మల్లు స్వరాజ్యం మనోగతం

ఇంటర్వ్యూ సేకరణ: కొండవీటి సత్యవతి, హిమజ
జూలై 13న సత్యవతి ఫోన్‌ చేశారు. మల్లు స్వరాజ్యం గారు ఇక్కడికి దగ్గర్లోనే ఉన్నారు. వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం వస్తారా! అని. తప్పకుండా వస్తానని చెప్పాను. అలనాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ధీరవనితగా ఆమె గురించి కొంత తెలుసు కానీ ఆమెతో ముఖాముఖిగా మాట్లాడటం అంటే ఆ అనుభూతి వేరు. సత్యవతి గారికి మనసులో ధన్యవాదాలు తెలుపుకుంటూనే బయలుదేరాను.        సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి దగ్గరగా ఉన్న మోటూరు ఉదయం భవనంలో ఆమె నివాసం ఉంటున్నారు. నేను వెళ్ళేసరికి సత్యవతి అక్కడికి చేరుకుని ఆవిడతో మాటామంతీ ప్రారంభించారు. అప్పటికే స్వరాజ్యం గారు  గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. హైదరాబాద్‌ సంస్ధానంలో ఫ్యూడల్‌ జమిందార్ల గురించి, రజాకార్ల రాక్షసత్వం గురించి 78 ఏళ్ళ వయసులో ఆవేశంగా, ఉద్రేకంగా ఆమె చెప్తూ వుంటే రాసుకోవడం మాకు కష్టమైపోయింది. అప్పటి ఉద్యమ చరిత్ర లైవ్‌లో చూస్తున్నట్లే అనిపించింది. తెలంగాణా పోరాట చరిత్ర, తన జ్ఞాపకాలు, తన అనుభవాలు భావోద్విగ్నతతో ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే భూమిక పాఠకులకోసం.
దేశంలో స్వాతంత్య్ర పోరాటం ఉధృతంగా సాగి విజయం సాధించబోతున్న రోజులవి. వీటన్నింటి ప్రభావం తెలంగాణాలో మాపై కూడా పడింది. తెలంగాణాలో నిజాం రాచరికం కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్ధ, ప్రజలు భూస్వాముల నిర్భంధంలో గ్రామాలకు గ్రామాలే వెట్టి, బానిస చాకిరీతో విలవిలలాడుతున్న పరిస్ధితి. దీని నుండి విముక్తి కావడానికి మేధావులు, సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రజల కాంక్షకు అప్పటికే ఏర్పడి వున్న ఆంధ్ర మహాసభను వేదికగా చేసుకుని (కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం వున్నది గనుక) కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా, రైతులపై పన్ను భారానికి వ్యతిరేకంగా, వాక్‌ స్వాతంత్య్రం కోసం సభలు, సమావేశాలు చట్టపరంగానే పోరాటాలకు ప్రయత్నిస్తున్నారు. ఆ రోజుల్లో మా అన్నయ్య భీమిరెడ్డి నర్సింహారెడ్డి పదవ తరగతి చదవటం కోసం హైదరాబాదులో వుండేవాడు. మా మేమమామ గారి కొడుకు, మేనత్త కొడుకు ఇద్దరూ బొంబాయిలో జరుగుతున్న సత్యాగ్రహంలో పాల్గొని వచ్చారు. హైదరాబాద్‌లో ఆంధ్ర మహాసభ కార్యక్రమాలు రావి నారాయణరెడ్డి, మగ్దూమ్‌ మొహియుద్దీన్‌ మొదలగువారి ఆధ్వర్యంలో నడుస్తున్నవి. హైదరాబాద్‌లో చదువుకుంటున్న మా అన్నయ్య, తనతోటి  విద్యార్ధులు ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కనుక తెలంగాణా విముక్తి కోసం పోరాడాలనే ఆలోచనతో ఇంటికి చేరాడు. అప్పటికే సూర్యాపేటలో ధర్మభిక్షం గారు విద్యార్ధులకు భోజన వసతులతో కూడిన హాస్టలు ఏర్పాటు చేసి నల్గొండ జిల్లా ఆంధ్ర మహాసభకు నాయకుడిగా వుండి విద్యార్ధులకు దేశభక్తిని బోధిస్తున్నాడు. ఇటు విజయవాడ వైపు నుండి కమ్యూనిస్టు పార్టీ సాహిత్యం విద్యార్ధుల ద్వారా గ్రామాలకు చేరి ఆంధ్ర మహాసభ కార్యక్రమాలకు ఊతమిస్తున్నది. గోర్కి రచించిన ‘అమ్మ’ నవల  మా యింటికి చేరింది. మా అన్నయ్య ఆ పుస్తకం నాకిచ్చి చదవమని చెప్పాడు. అప్పటికి నాకు 13 సంవత్సరాలు. ఆ గ్రామంలో మా నాన్న, చిన్నాన్నలు భూస్వాములు. ఆ గ్రామంపై వారిదే సర్వాధికారం. భూస్వాముల దౌర్జన్య పీడనా పద్ధతి ఆ గ్రామంపై కూడా కొనసాగుతూనే ఉంది. మా నాన్న నా ఎనిమిదవ ఏటనే చనిపోయారు. మా అన్నయ్యే మా ఇంటికి యజమాని. ఈ ఆంధ్ర మహాసభ కార్యక్రమాన్ని మా గ్రామంలో అమలు చేయటానికి ఆయన పూనుకున్నాడు. హరిజనులు, గొల్లలు, గిరిజనులు, గౌడలు, వీరందరినీ రహస్యంగా మా ఇంట్లో సమావేశపరిచి వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా వ్యవసాయ పనులను నిలిపివేయమని బోధించాడు. ఆ సమావేంలో నేను, మా అక్క శశిరేఖ పాల్గొన్నాము. ఆ సమావేశం మాకు ఉత్తేజాన్నిచ్చింది. అదే సందర్భాన ‘అమ్మ’ నవలను భాగవతాన్ని చదివినట్లుగా చదివి మా అమ్మకు కూడా వినిపించేవారం. ఈ విషయాలు పోలీసులకు తెలిసి మా అన్నను అరెస్టు చేయటానికి తెల్లవారుఝామున వచ్చారు.  ఆ రోజుల్లో పోలీసులు అరెస్టు చేయటమంటే అందులోనూ ఒక భూస్వామి కుటుంబంలోని వ్యక్తిని అరెస్టు చేయటమంటే అప్రతిష్టగా భావించేవారు. మా అమ్మ మానవతావాది. ‘అమ్మ’ నవల యొక్క ప్రభావము ఆమె మీద చాలా పడింది. పైగా గాంధీ మహాత్ముని గురించి కూడా మంచిఅభిప్రాయం ఉంది. అందుకని తన కొడుకు చేసేపని తప్పుకాదు అని భావించింది. ‘పేదలకు సహాయం చేయటమే కదా నా కొడుకుచేసిన పని. నా కొడుకు దొంగ కాదు మీరు అరెస్టు చేయటానికి. గాంధీ మహాత్ముని లాగానే దేశ భక్తుడు. మీరు అరెస్టు చేయవలసిన అవసరం లేదు. అందునా రాత్రిపూట వచ్చారు. నిజాం రాజు చట్టంలో రాత్రిపూట ఆడవారు వున్న ఇంటిని సోదా చేసే వీలులేదు. కాబట్టి వచ్చిన దారినే వెళ్ళిపొండి’ అని తలుపు పక్కనున్న కిటికీ గుండా  సమాధానం చెప్పింది. ఈ లోగా మాఅన్నయ్య ఇంటివెనుక నుండి తప్పించుకుని వెళ్ళాడు. పోలీసులు తెల్లవార్లూ గుమ్మం బయటనే కూర్చుని తెల్లవారిన తరువాత ఇంటిని సోదాచేసి వెళ్ళారు.
తరువాత అన్నయ్య వెళ్తూ వెళ్తూ సమ్మెను జయప్రదం చేయమని  నాతో చెప్పి వెళ్ళాడు. నేను ఆ సమ్మె కొరకు వాడవాడా తిరిగి వెట్టి చాకిరికి వ్యతిరేకంగా సమ్మె చేయమని ప్రచారం చేశాను.  ఒక భూస్వామి బిడ్డ, దొరసాని అయినామె తమ యింటికి వచ్చి తమ బాగు కోసం చెబుతుండడం చూసి వారు ఎంతో సంతోషపడ్డారు. కానీ ఆ రాత్రి మా ఇంటికి పోలీసులు రావడం, గ్రామంలో భూస్వాములు బెదిరించడం వల్ల భయపడ్డారు. ‘అమ్మో! భయం. మా వల్లకాదు. మేము సమ్మె చేయలేము’ అన్నారు. నేను స్వయంగా ఆలోచించి సమ్మెను ఎలా జయప్రదం చేయాలా? అనుకుని  కూలీలు పొలాలకు పోయే దారిలో  అడ్డంగా పడుకున్నాను. కూలీలు(అందరూ మహిళలే) నన్ను దాటిపోలేరు అని నా భావన. (దొరబ్డిను కదా!) నేను అనుకున్నట్టే వాళ్ళు నన్ను దాటి పోలేక నన్ను తప్పుకోమని బ్రతిమలాడారు. నేను వారికి ఒక ఉపాయం చెప్పాను. ఏమంటే మీరు గుంపులుగా పోకుండా ఎవరికి వారుగా విడివిడిగా వెళ్ళిపోమని చెప్పాను. వారు ఎక్కడి వారక్కడ తప్పించుకున్నారు. తెల్లవారి కూలీల కులపెద్దలను భూస్వాములు పిలిచి పంచాయితీ పెట్టారు. కూలీల తరుపున పంచాయితీ స్ధలానికి నేను ప్రత్యక్షమయ్యాను. ఊహించని పరిణామానికి భూస్వాములు నన్ను, వాళ్ళనీ కూడా హెచ్చరించి వదిలివేశారు. ఇదే నా రాజకీయ జీవితానికి ప్రారంభం. దీని తరువాత విజయవాడ రాజకీయ క్లాసుకు నా 13వ ఏట వెళ్ళాను. (అన్నయ్య పంపాడు)
నా చరిత్ర చెప్పమని మీరు అడిగారు. వీర తెలంగాణా రైతాంగ పోరాటం నుండి విడదీసి ఏ ఒక్కరి చరిత్రను చెప్పలేనేమో! కానీ కొన్ని సంఘటనలు చెప్పటానికి ప్రయత్నిస్తాను.
చాకలి ఐలమ్మ అనే ఆమె తన భూమి కోసం పోరాడి సాధించి విశ్నూరు జమిందారు అయిన రామచంద్రారెడ్డిని ఎదిరించి భూమి పోరాటాలకు నాంది పలికింది. ఈమె చరిత్ర వివరాలు మీకు తెలిసేవుంటుంది. ఈ సందర్భంలో ఈమెను విశ్నూరు భూస్వామి ”గడీ”కి పట్టి తెప్పించి చెట్టుకు కట్టి భూమి వదలకుంటే కాల్చివేస్తానని బెదిరించాడు. ఆమె తెలిసో తెలియకో ఆనాటి దొరలకు ఒక హెచ్చరిక చేసింది. అదేమంటే? ”నీవు 30 ఊర్లలో వేల ఎకరాల భూమిని ఆక్రమించి దుర్మార్గ పాలన సాగిస్తున్నావు. నీకు ఉన్నది ఒక్క కొడుకు. ఇంక చాలదా? నాకున్నది నాలుగెకరాల భూమి. నాకు నలుగురు కొడుకులున్నారు. నా కొంగున ఆంధ్ర మహాసభ సంఘం చిట్టీ ఉంది. నా నలుగురు కొడుకులు, సంఘమూ కలిసి నువ్వు ఆక్రమిం చిన  30 గ్రామాల భూమిని ప్రజలకు పంచిపెడతారు. నిన్ను, నీ వంశాన్ని జనం తిరగబడి నాశనం చేస్తారు. నీ గడిలో గడ్డి మొలుస్తది” అని.  ఇది భూస్వాములకు ఒక హెచ్చరిక, ప్రజలకు ఒక సందేశం అయ్యింది.ఆమె అన్నట్లే ప్రజలు, సంఘం వెట్టి చాకిరిని ఎగరగొట్టి భూ పంపకం కొనసాగించి భూస్వాముల పెత్తనాన్ని ప్రజలు కూల దోశారు. విశ్నూరు గడీతో పాటు అనేక గడీలలో గడ్డి మొలిచింది.
అలాగే దొడ్డి కొమరయ్య చరిత్ర. ఆనాడు భూస్వాములు వ్యవసాయ భూమినే కాక ప్రభుత్వ భూములు గ్రామ పొలిమేర (సరిహద్దు)లో పోరంబోకు, బంజరు భూములను కూడా ఆక్రమించుకుని హరిజన, గిరిజన, గొల్ల జనాల యొక్క పశువులను మేపుకున్నదానికి నిర్భంధంగా పుల్లర, కౌలు (డబ్బు రూపంలో) వసూలు చేసేవారు. పొయ్యిలో కట్టెలకు గాని, ఇల్లు అలకడానికి ఎర్రమట్టి తెచ్చుకోవడానికి కూడా సామాన్య ప్రజల నుండి పన్ను వసూలు చేసేవారు. పైగా గొర్రెలను, మేకలను (వెట్టిగొర్రె) ఆవు పాలు వారి ఇండ్లల్లో కార్యాలయినపుడు నిర్బంధంగా ఇవ్వవలసి వచ్చేది. కల్లుగీత కార్మికులకు తాటి, ఈత చెట్లపై హక్కులేదు. దొరలకు ఉచితంగా కల్లు పొయ్యాలి. దొర  దయాబిక్షపై పన్నుకట్టి చెట్లను గీసుకోవలసి వచ్చేది. కార్యాలు, పండుగలకు గీత కార్మికుల ఆడవారు దొరల ఇండ్లలో కల్లు మొయ్యాలి. విశ్నూరు దొర తల్లి మరీ దౌర్జన్యపరురాలు. కడివెండ గ్రామంలోని గడీలో ఆమె నివాసం. ఈమె పేరు చెబితేనే పసిపిల్లలు పాలు తాగరని పేరుండేది. ఈ నిర్భంధానికి వ్యతిరేకంగా నిరసన ఊరేగింపులు జరపమని, వెట్టిచాకిరీని నిరాకరించమని ఆంధ్రమహాసభ పిలుపునిచ్చింది. ఈ సందర్భాన అనేక గ్రామాలలో ఊరేగింపులు జరిగాయి. కడివెండిలో కూడా గ్రామ ప్రజలంతా దొరసాని దౌర్జన్యాన్ని నిరసిస్తూ ఊరేగింపు చేశారు. ఊరేగింపు ”గడి” ముందుకు వచ్చేసరికి దొరసాని గూండా లతో కాల్పులు కాల్పించింది. ఈ కాల్పుల్లో ”ఆంధ్రమహా సభకు.జై”అంటూ దొడ్డి కొమరయ్య నేలకొరిగాడు. ఆ ఊరేగింపులో గ్రామ ప్రజలందరూ పాల్గొన్నారు. ప్రజలు బెదరలేదు. పైగా ఈ వార్త తెలిసి చుట్టు ప్రక్క గ్రామాల ప్రజలు ఆంధ్రమహాసభ జెండా (ఎర్రజెండా) చేతబూని తండోప తండాలుగా కడివెండ గ్రామాన్ని చుట్టుముట్టారు. గ్రామ గ్రామాన భూస్వామ్య గడీలను ధ్వంస చేయాలని పట్టుపట్టి దూసుకుపోయారు. పోలీసులు చేరారు. పోలీసులను ఎదిరించటానికి ప్రజలు సిద్ధపడ్డారు. హైదరాబాదు నుండి ఆంధ్రమహాసభ నాయకులు,నల్గొండ జిల్లా  నాయకులు ఆ ప్రజా సమూహాన్ని శాంతించమని భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించు కుందామని చెప్పి వారిని నివారించారు. ఆ సమయంలో నేను అక్కడే ప్రజలతో పాటు వున్నాను. ఇలాంటి పోరాటాల వల్ల మేమెంతో స్ఫూర్తిని పొందాము. స్ఫూర్తిని పొందటమే గాక ఈ ఘటనలు చూసిన నేను భూస్వాముల భరతం పట్టాలి అనే ఆవేశానికి లోనై భూస్వాముల దౌర్జన్యాన్ని ఎండగడుతూ ప్రజల్ని ఉత్తేజపరచటానికి ఉయ్యాల పాటలు రూపంలో నేనే కవిత్వం అల్లి దాదాపు 2 గంటల సమయం ఏకబిగిన పాడదగిన పాటను పాడుకుంటూ ఎన్నో గ్రామాలు, తండాలు కాలినడకన తిరిగాను. ఆ పాట విని ఆయా ప్రాంతాల వారు కూడా స్ఫూర్తితో వారు అనుభవిస్తున్న  కష్టాలను  ఉయ్యాల పాట రూపంలో పాడుకునేవారు.ఆ ప్రాంతంలో వున్న ఆంధ్రమహాసభ నాయకత్వం, ప్రజలు స్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో పోగైన జనంతో సభలు నిర్వహించేవాళ్ళం. ఈ సభల్లో నేను కూడా మాట్లాడేదాన్ని. ఇలానే తెలంగాణా ప్రజలు నన్ను ఉపన్యాసకురాలిని చేశారు. అప్పుడు ఆంధ్రమహాసభ కమూనిస్టు పార్టీ నాయకత్వంలో వుంది. ప్రజల ఆకాంక్ష ప్రకారం దున్నేవాడికి భూమి, గీసేవానికే చెట్టు, కౌలుదార్లకు పట్టాహక్కు, భూస్వామ్య విధానం రద్దు, సామాజికంగా అణచివేయబడ్డ ప్రజల ఆధ్వర్యంలో గ్రామ రాజ్యాల నిర్మాణం, భూపంపకం చేయాలని పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమంలో సూర్యాపేట తాలూకాలో ఒక ఏరియాలో బాధ్యతలు నిర్వహించటం జరిగింది. తెలంగాణా ప్రజలు సామూహికంగా ఏకోన్ముఖంగా కదిలి వేలాది గ్రామాలలో భూస్వాములను తరిమి భూమి పంపకాలు చేసి గ్రామరాజ్యాలు ఏర్పాటుచేయడం ఉధృతంగా సాగింది.  వాటిని అణచివేయటానికి నిజాం రాజు  మిలటరీ బలగాలతో రజాకార్లను సృష్టించి గ్రామాలపై రాక్షస దాడులకు పూనుకున్నాడు. గ్రామాలను తగులపెట్టటం, సామూహిక అత్యాచారాలు, చిత్రహింసలు, నిర్బంధాలతో రాక్షస హింస చేశాడు. దీని నుండి రక్షించుకొనటానికి గ్రామ దళాలను ఏర్పాటు చేసి  ఆయుధాలు సమీకరించి ప్రతిఘటించాలని పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రజలు చేతికందిన ఆయుధాలు కర్రలు, కత్తులు, వడిసాలను తీసుకుని గ్రామ పొలి మేరలో కాపలాలు పెట్టి నిజాం  ర్యా పోలీసులను, మిలటరీలను,  రజాకార్లను తరిమారు. పాత సూర్యాపేట మల్లారెడ్డి గూడెం, మాచిరెడ్డిపల్లి, ఆకునూరు  గ్రామాలను రజాకార్లు తగులబెట్టి మహిళలను సామూహిక అత్యాచారాలు చేసి చిత్రహింసలు పెట్టారు. ఈ సంఘటనలను పేపర్లలో ఖండించారు. ఢిల్లీ నుండి కాంగ్రెసు వారు విచారణ నిమిత్తమై సరోజినీ నాయుడు కూతురైన పద్మజా నాయుడిని ఆ గ్రామాలకు పంపారు. ఈ సందర్భంలో  కమ్యూనిస్టు పార్టీ ఆదేశం ప్రకారం ఆ గ్రామాలను, చుట్టు గ్రామాలను సమీకరించి బాధితులకు మద్దతుగా సభ జరిపాం. పద్మజానాయుడు రజాకార్ల రాక్షస కృత్యాన్ని ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. తర్వాత తెలంగాణా పోరాటంలో పాల్గొన్న ప్రముఖుల గురించి రాసిన ”హూ ఈజ్‌ హూ” బుక్కులో నాపేరును, పై గ్రామాల ఘటనలను వ్రాశారు.   ఇవి రోజులకొద్దీ మిలటరీని నిలేసి పోరాడినాయి.  పోలీసుల కాల్పుల్లో పటేల్‌ మట్టారెడ్డి అనంతరెడ్డి, మల్లారెడ్డి గూడెంలో తిరుపమ్మ,  మరో ఇద్దరు అమరులయ్యారు.ఈ పోరాటాలలో పాల్గొనే గొప్ప అవకాశం నాకు దక్కింది.  మొత్తం తెలంగాణా పోరాటం ప్రపంచాన్ని ఆకర్షించిన పోరాటం. పదిలక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచి, 4 వేల గ్రామరాజ్యాలను ఏర్పాటు చేసి, స్వేచ్ఛాయుత పరిపాలనతోపాటు భూపుత్రులుగా భూమిలోని పంటను స్వేచ్ఛగా అనుభవించగలిగారు. అదొక స్వర్ణయుగంగా ప్రజలు భావించారు.
గ్రామ రక్షణ దళాలుగా ఏర్పడి గ్రామాలను రక్షించు కున్నారు. నిజాం మిలటరీ క్యాంపులపై దాడులు చేయటానికి, గ్రామాలను రక్షించుకోవటానికి అదనపు దళ నిర్మాణం, ఆయుధాలు అవసరమైనాయి, పోరాటానికి మద్దతుగా  అయుధాల సమీకరణకౖెె ఆంధ్ర ప్రజల ఆర్ధిక సహకారాన్ని సమాకరించాలని పార్టీ నిర్ణయించింది. అందుకు ఉపన్యాసాల నిమిత్తమై  రావి నారాయణరెడ్డి, బద్దం యల్లారెడ్డి, రపీ అహ్మద్‌  అనే విద్యార్ధి నాయకులు  నన్ను నియమించారు. శ్రీకాకుళం మొదలుకొని మద్రాసు వరకు చిన్నా, పెద్దా బహిరంగ సభలలో తెలంగాణా పోరాటానికి మద్దతివ్వమని కోరుతూ చివరంటా పాల్గొని ప్రజలచే ”విశాలాంధ్ర ముద్దుబిడ్డ” అని అనిపించుకున్నాను. ఈ సభలకు దాదాపు మూడు  నాలుగు నెలలు పట్టింది. ఆంధ్ర ప్రజల మద్దతు తెలంగాణా పోరాటానికి సంపూర్ణంగా దొరికింది. తరువాత కాలంలో రక్షణ, మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అక్కడి వారిని 400 మందిని కాల్చివేసింది.
గ్రామ రాజ్యాల పరిపాలన, గ్రామ రక్షణ మహిళా దళాల ఏర్పాటు, గ్రామ పరిపాలన పంచాయితీ కమిటీలు, భూపంపకం, భూమి రక్షణ కోసం కమిటీలు ఏర్పరిచాం. బాల సంఘాల  నిర్మాణం, వైద్యం కోసం శిక్షణ ఈ కార్యక్రమంలో బాధ్యతలు నిర్వహించాను. దీనికి తోడు క్యాంపులపై దాడుల సందర్భంగా ప్రజల్ని సమీకరించి పాల్గొనటం కూడా బాధ్యతగా చేశాను.
తర్వాత గిరిజన ప్రాంతాల ఉత్తర అడవుల్లోకి విస్తరించి ఆ ప్రజలను చైతన్య పరచి భూమి పంపకం,గిరిజన ప్రజలపై దోపిడీని అరికట్టడం మొదలగు పోరాట కార్యక్రమాన్ని అమలు చేయుటకు పార్టీ పూనుకున్నది. అందులో కూడా ఉత్తర ఏరియా కమిటీలో నేను, మల్లు నర్శింహారెడ్డి గారు, ఓంకార్‌ గారు, ముకుందరావు మొదలగు వారందరం కమిటీగా ఏర్పడి కమిటీకి సెక్రటరీగా వుండి ప్రధాన బాధ్యతను నిర్వహించాను. ఏమైనా ఈ పోరాటం భూస్వామ్య వ్యవస్థను కూకటివేళ్లతో కదిలించింది. ఆ దెబ్బకు  చచ్చి చతికిలపడింది. ఇది కమ్యూనిస్టులచే నడపబడింది కనుకనే సాధ్యమైంది. ఈ పోరాటం ప్రపంచాన్ని ఆకర్షించింది. కేరళ, బెంగాల్‌, త్రిపురకు స్ఫూర్తినిచ్చింది. నేటికీ తెలంగాణా ప్రజలలో యువతలో దోపిడీ వ్యతిరేక భావజాలాన్ని పురికొల్పుతూనే వుంది. భారతదేశ ప్రజాతంత్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. కనుకనే భారత ప్రభుత్వం కౌలుదారీ చట్టం, భూపరిమితి చట్టం, సంస్థానాల రద్దు, భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు చేయవలసి వచ్చింది. ఫలితమే కేరళ, బెంగాల్‌, త్రిపుర ప్రజలు స్ఫూర్తినొంది వామపక్ష ప్రభుత్వాలను ఎన్నుకొని భూపంపకం ద్వారా ప్రజాస్వామ్య పంచాయితీ రాజ్యాలను ఏర్పాటు చేసి ఈ దేశ స్వాతంత్య్ర ఫలితాలను కొంతలో కొంత  ప్రజలకు అందించారు. కానీ యూనియన్‌  సైన్యాలు ఇక్కడికి ప్రవేశించి తెలంగాణా ప్రజలపై నిర్భంధాలు కొనసాగించి తిరిగి భూస్వాములను ప్రవేశపెట్టి వీర తెలంగాణా పోరాట ఫలితాలను తెలంగాణా ప్రజలు స్వేచ్ఛగా అనుభవించకుండా కాంగ్రెస్‌ పరిపాలకులు ప్రజలకు ద్రోహం చేశారు. కమ్యూనిస్టులు అధికారంలోకి వస్తారని భయపడి తీవ్ర అణచివేతకు పూనుకున్నారు. ఉదా:- ఒక్క నల్గొండ జిల్లాలోనే పోరాట ఉపసంహరణ తరువాత 40 మందిని చంపివేశారు. ఖమ్మం, వరంగల్‌, జిల్లాలో కూడా ఇలాగే జరిగింది. బెంగాల్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి ప్రజలను ఊచకోత కోశారు. కేరళ వామపక్ష ప్రభుత్వాన్ని రద్దు చేశారు.
ఈ సమయంలో నేను  ఎంతో వేదన చెందాను. ఏమైనా తిరిగి ప్రజల్ని సమీకరించి వాళ్ళ హక్కుల కోసం పోరాడటం తప్ప మరో మార్గం లేకుండాపోయింది. తరువాత  ఇందిరా గాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది.  కమూనిస్టు నాయకత్వాన్ని, మానికొండ సూర్యావతితో సహా అరెస్టు చేశారు. పౌరహక్కుల సంఘం ప్రారంభించాం. ఈ పౌరహక్కుల ఉద్యమంలో కూడా చంటిబిడ్డని చంనేసుకుని  మోటూరు ఉదయం, అన్నే అనసూయతో పాటు ఉద్యమంలో పాల్గొన్నాను. సభలు, ఊరేగింపులు నిర్వహించాం. తరువాత రైతు సంఘం రాష్ట్ర కమిటీలో వుండి రైతు ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఈ ఉద్యమంలో కూడా  భూమి పంపక రక్షణ పోరాటమే ప్రధానమైంది. భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా స్త్రీలపై అవమానాలకు, అరాచకాలకు వ్యతిరేకంగా మహిళల రక్షణ కోసం పోరాడవలసి వచ్చింది. ఈ క్రమంలోనే 1978లో నేను ఎంఎల్‌ఏ గా ఎన్నికయ్యాను.  హైదరాబాద్‌ నగర నడిబొడ్డులో ”రమేజాబీ”పై ఘోరమైన అత్యాచారం జరిగిందని నాకొక మిత్రుడు (కల్లు రామచంద్రారెడ్డి) సమాచారమందించాడు. నేను వెంటనే ఆ పోలీస్‌ స్టేషనుకు వెళ్ళాను. అప్పటికే అ్కడ జనం పోగై  జరిగిన ఘటనను ఖండిస్తున్నారు. నేను ప్రజలతో మమేకమై ఎస్‌ఐను ఎదిరించి రమీజాబీను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకునివెళ్ళి పరీక్ష చేయించాను. ఎంఎల్‌ఎగా ఎన్నికయిన తరువాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ఆ విషయాన్ని లేవనెత్తాను. ప్రతిపక్షాలు, పార్టీల తారతమ్యం లేకుండా మహిళా ఎమ్మెల్యేలు అందరూ ఏకమై చర్చలో పాల్గొని విచారణ కమిటీ వేసేవరకూ పట్టుపట్టాం. బహుశా అసెంబ్లీ చరిత్రలో ఒక మహిళపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ  అసెంబ్లీలో చర్చ జరగటం మొదటి సంఘటన అనుకుంటాను.  ఆంధ్రదేశంలో స్త్రీలపై అత్యాచారాలను ఖండిస్తూ  పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో అనేక సార్లు పాల్గొన్నాను. కేసును కోర్టుకు పంపారు. కోర్టులో జడ్డి ముందు నేను హాజరు కావల్సివచ్చింది. కోర్టులో పబ్లిక్‌ప్రాసిక్యూటర్‌ గారి అడ్డగోలు వాదనను ఖండించి   ఈ ఫ్యూడల్‌ భూస్వామ్య పెట్టుబడిదారులు, పోలీసులు సమాజంలో పేద స్త్రీలను ఎలా హింసిస్తున్నారో అనేక  దుర్మార్గాలను  వివరంగా జడ్జిగారి దృష్టికి తీసుకుని వచ్చి వివరించాను. నా వాదనలోని వాస్తవాలను గమనించి ఒక బుక్‌లో రికార్డు చేసారు (ఇంగ్లీషులో తీర్పు కాపీలో రికార్డు చేశారు). అది చదివిన మేధావులు కొంత మంది నాకు ఫోన్‌ చేసి అభినందించారు.
అప్పటిదాకా దేశంలో అనేక బూర్జువా మహిళా సంఘాలు మధ్య తరగతి మహిళల వరకే పరిమితమై వున్నవి. సంస్కరణ ఉద్యమాలుగా వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం మానికొండ సూర్యావతి గారి అధ్యక్షతన ఉన్నది. నేను, మోటూరు ఉదయం గారు, శ్రీకాకుళం సంపూర్ణమ్మ, కర్నూలు లక్షమ్మ, ప||గో||జిల్లా అల్లూరి మన్మోహిని (అమ్మాజి), పాలకొల్లు ప్రభావతి,  గుంటూరు పుతుంబాక భారతి, రమాదేవి, అంజమ్మ, ఒంగోలు తవనం సుబ్బాయమ్మ, మోటూరు ఉదయం గారి అమ్మాయి టాన్యా, నెల్లూరు బీబమ్మ, శ్రీకాకుళం కమలమ్మ మొదలగువారి ఆధ్వర్యంలో  రాష్ట్ర మహాసభ జరిపి సూర్యావతి గారిని అధ్యక్షురాలిగా ఎన్నుకోవటం  జరిగింది.
రాష్ట్ర మహిళా ఉద్యమంలో పేద వర్గాల మహిళల్ని సమీకరించి వాళ్ళ సమాన కూలి మొదలుకొని అనేక ఫ్యూడల్‌, భూస్వామ్య, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, సభలు, ఉద్యమాలు జరిపాం. ఈ క్రమంలోనే 1981లో ఆంధ్రప్రదేశ్‌  అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యాను. మహిళా ఉద్యమాన్ని బలోపేతం చేశాము. 1982లో మిర్యాలగూడలో 10,000 మందితో పెద్ద సభ జరిపి వీర తెలంగాణా పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీర వనిత చాకలి ఐలమ్మను సన్మానించాం. బహుశా ఐలమ్మను సన్మానించిన మొదటి, చివరి సభ అదే కావటం అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘానికే గర్వకారణం. తరువాత మహిళా సమస్యల పరిష్కారానికై 10 డిమాండ్లను రూపొందించిన పత్రంపై లక్ష సంతకాల సేకరణతో ఛలో హైదరాబాద్‌ పిలుపునిచ్చి అసెంబ్లీ  ముందునున్న గన్‌పార్క్‌లో  సభావేదిక పెట్టి ఆనాడు ముఖ్యమంత్రిగా వున్న ఎన్‌టి రామారావుని అసెంబ్లీ నుండి సభావేదికపైకి తీసుకువచ్చి 10 డిమాండ్ల కోరికల పత్రాన్ని సమర్పించాము. అందులో ముఖ్యమైనవి  పుట్టింట ఆస్తిలో వారసత్వ హక్కు, మహిళలకు భూమిపై యాజమాన్యపు హక్కు, ఉపాథి కల్పన, జిల్లాకి ఒకటి చొప్పున నర్శింగు ట్రైనింగు స్కూలు,  మాతా శిశు సంరక్షణా ప్రాంగణాలు, పేద మహిళలకు మరుగుదొడ్ల సౌకర్యం మొదలగునవి ముఖ్య డిమాండ్లు వున్నవి. 10 డిమాండ్లను సభాముఖంగా అంగీకరించి  అందులో 6 డిమాండ్లను అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని ఆస్తి వారసత్వ హక్కును రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి ఒక కమిటీ వేసి  ( ఆ కమిటీలో నేను వున్నాను) తీర్మానించి ముఖ్యమంత్రి పరిధిలో లేకున్నా కేంద్రాన్ని ఒప్పించి చట్టం చేశాడు. ఇది రాష్ట్ర మహిళా ఉద్యమానికే గర్వకారణం.  ముఖ్యమంత్రిగా వున్న ఎన్‌టిఆర్‌ ఆంధ్ర మహిళల మన్ననలను పొందారు.
ఈ విషయం ఇప్పుడు చెప్పటం సందర్భమే అనుకుంటా. 1978లో ఎంఎల్‌ఎగా ఎన్నిక అయ్యాను. నా ఎమ్మెల్యే ఎన్నికకు 25,000 రూ||లు ఖర్చు అయినవి. 10,000 రూ||లు సుందరయ్య గారు రాష్ట్ర సెంటరు నుండి కరపత్రాలు, పోస్టర్లు, తోరణాలు, జెండాలు, వేసి పంపించారు. ఇంకో 10,000లు జిల్లా పార్టీ ఫండ్సు ద్వారా వచ్చినయి. 3 మోటారు సైకిళ్ళ కిరాయి, మైకుల కిరాయిలు, సైకిల్‌ యాత్రలకు ఖర్చు అయినవి. నామినేషను రుసుము 600ల రూ||లు రాష్ట్ర మహిళా సంఘం తరుపున మోటూరు ఉదయం గారు వచ్చి ఇచ్చారు.
ఆనాటి పోరాటంలో నేను పోటీ చేసిన నియోజక వర్గం వీర తెలంగాణా రైతాంగ పోరాట కేంద్రమైన తుంగతుర్తి. ఈ నియోజక వర్గంలో 70 గ్రామాలున్నాయి. భూస్వాముల కేంద్రమైన ఎర్రపాడు ఇందులోనే వుంది. నాకు వ్యతిరేకంగా నిలబడ్డ అభ్యర్థి కాంగ్రెస్‌ ప్రతినిధిగా భూస్వామి అయిన ధన్నారెడ్డి శ్యామసుందరరెడ్డి. ఆ భూస్వామి ఆధీనంలో వున్న 10 గ్రామాలు కాంగ్రెస్‌ పార్టీ పేరుతో కమ్యూనిస్టు ఏజెంట్లను  పోలింగు బూత్‌ల దగ్గర వుండనీయకుండా చేసి రిగ్గింగులు చేసుకున్నారు. అయినా గానీ  ప్రజలు స్వచ్చంధంగా ఓట్లు వేసి గెలిపించారు. ఆ స్ఫూర్తితోనే నేను ఆ నియోజక వర్గానికి అంకితమై పనిచేశాను. రిగ్గింగు చేసిన ఆ గ్రామాల్లోనే భూస్వాములు గత పోరాటంలో పంచిన భూములను 900 ఎకరాల పట్టాలు వారి చేతిలో పెట్టుకుని ఆ భూముల నుండి గిరిజనులను తొలగించారు. నేను ఎంఎల్‌ఎ అయినాక అక్కడి ప్రజలు ఈ సమస్యలను నా దృష్టికి తీసుకురావటం నేను ప్రజలను కదిలించి ఆ భూస్వాముల ఇండ్ల ముందు ఘెరావ్‌ చేశాము. తరువాత కలెక్టరుని కదిలించి సర్వేయర్‌ని పంపి సర్వేయరు వెంటవుండి ఎవరి భూమి వారికి  ఇప్పించాము.  భూస్వాముల నిర్భంధం నుండి బయటపడినందుకు వారు ఊపిరిపీల్చుకున్నారు. నియోజక వర్గం అంతా కాలి నడకన తిరిగేదాన్ని. ప్రజలు ఏది పెడితే దాన్నే సంతోషంగా తినేదాన్ని. గ్రామాలలో పోలీసులు ప్రజలపై  దౌర్జన్యాలకు పడకుండా కాపలా కాసేదాన్ని. ఇది కూడా ఒక పోరాటంగానే నాకనిపించింది. గిరిజనుల సమస్యలపై ముఖ్యంగా కరంటు, బోరు బావులు విషయాలను అసెంబ్లీలో చర్చకు తెచ్చి మంజూరు చేయించేదాన్ని. యేటి ఒడ్డున పేద రైతాంగం భూములు సాగు చేస్తున్నారు. వాటికి అవసరమయిన నీటి విషయం సమస్య వచ్చింది. పుచ్చలపల్లి సుందరయ్య గారు అసెంబ్లీలో ప్రతిపక్ష లీడరుగా వున్నారు. సుందరయ్య గారి సహాయం తీసుకుని ఇరిగేషను మినిష్టరుని కదిలించి మూసీ నది (నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం) ఒడ్డున 20 బావులు మంజూరు చేయించి పేద రైతాంగానికి సాగునీరు, గ్రామానికి త్రాగునీరు అందించాము.
తరువాత గమనించదగిన ఉద్యమం మద్య నిషేధ ఉద్యమం. మద్య నిషేధ ఉద్యమంలో కూడా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన శక్తిగా బాధ్యతలు నిర్వహించింది.  అన్ని సంఘాలు ఐక్యమయి ఈ ఉద్యమాన్ని బ్రహ్మాండంగా నడిపినవి.  మహిళలు చైతన్యవంతులైతే ఎంత సాహసంగా ఉద్యమించగలరో నిరూపణ అయ్యింది. ఇందులో నా పాత్ర తగిన విధంగానే నిర్వహించానని భావిస్తున్నా.
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నిర్మాణంలో, ఉద్యమాలలో నా అనుభవాలను అందిస్తూ కార్యక్రమాలను రూపొందించటంలో నా శక్తి వంచన లేకుండా కృషి చేశాను. ఆలిండియా స్థాయిలో వెళ్ళినపుడు నేను చదువుకోని లోపం  పెద్ద ఆటంకంగా కనిపించింది ( ఇంగ్లీషు రాకపోవటం). ఇది కూడా నాకు వేదన కలిగించింది. 10 వేలతో ప్రారంభించి లక్ష సభ్యత్వం వరకు విస్తరించాం. అదే సంఘం నేడు 8 లక్షలకు చేరింది.
ఆనాటి వీర తెలంగాణా  రైతాంగ  పోరాటం తెలంగాణా ప్రజల ఆకాంక్షల ప్రకారం  ఆర్ధిక సామాజిక భూస్వామ్య వ్యతిరేక పోరాటంగా మహాజర్లతో, సంతకాల విజ్ఞప్తులతో నిరసన సభలతో, ఊరేగింపులతో మొదలై సాయుధ పోరాట రూపంగా పరిణామం చెంది భూమి కోసం, భుక్తి కోసం ప్రజల నిండైన పాత్రతో త్యాగాలతో సంపూర్ణ ప్రజా పోరాటమై విజయం సాధించింది. భారత దేశం యొక్క ప్రజాతంత్ర ఉద్యమాలకు చిరకాలం మార్గదర్శిగా నిలుస్తుంది. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఒక్కటిగా వుండి నాటి ప్రజల మనోభావాలను అధ్యయనం చేసి ప్రజల సంసిద్ధతననుసరించి అంచెలంచెలుగా కార్యక్రమాన్నిచ్చింది. ప్రజలు స్వయంగా సూచించిన పోరాట రూపాలను కూడా అందుకుని అమలు చేసింది. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా ఒకటిగానే వుంది. ఆ పోరాటం నేటికీ ప్రజాతంత్ర ఉద్యమాలకు దిక్సూచిగా నిలచింది.
ఉయ్యాల పాట

భారతి భారతి              ఉయ్యాలో
మా తల్లి భారతి              ”            నైజాము రాజ్యంల            ”            నాజీల మించింది             ”            ఎంత పాపకారి            ”            పసిపిల్ల తల్లులను            ”            పాలివ్వతోలరే            ”            గట్టు మీదనున్న
ఓ దొర బాంచను            ”
పాలివ్వ దోలమని            ”
బతిమిలాడినా గాని         ”
పసిపిల్ల నోరెండి            ”
ఉయ్యాలలో సచ్చినా        ”
పాలు సేపుల కొచ్చే            ”
బాధ పడలేనంటి            ”
రొమ్ముల సెయ్యేసి            ”
పాలు పిండిరమ్మ            ”
నాగళ్ళమీదున్న            ”
నాయన్నలారా            ”
సీము నెత్తురు లేదా        ”
తిరగబడరేమయ్యా        ”
ఎవ్వరీ దొరలు            ”
ఎందుకూ ఈ చెరలు        ”
ఎవ్వరిదీ భూమి            ”
పోడుకొడింది మనం        ”
బీడు దున్నింది మనం        ”
ఎవ్వరీ దొరలు            ”
ఎందుకీ చెరలు            ”
పండించిన పంటంత        ”
దొరల ‘గడి’ లోన            ”
పస్తులతో మన బతుకు        ”
బాంచరికమయిపోయే        ”
నాగళ్ళ మీదున్న            ”
నాయన్నలారా            ”
సీము నెత్తురు లేదా        ”
తిరగబడరేమయ్యా         ”
ఊరంతా ఏకమై            ”
పోరులో కదిలితే            ”
ఉందురా ఈ దొరలు        ”
ఊరెల్లి పోదురు            ”
ఈ చెరలు తప్పేను            ”
ఈ భూమి మనదౌను        ”

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

2 Responses to మల్లు స్వరాజ్యం మనోగతం

  1. నిజంగా ఆదర్శనీయం.

  2. buchireddy says:

    చరిత్ర కల — –తెలంగానా వీర వ ని త ముల్లు గారు

Leave a Reply to buchireddy Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.