మారుమూల పల్లెలో, మట్టి కుటుంబంలో పుట్టిన మనిషి ప్రయాణం… భూమిక ప్రయాణం – సత్యవతి

 

25 సంవత్సరాలు… చాలా సుదీర్ఘకాలం. ఈ కాలమంతా నేను భూమికతో పాటు నడిచాను. అంటే 25 సంవత్సరాలు నేను భూమికతో మమేకమైపోయాను. నా ఇంటి పేరు భూమికయ్యింది. మట్టి నుంచి ధాన్యాన్ని వెలికితీసే కుటుంబంలో పుట్టి, ఎలాంటి సాహిత్య నేపథ్యం, సామాజిక ఆచరణ లేని నేను ఇన్ని సంవత్సరాలపాటు ఒక విలువైన, స్ఫూర్తివంతమైన పత్రికకు సారధ్యం వహించడం నా జీవితంలో ఒక అపురూప ఘట్టం. ఇరవై ఏళ్ళు వచ్చేవరకు పుట్టిన ఊరి సరిహద్దులు దాటని నేను హఠాత్తుగా హైదరాబాద్‌కు రావడం, నన్ను నేను నిలబెట్టుకోవడానికే ఎంతో సంఘర్షణ పడడం, నా అస్తిత్వాన్ని అన్వేషించుకుంటూ అన్వేషి బార్లా తీసిన తలుపుల్లోంచి హాయిగా నడుచుకుంటూ వెళ్ళిపోవడం… నా జీవితంలో అద్భుత ఘట్టాలు.

1992 నుంచి అన్వేషిలో జరిగిన చర్చల సారాంశంగా 1993లో భూమిక తొలి సంచిక రావడం, నేను సంపాదకురాలిగా ఎదగడం… ఎన్నో మధుర స్మృతులు. ఏడు సంవత్సరాల పాటు సామూహికంగా నడిచినా హఠాత్తుగా, అనుకోని విధంగా 2000 సంవత్సరంలో నా చేతుల్లోకి, నా సారథ్యంలోకి రావడం… ఒక బాధాకరమైన జ్ఞాపకం. అప్పటికి నేను చేస్తున్న తహసిల్దార్‌

ఉద్యోగం ఒకవైపు, భూమిక ఇంకో వైపు నిలబడి నన్ను ఎంచుకోమంటే నా మనసు భూమిక వైపే మొగ్గింది. 2000లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేసి మహా ప్రేమగా భూమికను నా గుండెల్లోకి తీసుకున్నాను. అప్పటి వరకు భూమిక సమూహంతో ఉన్నాను. 2000 సంవత్సరంలో నేను ఒక్కదాన్నే… ఇంకెవరూ లేరు… భూమికను అక్కున చేర్చుకున్నాను. ప్రేమగానే సుమా!

పత్రిక బ్యాంకు ఖాతాలో డబ్బుల్లేవు. ఒక్క చేత్తో పత్రికను ఎలా ముందుకు తీసుకెళ్ళాలో అర్థం కాలేదు. ఆఫీసులో రెండు రూములు వేరేవాళ్ళకి అద్దెకిచ్చి ఒకే రూములో పని చేయడం మొదలుపెట్టాం. చాలా కష్టం మీద రెండు నెలలకొకసారి, నాలుగు నెలలకొకసారి పత్రిక తెచ్చేవాళ్ళం. అప్పట్లో నేను, ప్రసన్న ఇద్దరమే. క్రమంగా ఎంతోమంది మిత్రులు, ఆత్మీయులు భూమికకు దగ్గరయ్యారు. ఎంతోమంది ఆర్ధికంగా ఆదుకున్నారు. భూమికను ప్రేమించే సహృదయులెందరో భూమికను ముందుకు తీసుకెళ్ళే పనిలో నాకు చేదోడయ్యారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ భూమిక ఎప్పడూ ఆగలేదు. నా పూర్తి సమయం భూమికకే కేటాయించడంతో భూమిక ఆర్థిక స్థితి క్రమంగా కోలుకొంది. భూమిక నుండి ఏరోజూ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.

ఆ తర్వాత వెనుతిరిగి చూసింది లేదు. ఆయా సందర్భాలకనుగుణంగాను, ఆయా సామాజిక కల్లోలాలను ప్రతిబింబిస్తూ ఎన్నో ప్రత్యేక సంచికలు తెచ్చాం. హెచ్‌.ఐ.వి/ఎయిడ్స్‌ ప్రత్యేక సంచిక తెచ్చిన సమయంలో ఆ సమస్య విస్తృతి, మహిళల వేదన నాలో పెను దుఃఖాన్ని కలిగించి నేను మానసికంగా కుంగిపోయాను. మెంటల్‌ బ్రేక్‌డౌన్‌కి గురై మానసిక చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవం నన్ను రాటుదేల్చింది. ఆ తర్వాత మరెన్నో ప్రత్యేక సంచికల రూపకల్పనకు నన్ను పురికొల్పింది.

భూమికతో రచయిత్రులను అనుసంధానం చేసే చర్యల్లో భాగంగా రచయిత్రులందరినీ కూడగట్టి రాష్ట్రం నలుమూలలకి సాహితీ యాత్రలు చేశాం. ముఖ్యంగా సామాజిక ఉద్యమాలు జరుగుతున్న ప్రాంతాలకి, అత్యాచారాలకి, అణచివేతలకి గురవుతున్న వర్గాల్లోకి ఈ యాత్రలను ప్లాన్‌ చేయడం, ఆ అనుభవాలన్నింటినీ రంగరించి ప్రత్యేక సంచికలు తీసుకు రావడం ఓ అద్భుతమైన అనుభవంగా నాకు మిగిలిపోయింది. నలభై నుండి యాభై మంది రచయిత్రులను వెంటేసుకుని మూడేసి రోజుల పాటు సాగిన ఆ సాహితీ యాత్రానుభవాలు రచయిత్రులందరూ అద్భుతంగా అక్షరాల్లో ఆవిష్కరించడంతో ఎక్కడెక్కడ ఎలాంటి ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్నాయి, వాటి ప్రభావాలు, పరిణామాలు ఎలా ఉన్నాయి అనే విషయం భూమిక ద్వారా ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. ప్రధాన స్రవంతి మీడియా చూపని కోణాలను స్త్రీ వాద దృక్పథంతో ప్రత్యామ్నాయ స్రవంతి ద్వారా భూమిక పాఠకులకు చెప్పగలిగాం. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు సృష్టించబోయే విధ్వంసం, గంగవరం పోర్టు విస్తరణ సమయంలో మత్స్యకారులు జరిపిన ఉద్యమం, పోలీసుల చేతుల్లో సామూహిక అత్యాచారానికి గురైన వాకపల్లి బాధితులకు సంఘీభావంగా చేసిన వాకపల్లి ప్రయాణం… ఇలా ఎన్నో ప్రయాణాలు… ఎందరో రచయిత్రులు భూమికతో కలిసి నడిచారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలు రచయిత్రుల ఐక్యతని దెబ్బతీసినప్పటికీ భూమికతో రచయిత్రుల బంధం మాత్రం చెక్కుచెదరలేదు. ‘వెయ్యి పూలు వికసించాలి… వెయ్యి ఆలోచనలు సంఘర్షించాలి’ అనే దృక్పథంతో భూమిక తనదైన శైలితో ముందుకు నడిచింది.

2006కు ముందు కేవలం మాగజైన్‌ పని మాత్రమే చేసిన నేను, 2006లో భూమిక హెల్ప్‌లైన్‌ను ప్రారంభించడం ద్వారా నా పని పరిధి అనూహ్యంగా విస్తృతమైంది. భూమిక ద్వారా స్త్రీ వాద భావజాల వ్యాప్తికి కృషి చేసిన నేను హెల్ప్‌లైన్‌ స్థాపన ద్వారా కొత్త కొత్త పనుల్లోకి మళ్ళాల్సి వచ్చింది. అంతవరకు ప్రభుత్వాలతో పనిచేసిన అనుభవం లేని నేను, పోలీసు శాఖను ఆమడ దూరంలో ఉంచిన నేనే ఆయా ప్రభుత్వ శాఖలతో అతి సమీపంగా కలిసి పనిచేయడం మొదలైంది. పోలీస్‌ స్టేషన్‌లలో స్త్రీల కోసం సపోర్టు సెంటర్లు పెట్టడం, పోలీసులకు శిక్షణలివ్వడం లాంటి పనుల్లోకి మళ్ళిపోయాను. మహిళా కారాగారంలో మహిళా ఖైదీల కోసం పనిచేసే అవకాశం రావడంతో ఎలాంటి జంకూ గొంకూ లేకుండా జైలులోకి వెళ్ళిపోయాం. ఖైదీల కోసం, వాళ్ళ పిల్లల సంక్షేమం కోసం రెండు సంవత్సరాలుగా చేస్తున్న పని అంతులేని సంతృప్తిని కలిగిస్తోంది.

భూమిక సంస్థ పని, పరిధి నగరాలకే పరిమితమైనా పత్రిక ద్వారా క్షేత్ర స్థాయిలో పనిచేసే అవకాశం 2015లో వచ్చింది. భూమిక హెల్ప్‌లైన్‌ నెంబర్‌ తొమ్మిదో తరగతి సోషల్‌ స్టడీస్‌ టెక్ట్స్‌ బుక్‌లో ప్రభుత్వం ముద్రించడం వల్ల విద్యార్థుల్లోకి హెల్ప్‌లైన్‌ నంబర్‌ విస్తృతంగా వెళ్ళడం, బాల్యవివాహాలకు సంబంధించి కాల్స్‌ రావడం మొదలైంది. ఈ అనుభవాన్ని అందిపుచ్చుకుని మహబూబ్‌నగర్‌ జిల్లాలో మద్దూరు, దామరగిద్ద మండలాల్లో బాల్య వివాహాల నిరోధక ప్రాజెక్టును అంగీకరించి పనిచేయడం మొదలుపెట్టాం. ఈ ప్రాజెక్టు ద్వారా అప్పటి వరకు నగరాలకే పరిమితమైన మా పని గ్రామాలకు విస్తరించడం జరిగింది. ఈ కార్యక్రమం నాకు ఎన్నో కొత్త అనుభవాలను ఇవ్వడంతోపాటు భూమిక టీం శక్తిసామర్థ్యాలను అనూహ్యంగా పెంపొందించింది. ప్రశాంతి మానస పుత్రికగా మారిన ఈ కార్యక్రమం మద్దూరు, దామరగిద్ద మండలాల్లో బాల్యవివాహాల నిరోదంలో గొప్ప ముద్రను వేసి, ప్రభావాన్ని చూపింది.

భూమిక పత్రికతో మొదలైన ప్రయాణం పత్రికను దాటి ఈ ఇరవై అయిదు సంవత్సరాలలో ఎన్నో కొత్త కార్యక్రమాల్లోకి అడుగు పెట్టడంతో భూమిక పని పరిధి, నా కార్యక్రమాల స్వభావం చాలా విస్తృతమై, రచయిత్రిగా నేను ఎంతో కోల్పోయాను. కథ రాయడాన్ని ప్రేమించే నేను నా చుట్టూ భిన్నమైన, సక్షిష్టమైన వస్తువులున్నప్పటికీ కథ రాయలేని స్థితిలోకి జారిపోయాను. యాక్టివిజం నాలోని రచయితను మింగేసిందేమో అనిపిస్తుంది. ప్రయాణం చేయడం, ఆ అనుభవాన్ని అక్షరీకరించడం నాకు చాలా ఇష్టమైన పని. ప్రయాణాలు చేస్తున్నాను కానీ ఆ అనుభవాలను రాసే తీరికను కోల్పోయాను. ఈ విషయాలేవీ నన్ను బాధించవు. ఏదో పోగొట్టుకున్నానన్న భావన కూడా నాలో లేదు.

ఈ ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణం నాకు ఎన్నో భిన్నమైన అనుభవాలనిచ్చింది. రిగ్రెట్స్‌ మాత్రం ఏమీ లేవు. ఏదైనా సంస్థ విజయవంతంగా నడుస్తున్నప్పుడు దానికి నాయకత్వం వహించిన వాళ్ళు సరైన సమయంలో సంస్థ బాధ్యతను కొత్త తరానికి, నూతన నాయకత్వానికి అందించగలిగితే ఆ సంస్థ మరో ఇరవై ఐదేళ్ళు నిరంతరాయంగా నడుస్తుంది. చాలా సంస్థల్లో ఆ వెసులుబాటు లేక, తగిన వ్యక్తులు దొరకక మూతపడిన సంస్థలెన్నో. భూమికకు ఆ అవస్థ ఎదురవ్వలేదు. స్త్రీల అంశాల పట్ల సున్నితంగా, సూటిగా ఆలోచించి, ఆచరించే ప్రశాంతి మూడేళ్ళ క్రితమే భూమిక కుటుంబంలోకి ప్రవేశించింది. భూమిక బాధ్యతను తన భుజాల మీద వేసుకుంది. భూమిక సత్యవతి స్థానంలో భూమిక ప్రశాంతి అయ్యింది. నేను మహదానందంగా, మనస్ఫూర్తిగా ఆహ్వానించిన పరిణామం ఇది. భూమిక పత్రికను, సంస్థను మరెన్నో ఏళ్ళపాటు ప్రశాంతి నడిపించగలుగుతుందనే తృప్తి సామాన్యమైంది కాదు.

ఈ ప్రత్యేక సంపాదకీయం రాయడానికి కూర్చున్నప్పుడు నా మనసులో ఎన్నో గజిబిజి ఆలోచనలు, ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలు… ఒకదాని తర్వాత ఒకటి తోసుకొస్తూ తమ గురించి రాయమని రగడ. ఇన్ని సంవత్సరాల పాటు ఒకే లక్ష్యంతో, ఒకే నిబద్ధతతో కొనసాగిన నా ప్రయాణంలో ప్రశాంతి నా సహప్రయాణికురాలవ్వడం నేను సాధించిన విజయం. ఎన్నో విజయాలను నేను భూమిక ద్వారా సాధించి ఉండవచ్చు కానీ పూవుకు తావి అబ్బినంత సహజంగా ప్రశాంతి ఆగమనం భూమిక పురోగమనానికి, సంస్థ ముందుకు నడవడానికి అందివచ్చిన అద్భుత కానుక నాకు. భూమిక ప్రయాణం ఎన్నో ఏళ్ళపాటు నడుస్తుంది.

ఈ రజతోత్సవ సందర్భంగా భూమిక పాఠకులకు, ప్రేమికులకు, ఆత్మీయులకు ప్రేమపూర్వక శుభాకాంక్షలు. భూమికను మరింత నిబద్ధతతో, లక్ష్యాలను, ఉద్దేశ్యాలను అధిగమించకుండా, క్రమం తప్పకుండా నడుపుతామని హామీ ఇస్తున్నాను. 25 సంవత్సరాల కాలంలో తెలుగు సమాజం మీద, సాహిత్యం మీద, సంస్థల మీద, వ్యవస్థల మీద, వ్యక్తుల మీద భూమిక వేసిన ప్రభావితపు ఫలితాన్ని సగర్వంగాను, వినయంగాను అంగీకరిస్తూ ముకుళిత హస్తాలతో, హృదయపూర్వక నమస్సులతో… ఇక ముందు కూడా భూమికను ఆదరించాలని కోరుతూ…

ఈ ప్రత్యేక సంచిక రూపకల్పనలో సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఇంటర్వ్యూల సేకరణలో ముఖ్యభూమిక పోషించిన పద్మ గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మిగితా అన్ని పనుల్లో సహకరించిన భూమిక టీమ్‌కి అభినందనలు…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

One Response to మారుమూల పల్లెలో, మట్టి కుటుంబంలో పుట్టిన మనిషి ప్రయాణం… భూమిక ప్రయాణం – సత్యవతి

  1. Raja Rama MohanRao says:

    మీ అనుభ‌వ‌సారాన్ని గుదిగుచ్చి రాసిన సంపాద‌కీయం బాగుంది. అంద‌రికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. అభినంద‌న‌లు మేడ‌మ్‌.
    మీకు తోడుగా నిలుస్తున్న మ‌హిళామ‌ణులంద‌రికీ శుభాభినంద‌న‌లు. భూమిక మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని భావిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో