తెలంగాణ ఆకాంక్ష -బండారి సుజాత

 

మన తెలంగాణలో పెద్ద పండగ దసరా. అన్ని పండుగలకంటే ఎక్కువగా జరుపుకుంటాం. పెళ్ళయిన ఆడపిల్లలందరూ పుట్టినింటికి వస్తరు. బొడ్డెమ్మ, బతుకమ్మల ఆటలతో ఆడపిల్లలున్న ఇల్లు సందడిగా ఉంటుంది. పుట్టింటికొచ్చిన ఆడపిల్లలు స్నేహితులను కలుసుకోవడం, చిన్ననాటి ముచ్చట్లతో, వచ్చి పోయే స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

అరుణ, కరుణ, సుధ, మౌనిక, నేను (దివ్య) మేమందరం చదువుకొనేటప్పుడు స్నేహితులం. మా ఊరిలో చదువు అయిపోగానే కొందరికి పెళ్ళయి వెళ్ళిపోయారు. కొందరు మాత్రమే పై చదువులకు వెళ్ళారు. దసరా పండుగకు వస్తే కలుసుకుంటం. ఇలా కలుసుకోవడం మా అందరికీ చాలా ఇష్టం. ఒక్కొక్కరోజు మాట్లాడుకుంటుంటే చీకటయిందే తెలవకపోయేది. ఈసారి అందరూ రాలేదు. కరుణ వచ్చిందని తెలిసి దాన్ని కలుద్దామని వెళ్ళాను.

నువొక్కదానివే వచ్చినవేందే, మౌనికేది? అని అడుగుతున్న కరుణతో 60 యేండ్లు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా! మన అదృష్టం బాగుండి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆనాటి ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకున్నదని నీకు తెలుసు కదా!

నాకేం తెలుసు అంటే వినటమే కాని వివరాలు తెలియవు అంటున్న కరుణతో ఆనాటి అమరవీరులకు అండగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఎంతోమంది బలైపోయారు. ఎన్నో కుటుంబాలు తమ వాళ్ళను కోల్పోయి జీవచ్ఛవాలుగా బ్రతుకుతున్నారు అంది దివ్య.

మౌనిక వాళ్ళ నాన్న తెలంగాణలో జరిగే రాజకీయ పరిణామాలను తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉద్యమంలో వెన్నంటి ఉన్నవారికి సముచిత స్థానం కల్పించారు. వారి చదువులను బట్టి ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం. అలా మౌనికకు ఉద్యోగం వచ్చింది.

అంటున్నారు కానీ ఎంతోమంది చనిపోయారు కదా! వాళ్ళందరికీ న్యాయం జరుగుతుందా? నిజమో, అబద్ధమో అనుకున్నాను కానీ నువ్వు చెబితే నమ్మాల్సి వస్తోంది. అయినా ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు అంది కరుణ.

నేను డిగ్రీ అయిన తర్వాత ప్రైవేటు జాబ్‌లో చేరాను కదా! అప్పటి నుండి ఇక్కడే పనిచేస్తున్న. అందుకే వివరాలన్నీ నాకు తెలుసు. నీకు తెలుసు కదా! కనపడిన పుస్తకాలు, పేపర్లు అన్నీ చదువుతాను కదా! అంతే కాకుండా మన అనుకున్న వాళ్ళకి ఏ కష్టమొచ్చినా అక్కడికి వెళ్తుంటాను. వాళ్ళ కష్టసుఖాలలో పాలుపంచుకొని వారికి కావలసిన సహాయం అందిస్తాను. అయినా నువ్వీ మధ్య రాలేదు కదా! అందుకే నీకిక్కడ విషయాలు తెలిసినట్లు లేవు అంది.

ఇక మన స్నేహితుల దగ్గరికి తప్పకుండా వెళ్తాను. మీరందరూ తలా ఒక దారి వెళ్తిరి. మౌనిక, నేను ఎప్పుడూ కలుసుకుంటూనే ఉంటం. వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే వాళ్ళమ్మ, అది పిచ్చివాళ్ళలాగా అయిపోయారు తెలుసా? మా అమ్మ, నాన్నకు చెప్పి వాళ్ళ బంధువులతో పాటు నేను వాళ్ళింట్లోనే రెండు, మూడు రోజులు ఉన్నాను. వాళ్ళను ఓదార్చడం ఎవరితరం కాలేదు. పండుగలప్పుడు ఇంట్లో అందరుంటేనే సంతోషం. కానీ ఇప్పుడు వాళ్ళింట్లో వాళ్ళిద్దరే కనుక ఏడ్చుకుంటనే ఉంటరని వస్తూ ఉంటాను, సాయంత్రం మౌనిక వాళ్ళింటికెళ్దామంది దివ్య. సరేనంది కరుణ.

ఇప్పుడు మౌనిక ఘణపూర్‌ రెవెన్యూ ఆఫీసులో జూనియర్‌ అసిస్టెంట్‌గా చేస్తున్నది. ఇంటికొచ్చిన స్నేహితుల పలకరింపులతో సంతోషపడుతుంది మౌనిక. అమ్మ ఎలా ఉందే అన్న కరుణతో అమ్మ ఇంకా కోలుకోవడం లేదు. ఏదైనా పని ఉంటే చేసి లోపలికి వెళ్ళి ఏదో ఆలోచించుకుంటూ కూర్చుంటున్నది. ఇంకా నాన్న జ్ఞాపకాల నుండి బయటికి రావడం లేదు. నేను ఆఫీసు నుండి వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడితే ఇదివరకటిలా లేదంటూ వచ్చే కన్నీటిని తుచుచుకుంది మౌనిక.

అసలేమైందే అంటున్న కరుణతో, ఇది నాన్న కట్టించిన ఇల్లు. చిన్నదైనా ఈ ఇల్లంటే నాన్నకెంతో ఇష్టం. తెలంగాణ ఉద్యమం మొదలయిన దగ్గర నుండి నాన్న సంతోషానికి అవధుల్లేవు. ఈసారి మన తెలంగాణ మనకొస్తది అంటూ నాయకులతో తిరిగేవాడు. అమ్మకు ఇష్టముండేది కాదు. ఎప్పుడూ అదే ధ్యాసైతే ఎట్లా? ఇంట్లో ఆడపిల్లుంది, పని చేసుకొని బతికేటోళ్ళం. రోజూ తెలంగాణ అంటూ తిరిగితే మన బతుకేం కావాలి అనేది అమ్మ. నారు పోసినవాడే నీరు పోస్తాడు, మనకు ఇల్లున్నది, చేసుకుని బతుక కాళ్ళు చేతులున్నయి కదా! ఎందుకు బాధపడతావు అనేవాడు. ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం, ఉద్యమ నాయకులతో వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడం చేసేవాడు. నన్ను బాగా చదివించాలన్న ఆశ బాగా ఉండేది. నువ్వు డాక్టరువైతే పేదలకు దీపం కావాలి బిడ్డ అనేవాడు. కానీ ఇప్పుడు నాన్న లేరు, ఆయనే పెద్ద దిక్కుగా ఉన్న మేము అనాధలయ్యాము అంటూ ఏడుస్తున్న స్నేహితురాలిని ఓదార్చారు దివ్య, కరుణ.

మౌనిక కన్నీళ్ళు తుడుస్తూ ఇందుకే నేను తరచు రావడం లేదు అంది దివ్య. లేదు దివ్యా! దీపావళి వచ్చిందంటే ముందురోజు నుండే నేను, నాన్న, అమ్మ ఇంటి చుట్టూ దీపాలు వెలిగించేవాళ్ళం. దీపావళి పండుగ గురించి వివరాలు చెప్పేవాడు. ”చెడుమీద మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుంది” అనేవాడు. ఉద్యమం ఉధృతమై రోజుకొక విధంగా పరిణామాలు సంతరించుకుంటుంటే తట్టుకోలేక తను చనిపోతేనన్న తెలంగాణ వస్తుందేమోనని లెటర్‌ రాసి జేబులో పెట్టుకుని రైలుకెదురుగా పోయి చనిపోయిండు. కానీ అనుకున్నవి జరగవు కదా! తర్వాత నాన్న స్నేహితులు, ప్రభుత్వ సహాయంతో డిగ్రీ వరకే చదువుకున్నాను. 2016 జూన్‌లో నాకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగమిచ్చింది. ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇచ్చింది. ఉద్యోగం చేస్తూ కూడా చదువుకోవాలనుకుంటున్నాను. కానీ మా నాన్న కోరిక తీర్చలేనేమో అంది మౌనిక.

మన మౌనికకే కాదు ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలతో పాటు ఇంటికొక

ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం. నాకు తెలిసినవాళ్ళే, అంతేకాక వివరాలలోకెళ్ళినప్పుడు విషయాలు తెలిశాయి. ఇంటిపెద్దను కోల్పోయి కొందరు, కన్నకొడుకులు బలైనవారు కొందరు ఇలా తమ ఆత్మహత్యలతోనన్న తెలంగాణ వస్తుందేమోనన్న ఆలోచన వారిది. చూస్తూ చూస్తూ ప్రాణాలు తీసుకోవడమంటే ఎంత బాధ. అవి గుర్తొస్తే చాలు మనసంతా అతలాకుతలం అయితది అంది దివ్య.

ఇంకెవరికిచ్చారే ఉద్యోగం నీకు తెలుసన్నావు కదా! అన్న కరుణతో కడిపికొండలో ఉంటున్న హరిశ్చంద్రారెడ్డి, నిర్మల కొడుకు కమలాకర్‌ రెడ్డి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో 2013లో ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయిండు.

అయ్యో! ఏం చదువుకొనేటోడు అంటుంటే, వాళ్ళ వివరాలు కూడా తెలసుకున్న. పిల్లలు 7, 8 సంవత్సరాలప్పుడే నిర్మల భర్త కాలేయం వ్యాధితో మరణించాడు. అప్పటినుండి ప్రైవేటు పాఠశాలలో అటెండరుగా చేసుకుంటూ పిల్లలను చదివించుకొంటున్నది. భర్త లేడు కదా! అన్నదమ్ముల తోడుగా కూతురు మానసకు పెళ్ళి చేసింది. ఆమె కొడుకు కమలాకర్‌ రెడ్డి హన్మకొండ తుషార కాలేజీలో ఇంటర్‌ చదివిండు. ఆమె తమ్ముడు కమలాకర్‌ను మంచిర్యాలలో డిగ్రీ చదివించడానికి తీసుకెళ్ళిండు. చురుకైనవాడు, బాగా చదివేవాడు కనుక మంచి పేరే సంపాదించుకున్నాడు. స్నేహితులతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేవాడు. టి.వి.లో తెలంగాణ గురించిన వార్తలు చూసి, స్నేహితులతో చర్చించేవాడు. వినాయకచవితి పండగని ఇంటికి వెళ్తానంటే పంపించాడు వాళ్ళ మేనమామ సతీష్‌ రెడ్డి. ఇంటికి వచ్చిన రెండు రోజులు వాళ్ళ అమ్మతో బాగానే ఉన్నాడట. స్నేహితులతో గణేష్‌ మంటపంలో రెండు రోజులు పడుకున్నాడట. ఎందుకురా అక్కడ పడుకోవడమని తల్లి అడిగితే స్నేహితులందరూ ఉంటారు కదమ్మా మాట్లాడుకుంట పడుకుంటం అంటే తల్లి సరేనన్నది.

అలా రెండు రోజులైన తర్వాత పొద్దున్నే ఇంటికొచ్చిన కమలాకర్‌తో వంటచేసి పెట్టిన తినమని చెబుతూ, ఆదివారం మంచిర్యాలకు వెళ్తావు కదా? నీకేమైనా కావల్సివస్తే నేను బడినుండి వచ్చిన తర్వాత కొనుక్కొచ్చుకుందువని వెళ్ళిపోయింది. స్నేహితులందరు ఏం మాట్లాడుకున్నారో, అతనేమి ఆలోచించాడో తెలియదు, సూసైడ్‌ నోట్‌ రాసి జేబులో పెట్టుకుని ఇంట్లోనే ఉరివేసుకున్నాడు. గణేష్‌ మంటపం దగ్గరి స్నేహితులు పిలవడానికి వచ్చేటప్పటికి తలుపులు తీసే ఉన్నాయట. అతన్ని పిలుస్తూ లోపలికి వెళ్ళడంతో ఉరివేసుకొని వేళ్ళాడుతున్న కమలాకర్‌ని చూసి అందరూ పిలిచారట. విషయం తెలుసుకున్న నిర్మల వచ్చేసరికి శవాన్ని దించి కింద పెట్టారట. ఆమె కడుపుకోత వర్ణనాతీతం. ఇప్పటికీ ఎవరిని చూసినా నా కొడుకులాగానే కనపడతడంటూ కన్నీళ్ళు పెట్టుకుంటది. 2016లో ఆమెకు పెద్దపెండ్యాల పాఠశాలలో అటెండర్‌ జాబ్‌ ఇచ్చారు. 10 లక్షల రూపాయల ప్రభుత్వ సహాయం అందింది. కానీ ఆమె కొడుకుకి ఏదీ సరిరాదు కదా!

పాఠశాలలో జరిగే జాతీయ ఉత్సవాలకు ‘కమలాకర్‌’ పేరుతో పిల్లలకు బహుమతులు, స్వీట్లు పంచిపెడుతుంది అంటూ

కన్నీళ్ళు తుడుచుకుంది దివ్య. దివ్య చెప్పేది వింటున్న కరుణ, మౌనిక ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ భారంగా నిట్టూర్చారు.

ఏమైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి కదే! అంటున్న కరుణతో అవునంటూ ”ఆ టైంలో ఎవరో ఒకరు దగ్గరుంటే అలాంటి ఆలోచన వాయిదా పడుతుందనుకుంట. ఒంటరిగా ఉంటే మానసిక బాధ మనిషిని ఆలోచించనీయదనుకుంట’ అంది దివ్య.

ఇంకెవరున్నారే అంటున్న కరుణతో చాలామంది ఉన్నారు. దూరంగా వెళ్ళి వివరాలు కనుక్కోలే. మన ఊరికి దగ్గరున్నవాళ్ళ గురించే తెలుసుకున్న అంది దివ్య.

మడికొండలోని ఎదులాపురం రాజయ్య, పుష్పలకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్ద కొడుకు శివకుమార్‌, చిన్న కొడుకు అజయ్‌కుమార్‌, కూతురు సృజన. శివకుమార్‌ డిగ్రీ చదివిండు. ఐ.టి.ఐ. చేసి ఫిట్టర్‌గా పనిచేసేవాడు. తల్లి బీడీలు చుట్టేది. తండ్రి ఏదో ఒక కూలిపని చేసేవాడు. శ్రీకాంతాచారి చనిపోయినప్పటి నుండి ‘అమ్మా! తెలంగాణ కోసం ఏమైనా చెయ్యాలే’ అనేవాడట. ఆయన ధైర్యాన్ని మెచ్చుకుంటూ తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్నడే అంటే, వద్దు బిడ్డా మనం లేనోళ్ళం. ఎట్లనో ఒకట్ల తెలంగాణ వస్తది కానీ, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకని, ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి పడే బాధను చెబుతూ, చెట్టంత కొడుకును పోగొట్టుకునే తల్లి ‘మోడే’ బిడ్డ. అలాంటి పనులు ఎవరూ చెయొద్దురా అని చెప్పినా కూడా, ఏది ఏమైనా మనకు తెలంగాణ రావాలి అనేవాడట. కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేయటం మొదలుపెట్టగానే మారుతున్న రాజకీయ పరిస్థితులను చూసి మనస్తాపం చెంది తెలంగాణ వస్తేనే మనం మంచిగ బతుకుతం అనేవాడట. పొద్దున్నే లేచి వాళ్ళమ్మను చాయ్‌ పెట్టమని చాయ్‌ తాగిండంట. చాలాసేపు వాళ్ళమ్మ పక్కనే కూర్చున్నడట. వంటచేసి శివకుమార్‌ అన్నం తిన్న తర్వాత కూరగాయలు తెస్తానని ఆమె మార్కెట్టుకు పోయిందట. వారానికి సరిపడే కూరగాయలు తీసుకొని వచ్చి తలుపులు కొడితే ఎంతకూ తీస్తలేడట. శివుడూ, శివుడూ అని ఇంటిచుట్టూ తిరుగుకుంట తలుపు కొట్టి తీయకుంటే, రాత్రంత టీవీల క్రికెట్‌ చూసిండు కదా! నిద్రపట్టిందేమోననుకున్నదట. కానీ ఏ అనుమానం రాలేదు. ఎందుకైనా మంచిదని కిటికీని గట్టిగా నెట్టి లోపల చీరతో ఉరిపెట్టుకొని ఊగుతాంటే బాగా అరిచిందట. అందరూ వచ్చి తలుపు పగలగొట్టగానే ఆమె ఉరికి కాళ్ళు పట్టుకున్న, ఛాతిల చేయిపెట్టగా వేడిగా ఉన్నాడని బతుకుతాడనుకున్నదట. కానీ అప్పటికే చనిపోయిండట. ఇంకొంచెం ముందు వస్తే నా కొడుకును బతికించుకుందునేమో, నేను కూరగాయలకు పోకున్న బాగుండునంటు ఏడుస్తున్న ఆ తల్లిని ఓదార్చడం నావల్ల కాలేదు. అతడు రాసిన డైరీ టేబుల్‌ పైన పెట్టి ఉన్నదంది ఏడుస్తూ.

తమ్ముడ్ని బాగా చదివిస్తానని, చెల్లి పెళ్ళి చేస్తాననే కొడుకు కానరాకుండ పోయిండని, ఎవ్వరి జోలికి పొయ్యేటోడు కాదు. కనకదుర్గమ్మకు పూజ చేసేటోడు, ఉపవాసాలుండేవాడు. తాగెటోళ్ళు, అల్లరి చేసేటోళ్ళంటే ఇష్టముండేది కాదు. బంగారమసోంటి కొడుకును ఆ దేవుడెత్తుపోయిండని ఏడ్చే ఆ తల్లి వేదన అంతా ఇంతా కాదు అని చెప్పే దివ్యతో పాటు కరుణ, మౌనికల కళ్ళు నీటి చెలమలయ్యాయి.

12-05-2010న శివకుమార్‌ ఆత్మహత్య చేసుకున్నడు. అతను చనిపోయిన రెండు సంవత్సరాలకే మానసిక వేదనతో అతని తండ్రి చనిపోయిండు. భర్త మరణంతో ఆమె ఇంకా కుంగిపోయింది. మిగతా ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నది. ప్రభుత్వం ఆమెకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. ఆమె రెండవ కొడుకు అజయ్‌కు మణికొండలో అటెండర్‌ జాబ్‌ ఇచ్చారు.

ఇలా చాలా కుటుంబాలు వేదనతో బాధపడుతున్నాయి. ఇంకొందరు ఆత్మహత్య ప్రయత్నం చేసి బయటపడ్డ వారున్నారు. తెలంగాణ కోసం తెగించి పోరాడుతం అని ఇప్పటికీ అంటున్నారు. మేము ఇంకే పనులు చేయాలనో మమ్మల్ని ఇక్కడే ఉంచిండు దేవుడు అంటున్నారు కొందరు.

మిలియన్‌ మార్చ్‌, ధూంధాం అంటూ పాటలతో ఉర్రూతలూగించిన అనేకమంది కళాకారులు, ఉద్యమకారులు తెలంగాణ తల్లి ఋణం తీర్చుకోవడానికి పోరాడిండ్రు. కొందరు కళాకారులకు ఉద్యోగాలు వచ్చినవి. ఇలా ఉద్యమంలో పాల్గొన్న చాలామందికి ఉపాధి కల్పించడంలో ప్రభుత్వం కృతకృత్యమైంది అంది దివ్య.

అవును నిజమే అంటున్న కరుణతో ”ఏది ఏమైనా 60 సంవత్సరాల తెలంగాణ కల సాకారమై మన వనరులను మనం ఉపయోగించుకుంటున్నం. తెలంగాణ అభివృద్ధి దశలోకి వెళ్తున్నదని మనం రోజు చదువుతున్నం. ఇన్ని సంవత్సరాల కష్టానికి ఫలితాలు అనుభవిస్తున్న తెలంగాణ ప్రజలందరూ కొంచెం సంయమనం పాటించాలి. ఆత్మహత్యలు ఎప్పటికీ మంచిది కాదు. ఆత్మహత్యల వలన కుటుంబంలోని వారందరూ కృంగిపోతారు. అలాంటి ఆలోచన రాకుండా మనకు మనం ధైర్యం చెప్పుకోవాలి. ఆత్మహత్య చేసుకొన్న కుటుంబాల కష్టాలను జ్ఞాపకం చేసుకుంటే మిగతావారికి ఆ ఆలోచనలు రాకుండా ఉంటాయి” అంది దివ్య. ”అందరికీ సహాయపడుతూ, వాళ్ళ కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ మంచి పని చేస్తోంది. మా నాన్న చనిపోయిన తర్వాత నా వెన్నంటే ఉండి చాలా ధైర్యం చెప్పింది. ఆ రోజు అది నా దగ్గర లేకపోతే నేను కూడా అదే పని చేసేదాన్ని కావచ్చు” అంది మౌనిక.

ఏమోనే నాకు మొదటినుండీ అలా అలవాటైపోయింది. ఎవరన్నా బాధలో ఉంటే చూస్తూ ఊరుకోలేను. నేను చేసే పనికి అమ్మ, నాన్న కూడా అడ్డుచెప్పరు. అందుకే అలా సాగుతోంది అంటున్న దివ్యతో, నువ్వు చేసే మంచి పనిలో మేము కూడా భాగస్వాములవుతాం అంటున్న స్నేహితులను చూసి సంతోషపడుతుంది దివ్య.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.