శారదా శ్రీనివాసన్‌ గారి రేడియో జ్ఞాపకాల పూలమాల

సుజాత
రేడియో! రేడియో! రేడియో!అబ్బ, రేడియో అంటే పిచ్చితో గడిపిన రోజులు ఎంత బాగుంటాయో!
రేడియో వింటూ బావిగట్టు మీద బట్టలు ఉతుక్కోడం,
రేడియోవింటూ ఇల్లు తుడవడం,
రేడియోవింటూ తోటపని చేయడం,
రేడియో వింటూ ధనుర్మాసాల సాయంత్రాలు వాకిట్లో రేపటి తాలూకు ముగ్గు పెట్టేయడం… ఇలా ఉండేది పరిస్థితి మా ఇంట్లో!
నేనైతే ఒకడుగు ముందుకేసి చదువుకునేటపుడు కూడా రేడియో వింటూ చదివేదాన్ని!
ఉదయం మంగళవాద్యం మొదలుకుని ఉదయతరంగిణి అయ్యాక అక్కడినుంచి వివిధభారతికి వెళ్ళి అర్చన, జనరంజని..! ఈ లోపు స్కూలు!
సెలవురోజుల్లో అయితే పదకొండున్నరకు వచ్చే ఉన్నత పాఠశాల విద్యార్థుల కార్యక్రమం (ఆ పాఠాలు మా క్లాసువి కాకపోయినా సరే) పన్నెండున్నరకు కార్మికుల కార్యక్రమం, ఒకటిన్నరకు వనితావాణి, రంగవల్లి, రెండూపదికి సీఫెల్‌ వాళ్ల ఇంగ్లీష్‌ పాఠాలు……. ఇహ సాయంత్రాలు చెప్పక్కర్లేదు. మా రేడియోకి విశ్రాంతే ఉండేది కాదు.
ఆ రేడియో అప్పుడప్పుడూ ఆగిపోతే దాని నెత్తిన ఒకటి మొట్టగానే తిరిగిమోగేది. వేసవిసెలవుల్లో ఆరుబయట వెన్నెల్లో రేడియో నాటక వారోత్సవాల్లో పోటాపోటీగా వేసే నాటకాలు, ”బహారో ఫూల్‌ బర్సావో” వంటి అద్భుతమైన పాటల కోసం ఛాయాగీత్‌ వరకూ విని తెలీకుండానే నిద్రపోవడం…. ఎంతో హాయిగా వుండేది ఈ వ్యవహారమంతా!
రేడియో అనౌన్సర్లూ, కళాకారులంటే పెద్ద సెలబ్రిటీ వర్షిప్‌! విజయవాడ అనౌన్సర్లూ కళాకారులకున్న ప్రతిభ హైద్రాబాదు వాళ్ళకి లేదని ఒక పెద్ద అపోహలో, గొప్ప గర్వపు ఫీలింగలో ఉండేవాళ్ళం! (చాలామంది అది అపోహ కాదు నిజమే అంటున్నారు.) హైద్రాబాదు ట్రాన్స్‌మిషన్‌ అంత క్లియర్‌గా వినిపించకపోవడమే ఇందుకు కారణమేమో మరి!
పేరికామేశ్వరరావు, వాసుదేవమూర్తి, కమలకుమారి, కోకా సంజీవరావు, రామం, డిఎస్‌ఆర్‌, మల్లాది సూరిబాబు, నండూరి సుబ్బారావు, వీబీ కనకదుర్గ, సీతారత్నమ్మ (గణపతి నాటకంలో తల్లి) గార్లు వీళ్ళంతా గొప్ప హీరో హీరోయిన్స్‌గా వుండేవాళ్ళు నా పాలిట. లలితసంగీతం వింటూ చచ్చిపోయినా పర్లేదనిపించేంత ఇష్టంగా ఉండేది.
క్రమక్రమంగా రేడియో వైభవం ప్రాభవం వివిధ కారణాల వల్ల తగ్గిపోయాక, ఆనాటి అనౌన్సర్లంతా రిటైర్‌ అయిపోయాక మేము ఉద్యోగాలనో పెళ్ళిళ్ళలో వూర్లు మారిపోయాక రేడియోని దాదాపుగా వదిలేసినట్టే అయింది. (ఇప్పుడు మాత్రం నాకు రోజూ రేడియో ఉండాల్సిందే)
హైద్రాబాదు కళాకారుల్లో మా ఇంట్లో అందరికీ ఫేవరిట్‌ హీరోయిన్‌ ఉండేది. శారదా శ్రీనివాసన్‌ గారు. (నాకు ఆకెళ్ళ సీతగారి గొంతు కూడా చాలా ఇష్టం.)
స్ఫుటంగా, స్పష్టంగా, తీర్చిదిద్దినట్టు, నగిషీలు చెక్కినట్టు ఒక్కో వాక్యం భావగర్భితంగా ఆమె పలుకుతుంటే మా అమ్మ అయితే ”అబ్బ, ఎంత బాగా మాట్లాడుతుందే ఈమె” అని ఆశ్చర్యపడుతూనే ఎంతో అభిమానించేది. ఒకసారి రేడియో ఆడిషన్ల గురించి శ్రీమతి శారద గారు ప్రసంగిస్తూ ”ఏవండీ, మీరేనా ఇలా అంటున్నది? నన్ను ఎందుకింత అపార్థం చేసుకున్నారు” (అనో, ఇలాంటిదే ఏదో డైలాగ్‌ ఉంటుంది) అనే డైలాగ్‌ని ఎన్నిరకాల భావప్రకటనలతో చెప్పవచ్చో పలికి చూపిస్తే….. కళ్ళు తిరిగిపోయాయి.
చలం పురూరవ విన్నాక ఎవరైనా సరే తేరుకోవడం చాలా చాలా కష్టం! అదే ఊర్వశి ఎక్కడికెళ్ళినా మన వెనకాలే తెరలు తెరలుగా నవ్వుతూ వెంటాడుతూ వస్తుంది. ఈ ఊర్వశిని వదిలించుకోడానికి నాకు చాలా టైముపట్టింది. మళ్ళీమళ్ళీ విన్నపుడు ఊర్వశి మళ్ళీ బయలుదేరుతుంది. దీనికి అంతం లేదిహ!
అయితే అలనాటి కళాకారులూ, అనౌన్సర్లూ ఈ మధ్య తమ జ్ఞాపకాలు రాస్తుండటం సంతోషించదగ్గ విషయంగా తోచింది నాకు. రచనలో డి. వెంకట్రామయ్య గారు, కౌముదిలో సుధామగారూ… ఇలా! అయితే ఇలాంటి ప్రయత్నాలేవీ లేకుండానే శారదా శ్రీనివాసన్‌ గారు తన అనుభవాలను ఒక పుస్తకంగా తీసుకురావడం నిజంగా ఒక అద్భుతం!
ఎన్నెన్ని జ్ఞాపకాలు, ఎంతమంది మనుషులు, ఎన్ని పాటలు, ఎన్ని నాటకాలు, ఎంతమంది గొప్ప కళాకారులతో దగ్గరగా మెసిలే అదృష్టం, ఎన్ని ప్రశంసలు, ఎంత పరిశ్రమ, ఎంత గుర్తింపు, ఎంత మంది అభిమానుల మనసులోచోటు, ఎంతమంది గొప్పవారి సాంగత్యం……!
ఈ పుస్తకం చదువుతుంటే విశేషాలు, అనుభవాలు ఒకదాని వెనుక ఒకటి పాఠకులను ఊపేస్తాయి. నేనైతే అసలు బ్రేక్‌ తీసుకోకుండా ఒక్కసారిగా పూర్తిచేసి పక్కనపెట్టి దిగాలుపడి కూచున్నా!
ఎన్నో అపురూపమైన కార్యక్రమాలు, నాటకాలు, రూపకాలు ఇవన్నీ నేను పుట్టకముందే ప్రసారాలు, పునఃప్రసారాలు కూడా అయిపోయాయి.
ఒక పాతికేళ్ళు ముందు పుట్టిఉంటే ఎన్నెన్నో గొప్పగొప్ప ప్రోగ్రాములు వినగలిగి ఉండేదాన్నని గొప్ప పశ్చాత్తాపం మొదలైంది. ఇవన్నీ ఆర్కైవుల్లో ఉన్నాయో లేవో శారద గారు రూఢీగా చెప్పలేదు ఈ పుస్తకంలో!
అధ్యాయాలుగా విభజించకుండా, గుర్తొచ్చినవి గుర్తొచ్చినట్లుగా రాసుకుంటూ వెళ్ళారు! అయినా ఎక్కడా బోరు కొట్టకుండా, హాయిగా సుతిమెత్తగా సాగిపోయింది ఈ జ్ఞాపకానుభవాల ప్రయాణం. ఎన్నో గొప్ప నాటకాలు! అన్నింటోనూ శారదే హీరోయిన్‌.
కాలాతీత వ్యక్తుల్లో ఇందిర పాత్ర శారద గారు వేశారని చదివి మళ్ళీ చెప్పలేనంత దిగులు పుట్టింది.
ఎలా దీన్ని వినడం!
అసలే ఇందిరంటే నాకు చాలా ఇష్టం (శారద గారిక్కూడానట) ఇందిర ఆత్మవిశ్వాసం, ఓడిపోని పంతం, ఇగో వీటన్నింటికీ డైలాగులు ఎలా రాసి ఉంటారు? వాటిని శారదగారు ఎలా పలికి ఉంటారు? ఇలా అసంఖ్యాకమైన అపురూప రేడియో నాటకాలు కోల్పోయామో? ఎక్కడ ఎలా వినాలి? (మాగంటి వంశిగారి చెవిలో ఒక డూప్లెక్స్‌ ఇల్లు కట్టుకుని మరీ పోరాలి.)
శారదగారి జ్ఞాపకశక్తికి జోహార్లు చెప్పేలా అనేక రూపకాలు, లలిత సంగీత కార్యక్రమాలు, యక్షగానాలు వీటన్నింటి నుంచీ ఎన్నెన్నో పాటలు పద్యాలు కోట్‌ చేశాడు. అక్కినేని నాగేశ్వరరావు పరితాపం అనే రేడియో నాటకంలో నటించడమూ, శారదగారు కథ చెప్పే కార్యక్రమంలో చివరగా ”అదర్రా కథ” అని ముగిస్తే దాన్ని రోజూ వింటున్న పెద్దాళ్లంతా ”మేమూ వింటున్నాం, మీరు అదర్రా అని పిల్లలతో కలిపేస్తే ఎలా” అని సరదాగా అభ్యంతర పెట్టడమూ, పొలం పనులు కార్యక్రమంలో స్క్రిప్ట్‌ శారదగారి చేత చదివించారని కోపగించిన ఒక అభిమాని రేడియో వాళ్ళని ”మీరు పన్నీటిలో పేడ కలిపి కళ్ళాపి చల్లుతారు. శారద గారి చేతా వ్యవసాయ కార్యక్రమాలు చదివించేది?” అని చీవాట్లు వేయడమూ, తనపై వి.ఎస్‌. రమాదేవి గారి ప్రభావమూ, యువవాణి తీర్చిదిద్దిన అద్భుతమైన వ్యక్తులూ…… ఇలా ఎన్నెన్నో అనుభవాలు మాలగా గుచ్చి అందించారు ఈ పుస్తకంలో!
అలాగే కొన్ని రేడియో నాటకాల్లోని పాత్రలు తన మీద ఎలా ప్రభావాన్ని చూపించాయో ఈడిపస్‌ నాటకాన్ని ఉదాహరణగా తీసుకుని చెప్తే చాలాఆశ్చర్యం వేస్తుంది. ఆ నాటకంలో తల్లి/భార్య పాత్ర కల్గించిన మానసిక సంక్షోభాన్ని తట్టుకోలేక శతపోరి మరీ దాన్ని చెరిపించేశారట ఆమె!
ఎంతోమంది కళాకారుల విశేషాలు ఫోటోలతో తీర్చిదిద్దిన ఈ పుస్తకంలో అచ్చుతప్పులు లేకపోవడం మరో విశేషం! సొంతగా వేసుకుని జాగ్రత్తగా ప్రూఫులు పర్యవేక్షించడం వల్ల కాబోలు!
శారదగారు ఒక ప్రశ్న కూడా వేశారు చివర్లో! ”పూర్వంలా కార్యక్రమాలు బావుండటం లేదండీ” అంటున్నాం. కానీ ఆలోచిస్తే అన్ని కార్యక్రమాలూ వినే చేస్తున్నామా ఈ కమెంట్‌? పోనీ ఏదైనా కార్యక్రమం బాగున్నపుడు ”ఇది బాగుంది” అని ఒక ఉత్తరం ముక్కయినా రాశామా? ఫోన్‌ చేసి అయినా చెప్పామా?…… నిజమే! ఇప్పటికీ రోజూ రేడియో వినే నాకు ”ఈ ప్రోగ్రాము బాగుంది” అనుకోవడం తప్ప ఉత్తరం రాయొచ్చనే ఆలోచన రాదు ఎంచేతో మరి!
”రేడియో ప్రజలకు సేవలు అందించడమే కాక చైతన్యవంతులను చేసింది. చెవినిల్లు కట్టుకుని పోరినట్టు మరీ చైతన్యవంతులను చేసింది” అంటారామె! అక్షరసత్యం కాదూ!
”చైతన్యమే కాదు, సామాన్య ప్రజల జీవితాలకు కళాసౌరభాన్ని అద్ది, కళల పట్ల ఆసక్తిని పెంచింది కూడా” అంటాను నేనైతే!
లెక్కలేనన్ని విశేషాలతో వచ్చిన ఈ పుస్తకం రేడియో అభిమానులకు శారదగారు ”అదర్రా కథ” అని చెప్తూ పెట్టిన తీపి తాయిలం లాంటిది.
కానీ ఈ పుస్తకంలో అసంఖ్యాకమైన ఆంగ్లపదాలు అలవోగ్గా దొర్లుకుంటూ వెళ్ళిపోయాయి. మాట్లాడుతున్నట్లుగానే భావించి రాస్తూ వెళ్ళడం వల్ల కాబోలు, చక్కని తెలుగు పదాలు రాయదగ్గ చోట కూడా ఇంగ్లీష్‌ పదాలు అనేకం చోటుచేసుకున్నాయి.
రెక్టాంగులర్‌ టేబుల్‌, ఎక్స్పెరిమెంటల్‌ ప్లేస్‌ (ప్రయోగాత్మక నాటకాలు), స్టాండర్డైజ్‌, సెంట్రల్‌ అండ్‌ స్టేట్‌ ఫంక్షన్స్‌, గ్రీవెన్సెస్‌, హయ్యర్‌ అఫీషియల్స్‌ నుంచి అబ్జెక్షన్స్‌,…… ఇలా ఎన్నెన్నో! ఇవి కాస్త తగ్గి వాటి స్థానంలో తెలుగు పదాలుంటే బాగుండేదనిపించింది!
ఇది చదువుతూ ఉంటే నాకు ఇదంతా శారదగారి గొంతులోంచి విన్నట్టుగానే అనిపించింది. అందువల్ల ఇందుమూలంగా నేను శారదా శ్రీనివాసన్‌ గారికి చేసే విజ్ఞప్తి, డిమాండ్‌, విన్నపం ఏమిటంటే దీన్ని తన స్వరంతోనే ఆడియో బుక్‌గా తీసుకురావాలని. అలా అయితే కార్లో పోతూనో, మరేదైనా పని చేసుకుంటూనో రేడియో విన్నట్లు వినొచ్చు హాయిగా!
అయితే ఈ పుస్తకం కాపీలన్నీ అమ్ముడుపోయాక ఆ పనిచేయాలి. ఎందుకంటే శారదగారి ఆడియో బుక్‌ వస్తే దీన్ని ఎవరు కొంటారు మరి?….
ప్రముఖ పుస్తకాల దుకాణాల్లో సిద్ధంగా ఉన్న 200 పేజీల ఈ పుస్తకం వెల నూటపాతిక రూపాయలు!
( సుజాత మనసులోమాట  బ్లాగ్‌ నుంచి)

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

3 Responses to శారదా శ్రీనివాసన్‌ గారి రేడియో జ్ఞాపకాల పూలమాల

  1. జాన్ హైడ్ కనుమూరి says:

    శారదా శ్రీనివాసన్ గొంతు ఎంత మధురమైన జ్ఞాపకమో, అంతే మధురంగా సుజాతగారి మాటలు బాగున్నాయి.
    అభినందనలు
    జాన్ హైడ్ కనుమూరి

  2. pullaa rao says:

    సుజాత గారూ,
    “చక్కని తెలుగు పదాలు రాయదగ్గచోట కూడా ఇంగ్లీషు పదాలు అనేకం చోటు చేసుకున్నాయి ” అనేది శారదా శ్రీనివాసన్ గారి భాష మీద మీ అభిప్రాయం.
    అయితే మీరుకూడా మీ పరిచయ వ్యాసంలో అనవసరంగా ఆంగ్ల పదాలని వాడారనేది నా అభియోగం.

  3. dvrao says:

    చాలా బాగా పరిచయం చేసారు. ఒకసారిలోతం లో కి వెళ్ళాను.

Leave a Reply to pullaa rao Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.