఈ యాంగిల్లో ఆలోచిస్తే, ఈ వ్యాసంలో వివక్ష కనబడలేదు. మీకేమన్నా కనిపిస్తే చెప్పండి, దాని గురించే మాట్టాడుకుందాం. స్త్రీలు దుర్మార్గంగా, చెత్తగా వున్న కుటుంబాలు నాకు బాగానే తెలుసు. అయితే సంఘంలో అది జనరల్‌ పరిస్థితి కాదు.

    భూషణ్‌ గారి పాయింటు బాగుంది. ఎక్కువ మంది విషయాల్లో, స్త్రీలకి పిల్లలు కూడా వుండటం, వారిని తాను మాత్రమే పోషించేటంత ఆర్థిక పరిస్థితి లేకపోవటం, పిల్లల పెంపకంలో కనీసం కొంత ఆర్థిక బాధ్యత పురుషుడికి ఇవ్వాలనుకోవటం, స్త్రీల ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేకపోవడం, వగైరాలు మనోవర్తికి సరైన కారణాలు. నాకు తెలిసిన ఒకావిడ భర్త ఇచ్చే మనోవర్తి ఏవో ఆశ్రమాలకు దానం చేసేస్తూ వుంటుంది. అడిగితే, ఆ మాజీ భర్తకి ఆ మాత్రం శిక్ష వుండాలీ అంటుంది. పురుషులు ఇంటి పని స్త్రీలకే ఎక్కువ కేసుల్లో అంటగట్టడం వల్ల, స్త్రీల ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. భర్తతో పాటు ఆ దుర్మార్గుడి మనోవర్తి కూడా అక్కర్లేదు అని అనుకుంటే అది చాలా మంచి అభివృద్ధే. మనోవర్తి అన్నప్పుడు సమాజంలోని జనరల్‌ పరిస్థితి మాత్రమే చూడాలి. ఆత్మగౌరవం అన్నం పెట్టదు కాబట్టీ, స్త్రీలని పెళ్ళి చేసుకుని, వాళ్ళని విడాకుల వరకూ లాగుతూ వుండే పురుషులకి శిక్ష వుండాలి కాబట్టీ, ఇలాంటీ రక రకాల కారణాలుంటాయి కాబట్టీ, మనోవర్తిని అంతగా వ్యతిరేకించనక్కర్లేదు. ఈ మధ్యనే ఏదో పేపరులో చదివాను. ఒక జడ్జి ఒక విడాకుల విషయంలో ఎక్కువగా సంపాదించే భార్య నించీ తక్కువగా సంపాదించే భర్తకి మనోవర్తి ఇప్పించాడు.

    మనోవర్తి తీసుకునే స్త్రీ రెండో పెళ్ళి చేసుకున్నాక మనోవర్తి నిలిచిపోతుందని విన్నాను. చట్టం బాగా తెలీదు. రెండో పెళ్ళి చేసుకున్నా, మాజీ భర్త వల్ల కన్న పిల్లల పోషణార్థం మనోవర్తి తీసుకుంటే, అది సమర్థనీయంగానే వుంటుంది. నాకు తెలిసిన ఒక కేసులో ఒకావిడ పిల్లల్ని భర్తకే వదిలేసి వెళిపోయింది విడాకుల విషయంలో. ఆ భర్త తన సంపాదనతోనే తన పిల్లలని పోషించుకుంటున్నాడు. అయితే ఇది జనరల్‌ పరిస్థితి కాదు.

    వ్యాసం అసమగ్రంగా, క్లుప్తంగా వున్నా ఎటువంటి తప్పు విషయంతోనూ లేదు.
    ఆనంద్‌

  6. భర్త చనిపోయిన స్త్రీకి లేదా విడాకులు తీసుకున్న స్త్రీకి రెండవ పెళ్లి చేసుకునే హక్కు ఉందని పెద్దగా చదువుకోనివారికి తెలియదు. తెలిస్తే 500 రూపాయల మనోవర్తి కొరకు రెండవ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండాలనుకోరు. ఆమె నాలుగైదు వేలు జీతం వచ్చే చిన్న ఉద్యోగిని పెళ్లి చేసుకున్నా ఆమెకి ఆర్థికంగా లాభమే.

  7. bhushan says:

    శ్రీకాంత్ గారూ – ఇప్పుడున్నది పురుషాధిక్య సమాజమే. అంటే స్త్రీల విషయంలో పురుషుల పెత్తనం ఎక్కువగా వుంది. ఆ దృష్టితో మీరు చూస్తే ఈ వ్యాసం (ఆనంద్ గారు చెప్పినట్టు అసమగ్రంగా వున్నా) వివక్షాపూరితం కాదు. ఆనంద్ గారు రాసినట్టు, విడిపోయిన భర్తలకి ఆ మాత్రం శిక్షలు ఉండాల్సిందే. కాకపోతే విడిపోయిన స్త్రీలు మనోవర్తి వద్దనుకుంటే అది వేరు. – భూషణ్

  8. సుధ says:

    గౌరవనీయులైన ప్రవీణ్ శర్మ గారికి,
    మీ వ్యాఖ్యలు చూస్తూనే వుంటాను. మీకు మార్క్సిజం అంటే గౌరవం అనీ, స్త్రీలపై వివక్షని వ్యతిరేకిస్తారనీ, స్త్రీల సమస్యలపై సానుభూతితో వుంటారనీ అర్థం అయితే అయింది గానీ, మీరు రాసే కామెంటులు కొన్ని సార్లు చాలా ఘోరంగా వుంటాయి. ఒకే ఒక్కసారి మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను.

    మీరు, “ఆమె నాలుగైదు వేలు జీతం వచ్చే చిన్న ఉద్యోగిని పెళ్లి చేసుకున్నా ఆమెకి ఆర్థికంగా లాభమే.” అని రాశారు. ఇది స్త్రీలని అవమాన పరిచేటట్టు వుంటుంది, మీ వుద్దేశ్యం అది కాకపోయినా. ఎంతసేపూ మీ వుద్దేశ్యం ఏమిటీ, మీ లక్ష్యం ఏమిటీ అని మాత్రమే కాక, మీరు రాసింది అవతల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారూ, వారు సరిగా రిసీవ్ చేసుకునేటట్టు మీరు రాయగలుగుతున్నారా అని మీరు అప్పుడప్పుడు, అస్తమానూ కాదు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. స్త్రీలు “ఆర్థికంగా లాభం” కోసం రెండో పెళ్ళి చేసుకుంటారా, ఎక్కడన్నా? అలా అనడం వారికి అవమానం కాదా? మీ వుద్దేశ్యం అది కాదని తెలుసు. మీరు రాసే మాటలు మీ వుద్దేశ్యాన్ని సరిగా వివరించడం లేదు. స్త్రీలని సమర్థించడానికి, వారికి భర్త పోయినా గానీ, భర్త నించి వారు విడిపోయినా గానీ, మీరు మీ రాతల్లో వారికి ఎలాగో అలాగ తొందరగా మళ్ళీ పెళ్ళి చేసెయ్యాలని చూస్తారు. “మగవాళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళన్నా చేసుకోవచ్చా, ఆడవాళ్ళు చేసుకోకూడదా” అని అంటారు. అదా అసలు విషయం? ఎవరయినా పెళ్ళనేది ప్రేమతో చేసుకోవాలి గానీ, మరో రకంగా కాదు కదా? మగవాళ్ళు తప్పు పని చేస్తే, ఆడవాళ్ళు కూడా తప్పు పని చేయాలని కాదు కదా? ఆడవాళ్ళు కూడా మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు. అయితే, అది ప్రేమతో మాత్రమే అవాలి. ప్రేమ అనేది ప్రధానంగా, మిగిలినవి సెకండరీగా వుండాలి. అయితే, విద్యా, ఆర్థిక స్తోమతూ లేని స్త్రీల విషయంలో పరిస్థితి వేరేగా వుంటుంది. దాన్ని సానుభూతితో అర్థం చేసుకుంటాం గానీ, అదే కరెక్టు అని అనకూడదు. దాన్నే సలహాగా ఎవరికీ ఇవ్వకూడదు. ఇక్కడ కూడా మీ వుద్దేశ్యం స్త్రీలకి సమర్థనగా వుండాలనే. కానీ వెలిబుచ్చే విధానం చాలా ఘోరంగా వుంటుంది.

    అలాగే అప్పుడప్పుడు మీ సొంత విషయం గురించి రాస్తారు. పిల్లలున్న వితంతువునే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని రాస్తారు. ఇక్కడ కూడా మీ వుద్దేశ్యం అభ్యుదయంగా వుండటమే. అయితే అది వెలిబుచ్చే తీరూ, అనుకునే పద్ధతీ అన్నీ తప్పులే. మీ పెళ్ళి ప్రేమతో జరగాలి ముందర. అలా ప్రేమతో జరిగినప్పుడు, ఆ స్త్రీ వితంతువు అయినా, పిల్లలున్నా, మరో సమస్య వున్నా అది మీకు ఆటంకం కాకూడదు. అంతేగానీ ఎక్కడన్నా పిల్లలున్న వితంతువైన యవ్వన స్త్రీ వుందా అని వెతుక్కోవడం చాలా తక్కువ స్థాయిని చూపిస్తుంది. అందుకే మిగిలిన వాళ్ళు ఈ విషయంలో మీమీద జోకులు వెయ్యడం, తక్కువ చేసి మాట్టాడ్డం జరుగుతోంది. మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాలు.

    మీరు చాలా పుస్తకాలు చదువుతారు. అందులో విషయాలని చాలా యాంత్రికంగా చాలా వాటికి అన్వయించాలని ప్రయత్నిస్తారు. అది చాలా చిక్కులు తెచ్చి పెడుతుంది. మీకు ఆత్మ పరిశీలన కొంచెం కావాలి.

    అలా అని మీరు అస్తమానూ తప్పు విషయాలే రాయరు. చాలా సార్లు చక్కగానే రాస్తారు.
    ఇంకో విషయం. అన్న మరణిస్తే, తమ్ముడు వదినని పెళ్ళి చేసుకున్నాడని రాస్తారు. ఇక్కడ మీ వుద్దేశ్యం, బయట వాళ్ళు ఏవేవో తప్పులు చేస్తున్నారూ, వదిన మరిదిని పెళ్ళి చేసుకుంటే తప్పేంటీ అని. సినిమాల్లో ఇంకా చెత్తగా చూపిస్తున్నారని మీ వాదన. వదినని (అన్న భార్యని) తల్లిగా భావిస్తారు. అదీ వావి వరస ఇక్కడ. తల్లిగా భావించే స్త్రీని ఎవరూ పెళ్ళి చేసుకోరు. అన్న మరణిస్తే, ఆ తమ్ముడు వదినని తల్లిలా చూసుకోవాలి. ఆమె తర్వాత జీవితంలో మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, తల్లి లాంటి వదినకి సపోర్టుగా వుండాలి. అదీ పద్ధతి. లేకపోతే అలాంటి రాతలు చదవడానికి సభ్య సమాజానికి అసహ్యం పుడుతుంది.

    ఇక్కడ రాసినవి అర్థం చేసుకున్నారా, మీ రాతలు అవతల వాళ్ళకి ఉపయోగకరంగా వుంటాయి. అలా కాకుండా నన్నూ, నా రాతల్నీ తప్పుగా అర్థం చేసుకుని, వ్యతిరేకిస్తారా అది మీ ఇష్టం. మీకు ఒకే ఒక్కసారి కాస్త వివరంగా చెప్పాలని అనిపించింది. చెబుతున్నాను.
    కె. సుధ

  9. లైల says:

    డియర్ ప్రవీణ్ ‘శర్మ’/మార్తాండ ‘శర్మ’/చెఱశాల ‘శర్మ’,

    హౌ ఆర్ యు? ఐ రీడ్ యువర్ కామెంట్స్ నౌ అండ్ దెన్.

    1. మీమీద ఒక జోకు వెయ్యాలని వుంది. దయచేసి జోకుగానే తీసుకోండి. సీరియస్ గా తీసుకోకండి. అలా సీరియస్ గా తీసుకుంటే నా మీద వట్టే. ఏమంటారు? అదేమంటే, కె. సుధ గారు మీకు రాసిన ఉత్తరం చూశాక, మీరు, “సుధ గారూ, మీకు పెళ్ళయిందా? అయితే మీరు వితంతువేనా? మరి పిల్లలున్నారా? మీ వయసెంత?” అని అడుగుతారేమో నని హడలి చచ్చాను. 🙂 🙂 అయ్యో, ఇది జోకు సార్. కొంచెం నవ్వండి. ప్లీజ్. సరదాగా వేసిన జోకు అంతే.

    2. ఇది కొంచెం సీరియస్ గా అడుగుతున్న డౌట్ సార్! మీరు చాలా అభ్యుదయంగా రాస్తారు. ఎన్నో అభ్యుదయ విషయాలు చెబుతారు. మరి, ఒక అగ్ర కుల చిహ్నమైన ‘శర్మ’ అనే పేరుని మీ పేరులో ఎలా వుంచుకున్నారు? ఎంతో మంది అభ్యుదయ వాదులు, కులాన్ని సూచించే, “చౌదరి”, “నాయుడు”, “రెడ్డి”, “శాస్త్రి”, “శర్మ”, లాంటి పేర్లని తమ పేర్ల లోంచి తొలగించుకున్నారు. మీరు మాత్రం అభ్యుదయం కాని ఆ పేరుని మోస్తూనే వున్నారు. ఎందుకని? మీరేమనుకుంటున్నారు ఈ అభ్యుదయం గురించి? అనుమానం వచ్చి అడుగుతున్నాను. మిమ్మల్ని వెక్కిరించాలనీ, కించపరచాలనీ కాదు సుమా! తప్పుగా అర్థం చేసుకోకండి, ప్లీజ్.

    ఇట్లు,
    లైల

  10. rameshraju says:

    గడిచిన శతాబ్దం వరకు స్త్రీలు విడాకులు తీసుకోవడం అంటే ఎరుగరు. అదేదో మహాపాపంగా భావించేవారు. భర్తలు తన్నినా, గెంటినా, తగలేసినా ఎదురుతిరగడమే తెలియదు. పూర్వజన్మలో చేసిన పాపంవల్లనే ఇలాంటి భర్త దొరికాడని ఆ బాధలు పడితే వచ్చే జన్మలో మంచి భర్త లభిస్తాడనే నమ్మకంతో ఎన్ని కష్టాలనయినా అనుభవించేవారు. – ఇది నిజమే, ఎందుకంటే అప్పటి స్త్రీ లకు చదువు,ఉద్యోగం వగై రా ఉండేది కాదు. ఒక వేళ అన్ని అవకాశాలు లభించినా సద్వినియోగపరచుకునే వారు. కాని ఈనాటి పరిస్థితి వేరు. పురుషుడు సృష్టించిన కుటుంబ కట్టుబాట్లను సంకెళ్ళుగా భావించి స్త్రీ గడపదాటి బయటకు వచ్చేసింది. నిరుద్యోగ సమస్య పెంచేసింది. అన్ని రంగాల్లో వారు రాణిస్తున్నా రు – మంచిదే. కాని లైంగికంగా రెచ్చగొట్టే బిగుతు జీను ప్యాంట్లు , సగం ప్యాంట్లు వేసుకుని,సిగ్గు ను విడిచి రాత్రి సమయాల్లో కూడా తిరుగుతూ తమ గౌరవాన్ని తామే పొగొట్టుకునుచున్నారు. ఈనాటి స్త్రీ పురుషునితో ఏ విషయంలోనూ రాజీ పడుటలేదు. ఉద్యోగాలు, చదువులు, ఆర్ధిక స్వాతంత్ర్యం వచ్చేశాయి కదా .. “ఏం పర్వాలేదు … ఆయన (భర్త) లేకపోయినా దర్జాగా బ్రతు కగల్ను” – అనే ధీ మా వచ్చే సింది. డబ్బు ల కోసం 498ఎ ను దుర్వినియోగ పరచుకునే మహిళలు ఇటీవల ఎక్కువై పోయారు. ఫలితంగా విడాకుల సంఖ్య ఎక్కువై పోయింది. సమా జం భ్ర ష్టు పట్టి పోతోంది.

  11. tvrao says:

    చాలా సత్యదూరమైన విషయాలు. నేడు స్త్రీ లలోనూ రాపణాసులు ఉన్నారు. సుబ్బమ్మగారికి అలాంటి వారు జీవితంలో తగలలేదు. తగిలినపుడు వ్యాసం తిరగరాస్తారు.

  12. Gugunk says:

    If my problem was a Death Star, this article is a photon tooepdr.

Leave a Reply to సుధ Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.