– పి. సత్యవతి

ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో రైతుల ఆత్మహత్యలు అధికంగా వున్నాయని పత్రికల్లో చదువుతాం. పత్రికల్లో వచ్చే అనేకానేక భీతావహమైన వార్తల్ని కూడా కాఫీతో పాటు సేవించే స్థిత ప్రజ్ఞత (జడత్వం?) అలవాటైంది కనుక, ఖాళీ కప్పుతో పాటు పత్రికని కూడా పక్కన పెట్టేసి పనుల్లో మునిగిపోగలం. అయితే మరొక వార్త దాని పక్కనే ఉంటుంది. రైతుల కుటుంబాలకి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించిందని!., ప్రకటించడానికి ఇవ్వడానికీ మధ్య ఉన్న అంతరం తెలీని సామాన్యులం, ”గుడ్డిలో మెల్ల” అనుకుంటాం.

ఈ అంతరాన్ని గురించే కోట నీలిమ ”షూజ్‌ ఆఫ్‌ ది డెడ్‌” అనే ఒక ఆలోచనాత్మకమైన నవల వ్రాసింది. ఇక ఇప్పుడు ”మెల్ల’ ఏంలేదు అంతా అంధకారమే అనిపిస్తుంది. ఈ నవల చదువుతుంటే. అయితే కోట నీలిమ ఈ నవలని ఒక ఆశావహ దృక్పథంతో ముగించింది. దాన్నిమనం ”విష్‌ ఫుల్‌ థింకింగ్‌” అనుకున్నా కూడా!! విదర్భలోని పత్తి రైతుల ఆత్మహత్యలు ఈ నవలకి మూలం అని ఆమే చెప్పుకున్నది. విదర్భలో విస్తృతంగా పర్యటించి అనేకమందితో సంభాషించి వ్రాసానని చెప్పింది. రైతుల ఆత్మహత్యలు, ఢిల్లీ రాజకీయాలు, జర్నలిజంలో నిబద్ధత ముప్పేట అల్లికగా సాగిన ఈ నవల, కథ క్లుప్తంగా….అసలు రైతుల ఆత్మహత్యలకి నిజమైన కారణాలు శోధించడం ఎక్కడ నుంచి మొదలు పెట్టాలి? ఆహార పంటలకి అనువైన పొలాల్లో వ్యాపార పంటలు వెయ్యడం మొదలుపెట్టినప్పటినించా? రైతులు తమ విత్తనాలు తాము తయారుచేసుకోకుండా మేలిమి విత్తనాలని నమ్మచెప్పి కంపెనీల విత్తనాలు కొనుక్కోడం మొదలుపెట్టినప్పటి నుంచా? అధిక దిగుబడి ఇస్తాయని చెప్పి కృత్రిమ ఎరువులు, జన్యుమార్పిడి విత్తనాలూ వాటికి అనువుకాని నేలల్లో వెయ్యడాన్ని ఎవరూ నిరుత్సాహపరచకపోవడం మొదలు పట్టినప్పటినుంచా? తమ ఆరోగ్యాలను కూడా లెక్కచెయ్యకుండా సంప్రదాయ కీటక నాశనుల బదులు ఘాటైన పురుగుమందులు చల్లడం మొదలుపెట్టి నప్పటి నుంచా? అధిక దిగుబడి మీద రైతుకు ఆశ కలుగచేసిన మార్కెట్‌ సంస్కృతా? చాపకిందనీరులా పాక్కుంటూ వచ్చిన ఈ క్రమాన్ని ఇప్పటికైనా గుర్తిస్తున్నామా? మరి ఇప్పటికిప్పడు వాటిని ఆపడం ఎట్లా? రైతుల్ని బ్రతికించుకోడం ఎట్లా? అని సామాన్యులం ఆలోచిస్తాం. కానీ ‘మాన్యుల’ ఆలోచనలు మరొక విధంగా కూడా వుంటాయి. అంటే ఇలా:

రైతుల ఆకస్మిక మరణాలన్నీ నిజంగా ఆత్మహత్యలేనా?పోనీ ఆత్మహత్యలే అనుకూదాం, అవి వానలు కురవక పంటలు పండక, విత్తనాలకీ ఎరువులకీ పురుగుమందులకి చేసిన అప్పులు తీర్చలేక అప్పిచ్చిన వారి వత్తిడి భరించలేక చేసుకున్న ఆత్మహత్యలా? విలాసాలకీ తాగుడికీ అలవాటుపడి అప్పులుచేసి తీర్చలేక చేసుకున్న ఆత్మహత్యలా? టీవీ, సినిమాల ద్వారా పల్లెటూళ్ళకి పాకిన వినిమయ సంస్కృతా? లేక చావుద్వారా తమ కుటుంబానికి నష్టపరిహారం రూపంలో డబ్బు రావాలని చేసుకున్నవా? ఒకే ప్రదేశంలో కొద్దిరోజు ల్లోనే ఇన్ని ఆత్మహత్యలు ఎందుకు సంభవిస్తున్నాయి? అందుమూలం గా ఆ ప్రదేశానికి చెందిన ప్రజాప్రతినిధికి తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్ని పట్టించుకోడంలేదని చెడ్డపేరు రాదా?!! పార్టీలో అతనికున్న పలుకుబడికి ఎంత విఘాతం? పార్టీకి కంచుకోటలా వున్న ఆ నియోజనకవర్గంలో రైతులు నిస్సహాయులైపోయి, ఆత్మహత్యలనే తుది పరిష్కారాలనుకోడం, ఎంత అపఖ్యాతి? ఇవి ఇలాగే కొనసాగితే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఆ పార్టీని, ఆ ప్రతినిధిని ప్రజలు ఎన్నుకుంటారా? కాబట్టి ఈ సమస్యను ఎట్లాపరిష్కరించాలి.? వాటి సంఖ్యని తగ్గించి చూపించాలా? ప్రమాదాల స్థాయిని తగ్గించి చూపడం ప్రభుత్వాలకి అలవాటే కదా!!

వారసత్వ రాజకీయ పదవీ సంపద అనే వెండి చెంచాతో పుట్టిన ఒక యువ ప్రజాప్రతినిధికి వచ్చిపడిన సమస్య ఇది. అతడు ”రాజకీ యాలలోకి వచ్చాక మొహానికి మాస్క్‌ వేసుకోనవసరం లేకుండా మాస్క్‌ తోనే పుట్టాడ’ట పదవీ, అధికారం తనకు పుట్టుకతోనే వచ్చాయనీ తను ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాననీ అతని నమ్మకం, అభిజాత్యం కూడా ఎందుకంటే, అతని తండ్రి ప్రస్తుతం అధికారంలో వున్న మిశ్రమ ప్రభుత్వంలో మెజారిటీ పార్టీ అయిన డెమొక్రటిక్‌ పార్టీ ముఖ్య కార్యదర్శుల్లో ఒకరు. ఆయన మంత్రిగా వున్నప్పుడు జరిగిన ఒక ప్రమాదంలో కలిగిన జన నష్టానికి నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేసి పార్టీకి అంకితమైన నిజాయితీపరుడుగా ప్రఖ్యాతిపొందాడు. అటువంటి మహనీయుని కొడుకుని పార్లమెంట్‌ కి గెలిపించడం పెద్ద కష్టమేమీ కాదు కదా! పైగా అనేక మంది వృద్ధ నేతల్లాగే దీపం వుండగానే రాజకీయాల్లోకి వారసులను ప్రవేశపెట్టాలనే కోరికకు అతీతుడేమీ కాదు! అందుకని కొడుకుని జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటూ వస్తున్నాడాయన. ఆట్లా ఆరునెలల క్రిందట పార్లమెంట్‌లో అడుగుపెట్టిన ఈ యువ ప్రతినిధి పేరు కేయూర్‌ కాశీనాథ్‌, ఆ తండ్రిపేరు వైష్ణవ్‌ కాశీనాథ్‌… అతని నియోజకవర్గం అయిన మిత్యాలలో, గడచిన నలభై రోజుల్లో ఇరవై ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యలకు ప్పాడడం కేయూర్‌ను కలవరపెడుతున్న సందర్భంలో.. ఈ సమస్యను చర్చించడానికి కొంతమంది ప్రముఖులతో ఒకనాటి సాయంత్రం ఒక అంతరంగిక సమావేశాన్ని కొత్త ఢిల్లీలోని తన బంగళా వెనక తోటలో ఏర్పాటు చేశాడు. ఈ అంతరంగిక సమావేశానికి కొంతమంది పత్రికా ప్రతినిధులు, ఒక పరిశోధన సంస్థ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, ఒక మహా సర్పంచ్‌ హాజరయ్యారు. మహా సర్పంచ్‌ అంటే జిల్లాలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు కలిసి ఇద్దరు మహా సర్పంచుల్ని ఎన్నుకుంటారు. అలా ఎన్నుకున్న ఈ పెద్ద మనిషి, డబ్బూ పలుకుబడీ, ప్రాబల్యం కలవాడు. ఇటువంటి మహాసర్పంచ్‌లు జిల్లాకి ఇద్దరుంటారు. ఈ సమావేశానికి వచ్చిన మహాసర్పంచ్‌ పేరు లంబోదర్‌. అతన్ని వాళ్ళ జిల్లాలో ”అపాత్ర”లంబోదర్‌ అంటారు. ”అపాత్ర” అతని ఇంటిపేరేంకాదు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులు పరిహారానికి పాత్రులా, అపాత్రులా అని నిర్ణయించడానికి జిల్లా కమిటీ ఒకటి వుంటుంది. ఆ కమిటీ వేసే ఓటు ప్రకారం ఆత్మహత్య చేసుకున్న రైతుకుటుంబానికి నష్టపరిహారం మంజూరు చేస్తారు. ఆ కమిటీ సభ్యుడైన లంబోదర్‌ ఎప్పుడూ ఎవరికీ ”పాత్రత” ఓటు వెయ్యడు. అందరూ ఆయన ఉద్దేశంలో అపాత్రులే అంచేత ఆయన్ని ”అపాత్ర లంబోదర్‌” అని పిలుస్తారు. ఆత్మహత్యలు చేసుకోడం ప్రభుత్వాన్ని అవమానించడమని ఆయన ఉద్దేశం.

ప్రజాప్రతినిధి అయిన కేయూర్‌ తన నియోజక వర్గంలో ఆత్మహత్యల్ని అరికట్టడానికి ఏం చెయ్యాలో సూచించమని ఈ సమావేశానికి హాజరయిన వారిని అడిగాడు. ఈ అంశం మీద పరిశోధన చేసి నివేదిక తయారుచేసుకొచ్చిన పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ దయ, తమ సిఫార్సులను చదివి వినిపించమని అతని అసిస్టెంట్‌ వైదేహికి చెబుతాడు. ఆ నివేదిక ప్రకారం రైతులు అధిక పంటలకోసం ఎక్కువ ఎరువులు ఎక్కువ పురుగుమందులు వాడుతు న్నారు. నేలలో ఎక్కువ బోర్‌లు వేసి నీటి సారాన్ని పీల్చేస్తున్నారు. వీటికోసం అప్పులు చేస్తున్నారు అవి తీర్చలేకపోతున్నారు. అంతేకాదు ఇప్పుడు పెరిగిన రవాణా సౌకర్యాలు పట్నాలనీ పల్లెల్నీ దగ్గర చేసి గ్రామాలలోకూడా వినిమయ సంస్కృతి పెరిగింది. టీవీలూ, సినిమాలూ ఆ సంస్కృతిని పెంచిపోషిస్తు న్నాయి. భూమి చిన్న చిన్న శకలాలుగా విడిపోయినందువల్ల అందులో ఎక్కువ బోర్లు వేసినందువల్ల భూమిలోని నీరంతా పీల్చేస్తున్నారు. ఊట తగ్గిపోతోంది. కనుక రైతులకి ఎరువుల మీదా విద్యుత్తుమీదా ఇచ్చే రాయితీలు రద్దు చేస్తే వాళ్ళు వ్యవసాయం మానుకుని ఇతర పనుల్లోకి పోతారు. ఆ భూమి ఇతరత్రా ఉపయోగపడుతుంది. రైతులు ఆత్మహత్యలకు పూనుకోకుండా వాళ్లకి ఆధ్యాత్మికమైన కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. అంతేకాక పట్నవాసపు పోకడలను గ్రామీణ యువకులు అనుకరిస్తున్నారు కనుక కొంతమంది పట్నవాసపు యువకులను గ్రామాలకు రప్పించి పట్నవాసాన్ని గురించిన మిద్యాభావాలను తొలిగించాలి” ఆ నివేదికలోని సిఫార్సులలో కొన్ని ఇవి.

ఒక్కొక్కడు తమ అభిప్రాయాలను చెప్పే క్రమంలో ఆ నియోజక వర్గంలో ఆత్మహత్యల సంఖ్య పెరగడానికి గల కారణాన్ని లంబోదర్‌ ఇట్లా చెప్పాడు. అతనుండే గోపూర్‌ గ్రామంలో వ్యవసాయానికి చేసిన అప్పు తీర్చలేక సుధాకర్‌ భద్ర అనే యువకుడు కొంతకాలం కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి వివాహం అయింది ఇద్దరు పిల్లలు కూడా. చదువుకుని పట్నంలో టీచర్‌ ఉద్యోగం చేస్తున్న అతని తమ్ముడు గంగిరి భద్ర, అన్న మరణవార్త వినగానే వచ్చాడు. అన్న ఆత్మహత్యకు ఇచ్చే నష్టపరిహారంతో అప్పులు తీర్చి వదినెనూ పిల్లల్నీ తనతో తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే వచ్చాడు. కానీ సుధాకర్‌ భద్రది వ్యవసాయానికి సంబంధించిన అప్పులు తీర్చలేక చేసుకున్న ఆత్మహత్య కానే కాదనీ అతను తాగుడు అలవాటుచేసుకుని అప్పులు చేశాడనీ, అతనికి వ్యవసాయం మీద అసలు శ్రద్ధ లేదనీ కమిటీ అతనికి నష్టపరిహారం తిరస్కరించింది… తన అన్న కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వలేదనేకసితో, గంగిరిభద్ర తన ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామంలో స్థిరపడ్డాడు. అతను జిల్లా కలెక్టర్‌ను ఒప్పించి ఆత్మహత్యల నిర్ధారణ కమిటీలో సభ్యుడయ్యాడు. అప్పటినుంచీ అతను తక్కిన సభ్యుల్ని కూడా ఏదోవిధంగా ఫ్రభావితంచేసి అన్ని రకాల మరణాలనీ ఆత్మహత్యలుగా నిరూపిస్తున్నాడు. అన్నీ వ్యవసాయ సంక్షోభ సంబంధిత ఆత్మహత్యలుగా తేలుతున్నాయి. అతన్ని కమిటీ లోనుంచి తప్పిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. అతన్ని తప్పించడానికి ఎన్ని ప్రయ్నాలు చేసినా ఫలించడం లేదు. కలెక్టరు కూడా ప్రయత్నించి విఫలమయ్యాడు” అని చెప్పాడు ఈ సమావేశం కోసం దక్షిణ మధ్య భారతం నించీ వందల మైళ్ళు ప్రయాణం చేసి రాజధానికి వచ్చిన లంబోదర్‌ మహాసర్పంచ్‌.

”మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి?” అని చర్చ జరిగింది.

”పరిష్కారం గంగిరి భద్రే… మహా సర్పంచ్‌ బదులు అతన్నే ఈ సమావేశానికి పిలువవలసింది” అంటాడు ఒక పత్రికా ప్రతినిధిగా వచ్చిన నాజర్‌ ప్రభాకర్‌.

”పరిశోధన కేంద్రం వారి సిఫార్సులు ఒట్టి కంటితుడుపు” అనే అతని వాఖ్యలు, అతను గంగిరిని సమర్థించడం అక్కడ చాలా మందికి నచ్చవు. ఆ సమావేశాన్ని గురించీ అక్కడ మాట్లాడిన మాటల గురించీ ఎవరూ పత్రికల్లో వ్రాయవద్దని కేయూర్‌ అభ్యర్ధించాడు. కానీ నాజర్‌ ప్రభాకర్‌ అప్పటికప్పడే కేయూర్‌ నియోజక వర్గమైన మిత్యాలలో లెక్కకు మిక్కిలిగా సంభవిస్తున్న ఆత్మహత్యల్ని గురించి తన పత్రికలో వ్రాశాడు. నాజర్‌ పత్రికా రచనను సీరియస్‌గా తీసుకునే వ్యక్తి తన అభిప్రాయాలను మార్చుకోవలసిన వత్తిడి వచ్చినప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేస్తాడేగానీ ఎవరికీ తలవంచడు. రైతుల ఆత్మహత్యలు అతన్ని నిజంగానే కలవరపెట్టాయి. తను వ్రాసే వార్తలవలన ఏదైనా ఒక క్రియ జరగాలని ఆశపడతాడు. మిత్యాల దరిదాపుల్లోని మూడు జిల్లాల్లో 99 శాతం పొలాల్లో పత్తి పండిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఒక అన్ననో తండ్రినో భర్తనో పొగొట్టుకోని స్త్రీలు లేరు. పూర్వం అక్కడ ఇళ్ళకి తలుపులు వుండేవి కాదు. ఎందుకంటే అక్కడందరి ఇళ్ళూ సమృద్ధిగా వుండి ఎవరికి దొంగతనం చేయాల్సిన అవసరం వుండేది కాదు. ఇప్పుడూ తలుపులు లేవు. ఎందుకంటే దోచుకోడానికి ఏ ఇంట్లోనూ ఏమీలేదు” అని ముగిసింది అతని రిపోర్ట్‌.

మిత్యాల జిల్లా ఆత్మహత్యల నిర్థారణ కమిటీలో కలెక్టర్‌తో సహా పదిమంది సభ్యులున్నారు. అందులో ముఖ్యులు మహాసర్పంచ్‌ లంబోదర్‌, వడ్డీవ్యాపారి దుర్గాదాస్‌ మహాజన్‌ మిగతా అందరూ వీళ్ళు చెప్పినట్లు వినాల్సిందే. లంబోదర్‌కి రాజకీయ ప్రయోజనాలున్నాయి. తన కొడుకుని తనతరువాత అక్కడ ప్రతిష్టించాలనే గాఢమైన కోరిక వుంది. వచ్చే ఎన్నికల్లో కేయూర్‌ స్థానంలో పార్లమెంట్‌కి నిలబట్టాలని కూడా వుంది. అతను పోయిన ఎన్నికల్లో కేయూర్‌ గెలవడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాడు. అందుకు బదులుగా ఒక వంద ఎకరాల స్థలంలో తన కొడుకు చేత ఏదో పరిశ్రమ పెట్టించాలని అందుకు కేయూర్‌ తండ్రి సాయంచేయాలనీ ఆశిస్తున్నాడు. ఈ ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమ ప్రణాళిక కేయూర్‌కి నచ్చకపోయినా అతను తండ్రిని ఎదిరించలేడు. అందుచేత కేయూర్‌ లంబోదర్‌కి వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేడు.

ఇక మరొక ముఖ్య సభ్యుడు దుర్గాదాస్‌ మహాజన్‌ వడ్డీ వ్యాపారి. ఇతను కూడా కేయూర్‌ గెలవడానికి ఎన్నికల్లో డబ్బు ఖర్చుపెట్టాడు. అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న ప్రతిరైతుకీ అతని దగ్గర అప్పుంది. వాళ్ళ పొలాలు తాకట్లున్నాయి. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వడం ఇవ్వకపోవడం వల్ల తన కెంత లాభమో ఆలోచిస్తాడు. నష్టపరిహారం రాకపోతే ఆ పొలం ఈతను చవుకగా కొనేసుకుంటాడు. అప్పు తక్కువున్నప్పుడు ఒకవేళ పరిహారం అంటూ వస్తే దాన్ని అప్పకింద తనే జమ కట్టుకుంటాడు. కానీ పరిహారం రాకపోతేనే అతనికి లాభం. గంగిరి అన్న సుధాకర్‌ పొలంకూడా అట్లాగే కొనుక్కోవాలని అతను ఆశపడ్డాడు. అంతకు ముందు గంగిరి తండ్రి సగం పొలం అప్పు కింది దుర్గాదాస్‌కే అమ్మివున్నాడు. గంగిరి చదువుకున్న వాడు ఇంగ్లిష్‌ మాట్లాడగలడు. దేని గురించి మాట్లాడాలన్నా ఆ విషయం గురించి కూలంకషంగా తెలుసుకుని వస్తాడు. ఆత్మహత్యలు అంతకుముందూ వున్నాయి ఆ జిల్లాలో… అయితే అవన్నీ సహజ మరణాలుగా చిత్రింపబడి ఆ సంఖ్య ఇంతగా పత్రికలకెక్కలేదు.

గంగిరి కమిటిలో సభ్యుడైనాక మిగతా సభ్యులందర్నీ కలిసి మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా వోటు వెయ్యమని నయానో భయనో చాకచక్యంగా ఒప్పించాడు. అంచేత మెజారిటీ ఓట్లతో చాలా కేసుల్లో న్యాయం జరుగుతోంది. అందుకే ఆత్మహత్యల సంఖ్య అంత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇది కంటకప్రాయం అయింది లంబోదర్‌, దుర్గాదాస్‌లకి ఈ సంగతులన్నీ ఆ సమావేశంలో లంబోదర్‌ కేయూర్‌కి చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి ఎట్లా అయినా గంగిరిని దెబ్బకొట్టాలని నిశ్చయించారు. అప్పుడక్కడికి వేరే పనిమీద వచ్చిన పరిశోధన సంస్థ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వైదేహికి ఆమాటలు వినపడ్డాయి. ఆమె ఆ సంగతి నాజర్‌కి చెప్పి గంగిరి ప్రమాదంలో పడ్డాడనీ ఒక ఫోన్‌ చేసిఅతన్ని హెచ్చరించమనీ కోరుతుంది. గోపూర్‌ దగ్గర ఉన్న తమ సిమెంట్‌ ప్యాక్టరీ ఉద్యోగి ద్వారా గంగిరికి ఒక సెల్‌ఫోన్‌ పంపిస్తుంది. తనమీద దాడి జరగబోతోందనే విషయాన్ని మొదట గంగిరి నమ్మడు. తరువాత నమ్మక తప్పలేదు అయినా అతని మీద దాడి జరిగింది గుండాలు అతన్ని కొట్టారు బలవంతంగా ఆత్మహత్యల నిర్థారణ కమిటీ నుంచీ రాజీనామా చేస్తున్నట్టు సంతకం పెట్టించారు. ఇల్లూ వూరూ వదిలి పొమ్మన్నారు. కానీ గంగిరి అట్లా చెయ్యలేదు. ”వ్యూహం లేని నిజాయతీ వ్యర్థం” అన్న నాజర్‌ మాటలు అతనికి నచ్చాయి. అతను ఆ విషయాన్ని కలెక్టర్‌కి పిర్యాదు చేశాడు. మళ్ళీ మామూలుగానే కమిటీ సమావేశాలకి హాజరయ్యాడు. కలెక్టర్‌ అతని రక్షణ భారాన్ని లంబోదర్‌ దుర్గాదాస్‌లకే అప్పచెప్పి గంగిరికి ఏం జరిగినా వాళ్లదే బాధ్యత అన్నాడు. తన మీద దాడిచేయించింది కేయూరే నని గంగిరికి కలెక్టర్‌ కీ కూడా అర్థం అయింది.

కేవలం తన అన్న కుటుంబానికి పరిహారం ఇవ్వలేదనే కోపంతో కాదు గంగిరి గ్రామంలో స్థిరపడింది. సుధాకర్‌ విషయంలో కమిటీ సభ్యుల ప్రవర్తన అతన్ని చాలా నొప్పించింది. సుధాకర్‌ తాగుడుకి అప్పచేసాడని దుర్గాదాస్‌, లంబోదర్‌ వాదించారు”. నా భర్తకి తాగుడు అలవాటులేదు. తినడానికి డబ్బు లేకపోతే తాగుడికి ఎక్కడ్నించీ వస్తుంది? అని సుధాకర్‌ భార్య పద్మా, గంగిరీ వాదిస్తే వాళ్ళవన్నీ అబద్దాలని కొట్టిపడేశారు. మిగిలిన పొలం కొనుక్కోడానికే దుర్గాదాస్‌ ఇట్లా మాట్లాడుతున్నాడని అర్థం అయింది గంగిరికి. అప్పుడే అతనొక నిశ్చయానికి వచ్చాడు. ఇంక ఎవరూ ఇక్కడ ఆత్మహత్యలు చేసుకోకూడదు. ఒక వేళ అలాజరిగినా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు న్యాయం చేయ్యాలి. ఈ సంకల్పంతో పట్నంలో సుఖమైన జీవితాన్నీ మంచి జీతాన్నీ వదులుకుని వచ్చాడు గంగిరి. పట్నంలో అతను గుంపులో ఒకడు… కానీ ఇక్కడ తను చెయ్యవలసిన పని ఉన్నది. అతనికి ఊళ్ళో రాజకీయాలు అర్థం అవుతున్నాయి. అతని దగ్గరవున్న డబ్బు ఉద్యోగ విరమణ సందర్భంగా వచ్చిన పాత బకాయి మాత్రమే. దాన్ని అన్ని ఖర్చులకీ జాగ్రత్తగా వాడాలి. అది ఇంట్లో అందరికీ రెండు పూటలా భోజనానికి చాలదు. పిల్లలు దేవాలయంలో రోజూ సాయంత్రం పెట్టె ప్రసాదంతో ఒకపూట పొట్టనింపుకోవాల్సి వస్తోంది. అతని ఎదుట రెండు ఎంపికలున్నాయి. ఒకటి, ఇల్లూ పొలమూ వచ్చిన కాడికి అమ్మేసి పట్నంలో ఉద్యోగం చూసుకుని వదినెనూ పిల్లల్నూ తీసుకుని వెళ్ళిఫోవడం లేదా ఇట్లా వాళ్ళని పస్తులు పడుకోబెట్టి ఊరికోసం పనిచేయ్యడం గంగిరి రెండవ దాన్నే ఎంచుకున్నాడు. తన ఆదర్శం కోసం వాళ్ళను బలిచేస్తున్నానని తెలుసు!

గంగిరిమీద త్వరపడి అట్లా దాడి చేయించి వుండకూడదని కేయూర్‌ని అతని తండ్రి మందలిస్తాడు. ఈ లోగా మిత్యాల నియోజక వర్గపు రైతుల ఆత్మహత్యల్ని గురించి నాజర్‌ ప్రభాకర్‌ వ్రాసిన రిపోర్ట్‌లు వరుసగా పత్రికలో వస్తున్నాయి. గంగిరి మీద జరిగిన దాడి గురించీ, అతన్ని కమిటీ నుంచీ తప్పకుని ఊరువిడిచి పొమ్మని బెదిరించడం గురించీ కూడా వ్రాసాడు. పార్టీ కేయూర్‌ని ప్రెస్‌ మీట్‌ పెట్టమని ఆదేశించింది. ప్రెస్‌ మీట్‌లో సంయమనం కోల్పోయాడు కేయూర్‌. ఆ ప్రెస్‌ మీట్‌ ఘోరంగా విఫలమయినాక కేయూర్‌ స్వయంగా నియోజకవర్గంలో పర్యటనకి బయలుదేరాడు. అప్పుడు కూడా అతను గంగిరికి ఆ వూరి విడిచిపొమ్మని మర్యాద గానే చెప్పాడు. కానీ గంగిరి వెళ్లనంటాడు. ఆపాత్ర మని కొట్టిపడేసిన ఆత్మహత్యల కేసుల్ని తిరగదోడి చాలా మందికి పరిహారం వచ్చేలా చేస్తాడు కేయూర్‌.. దాన్ని మెచ్చుకుంటాడేగానీ తను వెళ్ళనంటాడు గంగిరి. ఈ లోగా లంబోదర్‌ ప్రణాళికలను అర్థం చేసుకుంటాడు కేయూర్‌.

గంగిరికి సంకల్పబలం వుంది. ఆదర్శం వుంది ఆత్మగౌరవం వుంది. కానీ దానితో పాటే పెదరికం వుంది. అన్న చేసిన అప్పువుంది. తమ పొలంలో పంట వేయడానికి చేసిన అప్పు వుంది. అతనిమీద గౌరవంతో నాజర్‌ ప్రభాకర్‌ గానీ డాక్టర్‌ గానీ డబ్బు అప్పు ఇస్తామంటే తీసుకోడు. అది అభిజాత్యం కాదు. తనలాగా పరిచయాలు లేని సామాన్యులకు దక్కని సహాయం తనకొక్కడికే ఎందుకు? అనుకుంటాడు. దానిఫలితం తిండిలోపం వల్ల అన్న కొడుకు ఆరేళ్ల బాలు క్షయవ్యాధి బారిన పడతాడు. వాడి వైద్యం కోసం గంగిరి, అందరు రైతుల్లాగే దుర్గా దాస్‌ దగ్గరికి వెళ్ళి అప్పు అడుగుతాడు. దుర్గాదాస్‌ అతన్ని హీనాతిహీనమైన మాటలతో అవమానిస్తాడు. కోపంతో అతని గొంతు పట్టుకుంటాడు గంగిరి. దుర్గాదాస్‌ అనుచరులు గంగిరిని కింద పడేసి కొడతారు. కలెక్టర్‌కి ఆవిషయం తెలిసి దుర్గాదాస్‌ని పిలిపించి అతని వ్యాపారానికి లైసెన్స్‌ రద్దు చేస్తానంటాడు కానీ గంగిరి తనమీద దుర్గాదాస్‌ అనుచరులు దాడి చెయ్యలేదని ఆ దెబ్బలు మరెక్కడో తగిలాయనీ చెప్పి దుర్గాదాస్‌లో పరివర్తన తెస్తాడు. ఈ లోగా ఆరేళ్ళ బాలుడ మరణిస్తాడు.

ఆ పిల్ల వాడి మృతికి తనే కారణం అన్న అపరాథబావం తట్టుకోలేని గంగిరి ఆత్మహత్య చేసుకుంటాడు. అతను చేస్తున్న పనినీ అతని సభ్యత్వాన్నీ తన మిత్రుడు వడ్రంగికి అప్ప జెబుతాడు. వడ్రంగి తండ్రి కూడా అప్పులు తీర్చలేక ఆత్మహత్యకి పాల్పడ్డవాడే. అతనికి కూడా పరిహారం నిరాకరించబడింది. చివరికి గంగిరి ఆత్మహత్యకు పరిహారం అతని వదినెకు ఇస్తారు. కేయూర్‌ కాశీనాథ్‌ పదవికి రాజీనామా చేసి నియోజకవర్గంలో పని చెయ్యడానికి ఢిల్లీ వదిలిపెట్టి వస్తాడు. ఈ నవలలో నిబద్ధత కల రాజకీయ నాయకుడు శ్రీనివాస మూర్తి, జర్నలిస్ట్‌ నాజర్‌ ప్రభాకర్‌ మనకి భవిషత్తుమీద ఆశ కలిగించే వ్యక్తులు.

అప్పులు తీర్చలేకపోవడం ఒకటైతే ఆప్పిచ్చిన వడ్డీ వ్యాపారులు రైతుల్ని చేసే అవమానాలు చాలా ఘోరంగా వుంటాయి. రైతుల్ని బంధించడం స్త్రీలని బజార్లో అవమానించడం, పిల్లల్ని పాఠశాలలకు వెళ్ళనీయకపోవడం వంటివి. ఒకరైతుని కాలువలోకి నెట్టి చాలా సేపు బయటకు రానివ్వకుండా చేస్తే అతను చనిపోతాడు. కనుక ఆత్మహత్యలకు అవమానాలు చాలా వరకూ కారణం. అందుకే ఆత్మహత్యల నివారణకు గంగిరి కొన్ని మార్గాలు సూచించాడు. పదెరకాల లోపు వున్న రైతులకి అప్పు తీర్చడానికి ఒక సంవత్సరం గడువువ్వాలి. అందువల్ల తాజా అప్పులు తీసుకునేందుకు అభ్యంతరం పెట్టకూడదు. బ్యాంకుల నుంచీ గానీ వడ్డ వ్యాపారుల నుంచీ గానీ అప్పుతీసుకుని తీర్చలేకపోయిన వారిజాబితా తయారు చెయ్యాలి. ఈ జాబితాలో రెండేళ్ళ పాటు కానీ అంతకన్న ఎక్కువ గానీ ఉన్న వారికి ఏవైనా సంక్షేమ పథకాల ద్వారా సాయం చెయ్యాలి. విత్తనాలు గానీ ఎరువులుగానీ పురుగులు మందులు గానీ అమ్మే వారు రైతులకి అవి నకిలీవి కాదని భరోసా ఇవ్వాలి. తరువాత అప్పులు వసూలు చేసేటప్పుడు బ్యాంక్‌లుగానీ వడ్డి వ్యాపారులు గానీ పంచాయితీ నుంచీ అనుమతి తీసుకోవాలి. వసూలుకు వచ్చే వారితోపాటు కొందరు సాక్షలు వుండాలి.

నవలంతా చదివాక పాఠకులకు వచ్చే సందేహాలు కొన్ని : తనకెంత ఆత్మగౌరవం వుండనీపో, అన్న కొడుకు కళ్ల ఎదుట చనిపోతుంటే చూస్తూ వుండడమేమిటి? ఎవరైనా అప్పు ఇస్తానన్నప్పుడు తీసుకుని తరవాత ఎందుకు తీర్చరాదు? దుర్గాదాస్‌ వంటి కరడుగట్టిన వడ్డీ వ్యాపారులు, కేయూర్‌ వంటి రాజకీయ నాయకులు అంత త్వరగా పరివర్తన చెందుతారా? తను చేసే యుద్ధం తన సమ ఉజ్జీలతో కాదనీ తనకన్న అధికులతో ననీ తెలిసిన అతనికి కేవలం ముక్కు సూటిగా పోవడం కాక దానికో వ్యూహం వుండాలని తెలియదా? ఇట్లాంటి ప్రశ్నలు పక్కనపెడితే ఈ నవలలో కోట నీలిమ చిన్న రైతులు చేసే వ్యవసాయం కత్తిమీద సాములాంటిదని చాలా వివరంగా చెప్పింది. ఒక గంగిరిభద్ర ఆత్మ త్యాగం చెయ్యకపోతే తప్ప రాజకీయ నాయకులు కళ్ళకు కట్టుకున్న గంతలు కాసేపైనా విప్పరు. ఒక నాజర్‌ ప్రభాకర్‌ రిపోర్ట్‌ల మీద రిపోర్ట్‌లు వ్రాస్తే తప్ప తమ నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోరు. కనీసం ఎవరి ఓట్లతో అయితే గెలిచారో ఆ జనాన్ని గెలిచిన తరువాత ఒక్కసా రైనా కలవరు. ఇంకా గ్రామాల్లో భూస్వాములూ వడ్డీ వ్యాపారులూ రాజ్యమేలడం, బ్యాంక్‌ అధికారులూ ప్రభుత్వ డాక్టర్లూ కూడా వాళ్ళకు దాసోహమనడం జరుగుతూనే వుంది. రాజకీయ నాయకులకూ భూస్వాములకూ మధ్య ”క్విడ్‌ ప్రో కో” లు నడుస్తూనే వున్నాయి. ఎకరాల భూమి చేతులు మారుతూ వందలాది మంది పేదలు నిర్వాసితులౌతునే వున్నారు. ఇదంతా ఎలా జరుగుతుందీ నీలిమ కళ్ళకు కట్టిస్తుంది. నీలిమ శైలి నవలను ఒక్క బిగిని చదివిస్తుంది. వాక్యాలు పదునైన కత్తుల్లా వుంటాయి. వ్యంగ్యం ఆమెకు సహజం.

కోటనీలిమ ఢిల్లీ నుంచీ వెలువడే ”సండె గార్డియన్‌” పత్రికలో పొలిటికల్‌ ఎడిటర్‌గా పనిచేస్తారు. జాన్స్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం లోని ద పాల్‌ హెచ్‌ నీచే స్కూల్‌ ఆఫ్‌ అడ్వాన్సుడ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌లో సౌత్‌ ఏషియన్‌ స్టడీస్‌లో రీసెర్చ్‌ ఫెలో గా వున్నారు. ఆమె ఢిల్లీలోనూ వాషింగ్టన్‌లోనూ వుంటూ వుంటారు. ఈ నవలకు ముందు ”రివర్‌ స్టోన్స్‌” ”దడెత్‌ ఆఫ్‌ ఎ మనీలెండర్‌” అనే నవలలు వ్రాసారు. ఈ నవలను రూపా ప్రచురించింది (2013). ఈ నవల మీద నాకు ఆసక్తి కల్గడానికి పాలగుమ్మి సాయినాథ్‌ హిందూ లో వ్రాసిన వ్యాసాలూ ఆయన పుస్తకం ”ఎవిరిబడీ లవ్స్‌ ఎ గుడ్‌ డ్రాష్ట్‌” కారణం.

 

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

One Response to

  1. We need True Justice says:

    థాంక్స్ ఫర్ ది రివ్యూ. ఐ విల్ రీడ్ ఇట్.

Leave a Reply to We need True Justice Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.