గురజాడ వారసులు స్త్రీ వాదులు – డా|| అయ్యగారి సీతారత్నం

 

గురజాడ అప్పారావు నాటి సాహిత్య ధోరణికి భిన్నంగా ఒక నూతన ఒరవడిని తెలుగు సాహితీ లోకానికి అందించారు. ఈ నూతన ఒరవడిని అనంతరం సాహితీవేత్తలు అందుకొన్న విధంలోనే గురజాడ శక్తి బయటపడుతుంది. ఆస్తి, అధికారం లాంటి వాటికి వారసులుండకూడదు కానీ విలువలకి సామాజిక వారసులు అవసరమే. కానీ నిజానికి సాహిత్య చరిత్రలు రచించిన వారు కానీ, పరిశోధన చేసినవారు కానీ గురజాడ యుగమని పేర్కొనలేదు. సాహిత్యంలో గురజాడ చేసిన మార్పులు, ఒరవడిని అనంతర కవులు అందుకోలేదన్పించడమే కారణం. అలాగని గురజాడని ఏ ఒక్కరూ విడిచిపెట్టలేదు. ప్రత్యేకంగా ఆయన ప్రతిభను అందరూ వివరించారు. సమగ్ర పరిశోధన చేసిన ఆరుద్ర కూడా గురజాడని స్పష్టంగా చిత్రించినా ”గురజాడ యుగం” అని అనలేదు. అయితే అభ్యుదయ కవి, మార్క్సిజం చదువుకున్న వ్యక్తి అయినా ఆరుద్ర ఎందుకనో పాలకుల దృష్ట్యానే యుగవిభజన చేశారు. కుంఫిణీ యుగం, జమిందారీ యుగం… అని విభజించి జమిందారీ యుగంలో గురజాడను చేర్చారు. సి.నారాయణ రెడ్డి గారు కూడా గురజాడ ఆధునికత్వాన్ని కాదనలేక అలాగని యుగకర్త అనడానికి అప్పుడే అనుసరించిన వారు లేకనే గురజాడని, రాయప్రోలుని కూడా ఆధునిక సాహిత్యానికి ఇద్దరు యుగకర్తలుగా చెప్పి జాగ్రత్తపడ్డారు. సినారె నుండీ సిమ్మన్న గారి దాకా సాహిత్య చరిత్రకారులు, పరిశోధకులు గురజాడ గురించి చెప్పారు కానీ గురజాడకి యుగం ఇవ్వలేదు. మొదటిసారి పెట్టి ఈశ్వరరావు గారి శతజయంతి ఉత్సవాల నిర్వహణలో భాగంగా ‘గురజాడ యుగం’ అనే ఒక సమావేశాన్ని విశాలాంధ్ర వారే నిర్వహించారు.

వెలిచేరు నారాయణరావు గారు కూడా గురజాడది అసంపూర్ణ విప్లవంగా పేర్కొన్నారు. విప్లవం అంటేనే ‘పరిపూర్ణమైన మార్పు’ అని అర్థం చెప్పుకుంటే అసంపూర్ణ విప్లవం అనేది అర్థరహితమైనదే, అయినప్పటికీ గురజాడని యుగకర్తగా చెప్పలేమన్నది ఆయన అభిప్రాయంగా వ్యక్తమయింది. అంతేకాదు, గురజాడది ఆశు సంప్రదాయం. దాన్ని అనంతర కవులు అనుసరించలేకపోయారన్నది కూడా వ్యక్తపరిచారు. నిజానికి గురజాడ కవిత్వం శ్రోతగానూ, పాఠకుడిగా కూడా ఆనందించగలిగిందే. నిజానికి అచ్చు యంత్రం వచ్చేదాకా ఆశుసంప్రదాయమే కొనసాగింది. పోతన భాగవతం ఆశు సంప్రదాయం వల్లనే జన బాహుళ్యమైంది.

పురాణాలు ఒకరు చెప్పడం-పదిమంది వినడమే మన సంస్కృతి. దేశీయమైన విధానాన్ని గురజాడ పట్టుకుంటే ఇంగ్లీషు విద్య ప్రభావంతో రాయప్రోలు, కృష్ణశాస్త్రి నేరుగా ఇంగ్లీషు వారిని అనుకరిస్తూ వారిలాగా కాల్పనిక కవిత్వం రాయడం ప్రారంభించారు. ప్రబంధ కవులకు వ్యతిరేకంగా మనసుని మాత్రమే గ్రహించి సంభోగ శృంగారాన్ని వ్యతిరేకించి విఫ్రలంభ శృంగారాన్ని గ్రహించి ప్రణయ కవిత్వాన్ని రచించారు. సామాజికంగా ఉన్న జాతీయోద్యమ ప్రభావంతో దేశభక్తి కవిత్వం రాశారు. వీరిది కాల్పనిక దేశభక్తి. గురజాడది స్థానిక దేశభక్తి. జాతీయోద్యమంలో పాల్గొనలేదనిపిస్తుంది బాహ్యదృష్టికి. కానీ నిజానికి బ్రిటిష్‌ వారికింద బానిసత్వానికి రెండు కారణాలు ప్రధానం…. 1. ఆర్థికాధిపత్యం

2. సాంస్కృతికాధిపత్యం

గ్రామీణ ఆర్థిక వ్యవస్థని, కులవృత్తులను నాశనం చేసి ఆర్థికాధిపత్యాన్ని సంపాదించారు బ్రిటిష్‌వారు. సాంస్కృతికాధిపత్యం కూడా వచ్చి ఉంటే శాశ్వత బానిసలుగా మారేవాళ్ళం. ఆ సాంస్కృతికాధిపత్యం వారి చేతికి వెళ్ళకుండా ఉండాలనే మొదట మన సంస్కృతిని సమూలంగా మార్చడానికి, భావజాల మార్పిడికి సాహిత్యాన్ని ఉపకరణంగా గ్రహించారు. ఇంగ్లీషు బాగా చదువుకుని దానివలనే ప్రజాస్వామ్యం అనే దాన్ని గ్రహించారు. నిజానికి గురజాడ ఆధునిక యుగారంభకుడిగా గుర్తింపుకి ఇదే కారణం. వేల్పేరు నారాయణలాంటి వారు గురజాడకన్నా ముందే ఆధునికత ఆరంభమయిందని నిరూపించే ప్రయత్నంలో పోతన ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి సొమ్ములు గొన్ని పుచ్చుకొని… అని చెప్పినదీ, ధూర్జటి, రాజుల్‌ మత్తుల్‌ వారి సేవ నరకప్రాయంబు అనేదాన్ని ఉదహరించి రాచరిక వ్యవస్థని ధిక్కరించారనీ అదే ఆధునికత్వం అంటున్నారు. కానీ ఒక వ్యవస్థని కాదనడం మాత్రమే ఆధునికం కాదు, ప్రత్యామ్నాయం చూపించగలిగిన వారే యుగకర్తలు అవుతారు. గురజాడ ప్రజాస్వామ్యం అనే ప్రత్యామ్నాయాన్ని దర్శించారు. అందుకే ఆధునికం ఆయనతోనే ఆరంభమయింది. కవిత్వానికి కూడా ఆయనే యుగకర్త. కందుకూరి సరస్వతీ నారద సంవాదంలో సాహితీ సరస్వతి పాతదనం, దీనత్వం చూపారే కానీ ప్రత్యామ్నాయం చూపలేకపోయారు. గురజాడ ముత్యాలసరాలు తేటైన మాటలతో గ్రుచ్చి యిచ్చారు.

గురజాడ ఆధునికత్వంలో ప్రధాన విషయాలు:

1) వాడుక భాష

2) దేశీయ మాత్రా ఛందస్సు

3) ఆధిపత్యం, అణచివేతల గుర్తింపు

4) జెండర్‌ వివక్ష

5) కుల వివక్ష

6) స్థానికత

7) మతమౌఢ్యం

మొదటి రెండూ రూపానికి సంబంధించినవీ, తర్వాత వస్తువుకి సంబంధించినవీ. అభ్యుదయ విప్లవకవులు ఆధిపత్యం, అణచివేతని మాత్రమే గ్రహించారు. స్త్రీ, పురుష సంబంధాలపై, మానవ సంబంధాలపై, కులతత్వాలపై గురజాడ చూపిన దృక్పథాన్ని అందుకోలేదనే గ్రహించారు. జెండర్‌ వివక్షని స్త్రీ వాదులు అందుకుంటే కులవివక్షని దళితులు అందుకున్నారు. స్థానికత అనే అంశాన్ని ప్రాంతీయ అస్తిత్వవాదులు అందుకున్నారు. మతమౌఢ్యం పోగొట్టడానికి హేతువాదం వచ్చింది. నిజానికి కవిత్వంలో యుగకర్త కాదా అనే సంశయం భావకవిత్వం వలన వచ్చింది కానీ వచన సాహిత్యంపై గురజాడ ప్రభావం సుస్పష్టం.

గురజాడే మొదట కుటుంబ, వివాహ వ్యవస్థలో స్త్రీల అస్తిత్వరాహిత్యాన్ని, అణచివేతని పితృస్వామ్యాధిపత్యాన్ని గుర్తించారు. కానీ అనంతరం వచ్చిన అభ్యుదయ, విప్లవ కవులు కూడా కుటుంబాన్ని ఒక యూనిట్‌గా చూశారే తప్ప కుటుంబం లోపలికి తొంగి చూడలేదు. అక్కడ ఉండే ఆధిపత్య, అణచివేతలను గుర్తించలేదు.

కన్యాశుల్కంలో అగ్ని హోత్రావధాన్లు ఒక ఆధిపత్య ధోరణికి ప్రతీక. స్థానికంగా, తన కులాస్తిత్వ స్పృహతో నిజాయితీగా స్త్రీల అస్తిత్వరాహిత్యాన్నీ, అణచివేతనీ, పితృస్వామ్యాధిపత్యాన్ని గుర్తించారు. కన్యాశుల్కంలో బుచ్చమ్మ చైతన్యాన్ని అగ్ని హోత్రావధాన్లు అస్సలు భరించలేడు. ”నాన్నో, తమ్ముడికి పెళ్ళి చెయ్యాలంటే నా సొమ్ము పెట్టి పెళ్ళి చేయండి కానీ దాని కొంప ముంచి లుబ్ధావధాన్లుకి ఇవ్వొద్దని” చెప్పడంతో తండ్రికి వెర్రికోపం వస్తుంది. తండ్రితో నేరుగా, నా సొమ్ము పెట్టి చేయండని ఆస్తిహక్కుని వెల్లడించింది బుచ్చమ్మ. నేటికి కూడా ఆపేక్షంగా ఏదైనా చీరో సారో ఇస్తారేమోకానీ హక్కుగా కోరే స్త్రీలని భరింపలేరు. ఇది గురజాడ గుర్తించారు. ఈ గుర్తింపుని కొనసాగించి మూలాన్వేషణ చేశారు స్త్రీ వాదులు. ఓల్గా, నూరేళ్ళ నిశ్శబ్దం కళ్యాణరావు నేనేమడిగానని కథలలో ఇది స్పష్టమవుతుంది.

లైంగిక గోప్యత విపరీతంగా ఉన్న రోజుల్లోనే స్త్రీల జీవిత సూక్ష్మ పరిశీలన వలన భ్రూణ హత్యల్ని బయటపెట్టారు గురజాడ. మీనాక్షి పాత్ర ద్వారా లైంగిక అణచివేత, దాన్ని తప్పించుకొందామంటే అనాహ్వానిత గర్భం, దాన్ని తప్పించుకొనేందుకు భ్రూణహత్య, దాన్ని గుర్తించి పోలీసుల బెదిరింపులు, స్త్రీల జీవితంలోని ఒక అశాంతి, అభద్రత, అసౌకర్యాల్ని గుర్తించారు. దీన్ని మరింత లోతుగా పరిశీలించిన స్త్రీ వాదులు స్త్రీ తన మాతృత్వాన్ని సమాజానికి భయపడి చంపుకోనక్కర్లేదనే పరిష్కారంతో స్త్రీలకి ధైర్యాన్నివ్వడానికి కసాయి తల్లి, జగన్మాత వంటి చాలా కథలలో ప్రయత్నించారు. కర్ణ జన్మకి కారణమైన కుంతి తల్లుల వ్యధని పోగొట్టే ప్రయత్నం చేశారు.

స్త్రీలకి పెళ్ళే విధాయకమని భావించే సామాజిక దౌష్ట్యాన్నీ బయటపెట్టారు. కన్యాశుల్కంలో సౌజన్యరావు గిరీశం గురించి నిజం చెప్పమని ”వీడు అవ్యక్తుడయితే బుచ్చమ్మకు ఎంతవస్థ..”అని అడుగుతాడు. అంతేకాదు, విద్య నేర్చుకొని ప్రాజ్ఞరాలయి నచ్చిన వివాహం చేసుకుంటారు లేదా మానుకొంటారు అని గురజాడ పెళ్ళి చేసుకోవడమనేది స్త్రీ వ్యక్తిగత స్వేచ్ఛగా తెలిపారు. పెళ్ళికంటే ప్రజ్ఞ అవసరమని తెలిపారు. నిజానికి ఈ భావజాలం సాహితీపరులెవ్వరూ స్పష్టంగా అందుకోలేదు. 1980ల దాకా సినిమాల్లో కూడా అత్యాచారం చేసినా, మోసం చేసినా, మౌన పోరాటం చేసో, భయపెట్టో వారిని వివాహం చేసుకోవడమే విధాయకమన్నట్లుగానే చిత్రించారు. మొట్టమొదటి స్త్రీ వాదులే వివాహ వ్యవస్థలోని డొల్లతనాన్ని, పెత్తందారీ విధానాన్ని కూలంకషంగా పరిశీలించి బయటపెట్టారు. ప్రత్యామ్నాయంగా సహజీవనాన్ని ప్రతిపాదించారు. ఆలోచన ఉన్నా అణచివేతకి గురయ్యే బుచ్చమ్మలే ఎక్కువ. ”ఆడదానివి, నీకేం తెలియదు”, ”ఆడదానివి నీకెందుకు భోగట్టా అంతా…” అని చిన్నవాడయినా తమ్ముడు కూడా అణచివేతకి గురిచేస్తాడు. దాన్ని మరింత లోతుగా పరిశీలించి ఓల్గా ‘నోర్ముయ్‌’ మొదలగు రాజకీయ కథలు, కొండేపూడి నిర్మల, కుప్పిలి పద్మ, చంద్రలత, కె.సత్యవతి మొదలగు ఎందరో కవిత్వం ద్వారా, కథల ద్వారా, వ్యాసాల ద్వారా వ్యక్తపరచి మొదట కుటుంబాల నుండీ తనవారి నుండే తాను తన విముక్తి కోసం పోరాడాలనే చైతన్యాన్ని బలపరిచారు.

వైధవ్యంలో ఉండే బాధలను బయటపెట్టిన గురజాడ వారి పాత్రలు బుచ్చమ్మ, మీనాక్షి పూటకూళ్ళమ్మకి కొనసాగింపుగా మరింత సూక్ష్మ పరిశీలనతో వారి జీవన విధానాన్ని, అందులో ఇతరుల ఆధిపత్య జోక్యాలను వివరిస్తూ దానికి విరుద్ధంగా, వారికి నచ్చిన తీరులో తోడుని ఎంచుకొని జీవించే స్వతంత్రతని చిత్రీకరించారు స్త్రీ వాదులు.

బ్రతుకు తెరువు కోసం తనకున్న నైపుణ్యంతో తాను బ్రతికిన పూటకూళ్ళమ్మ నిజానికి ఒక వ్యాపారవేత్త. స్త్రీలు నైపుణ్యాన్ని పెంచుకునే ఉద్యోగాలు, వ్యాపారవేత్తలు అయినప్పటికీ మోసంచేసే గిరీశులుంటారని, వారిని ధైర్యంగా చీపురు తిరగేసైనా, మొరటుదనం ప్రదర్శించయినా ఎదుర్కోవాలనే సూచించారు గురజాడ. దాన్ని మరింత పరిశీలించిన స్త్రీ వాదులు ఉద్యోగినులైనా కూరగాయలు, పండ్ల వ్యాపారులు, చేపలమ్మేవాళ్ళు మొదలైన స్త్రీలు ఎదుర్కొంటున్న మోసాలే కాకుండా లైంగిక ఒత్తిళ్ళు, ఆధిపత్యాలు, తక్కువ జీతాలు, ద్విపాత్రాభినయాలు, ఇంటి చాకిరీ, గృహ హింస, ఆధిపత్యం మొదలైన అనేక అంశాలపై వాస్తవ సాహిత్యాన్ని సృష్టించి వ్యవస్థ భావజాల మార్పుకి కారణమై, లైంగిక ఒత్తిళ్ళు నిరోధానికి, గృహ హింస నిరోధానికి విడాకుల చట్ట సవరణలకు కారణభూతులయ్యారు. ఈ చట్టాల వలన పూర్వంలాగా స్త్రీలు ఎంత హింస ఉన్నా అదే బంధంలో ఉండి అవే బాధలను పడుతూ జీవితం నష్టపోనక్కర్లేదు.

వేశ్యల మంచితనాన్ని గుర్తించి ఆమె కూడా మనిషే అన్న స్పృహని కలుగచేశారు గురజాడ. వేశ్యల జీవితం, వారు జీవించే హక్కు గురించి రచిస్తూ వారి పక్షాన నిలబడగలిగారు స్త్రీ వాదులు. స్త్రీల అణచివేతను సూటిగా బయటపెడితే తట్టుకోలేని రావి శాస్త్రి లాంటి వారు గయ్యాళులంటే…

”అవును మేము గయ్యాళులమే

మధురవాణి మధుర వాక్యాలు మీ

దళసరి చర్మాలకు ఎక్కకపోతే…”

అని సూటిగా గురజాడ వారసులమనే స్పృహను కలుగచేశారు.

లైంగిక దోపిడీని గురజాడ కన్యకలో చిత్రించారు. ద్రౌపది, సీతల నాటి నుంచి ఈ దేశంలో లైంగిక దోపిడీ అనేది స్పష్టమే. ద్రౌపది, సీత కూడా భర్తల మీద ఆధారపడినవారే కానీ వారే స్వయంగా ధిక్కారం తెలిపినవారు కారు. మొదటిసారి గురజాడ కన్యక తన అన్యాయాన్ని ఎదిరించడం, తమ జాతి వారిని ఆధిపత్యానికి లొంగే తత్వాన్ని వదిలే విద్యని, పదవులని పొందమని బలమైన ధిక్కార స్వరం వినిపించింది. ఈ ధిక్కారం ఆత్మాహుతిగా తెలిపితే అనంతరం పోరాట పటిమతో నీ యుద్ధం నువ్వే చెయ్యి, నీ యుద్ధం ఎవరో చెయ్యడమే నీ ఓటమికి చిహ్నం.. అని చైతన్య పరిధిని పెంచి అత్యాచార నిరోధ నిర్భయ చట్టం రావడానికి కారణమయ్యారు. అంతేకాక అత్యాచారాన్ని చెప్పుకునే స్థితి కూడా లేక నిమజ్జనం అయిపోయే స్త్రీల దుస్థితికి కారణమైన శీలం చుట్టూ ఉండే మిథ్‌ని బద్దలుకొట్టి స్త్రీల అస్తిత్వాన్ని కాపాడుకునే స్థితిని పెంచారు. ఆధునిక స్త్రీ చరిత్ర తిరగరాస్తుంది అనే గురజాడ మాటను నిజం చేస్తున్నారు. దాచేస్తే దాగని సత్యాలుగా చారిత్రక గుర్తింపులేని స్త్రీల జీవితాన్ని వెలికితీసి కథకులు రాజకీయ వేత్తలు, సంస్కర్తలు, సంఘ సేవకులు మొదలైన అన్ని రంగాలలో వారి యదార్థ స్థితిని మహిళా వరణాలుగా, చరిత స్వరాలుగా మరల చరిత్ర రచన చేబట్టారు.

నిజానికి ఒకరి ప్రభావాన్ని బట్టి ఆ కవియుగ కర్తృకత్వం, వారసత్వం నిర్ణయిస్తారు. జి.వి.సుబ్రహ్మణ్యంగారు ప్రభావం గుర్తించి ఇలా చెప్పారు.

”ఒక కవి మరొక కవినుండి భావాన్ని సంగ్రహించే విధానంలోనే ప్రభావం బలం బయటపడుతుంది. అపరిణుతులైన కవులు అన్యుల భావాలను అనుకరిస్తారు. పరిణిత కవులు సంగ్రహిస్తారు. సత్కవులు తాము సంగ్రహించిన అంశాలకు ఉత్తమ రూపాలిచ్చి వాటిని ఉజ్వలం చేస్తారు.”

గురజాడ స్త్రీల జీవన విధానం గురించి చెప్పిన ప్రతి అంశాన్ని గ్రహించి లోతుగా పరిశీలించి ఒక అద్భుత కవిత, కథా రూపాలిచ్చారని ‘వంటిల్లు, గృహలక్ష్మీ మొహంజదారో, స్త్రీల విజ్ఞప్తి, తోడు, రిటైర్‌మెంట్‌, బోనసాయి, నేనూ నాన్ననవుతా…’ ఇంకా ఎన్నో కథలు, కవితలలో చాలా బలంగా, సృజనాత్మకంగా తెలియచెప్పారు. గురజాడ సాహితీ ప్రక్రియలుగా లేఖ, డైరీలను కూడా అందించారు. ఆ ప్రక్రియలను కూడా స్త్రీ వాదులు చేపట్టి స్త్రీల అభ్యుదయం కొరకు పాటుపడుతున్నారు. గురజాడ నిజంగా రోజూ వాడే భాషకి సాహిత్య గౌరవం దక్కించారు.

స్త్రీ వాదులు కూడా రోజూ వాడే భాష ముట్టు, రుబ్బుడు పొత్రం… లాంటివి సంకోచం లేకుండా ఎన్ని విమర్శలు వచ్చినా తట్టుకొని మరీ ఉపయోగించారు. అందువలన సాహిత్య ఫ్యూడలిజంతో గురజాడ అప్పారావు చేసిన యుద్ధానికి వారసులుగా సాహిత్య సామాజిక ఫ్యూడలిజంతో యుద్ధం చేస్తున్న స్త్రీ వాదులు గురజాడ వారసులు…

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.