సాహిత్య చరిత్ర రాసిన మహిళను నేనొక్క దాన్నే- ముదిగంటి సుజాతారెడ్డి

 

మీ బాల్యం గురించి…

నేనొక సాహిత్య వాతావరణం లేని కుటుంబంలో పుట్టాను. మాది వ్యవసాయ కుటుంబం. నల్లగొండ జిల్లా నుంచి వచ్చాను. కమ్యూనిస్టు పార్టీకి పెట్టింది పేరు అప్పుడు. మాది ఆకారం గ్రామం, నకిరేకల్‌కి దగ్గరగా ఉంటుంది. అమ్మ వెంకటమ్మ, నాన్న రాంరెడ్డి. ఇంట్లో సాహిత్య చర్చలు కానీ, సాహిత్య అంశాలను మాట్లాడటం కానీ అసలే లేదు. ఎవరూ చదువుకోలేదు. మాది పేరుకు భూస్వామి కుటుంబం, కానీ డబ్బు అంతగా ఉండేది కాదు. తెలంగాణాలో అందరూ అంతే. పేరుకు వందల ఎకరాల భూమి ఉన్నా, ఇక్కడి వాతావరణం పంటలకు అనుకూలం కాదు. పండినా అక్కడికక్కడే సరిపోతాయి. నేనేమీ బడికి పోయి చదువుకోలేదు. 5, 6 ఏండ్ల వయస్సు వచ్చేసరికి తెలంగాణాలో రజాకార్ల ఉద్యమం అప్పుడే మొదలైంది. చాలా అల్లర్లు, అత్యాచారాలు, హింసలు.

మీరు చిన్న వయసులోనే రజాకార్ల ఉద్యమం చూశారా?

రజాకార్ల వల్ల మా చదువులు పాడైపోయాయి. మా కుటుంబం భయపడి ఆంధ్ర ప్రాంతానికి తరలిపోయారు. 10 నెలల వరకూ అక్కడే ఉండి తిరిగి వచ్చాం. అప్పటికి కూడా జిల్లాలో ఇంకా శాంతి లేదు. అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. అందుకని వరంగల్‌లో అమ్మమ్మ దగ్గర కొన్నాళ్ళు ఉండి తిరిగి నల్లగొండ పట్టణానికే వచ్చాం, కమ్యూనిస్టులు మా ఊరిలోని బంగళాను కూలగొట్టారు. ఇల్లులేక ఊరికి వెళ్ళలేదు. ఇక్కడ పట్టణంలో పిల్లల్ని చదివించాలన్న ఆలోచన మొదలైంది. హైదరాబాద్‌లో కొత్వాల్‌ వెంకట్రామిరెడ్డి హాస్టల్‌ పెట్టడం వల్ల ఊళ్ళ నుండి ఆడపిల్లలు హైదరాబాద్‌కు వచ్చి చదువుకునేవారు. అప్పట్లో అది ఒక ఉద్యమంగా సాగింది. చదువు అవసరమనే అభిప్రాయం ఏర్పడింది కాబట్టి అందరం చదువుకునే వీలు కలిగింది.

నేను బి.ఎ. ఫస్టియర్‌ వరకు నల్లగొండలో చదువుకున్నాను. అప్పుడు నాకు ముదిగొండ గోపాలరెడ్డి గారితో వివాహమైంది. మా మామగారు ఆర్యసమాజ ఉద్యమానికి ఆకర్షితులై ఆర్య సమాజంలో చేరారు. కాబట్టి మా పెళ్ళి ఆర్య సమాజ సాంప్రదాయంలో జరిగింది. అదొక మలుపు నా జీవితంలో…

అప్పట్లో ఇంట్లో దానిపై ఏమైనా చర్చలు జరిగాయా?

అంటే వాళ్ళు మా బంధువులే. కానీ మా మామగారు ఆర్య సమాజ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఇద్దరు పిల్లల్ని హరిద్వార్‌ పంపించి సంస్కృత విద్యను అభ్యసింపచేశారు. మా వారు ఎం.ఎ సంస్కృతం కదా అని మా బంధువుల నుండి కొంత వ్యతిరేకత వచ్చింది. సంస్కృతం అంటే ఏమిటో తెలియాలి కదా! తెలుగే ఏమీ తెలియదు, అది బ్రాహ్మణులు చదివే భాష అన్న భావన ఉండేది. కానీ తర్వాత ఒప్పుకున్నారు.

నా భర్త 1961లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృతం లెక్చరర్‌గా చేరారు. విశేషమేమిటంటే అప్పటివరకూ యూనివర్శిటీలో కేవలం ఉత్తర భారతీయులు, మరాఠీలే సంస్కృత అధ్యాపకులుగా ఉండేవారు. తెలంగాణాలో అంటే మంథెన, ధర్మపురి వంటి చోట్ల తెలుగువారు సంస్కృతం చదివినవారు ఉన్నా, కాలేజీలో చెప్పగలిగే స్థాయికి ఉన్నవారు ఎవ్వరూ లేరు. తెలంగాణా నుంచి మొట్టమొదటి సంస్కృత ఆచార్యులు ఆయనే. ఆ తర్వాత యూనివర్శిటీలో జర్మన్‌ శాఖ వచ్చింది. మా వారు జర్మన్‌ భాష నేర్చుకున్నారు. అప్పటివరకూ నేను కూడా హైదరాబాద్‌లో బి.ఎ.లో మిగిలిన రెండు సంవత్సరాలు పూర్తిచేసి ఉస్మానియా యూనివర్శిటీ నుండి తెలుగులో ఎం.ఎ చేశాను. అంటే నాకు చదవాలనే అభిరుచి ఉండేది. సామాన్యంగా ఆడపిల్లలు పెళ్ళి కాగానే చదువులు ఆపేసేవారు. కానీ నాకు చదువుకోవాలనే ఇష్టం ఉండేది. కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు, కాబట్టి చదువుకున్నాను.

1963లో అమ్మాయి, 65లో అబ్బాయి పుట్టారు. మా వారు 1966లో జర్మనీ వెళ్ళారు. నేను తర్వాతి సంవత్సరంలో పాపను తీసుకుని జర్మనీ వెళ్ళాను. అప్పట్లో జర్మనీ వెళ్ళడానికి వీసా లేదు. టికెట్‌ కొనుక్కుని వెళ్ళిపోవడమే. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కొన్ని దేశాలకు నేరుగా వీసా లేకుండా జర్మనీ వెళ్ళడానికి అనుమతినిచ్చారు. అందులో భారతదేశానికి కూడా అనుమతి ఉంది.

మేము జర్మనీలో మూడు సంవత్సరాలున్నాం. ఈ లోపు మా వారు జర్మనీలో ఎం.ఏ పూర్తిచేసి ట్యుబింగన్‌ యూనివర్శిటీలో సంస్కృతం, హిందీ చెప్పడానికి చేరారు. అది ఇండాలజి శాఖ అన్నమాట. నేను కూడా ఊరికే ఎందుకుండాలని ఇండాలజి విభాగంలో పౌల్‌ థీమె అనే ఒక ప్రొఫెసర్‌ దగ్గరికి వెళ్ళాను. ఆయన చాలా గొప్ప పండితుడు. జర్మన్‌, సంస్కృత భాషను అధ్యయనం చేసిన వారిలో ప్రముఖులు, చివరి పండితులు కూడా ఆయనే. ఆయన సంస్కృతంలో మాట్లాడేవారు. కాశీ వచ్చి చదువుకుని, వ్యాకరణం నేర్చుకుని పరిశోధనలు చేసిన వ్యక్తి. నేను ఊరికే ఉన్నాను కదా అని లైబ్రరీలో ఓరియంటల్‌ శాఖలో సంస్కృత పుస్తకాల కేటలాగింగ్‌ చేయమని ఆయన నన్ను నియమించారు. వాళ్ళు చరిత్రకి, పరిశోధనకి సంబంధించిన చాలా పుస్తకాలు ఉత్తర భారత ప్రెస్‌ నుండి కొనేవారు. అంతకుముందే చాలా పుస్తకాలు ఉన్నాయి, అవి ఇంగ్లీషులో ఉండేవి. అవి చేస్తున్న క్రమంలో నేను వాటిని చదివాను. కొత్త విషయాలు చాలా తెలిశాయి. వీటన్నింటినీ తెలుగులో ఎందుకు చేయకూడదన్న ఆలోచనతో వాటిని ఒక నోట్సులో వ్రాసుకున్నాను.

మేము 1969లో ఇండియా వచ్చేశాము. ఓడలో మూడు వారాలు పట్టింది. అప్పుడే ఫ్రాన్స్‌ గొడవలలో సూయజ్‌ కెనాల్‌ మూసేశారు. కాబట్టి ఆఫ్రికా దేశాలన్నీ చుట్టి బొంబాయి వచ్చాము. అదే సమయంలో తెలంగాణా ఉద్యమం వచ్చింది. తెలంగాణా ఏర్పాటు కోసం ఉద్యమం చాలా ఉధృతంగా జరిగిన నేపధ్యంలో కాలేజీలన్నీ మూసేశారు. ఊర్లో దాదాపు సంవత్సరంపాటు ఉన్నాము. అంతకుముందే గ్రామీణ జీవితంపై నాకు కొంచెం పరిచయం ఉండేది. వ్యవసాయం, ఇతర వృత్తులు, గ్రామీణ పద్ధతులు ఇవన్నీ తెలుసు. ఈ సంవత్సరం పాటు అక్కడ ఉండేసరికి గ్రామీణ జీవితంపై అనుభవం పెరిగింది. నాకు గ్రామీణ వాతావరణంతో ఉన్న పరిచయం వల్ల నా రచనల్లో అది ప్రతిబింబిస్తుంది. ’70ల్లో నేను హైదరాబాద్‌లోని రెడ్డి కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా చేరాను.

మీరు తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్నారా?

మేం తెలంగాణా ఉద్యమంలో పాల్గొనలేదు. అప్పుడే వచ్చాం కదా! అప్పటికే ఉద్యమం సాగుతోంది. మేము అక్కడ

ఉన్నప్పుడు మాకు ఇక్కడి సమాచారమేమీ తెలియదు. కుటుంబసభ్యులు కూడా ఎవరూ పాల్గొనలేదు. నాన్న అప్పటికే పెద్దవారయ్యారు. ఊర్లోనే ఉండేవారు.

మీ ఉద్యోగం, అనుభవాలు?

30 ఏళ్ళు లెక్చరర్‌గా చేశాను. డిగ్రీ, పీజీ క్లాసులకు చెప్పేదాన్ని. క్లాసులకు ప్రిపేర్‌ కావడం, నోట్సులు వ్రాసుకోవడం, అందులో భాగంగా పుస్తకాలు చదివేటప్పుడు కొత్తకొత్తగా వచ్చే ఆలోచనలు, భావాలను వ్యాసాలుగా వ్రాసి పత్రికలకు పంపేదాన్ని. వేమన-నాధ సాంప్రదాయం, అద్యతన దృష్టి, రస చర్చ… ఇలా ఆ వ్యాసాలన్నింటినీ పుస్తకంగా తీసుకొచ్చాను. ముందు నేను ఎక్కువగా పరిశోధన, విమర్శ వ్యాసాలమీదనే దృష్టి పెట్టాను. వాటినే పుస్తకాలుగా వేశాను. నా థీసిస్‌, శ్రీనాధుని కవితా సౌందర్యం, ఇలా విమర్శకు సంబంధించిన పుస్తకాలు రావడంవల్ల నా పేరు ఎక్కువగా యూనివర్శిటీలలోనే వినిపించేది, రచయిత్రిగా బయటకు వచ్చేది కాదు.

కథలు బాగా చదివేదాన్ని. ఇంగ్లీషు, హిందీలో కూడా కథలు బాగా చదివేదాన్ని. తర్వాత నాకు కథలు వ్రాయాలని ఉండేది. అలా ’95లో కథలు వ్రాయడం మొదలుపెట్టాను. మొదట మలుపు తిరిగిన రథచక్రాలు అనే నవల వ్రాసాను. 1946 నాటి తెలంగాణా సాయుధ పోరాటానికి సంబంధించిన ఇతివృత్తాన్ని తీసుకున్నాను. నాకు కొద్దిగా పరిచయం, చిన్నప్పటి అనుభవం ఆధారంగా అప్పటి తెలంగాణా ప్రజల బాధలను సబ్జక్టుగా తీసుకున్నాను. తర్వాత కమ్యూనిస్టు పార్టీకి చెందిన దేవులపల్లి వేంకటేశ్వరరావు అనే ఉద్యమ వీరుడు వ్రాసిన పుస్తకం కూడా చదివిన తర్వాత వీటన్నింటినీ నవలా రూపంలో పెట్టాను. అందులో అర్ధగర్భితంగా ప్రేమ వృత్తాంతం, ఆకర్షణ గురించి చెప్పాను. అది కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకి నచ్చలేదు. కొంతకాలం తర్వాత ప్రజాశక్తి వాళ్ళు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల గురించిన పుస్తకాల సమీక్షను మొదలుపెట్టారు. అందులో నా నవల ఉండాలా వద్దా అని తర్జనభర్జన జరిగింది. వాళ్ళ రచనల్లోని పాత్రలు ఎక్కువగా

ఉద్యమాల గురించి, పార్టీ గురించి మాట్లాడతాయి, కానీ నా నవల అలాకాదు. ఉద్యమం ఎలా జరిగింది, దానివల్ల ప్రజల జీవితం ఏ విధంగా ఉండేది అనేది వ్రాశాను. ప్రజలంతా ఏకమై కలిసి గడీల మీదకు వెళ్ళడం, ఆయుధాలు పట్టుకుని గడీలను కూలగొట్టడం వంటి రెండు, మూడు వృత్తాంతాలు చాలా వివరంగా వ్రాశాను. అది ఎలా జరిగిందో నేను చూశాను కదా, నాకు పరిచయమే. చాలా వివరంగా వర్ణించాను. అలాంటివి వారి రచనల్లో లేవు. మరి అది నిజమైన చరిత్ర కదా! చేకూరి రామారావుగారు నా నవల చదివారు. చాలా బాగుందన్నారు. అందరూ ఉద్యమం గురించి వ్రాస్తారు, కానీ ఆ ఉద్యమం ఎలా జరిగింది, ఏ రూపంలో జరిగింది అని ఎవ్వరూ చెప్పలేదు. మీ నవలలో ఆ వర్ణన ఉంది అన్నారు. ఆఖరికి ప్రజాశక్తిలో నా నవలను తీసుకుని దాని గురించి వ్రాసారు.

తర్వాత మరో విశేషం ఏమిటంటే, పోరాటాలు గురించి ఆడవాళ్ళెవరూ రచనలు చేయలేదు. తెలంగాణా సాయుధ పోరాటం ఇతివృత్తాన్ని తీసుకుని పది, పన్నెండు రచనలు వచ్చాయి. కానీ అందులో నేను తప్ప ఇంక స్త్రీలెవరూ లేరు.

ఉద్యమాల్లో స్త్రీలు పాల్గొన్నా ఎవరూ వారి గురించి వ్రాయలేదు. అక్కడ కూడా అణచివేత ఉందంటారా?

అవును. పార్టీలో ఉండకూడదు, డెన్స్‌లో ఉండకూడదు. ఉన్నా వంట మాత్రమే చేయడం, ఎవరన్నా గాయాలయితే సేవ చేయడం వంటి పనులే చెప్పేవారు. చిన్నవాళ్ళయితే ఉత్తరాలు చేరవేయడం, కొరియర్‌ అన్నమాట. నా ఫ్రెండ్‌ ఒకామె అలాంటి పనే చేసింది. తర్వాత ఆరుట్ల కమలాదేవి, స్వరాజ్యం లాంటివి వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, తుపాకి పట్టినవాళ్ళు

ఉన్నారు. అయితే వారు తమ గురించి ఏమీ రాయలేదు. కానీ వారి జీవితాల గురించిన రచనలు ఒకటి, రెండు వచ్చాయి.

ఉద్యమ ప్రభావం మీ జీవితంపై, మీ ఆలోచనపై ఏ విధంగా ఉంది? అధికారం ఉండీ లేనితనం ఏ విధంగా ఉంది?

ఉద్యమం గురించిన పరిచయం ఉండడం, మేము కూడా ఒకప్పుడు భూస్వాములుగా ఉండి, ఉద్యమాల తర్వాత ఏమీ లేనివాళ్ళం అయ్యాం కదా! అంటే ఊర్లో దొరలుగా ఒక అధికారంలో ఉండి దాన్ని రుచి చూశాక, అది లేనివాళ్ళుగా అయ్యే క్రమం, పరిణామం గురించి నా నవల్లో చెప్పాను.

చిన్నతనం నుంచి చూశాను కదా! ఒకవైపు రజాకార్ల ఉద్యమం, మరోవైపు కమ్యూనిస్టు ఉద్యమం. వీటి మధ్య చంపుతారేమోనన్న భయానికి భూస్వాములంతా ఊరు విడిచి వెళ్ళిపోయారు. కొత్త స్థలానికి పోతే, ఒకటి – డబ్బు లేదు, నగదు రూపంలో లేదు. కేవలం బంగారం. దాన్ని మార్చుకుని వాడుకోవడమే. రెండవది – కిరాయికి ఇల్లు తీసుకోవడం. నైజాం నుంచి వచ్చారు అనగానే ఇల్లు దొరికేది కాదు. ఒకవేళ దొరికితే ఎక్కువ కిరాయికి ఇచ్చేవారు. అవి కూడా చిన్న చిన్న ఇళ్ళు. పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఉన్న అనుభవం, ఆడ బాపలుండేవారు. అన్ని పనులు చేసేవారు. అక్కడికి వెళ్ళాక చేతికింద ఎవరూ లేరు. గిన్నెలు తోమడం దగ్గర్నుంచి అన్నీ చేసుకోవాలి. అదంతా దుఃఖం కదా! మా అమ్మను చూశాను అలా. ఈ మధ్యలో పిల్లలు. మేము ఆరుగురం ఉన్నాం. అక్కడికి వెళ్ళాక మా అమ్మ ఒక కొడుకుని కన్నది. తర్వాత నల్లగొండ వచ్చినా మేనమామల ఇంట్లో ఉండడం.

పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు సుభద్ర అభిమన్యుడిని తీసుకుని కృష్ణుని దగ్గరకి ఎలాగైతే వచ్చిందో అలాగ. అది కూడా దుఃఖమే. మన ఇల్లు కాదన్న భావన. ఉన్న బంగారం అమ్ముకోవలసి రావడం. ఇలా, చాలా అనుభవించాము. పని చేయడం అలవాటు లేదు.

మా బాపు (నాన్న) ఉర్దూ చాలా బాగా వ్రాస్తారు. తహసీల్దారుగా ఉద్యోగం ఇస్తామన్నా, వ్యవసాయాన్ని తానొక్కరే చేయవలసిన కారణంగా తీసుకోలేదు. అలా చేసినా కొంత ఆర్థికంగా బాగుపడేవాళ్ళం. పిల్లల్ల పెళ్ళిళ్ళు కష్టమైంది.

మీ అమ్మగారు వీటన్నింటినీ ఎలా తట్టుకున్నారు?

అప్పట్లో 8 ఏండ్లకే పెళ్ళిళ్ళు అయ్యేవి. పది, పన్నెండేళ్ళకు కాపురానికి రావడం, పిల్లలు కలగడం జరిగేది. అయితే, మా నానమ్మ, తాతమ్మ కూడా ఉండేవారు. మా తాతమ్మ అన్నీ చూసుకునేవారు. ఆవిడకి చాలా ధైర్యం. మేమంతా వెళ్ళిపోయినా ఆవిడ ఊర్లోనే ఉన్నారు. ఊర్లో కొట్టాలు ఉండేవి, వాటిలో ఉండేవారు. ఇదంతా చాలా కష్టం. అందరూ ఒకచోట ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవారు,

ఉద్యమం వల్ల చెల్లాచెదురై వేర్వేరు చోట్లకి వెళ్ళిపోవడంవల్ల వచ్చాక ఉమ్మడి కుటుంబాలు విడిపోయాయి. అందుకే చదువులు కూడా ఉండేవి కాదు. వీథి బడిలో చదువులే.

ఇదంతా అయ్యాక నల్లగొండకి తిరిగి వచ్చాక ఒకేసారి నాల్గవ తరగతిలో చేరాను. పదవ తరగతిలో మేము పదిమంది అమ్మాయిలం ఉండేవాళ్ళం. వారిలో నేనొక్కదాన్నే సెకండ్‌ క్లాస్‌లో పాసయ్యాను. చదువుకునే వాతావరణం లేని కారణంగా చవివే పరిస్థితులు ఉండేవి కాదు. అంతంత మాత్రంగానే పాసయ్యేవారు. ఇప్పట్లాగా 90, 95 మార్కులు వచ్చేవి కావు.

మీ స్నేహితులు, నేపథ్యం, చదువు వాతావరణం…

నా స్నేహితులు రకరకాల నేపథ్యం. కొందరు ఆంధ్ర నుండి, ఒకరిద్దరు ఉద్యోగాలు చేసేవారి పిల్లలు. కొంతమంది మాలాగా ఊర్ల నుంచి వచ్చినవారు, ఒకరిద్దరు ముస్లింలు. మేము చదువుకునేటప్పుడు వేరే చర్చలు ఏవీ ఉండేవి కావు. ఎంతసేపూ చదువుకోవడం, ఆడుకోవడం అంతే. మాపై మా హెడ్‌మిస్ట్రెస్‌ ప్రభావం ఎక్కువగా ఉండేది. ఆవిడ లైబ్రరీకి చాలా పుస్తకాలు, అనువాద పుస్తకాలు తెప్పించేవారు. ప్రేమ్‌చంద్‌, శరత్‌ వంటి బెంగాలీ రచయితల అనువాదాల వంటివి, బాగా చదివేదాన్ని. నాకు చదవడం అంటే చాలా శ్రద్ధ ఉండేది. మొగలాయి దర్బారు, అడవి బాపిరాజు కథలను స్కూల్‌ మ్యాగజైన్‌కి రాసేదాన్ని. అడవి బాపిరాజు అంటే ఇష్టంగా ఉండేది. ఇప్పటికీ ఇష్టమే.

మీ రచనా వ్యాసంగం ప్రచురణ వరకూ ఎలా సాగింది…

నేను పియుసిలోనే గోల్కొండ పత్రికకు చిన్న చిన్న వ్యాసాలు పంపేదాన్ని. పత్రికలకు ఎలా పంపాలో తెలియదు. అడ్రసు తెలియదు. ఇంట్లో సాహిత్య వాతావరణం లేకపోతే చాలా కష్టం. ఆడపిల్లలకు ఇంకా కష్టం నాకు అనుభవమే కదా! చిన్న చిన్నగా నా అభిరుచిని పెంచుకున్నాను. నేను 90నుండి వ్రాయడం మొదలుపెట్టాను. మలుపు తిరిగిన రథచక్రాలు వ్రాసినప్పుడు దాన్ని ఎవరైనా సీరియల్‌గా ప్రచురిస్తారా అని అడిగాను. ముఖ్యంగా ఆంధ్రప్రభ, చాలా పాప్యులర్‌ ఆ రోజుల్లో. కానీ ఎవరూ వేయలేదు. విశాలాంధ్ర ప్రసాదరావు గారికి చూపించాను. ఆయన చూసి దీన్ని దాశరధి రంగాచార్య గారికి చూపించమని చెప్పారు. రంగాచార్య గారు నా నవలని మెచ్చుకుని, తెలంగాణా సాహిత్యం ఎవరూ సీరియల్‌గా వేయరు, తెలంగాణా భాష ఉంటుంది కదా. మీకు మీరే ప్రచురించుకోవాలి అన్నారు.

అప్పటినుంచి నా రచనలన్నీ నాకు నేను ప్రచురించుకుంటున్నాను. ఇదివరకు ఇప్పటిలా పబ్లిషర్స్‌ కూడా లేరు. నిజానికి నాతోనే ఎవరికి వారు ప్రచురించుకోవడం అనే సాంప్రదాయం కూడా మొదలైందేమో. కధావస్తువు, భాష తెలంగాణా కాబట్టి ఎవరూ ప్రచురించడానికి ముందుకు రాలేదు. బహుశా రంగాచార్య గారికి కూడా ఇటువంటి అనుభవం ఉండే ఉంటుంది. అందుకే అలా సలహా ఇచ్చారేమో. ఆయనకే దేశోద్ధారక గ్రంథమాల అనే పెద్ద ప్రచురణ సంస్థ ఉంది. 1955లోనే వట్టికోట ఆళ్వార్‌స్వామి వ్రాసిన ప్రజల మనిషి నవలను ప్రచురిస్తూ చాలా భయం భయంగా ప్రచురిస్తున్నాను అని వ్రాసుకున్నారు. భయమెందుకనే ప్రశ్న మనకు, అంటే పాఠకులు ఈ సబ్జెక్టును రిసీవ్‌ చేసుకుంటారా అనే భయం. ఆ భయం తెలంగాణా రచయితలకు ఇప్పటికీ ఉంది. తెలంగాణా రాష్ట్రోద్యమానికి మూలం కూడా ఇదే.

అలా నేనే నా నవలలను అచ్చు వేసుకుంటున్నాను. కొంతవరకు అమ్ముడుపోయాయి. విసుర్రాయి వంటివి రెండవ ఎడిషన్లు కూడా వచ్చాయి. అది చాలా పాప్యులర్‌ అయ్యింది. దానిపై అవార్డులు కూడా వచ్చాయి.

ఇప్పటికీ రాస్తున్నారా?

ఇప్పటికి కొద్దిగా తగ్గింది కానీ వ్రాస్తున్నాను. లేటెస్ట్‌ పుస్తకం 2014లో అద్యతన దృష్టి, ఈ మధ్యవి, పాతవి కలిపి విమర్శ వ్యాసాలు. తర్వాత సాహిత్య మధనం 2016 నాటిది. మరొకటి సాహిత్య పరామర్శ. ఇవన్నీ నా పుస్తకాలు, వ్యాసాలు, కథలు, వాటిపై వచ్చిన అభిప్రాయాలు, లేఖలు, సమీక్షలు, పరామర్శలు వాటి సంకలనాలు. విసుర్రాయి గురించి చాలా ఉన్నాయి.

ఇంకొక విశేషమేమిటంటే, నేను ఎంఏ విద్యార్థులకు చెప్పేదాన్ని. నాకు సాహిత్య చరిత్ర ఇచ్చారు. చాలాకాలం వరకు అది చెప్పడంతో, ఆ అనుభవంతో చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర అని రాశాను. ఇది ప్రస్తుతం 3వ ఎడిషన్‌ వస్తోంది. ఇది బాగా పాప్యులర్‌ అయింది. పోటీ పరీక్షలకు కూడా ఉపయోగిస్తున్నారు.

మరో విశేషం… గంగప్పగారి అల్లుడు ఆంధ్ర సాహిత్య చరిత్ర వ్రాసిన వారందరి విశేషాలు ప్రచురించాడు. అందులో అందరూ మగవాళ్ళే. ఇన్ని యూనివర్శిటీలలో ఇంతమంది మహిళా ప్రొఫెసర్లు ఉన్నారు. కానీ ఎవరూ సాహిత్య చరిత్ర వ్రాయలేదు. అందరిలోనూ నా పేరు ఒక్కటే స్త్రీ రచయిత్రిగా వచ్చింది. ఇప్పుడు వచ్చే 3వ ఎడిషన్‌ను తెలుగు సాహిత్య అకాడమీ వారు ప్రచురిస్తున్నారు. వారు దీన్ని తెలంగాణ కోసం వ్రాయమని అడిగారు. ఇందులోనే కుతుబ్‌ షాహి యుగం చేర్చి కొన్ని మార్పులు చేసి మన సాహిత్య చరిత్ర పేరుతో తీసుకుని వచ్చాను. అది కూడా అప్పటికప్పుడే 3వ ఎడిషన్‌ వచ్చింది. అలా సాహిత్య చరిత్ర వ్రాసినవారిలో ఆడవారిలో నేనొక్కదాన్నే, మరెవ్వరూ స్త్రీలు లేరు. కారణం ఎందుకో మరి…

మీ రచనలలో ఆడబాపల గురించి వ్రాసారు కదా! వారి సామాజిక నేపథ్యం వివరిస్తారా?

మలపు తిరిగిన రథచక్రాలు నవలలో ఆడబాపల గురించి రాసాను. అందులో ప్రధాన పాత్ర స్నేహితురాలు ఆడబాప. గడిలలో అమ్మాయిలుంటే వారికి ఆడబాపలు ఉండేవారు. వారికి కుటుంబ జీవనం ఉండేది కాదు. గడీలలోనే పెరిగేవారు. ఎలా మొదలైందంటే మనుష్యులే మనుష్యులను పీక్కుని తినేంత కరవు వచ్చింది. అప్పుడు పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లల్ని అమ్ముకునేవారు. మగవాళ్ళయితే ఏదైనా పని చేస్తారు. అందుకని ఆడ పిల్లలను ఇచ్చి ధాన్యం పట్టుకెళ్ళేవారు.

గడిలోనే వారి జీవితం. గడిలోని వాళ్ళతోనే సంబంధం, పిల్లలు పుడితే వారు కూడా గడిలోనే ఉండేవారు. ఎక్కడో కొన్ని చోట్ల వారికి పెళ్ళి జరిగేది. చాలా కొంతమంది మాత్రమే బయటకు వెళ్ళేవారు.

మొట్టమొదటిసారి ఒక కొత్త ఒరవడిని సృష్టించారు కదా! అది మీకెలా అన్పిస్తోంది?

నేను వ్రాశాను. ఇంతవరకెవ్వరూ రాయలేదు. మాది దక్షిణ తెలంగాణా. అక్కడ కమ్యూనిస్టు ఉద్యమం, నక్సలిజం వచ్చాక ఆడబాపలు దాదాపుగా లేరు. అందరూ వెళ్ళిపోయారు. మా అత్తవారిది ఉత్తర తెలంగాణలోని కరీంనగర్‌. మేము మొదటిసారి కరీంనగర్‌ పెళ్ళి అయ్యాక వెళ్ళినప్పుడు అక్కడ ఇంటీరియర్‌ ప్రాంతాలలోని మామగారి స్నేహితులైన వెలమదొరల వద్దకు వెళ్ళాం. అక్కడ వారింట్లో ఇంకా ఆడబాపలున్నారు. నాకు చాలా ఆశ్చర్యమేసింది. ఇక్కడ మా దగ్గర చూస్తే ఆడబాపలు వేరే కులాల్లోకి వెళ్ళిపోయారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ అక్కడ ఇంకా ఉన్నారంటే, ఇంకా దొరల సంస్కృతి ఉంది ఇంటీరియర్‌ ప్రాంతాల్లో. అందుకేనేమో ఇంకా నక్సలిజం కూడా ఇప్పటికీ ఎక్కువగానే ఉందనిపిస్తుంది. 60లలో కూడా ఇంకా భూస్వాములు ఉండడం, అత్యాచారాలు, అన్యాయాలు జరగడం అక్కడ కనిపించింది. నా ఆత్మకథలో నేను ఈ వివరాలని, మార్పులని వివరంగా వ్రాశాను.

నాకు చిన్నప్పటి నుండి చదవడంపై ఆసక్తి. స్త్రీల గురించిన నవలలు మాత్రం పెద్దగా చదవలేదు. ప్రేమ్‌చంద్‌, అడవి బాపిరాజు నవలలు చదివాక, వేరేవి చదవాలనిపించలేదు. మిల్స్‌ అండ్‌ బూన్స్‌ నవలలు కూడా చదవేదాన్ని, ఆ రోజుల్లో అదొక అంటురోగం లాంటిది, మైకంలా ఉండేది. ఒక్కొక్కరోజు రెండు కూడా చదివేదాన్ని. కాలేజి దగ్గర లైబ్రరీనుంచి తెచ్చి చదివేదాన్ని.

తెలంగాణ సాహిత్య ఉద్యమం గురించి చెప్తారా…

సాహిత్యంలో తెలంగాణాలో రెండో ఉద్యమం నాటికి రచయితలు ఎక్కువగా వచ్చారు. విరసం కూడా అప్పుడే. అలా 70లలో తెలంగాణా సాహిత్యంలో ఎక్కువ ప్రాంతీయ ప్రభావం వచ్చింది. కొంతమంది ఆంధ్ర రచయితలు 70లకు ముందు తెలంగాణలో సాహిత్యమే లేదు అన్న ప్రచారం తీసుకుని వచ్చారు. తెలంగాణ తెలుగు కథ ఎప్పటినుంచో ఉంది. మేమంతా తెలంగాణ సాహిత్య చరిత్ర ఎందుకు రాసామంటే ఇవన్నీ బయటపెట్టడానికే. 70లకి ముందు తెలంగాణలో సాహిత్యమే లేదు అన్న వాదనకి వ్యతిరేకంగా నేను తెలంగాణా తొలితరం కథలు అని వేశాను 2001లో. అప్పుడు చాలా లైబ్రరీలు తిరిగాను. సిటీ సెంట్రల్‌ లైబ్రరీ, వేమన గ్రంథాలయం, కృష్ణదేవరాయాంధ్రభాషా నిలయం, ఎక్కడో షాలిబండలోని పురాతన గుణవర్థక గ్రంథాలయం… వేమన గ్రంథాలయంలో చాలా పుస్తకాలు, కథలు దొరికాయి.1995లో తెలంగాణా సాహిత్యోద్యమం వచ్చింది. అందరూ తెలంగాణా సంస్కృతి గురించి, చరిత్ర గురించి ఆ భాషలోనే కవిత్వం, కథలు వ్రాసారు. అప్పుడు కుప్పలు తెప్పలుగా సాహిత్యం వచ్చింది. మా దగ్గర సాహిత్యమే లేదంటారా చూడండి అన్నట్లుగా. అప్పటికే చాలా పత్రికలు కూడా ఉన్నాయి. ఆంధ్రాభ్యుదయం, సుజాత వంటివి వేమన గ్రంథాలయంలో దొరికాయి. వాటిలో తెలంగాణా వారు రాసిన కథలు తీసుకుని నా తొలితరం కథలలో వేశాను. స్త్రీలవి ఉండాలని రెండు కథలు తీసుకున్నాను. కానీ వాటిలో కథా శిల్పం అంతగా లేదు. మాడపాటి హనుమంతరావు గారిది 1912లో మొట్టమొదటి కథ అని ప్రతిపాదించాను. ఇప్పుడు ఒక విధంగా తెలంగాణ సాహిత్య పునరుజ్జీవనం అని చెప్పుకోవచ్చు. 69 ఉద్యమంలో రచయితలు ఎక్కువగా ముందుకు రాలేదు. కాని ఈ ఉద్యమంలో చాలామంది రచయితలు ఉన్నారు. తెలంగాణా ప్రాచీన చరిత్రను, ప్రాచీన సాహిత్యాన్ని బయటికి తీస్తూ, ఎలా అయితే ఆర్కియాలజీలో భూమిని తవ్వుతూ చరిత్రను బయటికి తీస్తామో అలా అన్ని పత్రికలు, లైబ్రరీలలో రిఫరెన్సులను వెదికి ఎవరి దగ్గరైతే కలెక్షన్‌ ఉందో వాటిని కూడా వెళ్ళి తీసుకుని వచ్చి బయటపెట్టడం జరిగింది. అలా తెలంగాణా సాహిత్యం రాష్ట్ర ఉద్యమానికి ఊపిరి అయ్యింది.

ఆత్మాభిమానం అంశం ఇది. గురజాడ దగ్గర్నుంచి కూడా తెలంగాణాలో కథ ఉంది. ఈ మధ్యలో భండారు అచ్చమాంబను బయటికి తీశారు. వెంటనే మేము ఆమెను స్వంతం చేసుకున్నాం. ఆమె పుట్టింది భువనగిరి దగ్గర, వారి కుటుంబానికి కూడా తెలంగాణా మునగాల సంస్థానంతో సంబంధం ఉంది. కొమర్రాజు లక్ష్మణరావు తెలంగాణా వైతాళికుడు. గ్రంథాలయోద్యమం నడిపారు. ప్రచురణ సంస్థ నెలకొల్పారు. వారి చెల్లెలు భండారు అచ్చమాంబ. కాబట్టి మా తెలంగాణా కథ 1898లోనే ఉంది. ఇందుకోసం మేము దాదాపు 15 సంవత్సరాలు ఫైట్‌ చేశాక ఇప్పుడు ఒప్పుకున్నారు. ఈ మొత్తంలో భూమిక సత్యవతిగారు కూడా ప్రధానంగా ఉన్నారు. మొదట్లో రెండు కథలు ఉండేవి. తర్వాత సంగిశెట్టి గారి దగ్గర అన్నీ దొరికాయి. ఆయన చాలా చోట్ల లైబ్రేరియన్‌గా పనిచేశారు. చాలా పుస్తకాలను సంగ్రహించారు. తెలంగాణా కవిత్వం కనబడితే లేదా weed outచేసినవాటి నుంచి తీసుకున్నారు. అలా తెలంగాణా తొలి కథ ఆమెదే. నిజానికి తొలి ఆధునిక తెలుగు కథ కూడా ఆమెదే అని చెప్పాలి.

దీనిపై మొదట్లో చాలా వ్యతిరేకత వచ్చింది. గురజాడని అవమానిస్తున్నట్లు భావించారంతా…

సాహసమే అది. ఆధునిక కథా ఒరవడి గురజాడ నుండి మొదలైందన్న భావనని కదిలించి, అందులోనూ ఒక స్త్రీ వ్రాసిన కథ తొలి తెలుగు కథగా ఒప్పించగలగడం సాహసం. భూమిక organize చేసిన ఒక కథా వర్క్‌షాప్‌లో ఆవిడ కథను కె.లలితగారు తీసుకువచ్చారు. అక్కడినుండి ఆమె కథ బయటికి తీసుకురావడానికి కష్టపడాల్సి వచ్చింది. స్త్రీలను సమీకరించడం, సేవాభావంతో పనిచేయడం, ఆమెను ప్రప్రథమ ఫెమినిస్టుగా women writing in india లో ప్రస్తావించారు.

తెలంగాణ ఉద్యమంలో స్త్రీల పాత్ర….

తెలంగాణా ఉద్యమాలలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. వారి చరిత్రలు ఇప్పటికీ బయటికి రాలేదు, మనకి తెలియని మనచరిత్ర తప్ప. దరిశి అనసూయ, దేవులపల్లి వేంకటేశ్వరరావు భార్య … ఇలా చాలామంది ఉన్నారు. ఉద్యమంలో మగవారికి ఇచ్చినంత ప్రాధాన్యత ఆడవారికి ఇవ్వలేదు. ఉద్యమం కాగానే ఎన్నికలు వచ్చాయి. ఎక్కడా వారికి గుర్తింపే లేదు.

ఇప్పుడు అందరూ కోరుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చింది కదా? ఇప్పుడైనా స్త్రీలకి వారికి గుర్తింపు ఉందని అనుకుంటున్నారా?

ఏం లేదు. ఇప్పుడు కూడా అందరూ అనుకునేది అదే. ఎంతోమంది స్త్రీలు రైల్‌రోకో, వంటావార్పు వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీచర్లు ఎంతోమంది పిల్లలకు తెలంగాణా గురించి చెప్పడం, మోటివేట్‌ చేయడం వంటివన్నీ చేశారు. తీరా ఎన్నికలు వచ్చాక ఎవరికీ టిక్కెట్లు ఇవ్వలేదు. క్యాబినెట్‌లో మహిళలెవరూ లేరు. ఏమీ అనేట్లు లేదు.

భూమికతో అనుబంధం… 25 సం||లలో భూమిక ఏమైనా చేయగలిగిందా?

నా పేరు ఉంది ఎడిటోరియల్‌ కమిటీలో. కానీ నేను చేసింది ఏమీలేదు. సామాజిక మార్పులో భూమిక పాత్ర చాలా ఉంది. సత్యవతిగార్ని చూడడమే చైతన్యం కలుగుతుంది. ఎన్ని సమస్యలొచ్చినా, లెక్కచేయకుండా పనిచేయడం, భూమికే తన జీవితంలా పనిచేస్తారు. దాన్ని అందరం ఆదర్శంగా తీసుకోవాలి. భూమిక లాంటి పత్రికల అవసరం చాలా ఉంది.

భూమికలో స్త్రీల గురించి చరిత్రలు, కథలు, కవితలు వస్తున్నాయి. ఇవి పాఠకులకు తెలుస్తున్నాయి. ముస్లిం స్త్రీల గురించి కథలు వస్తున్నాయి. ముస్లిం స్త్రీలు ఇంకా మత మౌఢ్యంలోనే హింసకు గురవుతున్నారు. బయటికి రావడం గురించి ఆలోచించడంలేదు. ఇప్పటి కాలంలో ఆచారాలు, పెళ్ళి సాంప్రదాయాలు తిరిగి పాత సంస్కృతుల్లోకి తీసుకెళ్తున్నారు. ఇవి విదేశాలకు కూడా పాకిపోతోంది. ఈ పరిస్థితుల్లో భూమిక చేస్తున్న విశేష కృషిని కొనసాగిస్తూ… ఇంకా చెయ్యాల్సింది, చెయ్యగలిగింది చాలా ఉంది.

ఇంటర్వ్యూ చేసినవారు: పద్మ ఆకెళ్ళ, పి.ప్రశాంతి

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.