చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు

జి.వరలక్ష్మమ్మ
అధ్యక్షోపన్యాసము
సాధ్వీమణులారా!
నేనీసభకు అధ్యక్షురాలిగా నియమింపబడితినే కాని, దాని కారణము నాకు తెలియకున్నది. నాయందలి విద్యాగరిమనుచూచి నన్నేర్పరచియున్నయెడల ఆగరిమయే శూన్యము. లేక నాయందు ఏ విధమైన అసాధారణ ప్రజ్ఞయందురేమో, అది నాయందు లేనేలేదు. కాని నాకొక అనుమానము తోచుచున్నది. నాయొక్క వార్థక్యమునుచూచి ఈస్థానమునకు నియమించితిరేమోయను అనుమానము పొడగట్టుచున్నది. అయినను మీరందరు నన్ను సోదరీభావముతోచూచి నన్నీస్థానమునకు నియమించినందుకు నేనెంతయు కృతజ్ఞురాలనై యున్నాను. అయినను ఇట్టికార్యమును నిర్వహించుటయందు నాచేత కాకపోయినను లేక నాయందేవిధమైన న్యూనతకనపడినను తప్పునాదికాదనియు, నన్నీస్థానమునకు నియమించిన వారిదేయనియు విశదముగా తెలిపెదను.
నిజాంరాష్ట్రమునందు ఆంధ్రమహాసభ స్థాపింపబడి ఇది రెండవసంవత్సరము. ఈమహాసభయందు స్త్రీల సమావేశముకూడ అత్యావశ్యకమని చెప్పనవసరము లేదు.
”యథాహ్యే కేన చక్రేణ వరథస్య గతిర్భవేత్‌” యను లోకోక్తి ననుసరించి ఈ సంసారరథము సుఖదాయకముగా నడవవలసియున్న, స్త్రీ పురుషులను రెండుచక్రములు అత్యావశ్యకములు. పూర్వకాలమునందు స్త్రీ పురుషులు సమానులుగానిలబడి గృహచర్యయే కాని, సమాజపు ఔన్నత్యమే కాని, లేక రాజకీయ వ్యవహారములేకాని ఆచరించుచుండిరనుటకు మన పురాణేతి హాసములే నిదర్శనములు. మహాభారతములో చూడుడు. ద్రౌపదీదేవి గృహకృత్యమునందు కాని, సమాజమునుద్ధరించుటయందు కాని, రాజనీతియందుగాని తనభర్తలకు తోడునీడగానుండి కృతకృత్యురాలైనదని స్వష్టముగా తెలియవచ్చును.
ఎల్లప్పుడు స్త్రీ, పురుషులకు, ధర్మమార్గ మవలంభించుటయే ముఖ్యమైనకర్తవ్యము. ధర్మమనగా బ్రాహ్మణులకు దానమిచ్చుటయని కొందరు, నిరర్థకముగా ముక్కుమూసికొని ధ్యానముననుసరించి వర్తించుటయే ధర్మమని కొందరు గ్రహించెదరు. అయితే ధర్మముయొక్క నిజస్వరూపము మనుస్మృతిలో చెప్పబడి యున్నది – అది యేదన.
శ్లో || ”ధృతిక్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహః||
ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మలక్షణం”
ధృతియనగా అవలంబించిన న్యాయమార్గమునందు పట్టుదల యుండడము; క్షమా అనగా ఓర్పు, పొరపాటు వల్ల ఎవరైనను తప్పుచేసినయెడల దానిని ఓర్చుకొని పోవుట; దమము, దుష్కార్యమునుంచి విముఖులై మనస్సును అటుపోనీయక స్వాధీనమునందుంచుకొనుట, ఆస్తేయం, తనకెంత కష్టకాలమువచ్చినను ఇతరులసొత్తు నపేక్షించక, అట్టిసొత్తు నపహరించక యుండుట; శౌచం. ఏపని యుందు కాని కాయా వాచా మనసా శుచిగా నుండుట; అనగా దుష్కార్యముల నుంచి విముఖులైయుండుటయే కాక అట్టి కార్యములను మనస్సునందుకూడా రానియ్య కుండుట; ఇంద్రియనిగ్రహం, చూచిన పదార్థములను కోరిక, న్యాయమార్గమును తప్పక తమకున్నదానితో సంతోషముపొంది జీవించుట; ధీః ఒకరు చెప్పిన దానిని కాని, తాము చదివినదానిని కాని కండ్లుమూసికొని నమ్మక, ఇదిమాకు హితకరమా, ఇదిమాకు న్యాయమా, దీనినుంచి మాకు సుఖమార్గమబ్బునాయని ఆలోచించుశక్తి.
పురుషులవలెనే ముఖ్యముగా స్త్రీల ఔన్నత్యమునకు కారణభూతములైన అంశములు అనేకములున్నను, విద్యభ్యాసము మొదటిది. ఈ మధ్యకాలమునందు స్త్రీలకు విద్యాభ్యాసము అనావశ్యకమనితలచి, వారిని అజ్ఞానాంధకరాములో ముంచినందువల్లనే నేడీభరతభూమికి దురవస్థ సంభవించెను. మనదేశమునందు మనకేవిధమైన స్వాతంత్య్రములేక లోకప్రసిద్ధమైన మననీతి మార్గములకు బాహుళ్యమై ”స్వధర్మేని ధనం శ్రేయః పరధర్మోభయావహః” అను గీతావాక్యమునుమరచి చరించునట్టి దురవస్థ నేడుమనకుఘటించెను. ఇట్టి దురవస్థనుండి ఉత్తీర్ణులగుటకు సాధనములెవ్వి? నాకుతోచినంతవరకు స్త్రీలవిద్యాభ్యాసమే మొదటిసాధనము. విద్యయనగా వ్రాత, భాషాజ్ఞానమే కాదు. ఇతరులచే వ్రాయబడిన వాక్యములను చిలుకవలె పఠించుటకాదు. ముఖ్యముగా మనముచదివిన దానిలోని గుణగ్రహణశక్తియే విద్యయొక్క ఫలము.
ఎల్లప్పుడు నిజముపలుకుట, నిజముగా వర్తించుట, నిజమైన అంశములను గురించి ఆలోచించుట, అక్రోధః, కోపములేక యుండుట. ఒకరు తప్పుచేసిరని రాత్రింపగలు యోచించుచు దురాగ్రహమునకు ఎడమియ్యకయుండుట అక్రోధమందురు. ప్రపంచమునందు తప్పుచేయని వారేలేరు. తప్పుచేసిన తరువాత పశ్చాత్తప్తుడైనయెడల అట్టితప్పు మన్నించదగినదే!
సోదరీమణులారా, మనుస్మృతియందలి వాక్యానుసారముగా మీరందరు ధర్మమార్గమునే అవలంబింతురని ప్రార్థించుచున్నాను. సాధారణముగా, పురుషులుసబలలనియు, స్త్రీలు అబలలనియు లోకమునందు వాడబడుచున్నది. ఇది కేవలము దేహమునకు సంబంధించినది కాదు. సదసద్వివేచనశక్తిలోను, స్త్రీలుపురుషులకు వెనుతీయువారుకారు. ధైర్యశౌర్యములలోను వెనుకకు తీయువారు కారు. వీటికి నిదర్శనము కావలసియున్నయెడల, ఆంగ్లరాజ్యమునందు ప్రస్తుతము నడుచుచున్న శాంతిసమరములో, స్త్రీసాహసమెంతమేర మీరియున్నదో చూడుడు!
నిజాంరాష్ట్రములో ఆంధ్రస్త్రీలకు సంబంధించిన ప్రస్తుత సమస్యలనుగురించి క్లుప్తముగా నివేదించెను. మనదేశమందు స్త్రీవిద్య మిక్కిలి తక్కువగానున్నది. ప్రాథమికవిద్య మిక్కిలివేగముగా జనసామాన్యమునందు వ్యాపించవలెనన్న నిర్బంధోచిత ప్రారంభవిద్యా పద్ధతి ఇతర రాష్ట్రములలోవలె ప్రవేశపెట్టబడవలెను. ఈ విషయమున ప్రభుత్వమువారు మౌనమువహించి యున్నారు. ముందు ప్రవేశపెట్టినను నదిబాలురవరకే యుండునేమోయను సంశయము గలుగుచున్నది.  కనుక సందేహనివృత్తితోబాటు ఆలస్యమేలజరుగుచున్నదో ప్రభుత్వమువారు సత్వరముగా ప్రకటించుట మంచిది.
శాస్త్రీయజ్ఞానముతోబాటు ప్రపంచ జ్ఞానమలవడి నాగరిక కుటుంబములసంఖ్య వృద్ధియగుటకు ఉన్నతవిద్యావ్యాప్తికి మూల కారణము.  ఉన్నతవిద్య మాతృభాషయందే సులభమవుటకు పూనాలోని మహిళా విశ్వవిద్యాలయమే సాక్షియై యున్నది. ఈ తత్త్వమునే మన ప్రభుత్వమువారు అవలంబించి ఉస్మానియా విశ్వవిద్యాలము స్థాపించిరి. కాని అందు మనదేశభాషలలో ముఖ్యమగు ఆంధ్రభాషకు ప్రాధాన్యతలేదు. ఈ కారణమువలన బాలికలకు ఉన్నతవిద్యా లాభమునుబడయుట కవకాశములేకుండనున్నది. ఈ సౌకర్యమును ప్రభుత్వమువారు గలిగించెదరుగాక! వీనిని విచారించుటకు ఆంధ్రస్త్రీలు వైద్యవిద్యను నేర్చుకొనవలెను. ఆరోగ్యవారములు, శిశుప్రదర్శనములు మున్నగువాని ద్వారా ప్రచారమొనర్చి మంచిమాతలేర్పడుటకు వీలుగలిగించవలెను. ఉపాధ్యాయినుల అవసరముగూడ ఎంతేని గలదు. ఈకరవును బోగొట్టుటకు ప్రభుత్వమువారును ప్రజలును పాటుబడవలెను.
దురదృష్టవశమున ఆంధ్రులలోని కొన్ని తెగలయందు పర్దాపద్ధతి ఇంకనుగలదు. నాగరిక ప్రపంచమందంతటను ఇది నిరసింపబడు చున్నది. ఇది వదలిపోయిననేగాని జ్ఞానమునరికట్టుచున్న యొక నిర్బంధము తొలగదు.
హేయమైనవ్యభిచారము వృత్తిగాగల కులమువారు మన ఆంధ్రులందుండుట సంఘమునకు కళంకమైయున్నది. కళావంతులందు వివాహపద్ధతిని ప్రవేశపెట్టి వారిని గృహిణులనుగా నొనర్చు విధి విద్యాధికులదై యున్నది. వీరి ప్రయత్నములు ప్రయోజనకారులు గానిచో శాసనముచేయుటకు ప్రభుత్వమువారిని కోరవలెను.
నేను ప్రారంభమునందు మనవిచేసికొన్న ప్రకారముగా, ఇట్టిసభయొక్క అధ్యక్షతకు కావలసినయోగ్యతలు నాయందులేవు. అయినను, తమయాజ్ఞకు బద్ధురాలనై నాకు తోచినంతవరకు విన్నవించితిని. ఇప్పటివరకు అధ్యక్షులవలంబించిన మార్గము నవలంబిం చక చర్వితచర్వణము నిష్ప్రయోజనమని తలచి, నాకుచితముగాతోచిన ఆలోచనలను తమముందర నివేదించియున్నాను. దీనియందే లోపములున్నను, గుణగ్రహణపరాయణలైనమీరు అట్టి లోపములును మన్నించి, దీనియందలిగుణలేశమునే గ్రహింతురని ప్రార్థించుచున్నాను.
(ఈ అధ్యక్షోపన్యాసము-”తెలంగాణా  చైతన్యం రగిలించిన నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు”- మొదటిభాగం లోనిది- రచయిత  కె.జితేంద్రబాబు)

Share
This entry was posted in చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు. Bookmark the permalink.

One Response to చరిత్ర చీకటిలో వెలుగు రవ్వలు

  1. kumar says:

    వెర్య ఫినె

Leave a Reply to kumar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.