…..

జూపాక సుభద్ర

ప్రముఖ పాట కవి రచయిత కలేకూరి ఒక అంతు చిక్కని సముద్రం. కుల సమాజ విలువలకు అర్థంగాని లోతు. సూడో సమాజం మర్యాదల్ని, మెరుగుల్ని బద్దలు గొట్టిన బతుకు. కుటుంబ వలలో చ్కికుండా చివరిదాకా పోరిన జీవనం. సాహిత్య సమాజానికి, కుల సమాజానికి ఎక్కుపెట్టిన ప్రశ్న కలేకూరి ప్రసాద్‌. జవాబు మొదలుకాకుండానే తనను తను మృత్యువును కబలించుకోవడం విషాదం.

చంద్రశ్రీ ప్రథమ వర్ధంతి రాబోతుంది. ఆ సందర్భంగా ఆమె యాదిలో ఒక సంకలనం తేవాలని ‘మట్టిపూలు’ రచయిత్రులు నిర్ణయించడం జరిగింది. అందుకు నెలకింద చంద్రశ్రీ స్నేహితులకు, ఎరిగిన వాల్లకు చంద్రశ్రీ గురించి రాయమని మెయిల్స్‌ బెట్టి ఫోనులు చేస్తున్న క్రమంలో కలేకూరి వేరే మిత్రుడి ద్వారా కలేకూరి కలిసిండు. ‘చంద్రమీద కలేకూరన్న గూడ రాస్తాడట మాట్లాడు’ అని చెప్పిండు. ఒక్క నిమిషం ఆశ్చర్యం, ఉద్వేగం. 5, 6 సం|| లైంది కలేకూరిని చూడక. ఇన్నాల్లు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడో తెలువది. ఆరోగ్య సమస్యలతో వున్నాడని విన్న. కాని ఇప్పుడు చాలా స్పష్టంగా ఖంగున మాట్లాడ్తుండు. గొంతుల జీర, నీరసం లేదు. బిడ్డడు ఏమైతడో అనే బెంగ బడిండ్రు చానమంది. హమ్మయ్య బిడ్డడు బతికి బట్టగట్టిండు మల్లా సాహిత్య కెరటమై ఆకాశం అంచులు తాకొస్తడనుకొని సంతోష పడ్డ. ‘చంద్రకు నువ్వు మిత్రుడివి కదా చంద్ర గురించి రాయన్నా’ అంటే ‘నాకు రెండు రోజులు టైమివ్వు నానా’ మూడో రోజు అందుతుందని చెప్పిండు.

మల్లా రిమైండర్‌గా 17-5-13 రాత్రి 8 గం||లకు చంద్రశ్రీ వ్యాసం అడగడానికి అదే మిత్రుడికి ఫోను జేస్తే ‘ఇంకెక్కడ అన్న, అన్న అరగంట కింద పోయిండు’ పాటగాడై పల్లె పల్లెనా దళిత కోయిలై బతుకు పాటను పంచిన కలేకూరి కర్మ భూమిలో పూసిన ఓ పువ్వు పాట ఆడవాళ్లకు దగ్గర జేసింది. ఈపాట వూర్లల్ల ఆడపిల్లల కోసం వుత్తేజితంగా, విషాదంగా కూడా పాడేవాల్లు. చనిపోయిన ఆడవాల్ల ఆత్మశాంతిగా ఈ పాట పాడుకుని స్వాంతన పొందేల్లు.

ఉద్యమాల్లో కలేకూరి తెలవకున్నా అతని పాటలు బాగా పాడుకునేటోల్లము. ‘కీచకుల సీమలోన చెల్లెలా నువు అలజడివై కదలాలి రగలాలి బతుకులపై చీకటి పడి ఎన్నికలలు చెదిరాయో’ పాట బాల కార్మికుల మీద రాసిన ‘చిన్ని చిన్ని ఆశలం – చిట్టి చిట్టి బాలలం’ లాంటి అనేక పాటలు యువక పేరుతో రాసిన కలేకూరి ప్రసాద్‌ పాటలు మమ్మల్ని ఉత్తేజితం చేసిన చైతన్య గీతాలు. ఈ పాటలు పాడుతున్నపుడు ఆ కవిని చూడాలని బాగా వుండె. ఆడవాల్లపట్ల యెంత సానుకూలత, ఎంత ఆర్తి. మగవాల్లతో వివక్షలు ఎదుర్కోవడం అణచివేతల అనుభవాలున్న వాల్లంగా యువక ఎవరో ఒక్కసారి చూడాలి మాట్లాడాలని అవకాశం కోసం ఎదురు చూసేది.

భోపాల్‌ డిక్లరేషన్‌ మీటింగు కోసం భోపాల్‌కెళ్లినప్పుడు మొదటిసారి చూసిన కలేకూరిని. అంతకుముందు అతని రచనలను చాలా యిష్టంగా చదివేది. చాలా ఆర్తిగా, ఉద్వేగంగా అతని పాటలు, రచనలుండేవి. వార్తలో కాలమ్స్‌ రాస్తున్నపుడు విడవకుండా చదివేది. మనసును వడిపెట్టి పిండే కాలమ్స్‌ కలేకూరివి. అట్లాంటి కలేకూరి మహిళల పట్ల మర్యాదగా గౌరవంగా మసలే వాడంటరు. జెండర్‌ స్పృహగా వుండేవాడంటరు. ఆడవాల్లను పలకరించడంగూడ ఎడారి ఎండల్లో వానచుక్కలాంటి పలకరంపంటరు. మగ అణచివేతలు, కృరత్వాల్లో ఉన్న ఆడవాల్ల కలేకూరి పలకరింపు ఒక చల్లని జ్ఞాపకం.

కలేకూరి ప్రసాద్‌ ఎంతో మంది ఉద్యమకారులకు, సాహిత్య కారులకు ఇష్టమైన కవి. కుటుంబాలు ధ్వంసం కావాలని కుటుంబానికి అతీతంగా కమ్యూన్‌గా బతకాలనుకున్నడు. కుటుంబ రాజ్యాల్లో వున్నవాల్లు కలేకూరి జీవన విధానాన్ని బలపరచలేదు, హర్షించలేదు. అందికే అతన్ని అరాచక వాది అని భద్ర సమాజం నుంచి దళిత సమాజం దాకా ముద్రలేసిండ్రు. కలేకూరి ప్రసాద్‌ కులం మతం, జెండర్‌, ప్రాంతం ఏదైనా మనిషి మనిషిగా సమాన అవకాశాలు, గౌరవాలతో బత్కాలని ఆశించిన గొప్ప మానవతావాది. అతన్ని కుటుంబానికి పరిమితం చేయాలని, ఇరికించాలని అతని చల్లని వెన్నెల నవ్వుల్ని స్వంతం చేసుకోవాలని ప్రయత్నించి చాలామంది విఫలమైనారు.

సాహిత్యాన్ని దళిత దృక్కోణంతో తిరగదోడిన కలేకూరి, ఈ దేశ ముఖచిత్రంలో అంటరాని పాదముద్రల చరిత్రల్ని వెతికే క్రమంలో అర్థాంతరంగా తనను తాను హింసించుకుంటూ అందరికి దూరంగా మద్యానికి చేరువై కుటుంబానికి ఆవల ధిక్కారంగానే మరణాన్ని ఆహ్వానించడం మామూలు సంగతిగాదు. ఇతరులపట్ల సున్నితంగా వుండే ఈ మహాకవి, ఈ ఉద్యమకవి, పేదోల్ల గుండె పండుగ ఎందుకింత కఠినంగా తనను తాను ధ్వంస చేసుకున్నాడనేది ఎవరికి అంతుబట్టలే. ఒక చైతన్యపు వెలుగురేఖ ఒక దళిత బిడ్డను ఏ చీకటి శక్తులు అతన్ని విధ్వంస విషాదం చేసినయో!

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

One Response to …..

  1. రవికుమార్ బడుగు says:

    కలేకూరి దళితుడు కాబట్టి తాగుబోతయ్యాడు.. లేదంటే శ్రీశ్రీ అయ్యేటోడు

Leave a Reply to రవికుమార్ బడుగు Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.