‘స్మిత’ పజ్ఞ్రత

జె.శ్యామల

(భూమిక నిర్వహించిన కథ/వ్యాస రచన పోటీల్లో రెండవ బహుమతి పొందిన కథ)ఇల్లంతా నిశ్శబ్దం రాజ్య మేలుతోంది. సుమతికి నిద్రరావటం లేదు. దాహంగా అనిపించింది. మంచినీళ్ల కోసం డైనింగుహాల్లో ఉన్న ఫ్రిజ్‌ దగ్గరకు నడుస్తుండగా అటువైపుగా ఉన్న కొడుకు బెడ్‌రూమ్‌లోనుంచి కోడలు సునంద మాటలు వినపడ సాగాయి. ”ఏం ఖర్మమో, ఏమో. అంత కట్నం ఇచ్చి లక్షణంగా పెళ్లి చేశాం. తీరా చూస్తే తిరుగుబోతు. నాలుగు రోజులకోసారి ఇదేమో వచ్చేస్తానం టుంది. ఇంకా చిన్నతనం వదల్లేదు. వాడికేం మగవాడు. ఏంచేసినా చెల్లుతుంది. పోయినసారి అది అలిగొచ్చి ఓ నెల రోజులు ఉన్నందుకే ఇరుగమ్మ, పొరుగమ్మ ”ఏంటి మీ స్మిత ఇంకా ఇక్కడే ఉందా? ఇన్నాళ్లు ఉండటానికి ఒప్పుకున్నాడంటే మంచి వాడే అల్లుడు” అంటూ వ్యంగ్యంగా నవ్వులు. ఎంత చదువుకుని, ఉద్యోగం చేస్తుంటే మాత్రం తెగతెంపులు చేసుకుంటే పరువుతక్కువ కాదూ? అతనేం వెళ్లిపొమ్మనట్లేదు, అత్త, మామ కూడా వెళ్లమనటంలేదు. పోనీ వియ్యపురాలు చెప్పినట్లు ఎన్నాళ్లు తిరుగుతాడు, కొన్నాళ్లు కళ్లు మూసుకుంటే సరి. లేకపోతే చుట్టాల్లో ఏముఖం పెట్టుకు తిరుగుతాం. ఇంకా మన వాడికి పెళ్లి చెయ్యాలి. ఆడపడుచు మొగుణ్ని విడిచి, పుట్టిల్లు చేరిందని తెలిస్తే ఏ సంబంధాలు ముందుకొస్తాయి? మనకేం గౌరవం దక్కుతుంది?” కోడలు ఆవేశపడుతోంది. వాళ్ల మాటలు వినటం కూడదని తెలిసినా స్మిత గురించిన మాటలు వినిపించడంతో ఆమెకు తెలియ కుండానే అక్కడే ఆగి పోయింది. కొడుకు అందుకున్నాడు, ”సరేలే, స్మితను రానీ. మెల్లిగా మాట్లాడి చూద్దాం. ఇలా అవుతుందను కున్నామా? ఏం చేస్తాం, మన ప్రాప్తం. రాంగానే దానిమీద అరవకు” అన్నాడు కొడుకు. ”ఆ, అక్కడికి నేను గయ్యాళిని, మీరు మంచివాళ్లు. నా బాధ ఎవరికీ పట్టదు” అంది.
సుమతి చప్పుడుకాకుండా మంచి నీళ్లు తీసుకు తాగి తన గదికి చేరుకుంది. ”కొడుకు, కోడలు తనను ఏ విషయంలోనూ సంప్రదించరు. అసలు మాట్లాడే పనే లేదు. ఏదో లాడ్జింగురూమ్‌లో ఉన్నట్లు కాలక్షేపం. కొడుకు ఎప్పుడన్నా ఒకసారి పలకరించినా, అంతలోనే కోడలు దూసుకొచ్చి, ఏదో ఒక ములుకు మాట విసిరి వాణ్ని అక్కడినుంచి వెళ్లేలా చేస్తుంది. పాపం స్మిత. పోయిన సారి స్మిత వచ్చి ఓ నెల ఉన్న మాట నిజమే. తనతో అల్లుడు ఏదో ట్రెయినింగు కెళ్లాడని చెప్పారు. అసలు సంగతి ఇదన్నమాట. ఈ సమాజంలో అమ్మకుగాని, అత్తకుగాని కావలసింది కుటుంబం పైకి బాగా కనపడటమే. లోపల ఎంత కుళ్లిపోయినా సరే. అందులో అసలు బాధ వారిది కాదు. కాస్తో, కూస్తో బాధ ఉన్నా వారు కోరుకునే గౌరవం ముందు అది లెక్కలోకి రాదు. హు. తన జీవితమూ అంతేగా అనుకుంటుండగా, మనసు గతంలోకి జారుకుంది… మూడేళ్ల వయసప్పుడే తండ్రిని పోగొట్టుకుంది తను. అమ్మమ్మ దగ్గరే అమ్మ తలదాచుకుంది. తాతయ్య బతికున్నంతవరకు తమకు బాగానే జరిగిపోయింది. తండ్రిలేని పిల్లనని ప్రత్యేక ప్రేమతో చూసేవాళ్లు. తాతయ్య పోవటంతో ఇంట్లో పరిస్థితులు మారిపోయాయి. అమ్మ, తను వాళ్లకు అదనపు భారమన్న భావన మాటల్లో, చేతల్లో తరచు వినిపించేది, కనిపించేది. నైన్త్‌ ఫామ్‌లో ఉండగా తను వ్యక్తురాలైంది. దాంతో అందరికీ తన మీద ఆలోచనమళ్లింది. అప్పటివరకు తనను చిన్నపిల్లగా చూసినవాళ్లంతా, హఠాత్తుగా తనేదో పెద్ద పిల్లయినట్లుగా చూడసాగారు. ‘ఇంక చదువెందుకు, గంతకు తగ్గ బొంత ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది. ఎంత చదివించినా పెళ్లి చెయ్యక తప్పదు. పైగా దానికన్నా ఎక్కువ చదివినవాణ్ని తేవాల్సి వస్తుంది” అంటూ లాభనష్టాల సమీక్షలు చేసి సంబంధాలు చూడసాగారు. స్కూలుకి వెళ్లొద్దన్నారు. ఆరోజుల్లో ఆ పల్లెటూళ్లో ఆడపిల్లల చదువు అంతంత మాత్రంగానే ఉండటంతో ఇంట్లో వాళ్ల మాటకు ఎదురు చెప్పేవారెవరూ లేక పోయారు. మేనమామ వరసయ్యే చుట్టాల బ్బాయి సుబ్బారావు వచ్చి పెళ్లిచూపులు చూశాడు. ఆ రోజుల్లో గవర్నమెంటు ఉద్యోగమంటే గొప్ప. అతనికి గవర్నమెంటు ఉద్యోగం ఉంది. తనకన్నా ఎర్రగా ఉంటాడు. ఇంకేం బ్రహ్మాండమైన సంబంధమని తీర్మానించేసి, అతనికిచ్చి పెళ్లిచేశారు. పల్లెటూళ్లో పెద్దగా సరదాగా తిరగడం అదీ ఉండేది కాదేమో పెళ్లయ్యాక పట్నం వెళ్లటం, సుబ్బారావు తరచు సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లటం గొప్పగా అనిపించింది తనకు. పెళ్లయిన మూడునెల్లకే నెలతప్పింది. అది మొదలు వరసకాన్పులే. మూడోసారి పురిటికి పుట్టింటికి వెళ్లింది. ఆయన దగ్గర్నుంచి పెద్దగా ఉత్తరాలు రాలేదు. మనిషీ రాలేదు. చివరకు లాభంలేదని అమ్మే ఉత్తరం రాయిస్తే, రైలెక్కించండి నేను స్టేషన్‌కెళ్లి రిసీవ్‌ చేసుకుంటాను అని జవాబు రాశాడు. అనేకానేక ఆలోచనలతో పిల్లల్ని తీసుకొని రైలెక్కింది తను. స్టేషన్‌కు వచ్చాడాయన. కానీ చూపు తప్పించి మాట్లాడుతున్నాడు. ఏం అర్థం కాలేదు. కారణం ఇంటికెళ్లాక అర్థమైంది. ఇంట్లో మరో స్త్రీ. కోపం కట్టలు తెంచుకుంది. ఏమండీ” అరుస్తూ వెనుదిరిగింది. అతనుంటేగా, అక్కడినుంచి ఎప్పుడో జారుకున్నాడు. ఆమెను నోటికొచ్చినట్లు తిట్టింది. ఆమె చాలా శాంతంగా ”అక్కా! ఆయనకు పెళ్లయినట్లు నాకు ముందు తెలియదు. నీ బాధ నాకు తెలుసు. తప్పక తాళి కట్టించుకున్నా” అంటూ కళ్లు దించుకుంది. ఆమె గర్భవతని అర్థమైంది. ఆమె వండిపెట్టిందే కానీ సుమతికి తినబుద్ధి కాలేదు. సుబ్బారావు వస్తే ఏకి పారేయాలను కుంది. ఏ రాత్రికో ఇల్లుచేరాడు. ”చెప్పకుండా జారుకున్నారేం, మీ బండారం బయటపడే సమయమొచ్చిందనా?” ఇంకా ఏదో అనబోయింది.
సుబ్బారావు అందుకున్నాడు ”నాకేమన్నా భయమా, పనుండి వెళ్లానుగాని. నువ్వు ఒట్టి పిచ్చిమొద్దువి. ఇప్పుడు నీకు  ఏం తక్కువైందని గోలపెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టాలా పొయ్యాలా అదే సంపాదిస్తోంది. ఆ జీతం మనకే ఇస్తుంది. నువ్వింట్లో పిల్లల్ని చూసుకుంటే చాలు. రభస చేస్తే నీకే నష్టం. నన్ను కాదని ఎక్కడికి పోతావు, పుట్టింట మడిమాణ్యాలు ఉన్నాయనా” అన్నాడు ధీమాగా.
తప్పుచేసిన భావనే లేని అతణ్ని ఏమని ఏం ప్రయోజనం. అప్పడాలు, వడియాలు పెట్టి తన కడుపు నింపుకుంటోన్న తల్లి గుర్తొచ్చింది. తనను నాలుగు నెలలు భరించి, పురుడు పోసి పంపటానికే ఎంతో అవస్థపడింది. ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లల్ని వేసుకుని ఆమె దగ్గరకు ఏం వెళ్తాననుకుంది. సవితిగా వచ్చిన లలిత కూడా తన పట్ల గౌరవంతో ఉండటంతో తను సమాధాన పడిపోయింది. అయినా ఊరుకోలేక తల్లికి ఉత్తరంలో తన గోడు వెళ్లబోసుకుంది. అందుకు తల్లి నిన్ను బాగా చూసు కుంటున్నంతవరకూ నువ్వు మా మూలుగానే సర్దుకుపో. పిల్లల ముఖం చూసయినా నువ్వు అక్కడే ఉండాలి. కాదని వచ్చి ఈ సంఘంలో బతకడం చాలా కష్టం. పైగా ముగ్గురు పిల్లల్ని సాకాలి. ఇప్పుడు నీకేం ఉద్యోగాలొచ్చి నీ ముందు వాల్తాయి? మీ నాన్న లేక నేనెట్లాగూ ఒంటరిపక్షినయ్యాను. మొగుడనేవాడు ఉండీ నీ అంతట నువ్వు బంధం తెంపుకోవటం ఎందుకు? అతను నిన్నేం పొమ్మన్లేదుగా. అది కొంతవరకు నయం. నీ మంచే నీకు రక్ష” అంటూ ఉత్తరం రాసింది.
అది చదువుకుని తను నిర్వేదంగా నవ్వుకుంది. అది తను ఊహించిందే. అయినా ఏదో బాధ. చెప్పటం తేలికే. దేన్నయినా పంచుకోవచ్చు కానీ భర్తను మరొకరితో పంచుకోవటం దుస్సహమే.
వాళ్లిద్దరూ స్కూటరెక్కి ఆఫీసు కెళ్లడం, కలిసి సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం, ఆయన ఆమెతో సరసాలాడడం, తననేది ఉందని కూడా పట్టించుకోకుండా గదిలోకెళ్లి బోల్ట్‌ పెట్టేసుకుని ఆమెతో కులకటం… అవన్నీ భరించటానికి ఎంత సహనం కావాలో, మనసులో ఎంత చిత్రవధ అనుభవించాలో ఇతరులకేం తెలుస్తుంది?
చుట్టపక్కలందరూ ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడని, పెద్దపెళ్లాం, చిన్నపెళ్లాం అని రకరకాలుగా తనకు వినిపించేలాగే అంటుండేవాళ్లు. పేరంటాలకు పిలిచినప్పుడు తనో టాపిక్‌ అయ్యేది. పాపం ఎలా భరిస్తావో, ఆమెతోనేనా, నీతో కూడా ఉంటాడా సవితి పిల్లాణ్ని కూడా పెంచుతున్నావంటే నువ్వు నిజంగా సుమతివే. చక్కగా వండిపెడు తున్నావు, పిల్లవాణ్ని చూస్తున్నావు. తనకేం, టింగురంగా అని వన్నెచిన్నెల చీరెలు కట్టి, స్కూటరెక్కి పోతుంది… ఇలా ఏవేవో. లలితను ఆడిపోసుకుంటే తను సంతోషిిష్తానని, ఆమె గురించి ఇంకా ఏవైనా చెపుతానని వాళ్ల ఆలోచన. తను ఏం మాట్లాడకపోవటం చూసి, అయినా నీకు లేని నొప్పి మాకెందుకులేమ్మా, ఏదో ఊరుకోలేక అంటూ సాగదీసేవారు. మళ్లీ లలిత కనిపిస్తే వాళ్లేం మాట్లాడేది కూడా తనకు తెలుసు… ఇంత సంపాదిస్తున్నావు, నీకేం ఖర్మ, నీకున్నది ఒక్క నలుసు. వాళ్లు నలుగురు. నీ సంపాదన దోచుకుంటున్నారు. అయినా ఇంత చదువుకుని కలిసి ఉండటానికి ఎలా ఒప్పుకున్నావ్‌, దర్జాగా వేరే ఇల్లు తీసుకోక… అనటం తన చెవులలో పడింది కూడా. లోకం నోటికి రెండు వైపులా పదునే. ఏమిటో తన జీవితం అలా గడిచిపోయింది. హార్ట్‌ అటాక్‌ వచ్చి ఆయన పోవడం, లలిత తన కొడుకు దగ్గరికి అమెరికా వెళ్లడం, తనిక్కడ మహేష్‌ దగ్గర ఉండటం. స్మిత వస్తే అసలు సంగతేమిటో నెమ్మదిగా కనుక్కోవాలి” అనుకుంది. ఆలోచనలతో అలసి పోయిం దేమో నిద్రాదేవి ఒడిలో ఒరిగి పోయింది.
ఆరోజు స్మిత రానే వచ్చింది. కళ తప్పిన ముఖం ఆమె మానసిక సంఘర్షణను చెప్పకనే చెపుతోంది. కొడుకు, కోడలు తనెదురుగా మామూలు కుశలప్రశ్నలు వేశారు. ”బాగున్నావా బామ్మా” అన్న స్మిత ప్రశ్నకు, ”ఆవిడెందుకు బాగుండదు, పద, పద, స్నానంచేసిరా, ఎప్పుడనగా తిన్నావో, ఏమో” స్మితను అక్కడ్నుంచి తరిమినంత పనిచేసింది కోడలు.
మర్నాడు హఠాత్తుగా సునంద వాళ్ల నాన్నగారికి బాగాలేదని, ఆసుపత్రిలో చేర్చారని ఫోన్‌ రావడంతో సునంద ఉన్నపాటున ప్రయాణమైంది. కొడుకు ఆఫీసుకెళ్లాక స్మిత, సుమతి మిగిలారింట్లో.
”స్మితా! కొద్దిగా కాఫీ ఇస్తావా అమ్మా” అడిగింది సుమతి.
”అలాగే బామ్మా” అంటూ ఐదు నిముషాల్లో పట్టుకొచ్చింది.
కాఫీ రుచి చూసి ”నీ చేతి కాఫీ చాలా బాగుంది స్మితా” మెచ్చుకుంది మనవరాలిని.
”థ్యాంక్యూ బామ్మా, నువ్విలా అంటున్నావు కానీ మా ఆయనైతే దరిద్రంగా ఉందంటాడు” చప్పున అని నాలిక్కరుచు కుంది.
”ఏం స్మితా నాతో చెప్పినందుకు నాలిక్కరుచుకుంటున్నావా, నేనేమీ పరాయి దాన్నికాదుగా, మీ నాన్నకు అమ్మను. మీ అమ్మ, నాన్న కూడా నీగురించి నాకేమీ చెప్పరు. చూచాయగా గ్రహించి చాలా బాధపడ్డాను. అసలు విషయమేమిటో నాకు చెప్పవూ, నాకు తోచిన సలహా చెపుతాను తల్లీ” అంది లాలనగా.
ఆత్మీయమైన ఆ మాటలకు స్మిత ఇంక ఆగలేకపోయింది. ”ఏంచెప్పను బామ్మా! పెళ్లయిన మర్నాడే ఆయన ”నాకు తిరిగే అలవాటుంది. నా అలవాట్లు ఎప్పుడు మానుకోగలనో నాకు తెలియదు. అసలు మానతానో, లేదో కూడా. ఆ విషయంలో నన్ను విసిగించకుండా ఉండటం నీకు మంచిది” అని చెప్పాడు. ఏం చేయను, అమ్మ ఉందికదాని చెప్పుకుంటే ”అంతా అయ్యాక ఏంచేస్తాం, అయినా ఈ రోజుల్లో తిరగని కుర్రాళ్లెవరు? పైగా ఆ విషయం అతనే చెపు తున్నాడు కదా. నువ్వయితే మంచిగా ఉండు. నీ అదృష్టం బాగుంటే అతను అలవాట్లు మానుకుంటాడు.  నువ్వు  మాత్రం తొందర పడకు. అతనికి ఎలా ఉంటే ఇష్టమో గ్రహించి ఆ ప్రకారం నడుచుకో. మొగుణ్ని కొంగున ముడేసుకునే తెలివితేటలు నేర్చుకో” అంది.
సాటి ఆడదేకదాని అత్తగారితో ప్రస్తావిస్తే ”ఇదేమన్నా కొత్త సంగతా. మేమూ చెప్పిచూశాం. నీతులు చెపితే ఇంట్లోంచే వెళ్లిపోతానన్నాడు. నీకెందుకు గమ్మునుండు. ఎన్నాళ్లు తిరుగుతాడో చూద్దాం. పెళ్లయితే ఇంటిపట్టునే ఉంటాడేమోనని పెళ్లి చేశాం. ఏం లాభం లేకపోయింది. ఇక్కడ నీకేం తక్కువయింది. తినడానికి తిండి ఉంది. ఉండడానికి లంకంత ఇల్లుంది. ఎట్లాగూ ఉద్యోగం చేస్తున్నావు, పొద్దుపోదని బాధలేదు” అంది. ఇంకేం చేయను, ఆయన ప్రవర్తన నిజంగా దినదిన గండమే. రాత్రిళ్లు బ్లూఫిల్మ్‌లు చూస్తూ కూర్చుంటాడు. అతను లేచి నిద్రపోనంతవరకు నేనూ పడుకోకూడదు. లేదంటే వాయింపే. సీరియస్‌గా ఉన్నప్పుడు సీరియస్‌గా ఉండాలి. నవ్వినప్పుడు నవ్వాలి. అతను తిరుగుబోతని తెలిసినా ఎప్పటికప్పుడు ఏ కొత్త విషయమో తెలిసినప్పుడు బాధపడకుండా ఉండలేకపోతున్నాను. నేను నిలదీస్తే ఇంట్లో యుద్ధం, నేను మాట్లాడటం మానేయటం, మళ్లీ ఏదో సందర్భంలో రాజీ పడటం మామూలయింది. మొన్నటికి మొన్న ఊరికెనే అతని సెల్‌ తీశాను. చూస్తే వేరే అమ్మాయిలతో సిగ్గులేకుండా దిగిన ఫోటోలు… స్మిత గొంతులో సిగ్గు, దుఃఖం, అవమానం అన్నీ కలగలిశాయి. మనసు మండిపోయి ఏమిటిదని నిలదీశాను. అంతే నా ఇష్టమంటూ నా చెంప ఛెళ్లుమనిపించాడు. ఎప్పుడూ అమ్మా, నాన్న నామీద ఒక్కసారి కూడా చేయిచేసుకోలేదు. అలాటిది.. శారీరక గాయం కన్నా మానసికగాయం ఎంత బలమైందో స్మిత గొంతులో తెలుస్తోంది. అత్తగారు పరుగున వచ్చి ”అసలు వాడి సెల్‌ ఎవరు చూడమన్నారే నిన్ను” అంటూ నానెత్తిన మొట్టింది. తప్పు తన కొడుకుదయినా తనేం చేయలేకపోయినా, కనీసం మాటమాత్రం సానుభూతికూడా నాకు చూపకపోగా ఇంకా నామీదే దండ్రయాత్ర. నామీద ఏదో హక్కునట్లు మొట్టటం కూడా. ఇంక నాకు పిచ్చి ఆవేశం వచ్చింది. ఆ ఫోటోలోని అమ్మాయినే కడిగేయాలి అనుకొని, ఫోన్‌ నెంబర్‌ చూసి, నా సెల్‌నుంచే ఫోన్‌చేసి నోటికొచ్చినట్లు తిట్టాను. అంతే. అతనొచ్చి నా సెల్‌ లాక్కుని, సిమ్‌ ముక్కలు చేసి సెల్‌ పగలగొట్టాడు. ఇంక నాకు విరక్తి వచ్చింది. ఎందుకు నేనక్కడ పడి ఉండటం. ఎవరి కోసం? మారే ప్రయత్నం కొంచెం కూడా చేయని ఆ మనిషికోసం నేను నిరీక్షించటంలో అర్థం ఏముంది? అందుకే అమ్మా వాళ్లకు ఇంక వచ్చేస్తానని చెప్పా” ఆగింది స్మిత.
”ఇంత బాధను దిగమింగుతూ ఇన్నాళ్లు ఎలా ఉన్నావమ్మా. నీకు చదువుంది, ఉద్యోగం ఉంది. విడాకులిచ్చేసి కొత్త జీవితం మొదలుపెట్టు. పెళ్లే జీవితం కాదు. పెళ్లి జీవితంలో ఓ భాగం మాత్రమే. నీ అభిరుచికి అనుగుణంగా బతుకు. అన్ని విధాల మంచి వ్యక్తి తారసపడితే మళ్లీ పెళ్లి గురించి ఆలోచించుకోవచ్చు. ముందు ఆ గృహహింస నుంచి, మానసిక చిత్రవధనుంచి బయట పడు” చెప్పింది సుమతి.
స్మిత ఆశ్చర్యపోయింది. బామ్మ పాతకాలపు మనిషనుకుంది. కానీ అమ్మ కన్నా ఎంత మెరుగ్గా ఆలోచించింది, అమ్మ ఇవ్వని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నాలుగు మాటల్లో ఇచ్చేసింది. ”బామ్మా! కనీసం నువ్వయినా నా మనసును అర్థం చేసుకున్నావు, నీకు థ్యాంక్స్‌ చెప్పాలి. మరి అమ్మా, నాన్నతో మాట్లాడేటప్పుడు నా తరపున మాట్లాడుతావా” అడిగింది స్మిత.
”తప్పకుండా. ముందు మీ నాన్నతో మాట్లాడుతా. నువ్వింక లేచి ఫ్రెష్‌ అవ్వు. ఆ పీడకలలాంటి జీవితం గురించి మరిచిపో” చెప్పింది సుమతి.
ఆ రాత్రి కొడుకుతో స్మిత విషయం ప్రస్తావించింది. మహేష్‌ ”సునంద అక్కడుంటేనే గౌరవమంటోంది…” నాన్చాడు.
”మహేష్‌! నీకు నీ బాల్యం గుర్తుందా. నేను ఎంత బాధపడేదాన్నో నీకు బాగానే అర్థమయ్యేది. పెద్దయ్యాక నువ్వు నా దగ్గరే ఉందూగాని” అని నా కళ్లు తుడిచినపుడు నాకు ఎంతో ఓదార్పుగా ఉండేది. ఒక్కసారి గతం గుర్తుచేసుకుంటే స్మిత బాధ కూడా నీకు అర్థమవుతుంది” అంది సుమతి.
మహేష్‌కు గతం కళ్లముందు కదలాడింది. బయట అందరూ మీనాన్నే ఇద్దర్ని కట్టుకుంటే నువ్వేంట్రా అమ్మాయిల వైపే చూడవు? కృష్ణయ్యకు రామయ్య పుట్టాడురోయ్‌. అవున్రా మీ ఇంట్లో గొడవలేం ఉండవా? అంటూ రకరకాల ప్రశ్నలు. నిస్తేజంగా ఎప్పుడు చూసినా పనిలో మునిగితేలే అమ్మ… చాలా బాధనపించేది. పిన్ని మీద అంతులేని కోపం వచ్చేది. కానీ ఆమె ఆదరణగా పలకరించగానే తన గొంతు మూసుకుపోయేది. నిజమే. స్మిత జీవితాన్ని అలా నరకంలోకి తోయటం తప్పు, తప్పు… అంతరాత్మ హెచ్చరించింది.
”అమ్మా! ఈ విషయంలో సునందతో గట్టిగానే మాట్లాడుతా. అయినా స్మిత చిన్నపిల్లకాదుగా. అది విడిపోవాలని నిర్ణయించుకుంటే నేను అడ్డుచెప్పను” అన్నాడు.
”థ్యాంక్యూ డేడీ” ఒక్క ఉదుటున లోపలికి వచ్చింది స్మిత.
మహేష్‌ ఆశ్చర్యపోయాడు.
”అవును డేడీ. మీ మాటలన్నీ విన్నాను. ఆ జీవితం నాకొద్దు. అమ్మ ఒప్పు కున్నా, ఒప్పుకోక పోయినా సరే. కృత్రిమ సమాజ గౌరవం కోసం నేనా నరకంలో పడి ఉండలేను. నా బాధనర్థం చేసుకున్న బామ్మనే నా వెంట తీసుకెళతా. వేరే ఇల్లు చూసుకుంటా. అతడి చేతిలో మరెవరూ మోసపోకుండా తగిన బుద్ధి చెపుతా” గబగబా అంది స్మిత.
స్మిత వదనంలో కొత్త కాంతి, ఆత్మ విశ్వాసం తొంగిచూశాయి. ఆమె వైపు సుమతి, మహేష్‌ సంభ్రమంగా చూస్తుండి పోయారు.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

5 Responses to ‘స్మిత’ పజ్ఞ్రత

  1. ari sitaramayya says:

    కథ బాగుంది.

  2. Himabindu.S says:

    శ్యామల గారు,

    ఇలాగైనా మీ కథ చదివినందుకు ఆనందముగా ఉన్నది. కధ బాగున్నది.

    హిమబిందు

  3. కథ బాగుంది.స్మిత వెదన కొంత ఇన్కా వస్తె బాగుందెది.

  4. knmurthy says:

    బాగా రాసారు

  5. sivalakshmi says:

    సుమతి తో కాక మరో మహిళ తో -ఇద్దరి జీవితాలతో ఆడుకున్న పురుషుడు.ఒకరి వెనకాల ఒకరికి చెప్తూ ఇద్దరు స్త్రీలనూ బాధ పెట్టిన సమాజం-దీనికంతకూ మూలాలెక్కడున్నాయో స్త్రీలందరూ ఆలోచించాలి.
    ఆధునికత వేష భాషల్లో కాకుండా ఆలోచన ల్లో ఉండాలని తన జీవితం ద్వారా అనుభవం పొందిన సుమతి సూచించిన పరిష్కారం తో కధ నడపడం బాగుంది.

Leave a Reply to vasantha kumari Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.