మహిళలలో ఋతుస్రావ సమయానికి ఆ సమయంలో కనిపించే మూర్ఛ రోగానికి గల సంబంధం – డా|| చాగంటి కృష్ణకుమారి

 

(చికిత్సకి దారి తీయగల డాక్టర్‌ సాంబరెడ్డి గారి ఆశాజనక పరిశోధనా ఫలితాలు)

వివిధ అవయవాలకు మన మెదడు నుంచి వెలువడే ఆదేశాలన్నీ విద్యుత్‌ సంకేతాల రూపంలో నరాల ద్వారా ఆయా అవయవాలకు చేరతాయి. సాధారణంగా స్పందనలు క్రమబద్ధంగా వెలువడుతూ

ఉంటాయి. ఇది ఆరోగ్యమైన స్ధితి. కానీ ఏకకాలంలో అనేక విద్యుత్‌ స్పందనలు లెక్కకు మీరి వెలువడితే కండరాలు బిగుసుకుపోవడం, స్పృహ కోల్పోవడం, విచిత్రంగా ప్రవర్తించడం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. మెదడు నుండి అసాధారణ విద్యుత్‌ స్పందనల వల ఉన్నట్లుండి అకస్మాత్తుగా మనిషికి స్పృహ తప్పుతుంది. అలా స్పృహ కోల్పోవడాన్ని ‘సీజర్‌’ మూర్ఛ అంటాం. ‘ఫిట్స్‌’ అని కూడా వాడకంలోఉంది. ఇటువంటి అనారోగ్యాన్ని ‘ఎపిలెప్సీ’ అంటారు. ఇది స్త్రీలలోనూ, పురుషులలోనూ ఉండవచ్చు. నెలసరి సమయంలో హఠాత్తుగా పలుమార్లు మూర్ఛిల్లే లక్షణం కొంతమంది స్త్రీ మూర్ఛ రోగుల్లోఉంటుంది. ఋతిమతులై ఉన్న ఆ రోజుల్లో వారు అత్యధికంగా సీజర్స్‌కి లోనవుతారు. ఇది దీర్ఘకాలిక మూర్ఛ రోగంలో ఒక భాగం. స్త్రీ బహిష్టుతో సంబంధం ఉన్న ఈ రకం మూర్ఛని ‘కటమినియల్‌ ఎపిలెప్సీ’ అంటారు. కొన్ని వేల సంవత్సరాల నుండి వైద్య రంగానికి ఇది తెలిసి ఉన్నప్పటికీ తగిన చికిత్సా విధానం ఈ రోజుదాకా అందుబాటులో లేదు. ‘ఇంతే మా గతి’ అని భావిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరాశా నిస్పృహలకు లోనవుతున్న స్త్రీలు అనేకం ఉన్నారు.

డాక్టర్‌ డి. సాంబరెడ్డిగారు టెక్సాస్‌లోని ఎడఎమ్‌ వైద్య విశ్వవిద్యాలయ కళాశాలలో నాడీ శాస్త్ర, ప్రయోగిక చికిత్స శాస్త్ర ఆచార్యులు. గత రెండు దశాబ్దాల నుండి ‘కటమినియల్‌ ఎపిలెప్సీ’కి గల కారణాల వెతుకులాటలో చాలా శ్రద్ధగా పరిశోధన, అధ్యాయనాలలో నిమగ్నమై ఉన్నారు.

”మీరే మాకు దారి చూపాలి, దయుంచి మా ఈ పరిస్థితిని చక్కదిద్దరూ?” అంటూ అభ్యర్థనలతో రెడ్డిగారికి తరచుగా అంతర్జాలంలో ఉత్తరాలు పంపడం, ”మా దేశాన్ని దాటి విమానంలో మీ దగ్గరకు రమ్మనమన్నా రాగలను” అంటూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు దిగులుగా రెడ్డిగారిని అడగడం సర్వసాధారణమై పోయింది. అందుకు కారణం వేల సంవత్సరాల నుండి ఒక మిస్టరీగా ఉన్న కెటామినియల్‌ ఎపిలెప్సీకి నిర్దిష్ట కారణమేమిటన్నది రెడ్డిగారు గట్టి పట్టుదలతో శ్రమిస్తూ, స్త్రీలకే ప్రత్యేకమైన ఈ సమస్య పరిష్కారానికి నడుం కట్టుకొన్నవారవడమే.

తన పర్యవేక్షణలో డాక్టొరల్‌ డిగ్రీ కోసం పరిశోధన చేస్తున్న విద్యార్థి బ్రయన్‌ క్లోసెన్‌ (Bryan Clossen) తో కలిసి సాంబరెడ్డి గారు Journal of Neuroscience Research 2017 అక్టోబర్‌ నెల సంచికలో కేవలం మహిళలకే సంబంధించిన హార్మోనల్‌ సీజర్స్‌పై తమ పరిశోధనా వివరాలను ప్రచురించారు. ఆధునిక జన్యు మార్పిడి విధానాలను వాడుతూ అతి ప్రాచీన రోగమైన ‘కటమినియల్‌ ఎపిలెప్సీ’పై ప్రకటించిన పరిశోధనలలో ఇదే ప్రప్రథమమైనది.

”మామూలుగా మూర్ఛ రోగానికి వాడే యాంటీ ఎపిలిప్టిక్‌ మందులు ఈ మహిళలకు పనిచేయవు. చాలా కాలం నుండి డాక్టర్లు మూర్ఛ రోగానికి పురుషులకు వాడే మందులనే ఋతుస్రావ సంబంధిత మూర్ఛ రోగానికి స్త్రీలకు వాడుతున్నారు. ఋతుస్రావ రోజుల్లో ఉన్న స్త్రీ హార్మోన్లలో కలిగే మార్పులవల్ల మామూలుగా మూర్ఛ రోగానికి వాడే డైయజిపామ్‌ (diazepam), వాల్ప్రొయేట్‌ (valproate) వంటి మందులకు వారి మెదడు సున్నితత్వాన్ని కోల్పోతుంది. అందువల్ల ఆ మందుల ప్రభావం వారిపై ఉండదు” అని సాంబరెడ్డి గారు అన్నారు.

మహిళల ఋతుచక్రంలో ఒకదాని తరువాత ఒకటిగా వరుస క్రమంలో జరిగే నాలుగు దశలు ఉంటాయి. మొదటిది ఫాలిక్యులార్‌ లేది కూపిక దశ, ఇది అండాశయ పుటం ద్రవంతో నిండిన ఒక సంచిలో పరిపక్వం కాని అండాలు (స్త్రీ బీజాలు) తయారయ్యే దశ. రెండవది ఒవ్యులేటరి దశ, అనగా పరిపక్వమైన అండం అండకోశం ఉపరితలం నుంచి ఉబికి వచ్చి, పగిలి, అండం విడుదలయ్యే దశ. మూడవది అండం విడుదలైన తర్వాతి దశ. ఈ దశలో కూపిక (ఫాలికల్‌) మూసుకుపోయి కార్పస్‌ ల్యుటియం అనే ఆకారంగా మారుతుంది. ఒకవేళ ఫలదీకరణ జరిగితే అందుకు అనుగుణంగా ఇది గర్భాశయాన్ని సిద్ధం చేస్తుంది. ఈ కార్పస్‌ ల్యుటియం ఎక్కువ మోతాదులో ప్రోజెస్టరాన్‌ అనే హార్మోన్‌ను ఉత్పన్నం చేసి రాబోయే పిండం కోసం గర్భాశయపు లోపలి పొరను (ఎండోమెట్రియం) ద్రవాలతోనూ, పోషకాలతోనూ నింపి దళసరిగా తయారుచేస్తుంది. అండం ఫలదీకరణ చెందకపోతే 14 రోజుల తర్వాత కార్పస్‌ ల్యుటియం శిధిలమైపోయి నాల్గవ దశ అయిన ఋతుస్రావం జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ కొత్త ఋతు చక్రం మొదలవుతుంది.

ఈ దశలు నెత్తురులోని ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్ల నిష్పత్తిని ప్రభావితం చేయడం వల్ల మెదడు ఉత్తేజితం చెందే స్థాయి ప్రభావితమవుతుంది. మూర్ఛ రోగులైన చాలామంది మహిళలలో వారి ఋతుస్రావ సమయంలో స్పృహ కోల్పోవడానికి దారితీస్తుంది. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ మెదడులోని కణాలను ఉత్తేజితం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రోజెస్టరాన్‌ హార్మోన్‌ మెదడు కణాలను జోకొడుతుంది. దీన్నిబట్టి శరీరంలో ఈస్ట్రోజెన్‌ పాళ్ళు, ప్రొజెస్టరాన్‌ పాళ్ళు పెరగడం, తగ్గడం అనే అంశం మీద నరాల వ్యవస్థ ఉత్తేజితం కావడం ఆధారపడి ఉంటుందన్నమాట. హార్మోన్లలోని మార్పులు యువతుల్లో సీజర్స్‌ను ప్రేరేపిస్తాయి. అమెరికాలో 3 లక్షల నుంచి 5 లక్షల మంది కటమినియల్‌ ఎపిలెప్సి రోగులున్నట్లు అంచనాలు చెబుతున్నాయి.

”ఎపిలెప్సి ఉన్న మెదడు విపరీతంగా ఉత్తేజితమైనప్పుడు దాని విద్యుత్‌ వలయాలు ఎక్కువగా గాడి తప్పడం వల్ల వ్యక్తి స్పృహ కోల్పోతాడు. కానీ, ఒకవేళ అతని మెదడులో ఎక్కువ స్థాయి దీర్ఘకాలిక నిరోధాన్ని ఉంచగలిగితే, విద్యుత్‌ వలయాలు మితిమీరి ఉత్తేజితమవవు. అప్పుడు ఆ వ్యక్తికి స్పృహ తప్పడం జరగదు” అని సాంబరెడ్డి గారు చెప్పారు.

నాడీ ఉత్ప్రేరకాలు (Neurosteroids) దీర్ఘకాలిక నిరోధానికి మధ్యవర్తిత్వం వహించే నాడీ ప్రవాహకాల (Neurotransmiters) కి మెదడు గ్రాహకాలు ఎక్కువగానో లేదా తక్కువగానో స్పందించేలా చేస్తూ నాడీ సంబంధిత ఉత్తేజిత లక్షణం దారి తప్పకుండా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

”ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ను శరీరం విడుదల చేసినపుడు అది మెదడుకి చేరి నాడీ ఉత్ప్రేరకంగా మార్పు చెందుతుంది. దీని పేరు అల్లో ప్రగ్న నొలోస్‌ (allopregnanolone). ప్రత్యేకించి మెదడులోని ఒకానొక రకపు గ్రాహకంతో అల్లో ప్రగ్న నొలోస్‌ గట్టిగా తగులుకొని ఉంటుంది. ఇలా ఆ గ్రాహకాన్ని బంధించిన అల్లో ప్రగ్న నొలోస్‌ గామా-అమైనో బ్యూటిరిక్‌ ఆమ్లమనే నాడీ ప్రవాహకానికి ఆ గ్రాహకాలు ఎక్కువ స్పందించేలా చేస్తుంది. గామా-అమైనో బ్యూటిరిక్‌ ఆమ్లాన్నే GABA అని కూడా అంటారని రెడ్డిగారు వివరించారు.

మెదడులో నిరోధాన్ని కలుగచేసే నాడీ ప్రవాహకంగా GABA పనిచేస్తుంది. అందువల్ల దీర్ఘకాలిక మూర్ఛ రోగంతో ఉన్నవారికి GABA చాలా కీలకమైనది. ఎప్పుడైతే మెదడులోని చాలా ఎక్కువ GABA గ్రాహకాలను GABA బంధిస్తుందో అప్పుడు మెదడులో విద్యుత్‌ వలయం నిరోధించబడిన స్థితిలో కొనసాగగలదు. ఫలితంగా వ్యక్తి తెలివి తప్పిపోవడం అనేది జరగదు. దీన్నిబట్టి ‘కటమినియల్‌ ఎపిలెప్పి’ ఉన్న మహిళలలో తెలివి తప్పిపోయే స్థాయిని తగ్గించడంలో వారి నెత్తురులోని ప్రొజెస్టిరోన్‌ హార్మోన్‌ కీలకమైనదని తెలుస్తోంది.

ఋతుస్రావ సమయంలో ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయి తగ్గి ఉంటుంది. కనుక అల్లో ప్రగ్న నొలోస్‌ స్థాయి తగ్గుతుంది. అందువల్ల నాడీ వ్యవస్థలో ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి విద్యుత్‌ లేదా రసాయన సంకేతాలను చేరవేసే ‘సినాప్సె’ నిర్మాణంలోని సినాప్టిక్‌ గ్రాహకాల సున్నితత్వం GABA పట్ల తగ్గిపోతుంది. దీని ఫలితంగా మెదడు ఎక్కువగా ఉత్తేజితమై, కటమినియల్‌ ఎపిలెప్సీ స్త్రీలు పలుమార్లు స్పృహ కోల్పోతారు.

”ఋతుచక్రంలోని ఋతుస్రావ దశ విషయానికి వస్తే అప్పుడు నాడీ ఉత్ప్రేరకం చాలా తక్కువగా తయారవడం వల్ల మెదడులో దీర్ఘకాలిక నిరోధం మాయమై నిరోధించుకోగలిగే స్థాయి తగ్గి విద్యుత్వలయం విపరీతంగా ఉత్తేజితమవుతుంది” అంటారు ఆచార్య సాంబరెడ్డి.

మెదడులో స్పృహ కోల్పోయేలా చేసి వలయాలను క్రమబద్దీకరించే హిప్పోకాంపస్‌ ప్రదేశంలో నాడీ ఉత్ప్రేరకాల తగ్గుదల వల్ల కలిగే ప్రభావాలను ఈ అధ్యయనంలో పరిశోధకులు పరీక్షించారు. దీర్ఘకాలిక లేదా నిరంతర నిరోధానికి మధ్యవర్తిత్వాలైన ఎక్స్‌ట్రా సినాప్టిక్‌ డెల్టా GABA – Aగ్రాహకాలను (extra synaptic delta GABA -A receptors) తీసివేసి, హిప్పోకాంపస్‌ ప్రదేశం స్పృహ తప్పిపోవడానికి ఏ మాత్రం లొంగుబాటును ప్రదర్శించగలదో తెలుసుకున్నారు. ఆ తరువాత ఋతుచక్రంలో అల్లో ప్రగ్న నొలోస్‌ వంటి నాడీ ఉత్ప్రేరకాల హెచ్చు, తగ్గులు, ప్రావాహిక స్థాయిలను కలిగిస్తూ చూశారు. నాడీ ఉత్ప్రేరకాలు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, తెలివి తప్పిపోవడంలో తీవ్రత, తెలివి తప్పిపోయి ఉండే కాలం రెండూ కూడా ఎక్కువైనట్లుగా వారి ఫలితాలు వెల్లడించాయి.

”దీర్ఘకాలిక నిరోధపు నాడీకణాల కోడ్‌ను మేము ఛేదించగలిగాము. విద్యుద్వలయాన్ని పెడదారి నుండి తప్పించే బలానికి మధ్యవర్తిత్వం జరిపే హిప్పో కాపస్‌లోని ఎక్స్‌ట్రా సినాప్టిక్‌ డెల్టా GABA-A గ్రాహకాలే ఋతుస్రావ సమయపు స్పృహ కోల్పోవడాన్ని నియంత్రిస్తాయి. దీంతో దీర్ఘకాలిక నిరోధాన్ని పెంచే నాడీ ఉత్ప్రేరక కారకాలతో కెటామినియల్‌ ఎపిలెప్సీకి వైద్యం చేయడమే ప్రధాన లక్ష్యంగా భావిస్తూ చేసే చికిత్సా ప్రయత్నాలకు తెర తీయడమైంది” అన్నారు నాడీ శాస్త్ర ఆచార్యులు, పరిశోధకులు అయిన డాక్టర్‌ సాంబరెడ్డి గారు.

ఈ పరిశోధనా పత్రంలోని ఫలితాలు పరిశోధనా స్థాయి నుంచి చికిత్సా ప్రయత్నాలను రోగి మంచందాకా తీసుకెళ్ళగలవని సూచిస్తున్నాయి. నాడీ ఉత్ప్రేరక కారకాలతో తక్కువ మోతాదులో ఇచ్చే పల్స్‌థెరపీ కెటామినియల్‌ సీజర్స్‌ని దుష్ప్రభావాలకు తావివ్వకుండా అదుపులో పెట్టగలదు. ”నా భార్య అస్వస్థతకి గూగుల్‌ని వెదుకుతూ అకస్మాత్తుగా మీ వెబ్‌సైట్‌ని చూశాను. మీరు అద్భుతమైన పరిశోధన చేస్తున్నారు. చికిత్సా ప్రయత్నాలు ఫలప్రదమై తొందర్లోనే అందుబాటులోకి వస్తాయి. నా భార్య, వేల మంది మహిళలు దీనివల్ల లాభాలు పొందుతారని నమ్ముతున్నాను” అని రెడ్డిగారికి ఓ ఆసామీ అంతర్జాల ఉత్తరం పంపాడు.

కెటామినియల్‌ ఎపిలెప్సీకి తగిన చికిత్సను అందుబాటులోకి తేవడం ఇంకెంతో దూరంలో లేదు. ఇరవై సంవత్సరాల అలుపెరుగని ఆచార్య దూదిపాల సాంబరెడ్డిగారి ఈ పరిశోధనకి National Institute of Health వారు పదమూడేళ్ళ పాటు నిరంతరంగా ఆర్థిక సహాయాన్ని అందించారు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.