ఒక ప్రేమ – రెండు విలువలు – యం. రత్నమాల

 

బి.ఎ సెకండ్‌ ఇయర్‌ క్లాస్‌ తీసుకుని స్టాఫ్‌ రూమ్‌ కొచ్చే సరికే కరుణ తన క్లాసు ముగించుకొని వచ్చి కిటికీ పక్క చైర్లో కూర్చుని ఉంది. ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ అందర్ని నవ్విస్తూ గల గలా పారే సెలఏరులా ఉండేది. నేనొచ్చి పక్కనే కూర్చున్నా గమనించనంత పరధ్యానంగా కుర్చీలో వెనక్కు వాలి, ఇంతకు ముందయితే కిటికీలోంచి కన్పించే పూలచెట్లు చూస్తూ చెట్లపై వాలిన రంగుల పక్షుల కువకువలు వింటూ గడిపే కరుణ పైకప్పుకేసి శూన్యంలో చూస్తూ చూళ్ళేక పోయాను. ఇంట్లోనూ ఇదే వరస. అమ్మా, ఆంటీ కేమయింది మట్లాడ్డం లేదంటూ పిల్లలు. ఏం చెప్పేది.

కరుణ నేను మా ఊర్లో ఉన్నప్పుడు ఒకే స్కూలు. తరువాత హైదరాబాద్‌ నారాయణ గూడ రాజబహద్దూర్‌ స్కూలు, హాస్టలు.

ఉస్మానియాలో నేను పొలిటికల్‌ సైన్సు, కరుణ ఎకనామిక్సు – ఇప్పుడు ఇద్దరం ఆంధ్రమహిళా సభ కాలేజ్‌లో లెక్చరర్లుగా ఒకే చోట. బాల్యస్నేహం కొనసాగింపుగా పై చదువు కలిసే, ఉద్యోగం ఒకే చోట… చిరకాల స్నేహం మరింత బలపడింది.

నాకిద్దరు పిల్లలు. పాప పెద్దది, రెండో క్లాసు. చిన్నోడు బాబు, ఎల్‌కేజీ. కరుణ ఇప్పటికీ ఒంటరిగానే. మా వారు మాధవ్‌కి అక్క చెల్లెలు లేరు. చెల్లెమ్మ అంటూ ఆయన, మాధవన్నయ్యా అంటూ కరుణ. స్వంత అన్నా చెల్లెళ్ళకంటే కలివిడిగా ఉంటారు. ఎక్కడో వర్కింగ్‌ హాస్టల్‌ ఎందుకని మాధవ్‌ నేనూ ఆలోచించుకుని ఆరు గదులు, రెండు హాళ్ళు ఉన్న పెద్దిల్లు తీసుకుని ఒక హాలు, గది కరుణకిచ్చాం. తిండి తిప్పలు మాతోనే. ఒక విధంగా పేయింగ్‌ గెస్ట్‌లా. పిల్లలు మాతో కంటే దాంతోనే ఎక్కువ గడపుతారు. పాపకి జడలు వేసి, బాబుకి జుట్టు దువ్వి స్కూలుకి తయారు చెయ్యడం, సాయంకాలం స్కూల్‌ నుంచి వచ్చాక పాపతో హోంవర్క్‌ చేయించడం, బాబుతో రెయిమ్స్‌ వల్లెవేయించడం అన్నీ కరుణే చూసుకునేది. నేను వంట ముగించే లోపల పిల్లల్తో కలిసి ‘అమ్మా, తల్లీ రాజ్యలక్ష్మీ దేవీ, ఆకలేస్తోంది అన్నం పెట్టమ్మా’ అంటూ ఆటపట్టించేది.

కరుణని కూడా ఒకింటిదాన్ని చెయ్యాలని మా ఆయనకి ఆత్రంగానే ఉంది కానీ ఎట్ల? దీని మనసంతా కాలేజీ రోజుల్నుంచి పెనవేసుకున్న అనుబంధాన్ని, ప్రేమనీ కాదని కరుణ మనసునీ ప్రేమని అపార్థం చేసుకుని దూరంగా వెళ్ళిపోయి కనీసం ఉత్తరాలకైనా జవాబివ్వని సుధీర్‌ ఆలోచనల్తోనే. ఇట్లా ఎప్పుడూ మౌనంగా అన్యమస్కంగా సుధీర్‌ ధ్యాసలో దిగులుగా. కరుణని అసలు చూడ్లేక పోతున్నా. ఎట్లా ఏం చేసి దీని మనసు మళ్లించాలి – సుధీర్‌ కరుణని కాదనుకుని వెళ్ళిన విషయం తెలియక సుధీర్‌ అడ్రసివ్వు నేను వెళ్ళి మాట్లాడొస్తానని మా ఆయన మాటి మాటికీ అంటుంటే ఆయనకు వాళ్ళిద్దరిమధ్య అపోహలు చెప్పలేక, ఏ సమాధానం చెప్పాలో తోచక ఇబ్బంది పడుతున్న నేను ఈ రోజు కరుణతో సుధీర్‌ విషయం మాట్లాడాలని అనుకున్నా.

”కరుణా, మీ అన్నయ్య సుధీర్‌ దగ్గరికి వెళ్లొస్తా అడ్రసిమ్మంటున్నాడే” అన్నా భుజం మీద చెయ్యేసి. చటక్కున తలతిప్పి కంగారుగా చూస్తూ ”వొద్దు… వొద్దద్దని చెప్పు. ఈ విషయలేవీ మాధవన్నకు తెలవటం నా కిష్టం లేదు. అయినా ధీర్‌ నా నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయాడని ఎందుకనుకుంటున్నావు” అంది కరుణ. ప్రేమగా ధీర్‌ అంటే సుధీర్‌ అంతకంటే ముద్దుగా కరుణమ్మా అని, కారుణ్యా అని, కరుణామయి అని పిలుచుకునేవాడు. ఇంత ప్రేమను ఎట్లా దులపరించుకున్నాడో! సంవత్సరం దాటింది, కరుణ ఉత్తరాలక్కూడా బదులివ్వడం లేదు. ఇది మాత్రం సుధీర్‌ ధ్యాసలో మౌనంగా, నిర్లిప్తంగా ఎట్ల ఉండేది ఎట్లయిపోతోంది. ఏదో ఒకటి చెయ్యాలి.

… … …

మేం డిగ్రీ సెకండ్‌ ఇయర్‌లో ఉండగా ఓరోజు అధిక ఫీజు, కళాశాల్లో అధ్యాపకులు అన్ని సబ్జెక్టులకు చాలినంత మంది లేకపోవడం… ఇట్లా కొన్ని విద్యార్ధి సమస్యల మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం నించి అసెంబ్లీకి ర్యాలీ ఉందని, మేం కూడా కాలేజీ బహిష్కరించి ర్యాలీలో పాల్గొనాలని ఇద్దరమ్మాయిలు, అయిదారుగురు అబ్బాయిలు మా కాలేజీ కొచ్చారు. సుధీర్‌ తనతో పాటు మరో ఇద్దర్ని తీసుకుని ప్రిన్స్‌పాల్‌తో మాట్లాడి కాలేజీ ఆ రోజు మూసివేయడానికి ఒప్పించాడు. ప్రిన్స్‌పాల్‌ కూడా ఒప్పుకోవడంతో మేం చాలా మందిమే ఆ ర్యాలీకి వెళ్ళాం. అదే సుధీర్‌తో మా మొదటి పరిచయం. మా అందర్లో చురుగ్గా చొరవగా ఉండే కరుణ మొదటిసారి అయినా ఊరేగింపులో ఉత్సాహంగా నినాదాలివ్వడం చేసింది. మా కాలేజీ వాళ్ళందరిని వరుస క్రమంలో ర్యాలీలో నడిపించిన సుధీర్‌ ఆ తర్వాత ఏ కార్యక్రమం జరిపినా మా కాలేజీవాళ్ళను తీసుకురమ్మని కరుణకు కరపత్రాలూ అవీ ఇచ్చి వెళ్ళేవాడు. ఏ కార్యక్రమం జరిగినా మా కాలేజీకి సంబంధించి కరుణకే పనులు చెప్పేవాడు. ఇట్లా మొదలైన మా పరిచయం విద్యార్ధి ఉద్యమ కార్యక్రమాల నిర్వహణ క్రమంలో సుధీర్‌, కరుణ మధ్య స్నేహం, ప్రేమ కూడా పెరిగింది. ఇన్నేళ్ళ స్నేహం, ప్రేమ అన్నీ మరచి సుధీర్‌ ఎందుకిట్లా కరుణ ఉత్తరాలకు కూడా బదుల్వికుండా అయ్యాడు? ఎందుకట్ల మారిపొయ్యాడు? ఎందుకింతగా అపార్దం చేసుకున్నాడు? మేం డిగ్రీ పూర్తై ఉస్మానియాలో ఎమ్‌.ఏలో చేరాం. సుధీర్‌ అప్పటికే ఎమ్‌.ఎ. ఎకనామిక్స్‌ పూర్తి చేసి ‘ఎకానామిక్స్‌ ప్రిన్స్‌పుల్స్‌ ఆఫ్‌ మార్క్సిజం’ అనే విషయంపై ఎమ్‌.ఫిల్‌ చేస్తున్నాడు.

ఎమ్‌.ఏ. మొదటి సంవత్సరం తర్వాత ఎండాకాలం సెలవుల్లో మంచి సంబంధం వచ్చింది. కట్నం లాంటి పట్టింపులు లేవు, ఎంతిచ్చినా, ఇవ్వకపోయినా వాళ్ళకు పట్టింపులు లేవు. పెద్దమ్మ బిడ్డ రాధిక పెళ్ళిలో నన్ను చూసిన మాధవ్‌ నేను నచ్చి పెళ్ళికి వచ్చిన వాళ్ళమ్మా నాన్నలతో కూడా నేన్నచ్చిన విషయం చెప్పి ఒప్పించాడట. మాధవ్‌కి రైల్వేలో సికింద్రాబాద్‌ కార్యాలయంలో హెడ్‌ క్లర్కు ఉద్యోగం. మావాళ్ళు మాధవ్‌తో పాటు వాళ్ళ కుటుంబం నచ్చడంతో అదే ఎండాకాలంలో మా పెళ్ళయిపోయింది.

మేం తార్నాకాలో ఇల్లు తీసుకుని కొత్తకాపురం మొదలెట్టాం. కరుణ లేడీస్‌ హస్టల్‌లోనే ఉండిపోయింది. క్లాసయిపోగానే మాధవ్‌ స్కూటరేసుకుని ఆర్ట్స్‌ కాలేజీ మెట్ల దగ్గర ఎదురు చూడ్డం, నేను కరుణకి హఢావుడిగా మెట్లమీదనుంచే బాయ్‌ చెప్పి మా ఆయన వెనకాల వెళ్ళిపోవడం. ఒక్కతే లేడీస్‌ హస్టల్‌కి పోతున్న కరుణతో సుధీర్‌ రోజూ హాస్టల్‌ దాకా వెళ్ళి దిగబెట్టిరావడం. దార్లో యూనివర్సిటీ సమస్యలు మొదలుకుని జాతీయ, అంతర్జాతీయ సమస్యల దాకా చర్చ. చర్చ అనేకంటే సుధీర్‌ చెప్పే విషయాల్ని కరుణ కళ్ళింత చేసుకుని సుధీర్‌నే చూస్తూ చెవులప్పగించి వినడం. ఇట్లా వాళ్ళ స్నేహం పెరిగి పెరిగి ప్రేమగా ఎదిగింది. ఎమ్‌.ఏ పూర్తి చేసి ఉస్మానియాలోనే ఎమ్‌.ఫిల్‌ మొదలుపెట్టింది కరుణ. సుధీర్‌ ఎమ్‌.ఫిల్‌ పూర్తిచేసి జె.ఎన్‌.యులో పి.హెచ్‌.డి చేయడం కోసం ఢిల్లీ వెళ్ళినా ఆ దూరం వాళ్ళిద్దరి మధ్య వారానికి రెండు, మూడు ఉత్తరాల్తో దూరాభారాలకు అతీతంగా మరింత బలపడింది.

ఎమ్‌.ఏ. అయిపోయే నాటికే నాకు పాప పుట్టింది. పాపను మా అత్త చూసుకునేది. మాధవ్‌తో పాటు వాళ్ళమ్మ, అదే మా అత్త ప్రోత్సాహంతో నేనూ ఎమ్‌.ఫిల్‌లో చేరాను. ఢిల్లీ వెళ్ళిన రెండేళ్ళ దాకా కరుణా సుధీర్‌ ప్రేమ దినదిన ప్రవర్థమానంగా ఉత్తరాల్లో పెరుగుతూనే ఉంది. సెలవులని సుధీర్‌ ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఏరాత్రో హాస్టల్లో విడిచి వచ్చేంత వరకు ఒకర్నొకరు విడిచి ఉండే వాళ్ళే కాదు. ఎమ్‌.ఫిల్‌. పూర్తయ్యే సరికి పాప తర్వాత నాకు బాబు పుట్టాడు. ఎమ్‌.ఫిల్‌ అయిపోయిన సంవత్సరంలోపే మాకు ఉస్మానియా ఆంధ్రమహిళా సభ కళాశాలలో కరుణకీ, నాకూ ఇద్దరికీ ఒకేచోట ఉద్యోగాలు వచ్చాయి. నేనుద్యోగంలో చేరిన సంవత్సరంలో మా అత్త చనిపోయింది. ఎట్లాగూ మాధవ్‌ కరణని స్వంత చెల్లిలా చూసుకుంటాడు. పిల్లలూ కరుణాంటి అంటూ దాని వెంటవెంటే తిరుగుతూ ఉంటారు. అదొక్కతే ఎక్కడో వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్లో ఎందుకుని మేం కాస్తపెద్దది ఇప్పుడున్న ఇల్లు తీసుకుని కరుణకి పెద్ద గది, చిన్న హాలు ఇచ్చాం. మా ఇంట్లోనే తిండి తిప్పలు. పిల్లలతో సరదాగా గడపడం. ఇద్దరం ఉద్యోగానికి కలిసి పోతూ, కలిసివస్తూ సరదాసరదాగా హాయిగా గడిచిపోతోంది.

… … …

ఈ ఎండా కాలం సెలవుల్లో సుధీర్‌ ఎందుకో రాలేదు. అంతకు ముందు జనవరి సెలవుల్లో వచ్చినప్పుడు తనూ మాతోపాటే మా ఇంట్లో ఉన్నాడు. కరుణా మేము కలిసి ఒకే ఇంట్లో ఉన్నందుకు ఎంతో సంతోషించాడు.

”కరుణ మీతో ఉంది. ఇంక నాకేం బెంగ లేదు. నేను నిశ్చింతగా ఢిల్లీ వెళ్లి ఇంకో రెండేళ్ళలో పి.హెచ్‌.డి పూర్తి చేసుకుని వచ్చి ఇక్కడే ఉద్యోగం చూసుకుంటాను. అందరం ఇంకాస్త పెద్దిల్లు తీసుకుని మీరూ పిల్లలు అందరం కలిసే ఉందాం” అని ఎంతో ఆనందంగా అంటే ”ఏం మీకు పిల్లలొద్దా” అని నేను ఆట పట్టించే దాన్ని. ”ఎందుకొద్దు, అదే మీ పిల్లలు, మా పిల్లలు అందరం మనలాగే కలిసి పోయి ఆనందంగా ఉండొచ్చు” అనే వాడు. అట్లాంటి సుధీర్‌ ఈసారి ఎండాకాలం సెలవుల్లో ఎందుకో రాలేదు. కనీసం ఎందుకు రాలేదో ఉత్తరమైనా లేదు. కరుణ రాసిన ఉత్తరాలకి జవాబు రాలేదు.

ఏమయ్యుంటుంది. నాకే ఇంత ఆత్రుతగా ఉంది. ఇంక కరుణ అందోళన చెప్పనలివి కానిది. కరుణ మనసెరిగిన దాన్ని. సుధీర్‌ని చూడాలన్న దాని మనసుని గ్రహంచి ఢిల్లీలో జె.ఎన్‌.యులోనే చదువుకుంటున్న మా చిన్నమ్మ బిడ్డ సరితకి ఉత్తరం రాశాను. ఇట్లా నా స్నేహితురాలు కరుణ పనిమీద ఢిల్లీ వస్తుందని నీతో పాటు కొద్ది రోజులు హాస్టల్‌లో గెస్ట్‌గా ఉంచుకుని అక్కడ దానికి అవసరమైన సహాయం చేసిపెట్టమని. మాధవ్‌ ఎట్లాగూ రైల్వేలోనే కనుక వెంటనే రిజర్వేషన్‌ చేయించి, మాధవ్‌, నేను దగ్గరుండి ఎపి ఎక్స్‌ప్రెస్‌ ఎక్కించి, బోగీ నంబరు అన్నీ వివరంగా సరితకి ఫోన్‌ చేసి ఇంటికొచ్చాము. సుధీర్‌ అడ్రస్‌కి కూడా కరుణ వస్తున్నట్లు టెలిగ్రాం ఇచ్చాం. కాని అదక్కడికి ఎట్ల చేరుతుందో, సుధీర్‌ అక్కడ ఉన్నాడో లేదో, కలుస్తాడో లేదో, కలిసినా ఏమంటాడో? తనెందుకు హఠాత్తుగా ఉత్తరాలు కూడా మానేసాడో? ఎటువంటి విషయం వినాల్సి వస్తుందో అని ఆందోళనగానే ఉంది. అక్కడికెళ్ళి కరుణని వెంటనే ఫోన్‌ చేసి మాట్లాడమని చెప్పాను. అయినా అప్పటి దాక మనసు మనసులో ఉంటేగా. కరుణ వెళ్ళగానే సరిత ఫోన్‌ చేసింది. తాను స్టేషన్‌కి వెళ్ళి కరుణను రిసీవ్‌చేసుకున్నానని, కరుణ స్నానం చేస్తోందని, ప్రయాణపు అలసట తీరాక ఫోన్‌ చేయిస్తానని. అయితే సుధీర్‌ స్టేషన్‌కి రాలేదన్నమాట. కరుణతో ఎప్పుడెప్పుడు మాట్లాడతానో అని ఆత్రంగా ఉంది. సాయం కాలం సరిత ఫోన్‌.

కరుణ గొంతు వినగానే ఆత్రంగా అడిగా ”సుధీర్‌ స్టేషన్‌కు రాలేదు, ఎందుకు రాలేదట” అని. ”రాలేదు. అయినా ఎందుకు రాలేదో నాకెట్ల తెలుస్తుంది. తనని నేనింకా కలవలేదుగా” అంది. ”సరెసరే, రేపే కలువు. ఆలస్యం చేయకు. వచ్చిన తెల్లారైనా కలసుకోకుంటే నొచ్చుకుంటాడేమో. వెళ్ళిన పని అశ్రద్ధ చెయ్యకు” అంటూ మళ్ళీ మళ్ళీ జాగ్రత్తలు చెప్పేదాకా మనసాగలేదు.

మర్నాడు యూనివర్సిటీకి వెళ్ళి కరుణ సుధీర్‌ను కలిసిందట. ”ఏమైంది ఇన్ని రోజులు? కనీసం

ఉత్తరాలకైనా ఎందుకు జనాబివ్యలేదట? అసలు తన ఉద్దేశమేంటట? అమ్మాయిలంటే అసలేమను కుంటున్నాడు? ఏంటి సంగతి, ఎందుకంత నిర్లక్ష్యం అడిగావా?” అది సమాధానం చెప్పేలోపే నా ప్రశ్నల మీద ప్రశ్నలు. ”ఇన్ని ప్రశ్నలకు ఇట్ల ఫోన్‌లో ఏం చెప్పేది, నాలుగైదు రోజుల్లో వచ్చేస్తాగా. అప్పుడు అన్నీ తీరిగ్గా చెప్తాగా” అంది.

”ఏంటి! అయిదారు రోజుల్లో వస్తావా? ఎందుకు ఇంకా వారం రోజులు సెలువులున్నాయిగా. సరదాగా ఇద్దరూ అగ్రా వెళ్ళి తాజ్‌మహల్‌, ఇంకా చుట్టుపక్కల చూడదగినవి, ఢిల్లీలో కుతుబ్‌ మినార్‌, ఇంకా ఎన్నో టూరిస్ట్‌ స్పాట్స్‌ అన్నీ చూడండి. ఇన్నాళ్ళ దూరం ఇట్టేపోతుంది” అన్నా నవ్వుతూ. ”సెలవులు నాకు గాని సుధీర్‌కు కాదుగా” అంది కరుణ. ”అబ్బా తనదేమన్నా ఉద్యోగమా సెలువు లేకపోవడానికి, పి.హెచ్‌.డి. చేస్తున్నాడు. రోజూ హాజరు వేయించుకోవాలా ఏమిటి, సరదాగా అన్నీ తిరగండే మోద్దూ. ఎందుకంటున్నానో అర్థం చేసుకోవూ” అంటూ విసుక్కున్నాను. అది విని తేలిగ్గా సరేలే అంటూ ఫోన్‌ పెట్టేసింది.

అన్నట్లే అది మూడు రోజుల్లోనే ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమైంది. ఆశతో ఢిల్లీ వెళ్ళిన కరుణ నిరాశతో తిరుగు ప్రయాణమైన విషయం కరుణను హైదరాబాద్‌ రైలెక్కించి ఇంటికి రాగానే సరిత నాకు ఫోన్‌ చేసి చెప్పింది. పూర్తిగా కాకపోయినా సుధీర్‌ విషయం తనకు ఎంతో కొంతైనా తెలిసిన విషయాలు చెప్తూ తానీ విషయాలు నాకు చెప్పినట్లు కరుణతో చెప్పొద్దని, తనకీవిషయాలు ముందే కొంత తెలుసన్న విషయం కరుణకి తాను తెలియనివ్వలేదని చెప్పింది.

విషయం అర్థం అయింది కనుక అది ఇంటికి వచ్చేదాక ఆగకుండా మాధవ్‌క్కూడా ఈ విషయాలేమీ చెప్పకుండా స్టేషన్‌ కెళ్ళి రిసీవ్‌ చేసుకున్నాను. దిగులుగా, బేలగా రైలు దిగుతున్న దాన్ని చూసి నాగుండె తరుక్కుపోయింది. గబగబా ట్రైన్‌ దగ్గరికి వెళ్ళి దాని చేతిలోని కొంత లగేజ్‌ని అందుకున్నాను. ఇంటికొస్తూనే ”వచ్చేప్పుడు గీజర్‌ ఆన్‌ చేసే వచ్చాను. స్నానం చేసి రెస్ట్‌ తీసుకో” అనిచెప్పి వంటగదిలోకెళ్ళాను. ఎక్కడ నోరు తెరుస్తానో సరిత చెప్పిన విసయాలు బైట పెడతానో అని నన్ను నేను కంట్రోల్‌ చేసుకోడం కష్టంగా ఉంది. కరుణ సూట్‌ కేస్‌ తెరిచి పిల్లలకి బొమ్మలు, ఆగ్రా స్వీట్‌ డబ్బాలు ఇచ్చి బాతూరూంలోకెళ్ళింది.

ఈ లోగా నేను టేబుల్‌పైన అన్నీ సర్ది ”పిల్లలతో నువ్వూ భోంచేసి రెస్టు తీసుకో. ఆదివారం కదా, మాధవ్‌ బజారుకెళ్ళాడు. రాగానే మేం భోంచేస్తాం” అని ముగ్గురికీ వడ్డించాను. ఇదీ మంచిదేలే రాగానే తననేం అడక్కుండా భోంచేసి రెస్టు తీసుకో అనడంతో నేను రాగానే అక్కడ ఏం జరిగిందని అడుగుతానేమో అనుకని ఇబ్బంది పడ్డ కరుణ నేనేమీ అడక్కపోగా భోంచేసి రెస్టు తీసుకో అనడంతో కాస్త స్థిమిత పడి వేడి వేడి అన్నం ఆవురావురు మంటూ తిని తన గదిలోకి వెళ్ళిపోయింది.

రాత్రి అందరి భోజనాలయ్యాక పిల్లలూ, మాధవ్‌ పడక లెక్కాక వంటిల్లు సర్ది నేను కరుణ గదిలోకి వెళ్ళాను. అదింకా నిద్రపోయుండదని, నిద్ర పట్టదని తెలుసు. నేను లోపలికి వెళ్లగానే లేచి కూచుంది నిర్లిప్తంగా మాటామంతీ లేకుండా. అయిదు నిమిషాలాగి ”ఏంటే ఏం మాట్లాడవు? వచ్చాక చెప్తా అన్నావుగా ఏం జరిగింది. ఇన్నాళ్ళుగా సుధీర్‌ ఎందుకు ఉత్తరాలు రాయట్లేదట? గట్టిగా అడిగావా లేదా? నువ్వేమో మెతక. ఇట్ల ఉండగూడదే, కొన్ని విషయాల్లో సీరియస్‌గా ఉండాలి” అన్నా.

”గట్టిగా కాదు, మెల్లిగా కూడా అడగాల్సిన అవసరం లేకుండా అన్నీ తానే నేనడక్కముందే చెప్పాడు. ఇంక నేనేం అడిగేది” అంది. ”ఏం? ఏం చెప్పాడు” తలొంచి మెల్లగా చెప్పింది – అక్కడ తనకో అనుకోని సంబంధం ఏర్పడిందని.

”ఏంటే అమాట నీమోహం మీదే చెప్పాడా! ఎంత ధైర్యం అతగాడికి. నేనక్కడుండాల్సింది గట్టిగా నాలుగు పెట్టేదాన్ని” అన్నా.

”అమ్మా తల్లీ రాజ్యలక్ష్మీదేవీ, నువ్వంతటి దానివే అని నాకు తెలియదా. అందుకే ధీర్‌ బతికిపోయాడులే” అంది. నన్నేదోకూల్‌ చేయడానికి ప్రయత్నిస్తూ ఓ నిర్జీవపు నవ్వు నవ్వి నాకు విషయాలు పూర్తిగాకాక పోయినా సరిత చెప్పిన విషయాలు నాకేమీ తెలియనట్లుగానే ”అసలేం జరిగిందో చెప్పు” అన్నాను.

”అక్కడ జె.ఎన్‌.యులో ధీర్‌ కంటే పది పన్నెండేళ్ళు పెద్దదైన సోషియాలజీ ప్రొఫెసర్‌ కుముదినీ సక్సేనాతో ధీర్‌కి అనుకోని పరిస్థితుల్లో శారీరక సంబంధం ఏర్పడిందట” తలొంచుకుని మెల్లగా చెప్పింది.

”నువ్వెందుకే తలొంచుకుంటావు, చేసిన పనిని అతనంత ధైర్యంగా తలెత్తుకుని నీ మొహంమ్మీదే చెప్పినప్పుడు నువ్వేం అనలేదా? నీలదీయలేదా? కొంపదీసి వాళ్ళిద్దరికి కంగ్రాట్స్‌ చెప్పి రాలేదుకదా” అన్నాను కోపంగా.

”లేదులే నాకా అవకాశం. ధీర్‌తో కలిసి జీవించే ఉద్దేశం ఆమెకూ లేదు. విదేశాల్లో చదివి వచ్చింది మొదట్నించి ఉన్నత వర్గ సామాజిక జీవనం, విదేశాల్లో చదువుతున్న కాలంలో సంబంధాల విషయంలో పట్టింపులు లేకుండా ఉండడం అలవాటు. భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటోంది. అట్లా అని ఇక్కడ మనలా ఆమె భావంలో, భాషలో చెప్తే చాదస్తంగా ఉండదూ. ‘మూడు తరాలు’ కథలో సెన్యా మాట్లాడుతుంది చూడు, అట్లా అన్నమాట. ఇప్పుడు ధీర్‌ అంతే” అంది.

”ఆమె అంటే సరే. మరి సుధీర్‌ మాటేమిటి? తను అట్లాకాదుకదా! మానవ సంబంధాల విషయంలో సుధీర్‌ ఎంతనిఖ్ఖచ్చిగా

ఉండేవాడు ఇక్కడున్నప్పుడు. నువ్విక్కడో దానివి అతని కోసం ఎదురు చూపులు చూస్తున్నావని తెలియదా? ఆ విషయం ఆమెకు చెప్పొచ్చుకదా!”

”ఆమే, అక్కడ ఇంకొందరు అప్పటికే అక్కడో లెఫ్టిస్ట్‌ స్టడీ సర్కిల్‌ నడుపుతున్నారట. ధీర్‌ ఆ సర్కిల్‌కి పిలిస్తే వెళ్ళాడట. అట్ల రెండుమూడు సార్లు వెళ్ళాక ఓ రోజు వాళ్ళింట్లో స్టడీ సర్కిల్‌ పూర్తయ్యాక అందరితో పాటూ ధీర్‌ వెళ్ళిపోబోతుంటె ‘సుధీర్‌ నవ్వుండు, ఇవన్నీ సర్ధుకోవడంలో నాక్కాస్త హెల్ప్‌ చేద్దువుగాని’ అందట. అక్కడున్న చాపలు తీసి, కప్పులూ, ప్లేట్లూ తీసి సింక్‌లో వేసి, అన్నీ సర్దాక పోతుంటే ‘ఉండు భోంచేసి పోదువుగాని’ అందట. భోంచేసి వెళ్ళిపోబోతుంటే ‘విల్‌ యు షేర్‌ బెడ్‌ విత్‌ మి’ అందట. సుధీర్‌ ఇబ్బందిగా తన పర్స్‌లో ఉండే నా ఫోటో చూపిస్తూ నా గురించి చెప్పాడట. ‘పి.హెచ్‌.డి. అయిపోయి ఉద్యోగంలో చేరగానే పెళ్ళి చేసుకుంటా. ఈ విషయం వాళ్ళింట్లో మా ఇంట్లో కూడా చెప్పాం, ఒప్పించాం’ అని కూడా చెప్పాడట. ‘చేసుకోవోయ్‌, ఇక్కడిక్కూడా తీసుకురా నేనూ చూస్తాను. ఐ వాంట్‌ టు షేర్‌ బెడ్‌ విత్‌ యు దట్సాల్‌’ అందట. అంటూనే చొరవ తీసుకుందట” అంటూండగానే ”ఇక ఆ పనే ఆపు. చొరవ తీసుకుందట, తీసుకుంటే తన బుద్దేమయిందట, అట్లా లొంగిపోవడమేనా – నువ్వూ ఎంత బాగా చెప్తున్నావే! వినడానికి నాకే ఇంత చిరాగ్గా ఉంటే నీకేం అన్పించడం లేదా” అప్రయత్నంగా గొంతు పెరిగింది.

”ష్ష్‌ చిన్నగా. అన్నయ్య వింటాడు. మాధవన్నయ్యకి ఈ విషయలేవీ చెప్పకు” అంది. ”సరేలే చెప్పను గానీ ఇంతకూ నువ్వేం చేయ దల్చుకున్నావ్‌? ఆయన గారు చెప్పింది చెవులారా వినివచ్చావు ఒక్క మాటైనా అనకుండా. నీ పరిస్థితేంటి” అన్నా గొంతు తగ్గించినా కోపం తగ్గించలేకపోయాను.

”పి.హెచ్‌.డి అయిపోయాక ఇక్కడికి వస్తాడుగా, అప్పుడు చూద్దాం. ‘పి.హెచ్‌.డి పూర్తిగాకపోయినా ఇక్కడేదయినా కాలేజీలో పోస్టులు పడితే ధరఖాస్తు ఫారం పంపించు, ఉద్యోగం వస్తే వచ్చేస్తా. పి.హెచ్‌.డి. పూర్తి కాకపోయినా వచ్చేస్తాను. నన్ను నువ్వు గాక ఎవరర్ధం చేసుకుంటారమ్మా. నీలా నన్నెవరు చూసుకుంటారు కరుణమ్మా’ అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ధీర్‌నలా నేను చూడ్లేనని నీకూ తెలుసు” అంది అపరాధ భావంతో తలొంచుకుని.

”నువ్వెందుకే తలొంచుకుంటావు, తలొంచుకొవాల్సింది అతగాడు. ఆయనగారు బాధపడ్డాడట, ఈ రుణమ్మ కరిగిపోయిందట. సరే మధ్యలో నాకేంటి” కోపంగా లేచి తలుపు దబాల్న వేసివచ్చాను. నయం నేవచ్చేసరికే మాధవ్‌ నిద్రపోయాడు. లేకపోతే నా మోహం చూసి ఏదో జరిగిందని కనిపెట్టేసేవాడు.

… … …

రుణ పేపర్లో కనపడ్డ ప్రకటనల్లా చూసి ఆ కాలేజికి వెళ్ళి ఉద్యోగ ధరఖాస్తు ఫారం తీసుకుని సుధీర్‌కి పంపేది. సుధీర్‌ అయిదేళ్ళకు పైనే సాగదీసే పి.హెచ్‌.డి. థీసిస్‌ నాలుగేళ్ళకే పూర్తి చేసి హైదరాబాద్‌ తిరిగి వచ్చేశాడు. హైదరాబాద్‌ రావడానికి నాల్నెల్ల ముందు భద్రుకా కాలేజీలో ఎకనామిక్స్‌ లెక్చరర్‌ కోసం పడిన ప్రకటన దరఖాస్తు ఫారం కరుణ పంపిస్తే అప్లై చేసి ఇంటర్వ్యూక్కూడా హాజరై వెళ్ళాడు. ఉద్యోగం రాగానే నెలరోజుల్లోనే భద్రుకాలో చేరాడు. అక్కడ జరిగిందేదో జరిగిపోయిందిలే అనుకుని అందరం మామూలుగా ఇంతకు ముందులా స్నేహంగా ఉన్నాం.

అప్పుడప్పుడు వస్తూండడం వల్ల మాస్టాఫ్‌కి సుధీర్‌ తెలుసు. లెక్చరర్స్‌ యూనియన్‌లో యాక్టివ్‌గా పని చేసేవాడు. మాస్టాఫ్‌ను సభ్యులుగా చేర్పించడంతోపాటు పత్రికలు, పుస్తకాలు వాళ్ళతో కొనిపించేవాడు. భుజానికి వేళ్ళాడే పొడుగు సంచీలో పుస్తకాలు, పెరిగిన గడ్డం మీసాలు. సుధీర్‌ని మా లెక్చరర్లు ‘సుధీర్‌ భయ్యా’ అంటూ సరదాగా నవ్వుతూ చనువుగా మాట్లాడేవాళ్ళు. ఢిల్లీని, అక్కడ జరిగినవి కరుణా, నేనూ, మరిచిపోయ్యాం. సుధీర్‌ కూడా ఎప్పుడూ అక్కడి విషయాలు మాట్లాడే వాడు కాదు. గండం గడిచి గట్టిక్కి వీళ్ళిద్దరూ మళ్ళీ మామూలుగానే ఉన్నారు. సుధీర్‌కి కరీంనగర్‌ శాతవాహనలో ప్రొఫెసర్‌గా వచ్చి, వెళ్ళి జాయినయ్యాక ఆర్నెళ్ళపాటూ రోజుకో ఉత్తరం. శనాదివారాలు ఇక్కడే మా ఇంట్లో మాతో పాటే అందరం సరదాగా. ఆదివారం పిల్లలతో ఏ పార్కుకో, ట్యాంక్‌ బండ్‌ మీదకో, సినిమాకో ఎక్కడికో ఓ చోటికి వెళ్ళే వాళ్ళం.

ఈ వేసవి సెలవుల్లోనే వీళ్ళపెళ్ళి కూడా. రిజిస్ట్రేషన్‌, రిసెప్షన్‌ మాత్రమే అని రెండు కుటుంబాల్ని ఒప్పించాం. మళ్ళీ ఇప్పుడిలా అయిదు నెల్లుగా సుధీర్‌ నుంచి ఉత్తరాలకు సమాధానం లేదు. శనాదివారాలు రావడం లేదు. ఇదిగో కరుణ ఇప్పుడిట్లా ఉదాసీనంగా దిగులుగా ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న దానిలా, సుధీర్‌ను పోగొట్టుకున్నానే బాధతో. ఏం చేయాలి, వీళ్ళిద్దరి మధ్య అపోహలు ఎట్లా పోగొట్టాలి. మేం మాట్లాడతాం అంటే ఒద్దంట్టోంది. ఎవరు చేసుకున్న అపార్ధాలు వాళ్ళే పోగొట్టుకోవాలంటూంది. ఎట్ల, ఏంచేయాలి? అనుకొంటూ స్టాఫ్‌ రూం నించి బయటి కొస్తుంటే ‘కరుణగారూ’ ఎదో కొంపమునిగినట్టు గావుకేకపెట్టినట్టు పిలుస్తూ స్టాఫ్‌్‌ రూం వైపు వస్తున్న నాగబాబురావు ఎదురయ్యాడు. అసలే కరుణను అలా దిగులుగా చూసి బాధపడుతున్న నాకు నాగబాబురావు అట్ల కరుణగారూ అంటూ పిలుస్తూ రావడంతో చిర్రెత్తుకొచ్చింది.

”ఎందుకొచ్చారు? మీరు తన కోసం రావద్దని కిందటిసారి వచ్చినప్పుడు నేనూ కరుణా చెప్పాం కదా! మళ్ళెందుకొచ్చారు? వెళ్ళండి. ఇంకోసారి రావద్దు” అన్నాను. కాస్త గట్టిగా హెచ్చరిస్తూన్నట్టుగానే అన్నా జిడ్డు మొహం వదిలే రకంకాదు.

”ఒకసారి కరుణ గారిని చూసెల్తానండి” అంటూ లోపలికి వెళ్లబోతుంటే అప్పుడే బయటికొస్తున్న హిస్టరీ విజయలక్ష్మి ”తను చెప్పింది గదా మా స్టాఫ్‌కెవరికీ మీరు రావడం ఇష్టంలేదు వెళ్ళండి. కరుణ మీతో మాట్లాడదు. మీరు రావద్దని పోయినసారి కరుణ చెప్పినప్పుడు మేం అక్కడే ఉన్నాం” అంది. అకౌంటెంట్‌ రామకృష్ణను కలుస్తాను అంటూ ఆఫీసు రూం వైపు తిరిగాడు.

”ఆయనియ్యాల రాలేదండి” అంది స్టాఫ్‌ రూం ముందు స్టూలు మీద కూచున్న అటెండరు పార్వతమ్మ. అకౌంటెంట్‌ రామకృష్ణ, ఈ నాగబాబురావు ఇద్దరూ కలిస్తే క్యాంటీన్‌తో కూర్చుని ఆడవాళ్ళ గురించి చెత్త మాటలు, కుళ్ళు జోక్‌లు మాట్లాడుకుంటారని ఓసారి పార్వతమ్మ చెప్పింది. అందుకే నాకూ కరుణకే కాదు మిగతా స్టాఫ్‌కి నాగబాబురావు మా స్టాఫ్‌ రూంకి రావడం ఇష్టం లేదు. చేసేది లేక ముఖం మాడ్చుకుని వెళ్ళిపోయాడు.

లెక్చరర్స్‌ మీటింగ్‌లో ఒకసారి మాతో పరిచయం అయిన నాగబాబురావు ఆ తర్వాత కరుణ వెంట పడి ఒక రకంగా వేధించాడనే అనొచ్చు. ఒద్దన్నా రావడం, లొడా లొడా సొల్లు మాటలు మాట్లాడ్డం, అయిందానికీ కాని దానికీ కరుణను అకలిగా, అసంబద్ధంగా పొగడ్డం. చివరికి కరుణకోరోజు తానేంత గాఢంగా కరుణని ప్రేమిస్తున్నానో అంటూ సొల్లు కవిత్వం కూడా చెప్పాడట. ప్రపోజ్‌ చేయడం తప్పేమీ కాదు కానీ సుధీర్‌ కరుణ మధ్య ప్రేమ గురించి తెలిసే ప్రపోజ్‌ చేయడం, కాదన్నాక కూడా మళ్ళీ మళ్ళీ వెంటబడడం తప్పు.

సుధీర్‌కు కరుణపై అపార్ధం కలగడానికి కారణం వీడి చెప్పడు మాటలే. అయినా చెప్పుడు మాటలు విన్న సుధీర్‌దీ తప్పే. అసలు ఇన్ని తప్పులకి కారణం నేను చేసిన చిన్న పొరపాటూ ఇంతటి తప్పులకి దారితీసింది. కరుణ ఢిల్లీ వెళ్ళి వచ్చాక కరుణ సుధీర్‌ని అర్థం చేసుకుని క్షమించినట్టు నేను అర్థం చేసుకోలేకపోయాను. ప్రేమంటే నమ్మకమే కాదు. మంచి చెడుతో సహా ఒక మనిషిని పరిపూర్ణంగా జీవితంలోకి ఆహ్వానించడం, సరిదిద్దుకోవడం అన్న కరుణ మాటల్ని అర్థం చేసుకోలేక సుధీర్‌పై కోపంతో ఎట్లాగూ కరుణంటే వెంటపడుతున్నాడుగా వీడికో అవకాశం ఇద్దాం అనుకుని ఓ రోజు మాధవ్‌, పిల్లలు బజార్‌లో షాపింగ్‌కు వెళ్ళిన సమయం చూసి నాగబాబురావును మా ఇంటికి పిలిచి కరుణతో మాట్లాడే ఏర్పాటు చేశాను. ఏమైందో ఏమో అరగంటైనా గడవకుండానే నాగబాబురావు మొహం మాడ్చుకుని ”వస్తానండి రాజ్యలక్ష్మిగారు” అంటూ నాకు చెప్పి వెళ్ళిపోయాడు.

”పాపం ఏమన్నావేంటి, అతనట్లా మొఖం మాడ్చుకుని వెళ్ళిపోతున్నాడు” అన్నాను. కరుణ గది నుంచి బయటికి రాంగనే అడుగుతుంటేనే అది పడీపడీ నవ్వుతూ ”అమ్మా తల్లీ పెళ్ళిళ్ళ పేరిణీ, భలే వాణ్ణి తెచ్చావే. అరకిలో బంగారం, అరలక్ష కట్నం, ఇంకా స్కూటరు వగైరా లాంఛనాలు మాట్లాడుకుని ఇంకో ముడ్నెల్లలో పెళ్ళి కూడా చేసుకోబోతున్న వాన్ని భలే ఏరికోరి తెచ్చావే. తన గురించి ఏదీ దాచుకొకుండా చెప్పిన ధీర్‌ చెడ్డవాడా, అన్నీ దాచి పెట్టుకుని తగుదునమ్మా అంటూ నాతో పెళ్ళి మాటలు, ప్రేమ కబుర్లు చెప్పడానికొచ్చిన ఈ పెద్దమనిషి గొప్పవాడా? చెప్పవే” అంటుంటే నేనేం మాట్లడేది.

”పెళ్ళి కుదిరిందటనా” అన్నాను ఏం మాట్లాడాలో తోచక. ”ఆహ కుదిరిందట! అసలతగానికి ఉద్యోగం చేసే భార్యే వద్దట. వాళ్ళ వాళ్ళని, తనకు పుట్టబోయే బిడ్డల్ని, ఇంటినీ బాగా చూసుకోవడానికి ఇంట్లో ఉండే పదహారణాల గృహిణి కావాలంట. నన్ను చేసుకున్నా

ఉద్యోగం మాన్పించేవాడట. అదేదో తన ఇష్ట ప్రకారమే జరుగుతుందన్నట్లు ధీమాగా. ఇలాంటి వాడిని చేసుకోవడం కన్నా జీవితాంతం ఇట్ల ఒంటరిగా ఉన్నా మంచిదేనే. అమ్మో ఎంత ప్రమాదం తప్పిందో కదా. నీకు తెలుసా ఆ అరకిలో బంగారం అమ్మాయి అయిదో తరగతి పాసయిందట. చాలా అందంగా ఉంటుందట. అద్భుతంగా వంట చేస్తుందట. అబ్బో చాలా వర్ణించి వర్ణించి చెప్పాడులే. నేనేదో తనను మిస్సయి గొప్ప మనిషిని పోగొట్టుకున్నట్టు. నేనూ అన్నాన్లే, నీ బలవంతం మీదే తనతో మాట్లాడ్డానికి ఒప్పుకున్నానని, తనంటే నాకస్సలు ఇష్టం లేదని మరోసారి స్పష్టం చేయడానికి ఈ రోజు మీతో మాట్లాడ్డానికి రాజ్యం అడిగితే సరే అన్నానని చెప్పడంతో పాపం మనిషి

ఉడుక్కుని మొహం అట్లా మాడ్చుకున్నాడులే. మరేం లేదు అంతేలేవే” అంది.

ఇది రెండేండ్ల కింది మాట. అప్పటికి సుధీర్‌ ఇంకా ఢిల్లీలోనే ఉన్నాడు. నాగబాబురావు పెళ్ళయిపోయింది. మేం పెళ్లికి అమ్మాయి వాళ్ళ స్వస్థలం వరంగల్‌కి వెళ్ళలేదని మమ్మల్నోరోజు ‘మా ఆవిడ వంట రుచి చూడాల్సిందే మర్చిపోలేరు’ అంటూ మా కాలేజీలో ఫ్రెండ్‌ అకౌంటెంట్‌ రామకృష్ణని, మా స్టాఫ్‌ని, వాళ్ళ కాలేజి స్టాఫ్‌ని భోజనానికి పిలిచి, వాళ్ళ అపార్ట్‌మెంట్‌పైన కూర్చీలు, బల్లలు అట్టహాసంగా వేయించి, చిన్న పాటి ఫంక్షన్‌ ఏర్పాటు చేశాడు. ఇంతమందికి పాపం ఆ అందమైన భార్యతో ఒంటి చేత్తో వంట చేయించాడు. మేం వెళ్ళే సరికి ఇంకా ఆ అందమైన భార్య మొహానికి మసితో, జుట్టు చెదిరి మొహం మీదపడుతూ, గరిట చేత్తో ఇంకా వంట చేస్తూనే ఉంది. మమ్మల్ని చూడగానే అందరూ వచ్చారు.

”ఏంటా జిడ్డు మొహం, త్వరగా వెళ్ళి తయారయి రా. వడ్డించొద్దు!” అంటూ కసిరాడు. పాపం ఆ అమ్మాయి కంగారుగా పడగ్గదిలోకెళ్లి మొహం మీద ఇంత పౌడరు రాసుకుని గబగబా చీరమార్చుకుని వచ్చి ‘రండి రండి’ అంటూ నమస్కారం పెట్టి మా అందరికీ మంచినీళ్ళు ట్రేలో తెచ్చి ఇచ్చింది. పెళ్ళయిన ఓరెడ్నెళ్ళు నాగబాబురావు మా కాలేజీకి రాలేదు కానీ మళ్ళీ ఆ తర్వాత మాటిమాటికీ రావడం, కరుణతో సోది సొల్లు మాటలు మాట్లాడ్డంతో, కరుణ లేకున్నా మిగతా స్టాప్‌తో సోది అందరికీ చిరాగ్గా ఉంది.

ఢిల్లీ నించి సుధీర్‌ వచ్చాక ఓ రోజు సుధీర్‌ మాస్టాఫ్‌ రూమ్‌లో కరుణతో మాట్లాడుతుండగా నాగబాబురావు వచ్చాడు. ఆ రోజు పరిచయాన్ని అవకాశంగా తీసుకుని సుధీర్‌తో తెలివిగా లెక్చరర్ల సమస్యలపై మాట్లాడ్డాన్నికన్నట్టు కలుస్తునట్టు తరచుగా కలుసుకుని సుధీర్‌కి అతనిపై నమ్మకం కదిరిందని భరోసా ఏర్పాడ్డాక ఓ రోజు ఏదో యదాలాపంగా మాట్లాడుతున్నట్లు ”మీరు చాలా అదృష్టవంతులండి. కరుణ లాంటి అమ్మాయిని చేసుకోబోతున్నారు. నేను దురదృష్టవంతున్ని. మీరు ఢిల్లిలో ఉన్నప్పుడు కరుణ నాకు ప్రపోజ్‌ చేసింది. రాజ్యం గారింట్లోకి పిలిచి మాట్లాడింది. అయితే ఏం లాభం, అప్పటికే చాలా లేటయింది. మా ఇంట్లో వాళ్ళు నాకు చూసిన సంబంధానికి నేను అప్పటికీ ఓకే చేశాను. కరుణ ఇంకాస్త ముందుగా ప్రపోజ్‌ చేసి ఉంటే… ఆ అమ్మాయిని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి” అన్నాడట. ఈ సంగతి సుధీర్‌ కరణకు చెప్పి ”అవునా? నువ్వాయనకు ప్రపోజ్‌ చేశావా? ఈ విషయం నాకు నువ్వెప్పుడూ చెప్పలేదేం” అన్నాడట నేనన్నీ నీకు చెప్పాను కదా అన్న అర్దంలో.

”నేను నీ దగ్గరికి ఢిల్లీ వచ్చి మళ్ళీ ఇక్కడికి తిరిగొచ్చాక రాజ్యం నీ మీద కోపంతో నాకు ముందుగా చెప్పకుండా అతన్ని ఓ రోజు టీకి పిలిచి మామధ్య చిన్న మీటింగ్‌ లాంటిది ఏర్పాటు చేసింది. ఆయన్తో పెళ్ళి నాకిష్టం లేదని అప్పడే ఆయనకి స్పష్టంగా చెప్పాను” అందట. అహ అట్లనా అని సుధీర్‌ ముభావంగా వెళ్ళిపోయాడట. ఆ తర్వాత ఇన్నాళ్ళుగా సుధీర్‌నించి కరుణకి ఉత్తరాల్లేవు. హైదరాబాద్‌ రావడమే లేదు అందుకే. అయినా నాగబాబూరావుని అనుకొని ఏం లాభం. సుధీర్‌కి జ్ఞానం ఉండాలి కదా. ఢిల్లీలో జరిగిన విషయాలు సుధీర్‌ చెప్పినప్పుడు కరుణ ఇట్లానే ప్రవర్తించిందా! ఎంత సహృదయంతో ప్రేమతో అర్ధం చేసుకొని సుధీర్‌తో ఎప్పటిలా స్నేహంగా ప్రేమగా ఉండగలిగింది. మరి సుధీర్‌ కరుణనెట్లా అపార్ధం చేసుకున్నాడు. ఇన్నాళ్ళెట్లా దూరంగా ఉండగలిగాడు. అసలిలాంటి సుధీర్‌ని కరుణెందుకు ఇంకా మర్చిపోలేకపోతోంది. సుధీరెట్లా కరుణని మర్చిపోగలిగాడు. ప్రేమ, ఒకటి విలువలు రెండా! ఆడ ప్రేమ, మగ ప్రేమ విలువలు వేరువేరా!! ఇది సార్వజనీనమా… కాదు కాదు… మినహాయింపులు ఉన్నాయి కదా!

ప్రేమించినమ్మాయిని మర్చిపోలేక ఒంటరిగా మిగలిపోయిన మగవాళ్ళు, ప్రేమను సునాయసంగా మర్చిపోయి హాయిగా కాపురం చేసుకుంటున్న ఆడవాళ్ళు ఎందుకు లేరు. అయినా ఆడవాళ్ళ ప్రేమ నమ్మకం అయితే మగవాళ్ళ ప్రేమ అసూయేమో. కానీ ఆడవాళ్ళని అసూయాపరులు అంటారు ఎందుకు? ఆడవాళ్ళకి తమ మీదెంత నమ్మకమో ప్రేమమీద అంత నమ్మకం. మరి మగవాళ్ళకి తమ మీద నమ్మకం అభద్రతా భావమే. ప్రేమనీ నమ్మలేరేమో… అలోచిస్తూ లైబ్రరీకైనా వెళ్దాం, సబ్జెక్టు ఆప్‌డేట్‌ అవ్వొచ్చు అనుకుని

వెళ్తుంటే ఎదురుగా వస్తూ సుధీర్‌.

”కరుణ్కెడుంది రాజ్యం” అంటూ ఎదురయ్యాడు. ఆశ్చర్యం, ఆనందం రెండూ కలగలిసి ముప్పిరిగొని ”స్టాఫ్‌ రూంలోనే ఉంది వెళ్ళండి” అంటున్న నామాట పూర్తి కాకుండానే నన్ను దాదాపు తోసుకుంటూ పరుగులాంటి నడకతో వెళ్ళి రెండేసి మెట్లు ఒకేసారి ఎక్కుతూ సుధీర్‌ స్టాఫ్‌ రూంలోకెళ్ళగానే రూంలో ఉన్న ఇంగ్లీష్‌ లెక్చరర్‌ రోహిణి, తెలుగు లెక్చరల్‌ అశ్విని బయటి కొస్తూ ”పదండి మనం కాసేపు లాన్లో కూర్చుందాం” అంటూ దారితీస్తూరు. అక్కడే స్టూల్‌ మీదున్న అటెండర్‌ పార్వతమ్మతో ”ఇంకెవరైనా లెక్చరర్లు వస్తే మేం లాన్‌లో ఉన్నామని చెప్పి అక్కడికి పంపించు” అని చెప్పి లాన్‌వైపు వెళ్ళాం. దార్లో అశ్విని నవ్వుతూ ”సుధీర్‌ భయ్యా మనసుని మార్క్సో, ఏంగెల్సో (రచనలు) కాస్త గీకి ఉంటారు” అంది. ‘అవునవును…’ అంటూ అందరం హాయిగా నవ్వుకున్నాం.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.