నేనెప్పుడూ మౌనంగా లేను ఉద్యమాలతో మమేకమై ఉన్నాను రజిత అనిశెట్టి

 

మీ చిన్నప్పటి నుండి సాహిత్య ప్రవేశం, ఉద్యమ ప్రవేశం వంటివి స్పృశిస్తూ నేటివరకు మీ ప్రస్థానం, మీ అనుభూతులు, అనుభవాలు..

నేను అత్యంత వెనుకబడిన కుటుంబంలో పుట్టాను. ఇప్పుడు బిసిఎ అంటారు కదా! మా చిన్నప్పుడు అవేమీ తెలియవు. అటువంటి పరిజ్ఞానం లేని కుటుంబం మాది. నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా హనుమకొండ, వరంగల్‌ ప్రాంతమే. మా పూర్వీకులందరూ అక్కడే. 50, 55 సంవత్సరాల వెనుక కథ. మా మేనత్త చదువుకుని గవర్నమెంట్‌ టీచర్‌ ఉద్యోగం చేస్తుండడం వల్ల నన్ను ఇంగ్లీషు మీడియంలో, మా చెల్లెల్ని తెలుగు మీడియం బడిలోను వేశారు. తన పట్టుదల వల్లే చదువుకున్నాం నేనూ, మా చెల్లి. రోజూ మా మేనత్త నన్ను రిక్షాలో కాన్వెంటు బడికి తీసుకుని వెళ్ళేది. నన్ను దింపి, తను తన స్కూలుకి వెళ్ళేది. మళ్ళీ సాయంత్రం రిక్షా వచ్చి నన్ను ఎక్కించుకుని తన స్కూలికి వెళ్ళి, అక్కడి నుండి ఇద్దరం ఇంటి దారిపట్టేవాళ్ళం. చీకటి పడేది. మా ఇంటికి, స్కూలుకి 10 కి.మీ. దూరం. మొదట్లో రెండు మూడేళ్లపాటు స్కూలుకు వెళ్ళాలంటే చాలా ఏడ్చేదాన్ని. ఇంగ్లీషు మీడియం స్కూలు కదా, ఆవిధంగా నా ఇంగ్లీషు చదువుకి పునాది పడింది.

అక్కడ నుండి ఖాజీపేట ఫాతిమా గర్ల్స్‌ హైస్కూలుకి వెళ్ళాను. అక్కడ విభిన్న సామాజిక వర్గాల నుండి వచ్చే అమ్మాయిలు. ఇంజనీరింగ్‌ కాలేజి టీచర్ల, మెడికల్‌ కాలేజి డాక్టర్ల పిల్లలు, వారి రకరకాల నేపథ్యాలు. వారితో కలిసి చదువుకోవడం వల్ల ఆ స్థాయి, సంస్కారం గమనించడానికి అవకాశం దొరికింది. కొత్త ప్రపంచం తెలియ సాగింది. నేను పుట్టి పెరిగిన ప్రపంచంలో చదువులేని వాళ్ళు, నిరక్ష్యరాస్యులే ఎక్కువగా, మా యింట్లో. మా నాన్న, మా మేనత్త తప్ప అంతా పల్లెటూరి వాతావరణంలాగా ఉండేది. బడిలో ఎన్నో కొత్త విషయాలు. నాతోపాటు చదువుకుంటున్న అమ్మాయిలు చెప్పే కబుర్లు ఆశ్చర్యంతో వినేదాన్ని. వాళ్ళ క్యాంపస్‌లలో

ఉండే సంస్కృతి వేరు కదా. అలాగే ప్రతి శనివారం స్కూల్లో వాళ్ళు వేసుకునే బట్టలకి, నా బట్టలకి చాలా తేడా. వాళ్ళవి అత్యంత ఆధునికమైన రెడీమేడ్‌ ఫ్యాషన్‌ బట్టలు. ఆ షాపులు ఎక్కడుంటాయో మాకు తెల్వదు. నేను వేసుకునేవి సాధారణమైనవి. అవి కూడా రెండో, మూడో జతలు. మీ నాన్న ఏం చేస్తాడంటే ఏమీ చెప్పుకోలేని పరిస్థితి. మీరేంటిది అంటే చెప్పుకోవడానికి సిగ్గుతో కుంచించుకుపోయేదాన్ని. వాళ్ళు పెద్ద చదువులు, హోదాలు ఉన్న కుటుంబాల నుండి వచ్చిన పిల్లలు మరి. ఈ తేడా అనేది వర్గమా లేక కులమా తెలియదు కానీ చెప్పుకోవడానికి సిగ్గుపడడమనేది అప్పటినుండే తెలిసింది. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, మేము చాలా తక్కువ వాళ్ళం. వాళ్ళ ముచ్చట్లకి, మా ముచ్చట్లకీ చాలా తేడా ఉండేది. మేము వాళ్ళముందు ఏం చెప్పుకోవాలి అన్న భావన వెంటాడుతూనే ఉండేది.

ఆ రకంగా నా పదవ తరగతి చదువు ముగిసి, ఇంటర్మీడియట్‌లో చేరాను. వేషధారణ కానీ, భాషలో కానీ అక్కడ కొంత నాగరికంగా అయ్యాననుకోవాలేమో! బిఏ చదువుతున్నప్పుడు మా నాన్న 1979లో చనిపోయారు. దాంతో నాకు మెడపైన కాడిలా ఇంటి బాధ్యతల బరువునెత్తారు. అప్పటినుండి జీవితంలో మొండితనం, ఎదురీత మొదలైంది. మా ఇంటి చుట్టుపక్కల అందరూ మా కులం వాళ్ళే, కానీ పూర్తిగా నిరక్షరాస్యులు. మగవాళ్ళు రోజూ కూలీ పనులకు, ఆడవాళ్ళు వ్యవసాయం పనులకు వెళ్ళేవాళ్ళు. చదువుకున్న వాళ్ళు అప్పట్లో చాలా తక్కువ. అయితే వాళ్ళల్లో భార్యలను కొట్టడమనేది చాలా ఎక్కువగా ఉండేది. గృహ హింస దానిపేరు. మా ఇంట్లో కూడా నేను కొంత చూశాను. నేను కూడా చదువుకోనని ఏడ్చినందుకు చావు దెబ్బలు తిన్న రోజులున్నాయి. దాదాపు ప్రతిరోజూ చిన్నపిల్ల, కొట్టొద్దు అని, ఎవ్వరూ కలుగచేసుకున్న సందర్భాలు లేవు. పెద్దవారి పెత్తనం ఎక్కువగా ఉండేది. అలా హింస మీద వ్యతిరేకత, ప్రతిఘటించాలన్న భావన ఏర్పడింది. మా ఇంట్లో చూశాను, బయట ఇంకా ఎక్కువగా చూశాను. బాధితులు మా ఇంటికి వచ్చి ఆశ్రయం కోరడం, ఆ దెబ్బలు, గాయాలు, ఏడ్పులు చూసి నాలో, ఒక రకమైన కసి. వివాహ వ్యవస్థ మీద కూడా వ్యతిరేక భావాలు ఏర్పడ్డాయి. ఏముంది ఇందులో హింసే కదా అన్పించేది. దానిమీద అభిప్రాయం మార్చుకునే అవకాశం ఈ సమాజం నాకు ఏనాడూ ఇవ్వలేదు.

ఉద్యమాలలో ఊర్లు తిరుగుతున్నప్పుడు కూడా ప్రతిచోటా, నా మిత్రుల ఇళ్ళల్లో కూడా భార్యాభర్తల గొడవలు చూశాను. స్త్రీలు వీటివల్ల మానసికంగా క్రుంగిపోతున్నారు. ఒక తిట్టు తిట్టినా బాధేకదా! కొట్టడం ఇంకెంత హింస!! ఇవన్నీ నా అనుభవాలు… చిన్నప్పటినుండి ఇప్పటివరకు ఇదే చూస్తూ వస్తున్నాను. ఇంట్లో, బయటా వ్యవస్థలో ఎక్కడ చూసినా హింసే. దాంతో కుటుంబ – సామాజిక వ్యవస్థల పట్ల, వాటిలో ఉండే హింస పట్ల వ్యతిరేకత, నిరసన భావాలు ఏర్పడ్డాయి. క్రమంగా రాజ్య హింసను కూడా అర్థం చేసుకోవడం, వ్యతిరేకించడం మొదలుపెట్టాను.

ఉద్యమాలతో మీ పరిచయం ఎప్పటినుంచి, ఏ విధంగా జరిగింది? ఎందుకు పాల్గొనాలనిపించింది?

నా ఎరుకలో 1969లో మొదటిసారి ‘జై తెలంగాణ’ ఉద్యమం మొదలైంది. అప్పటికి నేను చాలా చిన్నపిల్లను. స్కూలుకి వెళ్తున్నాను. మొదట్లో ఆ జరుగుతున్న పరిణామాలను వింతగా చూసి, ఇంట్లో జరిగే చర్చలను వింతగా వినేదాన్ని. దానిపై ఏ మాత్రం అవగాహన లేదు. 1971 నాటికి కొంత అర్థమైంది. ఉద్యమం చివరి దశలో నేనూ పాల్గొన్నాను. దానికి కారణం ఇంట్లోవాళ్ళ ప్రోత్సాహం. నాన్న రాజకీయంగా అధికారంలో ఉన్న పార్టీలో ఉండడం వలన నన్ను, మా చెల్లెల్ని ఉద్యమంలో పాల్గొనమని ప్రోత్సహించారు. మౌలికంగా ఉద్యమ అంశాలపై అవగాహన లేకున్నా మేం కూడా పొద్దున్నే లేస్తూనే ఉద్యమంలో పాల్గొనడానికి వెళ్ళేవాళ్ళం.

20, 25 మంది అమ్మాయిలను పోగు చేసుకుని రోజూ ఏదో ఒక అంశంపై హన్మకొండ చౌరస్తాలో నిరసన ప్రదర్శనలు చేసేవాళ్ళం. నిరాహార దీక్షలు, ర్యాలీలు చేసేవాళ్ళం. ఈ క్రమంలో ఒకటి, రెండుసార్లు జైలుకి వెళ్ళడం, విడుదల కావడం జరిగింది. పెద్ద పెద్ద ర్యాలీలు, వేలమంది మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించిన మహిళా సభలు, సమావేశాల్లో పాల్గొనడం ఇవన్నీ మాకు ఉద్యమాల్లో పాల్గొనే విధానాన్ని నేర్పినట్లయింది. అయితే అప్పుడా ఉద్యమం నీరుగారిపోయింది. కొంతకాలంపాటు భయంకరమైన నిశ్శబ్దం, నిస్తబ్దం. ఎత్తు నుండి కిందపడిన భావన. తిరిగి మా చదువు కొనసాగింపు.

1975లో కాలేజీలో ఉన్నప్పుడు POW వాళ్ళు వరకట్న వ్యతిరేక ఉద్యమం రాష్ట్ర మంతా పెద్ద ఎత్తున నిర్వహించారు. దానిలో పాల్గొన్నా. సామాజిక పరిస్థితులే నన్ను అలా ఉద్యమాల వైపుకి లాక్కెళ్ళిపోయాయి, అయస్కాంతంలాగా. అసాంఘిక సమాజం పట్ల వ్యతిరేకత, కసి, బాధితుల పట్ల ప్రేమ ఇవన్నీ నన్ను ఆ వైపుగా ఆకర్షించాయి. డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ భుజానికి సంచి ఒకటి ఉండేది. దాంట్లో కరపత్రాలు పెట్టుకుని, అవి పంచుకుంటూ తిరిగేదాన్ని. ఏదో ఒక అంశం, ముఖ్యంగా మహిళలకు, హింసకు సంబంధించి రాయడం, ప్రింట్‌ చేయించడం, అందరికీ ఇవ్వడం. ఒక కార్యకర్తలాగా నేను తయారవుతున్నా.

అయితే ఇన్ని జరిగినా ఎప్పుడూ నేను ఏ పార్టీకి బద్ధురాల్ని కాలేదు. కాళోజీలా నాకు కూడా పార్టీవ్రత్యం లేదు. ఆయన ఏ పార్టీలోనూ నాయకుడూ కాదు, అనుచరుడూ కాదు. నాకూ పార్టీవ్రత్యం లేదు అని అనేవారు. అప్పట్లో నాకు తెలియదు కానీ అది విన్నాక నేనూ అంతే కదా అనిపించింది. ఆ రోజుల్లో అన్ని లెఫ్ట్‌ పార్టీలూ, ఉద్యమాలూ నన్ను వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించాయి. అలాగే కాంగ్రెస్‌ పార్టీ నుండి 30 ఏళ్ళ క్రితం మీకు పెద్ద స్థానం ఇస్తాము అంటూ నాకు పిలుపు. అప్పటికే 1982 నుండి ఆంధ్రప్రదేశ్‌ హేతువాద సంఘంలో ఉన్నాను. కత్తి పద్మారావు, ఎస్వీరావుల ఉపన్యాసాలవైపు ఆకర్షితురాలనై వారి సమావేశాలకు వెళ్ళడం మొదలుపెట్టాను. నా మార్గం ఏమిటన్నది కొంత స్పష్టత వచ్చింది.

నాకు పుస్తకాల దాహం ఎక్కువ. ఎవరైనా ఏదైనా కొత్త పుస్తకం పేరు చెబితే దాన్ని చదివేయాలని తాపత్రయం. అలా పుస్తకాలెన్నో తెచ్చుకుని చదివేదాన్ని, రూట్స్‌, స్పార్టకస్‌, పరిణామక్రమంలో స్త్రీ… ఇంకెన్నో. వీటిద్వారా నా ప్రపంచమంతా విస్తృతమైంది. అంతేకాక ఈ ‘సంఘం’ ద్వారా రాష్ట్రమంతటా తిరగడంతో వివిధ ప్రాంతాల అనుభవాలను తెలుసుకోవడం జరిగింది. హేతువాద సంఘర సమావేశంలో కూడా సంఘం సభ్యులయినా, కాని వారైనా స్త్రీలను (భార్యలు లేదా కుటుంబసభ్యులు) వెంట తీసుకుని రావడం, మగవాళ్ళు సమావేశంలో పాల్గొంటుంటే, వారి భార్యలు బట్టలు ఉతకడం, రాత్రి సమయాల్లో భర్తలకి టూత్‌ బ్రష్‌ల నుండి బట్టల దాకా అందించడం చూశాము. వాళ్ళని సమావేశాలకు వెంట తీసుకుని వచ్చేది ఇందుకా అనిపించేది. దాన్ని పాయింట్‌ అవుట్‌ చేశాము. ఆడవాళ్ళపై అత్యాచారాల మీద భీమవరం సభలో బొజ్జా తారకంగారు మాట్లాడుతుంటే ‘షేమ్‌’, ‘షేమ్‌’ అని అరిచాను. ఈ విషయాల్లో ఒక మిలిటెంట్‌లాగా ఉండేదాన్ని, నాకు నేనుగా స్వేచ్ఛావాదిగా ఉండాలనుకుంటాను. అలాగే మహిళలందరి స్వేచ్ఛ కూడా నాకు కావాలి.

స్వేచ్ఛ అనేది నాకు చాలా ముఖ్యం. స్వేచ్ఛ అనేది అందరికీ కావాలి. నాకూ, కాళోజీకి ఒక భావ సారూప్యత కనబడుతుంది. కాళోజీ మనిషి కవి. ఆయనపై రేడియోలో నేను ప్రసంగించాను. నేను, హేతువాద లక్ష్మి, కొండవీటి సత్యవతి ముగ్గురం అప్పుడే మంచి స్నేహితులం. అప్పటికి లక్ష్మి హేతువాద సంఘంలో ఉండేది. మా ముగ్గురి భావాలు ఒకటే. హేతువాద భావాలు, సామాజిక భావాలు, స్త్రీ హింసకు వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా… ఇవన్నీ మాకు చాలా చక్కగా కలిసిపోయాయి. అటు లక్ష్మి ఇటు నేను పురుషాధిక్యతవల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం.

ఈ దేశంలో ఎవరు దగాపడతారో వాళ్ళు దళితులు అన్నది నా అభిప్రాయం. మేము (నేను, లక్ష్మి) సామాజికంగా దళితులం కానప్పటికీ స్త్రీలుగా, దగాపడిన వారిగా దళితులమయ్యాము. ఏ ఉద్యమంలోనైనా మహిళలమంటే ఒక అంటరాని భావం ఉండే ఆనాటి సంఘ సమావేశాల్లో మహిళల కోసం ప్రత్యేక సెషన్లు నిర్వహించేలా చేసే స్థాయికి ఎదిగాము. మహిళల కోసం సెషన్లు పెట్టకపోతే నిరాహార దీక్షలు చేశాం. అలా ప్రతి ఉద్యమంలోను స్త్రీలకు ప్రత్యేక సభలు, సెషన్లు పెట్టించేలా మార్పు తెచ్చాం. ఒక ఉద్యమం, మరో

ఉద్యమం ఇలా ఎన్నో… ఇవన్నీ ఎంతో కొంత మార్పులకోసం ప్రయత్నం. మేము దళితులుగా పుట్టకపోయినా అంబేద్కర్‌ సంఘం, ఫూలే సంఘం, బౌద్ధ సదస్సులు, సమావేశాల్లో ఊరూరా తిరుగుతూ చాలాచోట్ల మాట్లాడుతున్నప్పుడు అసూయతో అక్కడి పురుషులు అదే వేదికలపై విసిరే వ్యంగ్యమైన మాటల్ని కూడా ఎదుర్కొన్నాం. ”మేము ఉద్యమాలలో పుట్టి, ఉద్యమాలలోనే ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాం, ఈ 20-25 సంవత్సరాల ఉద్యమాల్లో ఒక్క మహిళనైనా ఈ స్థాయికి తెచ్చారా” అని వాళ్ళకు సవాల్‌ విసిరి అక్కడినుండి విత్‌డ్రా అయ్యాం. ఎండనక, వాననక, తినీ, తినక, నిద్రపోక, ఊరూరా తిరుగుతూ, సమావేశాల్లో మాట్లాడుతూ ఎవరూ చెప్పని ఎన్నో కొత్త విషయాలు మాట్లాడుతూ ఒక నైతిక శక్తినిచ్చే సమాచారాన్ని అందించేవాళ్ళం. మా సభల తర్వాత జనంలో ఒక ఉత్సాహం కనపడేది.

ఈ పరిణామాల వల్ల ఆ వేదికల నుండి మేము విత్‌డ్రా అయినప్పటికీ, విభిన్న కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొనేవాళ్ళం. 1990లలో తెలంగాణా ఉద్యమం మళ్ళీ మొదలైంది. అప్పుడు జరిగిన సాహితీ సభలు, కార్యక్రమాల్లో పాల్గొన్నాను. బెళ్ళి లలిత హత్య అనంతరం నిరసన సమావేశాలెన్నో నిర్వహించాం. వరంగల్‌, నల్గొండ, కరీంనగర్‌లలో ప్రెస్‌ మీట్‌లు పెట్టి మాట్లాడాను. ఒక దశలో వరంగల్‌లో one man army లాగా నేనే ఇంటింటికీ వెళ్ళి ఒక మహిళ హత్య జరిగింది, మీ స్పందన ఏమిటని అడిగి, వాళ్ళ సమాధానాలను సేకరించి రిపోర్టు చేసి స్థానిక పేపర్లలో ప్రచురించడం, ప్రభుత్వానికి పంపించడం వంటి పనులు చేశాను. ఒక ఉద్యమ కార్యకర్త, సామాజిక కార్యకర్తలాగా నాకు నేనే పనిచేశాను. ఒక తెగింపుతో పనిచేసేదాన్ని. మహిళలు, దళితులు ఇలా ఎన్నో అంశాలపై ఒక్కదాన్నీ పనిచేసేదాన్ని. ఎవరైనా కలిస్తే సరే, లేదంటే నేనే చేసేదాన్ని.

1997లో ఒక పెద్ద టర్నోవర్‌ వచ్చింది. గోర్‌బాయి అయిన చంద్రు అనే యువకుడు భూపాలపల్లి ప్రాంతం తండాకు చెందినవాడు. చంద్రు ఖాళీ క్యాన్‌లు పట్టుకుని బస్టాండ్‌లో నిలబడితే, ఎక్సైజ్‌ పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి తీసుకుపోయి. భయంకరమైన చిత్రహింసలకు గురిచేసి, జైలులో ఒకరోజు పెట్టి అపస్మారక స్థితిలో MGM హాస్పిటల్‌లో చేర్చారు. అతని భార్య సమ్ము. 17 సంవత్సరాలుంటాయేమో. అమాయకంగా ఉండేది. భర్తని చూడడానికి హాస్పిటల్‌కి వచ్చింది. రాత్రి సమయంలో కాపలా ఉన్న కానిస్టేబుల్స్‌ ఆమెను నమ్మించి హోటల్‌కి తీసుకెళ్ళి, ఆ అమ్మాయి డబ్బులతోనే తిని, తిరిగి హాస్పిటల్‌ దగ్గర చీకటిగా ఉన్నచోట అత్యాచార ప్రయత్నం చేశారు. దాంతో ఆమె కొంత ప్రతిఘటించి, కొంత భరించి, జైలుదాకా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ ఆమెను రక్షించి, తెల్లారేదాకా ఉంచారు. సమాచారం తెలుసుకున్న ఆర్డీఓ గారు పరేడ్‌ పెట్టించారు. అందులో ఆమె వారిని గుర్తుపట్టింది. వెంటనే వారిని సస్పెండ్‌ చేసి, అరెస్ట్‌ చేయడం కూడా జరిగింది. ఈ లోపు చంద్రు చనిపోవడంతో ఆమె పట్టరాని దుఃఖంతో అతని శవాన్ని ఊరికి తీసుకెళ్ళిపోయింది. ఇందుకు నిరసనగా దళిత సంఘాల సభ్యులు చాలా కొద్దిమంది మా జిల్లా కలెక్టరేట్‌ ముందర నిరసన ప్రదర్శన చేశారు. అయితే, నేను దాన్ని అంత చిన్నగా ఎందుకు చేయాలి? సివిలియన్స్‌ అందరం కలిసి ఎందుకు రాజ్యహింసపై పోరాడకూడదు అని యూనివర్శిటీలో అందరికీ తెలియచేసి మీరు సహకరిస్తున్నారా? లేక నేను ఒక్కదాన్నే చేయనా అని ప్రశ్నించాను. అప్పుడు 20 సంఘాలతో కలిసి ఒక ప్రత్యేక న్యాయపోరాట కమిటీ వేసుకున్నాం. ఇది ఒక చారిత్రాత్మకమైన సంఘటన. మేము చంద్రుని నిర్బంధించిన సబ్‌జైలుకి వెళ్ళాం, వాళ్ళ తండాకూ వెళ్ళాం, ఇంటికీ వెళ్ళాం. ఆమె పరిస్థితి దారుణం. గుడిసె నుండి ఆకాశం కన్పిస్తోంది. అంత దయనీయమైన పేదరికం. తనతో మాట్లాడి, నిరసన ప్రదర్శనలు చేద్దాం రమ్మని చెప్పాం.

అయితే ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. ఎన్నోసార్లు ఇలా నిజనిర్ధారణ కోసం, ఇంకా ఇతర సందర్భాల్లో ఎంతోమంది దళిత బాధితులు దగ్గరికి వెళ్ళాం. అయితే ఎక్కడా కూడా వారిని చూసి, సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పి దీక్షలో పాల్గొనడానికి రమ్మని చెప్పి రావడమే కానీ, వారికి చేతిలో వంద రూపాయలు కూడా పెట్టే ఆలోచన ఎవరికీ ఉండదు. వాళ్ళని రమ్మని చెప్తే ఎలా వస్తారు? తినడానికి తిండి కూడా లేని పరిస్థితి వారిది. అలాంటి సందర్భాల్లో నేను మాత్రం ఎక్కడికి వెళ్ళినా అందరూ ముందుకు నడుస్తుంటే, నేను వెనుకకు తిరిగి వెళ్ళి వారి చేతిలో కొంత డబ్బు పెట్టి వచ్చేదాన్ని. 1977లో పత్తి రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నప్పుడు 50 గ్రామాలు తిరిగాం. అక్కడ కూడా బాధిత కుటుంబాల వారిని మీటింగులకి రమ్మంటే, మాకు బస్‌ ఛార్జీలు కూడా లేవనేవారు. అప్పుడు అనిపించేది – మనం చేసేదేమిటి? వారికోసం చేసే పోరాటంలో వారికి కావలసింది ఏర్పాటు చేయకపోతే ఎట్లా అని మధనపడేదాన్ని. గిరిజన అమ్మాయి (సమ్ము) వరంగల్‌ వచ్చి మా ఉద్యమ కార్యకర్తల ఇళ్ళల్లో ఉండేది. ఆ అమ్మాయితో రోజూ కలెక్టరేట్‌ ముందర ప్రదర్శన, నిరసన కార్యక్రమం చేసేవాళ్ళం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు వ్రాశాం. అదే సమయంలో ఆదిలాబాద్‌ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో బాలింతరాలైన ఒక (భారతీబాయి) ఆదివాసి మహిళపై కూంబింగ్‌ పోలీసులు నీచంగా ప్రవర్తించి, ఆమెను హింసకు, అవమానానికి గురిచేయడం జరిగింది. దానిపై ”వందేమాతరం! నీకిదే సన్మానం” అనే కవిత కూడా రాశాను. ఈ ఉదంతాన్నంతా ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, అన్ని కమిషన్లకు రాసి పంపించాం. పేపర్‌ క్లిప్పింగులు పెట్టి వీరిద్దరి ఘటనల పట్ల న్యాయం కోరాం. కానీ దారుణ స్థితి, ఎవరూ ఏ మాత్రం స్పందించలేదు.

సమ్ము కేసులో తొమ్మిది రోజులు ప్రదర్శన చేశాం. అదే సమయంలో మార్చి 8వ తేదీ వచ్చింది. ‘బ్లాక్‌ డే’గా డిక్లేర్‌ చేసుకొని కలెక్టరేట్‌ వరకు పెద్ద ర్యాలీ నిర్వహించాం. చివరికి అట్రాసిటీ కేసులో ఆమెకు రూ.1.25 లక్షల చెక్కు ఇచ్చారు. దాంతో ఆమెకు పాక్షిక న్యాయం జరిగినట్లే అని అనుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత పై నుంచి మాకు ఇదే సమాధానం వచ్చింది. ఇలాంటి ఘటనలు ఎన్నో, ప్రతిచోటా బాధితుల నిజమైన పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉండేది. ఈ అంశాన్ని నేను నాతోపాటు చాలామందికి అలవాటు చేశాను. బాధితుల దగ్గరికి ఊరికే వెళ్ళకూడదని, వారి పేదరికాన్ని గమనించి, ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం గురించి అర్థమయ్యేలా చేయగలిగాను. ప్రభుత్వంలాగా మనం కూడా ప్రవర్తించకూడదు కదా! నేను ఒక్కదాన్ని అయితే వంద, రెండువందలు మాత్రమే ఇవ్వగలను.

ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులను కుటుంబాలను కలుసుకునేందుకు ఒకసారి సిరిసిల్లకు వెళ్ళాం. ఒక కుటుంబంలో మగవాడు చనిపోతే, ఉన్న వాళ్ళు ఆ ఇంటి అద్దెలు కట్టలేక, తినడానికి తిండిలేక, అప్పులతో అవస్థలు పడుతున్న దుస్థితి. వారి బాధలో మమేకం కావడానికి వెళ్తున్నవాళ్ళం, మరి వారికి ఏలాంటి ఆర్థిక సహాయం చేయకపోతే మనమేం చేస్తున్నట్లు. అందుకని ఉత్తమాటలు కాకుండా ఈ పరిస్థితిని మార్చుదామని అందరికీ చెప్పాను. మన దగ్గరున్న కొంత మొత్తం వారికి ఇవ్వగలిగితే చిన్న ఉపయోగంగానైనా

ఉంటుందని నచ్చచెప్పాను. దాంతో అందరూ రూ.500, రూ.1000 చొప్పున ఇచ్చారు. అన్నీ కలిపి కొంతమందికైనా పంచగలిగాం.

సానుభూతి చూపించడం కన్నా సహాయం చేయడం మంచిది కదా. ఎక్కడికి వెళ్ళినా బాధితుల దగ్గరికి ఉత్త చేతులతో పరామర్శ చేసి రాకూడదు. వాళ్ళ గురించి రాసుకుని సంబరపడకూడదు. మానవత్వంతో వారికి ఏమైనా సహాయం చేయాలన్న సంస్కృతిని అలవాటు చేశాను. నచ్చని వాళ్ళు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. కులాన్ని కూడా వర్గం అధిగమిస్తుంది. ఆర్థిక స్థాయి ముందు అన్నీ చెల్లుబాటే. దిక్కులేని వారు, పేదలు, బాధితులు, దళితులకు ఒక స్థాయి రావాలంటే అది ఆర్థికస్థాయి పెంచడం ద్వారానే సాధ్యమవుతుందని నేను నమ్ముతాను. నేను కూడా ధనికురాల్ని కాదు. పుస్తకాలు చదివే నా అలవాటే నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చింది. రంగనాయకమ్మ, రావిశాస్త్రి, ఓల్గా గారు, సామాజిక అభ్యుదయానికి సంబంధించిన అనేక పుస్తకాలు, రష్యన్‌, చైనా, అనువాద సాహిత్యం… ఇవన్నీ చదివాక మానసికంగా చాలా మార్పు వచ్చింది. ప్రపంచం, సమాజం, కుటుంబం ఇవన్నీ ఏ విధంగా ఉంటాయో అర్థం చేసుకున్నాను. అప్పటినుండీ హింసను మూడు రకాలుగా అర్థం చేసుకుని పని చేయడం మొదలుపెట్టాను. కుటుంబం-సమాజం-రాజ్యంలో హింస వ్యవస్థీకృతమైందని తెలుసుకున్నాను.

మీరు చదివిన సాహిత్యం, మీరు ఉద్యమాల్లో పాల్గొనడం రెండింటికీ సారూప్యం ఉందా?

తప్పకుండా. నేను చదివింది, రాసింది నేను ఉద్యమాల్లో పాల్గొనేటప్పుడు, సాహితీ సభల్లో నేను మాట్లాడేటప్పుడు చాలా ప్రభావితం చేశాయి. కొన్నిసార్లు నన్ను కమ్యూనిస్టుగా ముద్ర వేయడం కూడా జరిగింది. 30, 40 సంవత్సరాల క్రితం నన్ను కొన్ని సంఘాల నుండి, వేదికల నుండి వెలివేయడానికి జరిగిన ప్రయత్నాల వల్ల వారికి నా వల్ల ముప్పు ఉందేమో అన్న భయం కారణమై ఉండవచ్చు. అయితే కమ్యూనిస్టు అనేది ఒక చట్రం కాదు. ఒక ఆచరణ.

మీ సాహిత్యం ఏ విధంగా ఉండేది?

కవిత్వం, కరపత్రాలు, ప్రెస్‌ రిపోర్టులు ఇలాంటివెన్నో. ఆర్టికల్స్‌ వ్రాసేదాన్ని. నేను చదివిన సాహిత్యం నన్ను ఈ వైపుగా చాలా ప్రభావితం చేసింది. అందుకే, కొన్నిసార్లు నేను చాలా ఇబ్బంది పడ్డాను. దీనికి తోడు 1979లో నాన్న మరణం, ఆర్థిక ఇబ్బందులు,

ఉద్యోగం లేకపోవడం బాధితులకు ఇంట్లో ఆశ్రయం ఇవ్వాల్సి రావడం, దీనికితోడు కమ్యూనిస్టునన్న ముద్ర, నన్ను దూరంగా ఉంచడం – ఇవన్నీ నన్ను విపరీతమైన ఒత్తిడికి గురిచేశాయి. అయితే, నా స్నేహితులు కొంతమందివల్ల నేను దాన్ని అధిగమించగలిగాను. వారంతా చాలా ఉన్నతస్థాయికి చెందినవారు, అయినా ఎంతో తోడ్పడ్డారు. నాకు తెలియకుండానే వారి స్నేహం నాకు ధైర్యాన్నిచ్చింది.

ఇప్పుడేమనిపిస్తుంది అవన్నీ తలచుకుంటుంటే…

ఒక మననం, విశ్లేషణ, సంయమనం, తెగువతో జీవిత పోరాటం చేసుకుంటూ సమాజ పోరాటం చేస్తున్నాను. నా జీవితంలో నిత్యం ఎదురీతే. చదువుకుంటూ ఒక మంచి కెరీర్‌లో స్థిరపడాలన్న ధ్యాస ఎప్పుడూ లేదు. పరీక్షల సమయంలో కూడా సమస్యలవైపు పరిగెత్తిన సందర్భాలున్నాయి. అలా అయినా బి.ఎ.లో, ఎం.ఎ.లో కూడా గోల్డ్‌మెడల్‌ సాధించాను.

నేను నాన్‌ టీచింగ్‌ ఉద్యోగంలో చేరాను. ఆస్తులు, బంగారం, ఫర్నిచర్‌ ఇలాంటి వాటిపై నా దృష్టి ఎన్నడూ లేదు. అట్టహాసాలు, ఆడంబరమైన జీవితం గడపాలని ఎన్నడూ ఆలోచించలేదు. నా కోసం నేను చేసుకోవడమనేది నాకెప్పుడూ అలవాటు కాలేదు. నా జీతంతోనే నా కుటుంబ సభ్యులు, బంధువులను చూసుకుంటూనే నా జీవితంలో సగభాగం గడిచిపోయింది. జనం చాలామంది చాలా సలహాలు ఇస్తారు. కానీ, జీవితమేమిటో నాకు తెలుసు. నేను వాటిని ఎప్పుడూ పట్టించుకోలేదు. నా జీవితం ఒక ఓపెన్‌ డైరీ.

మీరు వివాహ జీవితంవైపు వెళ్ళాలనుకోకపోవడానికి కారణం?

చిన్నప్పటి నుండీ నేను చూస్తున్న హింస వల్ల నేను విచలితమయ్యాను. చాలామంది నాకు సలహాలు, ప్రపోజల్స్‌ పంపారు. కానీ ఈ విషయంలో నేను ఎక్కడా రాజీ పడలేదు. ఎప్పుడైనా హాస్యంగా అనేదాన్ని – పెళ్ళి చేసుకుని పదిమంది పిల్లల్ని కంటే మన కల్చరల్‌ ట్రూప్‌లో సభ్యులకు కొరత ఉండేది కాదు కదా అని.

ఉద్యోగం, ఉద్యమాలు… రెంటికీ ఎలా సమయం కేటాయించేవారు?

సెలవు రోజుల్లో, ఉద్యోగ సమయాల తర్వాత పనిచేసేదాన్ని. అవసరమైతే ఉద్యోగానికే ప్రాధాన్యత ఇచ్చాను కూడా. ఎందుకంటే అందిరికీ నా గురించి తెలుసు కాబట్టి పని ఎక్కువగాలేని చోట నియమించడంతో నా సామాజిక జీవితానికి అవసరమైన సమయం చేసుకోగలిగేదాన్ని. ఏ ఆర్థిక ఆలంబనలేని నన్ను నా కుటుంబాన్ని రోడ్డున పెట్టలేదు.

మీ చెల్లెలు మీతోపాటు ఉద్యమాల్లో ఉన్నారా?

మాతోపాటే 1969లో జై తెలంగాణ ఉద్యమంలో తను కూడా పాల్గొన్నది. చదువుల తరువాత ఉద్యోగ, వైవాహిక జీవితంలో స్థిరపడింది. ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. పుస్తకాలు చదువుతుంది. తనకూ సామాజిక భావాలు ఉన్నాయి. కానీ కుటుంబం జీవనానికే ప్రాధాన్యత. నేనే కరడుగట్టిన మిలిటెంటులాగా అయ్యాను.

1971 తెలంగాణా ఉద్యమానికి, ఇప్పటి ఉద్యమానికి తేడా ఏంటి?

అప్పుడు విద్యార్థులు మాత్రమే ఉద్యమకారులు. మాలాంటి కొద్దిమంది మాత్రమే పార్టిసిపేట్‌ చేశారు. కానీ ఇప్పుడు బడి పిల్లల దగ్గర్నుండి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళతో సహా ప్రజలందరూ ఉద్యమంలోకి వచ్చారు. విద్యార్థులు, ఉద్యోగులు, గృహిణులు, రచయితలు, కళాకారులు, మేధావులు, అన్ని వర్గాల నుండి అందరూ ఉన్నారు. ఉద్యమంలో ప్రతి దశలో, ప్రతి రోజూ పార్టిసిపేట్‌ చేశాం. సాహిత్యం చాలా వచ్చింది. మేము ఎన్నో కవితలూ, పాటలూ రాశాం. నిరాహార దీక్షలు, బహిరంగ వంటావార్పులు, బతుకమ్మలు, ర్యాలీలు, సాహిత్య సమావేశాలు ఇలా అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఉద్యమ పరిధి బాగా పెరిగింది. నాడు ప్రభుత్వం చేసిన హత్యలు 360. నేడు రాజకీయాల వల్ల భంగపడి ఊపిరితీసుకున్న వాళ్లు 1000 మంది. అన్నీ ఉద్యమానికి ఆజ్యం పోశాయి. వాళ్ళ బలిదానాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేసాయి. పాలకుల మెడలు వంచాయి. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకున్నాయి. ఆకాశం కూడా హద్దు కాలేని త్యాగాలు ప్రజలవి.

మీ జీవితంలో మీకు చాలా తృప్తిగా అనిపించిన సందర్భం?

ఉద్యమాల్లో ఉన్నప్పుడు, ఉద్యమాల కోసం పనిచేయడమే పెద్ద తృప్తి, ఫలితం ఏదైనా. నేను నిశ్శబ్దంగా లేను. సమస్య వచ్చినపుడు ఒకవైపు నిలబడ్డాను. అదే నాకు తృప్తినిస్తుంది. ఒకవేళ నేను అందులో పార్టిసిపేట్‌ చేయకపోతే బాధ. కాళోజీ అంటారు – ‘మౌనం మహా కుట్ర’ అని. అలా నేను ఎప్పుడూ మౌనంగా లేను. ఏదో ఒక వైపు పనిచేశాను.

ఈ మధ్య ఆడపిల్లలపై హింస తీవ్రమౌతోంది. కారణం ఏమై ఉండవచ్చు? పరిష్కారం ఎక్కడ?

సమాజంలో పురుషుల ప్రవృత్తి వికృతంగా మారుతోంది. పూర్తిగా exploitation జరుగుతోంది. ముఖ్యంగా సినిమా, రాజకీయరంగాలు, స్త్రీల లైంగికత, స్త్రీల శరీరాలపై ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ఆ రంగాల్లోని వారు అదే సంస్కృతిలో ఉండి, స్త్రీలపట్ల అవాకులు, చెవాకులు పేలుతారు. ఈ రంగాల్లో స్త్రీలపై లైంగిక దాడి ఎక్కువగా జరుగుతుంది. దీనికి పరిష్కారం తిరగబడడం, పోరాడటం-సాంస్కృతిక విప్లవం కోసం.

ప్రస్తుతం వస్తున్న టీవీ సీరియల్స్‌… వాటి ప్రభావం, స్త్రీలను విలన్లుగా చిత్రీకరించడం – ఇదంతా పితృస్వామ్య భావజాలమే అంటారా?

స్త్రీలపై, సమాజంపై ముందస్తు దాడి, ఈ విధంగా స్త్రీలను విలన్లుగా చూపించడం పితృస్వామ్య కుట్రలో భాగమే. స్త్రీలను వికృతంగా చూపిస్తూ సొమ్ము చేసుకోవడం, ఆ విధంగా చేయవచ్చు అని బ్రెయిన్‌ వాష్‌ చేయడం వల్ల తిరిగి స్త్రీలమే బలిపశువులం అవుతున్నాం. మూఢనమ్మకాలను ఎగదోస్తూ, లేని దయ్యాల వ్యవస్థను సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. మృగాళ్ళను సృష్టిస్తున్నారు. వారి ప్రధాన లక్ష్యం సొమ్ము చేసుకోవడం. సమాజానికి ద్రోహం చేస్తూ మరింత పతనావస్థకి దిగజారుస్తూ, మానవ సంబంధాలను కలుషితం చేస్తున్నారు. పితృస్వామ్య భావజాలం వెర్రి తలలు వేస్తోంది.

మీడియా భావజాలంపై పెద్ద ఉద్యమం రావాలి. మహిళలతో పాటు పురుషులు కూడా ముందుకు రావాలి.

ప్రస్తుత విద్యావ్యవస్థ ఏ దశలో ఉందనుకుంటున్నారు?

కాలదోషం పట్టింది. ఈ చదువుల వల్ల సంస్కారం రావడం లేదు, కేవలం పరీక్షలు, ఉద్యోగాల కోసమే. సాహిత్యం చదివితే సంస్కారం వస్తుంది. కానీ ఆ సాహిత్యం చదువులకి అందడంలేదు, పనికి రావడం లేదు. మార్కులు, ర్యాంకులకే పరిమితమయ్యేలా

ఉన్నాయి నేటి చదువులు. సమాజం కంటే, కాలం కంటే ముందుండాల్సిన మనిషి వెనుకబడిపోయి ఆ మైలురాయి దగ్గరే ఆగిపోయాడు. అనాగరికత, హింస, క్రూరత్వం, స్వార్థం వంటివన్నీ ఉన్నాయక్కడ.

ప్రభుత్వం మనకి అన్నీ ఇవ్వదు, చట్టాలు తెస్తుంది, ప్రచారం చేయగలదు. కానీ ప్రజలు ఆచరించేలా చేయడం ఎలా? సమాజం స్త్రీకి ఆంక్షలు పెట్టింది. సంపూర్ణ ఎదుగుదలకు అవకాశం లేదు. మగవారికి మాత్రం విశృంఖల స్వేచ్ఛ నిచ్చింది. మనమే మార్పు తేవాలి. ఎదురీదాలి. సమాజంలో మార్పు తేవడమనేది అంత సులభమైన ప్రక్రియ కాదు. స్త్రీగా సమాజంలోకి అడుగుపెట్టాలంటే, నిప్పులు తొక్కడానికి, ఎదురుదెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండాలి.

ఆడపిల్లల్ని స్వశక్తివంతులుగా చేయాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి?

సావిత్రీబాయి ఫూలే, రమాబాయి అంబేద్కర్‌, చిట్యాల ఐలమ్మ జీవిత చరిత్రలు చెప్పాలి. స్కూలు, కాలేజిల్లో ఆడపిల్లలకు చాలా విషయాలను చెప్పాల్సిన అవసరం ఉంది. మగపిల్లలకు కూడా నేర్పించాల్సినవి, చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. సంకోచం, బిడియం, తక్కువతనం అనేది ఆడపిల్లలకు ఎందుకుండాలి? ఉండకూడదని నేర్పాలి. ఆత్మవిశ్వాసం కలిగించేలా మాట్లాడాలి. మేము కొన్ని ప్రత్యేక రోజుల్లో ఈ సెషన్స్‌ నిర్వహిస్తున్నాం. సర్వోదయ యూత్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో వైట్‌ రిబ్బన్‌ సివిల్‌ సొసైటీ ఫోరం సభ్యులం ఇందుకోసం పనిచేస్తున్నాం.

సమాజం కోసం పనిచేద్దాం రమ్మంటూ గత 30, 40 ఏళ్ళ నుండి వరంగల్‌లో నేను తొక్కని గడప లేదు. ఇంకా ఎంతో సైన్యం తయారు కావాల్సి ఉంది.

భూమికతో మీ సాన్నిహిత్యం గురించి….

భూమిక పుట్టినప్పటి నుండీ ఇప్పటి వరకూ మహిళల అంశాలను ప్రస్తావించడానికి మంచి వేదికగా భూమిక నిలిచింది, నిలుస్తున్నది. నేను మొదటి నుండీ భూమికతో ఉన్నాను. 1998లో సంపాదక వర్గ సభ్యురాలిగా కూడా ఉన్నాను. రచయిత్రుల వేదికల్లో పాల్గొంటున్నా. భూమిక తెలుగు మహిళలకు ఒక రాజకీయ, సామాజిక వేదిక అయ్యింది. స్త్రీవాద ఉద్యమానికి బలాన్ని చేకూరుస్తోంది.

మొదటి నుండీ భూమికలో ఉన్న మహిళాంశాల ట్రెండ్‌ నిరంతరం కొనసాగుతోంది. ఇంకా విస్తృతమైంది. మగవాళ్ళు కూడా వ్రాస్తున్నారు. ఇలాగే బాధితుల పక్షాన, స్త్రీల పక్షాన, సమాజం పక్షాన నిలబడి, సాహిత్యంలో మరింత ముందుకు వెళ్తుందని నమ్ముతున్నాను. విరివిగా సాహిత్య పాఠశాలలు నిర్వహించాలి. Refresher courses లాగా వర్ధమాన రచయిత్రులకు సాహిత్య శిక్షణ ఇవ్వాలి వారికి. సరైన మార్గదర్శనం ఇచ్చేలా ఉండాలి. భాషా వ్యక్తీకరణల నైపుణ్యాలు పెంచాలి. భూమిక 1997లో నిర్వహించిన కథా సదస్సులాగా కథ, కవిత్వం, నవల, పాట వంటి అంశాలపై సాహిత్య పాఠశాలలు నిర్వహించాలి. ఇప్పటికీ భూమికను ఇతరులకు పరిచయం చేస్తూనే

ఉన్నాను. నా చందా ఠంచనుగా కడుతున్నాను.

నేను ఎవరిని కలిసినా, ఎక్కడికి వెళ్ళినా నాతోపాటు భూమిక ప్రతులు తీసుకెళ్ళడం, మిత్రులందరికీ భూమికని పరిచయం చేసి చందా కట్టమనడం, ఒక్కోసారి నేనే వాళ్ళ తరపున చందా కట్టడం వంటివి చేస్తున్నాను. భూమికకు చందాలు రెగ్యులర్‌గా కలెక్ట్‌ చేసి కట్టడం, ఒక దశలో ఇంటింటికీ వెళ్ళి సేకరించడం కూడా చేశాను. భూమికతో నా స్నేహం 25 ఏళ్ళుగా కొనసాగుతున్నది.

మీ భవిష్యత్‌ ఆలోచన/ కార్యక్రమాలు?

నేను సామాజిక ఉద్యమాలలో మమేకం కావాలనే. అంతేకాక సమూహాలను కూర్చడంపై దృష్టి పెడుతున్నాను. కలిసి ఆలోచించ గలిగేలా, ప్రణాళిక చేయగలిగి ఆచరించేలా చేయడంపై పనిచేస్తున్నాను. నలుగురు కలిసి ఒకే అడుగు ముందుకు వేయడానికి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రయత్నంలో ప్రస్తుతం ఉన్నాను. నేను నడుస్తున్న నా దారి ఏమిటి? ఎక్కడికి? అందరినీ కలుపుకుని ముందుకు పోవాలనే ఆశయం.

మనకు తెలియని మన చరిత్ర లాంటి మరొక చారిత్రాత్మక పరిశోధన జరగాలి. సాహిత్యం రావాలి. మేము నారీ చైతన్య వేదిక ద్వారా అశ్లీలత, వరకట్నం వంటి అంశాలపై పనిచేశాం. అయితే, నాతో కలిసి పనిచేసిన స్నేహితులకు వారి వారి కుటుంబాల నుండి వ్యతిరేకత ఎదురైంది. దాంతో నేనొక్కదాన్నే కొనసాగాల్సివచ్చింది.

సమాజంలో అన్యాయం అనిపించిన ప్రతి విషయాన్నీ ఎదిరిస్తూ వచ్చాను. కానీ, ఈ క్రమంలో స్నేహితులు, సాహితీ మిత్రులందరూ వివిధ దశల్లో దూరమయ్యారు. నేనొక్కదాన్నే మిగిలాను. కానీ కొనసాగించాను. మనం తప్పుకున్నామే అని వాళ్ళే రిగ్రెట్‌ అవ్వాలి. ఎప్పుడూ ముక్కుసూటిగానే, గాయమైనా తుడుచుకుంటూనే ముందుకు సాగాను. అప్పటికీ, ఇప్పటికీ నేనెప్పుడూ కూడా ఎక్కడా రాజీ పడలేదు. ఒక్కోసారి నాకే అన్పిస్తుంది ఇంత తెగువ ఏంటి అని.

ఉదాహరణకు న్యాయ పోరాట కమిటీలో ఉన్నప్పుడు బాధితులకు న్యాయం జరగడంలేదని అనిపించినప్పుడు నేను భరించలేక అందులోంచి బయటకు వచ్చేసినా కానీ నేను అందులో ఉన్నాననుకుని నా దగ్గరికి ఇంకా కొంతమంది బాధితులు వచ్చేవారు. అలాంటిది ఒకటి లైంగిక వేధింపు ఘటన నా దగ్గరికి వచ్చింది. దాన్ని నేను పరిష్కరించగలిగాను. కానీ ప్రతిక్షణం ఏదో ముప్పు వెంటాడుతున్నట్లు అనిపించేది. ఎందుకంటే, అందులో నేరస్థులు రక్షణ శాఖలో పెద్ద ఉద్యోగులు. నా జీవితంలో చాలా పెద్ద వ్యవస్థను ఢీ కొన్నట్లే అయ్యింది. ఇలాంటివి చాలా జరిగాయి. నేను పంపించిన సమాచారం చాలా వరకు పేపర్లలో వేసేవారు, కానీ, ఒక్కోసారి ఈ వార్తను ప్రచురిస్తే దీనివల్ల మీకే ఇబ్బంది అని హితవు పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.