తెలుగు కథ – రజక మహిళ- ఆచార్య మూలె విజయలక్ష్మి

అనాదిగా కులం వృత్తి ముడిపడి ఉన్న సంబంధం. నేడు ముడిసడలింది. ప్రపంచీకరణ యాంత్రికీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ఆదరణ కోల్పోయాయి. కాని సమాజంలో కులాలస్థిరీకరణ నెలకొని వుంది. కులవృత్తి కూడు పెట్తుందని పెద్దతరం ఆశ. తరతరాలుగా సాగాలని కోరుకుంటారు. పల్లెల్లోవ్యవసాయం, కుల వృత్తులు అల్లిబిల్లిగా అల్లుకొని ఉంటాయి. చాకలి, మంగలి, కుమ్మరి వంటి వృత్తిదారులకు గ్రామాల్లో మిరాశీలు ఉంటాయి. నిర్ణీత మేర ధన, ధాన్య రూపాల్లో ఉంటుంది. కుటుంబం విడిపోతే మిరాశీ యిండ్లు పంచుకుంటారు.

కులాల పేర్లు సంస్కృతీకరించుకోవటం ప్రతిష్టాభావనం. చాకలి – రజక, మంగలి – నాయిబ్రాహ్మణ/క్షురక, జాలరి – మత్స్యకార, కంసాలి-విశ్వకర్మ తదితరాలు. కులాల ఆత్మగౌరవాన్ని పెంచే కుల పురాణాలు అవి పాడే ఆశ్రిత కులాలు ఉన్నాయి. గత దశాబ్దినుంచి తెలుగు సాహిత్యం ప్రపంచీకరణ నేపథ్యంలో కుల వృత్తుల స్థితిగతులను తెరకెక్కించింది. కోల్పోతున్న ఆదరణను, యాంత్రికీకరణ వల్ల దెబ్బతింటున్న వృత్తివిధానాలను, మారుతున్న సామాజిక వైనాన్ని వెలుగులోకి తెస్తోంది.

రజక వృత్తికి సంబంధించి గ్రామాల్లో పాత పద్ధతులే ఉన్నా, పట్టణాల్లో వాషింగ్‌ మిషన్లు, డిటర్జెంట్లు వాడుకలోకి వచ్చాయి. ఇంట్లోనే వెసులుబాటు చూసుకుంటున్నారు. కొందరు వృత్తిదారులు వృత్తిని వదలి విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో స్థిరపడుతున్నారు. రజకులు ప్రతిపల్లెలోను ఉంటారు. ఇంటింటికి ఉదయాన వెళ్ళి మురికి బట్టలు సేకరించి, రేవుకు తీసుకువెళ్ళి ఉతికి గుర్తు పెట్టుకొని సాయంత్రం ఏ ఇంటి గుడ్డలు ఆ ఇంటికి చేరుస్తారు. రాత్రి పూట మిరాశీయిళ్ల వాళ్ళు అన్నం పెడతారు. ఆ కుటుంబం శుభాశుభ కార్యాల్లో, గ్రామ దేవతల జాతర్లలో రజకులు నిర్ణీత సేవలు అందించవలసి ఉంటుంది. మారిన సామాజిక విధానంలో లాండ్రీలు వెలిశాయి. వృత్తిదారుల దగ్గరకు వెళ్ళి దుస్తులు ఇచ్చి, ఇస్త్రీ చేయించుకుంటున్నారు. వీధి కూడళ్లలో అపార్ట్‌మెంట్స్‌లో ఒకచోట బండ్లపై ఇస్త్రీ చేస్తున్నారు.

తెలుగు సాహిత్యం రజకుల జీవనచిత్రాలను రచించటంలో వృత్తి విధానం ఆర్థిక స్థితిగతులు అలవాట్లు, ఆచార సంప్రదాయాలు నిబిడీకృతమై ఉన్నాయి. రజక స్త్రీల వెతలు చిత్రితమయ్యాయి. గుడ్డలు ఇవ్వడానికో, తెచ్చుకోడానికో వెళ్ళినపుడు ఆ యింటి పురుషుల ఆగడాలకు దురపిల్ల వలసివస్తోంది. కుటుంబ హింస తప్పటం లేదు. రజకునికి వృత్తి పనిలో చేదోడు వాదోడు స్త్రీయే. వృత్తిని వదలి, ఉద్యోగాలు చేయాలనేనవతరం, కుల వృత్తి మమకారంతో తమ రాత ఇంతే అనుకొనే పెద్దతరం మధ్య సంఘర్షణ జరుగుతున్నది. ఈ సంక్లిష్ట సందర్భాలను తెలిపే కథలు నాలుగు నా పరిశీలనలో లభించాయి.

కులానికి వృత్తికి ఉన్న అవినాభావ సంబంధం సడలినా, కులవృత్తి చేయించాలని పట్టదలతో వున్న పెత్తందారీ వ్యవస్థపై తిరగబడిన రజక స్త్రీ గాధ పెద్దింటి అశోక్‌ కుమార్‌ వెలి (నవంబర్‌ 2002)

రామవ్వకు ముగ్గురు కొడుకులు. వివాహితులు. మూడో కొడుకు చదువుకొని చదువుకున్న రెడ్ల అమ్మాయి నీరజను పెళ్ళి చేసుకున్నాడు. నీరజకు వృత్తి పని చెప్పదు రామవ్వ. మిగిలిన ఇద్దరు కోడళ్ళకు ఇది కంటకింపు. ”మొగన్ని చేసుకునేటప్పుడు ఎరుక లేదా? సాకలోన్ని చేసుకుంటే సాకలి పని చెయ్యాలని రేపు ఎరువడ్డంక ముల్లె పట్టుకొని సాకరికిపోదటనా?” అని వెటకారం చేస్తారు. మిరాశీ ఇళ్ళు పంచమని పోరు కొడుకులు కోడళ్ళు. రామవ్వకు చాకిరీ తప్పలేదు. రేవు పెట్టడం, బట్టలు పంచడం, అన్నం పెట్టించుకు రావడంతో నడుములిరిగి పోతున్నాయి. బట్టలివ్వడానికి సత్తిరెడ్డి ఇంటికి వెళ్ళిన రామవ్వను వెంకటమ్మ ‘అది మాకు దూరపు సుట్టమైతది. వాళ్ళకు మాకు మాటల్లేక ఏండ్లు దాటినయి. రెడ్ల కులంల పుట్టి సాకలోల్ల వాకిలి నూకుతుంది. మైలబట్టలు ఉతకుతదటనాయే నీ కోడలు’ అంటూ నవ్వింది. వాళ్ళ వాకిట్లో జారిపడి లేవలేక పోయింది. కొడుకులను పిలిపించారు. తప్పంత తల్లిదేనని చిన్న తమ్ముడు వృత్తి చేయనంటున్నాడని, ఇద్దరికీ ఇండ్లు పంచివ్వమని చెప్పమన్నారు.

సత్తి రెడ్డి రామవ్వ చిన్న కొడుకు బిరును గుర్తొచ్చి, ”వాని వంతు ఇండ్లు మీరెందుకు ఉతుకుతారు? మీ పెండ్లాం లాగే వాని పెండ్లాం గూడా ఊరు తిరిగి బట్టలడుక్క రావాలె ముఖ్యమైన వాళ్ళ ఇళ్ళు తమ్మునికివ్వమని” అని నూరిపోసి బట్టలుతికించాలని పంతం పట్టాడు. పెద్దకొడుకు ఎల్లయ్య పంచితే తప్ప బట్టలుతకమని మొండికేసాడు. ఇద్దరినీ పంచుకోమంది. సత్తి రెడ్డి మాటలు తలకెక్కిన ఎల్లయ్య అంగీకరించలేదు. మూడుపాళ్లు చేయించారు. కోడళ్ళిద్దరూ రేవుకు వెళ్ళారు.

మూడో వంతు వాళ్లిండ్లకు వెళ్లలేదు. రామవ్వకు పనిచేసే ఆరోగ్యం లేదు. కుల పెద్దలను పిలిపించి పంచాయితీ పెట్టి ”వీడు మన బట్టల్ని ఉతుకుతాను అనేదాక మనమంతా సాకలోల్లకు బట్టలులెయ్యద్దు. అడుక్కతినే సాకలోల్లకు ఇంత నీలుగుడా” అన్నాడు సత్తిరెడ్డి. చాకలి వాళ్ళు తలా ఒక ఇల్లు ఉతుకుతామన్నా ఒప్పుకోలేదు.

పక్క ఊరి చాకలి వాళ్ళను పిలిపించి ఒప్పందం కుదుర్చుకున్నారు. దాంతో ఊరి చాకళ్లకు కడుపు కాలింది. పెద్దల నాటకమని గ్రహించింది రామవ్వ. వారివాకిట్లోకి వచ్చి ”పటేలా… మీరు రెడ్లు.. ఎడ్లు ఎవుసం ఉన్నోళ్ళు. మీ కులవృత్తి ఎవునం. మరి మీ కొడుకు యాపారమెందుకు జేత్తుండు? మీ అల్లుడు కల్లు మావులాలు ఎందుకు గుత్తపడుతుండు? తెనుగు తెంకరోల్లు జేసుకునేతోటలు గుత్తపట్టే పని మీ చిన్నల్లుడెందుకు జేత్తుండు. చిప్పల కాయల లారీలు ఎందుకుకొంటడు…? మీ ఎవునం ఎందుకు మూల పడ్డది? మీరు మీ ఇష్టమున్న పనులు చేసుకోవచ్చు మేము మాత్రం మీ మైల బట్టలుతుక్కంటనే ఉండాలె. కాదు కూడదంటే కులం బందంటరు. మీ కులంల ఉన్న కట్టు మాకులంల లేదు. గందుకనే మీకు అలుసు.” అని గయ్యిమంది.

చాకలి వాళ్ళంతా ఒకటయ్యారు. రామవ్వ కుటుంబాన్ని ఊరు వెళ్ళ గొట్టించాలని కుల పెద్దలు నిర్ణయించారు. ఇద్దరు కొడుకులు బతిమాలి కులంలో చేరి పోయారు. రామవ్వ తన పొలాన్ని అమ్మి, బాకీలు వసూలు చేసుకొని చిన్న కొడుకు కోడలుతో ఊరు వదిలింది. రెడ్లబలంతో పరాయి ఊరి చాకళ్లు తమ వాటాకావాల న్నారు. ఘర్షణ జరిగి కొట్టుకున్నారు. రామవ్వ కొడుకు కోడలుతో వారం రోజుల తరువాత రెడ్ల ఇండ్ల మధ్య ఇంట్లో అద్దెకు చేరింది.

”ఇంతవరదాక సాకలిండ్లల్లనే ఉన్న ఇప్పుడు వీల్ల ఇండ్ల మధ్యలుంట. వీల్లు ఇన్నేండ్లు ఊరును దోసుక తినుడంటూచేయలేని పనిని నా కొడుకుతో చేపిస్త. వీడు రేపటి నుండి ఈ ఊర్లె డాక్టర్‌ పని జేస్తడు. పేదోల్లకు వట్టిగనే మందులు గోలీలిస్తడు”.

అనాదిగా కులానికి వృత్తికి ఉన్న సంబంధానికి కట్టు బడి ఉండాలన్నదే పెత్తందారి వ్వవస్థ నిర్ణయం. చదువుకొని, కుల వృత్తిని వదిలి ఉద్యోగాల్లో స్థిరపడాలని నవతరం ఆలోచిస్తోంది. ఆధిపత్యంలో అణగి మణగి. జీవించిన రామవ్వ, అనుభవం పండిన రామవ్వ చిన్న కొడుకు అభిప్రాయానికి అండగా నిలిచింది. అన్ని కులాల్లో వృత్తిని ఎందుకు వదులుతున్నారని మా కులానికి మాత్రం ఈ గట్టి కట్టుబాటు, చేయించాలని పట్టుదల, పంతం ఎందుకని ప్రశ్నించింది. ఎదురు తిరిగింది. విముక్తి కోరింది. అగ్ర వర్ణాల ఇండ్ల మధ్య చేరి చిన్న కొడుకుతో ఉచిత వైద్యం చేయించడానికి సిద్ధపడింది.

చదువుకోవాలని ఇష్టమున్నా, కుటుంబం సహకరించక పోవటంతో కుల వృత్తి చేయవలసి వచ్చిన యువతి గాథ కె. సుభాషిణి ‘గంగమ్మ తల్లి సాక్షిగా’ (2006)

ప్రసన్న కుటుంబం చాకలి వృత్తి చేస్తుంది. సోషల్‌ వెల్‌ఫేర్‌ హాస్టల్‌లో వుండి పది పూర్తి చేసింది. పై చదువుకు అంగీకరించలేదు. ఆమె స్నేహితురాలు సుజాత పట్నంలో చదువు కొనసాగిస్తోంది. కడుపు నొప్పిని సుజాత ఇంటికి వచ్చింది. ప్రసన్న జేజి లచ్చుమ్మ తాము బట్టలుతికే సుజాత తల్లి సుభద్రమ్మ ఇంటికి వెళ్ళి గంగమ్మను చేసుకొనేదానికి బియ్యం బ్యాళ్లు అడిగి తెమ్మని పురమాయిస్తే వెళ్ళింది. సుభద్రమ్మ సుజాతయిడ్సిన బట్టలు పిండి ఆరేయమని చెప్పింది. అవి మైల బట్టలు. అదీతన ఈడు పిల్ల. ప్రసన్నకు జుగుప్స బాధ కలిగింది. తనకు నెలసరి వచ్చినపుడు కూడా కడుపునొప్పి వుంటుంది. సుజాత లాగ పడుకుంటే అవుతుందా. బట్టలు ఉతకాల్సిందే అని ఆవేదన చెందుతుంది. తన బట్టలు తప్ప ఇంత వరకు ఇతరులవి ముట్టుకోలేదు. ఇంతలో లచ్చుమ్మ వచ్చింది. సుభద్రమ్మ బియ్యం, బ్యాళ్లు ఇచ్చింది. సుజాత తరపున కొత్త చీర, జాకెట్టు గంగమ్మకు పెట్టుకోమని ఇచ్చింది.

చాకలి కులస్థులు వానలు పడాలని గంగమ్మకు పూజలు చేస్తున్నారు. యాటకు, పూజకు ఇంటికి ఐదు వందలు ఖర్చవుతుంది. బట్టలుతకటానికి అప్పు చేయాలా. ఇంత ఖర్చు పెట్టి పూజలు చేయకపోతే తనను చదివించొచ్చు గదా అనుకుంటుంది ప్రసన్న. అదే ప్రశ్నించింది. కన్నీరుమున్నీరయింది. ఈ మైల బట్టలు వుత్కడం కంటే హాస్టల్లో ఆపురుగులన్నం నీళ్ళ సాంబారే మేలు. అనుకుంది.

”ఏడ్సద్దే ఎంత ఏడ్సినా మన సాకల్లోళ్ళ బతుకు యింతేనే ఎవరో ఒకరిద్దరికి తప్ప మనకు సుఖపడే రాతలేదు. మనోళ్ళు మారరు మా పెద్దోళ్ళ లెక్కనే మేము… మా లెక్కనే మీరు… మళ్ళీ మీ పిల్లోళ్ళు ఇంతే” అని బంధువు రాజేశ్వరి జాలి పడింది. తిండి జరుగుబాటు కోసం భగవంతుడు రాసిన రాత అని పెద్దల నమ్మకం. ”రైతులకు, పూజార్లకు వ్యాపారస్థులకు వాళ్ళ పనులు మస్తుగుంటాయి.. బట్టలు శుభ్రంగా మల్లెపూల లెక్క మెరిసేట్టుగా వుతికే వరం మీకుయిస్తున్నాను” అలాగే ఎందుకుండాలన్నది యువతరం ప్రశ్న. చైతన్యం, మూఢత్వం రెండు భిన్న కోణాలకు ఈ కథ సాక్షి.

ఆధిపత్యం, అహంకారం చూపించిన యజమానిని దెబ్బతీసిన రజకుడు, తనను లైంగిక వేధింపులకు గురి చేసిన యజమానికి శాస్త్రి జరిగిందని భావించిన రజక మహిళ. ఒక దెబ్బతో రెండు రకాలుగా విముక్తి పొందిన రజక కుటుంబగాథ గంటేడగౌరు నాయుడు ‘విముక్తి’ (1989).

సిమ్మడు, అప్పిలి చూడముచ్చటైన జంట. అప్పిలితో కలిసి రేవు పెట్టితే శ్రమ తెలిసేది కాదు సిమ్మడికి. అలాంటిదేమైందో అప్పిలి మంచం పట్టింది. కులవృత్తి మాని వేయమని లేకుంటే జీతానికి కాకుండా జతకింతని మాట్లాడు కోమంటుంది. ఒక రోజు రేవుకు వెళ్ళినసిమ్మన్ని భార్య ఆరోగ్యం గూర్చి పరామర్శించాడు అప్పల సోమి. మందులకు డబ్బులేదని నాయుడ్ని జీతమడిగితే కోపగించుకున్నాడని వాపోయాడు సిమ్మడు. అప్పిలికి తీవ్రమయిందని సిమ్మడికి కబురొస్తే ఇంటికెళ్ళాడు. సిమ్మడు వాపోయిన విషయం నాయుడుకు చేర్చాడు అప్పలసోమి. సిమ్మడిని స్తంభానికి కట్టివేసి తట్టు తేలేటట్లు బాదాడు నాయుడు.

”సాకల్లంజికొడకా నీ జీతం ఎగమెడ్డీసీ నా కూతురు సమర్తలో మూలదాన్నింవుంచుకొనినేను మేడలు కట్టేస్తున్నాన్రా? ఎక్కడెక్కడో ఏటేటో పేల్తే నాకు తెలీదనుకున్నావురా? నేను నీకు జీతమివ్వలేదని ఊరందరికి సాటతావా? ఆలే యిత్తార్నేరా… ఎవుల్తోటి సెప్పినావో ఆలే యిత్తారు. నీకింత మెడపోత్రమా” అంటూ బండబూతులు తిట్టాడు.

”ఒరే రేవులో నీవు పారీసిన బట్టలు, అమ్ముకున్న సీరలు అన్నింటికీ రేటు కడితే నీ జీతానికి సరిపోతాయి. ఎల్లు.. ఎల్రా… ఎవుల్తో సెప్పుకుంతావో” అని కట్లు విప్పదీసేడు. సిమ్మడు నిగ్రహించుకోలేక సివంగి అయ్యాడు. దెబ్బకు దెబ్బ ఇచ్చాడు.

”ఇన్నాళ్ళూ మీ ఆడోళ్ళ మైలగుడ్డలు పులిమి, మీ పిల్లల సమర్త కవుర్లు సెప్పి, అరిసిలు కావుళ్ళు మోసి, మీ సావులుకి ‘కాష్టం’ పేర్చి, మీ బాడి నరకమంతా సేసినందుకు మా మంచి బవుమతే యిచ్చినారు. నా జీతమడిగితే నాకు మంచి శాస్తి సేసినారు. బావూ… మీ సెప్పులు మోసి బతికినోలుకి ఆ సెప్పులు కిందేసి నలిపేత్తారా ఈ సేవలు ఇక ఎవరు సేస్తారో చూస్తా అంటూ కళ్ళెర్రజేసాడు. కర్రతో నాయుణ్ణి వాయించాడు ఆధిపత్యం అహంకారం మీద దెబ్బకొట్టిన ఆనందం అప్పిలితో పంచుకున్నాడు. అప్పిలి మనస్సులో అనుకొంది. ఆ రోజు నాయుడు నా ఒంటి మీద సెయ్యేసినందుకు ఇప్పుడు తగిన శాస్తి జరిగింది”. అప్పిలి చెప్పిన సొంత ఇస్త్రీ షాపు గూర్చి ఆలోచిస్తున్నాడు ఇపుడు సిమ్మడు.

రజక స్త్రీలు గుడ్డలు తెచ్చుకోవటానికి వెళ్ళినపుడు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అప్పిలి సొంత ఇస్త్రీ షాపు ఆలోచన చేసింది. కొట్టినా, తిట్టినా జీతమివ్వకపోయినా అణగిమణగి ఉండే కాలం కాదని తెలియజేసాడు సిమ్మడు.

నాయుడు విషయం భర్తతో చెప్పకుండా కుమిలిపోయింది అప్పిలి. సుఖంగా సాగే సంసారంలో నిప్పులు కురవచ్చు. భర్త మమకారానికి దూరం కావచ్చు. కలతలు రావచ్చు. భర్త వెళ్ళి నాయుడ్ని నిలదీస్తే, అతని దురాగతానికి బలికావలసి రావచ్చు. నాయునికి కనిపించకుండా ఉండే ప్రయత్నాలు చేసింది. భర్తను పోరు పెట్టిందే తప్ప విషయం చెప్పకుండా లోలోన మథనపడింది. భర్త నాయునికి ఎదురుతిరిగి తగిన శాస్తి చేసినపుడు ఆనందించింది.

తాగుడుకు బానిసయి పిల్లల పోషణ భారం వహించని భర్త ఉన్నా, లేకున్నా ఒకటేనని శ్రమను నమ్ముకున్న మహిళగాథ ముదిగంటి సుజాతరెడ్డి ‘పలాయనం’ (1998).

మల్లమ్మ చంద్రయ్య భార్యాభర్తలు. చంద్రయ్య తాగుబోతు. మల్లమ్మ కుటుంబానికి జీవనాధారం తండ్రి ఇచ్చిన ఇస్త్రీ పెట్టే. ఇస్త్రీ చేసిన కష్టార్జితం తాగుడుకు హారతి కర్పూరం చేస్తాడు. కష్టానికి వెనుక తాగుడుకు ముందు ఇదే తంతు. మల్లమ్మను ఇండ్ల జాగా కొంటానని నమ్మించి పెళ్ళిలో పెట్టిన నగలు అన్నీ ఖర్చు పెట్టేసాడు.

ఇల్లు, పిల్లలు, సంసారం కాబట్టదు. చివరికి ఇస్త్రీ పెట్టెనీ కూడ తాకట్టు పెట్టి తాగాడు. మల్లమ్మ తండ్రి సంగయ్య వచ్చి విడిపించి వెళ్ళాడు. ఐదు మంది పిల్లలు. చంద్రయ్యకు ఏ పనీచేయకున్నా వేళకు తిండి పెట్టాలి. మల్లమ్మ తండ్రిని సాగనంపి వచ్చిన చంద్రయ్య వేళకు కూడు పెట్టలేదని భార్యను చితకబాదాడు. ఆ దెబ్బలకు నోటమాటరాక కుప్పకూలిపోయింది. చనిపోయిందని చంద్రయ్య జారుకున్నాడు. చాలా ఏండ్ల వరకు పత్తాలేడు. జాతరలో బిక్షమడుక్కుంటూ కనిపించాడని వార్త. చలించలేదు మల్లమ్మ.

”ఎక్కడ సచ్చిండో సీకూసింత లేకుంట సారా, గుడంబ తాక్కుంట. ఎక్కడున్నా ఆడు మారాజే గీ పోరగాలు ఆగమైతరని రందివుంటె గిట్ల మాయమై పోతాడా ఆడు గీ పోరగాల్లను సాదిపెండ్లిండ్లు సేసి ఆల్లకో దారి సూపేదనుకునయిన నా పెయిలో పానముంటె గంతేసాలు” అనుకొంది. ఇస్త్రీ పెట్టెను నమ్మకుంది. మల్లమ్మే కాదు వ్యసనపరుడైన భర్త ఉన్న ప్రతి ఇల్లాలు వ్యధ ఇదే. ఇల్లు గుల్ల. ఆడవాళ్ళు బతుకు గుల్ల. చివరకు కుటుంబం వీధిన పడడం సమాజంలో వున్న వాస్తవం.

అన్ని కులాల్లోను, వర్గాల్లోను మల్లమ్మ లాగ బాధలు సహిస్తున్న స్త్రీలు అనేక మంది. మద్యపానం వల్ల ఎన్నో కుటుంబాలు కడగండ్ల పాలవుతున్నాయి. ప్రభుత్వం ఆదాయవనరులుగా భావిస్తున్నదే తప్ప నిషేధం పెట్టటంలేదు. పెట్టినా తూతూ మంత్రమే. ఆర్థికంగా వెసులుబాటున్నా మగవాళ్ల ఆగడాలు ఆడవాళ్ళు భరింపరానివి. తాగుడువల్ల కలిగే అనర్థాలకు అంతముందా?

పై కథల్లోని అంశాలను అవలోకిస్తే రజక స్త్రీలు వృత్తి పనిలో పురుషునికంటె అధిక శ్రమ పడుతున్నారు. ఇంటింటికి వెళ్ళి బట్టలు తీసుకురావడం, రేవు పెట్టడంలో సహకరించడం, ఏ యింటి బట్టలు ఆ ఇంటికి చేర్చడం, సందేళ అన్నం పెట్టించుకు రావడం వంటి పనులన్నీ స్త్రీలే చేస్తున్నారు. ఆడపిల్లలతో వృత్తిపనికోసం అర్థాంతరంగా చదువుకు స్వస్తి చెప్పిస్తున్నారు పెద్దలు. భర్త చనిపోతేనో, ఇంటి బాధ్యతలో పట్టించుకోనోడో అయితే వృత్తిపని మొత్తం మీదేసుకొని, కుటుంబ పోషణ బాధ్యత చేపట్టక తప్పటం లేదు. వృత్తిపని మీద యజమానుల ఇళ్ళకు వెళ్లినప్పుడు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే చైతన్యం పొందుతున్నారు. పితృస్వామిక భావజాలం, సమాజంలో ఆధిపత్య భావజాలం వల్ల రజక మహిళ నలుగుతోంది. ఆధిపత్యం కింద నలిగిన అనుభవంతో గాని, యువత ఆలోచనా ధోరణిలో మార్పువల్ల గానీ వృత్తిపట్ల విముఖత, విద్యా ఉద్యోగాల పట్ల సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో, సమాజంలో సంఘర్షణ పడుతున్నా, పురోగామి దిశలో అడుగులు వేస్తున్నదని చెప్పవచ్చు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

2 Responses to తెలుగు కథ – రజక మహిళ- ఆచార్య మూలె విజయలక్ష్మి

  1. ఈ కధలను మేము మా వెబ్ సైట్ పెడదాం అనుకుంటున్నాము.మీ అనుమతి కావాలి.మీ అభిప్రాయం తెలుపగలరు

    • peddinti ashokkumar says:

      రజకమీజీవితాల మీద పెద్దింటి అశోక్‌ మ రొ క త వు న ది . దా ని పే రు ” సా కి రే వు “

Leave a Reply to peddinti ashokkumar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.