మహిళల్ని దోషులుగా నిలబెట్టే మగవాల్ల పన్నాగాలు

జూపాక సుభద్ర
వివిధ  సామాజిక నేపధ్యాలున్న ఆడవాల్లను మగ ప్రయోజనాలకనుకూలంగా కనీస గుర్తింపులు లేకుండా చరిత్రలో మిగిల్చిండ్రు మగవాల్లు. అవి సరిపోలేదని కొత్త కొత్త రూపాల్లో ఆడవాల్లను సమాజంలో దోషులుగా చూపెట్టే, నిలబెట్టే సంఘటనలు యీ మధ్య ఎక్కువైనయి. మగవాల్లు తమ చేతికి మట్టంటని పనుల్ని పన్నాగంగా అమలు జరుపుకుంటున్నారు ఆడవాల్లద్వారా. దోషులుగా, నేరస్తులుగా ఆడవాల్లను చూపే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతున్నాయి. భైర్లాంజి ఘటన కావొచ్చు, మద్యం టెండర్లు కావొచ్చు. మొన్న ఖైతాపూర్‌ (15.9.10)లో జరిగిన సంఘటన కావొచ్చు. యీ సంఘటన లన్నింటిలో ఆడవాల్లనే ముందుంచడం జరిగింది. సమాజ అవినీతి, ఆక్రమాలు, అసమానతల పాకుడుబండ  పాపాలన్ని మహిళలనెత్తి మీద మోపే మగ కుట్రలు జరుగుతున్నయి. వీటిపట్ల అన్ని కులాల మహిళలు అప్రమత్తంగా వుండాల్సినవ సరముంది.
ఈనెల ఖైెతాపురం గ్రామం (15.9.10) చౌటుప్పల్‌ మండల్‌, నల్గొండ జిల్లాల్లో ఒక ఎస్సీ, ఒక బిసీ ముసలివాల్లని చేతబడి చేస్తుండ్రని, కాళ్లు చేతులు కట్టేసి కొట్టి కట్టెల మీద పడేసి సజీవ దహనం చేసి చంపి పరారై దళిత బహుజన ఆడవాల్లని  మూకుమ్మడిగా ముందుకు తోసిండ్రు వూరి మగవాల్లు. అవిద్య పేదరికంవల్ల మూఢనమ్మకాల్ని బలంగా నమ్మే ఎస్‌సి, బిసి మహిళలు మేమే చంపినం ఏం జేస్తరో చేసుకోండ్రి అని పోలీసులకు పగడ్భందిగా చెప్పించిండ్రు. జైలుకు తోలిండ్రు. అసలు నేరస్థులు చేతికి కాదు కాల్కు మట్టి తగలకుండా తప్పించుకుండ్రు. ఖైతాపురం గ్రామం ఆడవాల్లు ఎవరికీ వాల్లుగా వున్న ఏకాకులు కాదు. సమ భావన సంగాలుగా వున్న వాల్లు. బాణమతి, మూఢనమ్మకాలు అవిద్యని ఆసరా చేసుకొని మగ ప్రపంచం బాగా ఉపయోగించు కున్నది. ‘మా పశువుల చస్తున్నయి పిల్లలు చస్తుండ్రు. మనుషులంత మంచాన బడ్డరు వీల్ల చేతబడితోని అందికే చంపినం యిప్పుడు మా వూరు బాగు పడ్తది.’ అని మొగ గొంతు లేసుకొని కొంగులు దులిపి నడుముకు సుట్టుకుండ్రు. ఎస్‌సి బిసి ఆడవాల్లంతా సైన్యంగా, గుంపు గూడి చిన్న కులాలైన దళిత బహుజనులైన ఎల్లయ్య, నర్సింహ య్యల్ని ముసల్లోలని కూడా చూడకుండా, సరిగా నడవలేని, చూడలేని వాల్లని గూడా చూడకుండా (మూఢ నమ్మకాలు పైకే లోపల వేరే ప్రయోజనాలు) చేతబడి చేస్తున్నరని కొట్టి కిరోసిన్‌ పోసి కాల్చి చంపిండ్రు. కట్టె మీద కాలుతూ పెట్టే బొబ్బల్ని ఏడుపుల్ని, అరుపుల్ని పైశాచికంగా పక్కనే కూచొని ఆనందించిండ్రు. చరిత్రలో, సమాజంలో అనేక అత్యాచారాలు, హత్యాచారాలు ఎదుర్కొన్న వాల్లు సంఘంలో అనేక దురాచారాల హింసల పాల్పబడినోల్లు, దుక్కాల గాయాలు తెల్సినోల్లు, జాలి, కరుణ వుంటదని పేరు బడ్డ ఆడవాల్లు యిట్లా ఎలా చేయగలిగిండ్రు. తమ మీద హింసలు దౌర్జన్యాలు అన్యాయాలు జరుగుతుంటే మహిళా సంగాలు గుంపులుగా చేరి ఒక్కర్నికూడా చంపిన సందర్భం లేదు. బాణామతి చేసినందుకు చంపినం అని చెప్పే సమభావన మహిళా చైతన్యం మహిళల మీద అత్యాచారాలు జరిగినపుడు మహిళల్ని చంపినపుడేమవుతుంది? యిలాంటి చర్యలు తమ కోసం చేస్తే మహిళల మీద ఎలాంటి అగయిత్యాలు జరగకుండా కాపాడినోల్ల్లవు దురు. జరుగుతున్న బాణామతి హత్యలన్ని దళితుల మీదనే ఎందుకు జరుగుతున్నయో చెప్పగలరా?
నిజానికి దళిత ఎల్లయ్య భూమి చెక్క ఆధిపత్య కులాల భూమి మధ్యనుండడం పెద్ద నేరమైంది. ఆ భూమి చెరువు తట్టునుండడం యింకా దోషమైంది. అది వాల్ల భూముల మద్దెనుండడం వాల్లకు కళ్ళమంటైంది. అది గుంజేసుకుందామంటే మామూలుగా వీలు కాలే. నయాన భయాన దళిత ఎల్లయ్యను కదిలించలేక పొయిండ్రు. అందికే చేతబడి అనే మూఢ నమ్మకాన్ని రెచ్చగొట్టిండ్రు వూర్లె. యీ సీజన్‌లో వచ్చే జ్వరాల్ని, రోడ్డు మీద జరిగిన ప్రమాదాల్ని కూడా వీరి ‘చేతబడి’ అకౌంట్లో వేసి ప్రజల్ని వుసి కొలిపిండ్రు.  పుకార్లు పుట్టించుండ్రు. మొగవాల్లకంటే ఆడవాల్లయితే కేసులు అంత బలంగా వుండవనుకున్నారో ఒక వేళ అయినా వాల్ల సావు వాల్లే చస్తరని ఆడోల్లని బత్తెక్కిచ్చి వొదిలేసిండ్రు. యీ ఆడవాల్లు కూడా రెచ్చి పోయిండ్రు నిజమేనని. లోపాయికారి తనాలు తెలుసుకోకుండా, బాణామతి మూఢనమ్మ కాలు బూటకం బూటకం అనే చైతన్యం లేకుండా చీమలంత కల్సి పామును చంపాలి. కాని చీమలు చీమలే కొట్టుకు చస్తున్నయి.. మహిళల్ని బట్టలిప్పిచ్చి బరివేతల బత్కమ్మ లాడిచ్చిన, బరిబాతల బజార్లు తిప్పిన ఆదిపత్య కులాల మగవాల్లని ఖైతాపూర్‌ ఎల్లయ్యని నర్సింహయ్యని కాల్చి చంపినట్లు చంపగలరా ఖైతాపురం దళిత బహుజన ఆడవాల్లు? బాధితుల్ని బాధితులే చంపు కునుడు ఆధిపత్య మగవాల్ల కుట్రల పలితమే.
మహారాష్ట్ర ఖైర్లంజిలో కూడా ఒక దళితునికి భూమివుందనే అక్కసుతో కుటుంబాన్ని అమానుషంగా చంపడం, తల్లి బిడ్డల మీద అత్యాచారాలు చేసి కాళ్ళ మధ్య కర్రలు గుచ్చి కాల్వల పడేసిన ఘటనలో  కుంచి కులం ఆడవాల్లు దగ్గరుండి చేయించారట. కాని వెనక   హస్తాలు వేరే.
మద్యం టెండర్లు మహిళలు వేయడం పాడటం కూడా యిలాంటిదే. సార తాగేది సమాజం లో మగవాళ్లే ఎక్కువ. కాని దాని విధ్వంసాల్ని ఎదుర్కొనేది ప్రధానంగా మహిళలే. యిల్లు, కుటుంబం, పిల్లల బరువు బండలన్ని మోసేది మహిళలే. మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడి మద్య నిషేధం తెచ్చిన మహిళలు మద్యం టెండర్లు వేసి పాడటం ఈ దశాబ్ద విషాదం. యిట్లా సంఘ వ్యతిరేక , మానవ వ్యతిరేక, మహిళా వ్యతిరేకమైన అమానుష, అన్యాయమైన కార్యకలాపాలు మగవాల్లు ప్రేరేపించి ఉసిగొల్పి మహిళల చేత చేయిస్తుండ్రు. మహిళల్ని మగవాల్లు ఆయుధాలుగా వాడుకుంటుండ్రు. తగిలించి తమాషాలు చేస్తుండ్రు. యీ ధోరణులు మహిళలు ముఖ్యంగా ఉత్పత్తి కులాల మహిళల్ని ఆగం జేసేవి. ప్రధానంగా ఆధిపత్య కులాల మగవాల్లు ఉత్పత్తి కులాల మహిళల్ని నిందితుల్ని చేస్తున్నరు. ఖైతాపురంలో జరిగిందిందే.
ఆడవాల్లని నియంత్రించే దాంట్లో అన్ని కులాల మగవాల్లొక్కటేననేదే చూస్తున్నం. యిపుడు జరుగుతున్న కుల ఉద్యమాలైన దండొర, తుడుందెబ్బ, ఎరుకలి సంగం, మాలమహనాడు, బీసిసంగాల్లో, తెలంగాణ సమైక్యాంధ్ర ఉద్యమాల్లోనికి మహిళల్ని రానివ్వడమే లేదు. ఎవరైనా బలవంతంగా వచ్చినా పొమ్మన లేక పొగబెట్టే రాజకీయాలే జేస్తున్నయి. ఇవి సామాజిక ఉద్యమాలని ఎట్లా అనాలి? అవి ఎట్లా క్లెయిమ్‌ చేస్తయి. ఒక్క ఆడనలుసుకు కూడా సూది మొన స్థానమివ్వనపుడు? యిట్లాంటి వాటికి దూర ముంచుతారు. నిందితులుగా నిలబెట్టడానికి మహిళలు కావాలి. చేతికి మట్టి అంటకుండా  వాల్ల కార్యాలు నెరవేర డానికి. యిలాంటి అన్యాయాల పట్ల అన్ని కులాల వర్గాల మహిళలు అప్రమత్తం కావాలి. చైతన్యం కావాలి. ప్రభుత్వాలు కూడా బాణామతి వంటి మూఢనమ్మకాలను తొలగించే చర్యలు చేపట్టి మానవహక్కులు కాపాడాలి.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to మహిళల్ని దోషులుగా నిలబెట్టే మగవాల్ల పన్నాగాలు

  1. buchireddy says:

    నిజాన్ని భాగ చెప్పారు–
    మార్పు ??????

Leave a Reply to buchireddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.