వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియమైన మృణాళినీ,

ఎలా ఉన్నావ్‌? మొన్నా మధ్యన విజయవాడలో సాహిత్య అకాడమీ మీటింగ్‌లో కలిసాం కదా! రెండ్రోజులు హాయిగా గడిచింది. సత్యవతి గారిని, బాలాంత్రపు రజనీకాంతారావు గార్ని కలిసిన అనుభవం మరువలేనిది. పింగళి చైతన్య, స్వరూపరాణి చల్లపల్లి, ప్రసన్న గారు కూడా మనతో ఉన్నారు. మృణాళినీ, నీ చిరునవ్వు నాకిష్టం. నీ విజయాలన్నీ ఆ చిరునవ్వులోనే దాగున్నాయి అన్పిస్తుంది. ఎంతో ఆత్మీయంగా ఆ చిర్నవ్వుతోనే అందర్నీ పలకరిస్తావు. అదే చిర్నవ్వుతో నచ్చని వాళ్ళని వాళ్ళ హద్దుల్లోనే ఉంచగలిగే ప్రతిభ కూడా ఆ నవ్వులోనే ఉంది. నిర్మలమైన, స్వచ్ఛమైన, నాకిష్టమైన చిర్నవ్వది. నిజం సుమా!

2000 సం||లో వచ్చిన ‘కోమలి గాంధారం’ – నీ హాస్యోక్తికి నిదర్శనం. నేను బుక్‌షాప్‌లో 10 పుస్తకాలు కొని, ఫ్రెండ్స్‌కి గిఫ్ట్‌గా ఇచ్చాను. శ్రీదేవి అనే ఫ్రెండ్‌ దుబాయ్‌లో ఉంటుంది. ఈ పుస్తకాన్ని ఎంతో ప్రేమతో దాచుకుందట. మొత్తం చదివేస్తే ఐపోతుందని వారానికొకటి చొప్పున చదువుకుని నవ్వును విరజిమ్మేదట. నువ్వొకసారి అన్నది గుర్తొచ్చింది. ‘మాల్గుడీ డేస్‌’ను తెలుగులో చేస్తే, కాళీపట్నం రామారావు గారు చాలా మెచ్చుకున్నారన్నావ్‌. ”ఆ ఇంగ్లీషు నాకు సరిపడదు గానీ, ఇది చాలా బాగుంది. చిన్నపిల్లాడికి లడ్డూ ఇస్తే దాచుకుని దాచుకుని అన్నట్లు కొద్దికొద్దిగా చదువుతున్నాను” అన్నారన్నావ్‌. ‘నాకొచ్చిన అవార్డుల కంటే పెద్దది ఇది’ అని మురిసిపోయావ్‌ కూడా కదూ! 2008లో వచ్చిన ‘తాంబూలం’ కూడా మంచి సోషల్‌ సెటైర్‌. మృణాళినీ! నువ్వొకసారి ఇంకొక అనుభవం కూడా చెప్పావ్‌. ఓసారి ఓలా క్యాబ్‌లో డ్రైవర్‌ మీరు మృణాళిని గారా అని అడిగారన్నావ్‌. టీవీ ప్రోగ్రామ్స్‌లో చూసుంటాడనుకున్నానన్నావ్‌. ‘తాంబూలం’ రైటర్‌ మృణాళిని గారు మీరేనాండి అన్న అతని ప్రశ్న ఆశ్చర్యానందాలకు గురిచేసిందన్నావ్‌. మనకు తెలియని అపరిచిత వ్యక్తి, అలా హఠాత్తుగా తన అభిమానాన్ని వ్యక్తీకరించడం సంతోషాన్ని ఇచ్చిందన్నావ్‌ కదూ!

రాయలసీమ లోని రత్నానివి నువ్వు. అందుకే అన్ని జిల్లాల పర్యటనలా కాకినాడ, విశాఖ, తిరుపతి, కావలి, హైదరాబాద్‌లలో నీ చదువు యాత్ర కొనసాగింది. ‘అసమర్ధుని జీవితయాత్ర, అల్పజీవి, అతడు-ఆమె, ఊబిలో దున్న’పై ఎం.ఫిల్‌. చేశావు. అలాగే ‘సాంఘిక నవల కథన శిల్పం’పై పిహెచ్‌.డి. చేశావు. బుక్‌గా కూడా వేశావు. చుట్టూ మిత్రుల్లో కవులే ఎక్కువగా ఉండడంతో, నేను కూడా వారిలాగా కవిత్వమే ఎందుకు రాయాలి అనుకునేనేమో, కథ, నాటకం, సంగీతాల వైపు మనసు మళ్ళించావు. డిగ్రీ రోజుల్లో కాలేజ్‌ మ్యాగజైన్‌లో కథ రాశావు. తర్వాత రేడియో కోసం కథ రాసి, లైవ్‌లో చదవడంతో రచనా రంగం మొదలైందని చెప్పొచ్చు. ఆ తర్వాత రేడియో కోసమే ‘కిటికీ’ అనే పేరుతో గల్పిక రేడియోలో సిరీస్‌గా వచ్చింది. తెలుగు భాషమీద ఎక్కువగా రాశావు. ‘నిర్ణయం’ అనే మొదటి కథ 1979లో ‘వనిత’లో ప్రచురింపబడింది. 1985 నుంచి ‘ఉదయం’ దినపత్రికలో ఉద్యోగ జీవితం మొదలైంది. అప్పుడెక్కువగా అనువాద కథలు కూడా రాశావు. 10 కథలకు పైగానే రాసుంటావు. పుస్తకం వెయ్యొచ్చు కదా అంటే, దొరకడం లేదు వెతుకుతున్నానంటావ్‌. గ్రీకు భారతీయ పురాణాల్లో స్త్రీల గురించి ‘నిశ్శబ్ద విప్లవాలు’, ‘ప్రతిధ్వని’ అనే వ్యాస సంకలనం, ‘ఇంతిహాసం’ – ఇది అద్భుతమైన రచన. మొత్తం మీద నీ అన్ని రచనలు 20కి పైగానే ఉంటాయి కదూ!

ఇక నీకొచ్చిన అవార్డుల విషయాని కొస్తే చాలా ఉన్నాయి. నాకు గుర్తున్నంత వరకూ బెస్ట్‌ టీచర్‌ అవార్డు, గృహలక్ష్మి స్వర్ణకంకణం అవార్డు (2007), తెలుగు యూనివర్శిటీ వాళ్ళిచ్చే అబ్బూరి ఛాయాదేవి అవార్డు, వాసిరెడ్డి సీతాదేవి అవార్డు, తురగా జానకీరాణి అవార్డు, యద్ధనపూడి సులోచనారాణి అవార్డు, బెస్ట్‌ ట్రాన్స్‌లేటర్‌ అవార్డు (మాల్గుడీ డేస్‌కి), విమర్శకు, ఆవంత్స సోమసుందర్‌ అవార్డు వచ్చాయి. 1940 నుంచీ చందమామలోని భేతాళ కథలను 25 కథల వరకు తీసుకొని రేడియోకి నాటకాలు రాసి ప్రొడ్యూస్‌ చేశావు. ‘బెస్ట్‌ ఇన్నోవేషన్‌ షో’ అవార్డులు మూడు వచ్చాయి. నిజంగా ప్రతిభ ఎక్కడ ఉంటే గౌరవం దానికదే వచ్చి చేరుతుందనిపిస్తుంది నీలాంటి వాళ్ళను చూసినప్పుడు. నాకింత అపురూపమైన మిత్రురాలున్నందుకు సంతోషంగా కూడా ఉంటుంది. రిసెర్చ్‌ ఆర్టికల్స్‌తో పాటు అద్భుతమైన వక్తగా కూడా కీర్తి నీ పేరుకి అదనంగా వచ్చి చేరింది. అమెరికా (4 సార్లు), లండన్‌, మారిషస్‌ (6 సార్లు), మలేషియా, నార్వే, చైనాలలో నీ వాణి విన్పించావు. 2006 నుంచి 2009 వరకు ‘వరల్డ్‌ స్పేస్‌ రేడియో’కి డైరెక్టర్‌గా ఉన్నావు. నువ్వు చేసిన అన్ని ఉద్యోగాల్లోకి ఇదెంతో ఆత్మతృప్తిని ఇచ్చిందనేదానివి. తెలుగు విభాగానికి ఈ మూడేళ్ళలో చాలా కృషి చేశావు.

2000కి పైగా టీవీ ప్రోగ్రామ్స్‌ ఇచ్చావు. హిందీ పాత పాటలంటే నీకు ప్రాణం. అందుకేనేమో నీ రింగ్‌టోన్‌గా ఉన్న పాట నాక్కూడా చాలా ఇష్టం. నువ్వు పాటలు రాసి ‘స్వరార్చనం’ పేరిట ‘సీడీ’ కూడా తీసుకొచ్చావు. సురేఖా మూర్తి పాడారు. నీ వాగ్దాటికీ, నీ స్పాంటేనిటీకీ, వ్యంగ్యోక్తి, చమత్కారాల మేళవింపుతో ప్రవాహంలా కొనసాగే నీ ఉపన్యాసాలు వినడానికి చాలామంది ఇష్టపడతారు.

సాహిత్య అకాడమీ జనరల్‌ కౌన్సిల్‌ మెంబర్‌వి కూడా కదూ! తెలుగు యూనివర్శిటీలో కంపారిటివ్‌ స్టడీస్‌లో డైరెక్టర్‌గా ఈ మధ్యనే రిటైర్‌ కూడా అయిపోయావు కదూ! ఇప్పుడు పూర్తి స్వేచ్ఛాజీవివి. ఇంకా నువ్వు ఏమేం చేయాలనుకున్నావో వాటన్నింటినీ ప్లాన్‌ చేసుకోవచ్చు. నువ్వెంతో ఇష్టపడే ‘ధృతి’ బంగారు కొండ. నిజంగా నీ దగ్గర హాయిగా, సంతోషంగా, స్వేచ్ఛగా, ఇష్టంగా ఎట్లా బతకొచ్చో నేర్చుకోవచ్చు. ప్రతి క్షణంలోనూ జీవనానందాన్ని పొందాలనుకునే నీ స్వభావం కూడా నాకు నచ్చుతుంది. ఒకసారెప్పుడో అన్నావ్‌. విజయాల కోసం మనం పరిగెత్తడం కాదు, మన కృషే విజయాన్ని తెచ్చిపెడుతుంది అని. నువ్వు రాసిన నాటకాలకు కూడా నేషనల్‌ అవార్డు వచ్చింది కదూ!

మృణాళినీ! మనసుకు దగ్గరగా వచ్చిన మంచి మిత్రురాలిగా, ఆత్మీయు రాలిగా, మన సాన్నిహిత్యం నా దృష్టిలో ఎంతో విలువైనది. గలగలా అందర్తో మాట్లాడే నీ మాటల వెనకున్న ఆత్మీయతా స్పర్శ హాయిగా ఉంటుంది. ఇక ఉండనా మరి.

నీ శిలాలోలిత

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.