బలికి ఎరకాని బ్రతుకు – తమ్మెర రాధిక

రోయిని కార్తె ఎండ మొకం పగులగొడ్తున్నది.

ఎర్రమట్టి బాట మీద వడగాలికి సన్నంగ దుబ్బ లేస్తున్నది. అప్పుడప్పుడు వచ్చిపోతున్న బస్సుల వేగానికీ, లారీల దూకులాటలకూ, బాటమీద నడిచి పోతున్న వాళ్ళు హడలిపోతున్నరు. ఎండ సుత అట్లనే బెదిరిస్తుంటే నడువటానికి సాహసం చెయ్యలేకపోతున్నరు.

ఎర్రమ్మకు తప్పుత లేదు నడుక!

నెత్తి మీద పెట్టుకున్న గుడ్డ మూట చెడ బరువనిపిస్తున్నది. అందులోని వస్తువులేవో నెత్తికి ఒత్తుకుంటున్నయి. ఎర్రమ్మ తెల్లని నెత్తి చిర్ర చిర్రంగ వున్నది. ఒంగిపోయిన నడుం సుట్టు బలం కోసమన్నట్టు కొంగు బిగించి బొడ్లోకి దోపింది. తెల్ల రయిక సెవటతోని అట్టలు కట్టింది. కాల్లు సుర్రున అంటుకుంటాంటే చుట్టూ చూసి బాటెంబడున్న చింత కిందికి ఉరుకులు బెట్టింది.

గుడ్డ మూట కిందికి దింపి మూటిప్పి నీల్ల సీస తీసి తాగి నిమ్మలపడ్డది. ”పైసలకు కమాయించే సోకు మా బాగున్నది కోడల్దానికి… మొగులు మీంచి ఊశిపడ్డ దేవత లెక్క బూకరేసం ఏస్తున్నది దీన్నెత్కపోను”

ఆయాసం దీరినంక మొట్ట మొదలు నోరిప్పింది ఎర్రమ్మ.

”ఎన్ని దినాలయ్యే ముసలోన్ని సూడక! ఏం తింటాండో ఎట్ల పంటాండో… అసల్కు వాని కేమన్న కట్టె కాలేసి పెడ్తాందో! అదే తెల్లంగ తెల్లార్దాంక లెవ్వుదాయే! ఓ… లేసినంక అంకపొంకాల వర్ధ మీన పడ్డట్టేనాయే… మొగడే కావచ్చు, పొల్లగాల్లే కావొచ్చు ఎవ్వలనీ చూసుడే వుండది వాల్లని తిట్టుడే తిట్టుడు”.

ఎర్రమ్మ మనసు కలికలి అయ్యింది కోడల్ని తల్సుకుని. మూటల్నించి పొవాక్కాడ తీసి పొడుగ్గ సాగదీసి మల్ల పైలంగ మడిసి దాచింది.

”ఎంత పావురమో ముసలోనికి రామయ్య దుకాండ్ల పొవ్వాకంటె. కొడుకు కాడికి పొయ్యేనాడు పది రూపాల్ది పట్కపోయిండు… మల్ల అప్పటి సంది సడి సప్పుడు లేకుంటనే వున్నడా? కొడుకు పొవ్వాక్కు పైసలిచ్చే వుంటడేమో!”

ఎర్రమ్మ తుపుక్కున ఊసింది నేలమీద కోడల్ని తిట్టుకుంట.

”బుడ్డ పోరగాల్లు ఆకిట్ల మస్తుగ ఎగుర్తరట! ఆల్లవి చిన్న ఆటలు గావు చిన్న పాటలు గావు అని కొడుకుతోని నౌకరి చేసెటాయినె ఊల్లెకు వచ్చినప్పుడు చెప్తడు. సారు మంచోడుండెనమ్మా పెండ్లామె అందర్ని బద్నాం చేస్తది అన్నడు గాదూ”

ఎర్రమ్మ తన మనసుతోనే ఎక్కువ మాట్లాడుకుంటది. ఒక్కొక్క పాలి సంతోషపడ్తది, ఇంకొకసారి ఏడుస్తది, కొట్లాడుతది కానీ ఎన్నడు సుత దేబిరియ్యది. తనకన్ని సాతనై సంపాయించుకుంట అనే చెప్తది ఎవలతోటి మాట్లాడినా.

ఇప్పిన మూటల్నుంచి చిన్న ఎర్ర గుడ్డ మూట బైటికి లాగి ఇప్పింది. దాంట్ల నూనె కల్పిన గట్టి అటుకులు కారం కల్సి ఎర్రంగ ఎల్లిగడ్డ వాసనతోని గప్పుమంటున్నయి. మూటల్నుంచి బుక్కెడు తీసి నోట్ల పోసుకునే వరకు మల్ల ముసలోడు గుర్తుకొచ్చిండామెకు.

”అదవరకు ఇంటికాడున్నప్పుడు, కూలీగట్ట పోయొచ్చినప్పుడు ముసలోడు ఉడుకుడుకు నీల్లు పోసుకోని ఇంటి ముంగటి కుక్కి మంచవుల కూసోని కారం గల్పిన అటుకులు నోట్ల ఏసుకుంట సుట్టు పట్టోల్లతోని బాతఖని ఏస్తుండే గిప్పుడెట్లున్నడో గని మారుతున్న కాలం గురించి దిగులు పడ్డది ఎర్రమ్మ!

బాట దిగొచ్చిన ఊరకుక్క ఒకటి తోక ఊపుకుంట ఎర్రమ్మ దిక్కు ఆశగ చూస్తాంది చెట్టు కింది కొచ్చి.

”ఫో… నీ కుక్కకీన బారెయ్య… నాకే లేక సస్తాంటే నీ కేడ దెత్తు!”

తింటున్న చెయ్యి ముడ్డికి తుడ్సుకుంట రాయందుకోని ఇస్సిరేసింది కుక్కమీదికి. తగలని దెబ్బ కాసుకోవడానికి కుయ్యి కుయ్యి మనుకుంట చెట్టు కింది నించి రోడ్డెక్కిందది ఉరుక్కుంట!

గుడ్డ మూట కొసలందుకోని గట్టిగ లాగి ముడేసి నెత్తికెత్తుకోని మల్ల పయానం బాట పట్టింది ఎర్రమ్మ.

ఇంకొద్ది దూరం నడుస్తె నల్లగొండకు పొయ్యే బస్సు స్టేజి వస్తది. కూలీ పైసలు వసూలు చేసుకోని మంచి చెడ్డ చూసుకోని బయలెల్లెటాలకు ఊల్లెకు వచ్చే బస్సు ఎల్లిపోయింది. అందుకనే గింత దూరం ఊరి బైటికి వచ్చి ఎక్కే బస్సు ఎండాల్లప్పుడు వుంటది. ఆ అమ్మనీ గీ అమ్మనీ పచ్చడో కారమో పొవాక్కాడలో అడిగి తెచ్చుకోని అని మూటకట్టుకోని వచ్చే వరకు గీ వరయింది. ఎర్రమ్మ ఆలోశనలు పూర్తికాకముందే స్టేజి వచ్చింది. ఎర్ర బస్సు దుబ్బ లేపుకుంట మీది మీదికి రానే వచ్చింది.

ఆగిన బస్సు ఎక్కెటందుకు తన్లాడుకుంట –

”అయ్యోయ్య ఇదేందే దీన్నోట్ల మన్నుబడ. పెయ్యంత దుబ్బ బారిందేం దుల్లా… ఓ అన్నా… జరంత గీ మూట అందుకోన్నా…” ఎవర్నో బతిలాడింది.

”ఎహె… మూటలేందవ్వా… బస్సు కదుల్తాంది నడు నడు… ఎందుకెక్కతరో మూట ముల్లెలతోని మా పానాలు తినెటందుకు. కాల్లేపవేంది…ఊ….ఎక్కు.”

వయసు పొల్లగాడు ఎర్రమ్మని చూసి చీదరతోని కసురుకున్నడు చెయ్యందించుకుంట.

”ఇయ్యర మయ్యర ఆడికీడికి తిరుతాంటరు ఊల్ల పొంటి. పానం శాతగానప్పుడు ఇంటికాడుండి పొద్దెల్ల బుచ్చుకోవాలె. ఏవిట్కి పోతానవవ్వా మూటేసుకోనీ?” ఇంకో పిల్లగాడు వాని జుట్లకెల్లి ఎల్లినోడున్నట్టున్నది కారెడ్డెం ఆడిండు. అదేం పట్టించుకోనట్టు, నిలబడేటందుకు ఆపసోపాలు పడుతున్నది.

”స్నానం చేసి ఎన్నొద్దులైందే ముసల్దానా!”

ముక్కు మూసుకోని మరీ కెక్కిరించిండొకడు.

”మీ లెక్క సబ్బులా… పొగడర్లా సారూ… ఉడుకు నీల్లు పోసుకుందామన్న కట్టెలో పుల్లలో ఏర్కొచ్చుకోవాలె… మీ అమ్మలకు ఎర్కుంటదా కష్టం… నీకేం ఎర్క?”

ఎర్రమ్మ సుర్కు పెట్టింది వాల్లకు. చానా మంది నవ్విండ్రా మాటలకు. ఎవ్వలు జరిగి కూసోమన్నోల్లు లేరామెను. మూట జరుపుకోని బస్సుల కిందనే కూసున్నది.

కండక్టరు జనాన్ని తోసుకుంటూ –

”జల్దీ తియ్యాలె పైసలు…” అని ఎర్రమ్మని తీక్షణంగ చూసుకుంటు ముందుకు పోయిండు.

ఆ మాటలకు ఆమె బొడ్లొ దోపుకున్న పైసల సంచి లాగి అరచేతిలో బోర్లించుకున్నది. రూపాయి బిళ్ళలు గల్లున ఒళ్ళె కొన్ని, చేతుల కొన్ని, ఒకటి రెండు బస్సుల పడ్డయి.

”గీ ముల్లెంత ఎవడు లెక్క గట్టాలే? బస్సెక్కెటప్పుడు సోయి వుండదానమ్మా! నువ్వొక్కదానివేనా ఇంకెవలన్న వున్నరా?”

ఎప్పుడొచ్చిండో కండక్టరు కాళ్ళు పంగజాపి సీట్లో కూర్చోని సంకల్నించి టికట్లు చింపే దాన్ని తీసుకుంట అడిగిండు. గయిన మాటలు పట్టనట్టు బిళ్ళలు లెక్కబెడ్తున్నది.

ఎంత విసురో అతని మాటల్లో!

అందర్తో పాటు డబ్బులు కడ్తూ కూడా అతని విసురును అనామకంగా భరించింది కాసేపు. కొంత మందికి జాలి కలిగింది, మరి కొంతమంది నిరాసక్తంగా గమనిస్తున్నారు. కాని ఎర్రమ్మ ఛాతి కొలిమి తిత్తి లెక్క ఉబ్బింది.

”ఏందయ్యో లావు మాట్లాడ్తానవే, ఏం లెక్కన కన్పిస్తున్న నీకు ఆ… ఉప్పిడి ఉపాసాలుండి తెచ్చిన పైసలియ్యి. నీ లెక్క గవురుమెంటోడు ఒళ్ళె పోసిన పైసలు కావు.”

కండ్టరు ఆమె మాటలకు నోరెల్ల బెట్టిండు. అది చూసి కిసకిస నవ్విండ్రు కొంతమంది.

”కాచిప్ప బెట్ట కంచుడు గోకినట్టు లావు ముచ్చట చెప్పానవే ముందుగాల పైసలు తీయ్‌, ఏడికెల్లాల్నో చెప్పు” కోపంగ గద్దిరించిండు.

”నార్కట్‌ పల్లికి ఇయ్యి” గంతే కోపంగ అన్నది ఎర్రమ్మ.

”ఆ ముసలమ్మకు టికెట్‌ పైసలు నేనిస్తా టికెట్‌ ఆమెకివ్వండి”.

పర్సులోంచి పైసలు తీసి కండక్టరుకు ఇస్తున్న ఆమెను ఎర్రమ్మ ఎవరన్నట్టు చూసింది అయోమయంగ.

టికెట్‌ చింపి ఎర్రమ్మ మొకంమ్మీదకు విసిరి ముందుకు పోయాడు కండక్టరు.

”ఎక్కడినుండి వస్తున్నవు? నార్కట్‌ పల్లికి ఎవలింటికి పోవాలి? ఎవలున్నరు అక్కడ” అడిగిందామె.

అడుగుతున్న ఆమె ప్రశ్నలకు ఎర్రమ్మ కండ్లల్ల నీల్లు దుంకినయి.

”కొడుకు కాడికి బిడ్డా… ఆడ మా ముసలోడు వున్నడు… ఆనికి జరమొస్తున్నదని రమ్మంటే పోతాన…” అన్నది జీరబోయిన గొంతుతోని.

”అదేంది కొడుకు దగ్గర నువ్వు వుండవా?”

”అబ్బో… యిద్దర్ని ఏడ వుంచుకుంటదది? వాండ్లు సదుకున్న టీచర్లు వాండ్ల ఇకమతులన్ని తెల్వనిది ఎవలకు? చిన్న యిల్లు మాది అందరం కల్సి వుండలేము నాయినని కొన్ని రోజులు వుంచుకుంట, అటెంక నువ్వు కొన్ని రోజులు వుందువు అని చెప్పిండ్రమ్మ మొగుడు పెండ్లాలు. అందాంక మనూర్ల గుడిసెల్నే వుండుమన్నడు నన్ను.”

”అయ్యో మరి నీ తిండి తిప్పలు?”

”యిద్దరం యింటి కాడ వుంటం అన్న బిడ్డా… కూలి నాలి చేస్కునేటోల్లం… పైసో పర్కో తింటం వుంటం అంటే యినకుంట ఇల్లు పని పెట్కోని చాకిరి చేసేటందుకు పనికొస్తడని ముసలోన్ని పట్కపోయిండు. చేసి చేసి గిప్పుడు బాగ జెరమొస్తుంది రమ్మన్నరు. మూడు రోజులు సంది లేస్తనే లేడట!”

చీర కొంగుతోని కోపు కండ్లు తుడ్సుకున్నది.

”కొడుకు టీచరంటున్నవు ఈ మూటల బట్టలేందవ్వా? సంచటుంటది లేదా నీకు”

”అబ్బో నాకేడొస్తది సంచీ, బాగూ… ఊళ్ళె కూలీకి పోయేదాన్ని నేను. నాకు మూటలు కాకుంటె సంచులెవడిత్తడు? ఒకనాడు నార్కట్‌పల్లి నుండి ఎవలతోనో గిన్ని బియ్యం పంపిండు కొడుకు. సంచి దుల్పుకోని ఎంబటే పంపుమన్నది కోడలమ్మ. ఖతం పంపిన, గా సంచులతోని నేను సుత ఏడికి పోయేడిదున్నది వచ్చేడి దున్నది? సంచులు పట్కోని మా గరీబు గాల్లింటికి వచ్చెతందుకు తొవ్వెవడికి దొర్కుతది తియ్యి”.

ఎర్రమ్మ గొంతులోని నిర్వేదం ఆమెకు అర్థమయ్యింది.

”కొడుకింటికి పోతనే వుంటివి కదా ఇప్పుడు, గట్లనే సుట్టాలింటికి పోవా ఎన్నడు? సంచీల బట్టలేసుకోని?”

చివరి పదం వత్తి వత్తి పలుక్కుంట అన్నదామె.

”ఇయ్యాల రేపు రెక్కల కష్టంమ్మీద బత్కెటోనికి ఇలువ లేదు బిడ్డా! కూలీకి పోయి ఇజ్జత్‌ తీస్తానవు సుట్టాల జాడకు పోవద్దని కోడల్ది గట్టిగ బెదిరిచ్చింది గాదూ… అవుగనీ నా తాన్నించి గిన్ని ఆరాల్థీత్తానవు ఏవిటికి బిడ్డా?”

ఎర్రమ్మ అమాయకపు ప్రశ్నకు ఉలిక్కిపడ్డదామె.

”పేపర్లేత్తవా ఏంది… గాయింత కూలీకి పోనీయకుంట, కూడు పుట్టకుంట చేస్తది నా కోడలు” ఎతాస్కం ఆడింది ఎర్రమ్మ నవ్వుకుంట.

”కొడుకు పేరేందమ్మా?” అడిగిందామె.

”ఊరట్టం శీనువాసమ్మ, అయిస్కూల్ల టీచరవ్వా వాడు… కోడలి పేరు కయిత అది సుతా టీచరమ్మే, వాళ్ళకిద్దరు పోరగాల్లు… సుందంపేట దాని తల్లిగారు…”

ఎర్రమ్మ ఎంతో అమాయకంగా పొరుగింటామెతో చెప్పినంత అల్కగ చెప్పడం చూసి ఆమె గొంతుల గుండ్రాయి యిర్కిపోయినట్టయ్యింది.

”గట్ల గుట్కిల్లు మింగుతవేందమ్మా?” ఆశ్చర్యంగ చూసిందామె మొకంలకు.

”ఏం లేదులే గని… చెప్పవూ కొడుక్కాడికి పోయి ఏం చేస్తవు? ఎన్ని దినాలుంటవు?” మల్లా ప్రశ్నించింది.

”ఎన్ని దినాలా పాడా… ఒక్క పూట వుంచుకోని ఎల్లగొడ్తది గాదూ… కూలీకి పొయ్యి తెచ్చిన పుట్నాల ప్యేలాలు ఎల్లిగడ్డ కారం గసొంటియన్ని మా ముసలోనికి ఇచ్చి గింత బువ్వతిని మల్ల బస్సెక్కుడే… ఆన్నే వున్నననుకో ఒక్కరోజు చూస్తది, ఇగ బిస్తరి కట్టిందాంక శాపెనలు పెడ్తది నన్ను. ముసలోనికి సుత బువ్వ ఎయ్యకుంట సావగొడ్తది ఎర్కేనా! పిల్లగాల్లని దగ్గరికే రానియ్యది. వాల్లు గూడ బిచ్చగాల్లని సూసినట్టు దూరం కెల్లి ఇచ్చిత్రంగ సూత్తంటరు. ఏవిట్కి వుండాల్నాడ? కొడుకైతే మట్కి సరింగ సూడకపోయిన వానికాడ దేవులాడుకుంట ఎందుకుండాలె? ఇప్పుడు మా ముసలోంతోని గుడ అదే చెప్త, వాడు పెడ్తె తింటలేము. మా రెక్కల కష్టం మేం తింటున్నం. నాతోని నడువుమంట ఇంటికి ఆ….”

ఎర్రమ్మ ఆవేశంగ బొండిగ ఒత్తుకుంట చెప్పింది. ఆమె గొంతు బాధతోని బిగుసుకపోతే సవరదీసుకుంటున్నది.

ఎర్రమ్మని చూస్తుంటే ఆమెకు కండ్లల్ల నీల్లు తిరుగుతున్నయి. మొకమంత ఎర్రబారింది.

”ఏం బిడ్డా గట్లైతన్నవ్‌? ఒంట్లె మంచిగ లేదా?” అడిగిందామెను.

”ఏం లేదవ్వా నా పేరు సుభద్ర. నేను కూడా నౌకరి చేసేదాన్ని… ఈ మధ్యనే నౌకరి దిగిన. నాకు ఒక కొడుకూ… బిడ్డ వున్నరు. ఇద్దరికీ పెండ్లి చేసిన. ఐదారేండ్ల కింద ఇల్లు కట్టుకోవాలె డబ్బులు సదురుమని త్యాప త్యాపకు బిడ్డ ఏడుస్తాంటె డబ్బులిచ్చినం. పిల్లల కాంచి పెద్దల దాంక కుషామతే కుషామతు అయ్యిండ్రు. ఇల్లు కట్టుకున్నంక నా బిడ్డ అత్తగారోల్లతోని లొల్లి పెట్టుకోవుడు మొదలుపెట్టింది, చుట్టాలని తీసుకోని నా యింటికి రాకు అని కొన్నాళ్ళు, అసలు వాల్లనే వద్దని కొన్నాళ్ళు, మొగుడుతోని పంచాయి పెట్టుకోని అందర్ని ఎల్లగొట్టింది. అదేందని మొగుడంటే మా అవ్వగారిచ్చిన ఇల్లన్నది. వాల్లు దీనంకల రాకుంట ఎటో ఎల్లిపోయిండ్రు!” అన్నది సుభద్ర ఎర్రమ్మని ఇబ్బందిగ చూసుకుంట.

”పొల్లకు నువ్వన్న చెప్పలేదానవ్వా, ఒద్దు బిడ్డా గసొంటి మాటలనకు వాల్ల శాపెనలు మంచిది గాదు, పొల్లగాళ్ళ పొల్లగాల్లకు గూడ ఆ శాపెనలు తగుల్తయ్యని? బాధపడ్తానవ్‌ బిడ్డకాడికే పోతానవా ఏంది? గట్ల గాబ్రా పడ్తునవు?” ప్రశ్నిస్తూనే కోప్పడ్డట్టు అన్నది ఎర్రమ్మ.

సుభద్ర కండ్లల్ల నీల్లు దుంకినయి.

నార్కట్‌ పల్లి స్టేజీకాడ బస్సు ఆగుడుతూనే ఎర్రమ్మని జాగ్రత్తగ కిందికి దింపింది మూటతోని సహా! పర్సుల్నించి రెండొందలు తీసి ఇవ్వబోయింది సుభద్ర.

నవ్వింది ఎర్రమ్మ, రెండు చేతులు చూయించుకుంటూ- ”రెక్కలున్నయి బిడ్డా… పుణ్యానికి వచ్చే నీ సొమ్ము నాకెందుకు? ఎవలన్నా ప్యాదోల్లకు పండ్లు కొనియ్యి, తల్సుకుంటరు పుణ్యాత్మురాలివని…” అన్నది.

ఎర్రమ్మలో ఆమెకు మొక్కవోని ఆత్మవిశ్వాసం కనిపించింది. గుడ్డ మూట నెత్తికెత్తుకుని పోతున్న ఎర్రమ్మ పూర్తిగా మూర్తీభవించిన దుర్గమ్మగ పొడసూపింది.

తళుకు బెళుకు పోకడలు, డబ్బు తెచ్చిన అహంతో ఎదుటి వాళ్ళని కానని అహంకారంతో మాట్లాడ్డం తన కూతురు లాంటి వాళ్ళ సొంతమైతే, అమాయకత్వంతో ఆత్మీయ సంస్కారమూర్తిగా ఎర్రమ్మ కన్పిస్తోంటే అటే చూస్తుండిపోయింది సుభద్ర.

ఆమె రోడ్డు మీదనే ఆలోచనలో పడింది కూతురింటికి పోవాలా వద్దా అని. కూతురు ఆమె అత్తగార్ని ఇంట్లో ఏ వస్తువునూ ముట్టుకోనివ్వక పోవడం, అత్తగారి బంధువులు వస్తే చులకనగా మాట్లాడ్డం, ఆవిడ ఆరోగ్యం బావుండకపోతే దాని గురించి భర్తకు చెప్పకపోవడం, పట్టించుకోకపోవడం, పిల్లల్ని దగ్గర చేరనివ్వకపోవడం లాంటివి చెయ్యడంలో తన పాత్ర కూడా వుందని సుభద్ర గుండె ఒణికిపోయింది. కూతురు అత్తగార్ని ఏవన్నా అంటుంటే తను కూడా ఎన్నిసార్లు అలా అనూ ఇలా అను అని ఎన్నిసార్లు ఎగెయ్యలేదూ… అందుకేనా ఈ బొల్లి రోగం! దానికీ దీనికీ ఏమయినా సంబంధం వుందా!

బొల్లి రావడం చూసిన కోడలు మొదట్లో అసహ్యం చూపేది. తరువాత తరువాత జాగ్రత్తలు చెప్పేది కానీ రాన్రానూ… చిన్నగా విసుక్కోవడం చేస్తోంది. పిల్లల్ని క్రమంగా దగ్గరికి రానివ్వడం బందు చేస్తోంది.

జబ్బు తగ్గేవరకు బిడ్డ దగ్గర వుండు పో అంటోంది. కొడుకు అట్ల కాదు ఇట్ల అని ఏవన్న అనబోతే ఈ విషయంలో మాట్లాడనివ్వదు. కోడలు మొకం పట్టుకోని అన్నది ఒకనాడు.

”ఇన్నాండ్లు జీతం తెచ్చినవు కనుక ఎట్లనో సహించిన, ఇప్పుడు రిటైర్‌ అయినవు నీ పించను డబ్బులు నీకు, నీ బిడ్డకే సరిపోను వుంటయి. నిన్ను సాదె శక్తి నాకు లేదు. పైసలు మొత్తం ఇస్తె సాత్త లేకుంటే వేరే యిల్లు తీస్కోని వుంటవో, బిడ్డ దగ్గర వుంటవో తేల్సుకో!” అని ఎల్లగొట్టడం వలన గాదూ ఈ బస్సు ఎక్కింది. బిడ్డ ఏవంటదో తెల్సుకుందమని దానింటికి పోతున్నది.

ఎర్రమ్మ వ్యక్తిత్వం ఆమె మాటలూ విన్నాక సుభద్ర ఆలోచనలో పడ్డది కూతురు దగ్గరికి పోవాల్నా వద్దా అని. ఎవ్వరి క్రిందా మాటలు పడకుండా కాస్తో కూస్తో చేతుల్లో చేవా డబ్బులు వున్నాక మన బ్రతుకు బాటేంటో స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా దేనికి అంతర్మథనం! నలుగురికి చేదోడు వాదోడుగా వుంటూ జీవితాన్ని జీవించాలి గాని అనుకుంది సుభద్ర దృఢంగా.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.