అమ్మా!బయలెల్లినాదో!

తమ్మెర రాధిక

(భూమిక కథల పోటీలో రెండవ బహుమతి పొందిన కథ)

పదకొండు గంటల బస్సు రోడ్డు దుమ్మును ముసుగులా ఏసుకొని అంగడి ముందాగింది.

 కాసేపు ఆ దుమ్ములో ఎవరు దిగిందీ, ఎవరు ఎక్కిందీ ఏదీ కనపడలా.  బస్సుపోయినాక నాగరత్నం చంటి పిలగాడి నెత్తుకొని, ఎడపోడిని చేతబట్టుకొని నిల్సుని కనిపించింది.

”గిప్పుడునానే రావుడు?” వాళ్ళ ఊరి నర్సయ్య పల్కరించిండు.
”మరే మావ… అత్తమ్మ గిట్ట బాగున్నారే?” అడిగింది నాగరత్నం.
”ఆ  ….. మీ నాయిన చూస్తాండు నీ కోసమే.”
నాగరత్నం బతకమ్మ పండ్గకు వచ్చింది.  తండ్రి అల్లుడికి మతలబు చేస్తే ఎవలనన్న పంపుతే పంపిస్తనన్నడు.
”ఎవలుంటరు ఆడిదంక రానీకే ? పొలం కావలి పోతాండ్రు, కరెంటు సైమంగ వస్త లేక” అన్నడు.
ఆ పిల్ల అత్త మావలు ఒప్పుకోలే.  విధిలేక పక్కింట పాలోని కొడుకు నారి గాడ్ని పంపిండు.
”నాయిన అరిట పండ్లు కొనే.” పిలగాడు చంకల్నించి జారుతుంటే పైకి ఎగరేసుకోని సంచీ బట్టుకుంది.  కుప్పలు బెట్టిన పండ్లు తక్కువ రేటు కిస్తరని అవ్వే పది రపాయలకు బేరం చేసి కవర్ల ఏయించుకున్నడు తండ్రి.  నాగరత్నం తల్లిగారూరు మండలానికి ఐదు కిలోమీటర్లు.  అంగడి పక్కనే ఆటోలుంటయి.  అక్కడ్నించి ఆటో పట్కోని మేదినీపురం పోవాలె.
”నడిచి పోదాం.  నాలుగంగలు ఏస్తే గుర్రాలోళ్ళ బండలొస్తయి.  ఆడ్నించి డొంకలకు పోతే గూడెమేనాయె” బిడ్డ మొకంలకు ఆశ్చర్యంగ చూసిండు తండ్రి.
”సంకల పొల్లగాడే నాయె! ఎడపోడు నడువద్దే! ఎండ దంస్తాంది.  మొన్న పొద్దకంగ ఎనిగలు పట్కోని వాన సొక్క గొట్టింది.  ఆ బురదల.. ఈ ఎండకు….” సందిగ్ధంగ ఆగిపోయిండు.
”పెద్దోడు ఆడ మేకలు మేపుకుంట తిర్గుత లేడా? గీ మాసరకే సుకపడ్తాము!” నాగరత్నం నడకతో దారితీసిండు. బిడ్డ కట్టం సుఖం ఏందోనని తండ్రికి లోలోపల దవ దవ గుంది.  ఇల్లు చేరినంక తల్లిచ్చిన గిలాసడు నీల్లు పిలగాడికి తాపింది.  తను గిన్నెన్ని గొంతుల పోస్కోని ఆరాంగ కూసున్నది.  పళ్ళెంల గోంగర తొక్కు ఎర్రమల్లెల అన్నం ఏసిచ్చి, సంటోడ్ని ఎత్తుకొని ముద్దు చేస్కుంట అత్త ముచ్చెట్లు అడుగుతున్న రత్తమ్మ.
”లేడికి సిరొస్తే లేసి లేసి పోయిందని, కలిగిన ఆడి బిడ్డొస్తే మా అత్తకు పై బట్టాగుత లేదు.”  చుట్టు పక్కల ఇండ్లోల్లు నాగరత్నాన్ని చూసెటందుకు వస్తంటే బిడ్డకు సైగ చేసింది ఊకో మని.  వట ముచ్చటైనంక, తిన్న పళ్ళెం గోలెం కాడ కడుక్కోని వచ్చుకుంట చెట్లనన్నింటిని చూసింది.  సద్దులు అయినంక సందుగల దొర్సాని ఏమన్న చీరె ఇస్తె కొంచపోవాలె.  నాయిన కొత్త చీర కొంటడో?  పొల్లగాళ్లకు బట్టలు పట్టిస్తడో?  పుట్టెడు ఆలోచనలు.  గోలెం కాడ స్నానం చేసి, సంచీలోంచి చీర దీసి కట్టుకోని బతుకమ్మ కాడ కూచున్నది.  పళ్ళెం ముందు పెట్టుకోని తంగేడు పువ్వు రిబ్బి వరుసగ పేర్చి, తంగేడాకు కడుపుల పోసి, ఇంకొక వరుస కట్లపూలు పేర్చింది.  మళ్ళీ కడుపుల ఆకు పోసి మందార పూలు పేర్చింది.  పేర్చుడు కాంగనే దాని మీద గుమ్మడి గౌరమ్మని సర్దింది.  చిన్న కవర్ల పెసర పప్పు పందార పోసి మూట కట్టింది.  ఇంకో కవర్ల తంగేడు మొగ్గలేసి మూట కట్టి పక్కన పెట్టుకున్నది.
”అవ్వా పోరగాళ్ళకు తానం బొయ్యె.  వాల్లొస్తమని లొల్లి బెడ్తరు ఐటంక” తల్లితోని చెప్పింది నాగరత్నం.  నాలుగన్నర ఐదు గంటలకు కర్నాల బత్కమ్మ ఎల్లంగనే అందరు బైలెల్లిండ్రు.  రంగు రంగుల చీరలు, రకరకాల బత్కమ్మలు. ఆడోళ్ళు చాలా మంది ఆ వూరి ఆడిబిడ్డలే.  పది రోజుల పండగని అంతా పుట్టింట కొస్తరు.  ఆడపిల్లలు కుంటకు పోత దార్లో ఎవరి అత్త గారింట ముచ్చట్లు వాళ్ళు ఎదుటి వాళ్ళకు చెప్పుకుంట సొద ఎల్లబోసు కుంటున్నరు.  కుంటకు చేరంగనే ఎవరి కులాలకు వారు విడిపోయిండ్రు.  కర్నాలు ఒక గుంపుగ, కోమట్లు, కమ్మర్లు కాపులు ఒక గుంపుగ, గౌండ్లోల్లు, కుమ్మరు మిగతా కులాలు ఒక గుంపుగ బతుకమ్మలు నేల మీద పెట్టిండ్రు.  నాగరత్నం వెంపలి చెట్టు దెచ్చి, మట్టి ముద్దగ చేసి దాంట్ల గుచ్చి పెట్టి, కుంటలకు బోయి నీల్లు దెచ్చి చల్లి పసుపు కుంకుమ పొట్లాలు ఇప్పి సల్లి సుట్టు నిలబడ్డ అమ్మలక్కలకు బొట్టు పెట్టుకుంట వచ్చింది.  తంగేడు మొగ్గలు చేత బట్టుకోని అందరు పాడుడు మొదలు బెట్టిండ్రు.  నాగరత్నం చెప్తుంటే చుట్టు నిల్చున్నోళ్ళు వంత పాట పాడుతుండ్రు.  ‘ఒక్కొక్క పువ్వేసి సందమామ – ఒక్క జాము ఆయె సందమామ, రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయే సందమామ’ అంటు.
”లచ్చుమక్క నువ్వో పాట జెప్పే” అన్నది నాగరత్నం. 
”నాకేడొస్తయ్యే చెల్లె.  యాదికి కూడ లేకుండే.  గా సిన్న పోర్ని చెప్పమను” అన్నది.  ఆ పిల్ల సిగ్గుల మొగ్గయి ముడుచుకు పోతూ పాట అందుకున్నది.  ‘ఒక్కో మాసం నెల తన గర్భిణి వొనగాయలడిగే చెలియా’ అనంగనే అందరు ‘చెలియా ఓనగాయలడిగే’ అన్నరు.  ‘రెండో మాసం నెల తన గర్భిణి రేగుబండ్లు అడిగే’ మళ్ళందరు ‘చెలియా రేగుబండ్లడిగే’ అంటూ అందుకున్నరు.  దీపాల యాళదంక పాడుకోని బత్కమ్మల్ని దీసి కుంటల ఒదిలి ఇళ్ళకు చేరిండ్రు.  అమాసనాడు పెతరామస బత్కమ్మని కుంటలకు పోతరు.  తొమ్మిది దినాలయి నంగ సద్దులు చేస్తరు.  దాన్ని సద్దుల బత్కమ్మంటరు.  చెరువుకు తీస్కపోతరు.
నాగరత్నాన్ని కదిపిందో రోజు తల్లి.  ఏదంటాంది మీ అత్త అని.
”నాయిన గున వోలిగ వుండదే దానికి.  పది మేకల్ని తోలియ్యల్నట.  చిన్నోడు బుట్టినంక అంగి లాగెర్కలేదట ఆమె కొడుక్కి.  బట్టెబాజు ముండ కొడుకు.  ఓ పని లేదు పాతర గడ్డ లేదు” మొగని ముచ్చట చెప్పుకుంట మొటకలిరిచింది.
”కోరీ లోకి పోతాండు.  నెల పైసలు ఇంట్లిచ్చుడు లేదు.  ముదాము తాగుడు… తాగుడు.  వాని  సోపతులు మంచిగ లేవు.  అవ్వ చెప్పది.  బిడ్డలు మంచి గుంటె సాలు.  మావ ఈగ దోమలెక్కనే దాని కింద”. 
”గాడేందే” జబ్బ చసి అడిగింది రత్తమ్మ.  నాగరత్నం ఏడ్చింది.  దెబ్బ గుర్తొచ్చి.
”మేకల్ని పంపుత లేరని నీ ఆడిబిడ్డ కొడుకుతోని కొట్టిపిచ్చింది.  నాయినకు మతలబు చేత్తే ఉలుకు పలుకు లేకుండున్నడని కోపంతోని గీపని చేసింది”. 
”ఉడుకు నీల్లు కాపనా బిడ్డా!” అడిగింది రత్తమ్మ.  ఒద్దని తలూపింది నాగరత్నం.  ఆడిబిడ్డని మనుసుల్నే శాపనలు పెట్టుకుంట, పిల్లగాల్లకు పక్కలేసి పండబెట్టి, తల్లిబిడ్డలు పోయి యింటి ముంగల కూసున్నరు.  అమాస రోజులేమో చీకటి చీకటి గున్నది.  చల్లగాలికి కూర్పాట్లు వస్తున్నా తండ్రి రాకడకు  చూస్తున్నరు.  జరంత సేపటికి రానే వచ్చిండు. 
”గలవట్లనే కూకున్నరేమే?  పిల్ల గాల్లు పన్నరా బిడ్డా?” అడిగిండు. 
”మా పన్నరు… పిల్లొచ్చే, యాల పొద్దుగలగ ఇల్లు చేర్దాం అనుకోవు గదా!” రత్తమ్మ ఈసడింపు లెక్క చేయక లోపలికొచ్చిండు.  గుడంబ వాసనొస్తున్నది తండ్రి దగ్గర.  రత్తమ్మకు ఆక్రోశంగ వున్నది.  మొగుడు ఏమాటా యినడు.  ఇంట సమస్యలసలే పట్టవు.  బిడ్డ దెబ్బలు తిని, పిల్లగాళ్ళ నేసుకొని పండ్లకు వచ్చింది తండ్రి దగ్గర.  రత్తమ్మకు ఆక్రోశంగ వున్నది.  మొగుడు ఏమాటా యినడు.  ఇంట సమస్యలసలే పట్టవు.  బిడ్డ దెబ్బలు తిని, పిల్లగళ్ళు నేసుకొని పండ్గకు వచ్చింది.  దాని సంగతి ఏందని తెల్సుకొనే ఉపాయం చేస్తలేడు.  తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి లెక్క, పొద్దుగాల పోతే నడిరాత్రొచ్చిండు.  పళ్ళెంల చింతకాయ పచ్చడి అన్నం ఏస్కొచ్చి, చెంబుల నీల్లు పట్కొచ్చి ఇచ్చింది.  వాకిట్ల కాల్లు చేతులు కడుక్కొని వచ్చి పల్లెం పట్కోని కల్పుకుంట కూసున్నడు.  ఎవ్వలు కాసేపు మాట్లాడలే.  నాగరత్నమే తెగించి అడిగింది.
”నాయిన మేకల సంగతేం జేసినవ్‌?”
”ఏం జేస్తమే!…. మేకల్ని కొందా మంటే నాకాడ డబ్బుల్లేవు.  కాల్వపైసలు రాంగనె ఇప్పిస్త.  ఇంగ నెలైతట్టే వుంది పైసలు రావాల్నంటె.  సర్పంచి కాడ దస్కతులు పెట్టీయ్యలె.  ఈడా అప్పులు సూస్తనే వున్నయి”.
”నీ అక్క ఊకుంట లేదు” రత్తమ్మ అక్కసుగ మొటికలిరిచింది.
”ఊకోక ఏం జేస్తాంది?” ప్రశ్నించిండు.
”పొల్లని సావ సావ గొట్టిస్తాంది.  పండుగకు తోలనన్నది కూడ అందుకే.  ఒల్లెచ్చబడ్తే పోరడ్ని దావుకాండ్లకు తీస్కపోలేడట నీ అల్లుడు… గంత పుర్సత్తు లేకుంట వున్నడా? పిలగాల్లు జూడు నక్క నక్క అయ్యిండ్రు.  సిన్నోడికింక జెరమే కొడ్తాంది.”
”నువ్వూకుండు” ఒక గదవయింపు గదవయించిండు.
”నా రత్నం నువ్వు చెప్పే…. మొగోల్లు సంపాయించుకొత్తాంకొత్తా౦టే తిని కూసోక తన్లాడు కోవుడుకు ఏం రోగమైందే మీ ఆడోల్లకు?” బిడ్డను అడిగిండు తండ్రి.  రేసుకుక్కోలిగె లేచింది రత్తమ్మ.
”నువ్వు నీ అక్కని ఎన్కేస్కరాకు.  ఇదారికే మూన్నాల్ల సార్ల పెద్దమడుసులల్ల  వడ్డం…పంచాయితీ అయ్యింది. పిల్లకి ఏరుబొస్తేనే అది మనిషొలిగె వుంటది.  ఊకె వచ్చె పోయె సుట్టం, ఆడిబిడ్డలు మరిది కుటుంబం ఆ సంసారంల ఏవి నెగుల్తది?…. ” రత్తమ్మ మాట పూర్తి గాలేదు, తింటున్న పల్లెం ఇసిరేసి, ”నీయమ్మ దొంగ.. ముం… పోరికి నేర్పుతున్నావే?  ఏరుబడమని.  తల్లి బిడ్డలు బదులుకోని తప్పు నా అక్కదంటరా”. రత్తమ్మని జుత్తందుకుని వంగదీసి నాలుగు గుద్దిండు.  రత్తమ్మ బండ బతులందుకుంది.  ”కట్టమీది మైసమ్మోలె కావలి బంటదిరో నీ అక్క…. నా బిడ్డకు.  సాటకండుని తవుడైందిరో దాని సంసారం… నీ అక్క మొదలారి పోనో.. పెండ్లి కాక ముందంత నా రెక్కల కట్టం దిన్నదమ్మో… ఇప్పుడు నా బిడ్డ ఉసురు బోసుకుంటున్నదమ్మో…” ఇంక నాలుగేసిండు.  తల్లిని గుంజి లోపలికి తోలి, తండ్రిని బైటికి నెట్టి తలుపేసి ఏడ్చుకుంట పిలగాల్ల పక్కెంబడి పండుకున్నది నాగరత్నం.
 సద్దుల నాడు నాగరత్నం మొగడు రాలె.  సద్దలు ఇసిరి ముద్దలు పిసికిండ్రు.  బియ్యం పిండి బెల్లం కల్పి ముద్దలు చేసిండ్రు.  పోరగాళ్లకు కొత్త బట్టలు లేవు.  తను ఉతికి తెచ్చినవే ఏసింది.  యాబయి రూపాయలు బిడ్డ చేతుల బెట్టి, ”కూళ్ళకు సుత పోతలేను బిడ్డా….. రోగం మొదలార దమ్ము సుతలాయిస్త లేదు.  ఈ పాలి తప్పక చీర కొంట, కొంచ పోదువు.  దొర్సాని చీర ఇస్త ఇస్తనన్నది, పండ్లకు పోయింది ఇయ్యకుంట”  అన్నది రత్తమ్మ.  నాగరత్నం కుంగిపోయింది.  అత్తింట మెహర్భానీ లేదు.  చిన్న కోడలు అన్ని తెచ్చుకుంటది అవ్వగారింట నించి, ఆడిబిడ్డ సమస్తం కొంచబోతది పుట్టింట నించెల్లి.  ఎటుబడి తన, తన పొల్లగాల్లు.  మొగుడు పట్టించుకోడు.  పుట్టింట్ల ఆదరువు లేదు.  ఏం బతుకు?  ఏట్లె బతుకు?  ఆ పైసలు చస్తె విరక్తి పుట్టింది.  చెయ్యేసి ముట్ల బుద్ది కాలేదు.  రెండ్రోజులకు తండ్రి చెప్తున్నడు సల్లంగ.
”మీరు మీరు ఏవన్న ఏడువుండ్రి.  మా అక్క జోలికి పోతే మటుకు మంచి గుండదు బిడ్డా! రేపు నలుగుర్ల పంచాయితికి పిలుస్తడట మా బావ.  మీ అమ్మ నోరు మంచిది గాదు.  నువ్వూ అవ్వ దాని మీద లొల్లి బెడ్తే నన్ను నోట్లె వుంచుతరు”.
”మల్లెప్పుడు పంచాయితీ?” నాగరత్నం నోరెల్ల బెట్టింది.  పండగెల్లంగనె తను ఇంటికి పోతలేదా?  వీలని గొంతు కోసి సంపినా పైస ఎల్లదు, పంచాయితి పెట్టినా లాభం లేదు.
”పైసలు పట్కొచ్చిందన్కాన తీస్కపోడట వాడు.  వాసం వోల్ల పోరడితోని చెప్పి పంపిందక్క.  ఎంత చెప్పిన వాడింట లేడంట”  చెప్పిండు తండ్రి.  ”గదంత వొల్లెక్కాలె నాయిన….” ఇంకేదో చెప్పబోయింది నాగరత్నం.  అత్త  బద్మాషీతనం చెప్పుదామనుకున్నా, తల్లి సైగ చేసింది వూకోమని.  సద్దుల నాడు బత్కమ్మ ఎల్లే యలైంది.  నల్లపూసల గొలుసు కొనుక్కొచ్చింది రత్తమ్మ యిరవై రూపాయలు పెట్టి.  బిడ్డను ఏస్కోమన్నది.  ”ఇర్వయి పెడ్తే పొల్లగాల్లు ఏవన్న తినెదానికొచ్చు కదా!” నాగరత్నం నిష్ఠురపోయింది.  మేలగాళ్ళు వర్జ్యం వస్తదని ముందుగాల కర్నాల యింట మంగల వాయిస్తున్నరు.  బత్కమ్మని తీసుకొని బైటకొచ్చింది నాగరత్నం.
ఎన్ని సంవత్సరాలు గడిచినా అత్తకూ అమ్మకు పొసగదు.  పెండ్లి కాక మునుపు అత్త తల్లి కింద ఏమనుభవించినా పెండ్లైనంక అదంత తనమీద తీరుస్తదత్త.  పండగ అయినంక పంచాయతి లేదు ఏం లేదని తను మొండిగ ఇంటికి పోయినా అత్త తనను ఉండనియ్యదు.  ఏరాండ్ల ముందట నవ్వుల పాలు చేస్తది.  గింత కంటే సస్తే నయం.  కండ్లెంబడి నీల్లు ఉబికి బత్కమ్మ మీద పడ్డయి.
జనం బజారు నిండ నిండిండ్రు.  పెద్ద పెద్ద బత్కమ్మలను జీతగాల్లు నెత్తికెత్తుకుంటె వాల్లెన్క దొర్సాన్లు, అమ్మగార్లు చిన్న చిన్న పల్లాలల్ల చిన్న బతకమ్మల్ని పట్కోని నగలు సవరించుకుంట ఆర్భాటంగ బైలెల్లిండ్రు.  చెరువు కాడ బతకమ్మల్ని దింపి కులాల వారిగా విడిపోయి ముచ్చట్లు, పాటల మొదలు పెట్టిండ్రు.  అయ్యగారు ఆశీర్వచనం చెప్పుకుంట అందరి దగ్గర కాడికి పోయిండ్రు. ఏసినమ్మ ఏసింది.  ఎయ్యనమ్మ ఎయ్యలేదు.  చెరువు కట్ట మీద మొగోళ్ళు పిల్లలు నిండి పోయారు.  సరీడు చెర్లోకి కుంగిపోయిందన్క కోట దిరిగి పాటలు పాడి అలిసిపోయిండ్రు అమ్మలక్కలు.  పిల్లగాల్లను దగ్గరికి పిల్చి పొద్దుగాల యింటికి పోండ్రని చెప్పి పంపింది నాగరత్నం.  మనసంతా దుఃఖభారంతో ఓటమితో నిండిపోయింది.  ఏం పాపం చేసిందని ఇంత కష్టపెట్టిండు దేముడు?  తెల్లారి లేస్తే అబద్ధాలతోటి జీవిక ఎళ్ళదీసెటోళ్ళని కరుణిస్తాండే తనేనా భారం భూమాతకు?  ఒక్కసారిగా ఆమెలో పిచ్చి ఆవేశం పొంగింది.  చెర్లో మునిగి సస్తే గాని అత్తకు మొగనికి బుద్ధి రాదు! అనుకుందే తడవు బతకమ్మని లేపింది.  ”గప్పుడే తీస్తానవేంది నా రత్నం?” ఆశ్చర్యపోయారు స్నేహితులు.  ”కడుపుల తిప్పుతాంది.  పొద్దు గడ పాయె.  కర్నాలు తీసిండ్రు కద!”  పొంతన లేని సమాధానాలు చెప్పి బయల్దేరింది.  చెర్లోకి ఒక్కొక్క అడుగేస్తుంటే దుఃఖం పొంగు కొచ్చింది.  అప్పటికే బ్రాహ్మణ ముత్తైదులు బతకమ్మల్ని చెర్లో ఒదిలి ఖాళీ పళ్లాలల్లో పసుపు గౌరమ్మల్ని వుంచి చెరువు నీళ్ళు కొన్ని పోసి ఒలలాడిస్తున్నరు.  ”హిమవంతూ నింట్లో పుట్టీ, హిమవంతూ నింట్లో పెరిగీ, విదియాట్ల తదియ నాడు,  కాంతాలందరూ గూడి,  గౌరమ్మకు పూజా చేసీ, వత్తీ పత్తీనీ బెట్టీ, వరుసాతో సద్దులు గలిపీ, ఆ శంబునీ కప్పాగించి మాయమ్మ లక్ష్మీదేవి పోయీ రావమ్మా!  అత్తా మామా పోట్లాశాలా, భయ భాక్తీ కలిగీ వుంటే వద్దీకి గలిగీ వుంటే బుద్ధీ కలిగీ నీవే వుంటే ప్రేమతో నీకు చీరెలు బెడుదూ, ప్రేమతో నీకు సారెలు బెడుదూ”.
చెర్లోకి దిగిన నాగరత్నం పచ్చపూల చీరతో నీళ్లల్లో సగం వదిలిన బతకమ్మలాగా వుంది.  ఆ పాట ఆమెలో ఉలిక్కిపాటును కలిగించింది.  ఎంత మంది పట్ల భయ భక్తులు కలిగి వుంటే ఏం లాభం?  సంసారంలో అన్నీ అపసృతులే దొర్లుతుంటే?
”బావా మరుదుల పట్లా, వదీనా మరదళ్ళా పట్లా భయ భాక్తీ గలిగీ వుంటే పాటించీనా దీపావళీ పండగ పదునాళ్ళుందనగా నాటికే తోలుక వస్తూ” కరణాల గొంతులు చెర్లో అలలు అలలుగా తేలివస్తున్నది.  ఏ పండ్గకూ సక్కంగ పంపలేదు.  ఎప్పుడు ఏడ్పులామ్పలేనాయె.  పాటలోని సొగసు జీవితాల్లో లేదాయె.
”పట్టంచూ చీరాలిస్తూ, చీనీ చీనాంబ్రాలిస్తూ, కాటీకా కాయలిస్తూ, కల కంచ చీరాలిస్తూ, కోటీ సూర్యాకాంతులు మెరియూ ముత్యాల హారాలిస్తూ….”
పుట్టింట్ల గనీ అత్తింట్లగనీ సరైన గుడ్డ మొకం తెల్వది.  పట్టంచు చీర కెవ్వలేడ్చిండ్రు.  ముక్కు పుడుకకు గతిలదు, ముత్యాల హారాన్నడిగిందెవ్వరు?  ఇంట రాజులందర్ని అడిగి పుట్టిల్లు చేరితే, పిడికెడు మెతుకులు గిట్టు బాటైత లేదు.  ముత్తైదలు మైమరిచి మరీ పాడుతున్నరు.
”పల్లెత్తీ పలుకాబోకమ్మా, గజ్జెల్లా చప్పుడుతో నడువా బోకమ్మా”. పల్లెత్తు మాట మాట్లాడుకుంట వుండెటోరీకే అత్తగారింట్ల గదేం తప్పు జేసిందో మాట్లాడ్తలేరు అంటరు.  గట్టిగ మాట్లాడితే రంకు అంటరు.  కను చీకట్లో గొంతు లోతు నీళ్ళల్లోకి దిగింది నాగరత్నం. 
ముందున్న బతకమ్మని చేత్తో నెట్టి తన బతకమ్మని వదుల్దామని లక్ష్మమ్మ చేతిని ముందుకు చాపింది నీళ్లల్లో.  ఎవరిదో తల! దాన్నట్లనే పట్కోని, ”ఎవలో మునిగి సస్తాండ్రు రాండ్రుల్లో” గట్టింగ కేకలు పెట్టింది.  నిరుట గాళ్లు ఒక్కుదుటున నీళ్లల్ల దూకి ఇవతల్కి గుంజుకొచ్చిండ్రు.  నాగ రత్నం! మునిగిపోత స్పృహ కోల్పోయింది.
*      *     *
పంచాయితీ రోజు పెద్దమడుసు లందరి ముందు నాగరత్నం పిల్లల్ని పట్కోని కూసున్నదల్ల ఒక్కసారిగ లేచి నిలబడి, ”గీ పంచాయితీల ఎన్నోసార్లు మీరందరు కూకోని తీర్మానం చేసిండ్రు.  ఏవన్న ఎవరన్న భయ భక్తులు కలిగి వుంటే ఏం లాభం?  సంసారంలో అన్నీ అపసృతులే దొర్లుతుంటే?
”బావా మరుదుల పట్లా, వదీనా మరదళ్ళా పట్లా భయ౦ భాక్తీ గలిగీ వుంటే పాటించీనా దీపావళీ పండగ పదునాళ్ళుందనగా నాటికే తోలుక వస్తూ” కరణాల గొంతులు చెర్లో అలలు అలలుగా తేలివస్తున్నది.  ఏ పండ్గకూ సక్కంగ పంపలేదు.  ఎప్పుడు ఏడ్పులామ్పలేనాయె.  పాటలోని సొగసు జీవితాల్లో లేదాయె.
”పట్టంచ చీరాలిస్తూ, చీనీ చీనాంబ్రాలిస్తూ, కాటీకా కాయలిస్తూ, కల కంచ చీరాలిస్తూ, కోటీ సూర్యాకాంతులు మెరియూ ముత్యాల హారాలిస్తూ….”
పుట్టింట్ల గనీ అత్తింట్లగనీ సరైన గుడ్డ మొకం తెల్వది.  పట్టంచు చీర కెవ్వలేడ్చిండ్రు.  ముక్కు పుడుకకు గతిలదు, ముత్యాల హారాన్నడిగిందెవ్వరు?  ఇంట రాజులందర్ని అడిగి పుట్టిల్లు చేరితే, పిడికెడు మెతుకులు గిట్టు బాటైత లేదు.  ముత్తైదలు మైమరిచి మరీ పాడుతున్నరు.
”పల్లెత్తీ పలుకాబోకమ్మా, గజ్జెల్లా చప్పుడుతో నడువా బోకమ్మా”. పల్లెత్తు మాట మాట్లాడుకుంట వుండెటోరీకే అత్తగారింట్ల గదేం తప్పు జేసిందో మాట్లాడ్తలేరు అంటరు.  గట్టిగ మాట్లాడితే రంకు అంటరు.  కను చీకట్లో గొంతు లోతు నీళ్ళల్లోకి దిగింది నాగరత్నం. 
ముందున్న బతకమ్మని చేత్తో నెట్టి తన బతకమ్మని వదుల్దామని లక్ష్మమ్మ చేతిని ముందుకు చాపింది నీళ్లల్లో.  ఎవరిదో తల! దాన్నట్లనే పట్కోని, ”ఎవలో మునిగి సస్తాండ్రు రాండ్రుల్లో” గట్టింగ కేకలు పెట్టింది.  నిరుట గాళ్లు ఒక్కుదుటున నీళ్లల్ల దూకి ఇవతల్కి గుంజుకొచ్చిండ్రు.  నాగ రత్నం! మునిగిపోతూ స్పృహ కోల్పోయింది.
*  *   *
పంచాయితీ రోజు పెద్దమడుసు లందరి ముందు నాగరత్నం పిల్లల్ని పట్కోని కూసున్నదల్ల ఒక్కసారిగ లేచి నిలబడి, ”గీ పంచాయితీల ఎన్నోసార్లు మీరందరు కూకోని తీర్మానం చేసిండ్రు.  ఏవన్న ఎవరన్న పాటించిండ్రా? పైసలు పెడ్తున్నరు గని పనైత లేదు.  ఎప్పటిలాగే వుంటాంది.  నా మొగని జీతం నా కిప్పియ్య నంటున్రు.  మా అవ్వగారింటి కాంచి పదేల రూపాయల మేకలు తెమ్మంటున్రు.  ఈ రెండు జరుగవు.  మా అత్త నన్ను తెల్లారి లేచింది మొదలు తిట్టు మీద తిట్టు.  ఆ తిట్లు మొదలార ఎవని పక్కల్నో పక్కల పండ బెడ్తనే వుంటది.  కొన్నాల్లకు గదే నిజవమని చెప్తరు.  గీ చెరలు నేనెందుకు పడాలె.  నా పిల్లగాల్లని కూలి నాలి చేసుకోని ఆడ్నే వుండి సాక్కుంట. నా మొగడు అత్తా యింటరా సరే సరి.  లేకుంటే నా రెక్కల కట్టం నేను పడ్త” అన్నది. జనం గుసగుసలు పోయిండ్రు.  పోయేకాలం వచ్చిందన్నరు.  డ్వాక్రా గ్రపులోల్ల మద్దత్తుతోని ఎన్నాల్లు మాట్లాడ్తదోన్నరు.  ఎవ్వరి తీర్ప నాగరత్నం ఇనలేదు.  పొట్టకూరి పేర్చిన సద్దుల బతకమ్మ లెక్క పిల్లలతోని బయలెల్లింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

One Response to అమ్మా!బయలెల్లినాదో!

  1. siri says:

    చాలా బాగు0ది మాది ఆ0ధ్ర అర్ద0చెసుకొవద0 కష్ట0 అఈ0ది

Leave a Reply to siri Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.