ప్రకృతి వైపరీత్యాలు- జండర్‌ అంతరాలు

ప్రకృతి వైపరీత్యాలప్పుడు జరిగే నష్టాలు, ప్రాణాపాయాలు, స్త్రీ పురుషులిద్దరి విషయంలో ఒకేవిధంగా ఉండవు. సమాజంలో ఏదో వొక విధమైన వివక్ష నెదుర్కొంటున్న వారిపైనా, అణచివేయబడుతున్నవారిపైనా, వనరులు అందుబాటులో లేనివారిపైనా ప్రకృతి వైపరీత్యాలు తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి.

ఈ విషయాన్ని, “డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జియోగ్రఫీ అండ్‌ ఎన్వైర్నమెంట్‌”, “లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌” వారు 2006 ఆగస్ట్‌లో జరిపిన ఒక అధ్యయనంలో స్పష్టంచేశారు. ఈ అధ్యయనం ప్రకారం ఈ జండర్‌ అంతరానికి మూడు ప్రధాన కారణాలు న్నాయి. (1) స్త్రీ పురుషుల మధ్య కల శారీరక భేదాలు. (2) సామాజిక కట్టుబాట్లు నిర్ణయించిన ప్రవర్తనా విధానాలు, (3) వైపరీత్యాల సమయంలో వనరుల కొరత వల్ల ఏర్పడే పోటీ, అందువల్ల మరింత వివక్ష పెరగటం.

1981 నుంచీ 2002 వరకూ దాదాపు 141 దేశాలలో సంభవించిన వివిధ వైపరీత్యాలను, పరిగణనలోకి తీసుకుని వైపరీత్యాల సమయంలో పురుషులకన్న స్త్రీల మరణాలే జాస్తిగా ఉన్నాయని నిరూపించారు. అయితే స్త్రీల సామాజిక, ఆర్థిక స్థాయి మెరుగ్గా వున్న చోట మరణాల సంఖ్య కొంచెం తక్కువగా వుంది. వీరు స్పష్టం చేసిన అంశం ఏమిటంటే, స్త్రీ పురుషుల శరీర దారుఢ్యాలలో ఉండే అంతరాలవల్ల కాక, కేవలం “స్త్రీలు” అయినందువల్లే ఎక్కువగా చనిపోతున్నారని. అంటే జెండర్‌ అంతరమే ఇక్కడ పనిచేస్తున్న దని అర్థం. వీరు చెప్పిన పై మూడు ప్రధాన కారణాలను వివరంగా పరిశీలిద్దాం..

శారీరక పరమైన కారణాలు:

ప్రకృతి వైపరీత్యాలవల్ల ఏర్పడే ప్రమాదాలను స్త్రీల కన్న పురుషులు ఎక్కవగా తట్టుకోగలగడానికి మూడు కారణాలు కనిపిస్తాయి.

అవేమింటే ప్రమాదాలను భౌతికంగా ఎదుర్కోగల శారీరక బలం వాళ్లకుంటుంది. స్త్రీలు చాలామంది తక్కువ బలం కలిగివుండి పెనుగాలులకి, వరద ప్రవాహా వేగానికి కొట్టుకుపోవడం జరుగుతుంది.సాధారణంగా స్త్రీలు పరిగెత్తి స్థంభాలూ చెట్లూ తదితర రక్షిత స్థలాలను చేరుకోలేరు. అయితే ఈ స్వీయ రక్షణాపద్ధతులు శరీర దారుఢ్యాన్ని బట్టి కాక చిన్నప్పటి నుంచీ పొందిన శిక్షణ ద్వారా కూడా అలవడతాయని “ఆక్స్‌ఫాం” వారు చేసిన అధ్యయనంలో తేలింది. 2004లో దక్షిణ, తూర్పు ఆసియా దేశాల్లో సంభవించిన సునామీ, స్త్రీలపై చూపించిన ప్రభావాన్ని వారు అధ్యయనం చేశారు. శ్రీలంకలో ఈదడం, చెట్లెక్కడం వంటి ఆత్మరక్షణ విద్యలు బాలురకే నేర్పుతారనీ, ఇవి పురుషులకే ప్రత్యేకమైన నైపుణ్యాలనీ, అందువల్లనే స్త్రీలకన్న పురుషులే ఎక్కువగా సునామీ బారినుంచి బ్రతికి బయట పడ్డారనీ తేలింది. అంతేకాక శారీరక దుర్బలత్వం ఒక్కటే కూడా ప్రమాదాలకీ తొందరగా చిక్కడం కాదని మరొక అధ్యయనం స్పష్టం చేసింది. సామాజిక ట్టుబాట్లు, ప్రవర్తనా నియమాలూ కూడా స్త్రీల ఆత్మరక్షణా సామర్థ్యానికి ఆటంకాలవు తున్నాయి.
గర్బవతులైవుంటే కూడా త్వరగా పరుగెత్తలేరు. చెట్లెక్కలేరు. పెద్ద ఎత్తున ప్రమాదాలు సంభవించినపుడు ఆహార పదార్థాల కొరత, అపరిశుభ్ర పరిసరాలు కూడా స్త్రీల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.

సామాజిక కట్టుబాట్లు, ప్రవర్తనా నియమాలు:

ప్రమాదాలనుంచీ రక్షణ పొందే విషయంలో స్త్రీలకి సామాజిక కట్టుబాట్లు చాలా అవరోధంగా పరిణమిస్తాయి.

ఈ కట్టుబాట్లను స్త్రీలు స్వచ్ఛందంగా అనుసరిస్తున్నట్లు పైకి కనపడినప్పటికీ నిజానికి స్త్రీ పురుషులమద్య అమలౌతున్న అసమ అధికార సంబంధాలనుంచి వచ్చినవి.

చాలా దేశాల్లో కుటుంబాన్ని చూసుకోడం, పిల్లల పోషణ, వృద్ధ్దుల సంరక్షణ, ఇంట్లో వస్తువుల్ని జాగ్రత్త పరుచుకోడం వంటి పనులన్నీ స్త్రీల బాధ్యతలుగా వుంటాయి. ఈ బాధ్యతలకి ప్రాధాన్యమిచ్చే క్రమంలో తన గురించి పట్టించుకునే సమయం తక్కువగా ఉంటుంది. అంతే కాక స్త్రీల సంప్రదాయ దుస్తులుకూడా ఒక్కొక్కసారి వాళ్ళు గబగబా పరుగెత్తడానికి, చెట్లపైకెక్కడానికి, ఈదడానికి సహకరించవు. బంగ్లాదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు చీరె కట్టుకుంటారు. మొగవారి ఎదుట ముసుగు ధరించాలి. తుఫాను వల్ల ఏర్పడిన వరదలప్పుడు వారు చాలా ఇబ్బంది పడతారు. వేరే దుస్తులను ధరించడానికి ఇంటిపురుషుల అనుమతి తప్పనిసరి. స్త్రీలు ఈత నేర్చుకోవడం మీద ఉన్న ఆంక్షలూ, వ్యతిరేకతా సరేసరి. ఇక చాలా సమాజాల్లో స్త్రీలకు పురుషులకూ వేరు వేరు విధులుంటాయి. స్త్రీల విధులు కూడా ప్రమాదాల సమయంలో వారికి అవరోధా లుగా పరిణమిస్తాయి.

2005లో సునామీ వచ్చినప్పుడు ఇండోనేషియాలోని తీరప్రాంతాలలో చాలా మంది స్త్రీలు ఇళ్ళల్లో ఉండిపోయారు. పురుషులు చేపలవేటకు సముద్రంమీద ఉన్నారు.. ఇండియాలో తీర ప్రాంత స్త్రీలు తమ భర్తలకోసం నిరీక్షిస్తూ ఒడ్డున వున్నారు. ఈ రెండు ఘటనలలోనూ పురుషులే ఎక్కువగా బ్రతికి బయటపడ్డారు. ఎందుకంటే సునామీ తీవ్రత ఒడ్డునే ఎక్కువ వుంటుంది. అలలు బలంగా ఎత్తుకిలేచి ఒడ్డుకి విరుచుకు పడతాయి. భూకంపం వచ్చినప్పుడు కొన్నిచోట్ల, పురుషులు తాము ఉద్యోగం చేసే ప్రదేశంలో వుంటే స్త్రీలు ఇళ్లలో ఉంటారు. గట్టిగా నిర్మించిన కర్మాగారాలలోనూ, మంచి భవనాలలోనూ పనిచేసే పురుషులు బ్రతికి బయటపడగా గుడిశెలలోనూ, జీర్ణ గృహాలలోనూ ఉండిపోయిన వారి భార్యలు తల్లులు, పిల్లలు, చనిపోయారు. సరైన ఇళ్ళులేకపోవటమే భూకంపాలలో ఎక్కువ మంది స్త్రీల మృతికి కారణం. భూకంపాలు రాత్రివేళల్లో సంభవించినా తప్పించుకోగలిగేది పురుషులే. ఎందుకంటే, గాలాడని ఇరుకు కొంపల్లో పురుషులు సాధారణంగానిద్రించరు. ఆరుబయటో, డాబాలపైనో నిద్రిస్తారు. స్త్రీలు మాత్రం ఇంట్లో చిక్కుపడిపోతారు.

అయితే ఇది అన్ని ప్రమాదాలలోను ఒకేరకంగా ఉండదు. ఉదాహరణకి, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో సంభవించే పెను గాలులకు మెరుపు వరదలకు, పిడుగు పాట్లకు ఎక్కువగా బలయ్యేది పురుషులే. 1998లో మధ్య అమెరికాలో వచ్చిన హరికేన్‌ మిచ్‌లో అక్కడికక్కడే చనిపోయిన పురుషుల సంఖ్యే ఎక్కువ. దానికి కారణం చాలా మంది పురుషులు బయట చేసే పనుల్లోను, తీరిక సమయాన్ని బయటగడప టంలోనూ ఉండడం. అదీకాకుండా అప్రమత్తంగా లేకపోవడంకూడా ఒక కారణం. ప్రకృతి విలయాల ప్రభావం అన్నిచోట్లా, అందరిమీదా ఒకే రకంగా ఉండకపోవచ్చు. కానీ సర్వసాధారణంగా, సామాజిక కట్టుబాట్లు, సాంప్రదాయాలూ, స్త్రీలని ఎక్కువగా, ఈ విలయాలకు బలిచేస్తాయనేది నిర్వివాదం.

పునరావాస కల్పనలో వివక్ష ప్రమాదా నంతరం ఏర్పడే పరిస్థితులు:

వరద బీభత్సంలో కొట్టుకుపోవడమో, భూకంపాలలో కూలిన ఇళ్లలో కూరుకు పోవడమో మొదలైన తక్షణ మరణాలే కాక వైపరీత్యాల అనంతరం సరైన సహాయం అందక చనిపోయేవారిలో కూడా స్త్రీలే అధికం అని ఈ అధ్యయనం చెబుతోంది. వనరుల పంపిణీలో వివక్ష, ప్రమాదాల అనంతరం ఏర్పడే క్రమశిక్షణా రాహిత్యం, పోటీ, ఇవ్వన్నీ కూడా స్త్రీలకి జరిగే నష్టానికి దోహద పడతాయి. పురుషాధిక్య సమాజాలలో ప్రమాదాల నుంచీ రక్షణ ప్రక్రియలో పురుషులకే ప్రధమ స్థానం వుంటుందనేది నిజం. 1991లో బంగ్లాదేశ్‌ లో వచ్చిన తుఫానులో ఎగిసిపడుతున్న సముద్రపుటల నుంచీ తన ఇద్దరి పిల్లల్నీ కాపాడుకోడానికి ప్రయత్నించిన ఒక తండ్రి ఎవరో ఒకర్ని వదలవలసి వచ్చినప్పుడు కూతుర్ని అలలకి వదిలి కొడుకుని గట్టిగా పట్టుకున్న సంఘటనే ఇందుకు నిదర్శనం. అట్లా చెయ్యడానికి ఆ తండ్రి చెప్పిన కారణం, కొడుకు బ్రతికి తన వంశాన్ని నిలబెడతాడని. సహయక బృందాలనించీ వచ్చే ఆహారంకానీ ఇతరాలను కానీ అందుకోడంలో పురుషులే ఎప్పుడూ ముందుంటారు. ప్రమాదాలప్పుడు దొరికే సహాయం విషయంలోనే కాదు, చాలా కుటుంబాలలో కూడా ఆహారం విషయంలో వివక్ష కనిపిస్తుంది. బంగ్లాదేశ్‌ లోని గ్రామీణ ప్రాంతాలలో కరువు కాటకాలప్పుడు ఆడపిల్లలే ఎక్కువ బాధపడ్డారని కూడా వెల్లడైంది. సాధారణంగా ఆడపిల్లల పట్ల అమలయ్యే ఈ వివక్ష, ప్రకృతి వైపరిత్యాలప్పుడు మరింత ఎక్కువవుతుంది. పశ్చిమ బెంగాల్‌లో వరదలొచ్చి ఎక్కువగా పంట నష్టం సంభవించినప్పుడు ఒక పద్ధతి ప్రకారం స్త్రీలకూ, ఆడపిల్లలకు ఆహార సహాయం అందనీయకుండా చేసిన వైనాన్ని “సేన్‌” అనే ఆయన తన అధ్యయనంలో వివరించారు. 1991లో బంగ్లాదేశ్‌ తుఫానప్పుడు కూడా ఇదే జరిగిందని మరొక నివేదిక చెబుతుంది. “ప్యాన్‌ అమెరికన్‌ ఆరోగ్య సంస్థ” ఈ వివక్షకు కారణం సమాజాలలో అంతర్లీనంగా వున్న అసమ సంబంధాలేనని సూచించింది. ప్రమాదానికి లోనైన ప్రదేశాలలోని ప్రజ లందరి కోసం సహాయం ఉద్ధేశించ బడినప్ప టికీ దానిని దక్కించుకోడంలో మహిళలెప్పుడూ వెనకబడే ఉన్నారు. అంచులకు నెట్టబడే ఉన్నారు.

ప్రకృతి వైపరీత్యాల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వాటివలన దీర్ఘకాలిక ఇబ్బందులు ఉంటాయి. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. అయితే కొంత వరకు ప్రవాసుల దగ్గర నుంచీ ఆర్థిక సహాయం అందడం, విదేశీ సహాయం,కొన్ని సంస్థలనుంచీ సహాయం ఈ ఇబ్బందులని తగ్గిస్తుంది. అయితే ఇవన్నీ అందటానికి కొంత సమయం పడుతుంది.

ఈలోగా స్త్రీలకి తమ కుటంబాన్ని చూసుకోడంతో పాటు ఇంటికి కావల్సిన మంచి నీరు, పొయ్యికిందికి కట్టెలు, అందరికీ భోజనం అమర్చడం చాలా శ్రమతో కూడుకున్న పని. ప్రకృతి వైపరీత్యాలు కొనుగోలుశక్తిని కూడా గణనీయంగా తగ్గిస్తాయి. ఇటువంటి పరిస్థితులలో న్యాయంగా స్త్రీలకే ఎక్కువ సహాయం అందాలి. కానీ వారికది అందదు. చాలా దేశాలలో సహాయ పునరావాస కార్యక్రమాల అమలు పురుషుల చేతిలో ఉంటుంది. ఎంత తెలివీ దక్షతా ఉన్పప్పటికీ మహిళలకి ఇందులో వారు భాగస్వామ్యం ఇవ్వరు.

ప్రమాదాలప్పుడు పేదవారికే నష్టం ఎక్కువ జరుగుతుందనేది విదితమే. భూకంపాలకూ, పెనుగాలులకూ తట్టుకోగల ఇళ్లని వాళ్ళు కట్టుకోలేరు. చవకలో తీరప్రాంతాలలో గాలివానకూ, వరదలకూ తేలిగ్గా దొరికిపోయే ప్రాంతాలలో ఒర్కొక్కసారి కొండలమీద కూడా ఇళ్ళు నిర్మించుకుంటారు. వీరికి ప్రమాదాల నుంచీ రక్షించుకునే చదువూ, ఆర్థిక వనరులూ ఉండవు. పేదలలో సగటు స్త్రీలే ఎక్కువ. ఉదాహరణకి, గోదావరి డెల్టాలలో వచ్చిన హరికేన్‌ 07 లో ఎక్కువగా నష్టపోయింది షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన వలస వ్యవసాయ కూలీలు. ఇది వర్థమాన దేశాలకే పరిమితమైన పరిస్థితి కాదు. 1995లో జపాన్‌లో సంభవించిన భూకంపంలో కోబే నగరంలో ఎక్కువగా మృతి చెందింది, ఒంటరి వృద్ధ స్త్రీలు. ఎందుకంటే వారు ఎక్కువ నివసించేది చాలా పేద ప్రజలు నివసించే చోట. అగ్నిప్రమాదాలకీ, వరదముంపులకీ అనువైన చోటులో.

మరొక విషయమేమిటంటే తీవ్ర ప్రమాదాల వల్ల కలిగిన వత్తిళ్ళ వల్ల గృహహింస, తాగుడూ, ఎక్కువైనట్లు, కొన్ని అధ్యయనాలలో తెలిసింది. అగ్నిమాపక దళాలు అక్కడి ప్రజలను త్వరగా కాపాడలేకపోయిన పరిస్థితుల్లో అక్కడ హింస, దోపిడీలూ లూటీలూ కూడా సాధారణం. ప్రభుత్వం బలహీనంగా వున్న కొన్ని దేశాలలో సాంఘిక సమతౌల్యం దెబ్బతినటం కూడా జరుగుతుంది. ప్రకృతి వైపరిత్యాల ప్రభావం తీవ్రంగా వున్నప్పుడు ఒక్కొక్కసారి అగ్రరాజ్యాలే అలజడులను అరికట్టలేక పోతాయని న్యూఆర్లియన్స్‌లో హరికేన్‌ కత్రినా అనంతర పరిస్థితులే రుజువుగా నిలిచాయి.

ప్రమాదాలబారిన పడిన వారిని, వారిస్వంత ఇళ్లకి దూరంగా తాత్కాలిక క్యాంపులలో వుంచినప్పుడు అక్కడ శాంతి భద్రతల పరిరక్షణ కూడా కష్టం అవుతుంది. అరాచక పరిస్థితులు నెలకొంటాయి. ముఖ్యంగా స్త్రీలు, యువతులపై అత్యాచారాలు, హింస ప్రబలే అవకాశాలు ఎక్కువ. ఇంతేకాకుండా స్త్రీలకి అవసరమైన ప్రయివసీ కొరవడి వారి కాలకృత్యాలు సకాలంలో నెరవేర్చుకోడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. సాధారణ పరిస్థితుల్లో ఉండే మరణాల సంఖ్య కన్న ఇటువంటప్పుడు జరిగే మరణాల సంఖ్య రెండింతలుగా వుంటుంది.

ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే స్త్రీల సామాజిక ఆర్థిక స్థితి మెరుగు పడితేగానీ ఇటువంటి మరణాల సంఖ్య తగ్గదు. పాశ్చాత్య దేశాలలో ప్రకృతి వైపరీత్యాల ప్రభావం తీవ్రత తక్కువ. అంతేకాక స్త్రీల సామాజిక ఆర్థిక స్థితి కూడా మెరుగుగా వుంటుంది. ప్రకృతి వైపరీత్యాలు అరుదుగా సంభవించే ప్రమాదాలు. భూగోళ శాస్త్రవేత్తలు చాలాకాలంగా ఒకేమాట చెబుతున్నారు. ఈ ప్రమాదాలలో ప్రకృతి ప్రభావం చాలా తక్కువ అని. ఆ ప్రమాదాలకు ఎక్కువ అందుబాటులో వున్న వారి పైనే ప్రభావ తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

అందుబాటులో వుండడం వారి వర్గాన్ని బట్టి, జెండర్‌ని అనుసరించీ ఇంకా అనేక విషయాలపై ఆధారపడి వుంటుంది. ఈ అధ్య యనం వల్ల ముఖ్యంగా తెలిసిందేమిటంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అందరికన్న ఎక్కువ మరణించేది ఆర్థికంగా అడుగున వున్న స్త్రీలేనన్నది. అంతేకాక స్త్రీల ఆయు:ప్రమాణంకూడా తగ్గిపోతుందన్నది.

Share
This entry was posted in అనువాదాలు, వ్యాసాలు. Bookmark the permalink.

One Response to ప్రకృతి వైపరీత్యాలు- జండర్‌ అంతరాలు

  1. jyotsna says:

    ఎ చెత్త నెను ఎక్కద చుదలెదు పరమ చెత్తఎ

Leave a Reply to jyotsna Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.