ఒంగోలు స్టేషనుకు స్వాగతం – రమాసుందరి బత్తుల

రాత్రి పదకొండు గంటలకు ఖమ్మంలో పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాను. అప్పర్‌ బెర్త్‌. తిరుపతి కొండంత ఎత్తున కనబడింది. అది ఎక్కే సాహసం చేయలేక టి.సి. సీట్‌లో కూర్చొన్నాను. జీవితంలో ఎప్పుడూ నిద్ర మొహం చూడలేదన్నంతగా పెట్టెలో అందరూ దీర్ఘ నిద్రలో మునిగి ఉన్నారు. ఒక పాపతో వాళ్ళ అమ్మ తలుపు దగ్గరే నిలబడి ఉంది. ఆరు నెలల ఆ బుడతకు ట్రైన్‌ అంటే భయమట. మొహం వేలాడేసి లోపలికి వస్తే బేరమంటున్నది. నేను కాసేపు దాని నిద్ర కళ్ళను, ఏడ్చి జావగారిన బుగ్గలను చూస్తూ కూర్చొన్నాను. విజయవాడలో వేరే టి.సి ఎక్కాడు. నేను ఆయనకు ఆయన సీటు భధ్రంగా అప్పగించేసి ఇంకొకళ్ళ కాళ్ళ దగ్గర కూర్చొన్నాను. అప్పటికి ఒంటి గంట అయ్యింది. ఇంకో రెండు గంటలు ఆగితే ఒంగోలు వస్తుంది.

”ఏమ్మా మీ సీట్‌ ఎక్కడ?” టిసి అడిగాడు.

పైకి చూపించాను.

”మరి పడుకోండి”.

”నేను పైకి ఎక్కలేనండి. ఈ మధ్య కాలు దెబ్బతింది. ఒక వేళ కష్టపడి ఎక్కినా, పైన ఉంటే ఒంగోలు రావటం తెలియదు. ఆ చీకట్లో కిందకు దిగటం కూడా కష్టమే” చెప్పాను.

ఆయన తల గోక్కొని పెట్టె అంతా తిరిగాడు. ఎక్కడైనా సర్దుబాటు చేయవచ్చేమోనని.

పెదవి విరుస్తూ ”అందరూ నిద్ర పోతున్నారమ్మా” అంటూ వచ్చారు.

”ఫర్వాలేదు లెండి. నేను ఇక్కడే కూర్చొంటాను”.

ఆయనకు నిద్ర వస్తుంది. ”మీరు ఎలాగోలా ఎక్కండి. ఒంగోలు వచ్చే పావుగంట ముందు నేను మిమ్మల్ని లేపుతాను. మెల్లిగా దిగవచ్చు.” బతిమాడుతున్నట్లు చెప్పారు. ఆయనలా బతిమలాడటంలో ”మీరలా దెయ్యంలా కూర్చొని వుంటే నేను ఎలా పడుకోవాలి?” అని ధ్వనించింది.

మొత్తానికి టిసి, అటెండర్‌, పాప తల్లి పర్యవేక్షణలో నేను శిఖరం ఎక్కినట్లు బెర్త్‌ అధిరోహించాను. అయితే నిద్రపోతే వొట్టు. టైమ్‌ చూసు కొంటూనే ఉన్నాను. ఎంతకూ టిసి నుండి పిలుపు రాలేదు. దిగితే ”నేను లేపుతానని అన్నాను కదా” అంటాడేమోనని భయం. ధైర్యం చేసి మెల్లిగా క్రిందకు జారాను. బాగ్‌ తీసుకొని గేట్‌ దగ్గరకు వచ్చాను. చల్లని గాలి మొహానికి తగిలి హాయిగా అనిపించింది. టైమ్‌ చూస్తే మూడుంపావు. ”ఒంగోలు స్టేషనుకు స్వాగతం” అని ఎంత సేపటికి వినబడటం లేదు. అనుమానం వచ్చి బయటకు చూశాను. ఎదురుగా హైవే మీద కార్లు పోతున్నాయి. ఒంగోలు దాటి పోయిందని అర్థం అయ్యింది. కంగారుగా పర్స్‌ చూసుకొన్నాను. చిల్లరంతా లెక్కపెడితే యాభై రూపాయలే ఉన్నాయి. డెబిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ రిజర్వేషన్ల పొగరుతో నేను డబ్బులు ఉంచుకోవటం మానేశాను. ఈ ట్రైన్‌ ఎక్కడ ఆగుతుందో తెలియదు. అక్కడి నుండి ఇంత రాత్రి ఎలా రావాలి? మధ్యలో చెకింగ్‌ వస్తే ఎలా?

చివరకు రైలు కావలి లో ఆగింది. దిగుతూ టిసి సీట్‌ వంక చూశాను. గుండెల మీద చెయ్యిపెట్టుకొని హాయిగా నిద్ర పోతున్నాడు. ”ఈయన నేను ఒంగోల్లో దిగిపోయాను అనుకొంటే బాగుండు”. అనుకొంటూ కాలు సాగించాను. కావలి టికెట్టు కౌంటరు దగ్గరకు వెళ్ళి ”ఒంగోలుకు ఏదైనా ట్రైన్‌ ఉందా?” అని అడిగాను. ఆయనకు నాలాంటి వాళ్ళు అలవాటే అనుకొంటాను. ”నాలుగుంబావుకి పాసెంజర్‌” అని అరిచాడు. నా దగ్గర డబ్బులు అన్నీ ఆయన ముందు పోసి ”ఒంగోలు” అన్నాను. బిక్కు బిక్కుమంటూ. ఆయన దయతో నన్ను చూసి ఒక్క పదిహేను రూపాయలే తీసుకొని టికెట్‌ ఇచ్చాడు.

రైలు రాగానే ఒక గుంపుతో బాటు ఎక్కాను. వాళ్ళ దగ్గరే కూర్చొన్నాను. ఎందుకైనా మంచిదని. ”ఏడకుబోవాలా?” యానాదులు లాగున్నారు. బియ్యం మూటలు, పిల్లా పాపలతో ఎక్కడికో వెళుతున్నారు. ”ఒంగోలు” చెప్పాను. నన్ను ఆనుకొని వాళ్ళ అమ్మాయే. ఒక ఐదేళ్ళ పిల్ల కూర్చొని ఉంది. దాని మెత్తటి పొట్ట నాకు తగులుతున్నది. ఎర్రటి జుట్టు. బొందెల, చిన్న జాకెట్టు వేసుకొంది. ఆమె కళ్ళు నీలంగా, నిర్వికారంగా నన్ను గమనిస్తున్నాయి. ఆ చిన్న కళ్ళు అంత చిన్ని వయసులోకూడా ఏ భావాన్ని ప్రతిఫలించక పోవడం ఆశ్చర్యంగా అనిపించింది. అలా కళ్ళు చూస్తూనే ఉన్నాను… నా కళ్ళు మూతలు పడ్డాయి.

”మే! ఆయమ్మను లేపండే. ఒంగోలు వచ్చినాది.” ఏదో గొంతు అరుస్తూ వినబడుతున్నది. మెత్తటి పొట్ట ఏదో నా మీద పడి కుమ్ముతూ ఉంది. ఉలిక్కి పడి లేచాను. అవే కళ్ళు నన్ను సూటిగా చూస్తూ ఏదో చెబుతున్నాయి. ”ఒంగోలు స్టేషన్‌కు స్వాగతం.” బయట కేకలు. బాగ్‌ తీసుకొని ఒక్క ఉదుటున కిందకు దూకాను. నన్ను నిద్ర బుచ్చి, మళ్ళీ నిద్ర లేపిన ఆ నీలి కళ్ళు ఇప్పుడు కిటికీలో నుండి నవ్వుతున్నాయి.

Share
This entry was posted in moduga poolu. Bookmark the permalink.

2 Responses to ఒంగోలు స్టేషనుకు స్వాగతం – రమాసుందరి బత్తుల

  1. Damu ndm says:

    సుబద్ర గారు,

    చాలా బాగుంది. “నన్ను నిద్ర బుచ్చి, మళ్ళీ నిద్ర లేపిన ఆ నీలి కళ్ళు ఇప్పుడు కిటికీలో నుండి నవ్వుతున్నాయి” అన్న వాక్యం చాలా బాగుంది.

  2. S. Narayanaswamy says:

    బ్రిలియంట

Leave a Reply to Damu ndm Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.