ప్రజలే (మహిళలే) స్వాములు, బాబాల భరతం పట్టాలి! – పసుపులేటి రమాదేవి

 

మన దేశంలో వందల సంఖ్యల్లో పెద్ద బాబాలు, వేల సంఖ్యల్లో సన్నకారు బాబాలు, స్వాములు ఉన్నారు కదా? మరి అందరూ తేలు కుట్టిన దొంగల్లా గమ్మున ఉన్నారెందుకూ? ఒక్కరంటే ఒక్కరు కూడా డేరా బాబా దురాగతాల్ని ఖండించలేదెందుకూ? స్వాములూ, బాబాలూ ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌ అయ్యారెందుకూ? ప్రజలే నిజాలను గ్రహిస్తూ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చింది. నిజానికి బాబా కావడం ఒక వృత్తి. గొంగళి పురుగు సీతాకోక చిలుక అయినట్లు, కష్టనష్టాలకు ఓర్చి బాబాలూ, స్వాములూ అవుతున్నారు. వీవీఐపీలను ఆకర్షిస్తున్నారు. స్వామీజీ-బాబాజీ కావడం అంత తేలికైన పని కాదని తెలుస్తోంది. దానికెంతో సాధన అవసరం. మోసం, దగా, హత్య, దోపిడీల్లాంటివన్నీ అవలీలగా చేయగల నేర్పరితనం ఉండాలి. అది కళే! కానీ దగుల్బాజీ కళ. హంతకుడు, గుండా అయి ఉండి కూడా బయటి ప్రపంచానికి ఒక దేవదూతగా, ఆధ్మాత్మిక గురువుగా కనబడడం ఎంత కష్టం?

సంత్‌ రామ్‌పాల్‌, రామ్‌ రహీమ్‌సింగ్‌, ధీరేంద్ర బ్రహ్మచారి, చంద్రస్వామి, కంచి శంకరాచార్య లాంటి వారంతా అరెస్టయ్యారు. కొందరికి బాగానే శిక్షలు పడ్డాయి. ‘సంత్‌ రామ్‌పాల్‌, రామ్‌ రహీమ్‌ సింగ్‌లకు శిక్ష విధించడం కోర్టుదే తప్పని’ ఒక పార్లమెంటు సభ్యుడు సెలవిచ్చాడు. రాజ్యాంగాన్ని, దాని విలువలను పక్కన పెట్టి, మత విశ్వాసాల దృష్టితో చూసేవారికి కోర్టు తీర్పులు నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకే బాబాలను, స్వాములను మాత్రమే జైళ్ళకు పంపడం కాదు, వారికి సహకరించిన వారికి, వారికి మద్దతుగా నిలిచిన వారికి కూడా శిక్షలుండాలి. సహ నేరస్తులు తప్పించుకోకుండా జాగ్రత్తపడాలి. ఇటీవలి కాలంలో కోర్టులు బాబాలకు కునుకు పట్టనీయడంలేదు. మంచి పరిణామమే! అయినా, ఇంకా తీవ్రతరం చేయాల్సి ఉంది.

అఖారా పరిషత్‌ సెప్టెంబర్‌ 2017లో దొంగ బాబాల లిస్టును విడుదల చేసింది. అందులో మొదటి పేరు గుర్మిత్‌ డేరా బాబాది. రెండో పేరు రాధే మా ది. బెదిరింపులు, గృహ హింస, అక్రమాస్తులు కూడబెట్టిందని ఈమెపై ఆరోపణలున్నాయి. ఇటీవల మరో చెడు కారణంతో ఆమె వార్తలకెక్కింది. ఒక పోలీస్‌స్టేషన్‌ ఉద్యోగులంతా ఆమెను సగర్వంగా పోలీస్‌స్టేషన్‌కు ఆహ్వానించడమే కాక, అక్కడ డ్యూటీలో ఉన్న డీఎస్పీ ఆమెను తన కుర్చీలో కూర్చోబెట్టి పక్కన చేతులు కట్టుకుని నిలుచున్నాడు. అతను ఆమెకు భక్తుడైతే తన ఇంటికి తీసుకువెళ్ళి కాళ్ళు కడిగి సేవలు చేసుకోవాల్సింది. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఒక మహిళను తన సీట్లో కూర్చోబెట్టడమంటే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించడమే. ఇక లిస్టులో ఉన్న మూడో పేరు ఆశారాం బాపు. ఈయన జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. నాలుగో పేరు ఆశారాం బాపు తనయుడు నారాయణ సాయి. తండ్రి అంతడివాడే ఇతను కూడా. లైంగిక వేధింపు కారణంగా జైలు పాలయి బెయిల్‌పై బయటికొచ్చాడు. ఇక ఐదో పేరు రాంపాల్‌ది. అనేక ఏండ్లు జైలు శిక్ష అనుభవించాడు. సరైన సాక్ష్యాధారాలు దొరకలేదని ఇటీవలే విడుదలయ్యాడు. ఇంకా అతనిపై దేశ ద్రోహం కేసు, హింసను ప్రేరేపించిన కేసులు ఉన్నాయి. ఆరవ పేరు నిర్మల్‌ బాబా, ఏడు ఓం బాబా, ఎనిమిది సచిన్‌ దత్తా, తొమ్మిది ఇచ్ఛాచారి భీమానంద్‌, పది మల్కా సింగ్‌, పదకొండు ఆచార్య ఖుష్‌ ముని, పన్నెండు స్వామి అసియానంద్‌, పదమూడు బృహస్పతి గిరి, పధ్నాలుగు ఓం నమశ్శివాయ బాబా. వీరంతా అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందిన దొంగ బాబాలు, స్వాములు. ఇంకా ఇందులో చేరాల్సిన స్వాములు, బాబాలు చాలామందే ఉన్నారు. ఏ కారణం వల్లనో రాసలీల నిత్యానంద పేరు లిస్టులో రాలేదు. వీరంతా దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నా చేస్తున్న పనులు మాత్రం ఒక్కటే. వేల కోట్లు ఆర్జించడం, భూ కబ్జాలు, మహిళలను లైంగికంగా లొంగదీసుకోవడం, అడ్డు వచ్చినవారిని హత్య చేయించడం, బడా రాజకీయ నాయకులను, ఉన్నతాధికారులను తమవైపు తిప్పుకోవడం, వారికి సహాయపడడం, అవసరమైనపుడు వారి సహాయం తీసుకోవడం…

డేరా బాబా గురించి భయంకరమైన వాస్తవాలు బయటికి వచ్చాయి కాబట్టి, బాబాలు, స్వాములందరూ చేసేవి అవే పనులు కనుక ప్రభుత్వాలు తక్షణం అలాంటివారిపై దర్యాప్తు చేయించాలి. అందరినీ చట్ట పరిధిలోకి తేవాలి. అసలు మతం పేరుతో, దేవుడి పేరుతో, ఆధ్యాత్మికత పేరుతో జనాలను మోసం చేస్తున్న వారిపై నిర్ధాక్షిణ్యంగా దర్యాప్తు చేయాలి. అవసరమైతే చట్టమే చేయాలి. రోజూ వార్తల్లో ఇలాంటి వారి గురించి వింటూనే ఉంటాం. వీరి గురించి కవి వేమన ఎప్పుడో చెప్పాడు, ”కరకకాయలు తిని కాషాయ వస్తముల్‌/బోడి నెత్తి గల్గి బొరయు చుండ్రు/తలలు బోడులైన తలపులు బోడులా/విశ్వదాభిరామ వినురవేమ.” ఈ దేశానికి ఏమయ్యిందో మరి? రైతులు, చేనేత కార్మికులు, విద్యార్థులు, నిరుద్యోగుల ఆత్మహత్యల వార్తలు నిరంతరం వింటున్నాం, చూస్తున్నాం. కానీ ఒక్కనాడైనా బాబాలు, స్వాములు, మత పెద్దలు, చీకట్లు పంచే మూర్ఖ శిఖామణులు పొరపాటునైనా ఆత్మహత్యలు చేసుకున్నారా? చేసుకోలేదు. కేరళలో అమృత చైతన్య అనే ఆయన ఉన్నాడు. ఆయనకు భక్తురాళ్ళ బ్లూ ఫిల్ములు తీయడం హాబీ.

కొన్నేళ్ళ క్రితం కంచి మఠం పీఠాధిపతి స్వయంగా హత్య కేసులో అరెస్టయ్యాడు. అరెస్టు కాకుండా తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎంతోమంది వీవీఐపీలు ఆయనను రక్షించాలని చూశారు. అందుకే చెప్పేదేమిటంటే, నిందితులనే కాకుండా వారికి సహాయపడిన బడా బాబులకు సైతం కఠిన శిక్షలు పడాలి. ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకోవాలంటే ఆధ్యాత్మికతకు, రాజకీయానికి లింకు తెగాలి. కంచిలోని ఒక దేవాలయం ప్రాంగణంలో ఒక సీనియర్‌ అధికారి శంకరరామన్‌ హత్య కావడం దేశంలో సంచలన వార్త అయింది. కంచి జయేంద్ర సరస్వతికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు న్యాయవాది తేజ్‌పాల్‌ సింగ్‌ తులసి వాదించారు. ఈ కంచి స్వామి తనను తాను కాపాడుకోవడానికి ఆనాటి రాష్ట్రపతి వెంకట్రామన్‌తో సహా పలువురి సహాయం ఆర్థించాడు. ఫలితం దక్కలేదు. ఆయన అరెస్టు కాకుండా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు, తమిళనాడు పోలీసులు అడ్డుకున్నారు. మహబూబ్‌నగర్‌లో ఉన్న కంచి స్వామిని హెలికాఫ్టర్‌లో పూణే తీసుకువెళ్ళి అక్కడినుంచి విదేశాలకు పంపించేయాలని నాటి ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికవేత్త ఒకరు తీవ్రంగా ప్రయత్నించారు. విషయం అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి దృష్టికి వెళ్ళాక అరెస్టు జరిగింది. చట్టం తన పని తాను చేసుకోకుండా, అడ్డుపడే శక్తులను కూడా గుర్తించి శిక్షలు వేయాలని అంటున్నది ఇందుకే. సామాజిక వ్యవస్థలో జీర్ణించుకుపోయిన పెత్తందారీ విధానాలను కొనసాగిస్తూ పోతే, వాటికే సలాం కొడుతూ ఉంటే… దేశాన్ని ఆధునిక భారతంగా నిర్మించేదెలా? మతానికి, ఆచారాలకు విశిష్ట స్థానం ఉందని అనుకునేవారు, వాటిద్వారా మోసాలు, హత్యలు, గూండాగిరి చేయకూడదు కదా! రాజకీయ పార్టీలు ప్రజల ఉద్రేకాలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోకూడదు కదా! అందుకే జనం కళ్ళు తెరిచి వాస్తవాలు గ్రహిస్తూ ఉండాలి.

పూణేలో ఒక కొత్త స్వామి వెలిశాడు, అతను దిగంబరంగా ఉంటాడు. అతని లైంగిక అవయవాన్ని నుదుటికి తాకించుకున్న వారికి జీవితంలో తరగనంత లైంగిక సుఖం లభిస్తుందని ప్రచారం చేయించుకున్నాడు. అయితే భూరి విరాళం ప్రకటించిన వారికే ఆ అవకాశం లభిస్తుందన్నది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఇకనేం పిచ్చి జనం నమ్మారు. మూర్ఖపు యువకులు కదా! తొంభై ఏండ్ల వృద్ధులు కూడా లైనులో నిలబడుతున్నారు. దేశంలోని అనేక ప్రాంతాల నుండి జనం అక్కడ క్యూ కడుతున్నారన్నది తాజా సమాచారం.

కేరళలో సముద్రపు ఒడ్డున ఒక అమ్మాయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ తిరుగుతుండేది. అమె పేరు సంధ్యారాణి. కాలక్రమంలో ఆమె దేవత అయిపోయింది. మాతా అమృతానందమయి అంటే ఇప్పుడు చాలామందికి తెలుస్తుంది. ఇప్పుడామె కోట్లకు పడగలెత్తింది. భక్తులను వాటేసుకుని ముద్దు పెట్టుకోవడం ఆమె ప్రత్యేకత. అలా చేయడం వల్ల భక్తుల రోగాలు నయమవుతాయన్నది ఆమె ప్రచారం. అసలు విషయమేమిటంటే ఈమెకు రోగమొస్తే మాత్రం వెంటనే సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్ళి ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స చేయించుకుంటుంది. ఈమె ఏర్పరచిందే ‘అమృతా ట్రస్ట్‌’. ఆ ట్రస్టులో రూపొందబోయే మెడికల్‌ యూనివర్శిటీకి అమరావతి దగ్గర నేటి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 200 ఎకరాల భూమి కేటాయించింది.

ఒకాయన తనకు తాను ‘సైకో ఆస్ట్రాలజర్‌’నని ప్రకటించుకున్నాడు. వేదాల్లో ఉన్న ఆస్ట్రో సైకాలజీని పరిశోధించి కనుక్కున్నాడు. సరే బాబూ అలాంటిది వేదాల్లో ఎక్కడుంది కాస్త చెప్పు అనడిగితే ఉన్మాదిలా ఊగిపోయాడు. అంటే వాళ్ళు చెప్పే సొల్లు మాటలు వినడం తప్ప ఎవరూ ప్రశ్నించకూడదన్నమాట. ప్రశ్న వింటే వారికి వెన్నులో వణుకు వస్తుందన్నమాట!

మన దేశంలో వింతలూ, విశేషాలకు ఎప్పుడూ కొదవేలేదు. ఇటీవల గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఒక మహాద్భుతం జరిగింది. ఒక ముస్లిం యువతి శివస్వామి మహా సంస్థానంలో హిందూ మతం స్వీకరించింది. 23 లక్షలసార్లు గాయత్రీ మంత్ర జప పఠనం చేసి ఆమె తన మతం మార్చుకుంది. ఇక్కడ ఒక చిక్కు ప్రశ్న ఎదురవుతోంది. హిందువుల్లో ఉన్న వేల కులాల్లో ఈ యువతిని ఏ కులంలోకి తోస్తారు? ఇకపోతే సాధారణ మనుషులు దేవదూతలుగా ఎలా మారతారో కొద్ది రోజుల క్రితమే కరీంనగర్‌ జిల్లా లోయర్‌ మానేర్‌ డ్యాం దగ్గర ఒక యువకుడు ప్రత్యక్షంగా చూపించాడు. చదువు,

ఉద్యోగం లేని బేవార్స్‌గా తిరిగే అతను డబ్బును సులభంగా ఎలా సంపాదించాలని ఆలోచించాడు. ఎవరిదో ప్రైవేటు భూమిలో ఒక చెట్టు మొదట్లో కుంకుమ పోసి శిగం పూనినట్లు చెప్పడం మొదలుపెట్టాడు. సారాంశమేమిటంటే ఆ చెట్టు మొదట్లో సమ్మక్క-సారక్కలు వెలిశారని, వారికి అక్కడ గుడి కట్టాలని! జనం గుంపులు గుంపులుగా రావడం మొదలైంది. ఆ భూమి యజమాని పోలీసు రిపోర్టు ఇవ్వడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. యువకుడ్ని నాలుగు తన్ని అక్కడినుంచి పంపించారు. ఏ మాత్రం జాప్యం జరిగినా అక్కడో గుడి తయారయ్యేది. ఆ యువకుడు ఒక స్వామీజీ అయ్యేవాడు. పథకం విఫలమైందని శిగం పూనిన యువకుడు అక్కడ్నుంచి తోక జాడించాడు.

ఇలాంటివి చూసే కాబోలు ఒక యువకవి ఇలా రాశాడు.

”అజ్ఞానానికి పూజలు చేస్తాం

జ్ఞానాన్ని నడిరోడ్డులో చంపేస్తాం,

మేము మూర్ఖ మతోన్మాదులం

ప్రశ్నించడం చేతకాని సన్నాసులం

నిజాన్ని భరించలేని అజ్ఞానులం

మేము మూర్ఖ జాతీయులం!”

అసలు ఈ బాబాలు, స్వాముల బారినపడి ముందుగా మోసపోయేది, దగాపడేది మహిళలే. కావున మహిళలందరూ తప్పక చదివి వాస్తవాలను తెలుసుకుని మన చుట్టుపక్కల వారికి కూడా ఈ వాస్తవాలను తెలియచెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది.

(నవ తెలంగాణా దినపత్రికలో ప్రచురించబడిన డాక్టర్‌ దేవరాజు మహారాజుగారి వ్యాసానికి సంక్షిప్తీకరణ)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో