ఆడది కోరుకునే వరం

శారద
 అవును! నేను తపస్సు చేయాలని అనుకుంటున్నాను.  దైవదర్శనం కోసం.
 దైవమంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనో కాక ఆ జగన్మాత దుర్గాదేవినే ధ్యానిస్తాను.
 
గుళ్ళో గోపురాల్లో వున్న దేవుడితో మొరపెట్టుకుని లాభం లేదు.

 లక్షల, కోట్ల మొరల్లో ఆయనకి మా మొర వినిపిస్తుందన్న ఆశ ఏ మాత్రం లేదు.  సాక్షాత్తూ ఆ దేవి పాదాల మీద పడి అడిగితే కాదనదేమో.  ఎంతైనా ఆమే నాలాటి ఆడదే కదా!  నన్నూ నా కోరికనూ తప్పక అర్థం చేసుకుంటుంది.  ఇంతకూ నేను తపస్సు చేసేది జన్మరాహిత్యానికో, మోక్షానికో కాదు.  వాటితో నేనేం చేసుకుంటాను, ఈ జన్మే నరకప్రాయమైపోయింది నాకిప్పుడు.  నాకు ఒకే ఒక్క వరం కావాలి.  అది ఇవ్వటం ఆ ఆదిశక్తి వల్లే అవును.  అందుకే ఈ తపస్సు.
నా పేరు…., పేరేదయితే ఏముంది లెండి.  సీత, సావిత్రి, లక్ష్మి, రజియ, మేరీ, ఏ పేరైనా ఒక్కటే.  ఆడదాన్ని, ఆ వివరం చాలు, నా బాధ అర్ధం చేసుకోవటానికి.
చిన్నప్పుడు నేను రేడియోలో ”ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం, చక్కని సంతానం” అనే పాట విని చిరాకుపడేదాన్ని.  ఆడవాళ్ళకేం కావాలో వీళ్ళకేం తెలుసు?  అయినా అందరు ఆడవాళ్ళకూ ఇదే కావాలని ఎవరో కవి చెప్పటం ఎంత అన్యాయం అనిపించేది.  కానీ ఇప్పుడు నాకు తెలుసు, అందరు ఆడవాళ్ళకీ ఒకే ఒక్క వరం కావాలి.  ఈ వరంతో నేనే కాదు, అందరు ఆడవాళ్ళూ తెరిపిన పడతారు.
అందుకే ఇల్లూ వాకిలీ భర్తా సంసారమూ అన్నీ వదిలి ఈ ఘోరారణ్యంలో తపస్సు మొదలుపెట్టాను.  ఒళ్ళు పొగరెక్కి భర్తనీ పిల్లల్నీ వదిలేసి వచ్చాననీ నా చుట్టుపక్కల వాళ్ళంతా అనుకుంటూ వుండి వుంటారు.  అలా అనుకునేవాళ్ళలో ఆడవాళ్ళే ఎక్కువ అని కూడా నాకు తెలుసు.  వాళ్ళ బాగు కోసమే నేనీ ప్రయత్నం చేస్తున్నానని వాళ్ళకే తెలియదు పాపం.  మగవాడు ఇల్లూ వాకిలి, పెళ్ళాం పిల్లల్నీ వదిలేసి తోటిమనిషి బాగుకోసం పాటుపడితే అది సంఘసేవ అవుతుంది.  అదే పని ఆడది చేస్తే ఒళ్ళు కొవ్వెక్కటం అవుతుంది.
నాకీ ఆలోచన ఆరునెలల కింద వచ్చింది.  అంతకు ముందు నేన అందరు ఆడవాళ్ళలాగా ఎప్పుడూ నా భర్తా, నా పిల్లలూ, నా ఇల్లూ అని అదే రంధిలో పడి కొట్టుకుంటూ వుండేదాన్ని.  అలాటిది నా కళ్ళముందు నేను ఆపలేని అన్యాయం జరిగింతరువాత కానీ అసలు మేమేమిటో, మా పరిస్థితేమిటో, మావెంత నీచపు బ్రతుకులో నాకు అర్థం కాలేదు.  అర్థమయింతరువాత ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండబుద్ధవలేదు.  వెళ్ళి వచ్చేసాను.
ఇంకా నాకు ఫర్జానా భయంతో వేసిన కేకలు చెవుల్లో మోగుతున్నట్టే వుంటుంది.  ఒకటా, రెండా, పదేళ్ళ స్నేహం మాది.  పక్క పక్క ఇళ్ళల్లోనే వుండటంతో బాగా స్నేహం కలిసింది.  చాలా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తున్న ఆమె అంటే నాకు చాలా ఇష్టంగా వుండేది.  హిందువుల ముస్లిముల కలిసి యేళ్ళ తరబడి బ్రతికిన వూళ్ళో ఇలా జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా?  అక్కడికీ కిందటి రోజు అననే అంది ఫర్జానా, ”ఎప్పుడూ లేనిది నాకీ కాలనీ అంటే భయం వేస్తుంది”, అని.  ”చాల్లే! ఇక్కడే పదేళ్ళబట్టీ వుంటున్నారు.  ఇక్కడ అందరికీ నువ్వు బాగా తెలుసు.  నిన్నిక్కడెవ్వరు ఏం చేస్తారు,” అన్నాను.  ఆ మాట అనకుండా వుంటే ఆమె ఇల్లు మారిపోయి వుండేదేమో పాపం.
ఆ రోజు రాత్రి గడగడా వణుకుతూ తలుపు తట్టింది ఫర్జానా.  తలుపు తీసి చటుక్కున ఆమెని లోపలికి లాగి తలుపేసాను.  ఊరంతా ఉద్రిక్తంగా వుంది.  ఎవరు ఎవరిని ఎందుకు పొడుచు కుంటున్నారో, తగలబెట్టుకుంటున్నారో అర్థం కాని పరిస్థితి.  దబదబా తలుపు చప్పుడు.  తలుపు తీయాల్సిన పనిలేకుండా తలుపు విరగగొట్టి లోపలికొచ్చారు కొందరు.  అందులో చాలామంది నాకు తెలిసినవాళ్ళే, చాలా మర్యాదస్తులు.  బయట నేను కనబడితే ”నమస్తే మేడం” అంటూ పలకరిస్తారు.  అలాంటి వాళ్ళిప్పుడు ఫర్జానా కోసం… ఏమయింది వీళ్ళందరికీ?
వాళ్ళతో వాదించి బ్రతిమిలాడీ లాభం లేదని తెలిసినా కాళ్ళా వేళ్ళా పడ్డాను.  మా ఆయన కూడా, ”మీకిది మర్యాద కాదు, ఇలాటి దెబ్బలాటలు మంచివి కాదు”, అన్నారు.  మరి మేం ఇంకా బలంగా చెప్పాల్సిందేమో.  చెప్పితే వినేవాళ్ళా? ఏమో!” పక్క కాలనీలో మన వాళ్ళమ్మాయిని వీళ్ళ మగవాళ్ళు మానభంగం చేసి చంపేసారు.  మనం వీళ్ళని వదలొద్దు.”  ఇంతకు మించి వాళ్ళ మెదళ్ళలో ఇంకే ఆలోచనా లేదు.  నన్ను తోసేసి ఆమెపైన పడి ఎత్తుకెళ్ళిపోయారు.  ఆ తరువాత ఫర్జానా ఏమైందో ఎక్కడుందో తెలియనే లేదు.  వాళ్ళు ఆమెని కుక్కలు విస్తరి చింపినట్టు చింపేకంటే ముందుగానే ఆమె ప్రాణాలు పోవాలని ఆ రాత్రి దేవుణ్ణి నేను ప్రార్థించినట్టు నా జీవితంలో ఎప్పుడూ ప్రార్థించలేదు.  బహుశా ప్రాణస్నేహితురాలు చచ్చిపోతే బాగుండునని కోరుకోవటం భగవంతుడెప్పుడూ విని వుండడు.  ఆయనకేం తెలుసు మా సమస్యలు.
చచ్చిపోయిందని ఆశ పీకుతున్నా తన కోసం ఎంతెంతో వెతికాను.  ఎక్కడా కనపడలేదు.  పరిస్థితులు తారుమారై వుండి వుంటే ఫర్జానా నాలాగే బాధపడివుండేదా?  తన ప్రాణాలడ్డుపెట్టైనా నన్ను రక్షించి వుండేదేమో.  నేను ఇంకా ధైర్యంగా నిలబడాల్సిందేమో.  నేనేం చేసి వుండాల్సిందో నాకు ఇంకా తెలియటం లేదు.  ఆలోచనలూ, బాధా నా మెదడుని తినేస్తున్న భావన.  డాక్టర్నడిగితే అది ”సర్వైవర్స్‌ గిల్ట్‌” అన్నాడు.  ఇద్దరు స్నేహితుల్లో ఒకళ్ళు దురదృష్టవశాత్తూ చచ్చిపోతే,  ఆపద తప్పించుకున్న వ్యక్తికి వుండే అపరాధ భావన, అంతే అన్నాడు.
అంతేనా? మరి నాకు కోపంగా కచ్చగా వుందెందుకు?  వాళ్ళ మీద కేసువేసి సాక్ష్యానికి నేను వెళ్దామని కూడా అనుకున్నాను.  కానీ నన్ను మా ఇంట్లో అందరూ ఆపేసారు.  ”పిల్లల మొహం చూసైనా ఇలాటి గొడవల్లో తలదూర్చకు” అన్నది మా అమ్మ.  నేన ఒక ఆడదాన్నేనా? అసలు మనిషినా? లేక తల్లినా?
మనిషినీ, మగవాణ్ణీ, ఆ మగవాడు తయరుచేసిన న్యాయవ్యవస్థనీ, అతడి కనుసన్నలో మెలిగే సంఘాన్నీ ఎవరినీ అడిగి లాభం లేదు, ఆఖరికి ఆ దేవుణ్ణి కూడా.  ఆయనా మగవాడే కదా?  అందుకే ఆ ఆదిశక్తినే అడుగుతాను.  ఆడవాళ్ళందరికీ కలిపి ఒక వరం ఇమ్మని.
రావణాసురుడికి బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపమే మాకు వరం.  రావణాసురుడికి ఆ శాపం లేకపోతే, పాపం సీతమ్మ వారి గతి ఏమయ్యేది?  సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భార్యా, ఆదిలక్ష్మి అవతారం అయిన ఆమెకే ఆ శాపం వల్ల మాత్రమే రక్షణ వున్నప్పుడు, మామూలు ఆడవాళ్ళం, మా లెఖ్కెంత?
ఎంతసేపూ, ”పరాయివాడి పెళ్ళాం మీద ఆశపడేవాడు రావణాసురుడిలా చావక తప్పదు”, అంటారు.  అంటే ఎవరి పెళ్ళాలూ కాని ఆడవాళ్ళమీద మగవాళ్ళందరూ ఆశపడొచ్చా?  ఏ ఆడదైనా, ఆఖరికి కట్టుకున్న భార్యైనా సరే, ఆమెకి ఇష్టం లేనప్పుడు మగవాడు ఆమె మీద ఆశపడటం ఆమెమీద దౌర్జన్యమే అవుతుంది.  ఈ దౌర్జన్యాన్ని ఆపాలంటే చట్టాలూ, సాంఘిక నియమాలూ చాలవు.  దైవం వల్లే కావాలి.  మగవాళ్ళందరికీ, తనని ఇష్టపడని ఆడదాని మీద బలవంతంగా చెయ్యేస్తే తల అక్కడికక్కడే బద్దలైపోవాలి.  ఇదే నాక్కావాల్సిన వరం.  మా రక్షణ కోసం, మా ఆత్మగౌరవాల కోసం మాకీ వరం ఇవ్వక తప్పదు.
ఆడవాళ్ళం మేమెప్పుడూ యుద్ధాల్లోకి దిగం.  మతకల్లోలాలు మొదలుపెట్టం.  కానీ ఏ రెండు జాతుల మధ్య సంఘర్షణైనా, మగవాళ్ళు శతృవర్గానికి చెందిన ఆడవాళ్ళనెందుకు మానభంగం చేస్తారో మాకు తెలియదు.  వాళ్ళు వాళ్ళు దెబ్బలాడుకుని తలలు నరుక్కోనివ్వండి.  అది వాళ్ళిష్టం, వాళ్ళ ఖర్మ.  మేం మొదలుపెట్టని ఘర్షణల్లో మమ్మల్నెందుకు బలిపశువులను చేస్తున్నారో ఎంత ఆలోచించినా అర్థం కాదు.
ఏ రెండు వర్గాల మధ్య కొట్లాట పుట్టినా అది ఆడదాని కొంప మీదికే తెస్తారు.  కౌరవ పాండవుల దగ్గర్నించీ ఇదే వరస.  ప్రపంచయుద్ధాలైనా, వీధికొట్లాటలైనా, నక్సలైట్ల-పోలీసుల గొడవలైనా, మగవాడు తన శత్రువనుకున్న మగవాణ్ణి చంపుతాడు, శత్రువర్గానికి చెందిన ఆడదాన్ని మానభంగం చేస్తాడు.  ఇదేమని అడగటానికి ఏ సంస్థల, సంఘాలూ ముందుకు రావు.
యుద్ధాలు కల్లోలాల లేని సమయాల్లో మాత్రం మమ్మల్ని వదలుతారా?  ఏ వయసు కానీ, ఎవరు కానీ, ఆడదై ఒంటరిగా చిక్కితే చాలు, మగవాడి కామాగ్నికి మాడి మసైపోవలిసిందే కదా?  మేం కనిపెంచిన మగవాడి చేతిలో మాకీ అవమానం, అమర్యాద, హింసా ఎందుకు? అడుగుతాను ఆ ఆదిశక్తినే! ఈ న్యాయన్ని ఎవరు సృష్టించారో, అసలిదేం న్యాయమో ఆమెనే అడుగుతాను.
 నాకు న్యాయం చెప్పేదాకా వదలను.  వరమిచ్చే దాకా కదలను, ఆమెని కదలనివ్వను. అంతే!

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

3 Responses to ఆడది కోరుకునే వరం

  1. “ఎంతైనా ఆమే నాలాంటి ఆడదే కదా !”
    ఎంతమాత్రం కాదు. ఈ విషయం తెలుసుకోవాలంటే మీరు జగన్మాతని ఆరాధించి తీరాలి.

  2. sumitra says:

    ప్రతి స్త్రీలోనూ జగన్మాత ఉంటుంది. సందర్భం వస్తే గానీ విశ్వరూపంతో బయట పడదు.కానీ అందుకు ఆ స్త్రీ కూడా జగన్మాత తనలో ఉందని గుర్తించాలి.

  3. “ఆడదానికి ప్రాణం కంటే మానం ముఖ్యమనే” భావజాలాన్ని విజయవంతంగా రీన్ఫోర్స చేసారు.

Leave a Reply to sumitra Cancel reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.