?

– రమాసుందరి బత్తుల

నిర్భయ అత్యాచారం, హత్య నేపధ్యంలో పెల్లుబుకిన ప్రజాగ్రహం అనేక నాణ్యమైన చర్చలకు, పరిణితి గలిగిన ఉద్యమాలకు పురుడు పోసింది. అత్యాచారాలకు సంబంధించిన మూలాల మీద దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియల నుండి మెరుగైన సాహిత్యం వచ్చింది. ఏళ్ళ తరబడి ఉచ్చరించటానికి వెసులుబాటు దొరకని, మాట్లాడుకోవటానికి అనుమతి దొరకని అత్యాచారాల అంతర్గత మూలాలు ఈ సందర్భంగా గాలి పీల్చుకొని వెలుగు చూశాయి.

నిర్భయ కేసులో ఉరి శిక్షల తీర్పు దరిమిలా ఒక వర్గం నుండి ప్రతిస్పందనలు ఉరికి అనుకూలంగా వచ్చినా వివేకం కలిగిన వ్యక్తులు, సమూహాలు ఈ ఉరి శిక్షలను ఆమోదించక పోవటం కొంత ఊరట కలిగించింది. బాలగోపాల్‌ గారు ఇరవై సంవత్సరాల క్రితం ఉరిశిక్షలకు వ్యతిరేకంగా ప్రచారం చేబట్టినపుడు వచ్చిన వ్యతిరేకత ఇప్పుడు అంత వ్యవస్థీకృతంగా కనబడక పోవటం గమనించదగిన విషయం. సాపేక్షికంగానైనా మారిన సామాజిక ఆలోచనాధోరణి కొత్త దిశలైపు చూపు సాచుతుంది. అయితే మొదడును అటవైపు తెరిచిపెట్టటానికి సంసిద్ధత ఉండాలి. భావోద్వేగాలు, అవేశకావేశాలు తరచుగా అందుకు ఆటంకాలు అవుతుంటాయి.

రాక్షస ఆకృత్యానికి బలై, నిస్సహాయంగా రాజధానిలోనే ఓ రహదారి నడిబోడ్డున సహాయం కోసం అల్లాడిన నిర్భయ కోసం నాడు యావత్భారతం కన్నీరు పెట్టింది. ఈ ఉదంతాన్ని ఒక ఒంటరి సంఘటనగా చూసి కదిలిపోయిన వారు పరిష్కారం కంటె ప్రతిచర్య ఎక్కువ కోరుకున్నారు. అందువల్ల అది కసితో కూడుకుని ఉంది. అయితే ఈ ఘటనను దేశంలో అనేక యేళ్ళుగా స్త్రీలపై జరుగుతున్న పాశవిక లైంగిక దమనకాండకు కొనసాగింపుగా చూస్తూ, ఒక కడపటి దశ కోసం పరిష్కారాలు వెతుకుతున్న వారి కనుచూపు మాత్రం నలువైపులా పరీక్షిస్తుంది. శాశ్వత పరిష్కారాల కోసం అన్వేషిస్తుంది. ఈ వర్గం ఈ సంఘటనకు కరుణ, సానుభూతులకు అతీతంగా ఒక నిస్పాక్షిక దృష్టితో హేతుబద్దమైన ప్రయత్నం చేస్తుంది.

నిజానికి, నిర్భయ లాంటి ఉదంతం మన దేశానికి కొత్త కాదు. ఈ ఘటనకు వచ్చిన ప్రజా స్పందన ఖచ్చితంగా ఆహ్వానింపదగ్గదే. కానీ తాత్కాలిక ఆగ్రహావేశాలు, ప్రతీకార కాంక్షలు హేతుబద్దమైన చూపుని మసక బారుస్తాయి. ఉరికి భయపడి ఇటువంటి నేరాలు తగ్గవని పశ్చిమ బెంగాల్‌లో ధనుంజయ ఘటన తిరుగు లేకుండా రుజువు చేసింది. బాధితురాలి కుటుంబం, బాధితురాలి తరపున గొంతెత్తిన వారి క్రోధావేశాలు చల్లారటానికి ఉరిశిక్ష అనుకొంటే, ఈ శిక్షలను అనుమతించటం వలన జరగబోయే పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. అత్యాచారం జరిగాక హత్య జరిగితే ఐసి సెక్షన్‌ పి. 302 కింద మరణ శిక్ష అందుబాటులో ఉంది. అయితే అత్యాచార నేరానికి (సెక్షన్‌ 376 కింద దోషిగా రుజువయిన వ్యక్తికి) ఉరిశిక్షలు ఉండాలాలేదా అనే దగ్గరే చర్చ వస్తోంది. జస్టిస్‌ వర్మ కమిషన్‌ కూడా ఈ విషయంలో లోతైన విచికిత్స జరిపింది. శిక్షా భయం వలన అత్యాచారాల తరువాత హత్యలు కూడా జరుగుతాయని మహిళా సంఘాలు వెలిబుచ్చుతున్న అభిప్రాయాన్ని పరిగణించి మరణ శిక్షను తిరస్కరించింది.

ధనం, పరపతి, ఆధిపత్యం, కులం దందా చేస్తున్న ఈ సమాజంలో ఎలాంటి శిక్షలైనా బలహీన వర్గాలపైనే మొదట ఎక్కు పెట్టబడతాయనేది ఎల్లరెరిగిన సత్యం. అలా కాదు అనుకుంటే మన పార్లమెంట్‌లో కూర్చోని వున్న ముఫ్పై నలుగురు అత్యాచార ఆరోపితులను విచారించి శిక్షించగలగాలి. అలాగే దేశంలో వివిధ చట్ట సభల్లో ఉన్న ఆరొందల చిల్లర అత్యాచార నిందితుల మీద విచారణ జరపగలగాలి. ఇప్పుడున్న వ్యవస్థ ఈ పని చేయగలదా? ఆవేశపరులు, ప్రతీకారేచ్ఛపరులు ఈ సంగతి ఆలోచించాలి.

భారతదేశంలో సగటున ప్రతి ఐదుగురి మగాళ్ళలో ఒకరు అత్యాచార ప్రయత్నం చేశారని లెక్కలు చెబుతున్నాయి. సామాజిక శాస్త్రవేత్తలు కూడా దీనిని ధ్రువపరచుస్తున్నారు. భారతదేశ కుటుంబాలలో ఉన్న ఫ్యూడల్‌ సంబంధాలు ‘స్త్రీలు బలహీనులు’ అని పసి మనసుల నుండే నూరి పోస్తున్నాయి. అత్యాచార మూలాలు కుటుంబంలో కరడు కట్టిన శిలలైన పురుషాధిక్యత, లింగ వివక్షల్లో ఉన్నాయి. ఈ వివక్షలకు పునాదులు ఫ్యూడల్‌, పెట్టుబడిదారీ సంబంధాల్లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అసమాన, అప్రజాస్వామిక పెంపకాలు ఒకవైపు ఆడపిల్లల సర్వతోముఖాభివృద్ధికి ఆటంకంగా పరిణమిస్తుంటే, మరోవైపు మగపిల్లల ఆరోగ్యకరమైన అవగాహనను, మానసిక ఎదుగుదలను నివారిస్తున్నాయి. ఇంట్లో స్త్రీల అణచివేతకు ప్రత్యక్ష సాక్షి అయిన పిల్లాడు బయట కొంత వెసులుబాటుతో తిరిగే స్త్రీ పట్ల చులకన భావం పెంచుకొంటున్నాడు. ఇది ఈవ్‌ టీజింగ్‌తో మొదలై లైంగిక వేధింపులు నుండి అత్యాచారాల వరకు విస్తరిస్తోంది. దేశంలోకి చొచ్చుకువచ్చిన విదేశీ విష సంస్కృతి ఈ మానసిక వైకల్యానికి ఊతం ఇచ్చి లైంగిక ఉన్మాదానికి బాటలు వేస్తున్నది.

దేశంలో నెలకొన్ని ఆర్ధిక, సామాజిక స్థితి గతులకు ప్రభుత్వాల నిర్లిప్తత తోడుగా ఉంటోంది. ప్రభుత్వాలు అవలంభిస్తున్న ఆర్ధిక విధానాలు, చేస్తున్న చట్టాలు ప్రజలను మరింత పేదరికంలోకి, ఉపాధి లేమిటోకి నెట్టడం వలన అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రజల ఫైనాన్స్‌ వనరులు క్రమంగా విదేశీ కంపెనీలకు అప్పజెప్పే విధానాలు ఒక్కొక్కటీ వరుసగా పార్లమెంటులో చట్టాలుగా రూపొందితున్నాయి. రిటైల్‌ ఎఫ్‌.డి.ఐ చట్టం, భీమా, బ్యాంకింగ్‌ రంగాల ప్రైవేటీకరణ మొదలైన సంస్కరణల చర్యలు ఒకపక్క పబ్లిక్‌ రంగ ఉద్యోగాలను కుదించివేస్తూ మరొపక్క స్వయం ఉపాధి మార్గాలను కూడా మూసేస్తున్నాయి. దానితో ఎన్నో కుటుంబాలు వీధిపాలై సామాజిక సంక్షోభం ఆవిష్కృతం అవుతోంది. ఈ పరిస్థితులు అనేకమంది యువతులు వ్యభిచార కూపంలోకి లాక్కెళ్తుంటే, యువకులు సంఘవ్యతిరేక శక్తుల చేతుల్లోకి వెళ్తున్నారు. (నూతన ఆర్ధిక విదానాలు అమలు అయిన నాటి నుండి ప్లెష్‌ మార్కెట్‌, నేరప్రవృత్తి పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి.) మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్న ఇంకో విచారకమైన సంగతే మిటంటే పట్టణాలలో పెదరికం వలన ఏకాంతం కరువైన ఇళ్ళళ్ళో తల్లితండ్రుల ఏకాంతం పిల్లల భావోద్వేగాల మీద ప్రభావం చూపుతోంది. బహిరంగ, బలవంత శృంగారానికి పునాదులు ఒక కోణంలో గృహాల నుండి కూడా పడుతున్నాయి. ఆదాయాల అసమాన పంపిణీ ఫలితంగా వృద్ధి చెందుతున్న దరిద్రం, పేదరికం, నిరుద్యోగం లాంటి సమస్యలకు ఛాందస సంస్కృతీ విలువలు తోడై మహిళలపై ఆత్యాచారాలకు దారి తీస్తున్న సంగతి గుర్తించకపోతే ఆత్యాచార నేరాలకు సామాజిక పరిష్కారం బదులు ఎంత మాత్రం పరిష్కారం కాని ప్రతీకార పరిష్కారమే మిగులుతుంది.

సామాజిక రుగ్మతలకు కారణాలు వెదికి, మూలాలు పరిశీలించి, అవి రూపుమాపటానికి ఓపికగా వైద్యం చేసే చిత్తశుద్ధి, సంసిద్ధత లేక, సమూహాల ఆగ్రహాన్ని సులభంగా చల్లార్చేటందుకు అమలు పరిచే ఆటవిక న్యాయమే ‘ఉరి’. ప్రజలకు అత్యాచారాలు చేయటానికి భీతి కలగాలంటే ఉరిశిక్షలు కాదు వేయాల్సింది. అత్యాచారాలు నిషిద్దాలని, వాటిని నాగరిక సమాజం ఆమోదించదనే భావజాలాన్ని వ్యాపింపచేయగలగాలి. ఆ రకమైన నైతిక జ్ఞానాన్ని ప్రజలకు ఇవ్వగలగాలి. ఆ కర్తవ్యాన్ని స్వీకరించడానికి బదులు ఉరిశిక్షను పరిష్కారంగా ప్రభుత్వం చూపించడం అంటే రాజ్యమే సమాజంపై అత్యాచారానికి ఒడిగడుతున్నట్లే.

ప్రజల ప్రజాస్వామిక కాంక్షలను అణగదొక్కడానికి రాజ్యం యొక్క వివిధ అంగాలు అత్యాచారాలని ఒక మార్గంగా ఎన్నుకోవటం యాదృచ్ఛికం కాకపోవచ్చు. భద్రతాబలగాల చేతుల్లో కాశ్మీరు, ఈశాన్య ర్ఱాస్టాలు, గిరిజన రాష్ట్రాల మహిళలు ఎదుర్కొంటున్న అమానవీయమైన లైంగిక హింస నుండి వారికి విముక్తి కల్పించాలనీ, పోలీసులు, తదితర భద్రతా బలగాలు సాగిస్తున్న అత్యాచారాలను సాధారణ నేరచట్టాల పరిధిలోకి తేవాలన్న అతి ముఖ్యమైన జస్టిస్‌ వర్మ సిఫారసు గురించి రాజ్యం మాట్లాడకపోవడం వల్ల ఈ అనుమానం కలుగుతోంది. సంఘర్షణాత్మక రాష్ట్రాల్లో ప్రజలు తమ ప్రాధమిక హక్కుల కోసం సాగిస్తున్న పోరాటాలను అణచివేయడానికి వీలుగా ప్రభుత్వాలు అమలులోకి తెచ్చిన ‘సాయుధ బలగాల (ప్రత్యేక అధికారాల) చట్టం’ – జుఓఐఆజు – ను సమీక్షించాలన్న వర్మ కమిటీ సిఫారసు ఊసు కూడా ప్రభుత్వానికి పట్టలేదు. పైగా ఈ చట్టం ఉపసంహరణను సాయుధ బలగాలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయని, కాబట్టి తామేమీ చేయలేమని కేంద్రమంత్రులు చెబుతున్నారు. మేకల్ని వేటాడొద్దని చట్టం చేయడానికి ఎవరన్నా పులుల అనుమతి కోరుతారా, తాము కూడా పులుల్లో భాగం అయితే తప్పు.

అత్యాచార బాధితులు సమాజంలో భాగమైనట్లే అత్యాచార నేరస్తులు కూడా మనతోటే ఉన్నారన్న సత్యాన్ని అంగీకరించకపోతే, మనం ఒక నేరమయ ప్రపంచంలో జీవిస్తున్నామనే కఠిన వాస్తవాన్ని నిరాకరించిన వారమౌతాము. నేరస్థ సమాజాన్ని సంస్కరించకుండా ఎన్ని ఉరితాళ్ళు పేనినా ప్రయోజనం శూన్యమే.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

4 Responses to ?

  1. రమ గారు .. వ్యాసం ఆలోచింపజేసింది పులులున్న సమాజంలోనే మనం జీవిస్తున్నాం అది నిజం .

  2. Lakshmi says:

    అవును నేను మీ తగాపూర్తిగా ఏకీభవిస్తున్నాను రమ గారూ. ముందు ధనిక మరియు రాజకీయ పలుకుబడి గల దోషుల్ని శి క్షి స్తేనేమార్పు సాద్యమవుతుంది.

  3. Karimulla Ghantasala says:

    Good analysis. Very comprehensive. Thanks a lot. But please call her Jyoti Singh Pandey, not Nirbhaya.

  4. Naveen says:

    సహజమైన కుతూహలం కలిగించేవి (స్త్రీ కి పురుషుడు-పురుషుడికి- స్త్రీ), మనసుల్నిఆహ్లదపరచేవీ, ప్రకృతి పరమైన సహజత్వానికి దూరమై, డబ్బు సంపాదించే వ్యాపార వస్తువులుగా మారిపోవడం వల్ల జీవన సంసృ్కతి కలుషితమైపోతోంది. మహిళలపై, మైనర్ బాలికలపై, చివరికి బడిపిల్లలపై లైంగిక అత్యాచారాలకూ, అఘాయిత్యాలకూ, మూలమీ నైతిక, సాంస్కృతిక కాలుష్యమే!

    ఉప్పు పప్పు నూనె బియ్యం లాంటి వినియోగవస్తువుల జాబితాలోకి మనుషుల ఉద్వేగాలతో ముడిపడివున్న వినోదం కూడా చాలాకాలం క్రితమే చేరిపోయింది. అమ్మకాలు కొనుగోళ్ళ మద్య వ్యాపారవస్తువైపోయిన “ఫన్” డిమాండు పెంచడానికి అందులో ఉత్తేజాలనూ, ఉద్రేకాలనూ కలిపేస్తున్నారు.

    స్త్రీపట్ల పురుషుడికీ, పురుషుడి పట్ల స్త్రీ కి స్వాభావికంగా వుండే ఆసక్తి, కుతూహలాలను కృత్రిమంగా రెచ్చగొట్టే విధంగా సినిమాలు వస్తున్నాయి. మనుషులకు సహజసిద్ధమైన లైంగికేచ్ఛ ‘లిబిడో’ ని ప్రకోపింపజేసే వాతావరణాన్ని రూపొందిస్తున్న ప్రతీ ముడిసరుకూ వ్యాపారవస్తువే. బెల్టు షాపులు, లైసెన్సు లేని బార్లు, లైసెన్సువున్న బార్లు, పబ్బులు, ఔటింగులు, డేటింగులు, రేవ్ పార్టీలు మొదలైనవి చివరికి లైంగిక సంతోషాల వైపే దారిచూపిస్తున్నాయి.

    ఈ ఆనందాల వేటలో ప్రలోభాల, భ్రమల ఎరకు చిక్కుకునేది మధ్యతరగతి, పేదతరగతి యువతులూ, మహిళలే – వీరిలో హెచ్చుమంది చివరి మజలీ వ్యభిచారమే అయిపోతోంది.

    దీనికితోడు టెక్నాలజీ విస్పోటనం నుంచి వచ్చిన సోషల్ నెట్ వర్కింగ్ కుటుంబ సంబంధాల్లో సామాజిక బంధనాల్లో, మానవసంబంధాల్లో తీవ్రమైన మార్పులనే తీసుకువస్తోంది.

    ఏకాంతంలో వుండే, వుండవలసిన మధురిమలు బట్టబయలవుతున్నాయి. ఎదుటివారితో ప్రశంసలు పొందాలన్న మనుషుల ఇచ్ఛ స్త్రీలలో పురుషులలో వెర్రితలలు వేసి ఎగ్జిబిషనిజం అవుతోంది.

    ఇక్కడ విశేషమేమంటే వర్చువల్ మాయా ప్రపంచపు మనుషులు అవసరమనుకుంటే నిజంగా ప్రత్యక్షమైపోవడమే. మోహం మొత్తాక మాయమైపోవడమే.

    మనుషులే సృట్టించిన ఇంటర్నెట్ లోకంలోకూడా మానవప్రపంచంలో వున్న మంచీచెడులన్నీ వున్నాయి. అయితే ఇది మంచి ఇది చెడు అని హితవుచెప్పే పెద్దమనుషుల వ్యవస్ధ అక్కడవుండదు. క్లిక్కులు, టా్రఫిక్కు, హిట్సే అక్కడ లాభనష్టాల లెఖ్ఖ.

    పురుషాధిక్య సమాజపు “స్త్రీ పట్ల కుతూహలం” ఇంటర్నెట్ లో పెద్ద వ్యాపారవస్తువు. మానవసమూహాల మధ్యగాక ప్రయివేటుగా కంప్యూటర్లు, ఇతర గాడ్జెట్టుల తెరలమీద మాత్రమే కనిపించే వీలుండటంవల్ల స్త్రీని విశృంఖలంగా చూపించడానికి, చూడటానికి చిన్నపాటి సంకోచమైనా వుండటంలేదు.

    ఇలాంటి “థ్రిల్” ఆఫ్ లైన్ లో, ఇంటర్నెట్ కనెక్షన్ కి అవకాశమే లేని ఫీచర్ మొబైల్ ఫోనుల్లో కూడా శరవేగంతో విస్తరిస్తోంది. మెమరీ కార్డుల్లో బూతు సినిమాలునింపి అమ్ముకునే వ్యాపారం గ్రామాల్లో పెరిగిపోతోంది.

    వీటన్నిటి ప్రభావంగా మెదళ్ళల్లో సెక్స్ శక్తివంతమైన ముద్రతో స్ధిరపడిపోతోంది. ఇందువల్ల ఏ స్త్రీ ని అయినా లైంగిక దృష్టితో చూడటమే జరుగుతోంది. మనిషి వేషంలో వున్న కోర్కెల మృగాల మధ్య మహిళలు తిరుగుతున్నారన్న ఆలోచనే వొళ్ళు జలదరింపజేస్తుంది.

    మహిళలు యువతులు చివరికి చిన్నపిల్లలపై లైంగికదాడులకు మూలాలు ఇవే.

    వంటలో ఉప్పో పులుపో కారమో ఎక్కవైతే పాలో పెరుగోకలిపి వాటిని విరిచేసి రుచికరంగా చేసే చిట్కాలు అమ్మకు తెలుసు. వరదప్రవాహంలా ప్రపంచమంతా విస్తరిస్తున్న ఈ సంస్కృతికి అడ్డుకట్ట వేయడానికి చిట్కాలు చాలవనే అనిపిస్తుంది.

    పాపికొండలు దాటాక దిగువవైపు గోదావరి వడి అంతా ఇంతాకాదు. గట్లను ఎలా కోసేయగలదో ఆ వేగం చూస్తేనే అర్ధమౌతుంది.గట్టుగ్రామాల్లో నివాసముండే గిరిపుత్రులు వెదురు బొంగులను ఒక కోణంవుండేలా చెక్కి ఒక మైలు దూరంలో ఏడెనిమిది వుండేలా నదిలో నాటేవారు. వెదురు కోణం, వాటిని నాటిన దిశలనుబట్టి ప్రవాహం దిశమారుతుంది. అంటే గట్టు కోతపడుతున్నచోటుని మార్చడమే. ఇందులో మహాప్రవాహం ఆగలేదు. చిన్న చిట్కాతో ఒక మళ్ళింపు ద్వారా కోతపడే ప్రదేశాన్ని కాపాడుకోవడమే!

    “నిర్భయ” లాంటి కఠిన చట్టాలు విషఫలాలను మాత్రమే రూపుమాపగలవు. మూలాలను నిర్వీర్యం చేయనంతకాలం ఆడవారిపై అఘాయిత్యాలను ఆపడం” నిర్భయ” వల్లకాదు.

    చట్టబద్ధతకూ, నైతికతకూ హద్దే చెరిగిపోయి, నీతి ఉనికే ప్రశ్నార్ధకమవ్వడంవల్ల ఈ తరం యువతరానికి “తప్పు”, “తలవంపు” అనే స్పృహే తెలియకుండా పోయింది. మనిషిమీద మనిషికి గౌరవ మర్యాదల సంస్కారాన్ని మళ్ళీ తీసుకురాగలిగితే దృక్పధాల్లోనే తప్పక మార్పువస్తుంది. ఇది చట్టాలూ, సామాజిక సంస్ధలపనికాదు. పూర్తిగా తల్లిదండ్రుల పనే. ఏ లైంగిక ఆగడం గురించి చదివినా, విన్నా- కన్నవారు జాగ్రత్తలు చెప్పేది కేవలం కూతుర్లకే…”కొడుకులూ! మీ ఆలోచనలూ నడకలూ జాగ్రత్త” అనాలనే ఆలోచనకూడా తల్లిదండ్రులకు రాకపోవడమే స్త్రీ అభద్రతకు పునాది అవుతోంది

    సాంస్కృతిక కాలుష్యం మీద పాలకుల తో సహా అన్ని పార్టీలు, సామాజిక సంస్ధలు దృష్టిపెట్టాలి. ఒక సాంస్కృతిక విధానాన్నిరూపొందించుకోవాలి. నేరస్ధులను శిక్షించడంతోపాటు స్త్రీ పట్ల దురవగాహనపెంచే మూలాలపై చైతన్యం తేవాలి. నీచమైన ఆలోచనలు ఒక రుగ్మత అనే స్పృహ పెంచాలి. ఇదంతా అంతతేలికేనా అనేఆనుమానం ఎదురౌతుంది. ఆదేసమయంలో గోదావరి ప్రవాహాన్ని మళ్ళించి గట్టు కాపాడుకునే గిరిజనుల అనుభవాన్ని కూడా గుర్తు చేసుకోవాలి

Leave a Reply to Karimulla Ghantasala Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.