సగాలు రెండూ సమానమేనా?

 – రమా సుందరి బత్తుల

పొద్దున్నే ఏదన్నా రాద్దామని ఒకసారి నన్ను నేను విదుల్చుకొని కూర్చొన్నానా! నాలో ఉండి, ఎప్పుడు ముచ్చటగా అచ్చరాలు కాగితం మీద పూయించే సిరా ఎందుకో మొరాయించి, మొండికేసింది. అచ్చరాలు రాయదంట. ఏమయ్యిందే నీకియ్యాల?” విసుక్కొన్నాను.

అక్కాయ్‌! వేల అచ్చరాలు కన్నాను కదా నేను! అవి కళ్ళు లేక కబోదులు మాదిరి ఆడ ఆడ పడి దొర్లుతున్నాయి. చూపులేని పిల్లల్ని కని ప్రయోజనం ఏముంది చెప్పు? వాటికి, తెగిపడిన గాలి పటాలకు తేడా ఏముంటది?”

ఎహే! ఎర్రి మొగవా! ఈసారి ఆడోళ్ళ పత్రిక్కే మనం రాయబొయ్యేది. అబ్బో గొప్ప ఆడ అచ్చరాలు కనాల నువ్వు ఇయ్యాల. బుజ్జగించాను.

ఆ! సంబడం!” మూతి ముప్పై వంకరలు తిప్పి పిచ్చి గీతలు గీసింది కాగితం మీద.

నాకు తెలియక అడుగుతాను అక్కాయ్‌. ఆడ మొగ శరీరాలు మాత్రమే వేరు కదా. పుట్టినపుడు అందరిలోనూ ఉన్నది ఒకేలాంటి ఆత్మ కదా. ఆడదానిలో ‘ఆడతనం’ ఎప్పుడు మొదలవుతుంది. ఆమెకు ఆడ కష్టాలు ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ఆడ కష్టాలు లేని ఆడది ఈ బూపపంచంలో ఉందా?” కాగితం మీద ప్రశ్నలు కక్కి, ఆవేశంతో రొప్పింది సిరా.

అమ్మాయ్‌! ఎందియ్యాళ రెచ్చిపోతున్నావ్‌? ఎచ్చులు పోకుండా పని చూడు. కళ్ళెర్రచేశాను.

నువ్వు బెదిరిస్తే బెదరే పనే లేదు ఇయ్యలా. నా మనసు ఒప్పుకోని పని నేను చెయ్యనక్కాయ. సరైన ఆడచ్చరాలు నేను కనాలంటే నువ్వు ఈ సంగతులు నాకు తేటతెల్లం చెయ్యాల్సిందే. లోకాన్ని సరిగ్గా చూడలేని ఆడబిడ్డలు నాకవసరం లేదు. బిగుసుకుంది సిరా.

దీని దుంపతెగ! ఏమి చెయ్యాలిప్పుడు? అనుకొంటూ సిరా బయటకు రాకపోయినా కాగితం మీద కెలుక్కుంటుంటే, ఐస్‌ చీకుతూ ఐదేళ్ళ పసిపిల్ల వచ్చింది ఆ దిక్కుకి. గబుక్కున ఒక ఆలోచన తట్టింది.

పాపా! పాపా! నీకు ఆడ కష్టాలు ఎప్పుడు మొదలయ్యాయి?” అడిగేశాను.

మరేమో! నేను పుట్టగానే మా అమ్మ కళ్ళనీళ్ళు పెట్టుకొంది కదా. మా నాన్న నన్ను చూడటానికి వచ్చినపుడు భయం భయంగా చూసింది కదా. అప్పుడే నాకు అర్థం అయ్యింది, నేను ఆడపిల్లనని. కులాసాగా చెప్పింది. ఇంకా ఎప్పుడెప్పుడు తెలిసిందో అడుగక్కాయ. నాలోని సిరా గొణుగుతుంది. ఇంకా అన్నాయికి గుడ్డు పెట్టి నాకు అమ్మ కారమేసి అన్నం పెట్టిందే అప్పుడూ…. పక్కింటి అంకులు నన్ను ముద్దు చేస్తున్నట్లు వళ్ళో కూర్చోబెట్టుకొని…. నా వళ్ళంతా తడిమాడే అప్పుడూ… చీమిడ్ని మోచేతుల పై భాగంతో తుడుచుకొంటూ చెప్పక పోతుంది పాప.

”ఆపమను, ఆపమను గగ్గోలు పెడుతుంది సిరా. పాప జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమ్మ. పాపం పున్నెం లేని పెపంచకం ఇది. పంపించేశాను. ఇంతలో ఎక్కడో వెక్కిళ్ళు వినబడి ఉలిక్కిపడ్డాను. కన్నీళ్ళతో సహా కారడానికి సిద్ధంగా ఉంది సిరా. ఆగు అరిచాను. పోరుబెట్టి మొదలు పెట్టించావుగా. పూర్తిగా వినాల్సిందే కఠినంగా అన్నాను.

ఆ దారిలో వెళుతున్న పాతికేళ్ళ పడుసుపిల్ల పార్వతి కనబడింది. అమ్మాయ్‌ అని కేకేద్దామని మళ్ళీ ఆగిపోయాను. ఈ పిల్ల ఇప్పుడు మొదలు పెట్టిందంటే కట్నం కన్నీళ్లు, అత్తింటి ఆరళ్ళు చెబుతుంది. వాళ్ళ పక్కింటి సీత కిరసనాయిలు చావు ఏకరువు పెడుతుంది. ఇక నాలోని ఈ బాసేలుని పట్టటం కనాకష్టం. చూడనట్లు ఉండటమే ఉత్తమం. అనుకొన్నాను.

ఇంతలో జడ అల్లుకొంటూ వస్తున్న నడేపు వయస్సు నాంచారిని చూడగానే ఆశ పుట్టింది. నాంచారి వళ్ళు అడ్డదిడ్డంగా పెరిగి ఉంది. మొహంలో రెండో గడ్డం పెరిగి దాని నుండి ఒక ఎంట్రిక మొలిచి ఉంది. ఈపెడ అన్నీ బరాయించుకొని వచ్చింది. అత్త పోయాక మొగుడింటి కష్టాలు కూడా ఒగదెగించుకొంది. పిల్లలు పెద్దాళ్ళయ్యారు. చల్లని కబుర్లు కాసిని చెప్పి సిరాని కాస్త సముదాయిస్తది. అనుకొని

నాంచారీ, నాంచారీ! నీ ఆడకష్టాలు లేవు కదూ?” అడిగాను.

అదే నేనూ అనుకొన్నానప్ప. ఇంత బతుకు చూసా కదా. మొన్న సింహాచలం కొండకెళ్ళి మొక్కు తీర్చుకొని ఒక్క దాన్నే వస్తున్నానా! నా కొడుకు వయసోడు. ‘ఆంటీ ఆంటీ!మీ బ్రా కనబడుతుందని’ వెనక బడ్డాడు. వళ్ళు చచ్చిపోయిందంటే నమ్ము.” యాష్ట పోయింది నాంచారి.

నాలోపల ఏదో జరుగుతున్నట్లు పసిగట్టాను. సిరా గడ్డగట్టుకొని పోతుందని అర్థం అయ్యింది. ”నేనేమీ చేయనురా బగమంతుడా! ఇది గడ్డకట్టి పోతే నాకిక బతుకే లేదు. చచ్చి పెన్నుల స్టాండ్‌లో అలంకారంగా మిగిలిన బతుకంతా నిలబడాల్సిందే కదా. అనుకొంటుంటే దేవుడు పంపించినట్లు కనకాయి కనబడింది. పొగతోటలో ఆకు కొట్టి వస్తున్నట్లు ఉంది. వాళ్ళాయన పొడుగు చేతల చొక్కా తొడుక్కొంది. కిందకి చూస్తే పాంటు కూడా తొడిగింది. ఎండకు గావాల్నా తలకు గుడ్డ చుట్టుకొంది. కనకాయికి పనికష్టం ఉంటది కానీ, ఆడ కష్టాలు ఉండవులే. మొగేసంలో ఎవరు చెడు చూపు చూడరుగా అని తలపోస్తా పిలిచాను.

కనకాయి, కనకాయి! మొగేసం వేశావుగా, నీకు ఆడ కష్టాలు లేవు కదా! అడిగాను.

బలే చెప్పొచ్చావులే, పని చేస్తున్నంత సేపు మా మేస్త్రి నన్ను ఆబగానే చూస్తానే ఉంటాడమ్మాయ్‌. మొగేసం నా పని సులువుకే కానీ, ఆడమనిషినన్న సంగతి నన్నెక్కడ మర్చిపోనిస్తారు? మైలు పొడువునా నిట్టూర్చింది కనకాయి.

ఏమి చేయాలో పాలుపోక నివ్వెరబోయి ఉన్న నాకు కనకాయి నొసలు మీద నుండి జారబోతున్న చెమట చుక్క కనబడింది. గుండ్రంగా, ముచ్చటగా ఆమె శరీరాన్ని తాకి తాకనట్లు నిలబడి ఉంది. పుట్టిల్లు కనకాయి దేహం అయినా తొందరగా జారీ భూమిలో ఇంకిపోవాలని కల కంటున్నట్లుగా ఉంది. కోట్ల చెమట చుక్కలతో ఒకటిగా కలిసిపోయి దుక్కి దున్నాలని, నాట్లు నాటాలని, కలుపు తీయాలని ఆతృత పడుతుంది. ఈ చెమట చుక్కను కనకాయి పుట్టించినా దీనికి లింగం లేదుగా! ఆడోళ్ళ వంటికష్టమైన, మగోళ్ళ వంటికష్టమైన… పుట్టిన చెమట చుక్క, కోట్లలో ఒకటిగా సంపద పుట్టిస్తుందే కానీ ఈ చెమట చుక్కకు ఆడతనం లేదుగా. ఆడకష్టాలు లేని ఈ చుక్కను నాలోని సిరాకు చూపించి మళ్ళీ దానికి కాస్త ఊపిరి పోస్తాను ఆనందపడుతూ కేక పెట్టాను.

చెమట చుక్కా, చెమట చుక్కా! నీకు ఆడ కష్టాలు లేవుగా?”

చెమట చుక్క నవ్వింది. విరగబూసిన సెనగ చేనులా నవ్వింది. కంకి వేసిన వరి పొలంలా నవ్వింది.పువ్వు పగిలిన పత్తి పంటలా నవ్వింది. కాపుకొచ్చిన కంది కాయలా విరగబడి నవ్వి, నవ్వి… అంతలోనే ఏడ్చింది.

మాలో ఆడ చెమటచుక్క, మగచెమట చుక్క వేరు అక్కాయ. మగ చెమటచుక్క పిరియం. అది రెండొందలు చేస్తాది. ఆడ చెమటచుక్క అగ్గవ. నా వెల వందే!

(పిరియం : ఎక్కువ ధర అగ్గవ : చౌక)

Share
This entry was posted in moduga poolu, Uncategorized. Bookmark the permalink.

4 Responses to సగాలు రెండూ సమానమేనా?

  1. haritha devi says:

    సమాజంలో సగం పరిస్తితి ఎంత బాగా చెప్పారో. చెమట చుక్కతో చెప్పించటం చాలా బాగుంది.

  2. raghava says:

    చాలా బాగా చెప్పారు..

  3. శ్రమ దోపిడీతో ముంగిపు నిచ్చి సగాలు రెండు సమానం కానేరవని ఆడ కష్టాలు ఏమిటో చక్కగా చెప్పారు. చాలా బావుంది రమ గారు .

  4. J R Nagabhusanam says:

    బాగుంది. చాలా చిన్న కథలో అంతేసి కష్టాలు చెప్పడం అద్భుతంగా ఉంది.

Leave a Reply to haritha devi Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.