– కొండవీటి సత్యవతి 156

128‘సమతా నిలయం’ బోర్డున్న ఆవరణలోకి, మా వాహనం ప్రవేశించగానే ‘వావ్‌! భలేవుంది.’ అరిచాన్నేను. ‘నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని నీకు ముందు చెప్పలేదు’ అంది ప్రశాంతి. పెద్ద పెద్ద మామిడి చెట్లు, వేపచేట్లు, ఎర్రగా పూసిన తురాయి చెట్లు, చుట్టూ కొండలు…

ఓ చల్లటి వనంలో ప్రవేశించినట్లయింది. అప్పటికి ఎండవేడి పెరిగింది కానీ…

ఆ చెట్లమధ్యలోకి రాగానే చల్లగా, హాయిగా అన్పించింది. అక్కడికి రాగానే ప్రశాంతి… ఎంతో ఉద్వేగంలో మునిగిపోయినట్లనిపించింది. సంతోషం తన ముఖంలో…

మాకేమో సంబరం. ఇంత చక్కటి ప్రదేశంలో రెండు రోజులుంటాం.

ఈ ఆలోచనతో నాకూ ఉత్సాహం వచ్చేసింది. ‘సమతా నిలయం’ చూడ్డానికి వెళదామా అని ప్రశాంతి చాలా సార్లు అడిగింది. వెళదాం, వెళదాం అని ఉత్సాహంగా చెప్పాను కానీ ఎప్పుడు కుదురుతుందా అని ఎదురుచూస్తున్నాను. మే 7, 8 online pokie games తారీఖుల్లో ‘వర్ని’ వెళదాం అని అడగ్గానే ఎస్‌ అనేసాను. రెండు రోజులు…. అని నసగ్గానే.. ఉండలేకపోతే రాత్రికి వచ్చేద్దువుగానీ… కానీ రాత్రి వుంటేనే యు విల్‌ ఎంజాయ్‌ అమ్మూ… అని ఊరించింది. ఏడో తేదీ ఉదయం నలుగురు పిల్లల్ని తన వాహనంలో ఎక్కించుకుని ప్రశాంతి రానే వచ్చింది. అందరం సందడిగా ‘వర్ని’ బయలుదేరాం. దారంతా కబుర్లు. పిల్లల నవ్వులు. ప్రశాంతి, నేను ఎప్పటిలాగే అంతుపొంతూలేని కబుర్ల ప్రవాహంలో కొట్టుకుపోతుండగానే ‘వర్ని’ వచ్చేసింది.

‘సమతా నిలయం’ బోర్డున్న ఆవరణలోకి, మా వాహనం ప్రవేశించగానే ‘వావ్‌! భలేవుంది.’ అరిచాన్నేను. ‘నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తాలని నీకు ముందు చెప్పలేదు’ అంది ప్రశాంతి. పెద్ద పెద్ద మామిడి చెట్లు, వేపచేట్లు, ఎర్రగా పూసిన తురాయి చెట్లు, చుట్టూ కొండలు… ఓ చల్లటి వనంలో ప్రవేశించినట్లయింది. అప్పటికి ఎండవేడి పెరిగింది కానీ… ఆ చెట్లమధ్యలోకి రాగానే చల్లగా, హాయిగా అన్పించింది. అక్కడికి రాగానే ప్రశాంతి… ఎంతో ఉద్వేగంలో మునిగిపోయినట్లనిపించింది. సంతోషం తన ముఖంలో… మాకేమో సంబరం. ఇంత చక్కటి ప్రదేశంలో రెండు రోజులుంటాం. ఈ ఆలోచనతో నాకూ ఉత్సాహం వచ్చేసింది. అక్కడ మేనేజర్‌గా పనిచేస్తున్న శాంతి ప్రబోధ మమ్మల్ని సాదరంగా రిసీవ్‌ చేసుకున్నారు. నేను చుట్టూ చూస్తూ నిలబడ్డాను. రూమ్‌కెళ్ళి కాస్త ఫ్రెష్‌ అవ్వాలేమో అనుకున్నాను కానీ.. ప్రశాంతికి ఎప్పుడెప్పుడు పిల్లల్ని కలవాలా, వాళ్ళని చూడాలా అనే ఆత్రుత…. వెంటనే పిల్లలందరూ కూర్చున్న రూమ్‌లోకి తీసుకెళ్ళారు శాంతి. ప్రశాంతికి పిల్లలతో దాగుడుమూతలాడాలన్పించింది. తను దాక్కుని నన్ను లోపలికి వెళ్ళమంది. పిల్లలంతా ప్రశాంతక్క, ప్రశాంతక్క అంటూ అరుస్తున్నారు. ప్రశాంతక్క రాలేదు. నన్ను పంపించింది. అన్నాన్నేను. లేదు వచ్చింది అంటూ కిటికీ వేపు చూస్తూ మేం చూసాం. అక్క వచ్చింది అంటుండగానే ప్రశాంతి లోపలికొచ్చేసింది. ఓ సంతోష తరంగం ఎగిసిపడింది. పిల్లల ముఖాలు పువ్వుల్లా విచ్చుకున్నాయి. ప్రశాంతి ముఖంలో గొప్ప సంతోషం. ఉద్విగ్నంలో ఉక్కిరి బిక్కిరవుతూ అందరినీ పేరు పేరునా పిలుస్తూ, వాళ్ళని తాకుతూ వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుండిపోయింది. తన ముఖంలో కనిపిస్తున్న భిన్న భావాలను సంబరంగా చూస్తూ కూర్చున్నాను. ఒక్కొక్కళ్ళని పలకరిస్తూ, వాళ్ళని హత్తుకుంటున్న ప్రశాంతి కళ్ళల్లో సన్నటి నీటిపొర. ఆనంద బాష్పాలు. పిల్లల ముఖాల్లో వెయ్యి మతాబుల కాంతి. అక్క తమ దగ్గరకు రావాలని, తమతో మాట్లాడాలని, తమని తాకాలని పిల్లలు…. వాళ్ళందరిని ఒకేసారి తన చేతుల్లోకి తీసేసుకోవాలని అక్క…. ఆ సన్నివేశం చూస్తున్న నా కళ్ళు చెమ్మగిల్లిపోయాయి.

167మాతో వచ్చిన నలుగురు పిల్లలు తమని తాము పరిచయం చేసుకున్నారు. నన్ను నేను పరిచయం చేసుకుంటూ, సరదాగా, ‘నేను ప్రశాంతక్క వాళ్ళ అమ్మని’ అన్నాను. పిల్లలంతా ఆ….. అంటూ నోళ్ళు వెళ్ళబెట్టారు. వాళ్ళంతా నావేపు, ప్రశాంతి వేపు చూస్తూ… కాదు… అక్క మీరు ఒకేలా లేరు కదా! మీరు ప్రశాంతక్క అమ్మకాదు. అంటూ బోలెడన్ని అనుమానాలు వ్యక్తం చేస్తుంటే నాకు చచ్చే నవ్వు. కానీ… ఆ క్షణానే వాళ్ళు నన్ను ‘అమ్మమ్మ’గా స్వీకరిస్తారని నేను ఊహించలేదు. సరదాగా నేనన్న మాటని, మొదట శంకించినా… ఆ తర్వాత సీరియస్‌గా తీసుకుని పిల్లలందరూ అమ్మమ్మా అని పిలుస్తుంటే చాలా గమ్మత్తుగా అన్పించింది. రెండు రోజులూ కొన్ని వేలసార్లు ఈ పిలుపును నేను విన్నాను. సుమారు గంట, గంటన్నరసేపు పిల్లలతో గడిపాం. చక్కటి పాటలు పాడారు. పిల్లల్లో ఒకమ్మాయి పేరు భూమిక. ఆది వినగానే నాకెందుకో చాలా సంతోషమన్పించింది. ఒకటిన్నరకి లంచ్‌ బ్రేక్‌… పిల్లలంతా పోలోమని తమ ఇళ్ళకు వెళ్ళారు ప్లేట్‌ తెచ్చుకోవడం కోసం. అంతకు ముందు మాతో వచ్చిన శతాక్షి ‘బ్లాక్‌ ఎక్స్‌పీరియన్స్‌’ గురించి పిల్లలకి చెప్పింది. నేను ‘వర్ని’ వస్తున్న సమయంలో బ్లాక్‌ ఎక్స్‌పీరియన్స్‌ గురించి పిల్లలకి చెప్పాను. దీని గురించి కొంచెం వివరంగా చెబుతాను. ఓ వారం క్రితం నేను, నా మరిది కొడుకు నరేష్‌ …. జూబ్లిహిల్స్‌లోని ఇన్‌ ఆర్బిట్‌లో వున్న ‘బ్లాక్‌ ఎక్స్‌పీరియన్స్‌’ రెస్టారెంట్‌కి వెళ్ళాం. అదో అద్భుతమైన అనుభవం. కన్నుపొడుచుకున్నా కనబడని చిమ్మచీకటిలో ఓ నలభై నిమిషాల టూర్‌. విజువల్లీ చాలెంజ్‌డ్‌ వ్యక్తితో కలిసి మనం ఆ చీకట్లో ఎన్నో అనుభవాలు పొందుతాం. చూపు లేకపోవడం అంటే ఏమిటి? చీకటి అంటే ఏమిటి? చూపు లేనపుడు పంచేంద్రియాల్లో మిగతా నాలుగు ఇంద్రియాలు ఎలా చురుగ్గా పనిచేస్తాయి. గుడ్డివాడు, బ్లైండ్‌ అని పిలిస్తే వాళ్ళెంత బాధపడతారు లాంటి అనుభవాలు ఈ ‘డార్క్‌ ఎక్స్‌పీరియన్స్‌’ కి వెళ్ళినపుడు మనకు కలుగుతాయి. నేను ప్రయాణంలో నాతో వున్న పిల్లలకి దీనిగురించి చెపితే… ఆ పిల్లలు ‘వర్ని’ పిల్లలకి చక్కగా వివరించారు. చూపులేని వాళ్ళపట్ల ఎంత సున్నితంగా వ్యవహరించాలో అర్థం చేయించిన ఈ అనుభవాన్ని నేను ఇలా అందరిలోకి తీసుకెళ్ళగలిగాను.224

లంచ్‌ అయిపోయింతర్వాత పిల్లలందరం తోటమీద పడ్డాం. చిన్నప్పుడెప్పుడో చెట్టెక్కాను. పిల్లలు, ప్రశాంతి చకచకా చెట్లెక్కెస్తుంటే నాకూ ఎక్కాలని ఒకటే ఉత్సాహం. ఎక్కగలనా…. అరవై ఏళ్ళ వయసులో ఎవరైనా చెట్టెక్కే ప్రయత్నం చేస్తారా? నేను చేసాను. అవలీలగా మామిడి చెట్టెక్కేసాను, అలా నోరెళ్ళబెట్టి చూడకండి.. నేను నిజంగానే చెట్టెక్కేసాను. నాతోపాటు పిల్లలు, ఒకటే నవ్వులు… కేరింతలు… అమ్మమ్మా! భలే ఎక్కేసావు అంటూ పిల్లల ఫ్రశంసలు. ఓహో! అద్భుతం ఆ అనుభవం. అలా పిల్లల్నేసుకుని తిరుగుతూ… వాళ్ళతో కలిసి నవ్వుల్ని వెదజల్లుకుంటూ తిరుగుతుంటే సాయంత్రం అయిపోయింది. పిల్లలు ప్రశాంతి చుట్టూచేరి రకరకాల ఫోటోలకు ఫోజులు … మా గాగుల్స్‌ పెట్టుకుని, నా టోపీ తగిలించుకుని పిల్లలు గొప్ప సంబరంగా, సందడిగా ఫోటోలకి ఫోజులు… అక్కడినుండి ఆటస్థలానికి వెళ్ళాం. విశాలమైన ప్లేగ్రౌండ్‌… చుట్టూ కొండలు, పచ్చని చెట్లు… అప్పటికి ఎండ తీవ్రంగానే వుంది. దాన్ని లెక్కచేసిందెవరూ… ఎండాలేదు కొండా లేదు.

పిల్లలు కబడ్డీ ఆట మొదలెట్టేసారు. నేనూ ఓ జట్టులో చేరిపోయి కబడ్డి… కబడ్డీ అంటూ ఒకటే నవ్వులు. మేం ఆడుతున్నాం. ప్రశాంతి… సైకిల్‌ తెచ్చుకుని, పిల్లల్నెక్కించుకుని మా చుట్టూ రౌండ్లేస్తోంది. తన చుట్టూ పిల్లలు. నేను కబడ్డీ మానేసి… సైకిల్‌ తొక్కాలని ఆరాటపడ్డాను. ఎన్ని సంవత్సరాలైంది? సైకిల్‌ తొక్కి.. మగపిల్లల సైకిలెక్కి, మైలు రాళ్ళ దగ్గర దిగుతూ స్కూల్‌ కెళ్ళిన రోజులు గుర్తొచ్చాయి. చెట్టెక్కగా లేనిది సైకిల్‌ తొక్కలేనా? అని ఆవేశపడి ఓ పొట్టి సైకిల్‌ సంపాదించి తొక్కాలని ప్రయత్నించాను. టైర్లలో గాలి సరిగ్గాలేక, సైకిల్‌ ముందుకెళ్ళనని మొరాయించింది. అలాగే దానిని కొంచెంసేపు తొక్కి, కిందపడి, లేచి దులుపుకుంటుంటే…. చచ్చే నవ్వు… పిల్లల కేరింతలు. సైకిల్‌ తొక్కి అలిసిపోయాను కదా కాసేపు కూర్చున్నాను అక్కడున్న జండా మెట్లమీద.

నేను కూర్చోగానే… అక్కడున్న పిల్లల్లోకి పెద్దవాడు, టెంత్‌ క్లాస్‌ చదువుతున్న ‘రవి’ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. పిల్లాడు చక్కగా, చురుగ్గా వుంటాడు. లంబాడా మ్యూనిటీకి చెందినవాడు. ‘నువ్వు అచ్ఛం’ మా పాడి లాగా వున్నావ్‌ రవీ! అన్నాను. ప్రద్యుమ్న.. మాకు పాడి… మై లిటిల్‌ ఫ్రెండ్‌…. నాకు అత్యంత ఆత్మీయుడు. రవి అచ్చం వాడిలాగా వున్నడు. రవి జుట్టులోకి వేళ్ళు పోనిస్తే అచ్చం పాడిగాడి జుట్టులా బిరుసుగా వుంది. ఆ తర్వాత రవి నాతో చాలా విషయాలు మాట్లాడాడు. తన జీవితంలోని విషాదాన్ని నాముందు పరిచాడు. నా కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. పదహారు, పదిహేడు ఏళ్ళు నిండని వీడి జీవితంలో ఇప్పటికే ఎన్ని విషాదకర సంఘటనలు జరిగాయి? అంటూ నేను బాధపడుతుంటే… ప్రశాంతి నా దగ్గరకొచ్చింది. ఇక్కడున్న పిల్లలందరి జీవితం ఓ విషాద కావ్యం. ఎన్నో సమస్యలు, దుఃఖాలు దాటుకొని ఇక్కడి కొచ్చారు’ అంది. అలా చెబుతున్నపుడు తన గొంతులో విన్పించిన విషాదం…. తన ఆలోచనల్లోంచి రూపుదిద్దుకున్న ‘సమతా నిలయం’ ఇంతమంది వల్నరబుల్‌ పిల్లలకి చల్లటి నీడనిచ్చి… వాళ్ళ ముఖాల్లో సంతోషం నింపిన ప్రశాంతి అంటే… ఆ క్షణాన ఎంతో ప్రేమ కలిగింది. తన మీదున్న ప్రేమ రెట్టింపైన సందర్భం…. ప్రశాంతిని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న సన్నివేశం… పిల్లల్లో కలిసిపోయి ఆడుతున్న తన మీద నాకు కల్గిన గౌరవం, ప్రేమ, ఇష్టం…. వర్ణించడానికి ఈ అక్షరాలు చాలవు. ఆ సాయం సంధ్యవేళ… నా మనసులో ఎన్నో ఆలోచనలు… ఎన్నో అనుభవాలు.. అనుభూతుల వర్షంలో నిండా తడిసిపోతున్నవేళ… రవి తన కథంతా నాకు చెప్పాడు. వాడిని గుండెల్లోకి తీసుకుని లాలించాలన్పించింది. అప్పటికే వాడి జీవితంలో వొలికిన దుఃఖం నన్ను నిలువెల్లా తడిపేసింది. బాగా చదువుకోమని… ఎలాంటి అవసరం తనకి వచ్చినా నన్ను అడగమని… నాకు ఫోన్‌ చెయ్యమని ఉత్తరం రాయమని చెప్పాను.

రవితో మాట్లాడుతున్నప్పుడే దూరంగా జీడిచెట్లు కన్పించాయి నాకు. అక్కడికి వెళ్ళాలనిపించింది. మా కబుర్లయిపోయాక… జీడిచెట్లవేపు వెళ్ళిచూద్దును కదా… చెట్లకింద బోలెడన్ని జీడిగింజలు.. ఎవ్వరూ ఏరలేదు. కొన్ని గింజలు ఏరి, కుప్పబోసాక… పిల్లలూ… అని పిలిస్తే హాయ్‌ అంటూ వచ్చేసారు. అరేయ్‌… జీడిగింజలేరదామ్‌ రండి అన్నానో లేదో… పోలోమని పిల్లలందరూ జీడిచెట్టుకింద చేరిపోయారు. ఓ పది నిమిషాల్లో రెండు మూడు కిలోలు జీడిగింజలు పోగయ్యాయి. అరేయ్‌! ఎవరైనా అగ్గిపెట్టె తీసుకురండి.. అంటే ఓ పిల్ల బాణంలాగా దూకింది. అరేయ్‌! ఎండిపోయిన ఆకులు తెండిరా… క్షణంలో ఎండుటాకుల కుప్ప. ఆకుల్ని జీడిగింజల కుప్పమీద పోసి అగ్గిపుల్ల గియ్యగానే… ఇంతెత్తున మంట లేసింది. పిల్లల కేరింతలు… వేడి సెగ… చెమటలు కక్కుతూ జీడిప్కిలు కాల్చే కార్యక్రమం ముగిసింది. తలో రాయి తెచ్చుకుని పిల్లలు కాలిన గింజల పనిపట్టడం… గుప్పిళ్ళ నిండా కమ్మటి జీడిపప్పు… అరచేతుల్లో నింపుకుని ‘అమ్మమ్మా’ తినండి… ‘ప్రశాంతక్కా తిను’… తినలేక అవస్థపడ్డాం, వాళ్ళ ప్రేమ మిళితం చేసి పంచిన జీడిపప్పు… ఆరోజు… చాలానే తిన్నాం. అక్కడున్న తాడిచెట్టు నుంచి ఓ ఆకును తెంపి బూర చేసి ఊదుతుంటే పిల్లలంతా నా చుట్టూ చేరి ఎగరుతూ, గెంతుతూ … నాకు … బూర నాకు అంటూ లాక్కుంటుంటే… అది కాస్తా ఊడిపోయి… ఆ మునిమాపువేళ… మా నవ్వులతో, కేరింతలతో అరుపులతో, కేకలతో చుట్టూవున్న కొండలు ప్రతిధ్వనించాయి. 104

‘మనం రేపు ఉదయం… ఆ కొండెక్కేద్దామా?’ అని ప్రశాంతి అడగ్గానే పిల్లలంతా ‘ఓ’ అని అరిచారు. రేపు ‘ఆరింటికి పెద్ద పిల్లలు మాత్రమే మాతో రావాలి’ అనగానే చిన్నపిల్లలు మూతిముడిచి మేము కూడా వస్తాం అంటూ గారాం మొదలెట్టారు. ఈలోగా చీకటి కమ్ముకుంటూ వస్తోంది. ‘పిల్లలూ! మీరంతా స్నానాలు చేసేయండి. రాత్రికి కల్చరల్‌ ప్రోగ్రామ్‌ వుంది కదా. ‘అలాగే అక్కా!’ అంటూ పిల్లలందరూ రాత్రికి ప్రదర్శించబోయే నాటకాలు, డాన్సులు, పాటలు గురించి చర్చించుకుంటూ గ్రౌండ్‌లోంచి రయ్‌మంటూ పరుగులు పెడుతూ తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇళ్ళు?? ఇక్కడ ఇళ్ళంటే మనముండేలాంటి ఇళ్ళు కాదు కానీ… దాదాపు అలాంటివే. తమకీ ఓ ఇల్లుంది… ఆ ఇంటికో పేరుంది…. ఓ కుటుంబముంది అనే ఫీలింగ్‌ రావడంకోసం ప్రశాంతి… ఆలోచనల్లోంచి పుట్టుకొచ్చిన చక్కటి ప్రయత్నం ఇది. గుడిశె ఆకారంలో గుండ్రంగా వుండే నిర్మాణాలివి. ప్రతి ఇంటికీ ఓ పేరుంది. అవని … ధరణి … నక్షత్ర…

ఆ ఇంట్లో.. ఆ పిల్లలతో వుండి .. తల్లిలా చూసుకోవడానికి ఓ స్త్రీని కూడా నియమించారు. తమకి ఇల్లువాకిలీ లేదు… తమకెవరూ లేరు అనే ఏకాకి భావానికి గురవ్వకుండా పిల్లలు హాయిగా వుండాలని ప్రశాంతి ఈ ఏర్పాటు చెయ్యడం… నిజంగా అత్యంత అభినందనీయం. పిల్లపట్ల తనకున్న నిబద్ధత, ప్రేమకి నిదర్శనం.

స్నానాలకోసం ఇళ్ళకెళ్ళిన పిల్లలు జలకాలాడి, ఫ్రెష్‌గా, వేసవిలో విచ్చుకునే మల్లెపువ్వుల్లా బిలబిలమంటూ… సాంస్కృతిక కార్యక్రమాల వేదిక దగ్గరికి వచ్చేసారు. తమ జీవితాలనే నాటకాలుగా మలిచి ప్రదర్శించారు. పాటలు పాడారు. డాన్సులు చేసారు. చక్కటి హావభావాలతో, నటనతో ప్రదర్శించిన నాటకాలు చాలా రక్తి కట్టాయి. హింస చుట్టూ అల్లుకున్న నాటకాలు, తమని రోడ్ల పాలుజేసిన గృహహింస’ తాగుబోతు తండ్రులు… కూతుళ్ళను అమ్మేసిన తండ్రులు… తల్లుల్ని కొట్టి చంపేసిన తండ్రులు… అత్యంత విషాదంగా … వీళ్ళే… పిల్లల నాటకాల్లో ముఖ్య పాత్రలైనారు. ఆవరణంతా సందడి సందడిగా పిల్లల నవ్వుల్తో, కేకలతో మారుమోగుతుండగా రాత్రి భోజన సమయమైంది. ఇంకా ఇంకా కొనసాగిద్దామని పిల్లల మారాం… అప్పటికే తొమ్మిదైంది. ”ఉదయమే లేచి కొండమీదకెళ్ళాలి కదా!” అని ప్రశాంతి అనగానే… ‘అవునవును’… అంటూ పిల్లలు లేచి రాత్రి భోజనానికి వెళ్ళారు. అప్పటివరకు హోరెత్తిన వేదిక మూగబోయింది. పిల్లలంతా చాలా క్రమశిక్షణతో భోజనాలు ముగించి తమ ఇళ్ళకి వెళ్ళిపోయారు.

అందరి భోజనాలు అయిపోయాక…. ఆరుబయట… ఆకాశం కింద… అమావాశ్యకి ముందురోజు… కోట్లాది నక్షత్రాలు కాంతి వెదజల్లే వేళ… నేను, ప్రశాంతి భోజనం చేస్తూ చెప్పుకున్న కబుర్లు, పంచుకున్న అనుభవాలు ఇక్కడ రాస్తే… అవే ఓ పెద్ద వ్యాసమౌతాయి. మహిళా సమతా గురించి… రెండేళ్ళ క్రితం సమతా నిలయం ఏర్పాటు చేసినప్పటినుంచి తన అనుభవాలు… ఇంకో మూడేళ్ళవరకు గ్యారంటీగా కొనసాగే వీలున్నప్పటికీ ఆ తర్వాత దాని భవిష్యత్తు ఏమిటి? ఈ పిల్లల భవిష్యత్తు ఎలా వుంటుంది? లాంటి ఆందోళన, తన మాటల్లో పిల్లలపట్ల కన్‌సర్న్‌ స్పష్టంగా కనబడుతూ నన్ను రకరకాల ఆలోచనల్లో పడేసింది. రెయిన్‌బో హోమ్‌ల్లో వున్న వేలాది వీధి పిల్లలు, ఎస్‌ఓఎస్‌ కమ్యూన్‌లలో వున్న లక్షలాది పిల్లలు, అనాధాశ్రమాల్లో వుండే పిల్లలు.. ఎందుకింత మంది పిల్లలు ఇంటికి, తల్లిదండ్రుల ప్రేమకి దూరంగా వుండాలి? ఇన్ని లక్షల మంది అనాధ పిల్లలున్న దేశానికి సిగ్గెందుకు కలగడం లేదు. పువ్వుల్లో పెరగాల్సిన పిల్లలు ముళ్ళకంచల్లోకి విసిరేయబడుతూ.. రక్తాలోడుతూ… అడక్కుంటూ… ట్రాఫికింగ్‌కి సమిధలవుతూ, బాల్యాం కోల్పోయి బాలకార్మికులుగా మగ్గుతూ.. ఎంత అవమానం.. ఎంత అమానవీయం. ఈ ప్రభుత్వాలు ఈ విషయం మీద ఎందుకు స్పష్టమైన పాలసీలతో, ఆచరణలతో పనిచేయలేకపోతోంది. ”ఏంటి అమ్మూ… ఆలోచిస్తున్నావ్‌” ప్రశాంతి అంటుంటే నేను నా ఆలోచనల్లోంచి బయటకొచ్చి చూస్తే… ఎక్కడో అడవిలో వున్నట్టనిపించింది. చుట్టూ నిశ్శబ్దం. మేమిద్దరం ఎంత సేపు కూర్చుని మాట్లాడుకున్నామో!! సమతా నిలయం… ఆ పిల్లలు నా గుండెంతా ఆక్రమించుకున్నారు. పొద్దున్నే లేవాలి కదా అనుకుంటూ… అప్పటికి మాటలకి కామా పెట్టి పడుకోవడానికి గెస్ట్‌ హౌస్‌కి వెళ్ళాం కానీ… పడుకున్నాక కూడా అవే కబుర్లు అంతూపొంతూ లేని కబుర్లు…. అనుభవాల ప్రవాహం సాగుతూనే వుంది. అర్థరాత్రి దాటాక…. రోజంతా ఎండలో తిరిగినా… ఎన్నో కార్యక్రమాల్లో మునిగితేలినా సరే… అలసట లేకపోయినా నిద్రమ్మ కళ్ళమీద వాలినపుడు, కళ్ళు అరమోడ్పులైనపుడు మాత్రమే మా కబుర్లకి ఫుల్‌స్టాప్‌ పడింది. ఆ తర్వాత గాఢనిద్రలోకి జారిపోయాను.

మర్నాడు ఐదున్నరకే… రకరకాల పక్షుల పాటలు వినబడి మెలకువ వచ్చేసింది. మా గది పక్కనున్న మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల పాటకచేరి మొదలుపెట్టింది. రూమ్‌ వదిలి బయటకొస్తే… పిల్లలు అప్పటికే బయట గుమిగూడారు. బకెట్‌లో నీళ్ళు తెచ్చి కళ్ళాపి చల్లుతుంటే నేను చల్లుతానంటూ లాక్కున్నాను. నేను… నేను అంటూ ప్రశాంతి వచ్చింది. మళ్ళీ నవ్వుల జల్లులు మొదలయ్యాయి. ప్రశాంతి ముగ్గు వేయడానికి ముగ్గుడబ్బా తీసుకుంది. తమాషాగా నాకూ అన్పించింది ముగ్గెయ్యాలని. జీవితంలో అప్పటివరకు ముగ్గేసింది లేదు. అయినా సరే వేస్తా… వేస్తా అంటూ ప్రశాంతి వెంటబడ్డాను. సరే వెయ్యమని, ముగ్గు తీసుకోమంది. నేను ముగ్గు పట్టుకున్న తీరుకి ప్రశాంతి పకపకా నవ్వింది. వంటరాని నేను గరిటె పట్టుకుంటే…ఇది పెన్‌ కాదమ్మా! గరిటె… అలా పట్టుకుంటే కాలుతుంది అని వెక్కిరించే ప్రశాంతి… ముగ్గుని అలా పట్టుకుంటారా అమ్మూ! ఇలా పట్టుకోవాలి అని క్లాసుపీకింది. నేను ఓ తీగని ముగ్గుతో వేసాను అష్టవంకర్లతో. నేను వేసిన తీరుకి పిల్లలందరూ కూడా నవ్వారు.

ఓ పది నిముషాల తర్వాత మా ట్రెక్కింగ్‌ మొదలైంది. చిన్న పిల్లల్ని వదిలేసి ఓ పెద్ద గుంపుగా బయలుదేరాం. కొండ పెద్దదే. దారి కూడా లేదు. కొండమీద రకరకాల చెట్లు. కొన్ని చెట్ల నిండా పువ్వులు. నేను ఓ వెదురు కర్ర చేతబట్టి, దాని సపోర్ట్‌తో ఎక్కసాగాను. కొంతమేర ఎక్కేటప్పటికి వొళ్ళంతా చెమటతో తడిసిపోయింది. దారి లేకపోవడం వల్ల బండరాళ్ళ మీద, ముళ్ళపొదల్లోంచి నడుస్తున్నాం. నేను ఎక్కడానికి కష్టపడుతుంటే రవి నా చెయ్యిపట్టుకున్నాడు. అప్పటి నుండి మళ్ళీ నేను దిగేవరకు నా చెయ్యి వొదల్లేదు. నా కోసం దారి చేస్తూ.. తాను జారిపోతున్నా నన్ను జారకుండా పట్టుకుంటూ…. రవి ఎంత బాధ్యతగా ప్రవర్తించాడో. సగం ఎక్కేటప్పటికి నాకు ఆయాసం మొదలై ఒకచోట కూర్చుండిపోయాను. రవి తానుకూడా నాతో కూర్చున్నాడు. పిల్లల గుంపు ముందుకెళుతోంది. ప్రశాంతి… వోరకంట నా గమనాన్ని గమనిస్తూనే వుంది. నేను కూర్చున్నప్పుడు… తను పై నుంచి చూస్తూ నిలబడి వుంది కానీ… ఎక్కొద్దు… ఆగిపో ఇంక అనలేదు. కొంత ఆయాసం తీరాక మళ్ళీ నేను ఎక్కసాగాను. రవి నా చెయ్యి వొదలలేదు. ఎక్కివచ్చిన ప్రాంతాన్ని చూస్తూ దిగగలనా? ఇలా జారిపోతోంది. అంటే, వెంటనే రవి షారుఖ్‌ ఖాన్‌ లెవెల్లో ”మై హూనా అమ్మా! నేనున్న కదా! దింపేస్తా కదా” అన్నాడు. నాకు భలే నవ్వొచ్చింది. మరో పదిహేను నిముషాలు నడిచి కొండపైకి వెళ్ళిపోయాం. పై కెళ్ళాకా ”ఐ డిడ్‌ ఇట్‌” అంటూ గట్టిగా అరిచాను. పిల్లలంతా నా చుట్టూ చేరారు. ఫోటోల మీద ఫోటోలు తీసారు. నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. నాలుగు మెట్లెక్కితే ఆయాసంతో ఉక్కిరిబిక్కిరయ్యే నేను అంతపెద్ద కొండని అవలీలగా ఎక్కేసాను. ఆగు… ఆగు… నీ ముఖం నువ్వెక్కడెక్కావ్‌… బడాయి కాకపోతే అంటూ లోపల్నించి తిట్లు… రవి.. రవి వల్లే నేను కొండెక్కి కొండంత సంతోషం మూటగట్టుకున్నాను.

ఓ అరగంట కొండమీద అల్లరి చేసి, అరిచి, పాటలు పాడి దిగడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. కిందికి చూస్తుంటే సీనరీ అద్భుతంగా వుంది. సమతా నిలయం… ఎనిమిది గుండ్రటి ఇళ్ళు కన్పిస్తున్నాయి. కొన్ని పచ్చటి పొలాలు కొన్నే నీళ్ళున్న నాలుగు చెరువులు కన్పించాయి. ఎడంచేతి వేపు ఎద్దు మూపరంలా వున్న కొండని చూపిస్తూ ”అమ్మా! మా ఊరు అదిగో ఆ కొండల మధ్యే వుంది. అదిగో చూడు. బస్సుస్తోంది కదా అదే మా ఊరు” అంటూ చూపించాడు రవి. ఆ ఊరిలో రవికి చాలా బాధాకరమైన అనుభవాలున్నాయి. ఆ పిల్లాడి ముఖంలో ఆ బాధ స్పష్టంగా కనబడింది. ”ఇంక దిగుదామా పిల్లలూ” అని ప్రశాంతి అనగానే పిల్లలంతా ఓకే… అంటూ బయలుదేరారు. దిగవలసిన దారి చూస్తుంటే… కాళ్ళు జారడమేమో గానీ గుండె జారిపోతోంది. వామ్మో! ఎలా దిగాలి… జర్రున జారుతోంది. పడితే… ఇంతే సంగతులు. చిత్తగించవలెను. జారిపడి, కాలుగాగ విరిగిందంటే ఆరువారాల బెడ్‌రెస్ట్‌… నేనిలాంటి ఊహల్లో ఊరేగుతుంటే రవి వచ్చి ”పదమ్మా!” అని చెయ్యిపట్టుకున్నాడు. ఇంకో పక్క అశోక్‌ వచ్చి నిలబడ్డాడు. ఎంత భరోసా నాకు! దిగడం మొదలు పెట్టాను. పిల్లలంతా ‘అమ్మమ్మా! జాగ్రత్త’ అంటూ… అందరూ చెయ్యందించడానికి పోటీ పడ్డారు. నేను దిగుతున్నానని గొప్పగా చెబుతున్నాను కానీ… వాళ్ళే నన్ను దింపేస్తున్నారు. ఒకరు ముళ్ళ మొక్కల్ని తప్పిస్తుంటే… ఇంకొకరు నా చెయ్యిగట్టిగా పట్టుకున్నారు. కొంచం చదునుగా వున్న చోట కాసేపు సేదతీరుదామని ఆగానా! ఇద్దరమ్మాయిలు పసుప్పచ్చ పువ్వులు కోసుకొచ్చి… ‘అమ్మమ్మ! ఇవి నీకు ప్రశాంతక్కకి” అని ఆ పూలను నా ముందు పెట్టారు. ఆకులు కోసుకురమ్మని, తాడుంటే చూడమని చెపితే రయ్‌మని వెళ్ళితెచ్చారు. ఆ పూలతో చక్కటి గుచ్ఛం తయారుచేసాను. ప్రశాంతి ఎక్కడో వెనకుంది. పిల్లలందరినీ జాగ్రత్తగా తీసుకొస్తోంది. అంత దూరం నించి నా మీద ఓ కన్నేసి, ఎలా దిగుతున్నానో చూస్తూనే వుంది. అక్క ఎప్పుడొస్తుందా? ఎప్పుడు గిఫ్ట్‌ ఇవ్వాలా అని పిల్లలకి ఒకటే ఆత్రంగా వుంది. ఓ పది నిముషాలకి ప్రశాంతి మా దగ్గరకొచ్చింది. పిల్లలు గొప్ప సంతోషంతో ”అక్కా! ఇది నీ కోసం, అమ్మమ్మ కోసం” అంటుంటే… ప్రశాంతి దానిని తీసుకున్నప్పుడు వాళ్ళ ముఖాల్లో ఎంత గర్వమో! ఎంత సంతోషమో!

ఓ అరగంట కష్టపడి మొత్తం కొండ దిగేసాం. అప్పటికి బాగా ఎండ వచ్చేసింది. చెమటలు ధార కడుతుంటే మరో అరమైలు నడిచి ‘సమతా నిలయానికి’ వచ్చేసాం. బాగా ఆకలిగా వుంది పిల్లలకి, మాక్కూడా! పిల్లలకి వంట చేసి పెట్టే లక్ష్మి వేడి వేడి కిచిడి, పచ్చిపులుసు వడ్డించింది. పిల్లలు ఆవురావురుమంటూ తినేసారు. పిల్లలు తినేసాకా మేం కూడా తినేసాం. కిచిడి, పచ్చిపులుసు చాలా బావున్నాయి. లక్ష్మికి చెబితే చాలా సంతోషపడింది. శాంతి ప్రబోధ నా దగ్గరకొచ్చి ”మీరు అమ్మాయిలకి క్లాసు తీసుకుంటానన్నారుగా! ఒక రూమ్‌లో కూర్చోబెట్టనా” అని అడిగారు. ”తప్పకుండా! కూర్చోబెట్టండి. పది నిమిషాల్లో వచ్చేస్తాను.” అని చెప్పాను. స్నానం చేసివచ్చే టైమ్‌ లేదు. అలాగే క్లాసులోకి వెళ్ళిపోయాను.

అంతకుముందు రోజు రాత్రి ప్రశాంతి, నేను భోజనం చేస్తున్నపుడు, అక్కడ టీచర్‌గా పనిచేసే మంజుల మాతో కాసేపు కూర్చున్నారు. టీనేజ్‌లోకి వస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడారు. నేను అప్పుడే అనుకున్నాను. సమతా నిలయంలో వున్న అమ్మాయిలతో కొంచంసేపు మాట్లాడితే బావుంటుందని. శాంతి గారు అమ్మాయిలందర్ని ఒకచోట కూర్చోబెట్టారు. నేను వాళ్ళతో గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి చెప్పాలని, వాళ్ళతో ఫ్రీగా అన్ని విషయాలు మాట్లాడాలని అనుకున్నాను. అలాగే ప్రేమభావనల గురించి, వాళ్ళవాళ్ళ కలల గురించి, జీవిత వాస్తవాల గురించి కూడా చెప్పాలనిపించింది.

529పిల్లలు చాలా ఉత్సాహంగానే నాతో మాట్లాడారు. శరీర ధర్మం గురించి, శరీరంలో వయస్సుతోపాటు వచ్చే మార్పుల గురించి చెప్పి, ఆ మార్పుల్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా సంభాళించుకోవాలి? శరీరంలో కొన్ని భాగాలు ఎలా సున్నితంగా స్పందిస్తాయో చెప్పినపుడు పిల్లలంతా నవ్వుల్లో మునిగారు. మన ప్రయివేట్‌ పార్ట్స్‌ అంటే ఏమిటి? మనకిష్టం లేకుండా వాటిని ఎవ్వరూ తాకకూడదని అర్థం చేసుకోవాలని చెబుతూ ప్రైవేట్‌ పార్ట్స్‌ ఏవి అని చెబుతున్నపుడు పిల్లలంతా గొల్లున నవ్వారు. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి కూడా వివరంగా చెప్పాను. ఎవరైనా మనకిష్టం లేకుండా మన శరీర భాగాలను తాకితే, మనల్ని లైంగికంగా ఇబ్బంది పెడితే ఏం చేయాలో చెబుతూ… అలా ఎవరైనా మనం వొంటరిగా వున్నపుడు కానీ, రోడ్లమీద నడుస్తున్నపుడు గానీ, స్కూల్‌లో వున్నపుడు కానీ ఎవరైనా మన ప్రైవేట్‌ పార్ట్స్‌ను ముట్టుకుంటే గట్టిగా ‘నో’ అని అరవాలని, వేగంగా ఆ ప్రాంతంనుంచి పరుగెత్తి వెళ్ళిపోవాలని చెప్పినపుడు, గదంతా ప్రతిధ్వనించేలా ‘నో’ అని అరిచారు. ఆ తర్వాత జరిగిన సంఘటన గురించి టీచర్లకి, పెద్దవాళ్ళకి చెప్పాలని, అమ్మానాన్నలతో వుండేవాళ్ళు అమ్మకి చెప్పాలని చెప్పాను. మీరు ఎవరికి చెబుతారు అని అడిగితే ప్రశాంతక్కకి చెపుతామన్నారు కొంతమంది పిల్లలు. ప్రశాంతక్క ఇక్కడ ఎప్పుడూ వుండదుగా మరి అంటే టీచర్‌కి చెబుతాం అన్నారు. దాదాపు గంటసేపు వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళల్లో టీనేజ్‌లోవున్న ఒకమ్మాయిని వచ్చి నేను చెప్పిన విషయాలు ఎలా అర్థమయ్యాయో చెప్పమంటే చాలా చక్కగా చెప్పగలిగింది. పిల్లలు కొన్ని ప్రశ్నలు వేసారు. పిల్లలందరితోను గట్టిగా మళ్ళొకసారి ‘నో’ అన్పించి క్లాసు ముగించేసాను. వాళ్ళకు నేను చెప్పినదంతా గుర్తున్నా వుండకపోయినా… తమకిష్టం లేకుండా ఎవరైనా వొంటిమీద చెయ్యేస్తే చెవులు చిల్లులు పడేలా ‘నో’ అని అరవడం మాత్రం బాగా అర్థమైంది.

ఇంక కొంతసేపట్లోనే ‘సమతా నిలయాన్ని’ వదిలి వెళ్ళాలి. అక్కడినుండి నేను, ప్రశాంతి ఆర్మూరు వెళ్ళాలి. అమృతలత మాకోసం కారు కూడా పంపించారు. పిల్లలంతా వెళ్ళొద్దని అడుగుతున్నారు. లంచ్‌ అయ్యాకా వెళ్ళమని, సాయంత్రం వెళ్ళమని అంటున్నారు. నిజానికి వాళ్ళతో ఇంకో రోజు వుండాలనిపించింది. కానీ వెళ్ళాలి. పిల్లలకి అప్పటికి బై చెప్పేసి, నేను గెస్ట్‌ హౌస్‌కి బయలుదేరితే పిల్లలంతా వెంటపడ్డారు. ‘అమ్మమ్మా! ఈరోజుండండి’ అంటూ ప్రాధేయపడ్డారు. వాళ్ళకి సర్దిచెప్పి పంపించేసరికి… చాలా బాధన్పించింది. వుంటే బావుండు కదా అని కూడా అన్పించింది. కానీ వెళ్ళాలి కదా!

నేను స్నానం చేసి, అన్నీ సర్దేసి, తయారై వచ్చేను కానీ ప్రశాంతి ఇంకా క్లాసులోనే వుంది. మగపిల్లలందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతోంది. ఓ అరగంట తర్వాత తను వచ్చేసింది. మేం తయారై బయలుదేరబోతున్నపుడు పిల్లలు వాళ్ళే తయారుచేసిన రకరకాల గిఫ్ట్‌లు మాకివ్వడం కోసం ఎదురుచూస్తున్నారు. ఒకమ్మాయి చక్కటి బొమ్మవేసి ప్రశాంతక్కకి, అమ్మమ్మకి అని రాసిచ్చింది. భూమిక నాకోసం పేపర్‌తో తయారుచేసిన మూడు బహుమతులిచ్చింది. అందులో ఒకటి మనీపర్స్‌, పర్స్‌లో డబ్బులెక్కడ పెట్టుకోవాలో, విజిటింగ్‌ కార్డులెక్కడ పెట్టుకోవాలో పర్స్‌ తెరిచి చూపించింది. వెంటనే నా విజిటింగ్‌ కార్డుల్ని, ఓ ఐదొందల నోటుని ఆ పేపర్‌ పర్స్‌లో పెట్టి చూపించగానే ఆ పిల్ల ముఖం పువ్వులా విప్పారింది. కాసేపు వాళ్ళతో గడిపి వాళ్ళని లంచ్‌కి పంపించేసి మేం బయలుదేరాం. ‘పిల్లలందరికీ బై చెప్పాలనుంది అమ్మూ! కానీ వాళ్ళ ఏడుస్తారు. అది నేనా భరించలేను. పైగా వాళ్ళకి లంచ్‌ టైమ్‌. మనం చెప్పాలని వెళితే వాళ్ళంతా లేచివచ్చేస్తారు’ అంది ప్రశాంతి. తన గొంతులో చాలా దిగులు విన్పించింది. కళ్ళల్లో సన్నటి నీటిపొర. ”వాళ్ళే కాదు అమ్మూ! నేను ఏడుస్తాను. వద్దులే. వెళ్ళిపోదాం” అంది. నాకూ ఆ ప్రాంతం, ఆ పిల్లలు… అలా వదిలేసి వెళ్ళిపోవడం బాధగానే వుంది. తప్పదుగా. మా కారు నిజామాబాద్‌వేపు బయలుదేరింది. మాతోవచ్చిన పిల్లలు, ఖాదిర్‌ కారులో నాలుగింటికి మమ్మల్ని డిచ్‌పల్లి దగ్గర కలిసారు.

‘సమతా నిలయం’ బోర్డు చాలా దూరం వరకు కనబడుతూనే వుంది. ఆ బోర్డు వెనక, అన్నం తింటున్న పిల్లలు, పచ్చటి పరిసరాలు, ఎర్రటి తురాయిపూలు క్రమంగా దూరమవుతూ వచ్చాయి.

‘సమతా నిలయం’ గురించి, అక్కడ నాకెదురైన అనుభవాల గురించి రాద్దామని కూర్చున్నపుడు, ఎన్నెన్నో జ్ఞాపకాలు నా చుట్టుముట్టాయి. అరవై ఏళ్ళ వయస్సులో నేను పిల్లల్లో ఓ పిల్లగా అవతారమెత్తడం గురించి నాకే ఎంతో అబ్బురమన్పించింది. ఇలాంటి అనుభవాలు చాలా అవసరమని కూడా అన్పించింది. ఆ రెండు రోజులు నాకింకేమీ గుర్తు రాలేదు. ఇల్లు, ఆఫీసు, పనులు ఇవేవీ నన్ను ఇబ్బంది పెట్టలేదు. మనో, వాక్కాయ కర్మలా, పూర్తిగా పిల్లలతోనే వుండిపోయాను. పిల్లల్ని వాళ్ళ క్లాసులో చూసింది మొదలు, వాళ్ళని వదిలి వచ్చేవరకు వాళ్ళతోనే వున్నాను. వాళ్ళు మా చుట్టూనే వున్నారు. అందుకే పిల్లలు అంత దగ్గరై పోయారు. నేను చేయగలనా? లేదా అని సంకోచించిన అన్ని పనుల్ని పిల్లలు నాచేత సూనాయాసంగా చేయించేసారు. చెట్లెక్కడం, సైకిల్‌ తొక్కడం, కబడ్డీ ఆడడం, కొండలెక్కడం… ముఖ్యంగా ట్రెక్కింగ్‌… నాకు గొప్ప అనుభవాన్నిచ్చింది. నామీద నాకు నమ్మకాన్ని, గౌరవాన్ని ఇనుమడింపచేసిన సందర్భమది. ఎందుకంటే ట్రెక్కింగ్‌ నేను చెయ్యలేనని, నా గుండె అందుకు సహకరించదని, ఆయాసం వస్తుందని ఓ భయం నాలో వుంది. ఇంతకు ముందు చాలా సార్లు అలా జరిగింది కూడా! కానీ రవి, అశోక్‌లు నాలో వున్న అన్ని భయాల్ని చెదరగొట్టేసారు. నాకో చక్కటి అనుభవాన్నిచ్చారు. నేనెప్పటికీ మర్చిపోలేని మధురానుభవమది. అయినా… ఈ వయస్సులో అన్ని అడ్వంచర్లు చెయ్యాలా? అని ఎవరైనా సన్నాయినొక్కులు నొక్కితే… వాళ్ళకో నమస్కార బాణం వెయ్యడం తప్ప… వేరే సమాధానం లేదు.

ఇంతటి అపురూపమైన అనుభవాలను నాకందించిన ప్రశాంతికి ఎలా థాంక్స్‌ చెప్పాలి? ‘సమతా నిలయం’ తనకు అత్యంత ప్రాణప్రదమైన ప్రాజెక్ట్‌. ఆ పిల్లలు తనకు అత్యంత ఆత్మీయలు. సమతా నిలయం గురించి తన ఆలోచనలు, కన్‌సర్న్‌లు నాతో పంచుకున్నపుడు నేను ఒక్కటే మాటన్నాను. నన్ను కూడా నీ ప్రాజెక్టులో భాగం చేసుకో. ఇపుడు సమతా నిలయం నాకూ ప్రియమైనదే. ఈ పిల్లల భవిష్యత్తు కోసం మనం తప్పకుండా ఏదైనా చేద్దాం’ అని చెప్పాను. అప్పటికే నాలో కొన్ని ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి కూడా. ఒక బ్రోచర్‌ తయారు చేయాలని, మితృలందరికీ ఆ పిల్లల గురించి చెప్పాలని నిర్ణయించుకున్నాను. అలాగే పిల్లలు రాసిన కథల్ని, కవితల్ని భూమికలో వెయ్యాలని కూడా నిర్ణయించుకున్నాను. వాళ్ళల్లో ఎన్నో కళలున్నాయి. ‘భూమిక’ వేసిన బొమ్మలు చూసినపుడు నాకు మతిపోయింది. అలాగే రవి రాసిన కథ, తన ఇంట్లో వున్న ఓ చేపల బొమ్మని చూసిన స్ఫూర్తితో రాసిన కథని నాకు చెప్పాడు. పిల్లలందరిలో గొప్ప సృజనాత్మకత వుంది. ఆ …. అన్నట్టు వాళ్ళు ప్రదర్శించిన నాటకాలు… డైలాగులు, దర్శకత్వం అన్నీ వాళ్ళే.. అభినయం కూడా అద్భుతం. ‘వాళ్ళు మట్టిలో మాణిక్యాలు’ అంది ప్రశాంతి. బొగ్గురూపంలో వున్న మాణిక్యాలు. సానబెట్టాలి. ధగధగ మెరిసిపోతారు. చిన్న ఆసరా ఇస్తే అల్లుకుపోతారు.

ఇలాంటి మణి దీపాల్లాంటి లక్షలాది పిల్లల్ని రోడ్ల పాల్జేస్తున్న వైనాల గురించి ప్రభుత్వం సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. పిల్లలు రోడ్లపాలవ్వడానికి ముఖ్య కారణం పేదరికం, కుటుంబహింస. తండ్రులు తమ కళ్ళముందే తల్లుల్ని చంపేస్తుంటే కళ్ళారాచూసిన పసిమొగ్గలున్నారు. తాగొచ్చిన తండ్రి, తిరుగుబోతు తండ్రి, బాధ్యతలొదిలేసిన తండ్రి… మగాడి దాష్టీకం… పిల్లల్ని ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తున్నాయి. వీటన్నింటి గురించి ప్రభుత్వాలు ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇళ్ళల్లో, తల్లిదండ్రులతో సురక్షితంగా వుండాల్సిన పిల్లలు… అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఎందుకు బతకాల్సివస్తోంది? దేశ సంపద పిల్లలు. వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే…. వాళ్ళనలా గాలికీ, ధూళికీ వదిలేస్తే ఎదురయ్యే పరిణామాలేమిటి? హాయిగా ఆడుకుంటూ, పాడుకుంటూ పాఠశాలల్లో వుండాల్సిన దేశసంపద… పిల్లలు ఇలా అనాధశ్రయాల్లోనూ, ఎస్‌.ఓ.ఎస్‌లోనో. సమతా నిలయంలోనో, మరింకెక్కడో దిక్కు మొక్కు లేనివాళ్ళుగా ఎందుకు బతకాలి? నాలో ఎన్నో ఆలోచనలు… గుండెల్లోంచి తన్నుకొస్తున్న ఆగ్రహం…

నేను ఈ అనుభవాలను రాస్తున్నపుడే… ఆశ్చర్యంగా రవి ఫోన్‌ చేసాడు. ‘అమ్మా! నేను రవిని మాట్లాడుతున్నాను’. అంటే ఓ క్షణం నాకు అర్థం కాలేదు. తను ఫోన్‌ చేసి మాట్లాడతాడని నేను అనుకోలేదు. ‘అశోక్‌’ కూడా నాతో వున్నాడమ్మా’ అంటే ఇంకా ఆశ్చర్యపోయాను. కాయిన్‌ బాక్స్‌ నుంచి మాట్లాడుతున్నామని, మీతో మాట్లాడాలన్పించిందని వాళ్ళు చెప్పినప్పుడు నా కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. బాగా చదువుకోమని, ఏం కావాలన్నా నాకు ఫోన్‌ చేయమని చెప్పాను. ‘మళ్ళెప్పుడు వస్తవమ్మా’ అని రవి అడిగినపుడు, అతి తొందరలోనే వస్తానని చెప్పాను కానీ… ఆ రోజు ఎప్పుడొస్తుందో!! కాయిన్‌ బాక్స్‌లోంచి మాట్లాడటంతో మాటి మాటికీ కట్‌ అయిపోవడంతో వాళ్ళతో మనసారా మాట్లాడినట్టనిపించలేదు.

వెళ్ళాలి… మళ్ళీ వర్ని వెళ్ళాలి. ప్రశాంతిని అడగాలి ఎపుడు వెళదామని. సమతా నిలయం పిల్లలు ప్రస్తుతం నాకూ పిల్లలే. నాకు ఇప్పటికే చాలామంది అమ్మాయిలున్నారు. ఇపుడు అబ్బాయిలు కూడా చేరారు. వర్ని ట్రిప్‌, సమతా నిలయం చూడ్డం, ఆ పిల్లలతో గడపడం నాకెప్పటికీ గుర్తుండిపోయే చక్కని అనుభవం.

థాంక్యూ! ప్రశాంతీ!!!

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

One Response to

  1. క్రియారూపం దాల్చని నా మనసులో కోరికలన్నీ మీ అనుభవంలో చూసుకున్నాను ముందుగా ప్రశాంతి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఎందఱో పిల్లల పట్ల ఆమె చూపే కరుణ,ప్రేమతో పాటు వారి భవిష్యత్ పట్ల ఉన్న శ్రద్ధతో … ఒక మార్గం వేసిన తీరు నాకు అద్భుతం అనిపించాయి
    సత్యవతి గారు మీ మాటలలో అక్కడి దృశ్యాలు అలా కదలాడి మనసు తడిపేసాయి రవి ఫోన్ చేసినప్పటి సమయంలో మీరెలా feel అయ్యారో అలాగే నేను feel అయ్యాను .అభిమానానికి, ప్రేమకి మనం ఏం బడులివ్వగలం ? వాటినే రెట్టింపు ఇవ్వడం తప్ప . మీరు ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు జీవించాలి మీరు వేసే ముందడుగులో మాలాంటి వాళ్ళు కలవాలి . బలహీనుల పట్ల, అండదండ లేనివాళ్ళ పట్ల,అనాధ బాలల పట్ల మన ప్రేమ రెట్టింపు కావాలి. మాటలలో కాదు చేతలలో కూడా చూపించే ఆదర్శం అవసరం అనిపిస్తుంది మనసారా మీకు అభినందనలు .

Leave a Reply to Vanaja Tatineni Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.