వెండితెర చీకట్లకు వెలుగు రాదా? -కొండేపూడి నిర్మల

 

2002లో జూనియర్‌ ఆర్టిస్టుల మీద నేను చేసిన పరిశోధనతో వెలుగులోకి తెచ్చిన అనేక సమస్యలు ఇన్నాళ్ళ తర్వాత కూడా పరిష్కారం కాలేదు. పైగా ఇప్పుడు చిత్ర పరిశ్రమ ఇంకా అధ్వాన్నంగా ఉంది. అంతర్జాతీయ సినిమాల సంఖ్య తెలుగులో తక్కువే కానీ అవినీతి, అక్రమాల పునాదులు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఫోకస్‌ చేసిన విషయాల్లో కొన్నయిన గుర్తింపు కార్డు సమస్య, ఆర్థిక లైంగిక దోపిడీ ఇంకా తీవ్రతరమయ్యాయి.

శ్రీ రెడ్డి అనే నటి ‘మా’ అసోసియేషన్‌లో సభ్యత్వం కోసం ప్రయత్నించి అది రాకపోవడంతో మీడియా ముందుకొచ్చింది. రావడం రావడం చిత్ర సీమలో ఉన్న కాస్టింగ్‌ కౌచ్‌, సెటిల్‌మెంట్స్‌ లాంటి పదాల్ని, వాటి వెనకున్న అక్రమాలతో సహా వెలుగులోకి తెచ్చింది. వినోదం తప్ప మరో అభిప్రాయం లేని సామాన్య ప్రజానీకానికి ఈ ఫీల్డు మీద సదభిప్రాయం కొంతవరకు సన్నగిల్లింది. అంత క్రితం కూడా కొందరు నటీమణులు ఇవే విషయాలు చెప్పినా ఈ స్థాయిలో, ఈ భాషలో ఇంత తీవ్ర పదజాలంతో చెప్పలేదు. సహజంగా ఇవి వైరల్‌ అయ్యాయి. ఆమెకు మద్దతుగా అనేకమంది నటులు వచ్చి కలిశారు. ‘మా’ అసోసియేషన్‌ మాట్లాడలేదు. అదే వ్యవస్థలో ఎలాగోలా రాజీపడి కాలం గడుపుతున్న కొందరు అభద్రతకు లోనవడం వల్ల శ్రీరెడ్డి ఆరోపణలు అవాస్తవమని, మరీ ఆ స్థాయిలో లేవని, ఉన్నా కానీ ఆమె లొంగాల్సిన అవసరం లేదని చెప్పారు. రేషియోలో తేడా తప్ప లైంగిక ఆర్థిక దోపిడీ లేదని మాత్రం ఎవరూ చెప్పలేదు. రచ్చకెక్కడం వల్ల సమస్య పరిష్కారం కాదని కొందరు సుద్దులు చెప్పారు. శ్రీరెడ్డి చర్యకు కోపగించిన ‘మా’ అసోసియేషన్‌ ఆమెకు సభ్యత్వం ఇచ్చే ఉద్దేశ్యం లేదని తమ దగ్గరున్న 900 మంది సభ్యుల్లో ఎవరూ ఆమెతో నటించడానికి వీల్లేదని ఒక ఫత్వా జారీ చేసింది. ఈ దశలో మహిళా సంఘాలు తోడ్పాటునిచ్చాయి. ఎప్పటినుంచో తాము క్యాష్‌ కమిటీ ఉండాలని చెప్తుంటే ఇప్పటివరకు లేకపోవడానికి కారణమేంటని ప్రశ్నించింది. దీనికి ఉద్యమ రూపం వచ్చింది. ఇంత జరిగినా పరిశ్రమ పెద్దలెవ్వరూ జవాబు ఇవ్వలేదు. ఏం చెయ్యాలో తోచని ఒక నిస్సహాయ దశలో శ్రీరెడ్డి ఒక అగ్రశ్రేణి నటుడి తల్లిని దూషించినట్లు వార్త వచ్చింది. ఇది ఇంకో అగ్రశ్రేణి డైరెక్టర్‌ సలహాతో చేశానని, అప్పుడు మాత్రమే చిత్ర పరిశ్రమ పట్టించుకుంటుందని చెప్పింది. వివాదంలో తమ ప్రసక్తి వినిపించగానే పేరున్న నటీమణులు ఒక్కొక్కరుగా మీడియాకెక్కడం మొదలెట్టారు. వారి అభిమానులు రకరకాల దాడులు చేశారు. రకరకాల వత్లిళ్ళ మధ్య శ్రీరెడ్డి మీడియా ముందు క్షమాపణ చెప్పింది. శ్రీరెడ్డి ఆరోపణల్లోని వాస్తవాల వల్ల మానవ హక్కుల సంఘాలు కూడా కలుగజేసుకున్నాయి. ‘మా’ అధ్యక్షుడి రాజీనామా వరకు పరిస్థితి వెళ్ళింది. అతన్ని శాంతింపచేసి రాజీనామా ఉపసంహరించడంతో బాటు ‘మా’ అసోసియేషన్‌లో కార్డు ఇవ్వడానికి సమ్మతి తెలియజేసింది. శ్రీరెడ్డి తమ కుటుంబ సభ్యురాలు అని ఆమెకు సినిమా కాల్షీట్లు ఇప్పిస్తామని చెప్పారు.

ఈ పరిణామాలన్నింటా కొందరు సినీ మర్యాదస్తులు ఎక్కుపెట్టిన ప్రశ్నలు నాకు ఆశ్చర్యం కలిగించాయి.

శ్రీరెడ్డి ప్రొటెస్ట్‌ తీరు:

ఎవరి బట్టలు వాళ్ళు విప్పుకోవడం నేరం, గుర్తుపెట్టుకోండి. పురాణాల్లో అయితే కౌరవ సభలున్నాయి. ప్రజాస్వామ్యంలో అయితే అసెంబ్లీ మొదలుకొని, స్కూలు, కాలేజి, వర్క్‌ ప్లేస్‌ లాంటివి బోలెడున్నాయి. ఎంత బాగా ఊడదియ్యాలో ప్రచార, ప్రసార సాధనాలు చెబుతాయి. కాబట్టి శ్రీ రెడ్డి చేసింది తప్పు, తప్పున్నర. మొన్న పూర్తి దిగంబరంగా ఒక సినిమా వచ్చింది చూశారా… దాని పేరు గాడ్‌, సెక్స్‌ అండ్‌ ట్రూత్‌. అది సమాజానికి ఉపయోగకరం.

ఈ దేశంలో ఆడవాళ్ళు ఎన్ని గజాల వస్త్రం చుట్టుకోవాలో, ఎప్పుడు విప్పుకోవాలో, ఎందుకు విప్పుకోవాలో అన్నీ ఎవరో ఒకరు నిర్ణయిస్తారు.

నిర్మాత కొడుకుతో దిగిన సెల్ఫీలో ఆమె నవ్విందా? ఏడ్చిందా?

శ్రీ రెడ్డి సినిమాలలో వేషాల కోసం కొందరికి లొంగాల్సి వచ్చింది. స్వచ్ఛందంగా కొందరికి కమిట్‌ అయి ఉండచ్చు. లొంగిపోయాక కూడా వేషాలివ్వకుండా మోసం చేయడం గురించి వాపోతోంది. ఆమె మాత్రమే కాదు అనేక పదుల మంది కూడా అదే మాట్లాడుతున్నారు. అంటే ఇది డబుల్‌ ఎక్స్‌ప్లాయ్‌టేషన్‌ కిందికి వస్తుంది. ఇంకా చెప్పాలంటే వేషాలిచ్చే స్థాయి వారితోనే కాదు వారి కొడుకులకు, తమ్ముళ్ళకు, బామ్మర్దులకు కూడా ఎలా లొంగిపోవాలో ఆ ఫోటో చెబుతుంది. లొంగుతూ ఉన్నప్పుడు నవ్వుతూ ఉందా? ఏడుస్తూ ఉందా అనే ప్రశ్న మన విచక్షణకే వదిలేస్తున్నాను. అది ఎవరి ఫోనుతో తీసిన సెల్ఫీ అనేది కూడా ఆ కోవలోకే వస్తుంది. ఏ పెట్టుబడితోను, హామీతోను సంబంధం లేకుండా ఎవడో అంత ఆక్రమణ చేస్తుండగా లేనిది శరీరాన్ని, కెరీర్‌ని పణంగా పెట్టినా వాళ్ళు ఆ మాత్రం లౌక్యంగా రికార్డు చేయడం తప్పా?

ఇంట్లో వాళ్ళే శ్రీరెడ్డిని భరించలేక తీర్థయాత్రలకు వెళ్తున్నారు

కావచ్చు. ఇప్పుడు నటిస్తున్న ఎవరి తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు? యుద్ధానికెడితే ధర్మవీర చక్రాలు, అమ్మలుగానో, బాబాలు గానో మారితే అవినీతి సామ్రాజ్యాలు వస్తాయి కానీ వేషాలేస్తే ఏమొస్తాయి? ఏమీ రావు. మేకప్‌ ఎలర్జీలు తప్ప, వ్యక్తిగత జీవితం లేకపోవడం తప్ప. అభిమానుల్ని నమ్ముకుని బతకడానికి వాళ్ళు హీరోలు కాదు జీరోలు కదా. వాళ్ళకి ఎక్స్‌స్ట్రాలనే పేరుంది. అంటే తెరకే అదనపు సంఖ్య అని అర్థం. ఇది తెలిసేటప్పటికే వృద్ధాప్యము, అనారోగ్యము వచ్చేస్తాయి. అయినా సరే డబ్బుల కోసమే కాదు నటన మీద ఉన్న అభిమానం కోసం వచ్చేవారు జూనియర్‌ ఆర్టిస్టుల్లోనే ఎక్కువ ఉన్నారు. వారసత్వంగా వచ్చే నటులు, నిర్మాతల కొడుకుల్లో లేరు.

శ్రీ రెడ్డి గవర్నమెంటుని ఎద్దేవా చేసింది.

ఎందుకు చేయకూడదు. సినిమా నుంచి రాజకీయానికి దొడ్డి దారి ఉన్నప్పుడు వారికి ఓట్లేసేవాళ్ళందరికీ ఆ హక్కు ఉంది. అవినీతిని సరిదిద్దడానికి చేతకాని ప్రభుత్వాన్ని ప్రశ్నించి తీరాలి కదా.

మనం పతివ్రతలుగా ఉంటే ఎవరూ ఏమీ చేయరు

చాలా బావుంది. ఈ నిర్వచనం ప్రకారం సీత, ద్రౌపది, అహల్య, ఎవరూ పతివ్రతలు కాదు. ఒక్కసారి పురాణాలు తిరగేయండి. చట్టము, న్యాయము, మానవ హక్కులు ఉన్నాయి. వాటిని అమలు చేసుకోవాలి.

ధర్మ పన్నాగాలు కాదు, ఇటువంటి లౌక్య రాజ్యాంగం చాలా చెబుతోంది. మనది లౌకిక రాజ్యం కాకుండా పోయింది. పాదాల మీద వేడుకుంటే అత్యాచారాలు ఆగిపోతాయని కూడా వాళ్ళు అంటున్నారు. ఈ కబుర్లు ఆ స్థాయిలోనే ఉన్నాయి.

కాస్టింగ్‌ కౌచ్‌ ఇది వరకు లేదు అని చెప్పేవాళ్ళందరూ రావూరి భరధ్వాజ రాసిన ‘పాకుడు రాళ్ళు’ నవల చదవండి. పోనీ ఒకటిన్నర దశాబ్దం క్రితం అచ్చయిన వెండితెర చీకట్లు చదవండి…

ఎక్‌స్ట్రా అనే మాటలో వినిపించే చులకన అర్థం ఆత్మగౌరవాన్ని వెక్కిరిస్తున్నట్టుగా అనిపిస్తే ఇక ఎవరితోనూ అలా అనిపించుకోకూడదని నాలుగేళ్ళ క్రితమే ఒట్టు పెట్టుకున్న వెండి తెర చీకట్లు జూనియర్‌ ఆర్టిస్టులు. పిలుపు మారినంత తేలిగ్గా పరిస్థితి మారుతుందా? మారడం లేదు.

ఎంత భీభత్స, కరుణరస, శృంగార, విషాద సన్నివేశానికైనా ప్రధాన పాత్రల పక్కన జూనియర్‌ ఆర్టిస్టులు కనిపిస్తేనే ఒక నిండుతనం, సహజత్వం ఉట్టిపడతాయి. లేకపోతే రద్దీలేని ఖాళీ మార్కెట్లు, క్లాసు రూములు, యాక్సిడెంట్లు, పెళ్ళిళ్ళు, జాతరలు, రైల్వే స్టేషన్లు ఎంత లోపంగా కనిపిస్తాయో జూనియర్‌ ఆర్టిస్టులు పని మానేసి సమ్మె చేస్తేనే గానీ తెలీదు. అంత ప్రాధాన్యత ఉన్న అప్రధాన నటీనటులు ఎన్ని అగచాట్లు పడుతున్నారో వాటికి కారకులెవరో తవ్వుతున్న కొద్దీ ఆసక్తికరమైన విషయాలు బైటపడుతున్నాయి.

నేపథ్యం:

ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళిచూస్తే… 1972లో సినిమా పరిశ్రమ అంచెలంచెలుగా హైదరాబాద్‌కి మారాక స్థానిక నటీనటుల్ని పోగుచెయ్యాల్సిన బాధ్యత ఆ తరం ఏజెంట్లయిన చొప్పన భత్యేశ్వరరావు, ఎస్‌.చెన్నప్ప, బూని యాదయ్య, వి.యస్‌.మోహన్‌, సీతమ్మ, గుండమ్మ, వి.మల్లారెడ్డి లాంటి వాళ్ళు కొందరు తీసుకున్నారు. నటనమీద అభిమానంతో కొందరు, వేరే ప్రయోజనాలుంటాయేమో అని కొందరు 1982 లేబర్‌ కమీషన్లో సినీ జూనియర్‌ ఆర్టిస్టుల కింద రిజిస్టరయ్యారు. సారధి స్టూడియో భాగస్వాములు తమ్మారెడ్డి కృష్ణమూర్తి, సి.వి.వి.ఆర్‌.ప్రసాద్‌ లాంటి నలభై మంది సహకారంతో దీనికి పునాది పడింది. 1987 నాటికి రెండు వందలమంది పోగుపడ్డారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1600 వరకూ ఉంది. వ్యవసాయాలు కుంటుపడ్డం, సంఘటిత, అసంఘటిత విభాగాల్లో ఉన్న నిరుద్యోగం కారణాలవడంతో ఏం చేయాలో తోచక ఆధారం కోసం వెతుకుతూ కూడా కొందరిక్కడ చేరారు. ఏజెంట్లు 54 మంది వరకూ ఉంటారు. డబ్బింగ్‌, కాస్ట్యూమ్స్‌, లైట్‌మేన్‌, గ్రూప్‌డాన్స్‌, డూప్స్‌, ఫుడ్‌ సర్వీసింగ్‌, డాన్సు, మ్యూజిక్‌, డ్రైవర్లు లాంటి 24 అసోసియేషన్లు ఉన్నాయి. 24 సంఘాల్లో ఒక్కోదానికి ముగ్గురు చొప్పున మొత్తం 72 మంది మెంబర్లు కలిసినదాన్ని ఫెడరేషన్‌ అంటారు. అమీర్‌పేట, ఇందిరానగర్‌, కృష్ణనగర్‌, వెంకటనగర్‌ దాకా విస్తరించి ఈ సంఘాలన్నీ ఉన్నాయి. ఈ 24 అసోసియేషన్ల నుంచీ ఆర్టిస్టులతో సహా అన్ని హంగుల్నీ సినిమా షూటింగ్‌ కోసం సిద్ధపరిచే బాధ్యత ప్రొడక్షన్‌ మేనేజర్‌ది.

జూనియర్‌ ఆర్టిస్టులు యూనియన్‌ సభ్యులైన ప్రెసిడెంట్‌, సెక్రటరీల నుంచి, ఏజెంట్స్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌, ప్రొడ్యూసర్‌ దాకా అందరికీ జవాబుదారిగా ఉండాల్సిన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకు లభించాల్సిన పారితోషికం కూడా ఇంతమంది చేతులూ మారి రావాల్సిందే.

వేషాలివ్వక పరిశ్రమ పొగబెడుతుంటే తట్టుకోలేనివాళ్ళు గుర్తింపు కార్డుల కోసం కట్టిన పైకాన్ని కూడా వదిలేసుకుని పారిపోగా మిగిలిన సంఖ్య 600 మంది వరకూ ఉంటారు. ప్రతిరోజూ తెల్లవారుజామున 4 గంటలకు యూసఫ్‌గూడా ప్రాంతంలో ఉన్న అన్నపూర్ణ స్టూడియో దగ్గరున్న జూనియర్‌ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ దగ్గర వీళ్ళంతా రోజూ బారులు తీరి నుంచుంటారు. సినీ స్టూడియో నుంచి వచ్చిన వ్యానులోకి కూరగాయల బేరం మాదిరి అక్కడొకర్ని, ఇక్కడొకర్ని ఏజెంట్లు పిలిచి ఎక్కించుకుంటారు. సాంఘికాలయితే 50 లేక 60 మంది, పౌరాణికాలయితే 100 మందికి వేషాలు దొరుకుతాయేమో అంతే.

ఈ రకంగా పావువంతు మందికి కూడా దొరకని గిరాకీ కోసం ఓపికున్నన్ని రోజులూ ఆశతో ముస్తాబయి వస్తారు. వ్యాన్లు వెళ్ళిపోతాయి. ప్రపంచానికింకా తెల్లారకముందే వాళ్ళ ఆశలు తెల్లబోతాయి. తమాయించుకోలేని ఆగ్రహంతో ఏజెంట్లని తిడతారు. యూనియన్‌ని తిడతారు. పరిశ్రమని తిడతారు. ప్రేక్షకుల్ని తిడతారు. చాలా తొందరగా దెబ్బలాటలోకి దిగిపోతారు. పదిమంది వచ్చి వాళ్ళను విడదీస్తారు. అరుచుకొని అరుచుకొని అలిసిపోయాక జేబులో డబ్బులుంటే ఓ టీ తాగి అరుగుమీద కూచుండిపోతారు.

చేబదుళ్ళు యిచ్చుకొని మిత్రులయిపోతారు. చాలా తొందరగానే వాళ్ళ శత్రుత్వాల మధ్య కారణం కూడా అర్థమయిపోతుంది. చాలాసార్లు వెళ్ళిన వ్యాన్లు తిరిగివస్తూ ఉంటాయి. ప్రొడ్యూసరుకో, దర్శకుడికో నచ్చలేదంటూ కొందర్ని వెనక్కి దింపేస్తారు. ఆ స్థానంలోకి ఇప్పటిదాకా విసిగిపోయి నిస్పృహలో పడిపోయిన వాళ్ళు మేకప్‌ దిద్దుకొని పరుగెడతారు. ఏరోజుకారోజు తప్పనిసరిగా మరణించి మళ్ళీ పుట్టే విద్య వాళ్ళకెలా అబ్బుతుందో తెలీదు కానీ దశాబ్దాల నుంచి ఇది నడుస్తున్న చరిత్ర. వేషాల్లేకపోవడమొక్కటే వాళ్ళ సమస్య కాదు. నటించిన సినిమాల్లో రావాల్సిన పారితోషికం అయిదారు నెల్లదాకా చేతికి రావడంలేదు. వేషాలిచ్చే భరోసా లేకపోయినా రూ.2600 పుచ్చుకొని కూడా క్యారెక్టరు ఎసెస్‌మెంట్‌ (శీల పరిశీలన) పేరిట కార్డులివ్వకుండా యూనియన్‌ యాతనలు పెడుతుంది. కన్వేయన్స్‌లో 20శాతం కమీషన్లు అధికారికంగా పుచ్చుకొంటూ అనధికారికంగా నాన్‌కార్డు హోల్డర్లను సప్లై చేస్తూ ఏజెంట్లు తిప్పలు పెడుతున్నారు. షెడ్యూల్స్‌, షిఫ్టులు, తిండి, కాస్టూమ్స్‌ ఏదీ వివరంగా చెప్పక, అందివ్వక ప్రొడక్షన్‌ మేనేజర్లు సతాయిస్తున్నారు. మాస్‌ ఫిల్ములకంటే క్లాస్‌ ఫిల్ములే జనాలు చూస్తున్నారని, వాటితో మాత్రమే వాణిజ్య పంటలు పండుతాయని మాస్‌ జనాల్ని, కాల్షీట్లని ఎత్తిపారేసే ప్రయత్నంలో ప్రొడ్యూసర్లు, కథకులు, దర్శకులు, ప్రయోగాలు చేస్తున్నారు. ఇదంతా ఒక పెద్ద రాకెట్‌లాగ జరుగుతుంది. అంతిమంగా ఆ తప్పంతా ప్రేక్షకులదేనట! ప్రేక్షకుల అభిరుచి మేరకే తాము మాస్‌ రీళ్ళను తగలబెట్టాల్సి వస్తోందని పరిశ్రమలోని పెద్దలు ఢంకా బజాయించి చెబుతున్నారు. 1990 తర్వాత వచ్చిన సినిమాల్లో ఏ సెట్టింగ్‌ చూసినా భూమికీ, ఆకాశానికీ అందనంత చిత్రవిచిత్రమైన కంప్యూటరీకరణతో నిండిపోయి కన్పిస్తాయి. గ్రాఫిక్స్‌ గందరగోళం చూసిన కళ్ళకి జూనియర్‌ ఆర్టిస్టులుండే మాస్‌రీళ్ళు నచ్చడం మానేశాయి. ప్రపంచీకరణ ప్రభావం చిత్ర పరిశ్రమలో ఎంతమందికి జీవనోపాధిని కరువు చేస్తోందో చూస్తే కానీ నమ్మలేం.

జూనియర్‌ ఆర్టిస్టుల గ్రేడ్‌:

జూనియర్‌ ఆర్టిస్టుల్ని గ్రేడ్‌ ప్రకారం విలువ కడతారు. ఫస్ట్‌గ్రేడ్‌ ఆర్టిస్టుకి కాస్త మంచి బట్టలూ, డైలాగులూ ఉంటాయి. అందంగానూ, ఖరీదుగానూ కనిపించేవాళ్ళని ఇందుకు ఎంపిక చేస్తారు. పారితోషికం రూ.250 ఉంటుంది. గ్రేడ్‌ టూ- మంచి పర్సనాలిటీ ఉండి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, లాయర్‌, డాక్టర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌, సిపాయి, మిలిటరీ ఉద్యోగి, సెక్యూరిటీ గార్డు వేషాలకు పనికొచ్చేవాళ్ళు ఇందులోకి వస్తారు. వీరి పారితోషికం రూ.200 వరకూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ రెండు గ్రేడ్లను కలిపి వ్యవహరిస్తున్నారు. గ్రేడ్‌ వన్‌ స్థాయిలో ఎవర్నీ గౌరవించడంలేదు. గ్రేడ్‌ త్రీ – స్త్రీలు, పురుషులు, స్త్రీలు ఏ వయసువారైనా సన్నివేశాన్ని బట్టి తీసుకుంటారు. వీరికి రూ.150 దాకా ఇవ్వాల్సి ఉంటుంది.

శారీరక శ్రమకు గురయ్యే సన్నివేశాల్లో నటించినపుడు అంటే బాంబ్‌ బ్లాస్టింగ్‌, శవాల్ని, పల్లకీల్ని, ఇతర బరువుల్ని మోసుకెళ్ళడం లాంటివి చేసినపుడు ఇచ్చిన కాల్షీట్‌కు అదనంగా రూ.60 ఇవ్వాలి. ఏ గ్రేడ్‌ వేషం కట్టినా కన్వేయన్స్‌గా ముట్టే రూ.35 లో రూ.5 కమీషన్‌ ఏజెంట్లకు వెడుతుంది. నటించిన సీన్ల తాలూకు పైకం వెంటనే అందివ్వాలని అగ్రిమెంటు కాగితాల్లో ఉంటుంది. కానీ అది దాదాపు అమలు జరగడంలేదు. ఇంగ్లీషుకు రెట్టింపు, హిందీకి ఒకటిన్నర రెట్లు రావాల్సిన పారితోషికం ‘అదనంగా ఎంతో కొంత’ అనే అనధికార నిర్బంధంతో కోత పడుతోంది. అంతేకాదు ఔట్‌స్టేషన్‌ షూటింగ్‌ చేసినప్పుడు రావాల్సిన అదనపు పారితోషికం ఆర్టిస్టు చేతికి అందడంలేదు.

సన్నివేశాన్ని బట్టి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఒక కాల్షీట్‌గానూ, 6 నుంచి తెల్లవారుజామున 2 వరకూ రెండో కాల్షీట్‌గానూ పరిగణించాలి. లంచ్‌, టీ, టిఫిన్‌, డిన్నర్‌ బ్రేక్స్‌ ఈ సమయం పరిధిలోకే వస్తాయి. వీటికెవరూ న్యాయం చేయకపోగా అడిగిన వాళ్ళను కసురుకోవడం మరోసారి వేషాలివ్వకపోవడం జరుగుతుంది. జూనియర్‌ ఆర్టిస్టులంటే అందరికీ చిన్నచూపేనని బ్రేక్‌ఫాస్ట్‌ రూ.25, సాయంత్రపు టిఫిన్‌ రూ.35, రాత్రి డిన్నర్‌ రూ.20 ఖరీదుచేసే ఆహారం ఇవ్వాల్సి ఉండగా ఎప్పుడూ ఆ స్థాయిలో ఇవ్వరని, భోజనం కూడా ఇతర ఆర్టిస్టులకి దూరంగా పళ్ళాలు పట్టుకొని నుంచుని తింటామని కొందరు ఆర్టిస్టులు బాధతో చెప్పారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం:

జూనియర్‌ ఆర్టిస్టుల్ని చిత్ర పరిశ్రమే కాక దాని బాగోగులు చూడాల్సిన ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేస్తున్నాయి.

ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఇక్కడికొచ్చాక 35 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం టెక్నీషియన్స్‌ కోసం ఎఫ్‌.డి.సి.కి ఇచ్చింది. అదే విధంగా ఫిల్మ్‌నగర్‌ ప్రాంతంలో 100 ఎకరాలు దర్శక నిర్మాతలకు ఇచ్చింది. మొదటిదాంట్లో 35 శాతం మాత్రమే సినిమా వాళ్ళు తీసుకోగా మిగిలిన దాన్ని మార్వాడీలు, డబ్బున్నవాళ్ళు ఆక్రమించారు. అప్పటి ముఖ్యమంత్రి రామారావుకి కోపం వచ్చి కమిటీ వేశారు. ఆ కమిటీని పెత్తందార్లు కొనెయ్యగలిగారు. ఈ లోగా ఫిల్మ్‌నగర్‌ పక్కన ప్రభుత్వం ఎఫ్‌.డి.సి.కి ఇచ్చిన 12 ఎకరాలు ఉంది కదాని క్రింది స్థాయి సాంకేతిక నటబృందం అందులో పాకలు వేశారు. ఆర్టిస్టులు కాని వాళ్ళుకూడా తిష్ట వేయడంతో పోలీసులు మొత్తం అందర్నీ కలిపి వెళ్ళగొట్టారు. ప్రభుత్వ స్థలం తిరిగి నిజమయిన బాధిత ఆర్టిస్టులకు ఇవ్వడం కానీ, బలహీన వర్గాలకు ఇచ్చే ఇళ్ళు కేటాయించడం కానీ చెయ్యాలని యూనియన్‌ అడుగుతోంది. అది జరగడంలేదు.

ముఖ్యమంత్రి విజయభాస్కరరెడ్డి హయాంలో ప్రభుత్వ స్థలాలు చౌకగా కొనుక్కునే అవకాశమిచ్చారు. 67 ఎకరాలున్న ఆ స్థలం 45 ఎవరాల వరకూ అంటూ 90 లక్షల ధనంతో ఆర్టిస్టులూ, పెద్దలూ కలిసి కొనగలిగారు. ‘సేవ్‌ ది రాక్‌ సొసైటీ’ అడ్డుపడి మిగతా స్థలం అమ్మకుండా కేసుపెట్టింది. 1997లో వచ్చిన ఈ చట్టం 1994లో మంజూరైన దాన్నెలా అడ్డుకుంటుందో తెలీడం లేదని ఆ కారణంగానే హుడా వాళ్ళు నిర్మాణానికి అంగీకారం ఇవ్వడంలేదని ఆర్టిస్టులు అంటున్నారు.

”రోజువారీ రాజకీయాలకే సమయం లేదని చెబుతూ సినిమా భుజం తట్టి ప్రచార ఘోషకు ఫోజులిచ్చే మంత్రుల కళ్ళకు మా సమస్యలెందుకు కన్పించవో, ఉన్న పళాన రాత్రికి రాత్రి గుడిసెలు పీకి పోలీస్‌స్టేషన్‌లోకి నెట్టిన వైనాన్ని అసెంబ్లీలో ఎందుకు చర్చించరో తెలీదు” అన్నారు క్యారెక్టరు వేషాలు వేసే అర్టిస్టు శైలజ.

జూనియర్‌ ఆర్టిస్టు అనేకమందికి ఓటు హక్కు కానీ తద్వారా లభించే రేషన్‌ కార్డు కానీ లేదు. భూమి సమస్య ఎప్పుడు తీరుతుందో తెలీదు. దూరంగా ఉంటూ తెల్లవారుజామున ఆటో ఛార్జీలు (ఆ సమయానికి బస్సులుండవు) భరించలేక, దగ్గరగా ఉండే సినిమా ఏరియాకున్న భారీ అద్దెలు, అదనపు కరెంటు బిల్లులు భరించలేక నానా యాతనా పడుతున్నారు. కాబట్టి ఏ విలేఖరి కనిపించినా ఇదే తమ తక్షణ సమస్యగా చెప్పుకొస్తున్నారు.

సరదా కోసం నటించే కాలేజీ అమ్మాయిలు, అబ్బాయిలు ఏజెంట్స్‌ ప్రోద్బలంతో సీనియర్లకి పోటీ అవుతున్నారు.

జూనియర్‌ ఆర్టిస్టుల యూనియన్‌:

తీవ్రతను బట్టి సమస్య జూనియర్‌ ఆర్టిస్టుల నుండి మనం పరిశీలించినా గాని మొత్తానికి అభద్రత అనేది పెట్టుబడి దారుడైన నిర్మాత నుంచి ఏజెంట్లదాకా అందరికీ ఉంది. కాబట్టి ఎప్పుడే మలుపు తిరుగుతుందో తెలీని ఈ కార్యకర్తలు ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే’ వ్యాపార సూక్తిని నమ్ముకుంటారు.

జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ అయిన గోపాల్రావు మాట్లాడుతూ ”1988లో కట్టుబట్టలతో కొన్ని ఫ్యామిలీ కారణాల వల్ల ఇక్కడికొచ్చి పడ్డాను. ”పద్మావతీ కళ్యాణం” షూటింగ్‌ జరుగుతోందని విని వెళ్ళి చూశాను. ఒక యూనియన్‌లో చేరి సర్వీసింగ్‌ చేస్తూ అప్లికేషన్‌ ఇచ్చుకుని సెట్స్‌ ఇన్‌ఛార్జిగా వెళ్ళాను. 1991లో ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ ఫెడరేషన్‌లో ట్రెజరర్‌గా వచ్చాను. ఆ తర్వాత ఫెడరేషన్‌లో 11 యూనియన్లు తయారయ్యాయి. చురుగ్గా పనిచేస్తున్నవి ఆరు యూనియన్లే. 1991 డిసెంబర్లో మద్రాస్‌ వర్కర్లు ఇక్కడి వాళ్ళతో కావాలని గొడవ పెట్టుకుని షూటింగ్‌ క్యాన్సిల్‌ చేశారు. 1992లో సౌత్‌ ఇండియా ఫిల్మ్‌ ఆఫ్‌ ఛాంబర్‌ని రమ్మంటే రామానాయుడు మాకు మీటింగ్‌ అరేంజ్‌ చేశారు. ప్రెసిడెంట్‌ మోహన్‌గాంధీ రామన్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసిన చోట మమ్మల్ని మైనార్టీ కాబట్టి మాట్లాడమన్నారు. అప్పటి రోజుల్లో ఆంధ్రావాళ్ళ స్థాయి అదే. 1991 వరకూ జూనియర్‌ ఆర్టిస్టులు, ఏజెంట్లు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఇక్కడికొచ్చాకే జీతభత్యాల నిర్ణయం, నియమ నిబంధనలు రాసుకున్నాం. ఆర్టిస్టు నుంచి మేం తీసుకునే 20 శాతం కమీషన్లోనే అద్దె, ఫర్నిచర్‌, లైటింగ్‌, ఫోన్‌, ఫ్యాన్లు, సిబ్బంది జరుగుబాటు లాంటి అన్ని ఖర్చులూ గడవాలి. 1993 తర్వాతే జూనియర్‌ ఆర్టిస్టులకు స్ఠాయీ, గౌరవం పెరిగాయి. మంచి కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళతో కానీ, మా ప్రవర్తన, పద్ధతి వల్ల కానీ ఇక్కడి పరిస్థితి బావుంది” అంటారు.

యూనియర్‌ సెక్రటరీ వేణు ఈ వృత్తి పట్ల అసంతృప్తిని ప్రకటిస్తూ ”ఏదారి లేక గోదారి అన్నట్టుగా ఇక్కడికొచ్చి పడ్డాం. నాకు పదహారేళ్ళకే పెళ్ళయింది. వెంటవెంటనే ముగ్గురు పిల్లలు. సింగరేణి బొగ్గు గనిలో పనిచేసేవాడ్ని. ఒక ఏజెంట్‌ సౌత్‌ ఆఫ్రికాలో పని చూపిస్తానని దానివల్ల ఏడాదికి లక్ష రూపాయలు సంపాయించుకోవచ్చని చెప్పి నిజామాబాద్‌ దగ్గరున్న ఒక పల్లెటూరుకు తీసుకెళ్ళాడు. రెండు జతల బట్టలు మాత్రం నా దగ్గరుంచుకుని రూ.17,000 అతని చేతిలో ఎవరికో కమీషన్‌ ఇవ్వాలంటే ఇచ్చాను. వెళ్ళిన మనిషి మళ్ళీ రాలేదు. నాతోపాటు ఇంకా కొందరున్నారు. వాళ్ళలో ఎక్కువ మంది తిట్టుకుంటూ వెనక్కి వెళ్ళిపోయారు. నేనలా వెళ్ళలేదు. అక్కడేదో బండెక్కి హైద్రాబాద్‌ వచ్చాను. ఇక్కడ సినిమా స్టూడియోలు చూడాలని ఆశ. అన్నపూర్ణ స్టూడియో చూశాను. ఇప్పుడు యూనియన్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న చండ్ర మధు అప్పట్లో ఏజెంట్‌గా పని చేసేవాడు. వాళ్ళతో పాటు పద్మాలయాకి వెళ్ళాను. ఆ రోజుల్లో ఆర్టిస్టుకి రూ.3 కన్వేయన్స్‌ ఉండేది. ఆర్టిస్టుల దగ్గరికి అమ్మాయిల కోసం, డబ్బుల కోసం రౌడీలొచ్చేవారు. మిత్రుడు భాషా, నేనూ ఏజెంట్‌ సీతమ్మ దగ్గర పేర్లు రాసే పనిలో చేరాం. బొగ్గు గనిలో పనికంటే అసిస్టెంటు పని కాస్త సులువుగానే ఉండేది. నాలుగు సంవత్సరాలు పనిచేశాక ఇందులో ఉన్న మంచిచెడ్డలు అర్థమయ్యాయి. ఇందులో ఉన్న చెడ్డని పోగొట్టి మంచిని పెంచాలని దీక్ష పెంచుకున్నాను. కొద్ది రోజులయ్యాక గండయ్య, మోహన్‌ అంతా కలిసి లాల్‌ బహదూర్‌ స్టేడియం దగ్గర్నుంచి ఇక్కడ యూసఫ్‌గుడాలో స్టూడియో పెట్టించాం. 10 సినిమాలకు పనిచేసిన అనుభవం ఉంది. ‘మౌన పోరాటం’ అనే సినిమా నుంచి నన్ను ఏజెంట్‌గా తీసుకున్నారు. అప్పట్నుంచీ నా ఏజెంట్‌ గిరీ మొదలైంది. ఆర్టిస్ట్‌ సప్లయర్స్‌ (ఏజెంట్స్‌) అంటే ఎందుకోకానీ జనాల్లో దురభిప్రాయం ఉంది. మంచి చెడ్డలు వ్యక్తుల్ని బట్టి ఉంటాయి. నేను నా భార్యతో బైటికెళ్ళినా ఎవరమ్మాయినో ఎత్తుకుపోతున్నట్లు చూస్తారు. జూనియర్‌ ఆర్టిస్టులక్కూడా మేమంటే కోపం. 50 మంది మనుషులు సరిపోతారని అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్పష్టంగా చెప్పినప్పుడు అంతకంటే ఎక్కువ అవకాశాలు ఎక్కడినుండి ఇస్తాం? కనీసం ఏ సీన్‌ కోసం, ఏ వయసు ఆర్టిస్టులు కావాలో కూడా ఫీల్డ్‌ పెద్దలు చెప్పరు. అడిగితే నీకెందుకు? అన్నట్టు చూస్తారు. దీనిమూలంగా మాలో అస్పష్టత, అయోమయం ఉంటాయి. ఇప్పుడిప్పుడే మేం అడగ్గా అడగ్గా ఏ సీను, ఏ వయసు, ఎంతమంది లాంటి వివరాలు ముక్తసరిగా అయినా చెబుతున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్లు మోడల్‌ అమ్మాయిలు కావాలని అడుగుతున్నారు. ఇక్కడున్న మెంబర్స్‌లో ఎక్కువమంది సీనియర్సే. అంతంత మాత్రం చదువులు, అందచందాలు. ఏం చెయ్యమంటారు? నాన్‌ మెంబర్స్‌ని తీసుకోవడం వల్ల మాకేమిటి లాభం? చిరంజీవి లాంటి హీరోలు కూడా మాస్‌ సీన్స్‌ తగ్గించేశారు. సెల్యులాయిడ్‌ నిండా ఎంతసేపు టీ షర్ట్స్‌, గౌన్లు ఉంటే చాలా? పోనీ మా ఆర్టిస్టుల్లోంచి అయినా కొందరికి ఆ గెటప్‌ ఇవ్వొచ్చుగా. రద్దీ రోడ్లమీద కూడా అందమైన బొమ్మలే ఉండాలంటే ఇక మాస్‌ మనుషులు ఎలా బతుకుతారు? ఇక ప్రొడ్యూసర్స్‌ నుంచి ఆర్టిస్టులకి సంబంధించిన బిల్లులు లేవు. ఉన్న బిల్లులు యూనియన్‌ సెక్రటరీ, క్యాషియర్లు పంచుతున్నారో లేదో అడగండి. ‘సుబ్బు’ సినిమా రిలీజయింది. లక్షా ఇరవై వేలు బిల్లు వచ్చింది. రూ.40,000 అయినా ఆర్టిస్టులకి

వాళ్ళు ఇవ్వలేదు. మా దగ్గర ఏ బిల్లూ ఆగదు. అసలు డబ్బులు తీసుకునే గుర్తింపు కార్డులెందుకివ్వరో అడగండి. ఈ ఫీల్డుకొచ్చి మేం బావుకున్నది లేదు. నిందలు తప్ప” అంటూ ముగించారు. యూనియన్‌ ప్రెసిడెంట్‌ చండ్ర మధు ఆ పదవిలో మూడోసారి కూడా అత్యధిక ఓట్లతో గెలిచి పనిచేస్తున్నారు. ఆర్టిస్టులు, ఏజెంట్ల ఆరోపణలు వారి దృష్టికి తెచ్చినపుడు మౌనంగా విని కాస్సేపయ్యాక చెప్పారు.

”ఔను మూడోసారి కూడా ఎన్నికయ్యాను. వాళ్ళకేమీ న్యాయం చెయ్యలేకపోతున్నాను. పనికి అడ్డుపడే అవరోధాలు చాలా

ఉన్నాయి. ఛాంబర్‌ ఏజెంట్స్‌ ఏ రోజు బిల్లులు ఆ రోజు ఇవ్వాలి. వాళ్ళు వెంటనే ఇచ్చేస్తే మేం ఆర్టిస్టులకి పంచేస్తాం. కొన్నిసార్లు మేం

ఉన్న టైము లోపల ఆర్టిస్టులు వచ్చి వసూలు చేసుకోరు. కొంతమంది ప్రొడ్యూసర్లు పిక్చర్‌ రిలీజయ్యాక కూడా బిల్లులు పంపరు. దీనివల్ల అందరూ మమ్మల్ని తప్పు పడుతున్నారు. అసలు ఇక్కడ అవసరానికి మించి మనుషులు పోగుపడిపోతున్నారు. కార్డులివ్వడం మానేయమని మా సెక్రటరీకి చెప్పాను” అన్నారు. వెంటనే అక్కడున్న సెక్రటరీ భాస్కరరావు స్పందిస్తూ ”బ్రతిమలాడి మా ప్రాణం తీసి డబ్బులు చెల్లిస్తారు. అది కూడా వాయిదా పద్ధతుల్లో. వాయిదా పూర్తి కాకుండానే కార్డులే కాదు రసీదులు కూడా ఇవ్వలేం. రసీదులు ఉన్న వాళ్ళని కూడా మనిషి ప్రవర్తనా పద్ధతి పరిశీలించి కానీ ఎటూ రికమండ్‌ చేయలేం. కార్డు, క్యాష్‌ లేకపోతే ఆఫీస్‌ జరుగుబాటు ఎలా? ఆర్టిస్టుల బాగోగులు, ఎవరైనా ఆకస్మికంగా జబ్బు పడితే, చనిపోతే ఆ ఖర్చు ఇవన్నీ గట్టెక్కించాలి కదా. ఓటు హక్కు లేదని గొడవపెడుతున్నారు. ఎన్నికల వాళ్ళు వచ్చినపుడు ఆ సమయానికి ఉండి వివరాలిస్తున్న వాళ్లెవరైనా ఉన్నారా? హెల్త్‌ కార్డు తీసుకోమని నోటీస్‌ బోర్డుమీద రాశాం, ఎవరూ పట్టించుకోరు. ఎక్కడెక్కడి ఊళ్ళనుంచో ఇక్కడికొస్తే అన్ని జాగ్రత్తలూ పడాలి కదా. పొద్దున్న వెళ్ళినవాళ్ళు రాత్రికి కానీ రారు. సరే తప్పెవరిది? మాది కాదు కదా” అంటూ ఆవేశపడ్డారు.

నెలకు 15 రోజులయినా వేషాలు దొరికే మంచి పర్సనాలిటీలు, ఖరీదైన బట్టులు, భాష ఉన్నవారికి భవిష్యత్తు మీద కొన్ని ఆశలుంటే, జీవితంలో ఒడిదుడుకులకు తట్టుకోలేక, ఆదరణ లేక ఏదో ఒక సీన్లో అలా కనిపిస్తే తిండి దొరుకుతుంది కదా అని వచ్చిన వృద్ధులు కొందరున్నారు. ఆర్‌.సంజీవి (55) కూడా ఈ ఫీల్డులో జరుగుబాటు అవుతుందని గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం నుంచి వచ్చారు. వ్యవసాయంలో నష్టం వస్తే స్కూల్లో అసిస్టెంట్‌గా కొన్నాళ్ళున్నారు. 20 రోజులపాటు సిమెంట్‌ తట్టలు మోసే పని దొరికిందని చేసేసరికి జబ్బుపడి, మధుమేహం మూలంగా కాళ్ళు, చేతులు పుండ్లు పడ్డాయి. మెహదీపట్నం అనాధ హాస్టల్‌లో వాచ్‌మేన్‌గా కుదిరి చేస్తున్నానని, ఫీల్డ్‌ ఆదరిస్తే బావుంటుందని నానా కష్టాలు పడి రూ.2,160 కట్టినా కార్డునివ్వలేదని చెప్పుకొచ్చారు.

ఆర్థికమైన ఈతిబాధలు ఎన్నున్నా నటన కోసం ప్రాణమిచ్చేవారు మనకు జూనియర్‌ ఆర్టిస్టుల్లోనే కనిపిస్తారు. కుటుంబంలో అయినవాళ్ళతో భంగపడి కొందరుంటే, సినిమాల్లో ఒకట్రెండు సెకండ్లపాటు కనిపించే పాత్రల్నే సంబరంగా చెప్పుకుంటూ ఫీల్డు ఆఫీసే తమ ఇల్లుగా భావించే సంతృప్తి బైటినుంచి కాకుండా మనసులోంచే వస్తుంది అని చెప్పడానికి ఎమ్‌.సావిత్రమ్మ ఒక ఉదాహరణ. సావిత్రికి అయిదు పదుల వయసు ఉండొచ్చు. భర్త చౌదరి మిలిటరీలో పనిచేసి రిటైరయ్యారు. పుట్టి పెరిగింది వరంగల్‌. పిల్లల్లేరు. 5 క్లాసులు చదివారట. పక్క వాటాలో ఉండే మణెమ్మ, మేరి, శాంతమ్మ తదితర నేస్తాలతో షూటింగులు చూసేవారు. కళగల మొహం, పర్సనాలిటీ

ఉండడం మూలంగా మణెమ్మ ఈమెను ఫీల్డుకి పరిచయం చేసింది. పాతికేళ్ళ వయసులో జనంతో కలిసి ఒక సన్నివేశంలో కనిపించింది. సినిమా పేరు గుర్తులేదు. కానీ పారితోషికంగా ఇచ్చిన పది రూపాయలు తనకెంతో ప్రోత్సాహం ఇచ్చాయంటుంది. తర్వాత్తర్వాత డైలాగ్‌ చెప్పడం, ఎమోషనల్‌గా ఏడవడం, ధర్నాలు చేసే సీన్లకు నినాదాలివ్వడం చేసి గ్రేడ్‌ పెంచుకుంది. ఫీల్డు కొచ్చిన తర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తిరిగి ఇంటికెళ్ళలేదు. రెండో పెళ్ళి చేసుకున్న భర్త మాత్రం ఎప్పుడైనా వచ్చి చూసి వెళతారంట!

”సినిమా పిచ్చిదాన్నండీ. సినిమాలోనే చచ్చిపోతాను. కెమెరా ఎటు తిరగమంటే అటు తిరుగుతా. ఏడుపు సీన్లు రక్తి కట్టించాలంటే నా తర్వాతే ఎవరైనా. రక్షణ సినిమాలో నా కూతుర్ని ఒకరు చంపేస్తే ఆ సన్నివేశంలో ఏడిచాను. బాగా నటించానన్నారు. ‘చిత్రం’ సినిమాలో బామ్మ పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఎదురులేని మనిషి, ఆజాద్‌, పచ్చని సంసారం, శివ, సమ్మక్క సారక్కలో బోనాలు ఎత్తుకెళ్ళే సీను, ఒసే రాములమ్మ సినిమాలో నా కూతుర్ని మోసం చేస్తే ఏడిచే సీను-ఏదైనా సరే ఒక్క టేకులో చేస్తాను. నాకేమిటో జీవితానికి, సినిమాకి తేడా తెలవదు. రెండూ ఒకటేగా అనిపిస్తుంది. అంచేత అలా ఏడుపొచ్చేస్తుంది. టీవీ సీరియల్స్‌ చెప్పుకోవాలంటే రుతురాగాలు, సుందరీ నీవెక్కడ, భక్త మార్కండేయ, పరమానందయ్య శిష్యుల కథ, సంకెళ్ళు వంటి వాటిల్లో నటించా. ఫీల్డు నాకు బానే

ఉంది. కాలూ, చెయ్యి ఆడినంతవరకూ పనిచేస్తాను. కానీ… ఆ తర్వాత ఏమిటి? సినిమాల్లో హీరోల్లాగ పోయేముందు ధైర్యం చెప్పేవాళ్ళెవరైనా ఉంటారా? ఉంటే బావుండ్ను” అని చెప్పారు.

యూసఫ్‌గుడాలో అడుగుపెట్టగానే ఏజెంట్స్‌ ఆఫీసులో మనల్ని ఆకర్షించే వ్యక్తి ‘మీనాక్షి’. ఆరడుగుల పొడుగున్న పర్సనాలిటీ, తీరైన ముఖం, వెంకటగిరి జరీ చీర, కొప్పునిండా కనకాంబరాలతో కిళ్ళీ నములుతూ నవ్వుతూ కళ్ళతోనే పలకరిస్తుంది. జూనియర్‌ ఆర్టిస్టుల సాధక బాధకాల్ని గురించి అడిగినప్పుడు చెప్పడానికి ఇష్టపడనట్లు కనిపించింది. తరచి తరచి అడిగిన మీదట ఎలాగోలా ఒప్పుకుంది. మీనాక్షి మాట్లాడేదాకా మనకి తను మొగవాడని తెలీదు. స్త్రీలంటే ఉండే వివక్షకి తోడు ఇలా క్రోమోజోమ్స్‌ లోపంతో పుడుతున్న అసంపూర్తి అవయవ లక్షణాలున్న ఆడవాళ్ళపట్ల ఈ సమాజానికుండే హేళన అంతా ఇంతా కాదు. అయితే మీనాక్షి చాలా తక్కువ కాలంలోనే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుంది. ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటూ, ఎవరైనా మోసం చేస్తున్నట్లు పసిగడితే పులి అమరేందర్‌రెడ్డిగా ప్రతాపం చూపిస్తూ ఒక ప్రత్యేకత సంపాయించుకుంది. స్క్రీను మీద మీనాక్షి ఆడ, మగ రెండు పాత్రల్లోనూ నటిస్తుంది. డాన్సులు, ఫైట్లు చేస్తుంది. తన మాటల్లో చెప్పాలంటే ”కన్నవాళ్ళు బాధపడకుండా ఉండాలని పాంటూ, చొక్కా వేసుకుని రోడ్డుమీద నడుస్తుంటే ‘కొజ్జా, కొజ్జా’ అని వెక్కిరించి సమాజమే నన్ను తనకు వీలుగా మార్చుకుంది. మా నాన్న వ్యవసాయం చేసేవారు. కరీంనగర్‌లో ఉండేవాళ్ళం. శరీరాలు దేవుడిచ్చినవి కదా. మా తప్పేం లేకపోయినా పరువు కోసం కుటంబాలే మమ్మల్ని వెళ్ళగొడతాయి. హత్యలూ, దోపిడీలు చేసిన వాళ్ళకంటే ఎక్కువ నేరస్థుల్లా మేం ఇళ్ళనీ, కన్నవాళ్ళనీ ఎవరికీ చెప్పకుండా బతికేయాలి. ఒకవేళ పోయినా బాధపడేవాళ్ళుండరనుకోండి. నేను పదో తరగతి చదువుతూ ఉండగానే ఇక్కడికొచ్చేశాను. నా పుట్టుకకి ఏదో ప్రయోజనం ఉండే ఉంటుంది. అది కనిపెట్టి పని చేస్తే అంతే చాలు కదా అని నమ్మాను. ఆ నమ్మకం ఒక్కటే నా బలం. నాలాంటి వాళ్ళు భాగ్యనగరంలో నాలుగు వేల మంది వరకూ ఉంటారు. కృత యుగం నుంచీ ఈ అవతారం ఉంది. భాగ్య నగరం మాలాంటి పవిత్ర జీవుల ఆశీర్వచనం. ప్రపంచంలో ఇన్ని రకాల దొమ్మీలు, కుట్రలు, నమ్మకద్రోహాలు జరుగుతున్నాయి కదా ఒక్క విషయంలో కూడా మా నేరం లేదు. మమ్మల్ని దేవతలుగా నమ్మే వాళ్ళున్నారు. కోటి దేవతల దీవెన ఒక ఎత్తు. కొజ్జా దీవెన ఒక ఎత్తు. మేం ఎవరినైనా దీవించడమే కానీ మోసం చెయ్యలేం. ఇళ్ళల్లోనో, ఆస్పత్రుల్లోనో ప్రసూతి అయితే తల్లీ బిడ్డల్ని దీవించి కానుకల్ని తీసుకుంటాం. హోలీ, దీపావళి పండగలకి, కొత్త దుకాణాలు తెరిచినప్పుడు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మేం ఉండాల్సిందే. ప్రభుత్వ నిధులతోనో, ఉద్యోగాలతోనో బతకడానికి మా సంఘం పెద్దలు ఒప్పుకోరు. కానీ నాకు మొదట్నుంచీ నాట్యం, నటన, పాటలాంటివి ఇష్టం. జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్నందుకు అపరాధ రుసుము కింద మా వాళ్ళు రూ.500 తీసుకున్నారు.

నేను కళామతల్లినే నమ్ముకున్నాను. అమ్మవారి గెటప్‌లో మర్ధిని నేనే ఆడాలి. లంబాడి డాన్సు నుంచి లక్షద్వీప్‌ డాన్సు వరకు నా అభినయం ఇంకెవరికీ రాదు. నా వయసు ఇప్పుడు 42. ఫీల్డులోకొచ్చిన కొత్తలో అంటే నా పద్నాలుగో ఏట ఆర్టిస్టుకి రూ.3 కన్వేయన్సు

ఉండేది. పారితోషికం రూ.15 దాకా ఇచ్చేవారు. కాల్షీట్లు, టైమింగ్స్‌ లాంటి నియమ నిబంధనలేవీ ఉండేవి కాదు. రూ.20 కట్టి మెంబర్‌షిప్‌ తీసుకున్నాను. నాకు వ్యక్తిత్వం వచ్చేవరకూ మా సంఘం వాళ్ళే చూసుకున్నారు. కూచిపూడి, ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. సాంస్కృతిక వివరాల శాఖలో డాన్సరుగా పనిచేశాను. ఇప్పుడు కూడా గ్రూప్‌ డాన్సర్‌గా చేస్తాను. 300 సినిమాల్లో ఫైట్స్‌తో సహా అన్ని తరహా పాత్రలూ చేశాను. ఫీల్డులో నేనంటే గుర్తింపు ఉంది. బాలంరాయి అన్నా నగర్‌ మహిళా మండలిలో మెంబర్ని కూడా. అశ్వనీదత్‌ ప్రొడ్యూసర్‌గా ఉన్న రాజకుమారుడు సినిమా కోసం రాత్రీ పగలూ పనిచేయించుకుని రూ.15,000 పైకం రూ.8000 లకు తగ్గించి ఇచ్చారు. వాళ్ళ మాట నమ్మి గ్రామాల నుంచి ఆర్టిస్టుల్ని తీసుకొచ్చి మరీ మోసపోయాను. మాట తప్పడం అనేది ఈ ఫీల్డులో భూమి పుట్టక ముందు నుంచీ

ఉంది. ఈ ఫీల్డులో పనిచేసే క్యాషియర్‌ సత్యం డబ్బు విషయంలో అందరితో పాటు నన్నూ మోసం చేశాడు.

అభ్యసించిన వేషం గురించి, డైలాగ్‌ డెలివరీ గురించి ఏ లోపం లేకుండా ఎలా మెలగాలో ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఏడు భాషలు మాట్లాడ్డం తెలుసు. ఇప్పటికి రెండేళ్ళ క్రితం వరకూ మగవాడి డ్రెస్సులోనే ఉన్నాను. నా విషయం అంతర్గతంగా ఉంచుకుని పెళ్ళి చేసుకున్నాను. స్నేహితురాల్లాగా, సొంత కూతురిలాగా భార్యను చూసుకున్నాను. కానీ ఆవిడవైపు వాళ్ళంతా ఇంటి మీదికొచ్చి గొడవ చేశారు. అక్కడితో ఆ ఛాప్టర్‌ పూర్తయింది. పొలిటికల్‌ లీడర్స్‌ అంతా తెలుసు. స్థలాల విషయంలో మాకు మోసం జరిగింది. తిన్నా తినకపోయినా ఒక గూడు ఉంటే బావుంటుందనిపిస్తుంది. మా సంఘానికొచ్చి, తల్లి దండ్రులే వదిలేసిన పిల్లల్ని పెంచుకుంటాం. నా దగ్గర నలుగురు జూనియర్‌ కొజ్జాలున్నారు. బంధుత్వాల మీద పోని మమకారం వాళ్ళవల్లనే మాకు తీరుతుంది. అత్తా, పిన్నీ, అమ్మా అంటూ ఆ పిల్లలు మమ్మల్ని పిలుస్తారు. మా బంధాల్లో కట్టడి కానీ శాశ్వతత్వం కానీ ఉండదు. కాబట్టి ఆ పిల్లల్లో ఎవరెక్కడికి పోతారో చెప్పడం కష్టం. హైదరాబాద్‌లో ఎవరైనా చీరా, జాకెట్‌ కట్టాలి. బోంబే, ఢిల్లీ లాంటి చోట్ల ఫ్యాన్సీ డ్రెస్సులు కట్టచ్చు. మాలో ఎక్కువ మంది సిటీలో ఉండడానికే ఇష్టపడతాం. మా వల్ల తప్పుకానీ మోసం కానీ జరిగితే మా సంఘంలో పంచాయితీ పెడతారు. అందరిలాగానే బతకడానికి ఏ పని అయినా చేసుకునే స్వేచ్ఛ ఉండాలని నేను వాదిస్తాను. బోంబేలో ఛాయ అనే ఆర్టిస్టు ఎన్నో సినిమా షూటింగులు చేస్తుంది. ఉత్తరప్రదేశ్‌, హర్యానాలాంటి చోట్ల శోభాజీ ఎమ్మెల్యే అయింది. మధ్యప్రదేశ్‌లో కమలాజీ నగర మేయర్‌గా ఉంది. చాలా కమిటెడ్‌ మనిషి. ప్రభుత్వం కారు ఇస్తే తీసుకోలేదు. ఆటోలో తిరుగుతుంది. మాకు ఆడ, మగ బలహీనతల్లేవు. అంచేత డబ్బు అవసరాన్ని మించి దాచుకోనక్కర్లేదు. కొజ్జాల్ని సమాజంలోకి రానివ్వకపోవడం నేరం. మేము ఆడవాళ్ళ బలహీనతలూ, మగవాళ్ళ బలహీనతలూ రెండూ గుర్తుపట్టగలుగుతాం. అంచేత ప్రభుత్వం మాతో స్వలింగ సంపర్కుల మానసిక వికాసం కోసం పనిచేయించుకోవచ్చు. ఎయిడ్స్‌ నిరోధానికి క్యాంప్స్‌ పెట్టొచ్చు. కానీ మాకెవరూ ఉపకారం చేయరు. మమ్మల్ని మీ కోసం ఎలా చెయ్యనివ్వరు. చీర కట్టుకుని నేనిలా ఆడదానిలా కనిపిస్తున్నా సరే రెడ్డీ, రెడ్డీ అని పిలుస్తారు. నేను రెడ్డిని కాదు ఆ రెడ్డి చచ్చిపోయాడు. నన్ను మీనాక్షి అని పిలవండి అని అరిచి చెబుతుంటాను”.

మీనాక్షి చెప్పిన దాంట్లో వ్యక్తిగత విషయాలే ఎక్కువుండడం సహజం. ఎందుకంటే జెండర్‌ అనేది ఆమె జీవన్మరణ సమస్య. ఎప్పుడో తప్ప ఆమెకు ఇప్పుడు ఫీల్డులో వేషాలుండడం లేదు. మిగిలిన జూనియర్‌ ఆర్టిస్టుల సమస్యలన్నీ ఆమెకూ వర్తిస్తున్నాయి. నిర్మాతల దృక్పథంలో మార్పు రావాలనేది మీనాక్షి వాదన.

తమ్మారెడ్డి భరద్వాజ:

ఈ విషయంలో దర్శక నిర్మాతల అభిప్రాయాలు ఇంకోలా ఉన్నాయి. ఓ వైపు జూనియర్‌ ఆర్టిస్టుల బాగోగుల కోసం కృషి చేస్తూ, ఇంకోవైపు సినిమాలు తీస్తూ, దర్శకత్వం వహిస్తూ ఫీల్డుకి సుపరిచితుడైన తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ”జూనియర్‌ ఆర్టిస్టులకున్న ప్రధాన సమస్యలు రెండే. ఒకటి జీతాలు, రెండు ఇళ్ళు. రెండు విషయాలూ గందరగోళంలో పడడానికి వాళ్ళ బలహీనతలే కారణం. ఆర్టిస్టులు అవసరానికి మించి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సగానికి సగం మంది ఇళ్ళ స్థలాలు దొరుకుతాయని వచ్చారు. కష్టపడకుండా గడిచిపోతుందని వచ్చారు. ప్రొడక్షన్‌ మేనేజర్‌ పైకం ఇచ్చేదాకా ఆగరు. ఇచ్చే వేళకి ఉండరు. ఏజెంట్లు ఆ డబ్బు వాడుకుంటున్నారు. పాత కాల్షీట్‌కి పైకం అందకుండా కొత్తదానికి ఎందుకొస్తున్నారు? గట్టిగా అడగాలి కదా. అడగరు, భయం. అవసరం ఏదైనా అనుకోండి. ఒక్క రోజు వ్యాను ఎక్కకుండా ఆగమనండి. పరిస్థితి ఎందుకు చక్కబడదో చూద్దాం. మాట్లాడవలసింది కాక ఇంకేదో పోట్లాడతారు వాళ్ళు. హీరో హీరోయిన్స్‌కుండే ట్రీట్‌మెంట్‌ వాళ్ళు ఆశించడం అసహజం కదా. పాత్రలూ, పారితోషికాలు అన్నీ వేరే. తిండి పెట్టడంలేదని ప్రచారం చేస్తున్నారు. అందరి తిండీ ఒకే మెస్సు నుంచి వస్తుంది. కాకపోతే హీరో హీరోయిన్స్‌కి ఇంకో రెండు స్వీట్లు ఎక్కువ ఉండొచ్చు. షెడ్యూల్‌ హడావిడిని బట్టి ఎక్కడో ఒకచోట నిలబడి తినేస్తాం. తమిళంలో ఎంత పెద్ద నటుడైనా మామూలు కాఫీ హోటల్లో తిండి తింటాడు. రోడ్డు పక్క మిర్చి బజ్జీలు కొంటాడు. కడుపు నిండా పెడుతున్నామా లేదా అనేది ముఖ్యం కానీ అనవసరమైన విషయాలు స్లోగన్‌ చేస్తారు.

ఆర్టిస్టులకి వేషాల్లేవు అంటే మాస్‌ రీళ్ళు తగ్గిన మాట నిజమే. ఏ పెట్టుబడి దారైనా సినిమా వ్యాపారం చెయ్యదల్చుకున్నప్పుడు ప్రేక్షకుడి ట్రెండ్‌ని బట్టే నడుచుకుంటాడు. రిస్క్‌ ఎందుకు తీసుకోమంటారు? ఇప్పుడున్నవన్నీ ప్రేమ కథలు, యూత్‌ క్యారెక్టర్లే అవసరం. పారితోషికంతో సంబంధం లేకుండా కాలేజీ పిల్లలు దొరుకుతుంటే నడివయసు వాళ్ళకి పిల్లల మేకప్‌ ఎలా చేస్తాం. సహజత్వం ఉండాలి కదా. కుర్ర సినిమాల్లో ఉండేదే గ్రాఫిక్స్‌. అవి తీసేసి కూరగాయల మార్కెట్లు, సంతలు, తిరునాళ్ళు ఎలా చిత్రీకరిస్తాం? అసలు తెలుగుదనం భాషలో కానీ పరిసరాల్లో కానీ ఎంత తక్కువుంటే అంతిష్టంగా చూస్తున్నారు కదా మీరు! ఇప్పుడు కూరగాయల మార్కెట్‌ స్థానంలో ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, సూపర్‌ బజార్లు, ఇండస్ట్రియల్‌ ఎగ్జిబిషన్లు, స్విమ్మింగ్‌పూల్స్‌, ఎయిరోప్లేన్లు ఉంటున్నాయి. కథలన్నీ వాటి చుట్టూ తిరుగుతాయి. ఇలాంటి చోట్ల ఎలాంటి మనుషులుంటే బావుంటుందో మీరే చెప్పండి. ఇప్పుడున్న ధోరణి ఇది. భద్రాచలం లాంటి సాంఘిక సినిమాలు, జానపదాలు, పౌరాణికాలు వస్తే అందరికీ పని దొరుకుతుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్ల సౌకర్యం కోసం ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ 60 ఎకరాల భూమి చవగ్గా ఇచ్చింది. టైమ్‌ షెడ్యూల్స్‌లో కూడా రెండింటిలో నటిస్తే రెండింటి పారితోషికం గట్టిగా అడిగి పుచ్చుకోమనండి. ఏజెంట్లో, యూనియన్లో, ప్రొడక్షన్‌ మేనేజర్లో ఒక పేమెంట్‌ ఇస్తే పుచ్చుకోవడం ఎందుకు? అది ఖచ్చితంగా ఆర్టిస్టులు అలవాటు చేసిందే కదా!” అని చెప్పారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాటల్ని బట్టి సినీ, టీవీ జూనియర్‌ ఆర్టిస్టుల సమస్యల వలయం ఎవరూ దిగలేని మురికి గంగలా ఉందని అర్ధమవుతోంది. ఆయన ఆరోపణల్ని బట్టి చూసినా ఆర్టిస్టుల్లో సంఘటిత శక్తితో బాటు యూనియన్‌ సిబ్బంది అవినీతి అవకాశవాదాలే ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దాంతో బాటు దర్శకనిర్మాతలు, ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణినీ తక్కువ చేసి చూడలేం. స్క్రీను అరసెకను సమయం కూడా కనిపించని ఆర్టిస్టుకి క్లీన్‌ సర్టిఫికెట్‌ అడుగుతున్న యూనియన్‌, జనరల్‌ బాడీ మీటింగులు పెట్టకపోవడానికి, అక్కౌంట్ల విషయంలో పారదర్శకత, బాధ్యత లేకపోవడానికి సరయిన కారణాలు చెప్పలేకపోతున్నారు.

ఇన్ని కష్టాల మధ్య ఈ ఫీల్డునింకా నమ్ముకుని చదువు, పనులూ లేని వాళ్ళే కాదు డాక్టర్‌, లాయర్‌ చదివిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. టి.మురళీధర్‌ అనే ఆర్టిస్టు ఒక ఆయుర్వేద డాక్టరు. బైట ప్రాక్టీసు ఉన్న రోజుల్లో ఇక్కడికొచ్చి ఇటు వేషాలు లేక, అటు వైద్యం చేయించుకునే పేషెంట్లు ఆర్టిస్టుల్లోనూ కనిపించక బాధపడుతున్నాడు.

మద్రాస్‌ సినీ పరిశ్రమలో కార్డు తప్పనిసరిగా ఇస్తారు. ప్రతివాళ్ళకూ ఒక టోకెన్‌ నంబరు ఉంటుంది. డబ్బులు సరాసరి ఆర్టిస్టుల పేర ఆఫీసుకొచ్చేస్తాయి. హైదరాబాద్‌లో ఎందుకో ఆ క్రమశిక్షణ లేదు.

పెద్ద బ్యానర్ల పెత్తందార్లు కూడా అగ్రిమెంట్స్‌ ప్రకారం నడుచుకోకపోవడం గమనార్హం. ఆర్టిస్టులు చెప్పినదాన్ని బట్టి సమాధానం దొరకని ‘ప్రశ్నలు’ ఇలా ఉన్నాయి.

1) రిస్కీషాట్స్‌లో అదనపు పేమెంట్‌ ఇవ్వడం లేదు.

2) ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఒక కార్మికస్థాయి ఉద్యోగి తప్పనిసరిగా ఉండాలి. కానీ పది పదవులున్న వాళ్ళకే అక్కడ పాదుకా పట్టాభిషేకం జరుగుతుంది.

3) ఖచ్చితంగా స్పాట్‌ పేమెంట్‌ ఇస్తున్న ఇతర భాషా చిత్ర నిర్మాతలు తెలుగు నిర్మాతల్ని చూసి ఆలస్యాన్ని అనుకరిస్తున్నారు.

4) సాధారణంగా కాస్ట్యూమ్స్‌ సినిమా నిర్మాతలే సప్లై చేయాలి. ఈ మధ్య ఈ డ్రెస్సులు కూడా జూనియర్‌ ఆర్టిస్టుల్నే తెచ్చుకొమ్మని చెబుతున్నారు. ఇందుకు గీతా ఆర్ట్‌ ప్రొడక్షన్‌ అయినా, ఉషాకిరణ్‌ మూవీస్‌ అయినా మినహాయింపు కావడం లేదు.

5) డైలాగ్‌ చెప్పే ఆర్టిస్టుకి అదనంగా చెల్లించాల్సిన పైకం చెల్లించడం మానేశారు.

6) అగ్రిమెంట్‌ ఉండి తీరాలని నియమ నిబంధనలు మాట్లాడే పద్మారెడ్డి పిక్చర్స్‌ వాళ్ళు ‘లవకుశ’ సినిమా తాలూకు డబ్బులు ఏజెంట్‌ సీతమ్మకి ఇవ్వలేదు.

7) పోలీసులు, నర్సులు లాంటి ప్రొఫెషనల్‌ పాత్రలక్కూడా గ్లామరే అవసరం కావడంతో గ్రేడ్‌ టూ ఆర్టిస్టులు బాధపడుతున్నారు.

8) జూనియర్‌ ఆర్టిస్టులకి నటనలో ట్రైనింగ్‌ లేదని విమర్శించడమే తప్ప ఓట్లేయించుకుంటూ ప్రతినెలా మెంబర్‌షిప్‌ వసూలు చేస్తున్న ఏ యూనియనూ వాళ్ళకింతవరకూ శిక్షణ ఇవ్వడంలేదు.

9) హెల్త్‌కార్డు జూనియర్‌ ఆర్టిస్టులకి ఎంత మాత్రం ఉపయోగపడడంలేదు. ఏ రోగం చెప్పినా ఒకేలాంటి మందుబిళ్ళలు ఇస్తారు.

10) జూనియర్‌ ఆర్టిస్టులకి లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లేదు. ప్రభుత్వ సహాయం లేదు.

11) రాక్స్‌ సేవర్స్‌ కమిటీవాళ్ళు జూబ్లీ, బంజారాహిల్స్‌ని దొలుచుకుంటూ మొలిచిన కట్టడాల్ని వదిలి ఆర్టిస్టులకు కేటాయించిన మణికొండ దగ్గరున్న స్థలంమీద కేసు పెట్టడం ఎందుకు జరిగింది.

ప్రజా సంపదల్ని పిడికిట్లో పెట్టుకోవడం కంటే, సమాచారాన్ని ప్రచారం కాకుండా చూడడం పాలక వర్గాలకు సంబంధించిన కుట్రగా మనకు తెలుసు. సమాచార విప్లవం గురించి వాళ్ళే ఎక్కువగా మాట్లాడతారు. సినీ పరిశ్రమ విషయానికొస్తే ప్రొడ్యూసర్లు ఏ రోజు బిల్లులు ఆ రోజు ఆర్టిస్టుకు ఇచ్చేస్తున్నారని, ఒకవేళ అలా ఇవ్వకపోతే ఆడియో జరక్కుండా టెక్నీషియన్‌లు అడ్డు పడతారని పరిస్థితి లోగడ కంటే ఎంతో మెరుగైందని ఫెడరేషన్‌ డైరెక్టర్‌ కృష్ణమోహన్‌ అంటున్నారు. అంతేకాదు నక్సలైట్‌ లాంటి వాళ్ళు జిల్లాలో ఉండలేక జీవన భృతి కోసం సిటీకొచ్చేస్తున్నారని, వాళ్ళలో కొందరు జూనియర్‌ ఆర్టిస్టుల బృందంలో చేరే అవకాశం ఉందని అందుచేత కార్డులిచ్చే ముందు శీల నిరూపణ పత్రం కావాలని ప్రభుత్వం ఉత్తర్వు చేసిందట. కార్డులివ్వకపోవడానికి సహేతుకమైన కారణం ఇప్పుడు మన కళ్ళకు కనిపిస్తోంది. (నక్సలైట్లను లొంగిపొమ్మని వారికి పునరావాసం కల్పిస్తామని ఇదే సర్కారు చెప్పిన మాటలు ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అందువల్ల ఆర్టిస్టులకు ఇప్పుడు సొంతంగా తాము నక్సలైట్లు కామని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత అదనంగా పడింది.) ”ఎవరి హక్కులకు సంబంధించిన సమాచారమైనా పిడికిట్లో ఎవరూ పెట్టుకోరండీ! తెలుసుకోదలచుకుంటే తెలుస్తుంది. నాలుగు రోజులు వరుసగా ఈ సబ్జెక్టు మీద పనిచేయండి. అప్పుడు మీరే మాకు అనేక సంగతులు చెప్తారు” అని నేనడిగితే ఒక ప్రశ్నకు ప్రొడ్యూసర్‌, డైరెక్టర్‌ అయిన తమ్మారెడ్డి భరద్వాజ వివేచన కల్పించే ప్రయత్నం చేశారు.

అయితే, నేను రాసిన వాటికంటే ఎక్కువ హక్కులు ఆర్టిస్టులకు ఉన్నాయి. (600 మంది జూనియర్‌ ఆర్టిస్టుల సామూహిక స్పందనలు, బాధలు అబద్ధమైనా అయ్యుండాలి, అజ్ఞానమైనా అయ్యుండాలి). ఎక్కడ…!? కాయితాల్లోనా…!? గొంతెండిపోతున్న వాడికి గ్లోబ్‌లో ఉన్న నదులు, సముద్రాలు చూపించడం ఎలా ఉంటుందో ఇది అలానే ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల్లాగానే ఇందులోనూ అగ్రిమెంట్లు గొప్పగానే ఉండొచ్చు కానీ వాటికి సంబంధించిన జవాబుదారీ తనం, నిజాయితీ మందగించినట్లు కనిపిస్తున్నాయి. ఆర్టిస్టులకు మార్గదర్శకత్వం లేకపోవడంతో పాటు ఇది ఇంకో ప్రధాన కారణం.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.