‘నాసిక్‌ టూ ముంబై’ రైతు దీర్ఘయాత్ర ఓ ముందడుగు – పి.ప్రసాదు

 

దేశంలో ఒకవైపు రైతాంగ సమస్యలను పరిష్కరించాల్సిన ‘చారిత్రక ప్రాధాన్యత’ పెరుగుతూ వస్తున్నది. మరోవైపు వాటిపట్ల ‘రాజకీయ ప్రాధాన్యత’ తగ్గుతూ వస్తున్నది. ఈ విధంగా పెరుగుతున్న ‘చారిత్రక ప్రాధాన్యత’కు, తగ్గుతున్న ‘రాజకీయ ప్రాధాన్యత’కూ మధ్య క్రమంగా వైరుధ్యం తీవ్రతరమవుతున్నది. ముఖ్యంగా ప్రపంచీకరణ విధానాలు ఉనికిలోకి వచ్చాక ఈ వైరుధ్యం వ్యవస్థీకృత రూపం తీసుకున్నది. ఈ వైరుధ్యం పెరగడానికి మూల కారణం మరో వైరుధ్యం తీవ్రతరమవుతుండడంలో దొరుకుతుంది. దాన్ని కూడా ప్రస్తావించుకుందాం.

ప్రపంచీకరణ విధానాల ఫలితంగా ‘సంక్షేమ’ బాధ్యత నుంచి రాజ్యం క్రమంగా తప్పుకుంటూ వచ్చింది. ఈ రాజ్య సంరక్షణ బాధ్యతలను చేపట్టే ప్రభుత్వాలను ఎన్నికల వ్యవస్థ నిర్ణయిస్తున్నది. తద్వారా ఐదేళ్ళ కొకసారి ఎన్నికవుతున్న వివిధ పార్టీలు లేదా కూటముల ప్రభుత్వాలు ఆచరణలో రాజ్యం తరఫున ‘సంక్షేమ’ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. దేశంలో నేటికీ అత్యధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయ రంగ సంక్షేమ బాధ్యతల నుంచి తప్పించుకోవడం కూడా ఒక ప్రధాన ధోరణిగానే కొనసాగుతున్నది. దాని నుంచి అవి తప్పించుకున్న తర్వాత ‘శూన్యం’ మిగలదు. అది రైతాంగాన్ని గాలికి వదిలేసే ప్రక్రియ కాదు. శూన్యానికి బదులు మరో ప్రత్యామ్నాయం విధిగా ఏర్పడుతుంది. అదే మార్కెట్‌ వ్యవస్థ! దీనర్థం, ఒకవైపు వ్యవసాయ రంగ బాధ్యతల నుంచి రాజ్యం తప్పించుకునే ప్రక్రియకూ, మరోవైపు మార్కెట్‌ శక్తుల చొరబాటు ప్రక్రియకూ ఒక అనుబంధం ఉంది. ఇది వాస్తవానికి పాలక వర్గాలకూ, మార్కెట్‌ శక్తులకూ మధ్య పరస్పర అవగాహన, ప్రయోజనాలతో అన్యోన్య ప్రక్రియగానే సాగుతుంది. అదే సమయంలో రాజకీయంగా పరిష్కరించలేని ఒక వైరుధ్యం కూడా!

పైన పేర్కొన్న రెండో వైరుధ్యం పెరిగే తీవ్రత మీద ఆధారపడేదే మొదటి వైరుధ్యం. ఈ వైరుధ్యాలు ప్రపంచీకరణకు ముందు కూడా ఉన్నాయి. అయితే ప్రపంచీకరణ విధానాల ఫలితంగా మరింత తీవ్రతరమవుతున్నాయి. నిజానికి ‘పెట్టుబడుల ప్రపంచీకరణ ప్రక్రియ’ ఒక గుణాత్మక మలుపు తీసుకోవడమే సారాంశంలో ప్రపంచీకరణ ప్రక్రియ అనే విషయం అందరికీ తెలిసిందే. దీనర్థం వ్యవసాయ రంగంలోకి పెట్టుబడుల చొరబాటు ప్రక్రియ మరింత తీవ్రతరమవుతున్న కొద్దీ, పైన పేర్కొన్న రెండు వైరుధ్యాలు కూడా మరింత తీవ్రతరమవుతాయనుకోవాలి. ఈ అవగాహన వెలుగులోనే వర్తమాన రైతాంగ సమస్యలను అర్థం చేసుకోవాల్సి ఉంది.

పై వైరుధ్యాలు తీవ్రతరమయ్యే ప్రక్రియ శాశ్వత ధోరణిగా కొనసాగడం సాధ్యం కాదు. అదొక శిలా సదృశ్యమైన ధోరణి కాదు. అది ఒకానొక దశలో విచ్ఛిన్నం కాక తప్పదు. అది విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ ఆకస్మికంగా జరగదు. అందుకు చాలాకాలం పడుతుంది. ”పెరుగుట కూడా విరుగుట కొరకే” అన్న నానుడి తెల్సిందే. ఈ నానుడిలో గతి తర్కం ఉంది. ప్రతి వస్తువులో ఒక దశలో కొత్త వైరుధ్యాలు పుట్టడమూ, మరో దశలో అవి తీవ్రతరమవుతూ ఉండటమూ, చివరకు అవి తీవ్ర ఘర్షణ ద్వారా పరిష్కరించబడటమూ గతి తార్కిక నియమమే. అది సమాజానికి కూడా వర్తించే సూత్రమే. అది వ్యవసాయ రంగానికి కూడా వర్తిస్తుంది. అందుకే మార్కెట్‌ శక్తులకూ, రైతాంగానికీ మధ్య వైరుధ్యం తీవ్రతరమవుతున్న నేటి ధోరణి చెక్కుచెదరని ధోరణి కూడా శాశ్వతం కాదు. అది పరిష్కరించబడే ప్రక్రియకు చాలాకాలం ముందునుంచే దాని విచ్ఛిన్నమయ్యే లక్షణాలు బహిర్గతమవుతాయి. ఇది భవనాలు కూలడానికి చాలా ముందునుంచే వాటి పగుళ్ళూ, బీటలూ బహిర్గతమవ్వడం వంటిది. అట్టి దశలో ఒక పగులూ లేదా బీట వంటిదే తాజా ‘నాసిక్‌ టూ ముంబై’ రైతాంగ దీర్ఘ యాత్ర.

నాసిక్‌ నుంచి ముంబైకి సాగిన రైతుల దీర్ఘయాత్ర ఇటీవల కాలంలో సాపేక్షికంగా బాగా ప్రాచుర్యం పొందింది. కార్పొరేటు మీడియా సైతం చివరకు ప్రచారం చెయ్యక తప్పలేదు. మార్చి 6, 2018న నాసిక్‌లో రైతుల దీర్ఘయాత్రను ప్రకటించే కాలంలోనూ, ప్రారంభించిన సమయంలోనూ, యాత్ర సాగిన వారం రోజులలోనూ కార్పొరేట్‌ మీడియా దాదాపు పట్టించుకోలేదనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే మరుగుపరిచింది. కానీ అది 12 మార్చి, 2018న దేశ వాణిజ్య నగరం ముంబైలో ప్రవేశించిన క్షణం నుంచీ ఫడ్నవీస్‌ ప్రభుత్వం ఒప్పందం చేసేంతవరకూ విశేషంగా ప్రచారం చేయక తప్పలేదు. ఫడ్నవీస్‌ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం బాధిత రైతాంగం పట్ల చాలా ఔదార్యతను ప్రదర్శించిందంటూ కీర్తించే తక్షణ రాజకీయ లక్ష్యం కార్పొరేట్‌ మీడియాకి ఉండడం కూడా అందుకొక ముఖ్య కారణం కావచ్చు. అయినా వర్తమాన దేశ రాజకీయ రంగ స్థలం మీద రైతును ఒక కథా నాయకుడిగా మార్చే ప్రక్రియకు అయిష్టంగానైనా కార్పొరేట్‌ మీడియా సహకరించక తప్పలేదు. ఫలితంగా ఇటీవల కాలంలో ముంబై రైతు యాత్రకు విశేష ప్రాచుర్యం లభించింది. ఇది ఇంతవరకూ నిరంతరంగా, నిరవధికంగా, యథేచ్ఛగా తీవ్రతరమవుతున్న పై వైరుధ్యాన్ని మరో రూపంలో పరిష్కరించాల్సిన రాజకీయ ఆవశ్యకతను వెల్లడిస్తున్నది. అలాంటి కొత్త పరిష్కారాలను వెతుక్కోవాల్సిన బాధ్యతను పాలక వర్గాల భుజస్కంధాలపై మోపుతున్నది.

పైన పేర్కొన్న రైతుల దీర్ఘయాత్ర మొదటి రోజు నుంచే సామాజిక మాధ్యమాల (సోషల్‌ మీడియా) ద్వారా విశేష ప్రాచుర్యం పొందింది. చివరకు మెయిన్‌స్ట్రీమ్‌ మీడియా దీనికి ప్రాచుర్యం కల్పించడానికి సోషల్‌ మీడియా ప్రచారం కూడా ఒక కారణమే. ఫలితంగా దీర్ఘయాత్ర దృశ్యాలు ముఖ్యంగా విద్యాధిక మధ్య తరగతి వర్గాలలో బాగా ప్రచారమయ్యాయి. అందులో ఆదివాసీ రైతాంగం అత్యధిక సంఖ్యలో పాల్గొన్నది. దేశంలోని సగటు రైతాంగంతో పోల్చితే ఆదివాసీ రైతాంగం ఎక్కువ దుర్భర జీవితం సాగించడం తెలిసిందే. అది వారి వేష, భాషల్లో సైతం బహిర్గతం కావడం తెల్సిందే. చెప్పులు లేకుండా నడవడం; ఒకవేళ ధరించినా తోలు చెప్పులు ధరించడం లేదా చెట్ల ఆకులు లేదా బెరళ్ళతో సొంతంగా చేసుకున్న చెప్పులను వినియోగించడం; పటాటోపాలు లేకుండా విధేయతతో అవిశ్రాంతంగా నడవడం; ఎండలోనైనా, చలిలోనైనా, ఎక్కడైనా నిద్రపోగలగడం; అర్థాకలితోనైనా ర్యాలీలో కొనసాగడం; టీవీ ఛానళ్ళ ఎదుట మాట్లాడలేక బిడియపడటం; కాళ్ళకు పుండ్లు పడుతున్నా ఓపికతో ర్యాలీని అనుసరించడం వంటి అరుదైన లక్షణాలు అందులో భాగమే. ఇవన్నీ నాగరిక ప్రపంచాన్ని విస్మయానికి గురిచేయడం సహజమైనదే. ఫలితంగా తాజా రైతాంగ దీర్ఘయాత్ర విశేష ప్రజాదరణ పొందడం గమనార్హం. అది నాగరిక సమాజం దృష్టిలో ఒక కన్నీటి రైతుయాత్రగా పేరొందింది.

ప్రపంచీకరణ విధానాలు ఉనికిలోకి రాకముందు సబ్సిడీలు, సంక్షేమ పథకాల పట్ల సమాజంలో సార్వత్రిక ఆమోదం ఉండేది. అందుకే వాటిపట్ల ఆనాటికి ప్రజల్లో మిశ్రమ స్పందనకు అవకాశం లేదు (ఆనాడు పాలకవర్గాలకు కూడా అది అవసరం కావడం గమనార్హం). కానీ ప్రపంచీకరణ విధానాల నేపథ్యంలో ‘సంక్షేమ’ బాధ్యతల నుంచి రాజ్యం తప్పించుకునే క్రమం కొత్త పరిస్థితిని సృష్టించసాగింది. సంక్షేమ విధానాల పట్ల సమాజంలో మిశ్రమ స్పందనను సృష్టించే బాధ్యతలను కార్పొరేట్‌ వ్యవస్థ తన భుజానికి ఎత్తుకున్నది. తన నేతృత్వంలోని కార్పొరేట్‌ మీడియాకు ఆ కర్తవ్యాన్ని అప్పగించింది. అది సృష్టించిన మిశ్రమ స్పందన ఫలితంగా ప్రజల మధ్య ఒక కొత్త వైరుధ్యం రంగంలోకి వచ్చింది. అది రైతాంగానికీ, రైతాంగేతర వర్గాలకూ మధ్య వైరుధ్యంగా రూపొందింది. అది ఆచరణలో రైతు కుటుంబాలలో సైతం కొత్త వైరుధ్యాన్ని సృష్టించింది. తండ్రీ కొడుకులకూ, తల్లీ కూతుళ్ళకూ మధ్య వివాదాలకు కూడా కారణమైంది. ఇటీవల కాలంలో క్రమంగా ఈ వివాదాలూ, వైరుధ్యాలూ తగ్గుముఖం పడుతున్న కొత్త ప్రక్రియకు తాజా కన్నీటి రైతుయాత్ర దోహదపడింది.

తండ్రి ఒక రైతు. కొడుకు ఒక ప్రభుత్వోద్యోగి. తల్లి ఒక వ్యవసాయ కూలీ. కూతురు ఒక

ఉపాధ్యాయిని. అరుదుగా రైతు కుటుంబాల నుంచి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల వంటి అధికాదాయ ఉద్యోగులు కూడా పుట్టుకొచ్చారు. ఆ కారణంగా రైతు కుటుంబాల నుంచి ఎదిగివచ్చే తెల్ల చొక్కా ఉద్యోగులలో సబ్సిడీలనూ, సంక్షేమ పథకాలనూ వ్యతిరేకించే భావజాలం పెరిగింది. అందువల్ల రైతు కుటుంబాలలో కూడా మిశ్రమ స్పందన ఏర్పడి కొత్త వైరుధ్యాలకు దారితీసింది. ఈ వైరుధ్యాలను తగ్గించే నూతన ప్రక్రియకి తాజా రైతుయాత్ర సహకరించడం సహజమే. రుణమాఫీ పట్ల చరిత్రావలోకనం చేస్తే 1980 నాటి రుణమాఫీ పట్ల రైతు మిశ్రమ స్పందన దాదాపు లేదనే చెప్పాలి. కానీ 2008 నాటి రుణమాఫీ పట్ల మిశ్రమ స్పందన ఒక మేరకు ఏర్పడింది. ఆ తర్వాత కాలంలో అది మరింత బలపడింది. సమాజంలో మధ్యతరగతిలో ప్రజల శాతం పెరగడంతో పాటు, రైతు రుణమాఫీ విధానం పట్ల కార్పొరేట్‌ మీడియా సాగించిన వ్యతిరేక ప్రచార తీవ్రతలు అందుకు కారణాలే. ఇలా మధ్యతరగతి బలపడుతూ వచ్చిన ధోరణి కూడా శాశ్వతమైనది కాదు. ‘పెరుగుట విరుగుట కొరకే’ అన్న నానుడి ఈ ధోరణికి కూడా వర్తిస్తుంది. అది తిరిగి బలహీనపడే కొత్త ప్రక్రియ కూడా ఇటీవల ప్రారంభమైంది. ఈ కొత్త ప్రక్రియకు తాజా ‘రైతాంగ దీర్ఘయాత్ర’ ఒక

ఉత్ప్రేరకంగా మారింది.

యూపీఏ ప్రభుత్వం 2008లో రూ.60 వేల కోట్ల విలువ గల రైతు రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. కానీ అదే ఏడాది సంభవించిన ప్రపంచ ఆర్థిక సంక్షోభ బూచీని చూపించి బడా కార్పొరేట్‌ వర్గాలకు అంతకంటే పది రెట్ల విలువ చేసే ఆరు లక్షల కోట్ల రూపాయల రాయితీలను కల్పించింది. ఆ తర్వాత తిరిగి రైతు రుణమాఫీ చేయకుండానే, బడా కార్పొరేటు సంస్థల బ్యాంకు రుణాల మాఫీకి దిగింది. ఇది మధ్య తరగతి ప్రజలలో క్రమంగా మరో కొత్త రకం మిశ్రమ స్పందనకు కారణమైంది. అంతకుముందు సమాజంలో రైతాంగానికీ, రైతాంగేతర వర్గాలకూ (ముఖ్యంగా మధ్యతరగతి) మధ్యగల వైరుధ్యం, ఆ తర్వాత కేవలం మధ్యతరగతి ప్రజల మధ్య అంతర్గత వైరుధ్యంగా మారింది. బీజేపీ ప్రభుత్వం గద్దెక్కిన తర్వాత అది మరింత తీవ్రతరం కాసాగింది. తాజా కన్నీటి రైతాంగ దీర్ఘయాత్రకు మధ్యతరగతి నుంచి కూడా బహుళ ఆదరణ లభించడం అందుకొక ఉదాహరణ.

దసరాకో, సంక్రాంతికో పట్టణ ప్రాంతాల నుంచి రెండు రోజులు తమ కుటుంబీకులతో, బంధు మిత్రులతో గడపడానికి

ఉద్యోగులు (రైతుల సంతానం) తాము పుట్టి పెరిగిన పల్లెటూళ్ళకు రావడం తెలిసిందే. ఆయా సందర్భాలలో రైతు రుణ మాఫీ వంటి సంక్షేమ చర్యల తప్పొప్పుల గురించి తండ్రీ కొడుకుల మధ్య, తల్లీ బిడ్డల మధ్య వాదోపవాదాలు జరుగుతుండేవి. ‘సుస్థిర దేశాభివృద్ధి’ని సబ్సిడీలు ఆటంకపరుస్తాయన్న కార్పొరేట్‌ మీడియా వ్యూహాత్మక ప్రచారం రైతు బిడ్డలను చాలావరకు ఆకర్షించిన ఫలితమిది. రుణమాఫీ కోరుకున్న తన కన్నతండ్రి న్యాయమైన ఆకాంక్షను కూడా కొడుకు తప్పుపట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితి కూడా శాశ్వతం కాదు. ఒకవైపు తన స్వంత ఊరి రైతుల ఆత్మహత్యలూ, మరోవైపు అంబానీ, అదానీ వంటి సంపన్న దిగ్గజాలకు లక్షల కోట్ల రుణ మాఫీ చర్యలూ మధ్య తరగతిలో కనువిప్పు కలిగిస్తూ వచ్చాయి. అందుకే పదేళ్ళ క్రితమో లేదా ఐదేళ్ళ క్రితమో దసరా, సంక్రాంతి పండుగల నాటి వాదోపవాదాల తీవ్రత నేడు లేదు. ధోతీలు కట్టుకునే పాత తరం వృద్ధ రైతులకు తమ నాగరిక సంతానంతో వాదించే సామర్ధ్యం లేకపోవచ్చు. కానీ ఒకే రైతు కుటుంబంలో పదవ తరగతి చదివిన పెద్ద కొడుకు ఊళ్ళో వ్యవసాయంలో స్థిరపడ్డాడు. ఉన్నత చదువులతో ఉద్యోగం గడించిన తమ్ముడు నగరాలలో స్థిరపడ్డాడు. ”నువ్వు చెప్పే దేశ సుస్థిరాభివృద్ధి అంటే అంబానీ, అదానీలకు లక్షల కోట్ల రుణమాఫీయా?” అని అన్నయ్య అడిగే ప్రశ్నకు తమ్ముడి వద్ద సమాధానం లేదు. ఈ కొత్త వైరుధ్యం గత నాలుగేళ్ళుగా పెరుగుతూ ఉంది. ముంబై వంటి నగరాల ప్రజల మూలాలు కూడా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల రైతు, కూలీల కుటుంబంలో ఉండడం తెలిసిందే. ఈ నేపథ్యం కూడా ముంబై నగరవాసులతో పాటు నాగరిక సమాజం నుంచి తాజా రైతాంగ దీర్ఘయాత్రకు అధిక ప్రజాదరణ లభించడానికి ఒక ముఖ్య కారణమైంది.

సమాజంలో ఏ ఒక్క కొత్త పరిణామమూ ఆకాశం నుంచి హఠాత్తుగా ఊడిపడదు. బయటకు ఆకస్మిక పరిణామాలుగా మన కళ్ళకు కనిపించే వాటి వెనక కూడా దీర్ఘకాల పరిణామ క్రమాలుంటాయి. పైన పేర్కొన్న అన్ని రకాల వైరుధ్యాలూ ఈ కోవలోకే వస్తాయి. ఇవన్నీ పెరుగుట విరుగుట కొరకే అన్న సూత్రానికి వర్తింపచేయాల్సినవే. నాసిక్‌ నుంచి ముంబైకి సాగిన రైతుయాత్రకు నాగరిక సమాజం నుంచి లభిస్తున్న విశేష ప్రజాదరణ కూడా ఇదే కోవలోకి వస్తుంది. ఇవి ఆరంభమూ కాదు, అంతమూ కాదు. గొలుసుకట్టు వంట పరిణామ ప్రక్రియలో ఇదొక లింకు వంటి సంఘటన మాత్రమే.

రైతాంగ సమస్యలను వెలుగులోకి రానివ్వకుండా వ్యూహాత్మకంగా రాజ్యం నియంత్రిస్తున్నప్పటికీ, అనివార్యంగా బహిర్గతమవుతున్న పరిణామ ప్రక్రియ సుదీర్ఘమైనది. ముఖ్యంగా అటువంటి ప్రక్రియలో 2017వ సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రపంచీకరణ ప్రక్రియ తర్వాత గత పాతికేళ్ళ కాలంలో రైతాంగ సమస్యలను దేశ రాజకీయ ఎజెండాలోకి తెచ్చే నూతన ప్రస్థానంలో 2017వ సంవత్సరం ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పవచ్చు. దానికి గల నేపథ్యాన్ని సంక్షిప్తావలోకనం చేద్దాం.

2017 ఫిబ్రవరిలో బీజేపీ పాలిత రాజస్థాన్‌ రాష్ట్రంలో సికార్‌ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని పెంచిన విద్యుత్‌ ఛార్జీలపై రైతాంగ ఉద్యమం ప్రారంభమైంది. అది 17 రోజుల రాష్ట్ర రైతు ఉద్యమంగా నడిచింది. చివరకు విజయరాజే సింధియా ప్రభుత్వం ఉపసంహరించక తప్పలేదు. అయితే అది విస్తృత ప్రజా ఉద్యమంగా సాగినప్పటికీ, అఖిల భారత స్వభావాన్ని ధరించలేదు. కానీ ఆ తర్వాత వరుసగా వివిధ రాష్ట్రాలలో సాగిన రైతు పోరాటాలు అఖిల భారత రూపం ధరించాయి. అందుకు శ్రీకారం చుట్టిన ఘనత తమిళనాడు రైతు ఉద్యమకారులకే దక్కుతుందని చెప్పుకోవచ్చు.

పాములూ, కప్పలూ, తేళ్ళు తినడం; కపాలాలు (పుర్రెలు) మెడలో ధరించడం, నగ్నంగా పరుగెత్తడం, మూత్రపానం వంటి విచిత్రమైన, దిగ్భ్రాంతికర నిరసన రూపాలతో 40 మంది తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద 2017 మార్చిలో నిరసన ఆందోళనకు దిగారు. వారికి మోడీ ముఖం చూపించకపోయినా, నాటి తమిళనాడు ముఖ్యమంత్రి ప్రత్యక్ష హామీతో 40 రోజుల తర్వాత వారు తన నిరసనను విరమించారు. వారు సంఖ్యాపరంగా 40 మందే కావచ్చు. మీడియా వ్యూహాత్మకంగా ప్రచారాన్ని నియంత్రించవచ్చు. కానీ సోషల్‌ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. దేశవ్యాప్తంగా రైతు సమస్యల్లోనూ, రైతాంగ ఉద్యమ శ్రేణుల్లోనూ ఒక నూతన కదలికను తేవడానికి ఇది ఉపయోగపడింది. ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు అఖిల భారత స్థాయి రైతాంగ ఉద్యమ నిర్మాణానికి బలాన్నిచ్చాయి. తదనంతర పరిణామాలనూ ప్రస్తావించుకుందాం.

జంతర్‌ మంతర్‌ వద్ద తమిళనాడు రైతుల నిరసనల సమయంలోనే యూపీ శాసనసభ ఎన్నికలలో స్వయంగా మోడీ రైతు రుణమాఫీ, చెరకు ఉత్పత్తిదారుల బాకీల సత్వర చెల్లింపు, కొత్త రుణ సదుపాయం వంటి హామీలనిచ్చారు. దీంతో అదే సమయంలో మహారాష్ట్ర శాసనసభా సమావేశాలలో రైతు రుణ మాఫీ ప్రధాన ఎజెండాగా మారింది. ఇంతలో ఏప్రిల్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగాక మొదటి చర్యగా రైతు రుణమాఫీ మొదలుపెట్టింది. దీంతో ఏప్రిల్‌, మే నెలల్లో మహారాష్ట్రలో ఉధృతంగాను, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఒక మాదిరిగానూ రైతు నిరసనోద్యమాలు సాగాయి. ఈ క్రమంలోనే దేశ వ్యవసాయ రంగ చరిత్రలో మున్నెన్నడూ లేని ‘రైతాంగ సమ్మె’ మహారాష్ట్రలో జూన్‌ 1, 2017 నుంచి ప్రారంభమైంది. మార్కెట్లకూ, సంతలకూ ధాన్యం, కూరగాయలు, పండ్లు బందు పెట్టిన ప్రక్రియ ఒక కొత్త పరోట రూపంగా ఉధృతంగా సాగింది. అది పొరుగు రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ రైతాంగాన్ని వేలసంఖ్యలో రోడ్లమీదకు తెచ్చింది. ఫలితంగా జూన్‌ 6, 2017న మంద్‌సార్‌లో కాల్పులు జరిగి ఆరుగురు రైతులు మరణించారు. ఆ తర్వాత మరింత ఉధృతంగా కొనసాగిన మహారాష్ట్ర రైతాంగ సమ్మెకు ఫడ్నవీస్‌ ప్రభుత్వం తలవంచింది. రైతు రుణమాఫీకి అంగీకరించింది. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల అమలు కోసం ప్రధాని మోడీ దగ్గరకు రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీని తీసుకెళ్తానంది. అటు యూపీ రుణమాఫీ, ఇటు మహారాష్ట్ర రుణమాఫీ కలిసి ఇతర రాష్ట్రాల రైతాంగ ఉద్యమాలకు ఊపిరిపోశాయి.

పంజాబ్‌ శాసనసభ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా అనివార్యంగా రైతు రుణమాఫీని ఆమోదించింది. రెండు వారాల రైతు ఉద్యమం తర్వాత 2017 సెప్టెంబరు 7న రాజస్థాన్‌ ప్రభుత్వం కూడా రుణ మాఫీ చేసింది. అంతకు ముందే రానున్న ఎన్నికల నేపథ్యంలో కర్నాటక కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా ఈ రైతు రుణమాఫీని ప్రకటించింది. ఈ విధంగా 1. యు.పి, 2. మహారాష్ట్ర, 3. పంజాబ్‌, 4. కర్నాటకల తర్వాత రైతు రుణమాఫీల ప్రక్రియలో ఐదవ రాష్ట్రంగా రాజస్థాన్‌ చేరింది. అంతేకాకుండా దాదాపు ఇరవై ఏళ్ళుగా గుజరాత్‌ ఎన్నికలలో బీజేపీకి తిరుగులేని ఆధిక్యత గల సౌరాష్ట్ర వంటి పత్తి (కాటన్‌) పంట ప్రాంతాలలో రైతు రుణ మాఫీ విముఖత వల్ల ఆ పార్టీ బాగా దెబ్బతింది. ఈ అన్ని పరిణామాల వల్ల 2017వ సంవత్సరానికి అధిక ప్రాధాన్యత చేకూరింది. దానివల్లే ఆ తర్వాత దేశవ్యాప్త రైతు యాత్ర సాగింది. ఈ నేపథ్యంలోనే 2018లో నాసిక్‌ నుంచి ముంబైకి దీర్ఘ రైతు యాత్ర జరిగింది. అంటే దీనికి ముందే రైతు నిరసనను విధిగా చల్లబరచాల్సిన రాజకీయ బాధ్యత పాలకవర్గాల మీద పడింది. ఈ రాజకీయ నేపథ్యంతో సంబంధం లేకుండా ఫడ్నవీస్‌ ప్రభుత్వం తాజా రైతాంగ దీర్ఘయాత్రకు తలవంచిందనుకోవడం సరికాదు.

2017 కంటే ముందున్న పూర్వరంగ భౌతిక పరిస్థితులు లేకుండా 2017లో రైతాంగ పోరాటాలు లేవు. అవి లేకుండా అదే అర్ధ సంవత్సరంలో సాధించిన రైతాంగ విజయాలు లేవు. అట్టి విజయాల స్ఫూర్తితో చేపట్టిన యాత్రగా తాజా దీర్గయాత్రను పరిగణించాలి.

కేవలం అణచివేతతోనే రైతాంగ సమస్యలను పరిష్కరించే పరిస్థితే పాలకవర్గాలకు నేడు లేకుండా పోయింది. కొత్త రకం నాటకీయ లేదా భౌతిక వాస్తవిక పరిష్కారాలను వెదకాల్సిన బాధ్యత వాళ్ళమీద పడింది. అందువల్ల కూడా ‘నాసిక్‌ నుంచి ముంబై’ రైతు ర్యాలీని అయిష్టంగానైనా, పాలక వర్గాలు అనుమతించక తప్పలేదు. అణచివేతనే ప్రధాన పరిష్కార ప్రక్రియగా పాలకవర్గాలు ఎంచుకున్న కాలంలో ఇలాంటి దీర్ఘయాత్రలను ఇంత సాఫీగా సాగించడానికి అవి అనుమతించవు. సుమారు 200 కిలోమీటర్ల దూరం వారం రోజులు శాంతియుతంగా నడిచే అవకాశం లభించదు. సాధారణంగా నాసిక్‌లోనే చెదరగొట్టడం జరుగుతుంది. అలా అయిష్టంగానైనా అనుమతించడానికి మూడు ముఖ్య కారణాలు పనిచేసి ఉండవచ్చు. వాటిని ఉదహరిద్దాం:

మొదటిది; మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా దేశవ్యాపిత విస్తరణ స్వభావం కలిగి, ప్రజాదరణ కూడా కలిగిన రైతాంగం మీద అణచివేతకు దిగడం నష్టదాయకమైనది. దానివల్ల అధిక రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న అంచనా మోడీ సర్కారుకి ఉండవచ్చు. రెండవది; ప్రజాదరణ పొందిన రైతు యాత్రను ఆధారం చేసుకొని రాజకీయ లబ్ది పొందడం, తమ బీజేపీ రైతులకు అండగా ఉంటుందని చాటుకోవడానికి వీలుగా ఒక ఒప్పందాన్ని చేసుకోవడం. ఇక మూడవది; ఎన్నికల బరిలో రేపు ప్రధాన ప్రత్యర్థులుగా మారనున్న శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీల పాత్రలేని ‘వామపక్ష ర్యాలీ’గా దీర్ఘయాత్ర సాగుతున్నది. దానికి రాజకీయ నేతృత్వం వహిస్తున్న సీపీఎం రాష్ట్ర ఎన్నికల బరిలో బీజేపీకి నేడు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కాదు. ముఖ్యంగా మహారాష్ట్రలో వామపక్షాల స్థానం నామమాత్రంగా ఉంది. వారు నడిపించిన రైతు ఉద్యమం ఎదుట తలవంచినందువల్ల తమ బీజేపీకి ఎన్నికల కోణంలో ఎలాంటి నష్టం ఉండదు. ఈ మూడు కారణాల వల్ల ”నాసిక్‌ టూ ముంబై లాంగ్‌మార్చ్‌” శాంతియుతంగా విజయవంతం కావడంతో పాటు తాత్కాలిక విజయం సాధించి ఉంటుంది.

సహజ ఆర్థిక వ్యవస్థ (నేచురల్‌ ఎకానమీ) ఉనికిలో ఉన్న కాలంలో గ్రామీణ భూస్వామ్య వ్యవస్థకీ, రైతాంగానికీ మధ్య వైరుధ్యం ప్రధాన ధోరణిగా ఉండేది. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థకీ వ్యవసాయ రంగంమీద ఆధిపత్యం చెలాయిస్తున్న క్రమంలో మార్కెట్‌ శక్తుల వ్యతిరేక రైతాంగ పోరాటాలు పెరుగుతున్నాయి. ఈనాటి రైతాంగ ఉద్యమాల డిమాండ్లు ఎన్ని ఉన్నా అందులో రెండు తీవ్ర స్వభావం కలిగి ఉన్నాయి. తాజా లాంగ్‌ మార్చ్‌లో అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసీ రైతాంగ భూములకు పట్టాల మంజూరు, రాజస్థాన్‌లో విద్యుత్‌ రేట్ల తగ్గింపు వంటి కొన్ని ప్రత్యేక డిమాండ్ల ప్రత్యేక సందర్భాలలో మినహాయింపుగా ఉన్నాయి. అయినా దేశవ్యాపిత స్వభావం గల రైతు డిమాండ్లలో 1. రుణమాఫీ, 2. స్వామినాథన్‌ కమిషన్‌ ప్రకారం మద్దతు ధర ప్రధానమైనవి. ఈ రెండూ మార్కెట్‌ శక్తుల ప్రత్యక్ష ప్రయోజనాలతో ముడిపడ్డవే. మార్కెట్‌ శక్తుల చేతుల్లో రాజ్యం ఒక సాధనంగా ఉండడం తెలిసిందే. అందుకే తమ లక్ష్య సాధనలో భారతదేశం రైతాంగం నేడు అత్యంత పెద్ద శత్రువుతో యుద్ధం చేయాల్సి ఉంది. అందుకు లోతైన రాజకీయ చైతన్యంతో పాటు కార్మికవర్గ నేతృత్వాన్ని స్వీకరించే అవగాహనను కూడా పొందాల్సి ఉంటుంది కానీ ఫడ్నవీస్‌ ప్రయత్నం తలవంచి చేసుకున్న ఒప్పందం వంటి సునాయాస విజయాలు రైతాంగానికి ఆచరణలో ఫలితాలనివ్వకపోవచ్చు.

నిరర్థక ఆస్తుల పేరిట సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు బకాయిలు నేడు పేరుకుపోయాయి. వాటి స్వాహా కోసం ఎదురుచూస్తున్న బడా కార్పొరేట్‌ సంస్థలు తమ చెప్పుచేతల్లోని పాలకవర్గాలను రైతు రుణమాఫీకి అంత తేలిగ్గా అంగీకరించనివ్వబోవు. అదేవిధంగా స్వామినాథన్‌ కమీషన్‌ ప్రకారం మార్కెట్‌ శక్తులు ఎరువులు, క్రిమిసంహారక మందులు, విత్తనాల మీద పెంచే ప్రతి రూపాయిని గిట్టుబాటు ధరల నిర్థారణకు లెక్కించే పద్ధతిని కూడా అంగీకరించనివ్వవు. దీని ప్రకారం వ్యవసాయ కూలీల ధరలు ఎంత ఎక్కువ పెరిగితే దానిమీద 50 శాతం విలువను గిట్టుబాటు ధరలో చేర్చాల్సి

ఉంటుంది. అందుకే స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను అంగీకరించనివ్వబోవు. అది అమలు జరిగితే వ్యవసాయ కూలీల రేట్లు ఎంత ఎక్కువగా చెల్లిసే రైతులకు అంత గిట్టుబాటు ధర లభిస్తుంది. తద్వారా రైతు కూలీల మధ్య వైరుధ్యాలు తగ్గడంతో పాటు ఐక్యత ప్రగాఢంగా పెరుగుతుంది. అందుకే పై రెండు ప్రధాన డిమాండ్లను ఆమోదించడం అంత తేలికైనది కాదు.

పార్లమెంటరీ వ్యవస్థలో రైతాంగానికి మరెన్నో చేదు అనుభవాలు ఎదురుకాక తప్పదు. రానున్న కాలంలో ‘అందని ద్రాక్షపళ్ళు’ వంటి విజయాలు రైతాంగానికి లభిస్తాయి. అలాంటి ద్రాక్ష పళ్ళ గుత్తుల కోసం ఎదురుచూస్తున్న రైతుల నోట్లో వాటిలోని కొన్ని పండ్లు రాలి పడడం కూడా జరగవచ్చు. అదే సమయంలో అవి రైతుల చేతికి ఆసాంతం అందడం మాత్రం సాధ్యం కాదు. అంతిమంగా పార్లమెంటేతర పోరాట చైతన్యం ద్వారానే రైతాంగం తగిన విజయాలను సాధించగలదు. అయితే అనేక ఓటములు, పరాభవాలు, విశ్వాస ఘాతుక పరిణామాల తర్వాతనే రైతాంగానికి అలాంటి పార్లమెంటేతర రాజకీయ చైతన్యం లభిస్తుంది. తద్వారానే అలాంటి విప్లవ లక్ష్యం గల విప్లవ రైతు సంస్థల నేతృత్వం కూడా రైతాంగానికి లభిస్తుంది. అదొక చారిత్రక క్రమం.

నిన్నటి రైతాంగ లాంగ్‌మార్చ్‌ ఉద్యమ సంస్థలతో ఫడ్నవీస్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం అమలుకు ఆరునెలల కాలపరిమితి ఉంది. అది ఆచరణలో పాక్షిక విజయంగా ముగిసిపోవచ్చు. తిరిగి నూతన చైతన్యంతో మరో ఉద్యమ ఘట్టానికి కారణంగా మారవచ్చు. లేదంటే, మరోసారి ఘోరంగా వంచించబడి, నూతన తరహా పోరాట రూపాలను రైతాంగానికి అందించవచ్చును. లేదంటే 2019 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను దేశవ్యాపితంగా అన్ని పాలక పార్టీలూ రైతాంగాన్ని అందలమెక్కించి ఊరేగించే జాతరగా కూడా మారవచ్చు. ఎన్నికల నాటికి రైతాంగాన్ని మునగచెట్టు ఎక్కించి ఆ తర్వాత కిందికి తోసే అవకాశం కూడా లేకపోలేదు. అప్పుడైనా తిరిగి చేదు స్వానుభవాల నుంచి నూతన రాజకీయ చైతన్యం పొందే ప్రక్రియ తప్పదు. ఇందులో ఏ రీత్యా చూసినా తాజా ”లాంగ్‌మార్చ్‌” భారతదేశ రైతాంగ ఉద్యమ చరిత్రలో ఒక విలువైన అనుభవాలను అందించే అధ్యాయం కాక తప్పదు. అది రైతాంగ సుదీర్ఘ చారిత్రక ఉద్యమ ప్రస్థానంలో ఒక మైలు రాయిగా నిలుస్తుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.