మావోల్ల దగ్గర కూడ-మాకు అవమానమేనా?

పి.మేరీ మాదిగ

ఏప్రిల్‌ 5 వ తేదీన బాబుజగ్జీవన్‌రామ్‌గారి 101 జయంతి ఉత్సవాల సందర్భంగా మా దళిత పురుషులు కూడా దళిత మహిళలను అవమానించారు.
ఈ మధ్య డిఫ్యూటీ స్వీకర్‌గా అసెంబ్లీ లో కుతహలమ్మను దళిత  స్త్రీ కాబట్టే చంద్రబాబునాయుడు (టి.డి.పి ప్రతిపక్షనేత) అవమానించాడని గొంతు చించుకున్నారు మా దళిత అన్నలు.

 అసెంబ్లీలో కుతహలమ్మకు క్షమాపణ చెప్పమని గొడవ చేశారు. బయట మద్దతుగా ధర్నాలు కూడా చేశారు. దిష్టి బొమ్మలను తగలేశారు. క్షమాపణ చెప్పించుకున్నారు. సంతోషమే. కానీ దళిత జాతి మహానీయుడు జగ్జీవన్‌రామ్‌  విగ్రహం సాక్షిగా దళిత అన్నలు, దళిత స్త్రీలను అవమానించొచ్చా? ఏప్రిల్‌ 5 వ తేదీన 101 వ జగుజ్జీవన్‌రామ్‌ జయంతి ఉత్సవాల సందర్భంగా అక్కడి కొచ్చి మీతో పాటు వేదికనెక్కిన మేము (ప్రముఖు లైన) మీకు, ఆంధ్రరాష్ట్ర దళిత అన్నదమ్ము లకు, తోటి దళిత చెల్లెల్లు, అక్కలు మీ కండ్లకు కనిపించలేదా?
దళిత ఉద్యమంలో మీతోపాటు మునిగి లేస్తూ, పడి చస్తూ, ప్రతిదినం కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాడు తున్నాం. దళిత స్త్రీలను ఉద్యమకారులుగా, మేధావులుగా, కళాకారులుగా, రాజకీయ వేత్తలుగా ప్రముఖ స్థానంలో నిలబెట్టడంలో మీకు వస్తున్న ఇబ్బంది ఏమిటి? నిర్ణయాధికారంలో, ఆర్ధికాంశాలలో, మమ్మల్ని వెనుక పడేయడంలో, మీది రాజకీయం అనుకోవాల్నా లేదా అలసత్వం అనుకోవాల్నా? ఇంకా చెప్పాలంటే అవగాహనా లోపం అనుకోవాల్నా? ఎందుకంటే మనం కులవివక్ష గురించి అనేక యేండ్ల నుంచి పోరాటం చేస్తున్నప్పుడు, దళిత ఉద్యమాల్లో, కుటుంబాల్లో, రాజకీయాల్లో, ఉన్న అసమానత్వం తొలగించుకోవడం అవసరమా కాదా? మీరే చెప్పండి! కుల అసమానత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు జెండర్‌ అసమానత్వాన్ని కులంలో గుర్తించి పని చేయాల్సిన అవసరం లేదా? ఇంకా ఎన్ని రోజులు మమ్మల్ని భ్రమల్లో పెడతారు. మహానుభావులు డా. బి.ఆర్‌. అంబేద్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ అడుగు జాడల్లో నడుస్తామని దళిత ఉద్యమాలను ప్రారంభించినపుడు ఈ ప్రశ్నలు వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం లేదా? మీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాల్సిన బాధ్యత మీది కాదా! అలా కానప్పుడు కేవలం ఒక నాన్‌గవర్నమెంట్‌ ఆర్గనేజేషన్‌గా (ఎన్‌.జి.వో) స్వచ్ఛంద సంస్థలుగా మొదలై, విభజించబడి ఐక్యతను పోగొట్టుకొనే ప్రమాదం లేదా? ఉన్నత వర్గాల్లో ఉన్న స్త్రీలు, పురుషాధిక్యతకి వ్యతిరేకంగా హక్కుల పోరాటం చేసిండ్రు. పురుషులతో సమానంగా అవకాశాలను కూడా అందుకుంటున్నారు. వీరికి ఒకింత అణచివేత ఉంటే ప్రత్యేకంగా మా దళిత స్త్రీలం మూడింతల వివక్షతను నిత్యం అనుభవిస్తున్నాము. కుల, వర్గ పురుషాధిపత్యం అణచివేతకు  వ్యతిరేకంగా పోరాడటానికి దళిత స్త్రీలుగా ముందు కొచ్చాం.
దళిత స్త్రీలుగా మేము ఒక వైపు జెండర్‌ సమానత్వం కోసం మరోవైపు అగ్రవర్గాలకు వ్యతిరేకంగా, రాజ్యహింసకు వ్యతిరేకంగా, రాజ్యం యొక్క కులంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నం. ఇంకా మీతో కూడా సమానత్వం కోసం మేము ఉద్యమించాల్సి వస్తే దళిత జాతి సమాజం సిగ్గుపడాలి. మీరు దళిత స్త్రీలను ఉద్యమాల పేరు మీద ఒక్క తాటికి తీసుకొస్తామంటున్నారు నిజమే కానీ ముందుకు వచ్చిన దళిత మహిళలను నాయకత్వ హోదాలో అంగీకరించడానికి మీకు అడ్డువస్తున్నదేంది? మేము ఎందరితో కొట్లాడాలి.
ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమాల పోరాట చరిత్రలో మేము ఒక సంఖ్యలం మాత్రమేనా? లేదా ఆడ గుంపులమేరనా? కమ్యూనిష్టులుగా నక్సల్‌ భరీ సాయుధ పోరులో, సారా పోరాటాల్లో, కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, చీమకుర్తి, వేంపెట ఇంకా ఎన్నో పోరాటాల హోరులో మా రక్తం కూడా ఈ భూదేవిని తడపలేదా? దళిత మహాసభల్లో, మాల మహానాడుల్లో దండుగట్టి భుజం కలపలేదా? పోరు సలపలేదా? మీ నాయకత్వాన్ని నిలబెట్టడంలో,  రక్షించడంలో మేము నిస్వార్ధంగా చేసిన సేవలకు విలువలేదా? అంగీకరించడానికి మీ మనసు ఒప్పుకోవడంలేదా? ముఖ్యంగా వినండి. మీకు పడాల్సిన దెబ్బలు మేము తిన్నాం. మీ లీడర్‌షిప్‌  నిలబెట్టడం కోసం మేం జైళ్ళకెళ్ళాం. కోర్టులపాలయ్యాం. ఇంకా తిర్గలేక, కేస్‌లు కొట్టుకు పోక వాయిదాలకు హాజరు అవుతూ ఖర్చులపాలు అవుతూనే వున్నాం. ఆఖరికి మీరు కూడా మా శ్రమను దోపిడీ చేస్తారా? మీరు మరొక్కసారి అంబేద్కర్‌ని చదవండి? స్త్రీల పట్ల ఆయన దృక్పధాన్ని, అవగాహనను అర్ధం చేసుకోండి. హిందుకోడ్‌ బిల్‌ తీసుకురావడం వెనుక ఆయన అనుభవాన్ని పరిశీలించండి. దానికి స్కూర్తి ఆయన భార్య రమాదేవే అని మా భావన. ఎందుకైనా మంచింది జ్యోతిభాఫూలే, సావిత్రిబాయిల జీవిత చరిత్రలు కూడా తిరిగి చదవండి. భార్యలను ప్రోత్సహించడంలో, అర్ధం చేసుకోవడంలో ఆ మహానుభావులు ముందుకొచ్చిన తీరు తెలుసుకుంటే గానీ మీకు మేము అర్ధం కాము. డా. అంబేద్కర్‌ భార్య రమాదేవి ఆయనను చదివించడం కోసం పడ్డ శ్రమ, చేసిన త్యాగం మీకు తెలుసా? ఆమె గానీ పిడకలు అమ్ముకొని కుటుంబాన్ని నడిపించకపోతే, కుటుంబ బాధ్యత తీసుకోకపోతే అంబేద్కర్‌గారి జ్ఞానసముపార్జన, చదువు కొనసాగేనా? ఆగమయ్యేది కాదా? 14 యేండ్లకే కుటుంబ బాధ్యతలు మోసి ఉంటే రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర ఉండేదా? రాజ్యాంగం రచించే అవకాశం కోల్పోయేవాడు కాదా? ఆయన చేస్తున్న పని ఆగిపోకుండా ఉండేందుకు రమాదేవి చేసిన త్యాగం మీకు అర్ధమవుతుందా? కన్నబిడ్డలు ఆకలికి తట్టుకోలేక పిట్టల్లాగా రాలిపోతుంటే చచ్చినొల్లను బొంద పెట్టుకుంటూ పోయింది ఆ తల్లి. మందులకు డబ్బులు లేక తన కడుపుకు గుక్కెడు బువ్వ లేక ఎండిపోతూ, నలిగిపోయి దు:ఖాన్ని కడుపులో ఆపుకోని, ఆయనను ముందుకు నడిపించింది. ఆమె తన స్వార్ధం చూసుకొని ఉంటే  ఎల్‌కెజిలోనే ఆయన గారి విద్య ఆగిపోయి ఉండేది కాదా? ఆయనగారు డా. అంబేద్కర్‌గా భరత జాతి చరిత్రకారుడుగా, మన రాజ్యాంగాన్ని రాసే అవకాశాన్ని కోల్పోయేవాడు. ఆ మహానాయకునిపై ఆధారపడ్డ, స్త్రీలు, దళితులు, భారతీయ ప్రజలు ఆయనను కోల్పోయేవారు. అవును ఆమెది త్యాగం. ఎందుకంటే మన దేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పురుషుడు సంపాదించాలి. పోషణ బాధ్యత వహించాలి. స్త్రీ పిల్లలను, భర్తను చూసుకోవాలి. కాని ఇక్కడ రమాదేవి అంబేద్కర్‌, ఈ పీడిత వర్గాల పిల్లల ప్రాణాలను రక్షించడానికి తన పిల్లలను చంపుకోని తన భర్తని చదివించింది. ఆయన చదివి ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్న దరిద్రులను అన్నింటిలో ధనవంతులను గుణవంతులను బలవంతులను చెయ్యడానికితను ఒక్కడు ఒక సైన్యమై మనకు అన్ని హక్కులు కల్పించాడు తన నలుగురు  పిల్లలు కరువులో ఆకలికి చనిపోతే తండ్రి విదేశాల్లో చదువుతుంటే, రమాదేవి పిడకలు అమ్ముకున్న తన డబ్బులతో పిల్లల చదువులు, తిండి, వైద్యం మాత్రమే చూసుకొని అంబేద్కర్‌ చదువు ఖర్చులను విదేశ ప్రయణాలను, భరించకుండా తన కోసం ఉంచుకుంటే అంబేద్కర్‌ ఇన్ని చీకటి బ్రతుకులకు వెలుగునిచ్చేవాడా! దళిత లీడర్లు కాస్త ఆలోచిస్తారా?
ఇప్పుడు మీరు లీడర్లుగా ఎదగడానికి అన్నల్లారా! మీ తల్లి, చెల్లీ, అక్కా, భార్యా,బిడ్డలు ఎంతగానో సహకరించబట్టే మీరు బయట లీడర్లుగా చెలామణి అవుతున్నారు కదా! అది మీరు మరిచారా? ఇతర ఆడోల్లు రమాదేవినీ బారిష్టరు భార్యా పిడికలేరి, కట్టెలు కొట్టుకొని బ్రతకమా అని ఏలన జేసిండ్రు. అయినా తన భర్తకున్న గొప్ప పేరును జూసి ఆమె మురిసింది.  ఆమెను అవమానపర్చిన భరించింది. తన పిల్లలు చూస్తే పీనుగ మీద కప్పనీకి కొత్త గుడ్డ లేక తన చీరను చింపి కప్పి బిడ్డలను మట్టిలో  పూడ్చుకుంది. అయినా సరే భర్తను ఉద్యోగం చేసి తమను పోషించమని వేధించలేదు. ఆయన పని ముఖ్యమైనదని గ్రహించింది. ఆయన విజయానికి తాను ఒక నీడయ్యింది.
 అందుకే దళిత స్త్రీలుగా మా పోరాటం చాలా సుదీర్ఘమైనదని మాకు తెలుసు. ఇందులో మీ భాగస్వామ్యమేంటో ఇంకనైనా తెల్చుకోవాలేమో ఆలోచించండి. ఎందకంటే మాల, మాదిగ, ఏ జాబితాల్లో ఉన్నా, మీ క్రింది ఉపకులాలపై ఆధిపత్యం చేస్తూ మీ స్త్రీలపై కూడా మీరు పెత్తనం చేస్తుంటే పై కులాలను ప్రశ్నించే హక్కు మీకెక్కడిది?
దళిత నాయకులుగా దళిత స్త్రీల సమానత్వాన్ని గుర్తించడానికి మీరే వెనుకబడి ఉన్నప్పుడు అగ్రవర్ణ ఆధిపత్యం, కుల వ్యవస్థను, ప్రశ్నించే అర్హత అధికారం, మీకుందా?
మాల మాదిగ దళిత పోరాటాల్లో మరియు రాజ్యాంగంలో పొందుపర్చిన 59 ఉమ్మడి కులాలకై సమానంగా రిజర్వేషన్లను ఇవ్వమని సామాజిక న్యాయం జరగాలని మీరు చేస్తున్న పోరాటంలో మీకు నిజాయితీ ఉందని మేం ఎట్లా అంగీకరించాలి.
60 యేండ్ల ఈ దళిత రాజకీయల్లో స్వతంత్ర భారతదేశ రాజ్యాంగంలో అంబేద్కర్‌గారు అందించిన రిజర్వేషన్లను ముందునుండీ అనుభవించినవారే ఇంకా అన్ని రంగాల్లో ఇప్పటికీ అనుభవిస్తున్నారు. విద్యా, ఉద్యోగ, ఆర్ధిక, రాజకీయ అవకాశాలు ఇంకా అందని మాల మాదిగ పేదలు 90% ఉన్నారు. పేదవారుగా, శ్రామికులుగా, కూలీలుగా పనులు దొరకక, ఉన్న ఊరు ఇడ్చి పెద్ద పెద్ద పట్నాలకు వలసకుబోయి కాయాకష్టం చేసుకోని బత్కుతున్నారు. పట్నంల పని దొరకక చదువులేక రాజకీయల పేరు మీద మతాల పేరు మీద వారు తప్పుతోవ పడ్తున్నారు. వాళ్లను అగ్రవర్ణాలు, మత ఛాందసులు, సినిమాలవాళ్లు వాడుకుంటున్నారు. వీళ్లంతా మన దళిత బడుగు వర్గాలకు చెందినోల్లే. ఎక్కడ పాలుబోక తాగుడుకు బానిసలవుతున్నారు. బిచ్చగాలుగా  మారుతున్నారు. స్త్రీలు కాయాకష్టం చేసుకున్నా కూలి చాలక. కూలి దొరికినా లైంగిక హింసకు అవమానాలకు గురవుతున్నారు. శారీరక దోపిడీకి బలైపోతున్నారు.
ఒకప్పుడు గడీలల్ల భూస్వాముల, దొరలకు ఎట్టిచేసిన మన మాల, మాదిగ ఆడోళ్ళు ఇప్పుడు పట్నంలో ఇండ్లల్లో పాచిపని చేసుకుంటు, ప్లాస్టిక్‌ కవర్లల్లో బువ్వ కూరలు తెచ్చుకోని తింటుండ్రు. పట్నంల మొగడు కూలి చేసినా, పని దొరికినా మొగడి  తాగుడు అలవాటుకు డబ్బులు తగులబెట్టితే ఆడామే పాచి పని, కూలీ పని చేసి తెచ్చిన డబ్బుతోనే ఇల్లుగడుస్తది. గుడిసెల్ల తానం చెయ్యడానికి మలముత్రాలకు స్థలం లేక కష్టాలు పడుకుంటూ స్త్రీలుగా ఆత్మగౌరవ పోరాటం చేస్తుంటే మీరు మమ్మల్ని ఎనకబడేస్తే మేము ఏం జెయ్యలే? ఎవ్వరికి చెప్పుకోవాలె?
మురికి కాల్వల పక్కన గుడిసెలేసుకోని మురికివాడల్లో ఇరుకు గల్లీల్లో, బుడ్డ బుడ్డ, అర్రలల్లో, వందల రూపాయలు ఇంటి కిరాయిలు చెల్లిస్తున్నారు. పొట్టకు, గుడ్డకు అందని బ్రతుకులు,పల్లె నుంచి పట్నం వచ్చిన దళిత స్త్రీల జీవితం గడీల బ్రతుకులు, గంపల సద్ది బువ్వ మారినా ప్లాస్టిక్‌ కవర్లల్లో ప్లాస్టిక్‌ బుట్టల్లో బువ్వ ఆడుక్కోని తినే బ్రతుకుగా మారిన దుస్థితి మన దళిత బహుజన స్త్రీలది. బంగ్లాలో పాతచీరలడుక్కోని, కన్న పిల్లలకు ఇంకా కడుపునిండా తిండిపెట్టలేక, చదువులేక ఆరోగ్యం కరువై తన బిడ్డలకు భవిష్యత్తు కానరాక ఆశలను బుగ్గిపాలు చేసుకుంటది. జానేడు పొట్ట కోసం తమ ఆడపిల్లలను ఇండ్లల్ల పనికి పంపుతు బడి మాన్పించి బాలకార్మికులుగా మారుతున్న తన పిల్లలను చూసే దిక్కేది అని ఏడుస్తది. బాల బాలికలను బాల కార్మికులుగా, ఆడెపాడె పసి వయస్సును కూడా అనుభవించని, ఎందరో దళిత బహుజన ఆడబిడ్డలవి కన్నీటి బతుకులు. అయితే దళితుల్లో కూడా కొంత అభివృద్ధి చెందిన ఆస్తులు కూడ పెట్టి అధికారులుగా మారిన కుటుంబాలు తోటి దళితులకోసం, వారి సమాన  అవకాశాల కోసం కృషి చేస్తున్నారా అనేది ఆలోచించాలి. అభివృద్ధి చెందిన దళితులు ఇంకా అభివృద్ధి చెందుతున్నాడు. అభివృద్ధికి ఆమడ దూరంగా ఉండే వాడు ఉంటూనే ఉన్నాడు.
దళిత కుటుంబాల్లో ఐఎఎస్‌ కొడుకు ఐఎఎస్‌ అవుతుండు. ఒక్క ఇంట్లోనే 5,6 మంది ఆఫీసర్లు అవుతుండ్రు. వీళ్లు పట్టించుకోకపోతే పేద దళిత స్త్రీలకు న్యాయం చేసేవారు ఎవరు? వీరి జీవితాల మార్పుకై దళిత లీడర్స్‌పోరాడే అవసరం లేదా? వీల్ల బతుకులు ఇలా కావడానికి బాధ్యులెవరు? చెప్పులు కుట్టేవాడు, కూలీ చేసేవాడు, బొంద దొవ్వేవాడు, పాయకాన ఎత్తేటోల్లు సంచార జీవనం చేస్తూ, ఆటపాటకు దూరమై, ఏసే ఏసంకు విలువ లేక గ్రామాల ప్రజలు హరికథలు, జానపదాలు,జాంభవ కథలకు బ్రహ్నంగారి చరిత్ర లాంటి బుర్రకథ, బైండోల్ల ఎల్లమ్మ కథ, డక్కలి జాంభవ పురాణానికి, దూరమై హైటెక్‌ పద్ధతికి అలవాటుపడ్డి పోతున్నారు. దళిత బహుజనయువతకు సినిమాల మోజు ఎక్కువై సినిమా టాకీస్‌ దగ్గర బ్లాక్‌ టికెట్లు అమ్ముకునే బ్రతుకు మిగిలింది.
గ్రామాల్లో డేరా లేసి, షాంద్రిలేసీ, ఆటలాడే జీవితాలు, గ్రామాల్లో ఆడే ఆటకు విలువ లేక హోటల్లో బంధికానా, బ్రతుకులకు ఎవరు బాధ్యులు? నీచమైన బానిస శ్రమ చేస్తుంది ఎక్కువగా దళిత వర్గాలైనప్పుడు వీటి మార్పుకై ఆలోచించేదెప్పుడు? దళిత స్త్రీలను, దళిత పిల్లలను, గిరిజన తండాల్లోంచి ఆడోల్లను పట్టుకొచ్చి, అమ్మడం, కొనడం ఎందుకు మన వర్గాల్లోనే జరుగుతుంది? వీటికి ఫుల్‌స్టాప్‌ లేదా? వీటన్నింటికి, మీ సవధానం మాక్కావాలి? ఎస్సీ/ ఎస్టీ రిజర్వేషన్స్‌ అనుభవించే జాతులకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక వైపు పట్టణాల్లో ఇలా జరుగుతుంటే ఇంకొక వైపు ఎన్‌కౌంటర్ల పేర్లతో రాజ్యహింసకు, గ్రామభూస్వాముల ఆగడాలకు, దళిత ఆదివాసీ పీడిత వర్గాలూ బలైపోతున్నారు. మీకు మీరుగ మాల మాదిగల సమస్యను సృష్టించుకొని మీరు పోరాడితే మేము మీతో పోరాడితిమి. మనసమాజం ఏమన్నగానీ రాజ్యాధికారం ఏమన్నగానీ. దోసుకున్నోడు దోసుకునేవట్టే. కులాల పేరుతో బత్కుతుండ్రు కుల వివక్ష నిర్మూలన సంగతి దేవుడికే ఎరుక ఉన్నత వర్గాలతో కలిసి చేసిన పోరాటంలో మాకు అన్యాయం జరిగింది. మీరు కూడ అన్యాయం చేస్తారా?
దళిత జాతి పోరాటాల్లో మొదటగా మొగొల్లు జెడ్డరు. ఆడోల్లు గడ జెడ్డరు. మరి మొగోల్లె నాయకులా పోరాడే కాడ మేము పనికొచ్చి దళిత ఆడోల్లు పనికొచ్చి పదవులకాడ ఫలితాల కాడ పనికిరారా? కరపత్రాలల్లో, పోస్టర్లల్లో, వేదికలపైన, పుస్తకాలల్లో మా పేర్లు వెయ్యకుండా, మమ్మల్ని గుర్తించకుంటే దళిత బహుజన ఉద్యమ చరిత్ర భవిష్యత్తు మిమ్మల్ని ప్రశ్నించదా? మమ్మల్ని ఉద్యమంలో పావులుగా వాడుకోని మీరు మీ ఉద్యమాలు ఎదిగే వరకు దళిత స్త్రీలుగా మమ్మల్ని ఉపయెగించుకోని, మా శ్రమను అన్ని స్థాయిల్లో వాడుకొని ఇప్పుడు ఉద్యమానికి వున్న గుర్తింపులో మా భాగం లేదా? వాటి ద్వారా అందే ప్రతి ఫలాలను మీరే అనుభవిస్తారా? ఆర్ధిక నిర్ణయధికారాలలో మా శారీరక శ్రమని భూస్వాములు, పెతందార్లు పొలాలల్లో, గడీలలో, వాడుకున్నట్టే దళిత ఉద్యమాలల్లో మీరు వాడుకుంటారా? నాయకులుగా మా శ్రమను మా త్యాగాలను దళిత స్త్రీ నాయకురాళ్లుగా నిర్ణయధికారాన్ని ఆర్ధిక సమానత్వాన్ని మీతో అనుభవించే హక్కు మాకు లేదా?
( దళిత స్త్రీలపై వివక్షా వ్యతిరేక ఐక్య సంఘటన, ఎ.పి)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

3 Responses to మావోల్ల దగ్గర కూడ-మాకు అవమానమేనా?

  1. sanjayg says:

    వద్దు.. అక్షర దొషాలు రావద్దు.

  2. సంజయి గారు “అక్షర దొషాలు రావద్దు” అనుట్ల మీ ఉద్దేశం “స్త్రీలు,అందుల దళిత స్త్రీలు సమాన హక్కులు అడగొద్దు?” అంటె అది మీ Male Chauvinismకు పరాకాష్ట

  3. స్త్రీలకు సమాన హక్కులేదనెవరన్నారు? హక్కులు దళితులు పోరాడి తీసుకున్నట్లే, దళిత నాయకులనుంచీ మహిళలు పోరాడి తీసుకోవాలి. ఈ పోరాటం తప్పదు. ఎవరూ హక్కుల్ని పంచరు…అవి పోరాటంతో సాధించాల్సినవే!

Leave a Reply to JayaPrakash Telangana Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.