కడలి ఒడ్డున కవిత్వ కుట్టి రేవతి -జగద్దాత్రి

 

కుట్టి రేవతికి బాగా పేరు తెచ్చిన కవిత ములైగళ్‌. కొందరు ఈ రచయిత్రిని చెంప పగలగొట్టాలి అంటే, కొందరు ఆమె కవిత్వ సంపుటి చెన్నై మౌంట్‌రోడ్‌లో తగులబెట్టాలన్నారు.

ఒకే సముద్రం విశాఖ, చెన్నై తీరాలను తాకుతూ అలజడి చేస్తూ ఉంటుంది. ఫాల్గుణ మాస కృష్ణ పక్షం. సాయం సంధ్య. అటు సబ్‌మెరీన్‌, ఇటు సరికొత్త విమాన మ్యూజియం. దూరంగా కరి ప్రమాణంలో కదలని కొండ, దగ్గరలో నీటి అడుగు ఇసుక మేటలు తీస్తున్న తవ్వోడ – సముద్రం మీద కవిత్వం రాసిన తమిళ కవయిత్రి కుట్టి రేవతి మిత్రులను పలకరిస్తూ కలుపుగోలుగా స్వాగతం పలికింది స్వీట్‌ మేజిక్‌ గుమ్మంలో. డాక్టర్‌ మాటూరి శ్రీనివాస్‌, రేవతి, మరో ఇద్దరు లఘు చిత్రాల దర్శక నిర్మాతలు ఉండగా వెళ్ళారు రామతీర్థ, జగద్దాత్రి.

కవిత్వం నా రెండో ప్రాణం అంటారు రేవతి. మనం ప్రజల మాటలే రాస్తాము, అది మన కవిత్వం ఎందుకయ్యింది, అది ప్రజల వాక్కు అంటూ ఆమె కెరటాలు కెరటాలుగా కవిత్వ తరంగాలను విస్తరించింది. తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదం, అభిప్రాయ ప్రకటనం తమిళంలోకన్నా ముందే మొదలయింది. కుట్టి రేవతికి బాగా పేరు తెచ్చిన కవిత ములైగళ్‌. గత పద్దెనిమిదేళ్ళలో ఎనిమిది కవితా సంపుటాలు తెచ్చిన విలక్షణ స్వరం కుట్టి రేవతి. ఆమె 2002 లో ప్రచురించిన రొమ్ములు (ములైగళ్‌) కవిత్వ సంపుటి పట్ల, సంప్రదాయ తమిళ సమాజం తీవ్రంగా అభ్యంతరాలు తెలిపింది. కొందరు ఈ కవయిత్రిని చెంప పగలగొట్టాలి అంటే, కొందరు ఆమె కవిత్వ సంపుటి చెన్నై మౌంట్‌రోడ్‌లో తగులబెట్టాలన్నారు. ఆమె స్త్రీ వక్షోజాలు కేవలం ప్రదర్శనా వస్తువులుగా కాక, నివాసబద్ధ వాస్తవంగా చూసే ప్రయత్నమే తన కవితంలో చేశానని చెప్తూ, కొంత వివాదం ఊహించినా ఇలా ముదిరిన పద్ధతి వస్తుందని అనుకోలేదని తెలిపారు. ఎవరు స్త్రీ శరీరానికి హక్కుదారు అనే విషయాన్ని చర్చలో మరింత ముందుకు తీసుకువెళ్తూ, ఆమె ”మాటలతో నేను నా శరీరాన్ని నేస్తాను” అని ఒక వ్యాసం రాశారు. ఇంటర్వ్యూలు ఇచ్చారు. రేవతి వ్యాసాల్లో, కథల్లో స్త్రీ ఆత్మగౌరవ ప్రయాస, ఆమె ఆలోచనలకు ఇవ్వాల్సిన గుర్తింపు, విలువ గురించి ప్రస్తావిత చర్చలు ఉంటాయి.

నిజానికి ములైగళ్‌ కవిత చిన్నది. బహుముఖీన చిత్రణగా తోచదు. ఎందుకంటే, అప్పటికే మనం తెలుగులో అంతకన్నా పెద్ద కాన్వాస్‌మీద వచ్చిన కొండేపూడి నిర్మల కవిత ”హృదయానికి బహువచనం” చదివి ఉన్నాము కాబట్టి. స్త్రీకి భిన్న వయో దశల్లో రొమ్ముల పట్ల ఉండే భావన, ఆధునిక కవిత్వ ధర్మం పాటిస్తూ నిర్మల రాసిన కవిత పలు స్తరాల్లో నిలుస్తుంది. తెలుగు సాహిత్య లేదా పౌర సమాజం నిర్మలతో విభేదించి వాదులాటకు దిగలేదు. రేవతికి తమిళ సమాజంలో వచ్చిన నెగటివ్‌ ఆదరణకన్నా తెలుగు సమాజంలో నిర్మల పొందిన గౌరవం విలువైనది. ములైగళ్‌ కవిత ఇలా సాగుతుంది …

తెలుగులో స్త్రీ వాద కవిత్వం, ఇంకా సంపన్నంగా, బలమైన అభ్యంతరాలను నిలిపింది. మన కవయిత్రుల కూటమి ‘నీలి మేఘాల’ను తాకింది. అయితే కుట్టి రేవతి గత పద్దెనిమిదేళ్ళుగా రాస్తూ, తదితర తమిళ సమభావనల కవయిత్రుల కోసం, తన కోసం, స్త్రీల అస్తిత్వ ప్రాధాన్యత విషయంలో ‘పనికుడమ్‌’ (ఉమ్మనీరు) పేరిట ఒక స్త్రీ వాద పత్రికను కూడా 11 సంచికలు ఇంతవరకూ తెచ్చారు. సామాజిక మాధ్యమాలు, డాక్యుమెంటరీలు, చిత్ర నిర్మాణం ప్రస్తుతం ఈ కవయిత్రి ఎక్కువగా శ్రద్ధ పెడుతున్న రంగాలు. సాహిత్య అకాడెమీ గ్రాంట్‌తో దేశంలో వివిధ సాహితీవేత్తలను కలిసే ప్రాజెక్ట్‌ ఈమె విజయవంతంగా నిర్వహించారు. ఆ ప్రణాళికలో భాగంగానే ఆమె బెంగాల్‌లో మహాశ్వేతను కలిశారు. కేరళలో కమలాదాస్‌పై ఒక డాక్యుమెంటరీ తీశారు. మహాశ్వేత తనకు ప్రతిబంధకాలైన ఎన్నో సమాజ గుర్తింపులను చెరిపేసుకుని, ప్రజల పక్షాలన నిలిచిన ఒక మహాశక్తిగా రేవతి అభివర్ణిస్తారు. కమలాదాస్‌తో డాక్యుమెంటరీ కోసం కలిసి పనిచేసినా, మహాశ్వేతాదేవి సాహిత్య పరిధి, లోకదృష్టి చాలా విస్తృతమైనవి అని చెప్తారు. శ్రీలంక తమిళ కవి ప్రమీల్‌ తనను ప్రభావితం చేసిన కవి అని తెలిపారు.

తమిళ సాంప్రదాయ సాహిత్యంలో కన్నగి పాత్రకి గల ప్రజాదరణ ఎరిగి నేడు కాలగర్భంలో కలిసిపోయిన, అలనాటి చారిత్రక నగరం పూంప్‌హార్‌ నుంచి మధురై వరకు కన్నగి చేసిన యాత్ర తానొక డాక్యుమెంటరీగా కూడా తీశానని చెప్పారు. ”శరీరం పవిత్రతల కట్టుబాట్లతోను, హృదయంలో మధురై నగరాన్ని తగులబెట్టగల ఆగ్రహంతోనూ ఉన్నది కన్నగి” అంటూ ఒక కవిత్వ పించాన్ని విస్తరింపచేస్తుంది రేవతి. ”నా భాషను నేను కేవలం స్త్రీ శరీరం, ఆత్మలను కట్టి ఉంచుతున్న శక్తులను దెబ్బతీయడానికే అలా వాడుతాను” అనే కవయిత్రి రొమ్ములు, లైంగికావయవం, స్వయంతృప్తి వంటి మాటలు కవితల్లో ప్రతీకలుగా వాడినందుకు, నేరుగా ప్రస్తావించినందుకు, తమిళ సంప్రదాయ సమాజం ఈమె కవిత్వాన్ని పక్కన పెట్టగా, తమకు కూడా ఒక వాహిక కావాలి కనుక ‘పనికుడమ్‌’ పేరిట పత్రిక తెస్తున్నాము అని, ఎందరో ప్రస్తుత తమిళ స్త్రీ అస్తిత్వ రచనలు చేస్తున్నవారు ఈ పత్రిక ద్వారానే తమిళ పాఠకులకు మొదటగా పరిచయమయ్యారని చెప్పింది. సముద్రం మీద తాను రాసిన కవిత్వాన్ని సముద్రం పక్కనే కూచుని రామతీర్థ తెలుగు అనువాదం వినిపిస్తూ ఉంటే, కడలి కెరటంలా సంబరపడిపోయింది. ”మహిళా హక్కుల రచనలు చేసే వారిపై తమిళ పురుషాధిక్య సమాజంలో చిన్న చూపు, హేళన ఎక్కువ. మాకు అవమానకరంగా వారు ఏమైనా రాయవచ్చు, అది చదివి అందరూ సంతోషిస్తారు. ఇలాంటివి ఎన్నో చూశాము” అని తెలిపింది రేవతి.

డాక్యుమెంటరీలే కాదు, మంచి కథలు కూడా సినిమాలుగా తీయవచ్చు. ఆ దిశగా ఆలోచించారా అంటే ”మీరు నెమ్మదిగా మాట్లాడుతూనే నా ముందర ఎన్నో కొత్త లక్ష్యాలను ఉంచుతున్నారు. ఎంతో అభిమానం ఉంటే తప్ప మా తమిళ సాహిత్య లోకంలో కూడా ఇలా ప్రేమ, శ్రద్ధ, పట్టించుకోవడం సాధ్యం కాదు” అంటూ, ఆమె కవిత్వ తెలుగు రూపాలతో పలకరించినందుకు గుర్తింపుగా మనం ముందు ముందు కలసి పనిచేద్దాం అన్నది కుట్టి రేవతి. అనంతాంబరపు నీలి నీడల జగతి కనులను, రామతీర్థ కవితానువాదాలనూ, డాక్టర్‌ శ్రీనివాస్‌ స్నేహశీలతను అబ్బురంగా స్వీకరించింది కుట్టి రేవతి. ఎనిమిది కవితా సంపుటాలు, ఆరు డాక్యుమెంటరీలు తీసి తమిళ ప్రధాన స్రవంతి సినిమాలో కొంత కృషి చేస్తున్నారు. సిద్ధ వైద్యంలో డాక్టరేట్‌ గల మహిళ, కుట్టి రేవతి తాను సముద్రం మీద తమిళంలో రాసిన ఈ కవిత తెలుగులో వినిపిస్తేనే అంతలా సంబరపడ్డది. సముద్రం ఆది తాయి అంది ఆమె (ఆది తాయి అంటే తొలి తల్లి అని అర్థం). నీటి నుంచి నేల పైకి ప్రాణం ప్రయాణించిందని సైన్స్‌ చెప్పడం విన్నాము అదే కవి చెప్తే – ఇలా ఉంటుంది…

ఆది తాయి (తొలి తల్లి)

మన ప్రాచీన మాతృమూర్తి

కడలి రూపం దాల్చింది

పైకెగుస్తూ న్యాయం కోసం ఆమె ఆవేశం

ఎగిసే అలలయ్యింది

గుండెలు బాదుకుంటూ

ఆమె తన పాటలు రాసింది

శరీరాన్ని ఓ శిలువ లాగా మోసుకెళ్ళింది

మానవాళి మెరుగైన దశ కోసమై

భూ పాత్రలోకి ఒదిగి

ఆమె ఎండి ఉప్పయినా అయింది

లేదూ సురగా మారింది

మళ్ళీ ఆమె మూలికా ఔషధమయ్యింది

రాయబడని చరిత్రల జ్ఞాపకాలను కలయబెడుతూ

తను తీసుకెళ్ళే నిప్పుగిన్నెలో

కొన మంటలపైన ప్రతి దినాన్నీ సృష్టిస్తుందామె

ఓటములను నిత్యం ప్రేమిస్తుంది

తన పిల్లలను అలలుగా మార్చి

పంపుతుందామె ఒడ్డున ఆడుకునేందుకు

నదీ శయ్యలు ఆమె చీరంచులై పైకుబుకుతుంటాయి

ఆమె వెతలన్నీ అక్కడ సముద్రపు నాచు రంగుదేలి ఉంటాయి

అక్కడ మన తొలి తల్లి

చేప రూపాన ఇంకా తచ్చాడుతూ ఉంటుంది

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.