విశాలి -ఈటూరి పద్మావతీదేవి

 

విశాలి నా చిన్ననాటి స్నేహితురాలు. చాలా అందంగా ఉండేది. సాంప్రదాయ బద్ధమైన కుటుంబంలోంచి వచ్చింది. ఎక్కువగా పూజలు, పునస్కారాలు చేసేది. అయితే ఆ ఊళ్ళో 11వ తరగతి వరకే ఉండడం వలన అంతవరకు మాత్రమే చదివించారు. ఆ తర్వాత పై చదువులకి పట్టణం వెళతానని ఆమె ఎంతగా ప్రాధేయపడ్డా ఆమె తండ్రి అంగీకరించలేదు. ఏదో సంబంధం చూసి పెళ్ళి చేస్తాం, చదివింది చాలు అన్నారు ఆమె బామ్మ, తల్లి.

ఈ సమయంలోనే నాన్నగారికి ట్రాన్స్‌ఫర్‌ అయింది. మా నాన్నగారు ఆంధ్రాబ్యాంకులో మేనేజర్‌గా చేస్తుండేవారు. విశాఖపట్నం బదిలీ అయింది. నేను అక్కడే కాలేజీలో చేరి డిగ్రీవరకు పూర్తి చేశాను. ఆ తర్వాత మళ్ళీ మా నాన్నగార్కి ఢిల్లీ ట్రాన్స్‌ఫర్‌ అయి చాలా దూరం వెళ్ళిపోయాం.

విశాఖపట్నంలో ఉన్నంతవరకు అడపా దడపా విశాలి సమాచారం తెలుస్తూ ఉండేది. కానీ ఢిల్లీ వెళ్ళాక పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. నా పెళ్ళికి విశాలిని పిలవాలని ప్రయత్నం చేశాను. కుదరలేదు. తర్వాత నా పెళ్ళవడం, ఇద్దరు పిల్లలు పుట్టడం, తిరిగి మా వారికి హైద్రాబాద్‌లో పోస్టింగ్‌ రావడం… అలా అన్నీ వరుసగా జరిగిపోయాయి.

మధ్యమధ్య విశాలి గుర్తువచ్చేది. ఆ మధ్య పల్లెటూరు నుండి మా బామ్మని పలకరించడానికి తెలిసిన వ్యక్తి వచ్చాడు. అతని ద్వారా చూచాయగా కొన్ని విషయాలు తెలిసాయి. విశాలి ఎవరో కులంగాని వ్యక్తిని పెళ్ళి చేసుకుందని, ఆ చేసుకున్న వ్యక్తి కూడా మోసం చేశాడని, వాళ్ళ వాళ్ళు ఆమెని ఇంటినుంచి గెంటేశారని, ఎక్కడుందో ఎవరికీ తెలియదని చెప్పాడు. ఎంత ప్రయత్నించినా దాని ఆచూకీ తెలుసుకోలేకపోయాను. తరచుగా ఆమె గురించిన ఆలోచనలు చుట్టుముట్టేవి. ఆలోచిస్తే నాకంతా ఆశ్చర్యంగా, నమ్మశక్యం కాకుండా ఉంది. విశాలికి తల్లిదండ్రులంటే భయం, భక్తి ఉన్నాయి. కుటుంబ ఆచారాల పట్ల గౌరవం కూడా ఉంది. మరి ఇదెలా సాధ్యం? కాలం గడిచిపోతోంది. నాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. కవలలు. అమ్మాయి, అబ్బాయి. నాకు వాళ్ళతోటే లోకం. ఇంటిపని, పిల్లల పని, వాళ్ళ చదువు, శ్రీవారి బాగోగులు… ఇవి చూసుకోవడంతోనే నా కాలమంతా సరిపోయేది. విశాలిని గురించిన ఆలోచనలు అరుదుగా వచ్చేవి. ఆమె గురించి ఎటువంటి సమాచారం నాకు దొరకలేదు.

ఇటీవలే మా వారికి హైద్రాబాద్‌ ట్రాన్స్‌ఫర్‌ అయింది. ఈ విషయం తెలియగానే మొదట నా మదిలో మెరిసిన వ్యక్తి విశాలి. ఈసారెలాగైనా ఆమె అడ్రస్‌ సంపాదించి కల్సుకోవాలని నిర్ణయించుకున్నాను.

మా వారు స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో మేనేజర్‌. శ్రీనగర్‌ కాలనీలో మకాం. హైద్రాబాద్‌ వచ్చిన నెలరోజుల తర్వాత విశాలి గురించి వెదకడం మొదలుపెట్టాను. చాలా మారిపోయి ఉంటుంది. ఎలా ఉందో? ఏదైనా కష్టంలో ఉండి ఉండొచ్చునా? కనీసం నేనున్నాననే సంగతి కూడా దానికి గుర్తులేనట్టుంది. ఈ మహా నగరంలో ఎలా దాని ఆచూకీ తెల్సుకోవడం? మా వారితో అంటే తేలిగ్గా కొట్టి పారేశారు. ఇన్నేళ్ళ తర్వాత అసలు ఆమె హైద్రాబాద్‌లో ఉందో, లేదో, ఉంటే ఎక్కడ ఉందో, కేవలం పేరుపై వెదకడం వృధా ప్రయాస, అసాధ్యం అన్నారు. చేసేదేం లేక ఊరుకుండిపోయాను.

ఐతే, అనూహ్యంగా ఈ మధ్య ఒక సంఘటన జరిగింది. మా పనిమనిషికి జబ్బుగా ఉందని తెల్సి చాలాకాలంగా నమ్మకంగా పనిచేస్తున్నందువల్ల, ఎలా ఉందో తెల్సుకుందామని క్రిష్ణనగర్‌ వెళ్ళాను. ఆమె ఉండేది స్లమ్‌ ఏరియానే. అదొక సత్రంలా ఉంది. అనేక గదులు వరుసగా ఉన్నాయి. బయట కామన్‌ లెట్రిన్‌, బాత్రూంలు. మధ్యలో మండువాలా ఉంది. ఒక బోరు పంపు మధ్యలో మగాళ్ళు లుంగీలు పైకి కట్టుకుని సిగరెట్లు తాగుతూ కన్పించారు. ఆడాళ్ళు బట్టలు బోరు గట్టుపై ఉతుకుతూ, మరి కొంతమంది అంట్లు తోముతూ కన్పించారు. సరిగ్గా ఏడో నంబరు గది దగ్గరకు వెళ్ళాను. లోపలినుండి మూలుగు విన్పిస్తోంది. మా పనిమనిషి పేరు లక్ష్మి. భర్త ట్రాలీ నడుపుతాడు. క్రిష్ణనగర్‌లో షాబాదు బండల వ్యాపారం ఎక్కువే. ట్రాలీలకు గిరీకీ ఎక్కువే. అతను బాగా తాగుతాడని, తన జీతం డబ్బుతోనే ఇల్లు గడుస్తుందని లక్ష్మి చెబుతుంటుంది.

లక్ష్మి నేలతుక్కుపోయి ఉంది. జ్వరం తీవ్రంగా ఉంది. తలనొప్పి అంటూ మూలుగుతోంది. నాతోపాటు తెచ్చిన మాత్రలు ఇచ్చాను. మంచినీళ్ళ సీసా ఇచ్చాను. నన్ను చూసి ప్రయత్నం మీద లేచి కూర్చుంది. ‘అమ్మా మీరెందుకొచ్చారు? ఇక్కడ అంటు జ్వరాలు

ఉన్నాయి. కాస్త ఓపిక రాగానే పనిలోకి వస్తాను. మీరు వెళ్ళండి’ అంది.

‘జాగ్రత్త’ అంటూ చెప్పి ఇంటికి బయల్దేరాను. సందు మలుపు తిరుగుతుంటే ఒక స్త్రీ ఆకారం. అచ్చు విశాలిని పోలిన మాదిరిగా ఉంది. ఆటోని వెనక్కి తిప్పించి ఆమెను అనుసరించాను. ఆమె ఒక చిన్న రేకులషెడ్డు ముందర ఆగింది. ఇద్దరు పిల్లలు ‘అమ్మా’ అంటూ ఆమెని చుట్టుముట్టారు. చింకిరి గుడ్డలు, పీక్కుపోయిన మొహాలు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పెద్దదిగా ఉంది.

ఆమె పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. నేనూ ఆమెను అనుసరించాను. వెనక్కి తిరిగి నన్ను చూసి స్థాణువులా నిలబడిపోయింది. కళ్ళప్పగించి చూస్తూ ఉంది. విశాలి చాలా చిక్కిపోయి ఉంది. పల్చని చెక్కిళ్ళు, నుదుటి మీద కుంకుం బొట్టు, చవకబారు నైలాన్‌ చీర, మెళ్ళో పసుపుతాడు, చేతులకి ఎర్రటి మట్టి గాజులు. ఎలాంటి మనిషి ఎలా అయిపోయింది. నాకు తెలియకుండానే నా కళ్ళు చెమర్చాయి. ‘విశాలీ’ అన్నాను. ఆమె ఒక్కసారిగా తేరుకొని నా దగ్గరికి వచ్చి నన్ను వాటేసుకుని బావురుమంది. ఇన్నాళ్ళ దూరం తృటిలో ఎగిరిపోయింది. ”ఏంటే ఇలా అయిపోయావ్‌? ఏమైంది. ఈ పిల్లలెవరు?” చాలాసేపటివరకు విశాలి ఏమీ మాట్లాడలేకపోయింది. తర్వాత నాకు కూర్చోటానికి ఒక ప్లాస్టిక్‌ స్టూల్‌ ఇచ్చింది. తను ప్రక్కనే ఉన్న వెదురు బొంగులతో చేసిన మంచంపై కూర్చుంది. పిల్లలకి తినడానికి మరమరాల

ఉండలు ఇచ్చి ఆడుకోండని బయటికి పంపింది. ‘నీకు టీ ఇద్దామంటే పాలైనా లేవు పద్మా’ అంది. ‘ఫర్వాలేదులే, అసలు నీ పరిస్థితేంటి? అది చెప్పు ముందు’ అన్నాను. మధ్యమధ్యలో కళ్ళు తుడుచుకుంటూ క్లుప్తంగా చెప్పింది ఆమె జీవితం గురించి.

ఉస్మానియాలో ఎమ్‌.ఎ.లో చేరినపుడు, ఎవరో వ్యక్తితో పరిచయమయిందట. అతని పేరు శోభన్‌ అట. తనను పిచ్చిగా ప్రేమించాడట. ఆర్నెలు కల్సి తిరిగారట. గర్భవతి అయిందట. ఏదో గుళ్ళో పసుపుతాడు కట్టాడు. ఒకరోజు అకస్మాత్తుగా కొంతమంది ఇంటిపై దౌర్జన్యం చేశారంట. అతన్ని బాగా కొట్టారట. విశాలికి అప్పుడు తెలిసిందట, ఆ వచ్చింది అతని మొదటి భార్య తాలూకు బంధువులని. పెద్ద పంచాయితీ పెట్టారట. శోభన్‌ అన్న, వదిన ఇతని వైపు మాట్లాడారట. అతని భార్య అందరిపై పోలీసు కేసు పెట్టింది. పోలీస్‌స్టేషన్‌లో కేసు కాకుండా రాజీ కుదిర్చారట. శోభన్‌ పేరుపై కరీంనగర్‌లో ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంటిని మొదటి భార్యకు, ఆమె కూతురికి రాసిచ్చాడట. ఇద్దరు భార్యలతో సంసారం చేయమని, చెరొకరి దగ్గర నెల చొప్పున ఉండమని, శోభన్‌ సంపాదనలో సగ భాగం మొదటి భార్యకు ఇవ్వమని పరిష్కారం జరిగిందట.

అప్పటినుండి శోభన్‌ కొన్నాళ్ళపాటు అలానే ఉన్నాడట. ఈ లోపల తను ఆడపిల్లను ప్రసవించిందని, ఆ తర్వాత రాను రాను శోభన్‌ ప్రవర్తనలో మార్పు వచ్చిందని, క్రమేపీ తన దగ్గరికి రావడం తగ్గించేవాడని చెప్పింది. కానీ అనుకోకుండా రెండోసారి గర్భం వచ్చిందని, మగపిల్లాడు పుడతాడేమో అని గర్భం తీయించుకోవడానికి శోభన్‌ అంగీకరించలేదట. తను మొదట్లో ఏదో ముస్లిం స్కూల్లో టీచర్‌గా పనిచేసేదని, తర్వాత వాళ్ళు తీసేశారని, ప్రస్తుతం ఏదో మాల్‌లో పనిచేస్తున్నానని చెప్పింది. ఈసారి కొడుకే పుట్టాడు. కానీ శోభన్‌ బైక్‌ యాక్సిడెంట్‌లో చనిపోయాడని చెప్పింది. రెండు సంవత్సరాలు కనీసం తిండికీ, బట్టకీ మొహం వాచిపోయానని చెప్పింది.

శోభన్‌ది తమ కులం కాకపోవడం వల్ల ఆమె తల్లిదండ్రులు ఆమెను ఇంట్లోకి రానివ్వలేదట. నువ్వు మాకు చచ్చినదాంతో సమానం. నీకూ, మాకూ ఎలాంటి సంబంధం లేదన్నారట. పిల్లల్ని సాకడం, బడికి పంపడం తలకు మించిన పనైందట విశాలికి.

ఈ విషయాలు చెపుతుండగా మళ్ళీ దుఃఖం ముంచుకొచ్చింది ఆమెకి. తిరిగి భోరున ఏడ్చింది. ఆడుకోవడానికి వెళ్ళిన పిల్లలు తిరిగి వచ్చారు. వారికి ఏదో పచ్చడి కలిపి అన్నం పెట్టింది. అన్నం తిని పిల్లలు మళ్ళీ బయటికి వెళ్ళారు.

‘విశాలీ, మా ఇంటికి పోదాం రారాదూ’ అన్నాను.

‘తప్పక వస్తాను’ అని మళ్ళీ ఏదో చెప్పడానికా అన్నట్లు మొహం నావైపు తిప్పింది.

‘పద్మా! మరొక ఘట్టం ఉంది నా జీవితంలో. పరిస్థితుల చేతిలో కీలుబొమ్మనయ్యాను. ఒంటరిగా, వయసులో

ఉన్న నేను పదిమందికీ ఆటవస్తువుగా కనబడ్డాను. ఏదో రూపంలో నన్ను పొందాలని చూసేవాళ్ళు ఎక్కువయ్యారు’. విశాలి స్వరం మారింది. కొంత కసి, అసహాయత, బేలతనం కంఠంలో ప్రతిధ్వనించాయి. అయినా గంభీరంగా చెప్పింది. తొణకలేదు. పశ్చాత్తాపం లేదు. నిర్వేదంగా ఆమె నోటినుండి వెలువడ్డాయి ”నేనిప్పుడు వ్యభిచారిని” అని.

‘పద్మా! నాకు బాధగా లేదిప్పుడు. నా పిల్లలకి ఇంత అన్నం పెడుతున్నాను. కనీసం సర్కారు బళ్ళోకైనా పంపగలుగుతున్నాను. ఈ సమాజం మరిచిన వనితను నేను. తప్పో ఒప్పో తెలీదు. ఇంతకన్నా గత్యంతరం నాకు కన్పించలేదు. అవసరమున్నప్పుడు మాత్రమే వెళతాను’ అని చెప్పింది.

నాకెందుకో ఇక అక్కడ ఉండాలనిపించలేదు. మావారి విజిటింగ్‌ కార్డు ఆమె చేతిలో పెట్టి, ఎప్పుడైనా అవసరం వస్తే ఈ అడ్రసుకు రా అని ఆమె చేతిలో రెండు వేలు పెట్టి బయటికి వచ్చాను.

(ఈ కథ ఒక యదార్థ గాధ ఆధారంగా మలచబడింది. ఇందులో పేర్లు కల్పితాలు)

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో