ఆలోచించి అడుగెయ్యి -డా.ఓరుగంటి సరస్వతి

మనుషుల్లో కొందరు సాటి మనుషుల్ని ఎప్పుడు మోసం చేద్దామా అని అన్పించే సందర్భాలే ఎన్నో. ఐతే అమ్మాయిలు, అబ్బాయిల విషయంలో మాత్రం మోసపోవడమనేది అమ్మాయిల వంతే అవుతుంది. నాటికీ, నేటికీ… ఎంతో కొంత తెలివుండి కూడా బాగా చదువుకొని ఉన్న అమ్మాయిలు కూడా ప్రేమ పేరుతో మోసపోతూనే ఉన్నారన్నది నగ్నసత్యం. ఆ కోణంలోనే ఒక కథ…

”దేవుడా! నన్ను ఎందుకు ఇలా పుట్టించావు. అందరి అమ్మాయిల్లా చక్కగా కాళ్ళు ఇవ్వొచ్చుగా. అవిటి కాలితో నేను ఎన్ని ఇబ్బందులు పడాలో” అని శాంతి తనకు చిన్నప్పుడే వచ్చిన పోలియో కాలుని చూసి బాధపడ్తుంది. చిన్నతనంలో అమ్మ తనకు సపర్యలు ఎన్నో చేసింది. తన తల్లిదండ్రులు చదువుకోకపోవడం వల్లనే పోలియో ఇంజెక్షన్‌ వేయించలేదేమోనని ముప్ఫై ఏళ్ళ శాంతి ఆలోచన. తనకు ముగ్గురు తమ్ముళ్ళు. తండ్రి తాగుబోతు. ప్రతిరోజు సాయంత్రం తండ్రి నోటి నుండి వచ్చే బూతు మాటలు తన తల్లిని పొడుస్తాయి.

తమ ఇల్లు ఊరవతల ఉన్నా… శాంతి పట్నంలోనే చదువుకుంది. తన తల్లి ప్రతిరోజూ బస్సెక్కించేది. రాను గంటా, పోను గంటా ప్రయాణం. ఎలాగో తన వైకల్యాన్ని పక్కనపెట్టి టీచర్‌ ట్రైనింగ్‌ చేయాలన్న కోరికను కూడా నెరవేర్చుకుంటుంది. టీచర్‌ కావాలనుకుంటుంది. ఇంట్లో తండ్రి తాగుబోతు. అతనికి కొడుకులంటేనే ఇష్టం. ”కూతురు చదివి ఉద్ధరిస్తుందా. అందునా ఒక కాలేమో సరిగా లేదు. ఇంట్లో కూర్చుని ఉండక, తిరిగి రావటం ఎందుకు? చదువెందుకు? పెళ్ళిలేదు, ఏమీలేదు” అని కూతురు శాంతిని గురించి ఒక తండ్రిలా కూడా మాట్లాడడు. కానీ శాంతి తన తండ్రి మాటలకు ఒక్కోసారి బాధపడ్డా, తన తల్లి సర్ది చెప్పేసరికి ఊరుకుంటుంది.

శాంతికి దూరపు బంధువు కుమార్‌, మామ వరుస అవుతాడు. అతడంటే శాంతికి అభిమానం. తన తల్లి తరఫు బంధువు. అతడు ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తాడు. మొదటి నుండి శాంతికి అతడంటే ఎందుకో ప్రత్యేక అభిమానం. అతడు శాంతితో చనువుగానే మాట్లాడేవాడు. శాంతి తండ్రికి కుమార్‌ కుటుంబం అంటే నచ్చదు. ఎప్పుడూ తిడుతుండేవాడు. ఒకానొక సమయంలో శాంతిని కుమార్‌కిచ్చి చేద్దామన్న శాంతి తల్లి కూడా భర్తకు భయపడి కూతురు తన దగ్గర ఉంటే చాల్లే, పెళ్ళి వద్దు ఏమీ వద్దన్న అభిప్రాయానికి వస్తుంది. ”బిడ్డా! నీకేమో కాలు అవుడు, అయ్యకేమో నీకు పెళ్ళి చేయడం ఇష్టం లేదు. తమ్ముళ్ళంటేనే ఇష్టం. బాగా చదువుకో. నేను బతికినంతకాలం నీ బాగోగులు చూస్తా. అయ్య మాటలను పట్టించుకోకు, బాధపడకు” అని చెప్తుంది. కానీ శాంతికి వయసుతోపాటు ఆలోచనలు, కోరికలు కూడా అందరి అమ్మాయిల్లాగే పరిగెడుతుంటాయి. తనూ అందరి అమ్మాయిల్లా పెళ్ళి చేసుకోవాలని, తనకూ మంచి భర్త రావాలని

ఉంటుంది, కానీ… తండ్రి ఒప్పుకోడు… ఏం చేయాలి.

ఒకరోజు తల్లి అకస్మాత్తుగా గుండె నొప్పితో చనిపోతుంది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి శాంతి ఒంటరిదైపోతుంది. ఓ వైపు తల్లి లేకపోవడం, మరోవైపు తండ్రి సూటిపోటి మాటలు, తమ్ముళ్ళకి తనకంటే ముందే పెళ్ళిళ్ళు చేయడం… శాంతికి ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నట్లుగా ఉంటుంది. ఎక్కడా తనకు ఉద్యోగావకాశాలు రాకపోవడంతో ఇంట్లోనే తన తమ్ముళ్ళ పిల్లలను చూసుకుంటూ, అవసరమైతే పొలానికి వెళ్ళి పశువులకు గడ్డి కూడా కోసుకు వస్తుంది. చూసేవారికే కానీ, శాంతి ఏ మాత్రం తనకు వైకల్యం ఉందని ఆలోచించదు. తన తల్లి ఉన్నప్పుడు ప్రయత్నించి శాంతికి పింఛన్‌ వచ్చేలా చేస్తుంది. వికలాంగుల పెన్షన్‌ డబ్బులతో తన చిన్న చిన్న ఖర్చులు చూసుకుని అందులోనే కొంత తమ్ముళ్ళకీ ఇస్తుంది.

శాంతి జీవితం ఇలా జరుగుతున్న క్రమంలో శాంతి బయటికి వెళ్ళినప్పుడు ఆమె బావ కుమార్‌ కలిసి, ఆమెను ఓదార్చుతుంటాడు. దాంతో శాంతికి తన తల్లి పోయిన తర్వాత ఓదార్పునిచ్చిన వ్యక్తిగా కుమార్‌ కన్పిస్తాడు. దాంతో వారి మధ్య చనువు ఏర్పడుతుంది. ఆ చనువు ఎక్కడివరకు వెళ్తుందంటే కుమార్‌కి ఇదివరకే పెళ్ళై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్న విషయాన్నే గుర్తించేలా చేయదు. అలా వారు ఒకరినొకరు ఇష్టపడ్తారు. తను వికలాంగురాలిని కాబట్టి వేరేవారెవరూ తనను చేసుకోవడానికి ముందుకు రారు, తన తండ్రి ఎలాగూ తన గురించి, తన పెళ్ళి గురించి పట్టించుకోడు అని ఆలోచించుకుంటుంది. మొదటినుండి కుమార్‌కి తన గురించి, కుటుంబం గురించి తెలుసు కాబట్టి అతన్నే పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. కానీ కుమార్‌ మాత్రం తనకు ముందే పెళ్ళై పిల్లలున్నా, శాంతిని చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. కారణం శాంతి బాగా చదువుకుందనీ, ఎప్పటికైనా ఉద్యోగం చేస్తుందని, దాంతో ఎలాగైనా భార్యను ఒప్పించవచ్చని అనుకుంటాడు. కానీ శాంతి కుమార్‌ కుయుక్తిని అర్థం చేసుకోలేకపోతుంది.

శాంతి, కుమార్‌లిద్దరూ ఎవరికీ చెప్పకుండా, ఎవరికీ తెలియకుండా పెళ్ళి చేసుకుంటారు. నాలుగు గోడల మధ్య శాంతి మెడలో పసుపుతాడు కట్టి తనదనిపించుకుంటాడు. శాంతి కోసం పట్నంలో ఎవరికీ తెలియకుండా ఒక గది అద్దెకు తీసుకుంటాడు. మొదటి భార్య దగ్గరికి తన ఇంటికి ఎప్పటిలాగే వెళ్తూ, రెండో పెళ్ళి విషయం మాత్రం తెలియనీయడు. శాంతి దగ్గరికి వీలైనప్పుడల్లా, కోరిక కలిగినప్పుడల్లా వస్తాడు. కొద్దిగా సామాన్లు, అరకొరగా వసతులతో శాంతి సర్దుకొని ఉంటుంది. శాంతి నెల తప్పుతుంది. ఎంతో సంతోషకరమైన విషయాన్ని పంచుకుందామంటే తల్లి లేదు. ఆ సమయంలో తల్లిని తలచుకొని బాధపడ్తుంది. రెండు రోజుల తర్వాత వచ్చిన కుమార్‌కి శాంతి నెల తప్పానని చెప్పడంతో ఏమి చేయాలో తోచని స్థితిలో ఆలోచిస్తుంటాడు.

”అదేంటి! నెల తప్పానని చెప్తుంటే ఎంతో సంబరపడిపోతావనుకుంటే, ఏదో కోల్పోయినట్టుగా అలా చూస్తావేంటి?” అని అడుగుతుంది. దాంతో ”ఇప్పుడిప్పుడే ఇలాంటివన్నీ వద్దు. కొన్ని రోజుల తర్వాత చూద్దాం, ముందు అబార్షన్‌ చేయించుకో” అంటాడు. అతను ఇలాంటి మాటలు అంటాడని ఊహించని శాంతికి ఏమి చేయాలో పాలుపోదు. ”నేను రెండు రోజుల తర్వాత వస్తా. అబార్షన్‌ చేయించుకోవడానికి రెడీగా ఉండ”మని చెప్పి వెళ్ళిపోతాడు.

శాంతి పెళ్ళి విషయం ఎలాగో ఊర్లో తెలిసిపోతుంది. తండ్రి మామూలుగానే శాంతి గురించి ఏమీ ఆలోచించడు. ఈ విషయం తెలిసి ”అది చచ్చినదాంతో సమానం. దానికి పెళ్ళి కావాల్సి వచ్చిందా! కుంటిదైనా పెళ్ళి కావాల్సొచ్చింది. నా పరువు తీసింది. నా కంటపడితే రెండో కాలు కూడా విరగ్గొడతానని” కొడుకులతో అంటాడు. శాంతి తమ్ముళ్ళు కూడా తన అక్క పెళ్ళి చేసుకుందని సంతోషించరు, అలాగని బాధపడరు. అసలు ఆమెను గురించి ఏమీ పట్టించుకోరు.

కుమార్‌కి ఓ పక్క శాంతి నెల తప్పిందని భయం. దాంతో, చెప్పిన మాట ప్రకారం శాంతి దగ్గరికి వస్తాడు. ఆమెను అబార్షన్‌ చేయించుకోవడానికి బయలుదేరమని చెప్తాడు. దాంతో శాంతికి అసలు తన జీవితం ఏమవుతుందో అర్థం కాదు. పెళ్ళైందని, తల్లిని కాబోతున్నానని సంతోషపడేంత సమయం కూడా ఇవ్వకుండా ఏమిటీ దుర్మార్గమని బాధపడ్తుంది. కుమార్‌కి నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తుంది. ”నేను నిన్ను ఏమీ ఇబ్బందిపెట్టను. నీ మొదటి భార్య దగ్గరికి వచ్చి ఏం గొడవ చేయను. నేను ఇలాగే ఎక్కడో ఒక చోట ఉంటా. నా కడుపులో బిడ్డను బతకనివ్వ”మని బతిమాలుతుంది. ఆమె మాటలను పెడచెవిన పెట్టిన కుమార్‌ ”అబార్షన్‌కి ఒప్పుకోకపోతే నీకూ నాకూ ఎటువంటి సంబంధం లేదు” అని బూతులు తిడ్తాడు. ఆ మాటలు శాంతికి శూలాల్లా గుచ్చుకుంటాయి. కుమార్‌ వెళ్ళిపోతాడు. శాంతికి ఐదవ నెల. తాను చెప్పినట్లు వినలేదని కుమార్‌ ఆమెనసలు పట్టించుకోడు. శాంతి తన పెన్షన్‌తోనే సర్దుకుంటూ బిడ్డను కనాలని అనుకుంటుంది. ప్రభుత్వ ఆస్పత్రిలోనే చూపించుకుని మందులు వాడుతుంది.

కుమార్‌ మొదటి భార్యకు ఈ విషయం తెలిసి అతనితో పెద్ద గొడవకు దిగుతుంది. పిల్లలతో కలిసి చనిపోతానని చెబుతుంది. ఇంతవరకు వస్తుందని ఊహించని కుమార్‌ భార్యకు నచ్చచెప్పుకుంటాడు. ”నేను చేసింది తప్పే. నువ్వంటేనే నాకిష్టం. శాంతి నన్ను ఏదో మాయచేసి లోబరచుకుంది. నా ఆస్తికోసమేనేమో! నాకు తెలియదు. నేను ఇంకెప్పుడూ దాని దగ్గరికి వెళ్ళను. నీ దగ్గరే ఉంటానని” భార్యను బతిమాలుకుంటాడు. కుమార్‌ మొదటి భార్య భయంతో ఆస్తినంతా తన పేరున రాయించుకుంటుంది. కుమార్‌ ఇల్లొదిలి ఎక్కడికీ పోకుండా, ఇంటిపట్టునే ఉండి పొలం పనులు చూసుకుంటుంటాడు.

కడుపుతో ఉన్న శాంతి గదిలో ఒంటరిగానే ఉంటుంది. కుమార్‌ కోసం ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సమాధానం లేదు. ఒక్కటే మాట ”నీకూ నాకూ సంబంధం లేదు. నాకు ఫోన్‌ చెయ్యొద్దు” అని. శాంతికి నెలలు దగ్గర పడుతున్నకొద్దీ, తన శరీరం సహకరించదు. ఉన్న పూట తింటుంది, లేకపోతే పస్తులుంటుంది. ఎవరికి ఏమి చెప్పుకుందామన్నా ఎవరైనా తనను తిడతారనే భయం. ”అంత చదువుకొని నేనెలా మోసపోయానో కదా! వాడి మాటలు నమ్మి నా జీవితాన్ని పాడుచేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. కనీసం కనికరం లేకుండా, పట్టించుకోకుండా అంత నిర్దయగా వదిలేశాడే. నా భవిష్యత్తేంటి” అని నిద్రాహారాలు మాని బాధపడుతుంది.

శాంతికి దూరపు బంధువైన ఆమె అమ్మమ్మ శాంతి జాడ తెలుసుకొని, అవిటిదైన మనుమరాలిని వదులుకోలేక తోడుంటుంది. ఇద్దరి పెన్షన్‌తో అరకొర జీవిస్తుంటారు. శాంతికి నెలలు నిండి నొప్పులు రావడంతో దగ్గర్లోనే ఒక ప్రభుత్వ ఆస్పత్రిలో జాయిన్‌ చేస్తుంది ఆమె అమ్మమ్మ. డాక్టర్లు శాంతిని పరీక్షచేసి సిజేరియన్‌ చేయాల్సి వస్తుందని చెప్పారు. నొప్పులు రావడంతో శాంతికి ఒక భయం పట్టుకుంటుంది. ”తనకు పుట్టబోయే బిడ్డ కూడా తనలా అవిటితనంతో పుడుతుందా? దేవుడా! కాపాడమని” వేడుకుంటుంది. చివరకు పండంటి బాబు పుడతాడు. శాంతి అమ్మమ్మే ఆస్పత్రిలో ఆమెకు సపర్యలు చేస్తుంది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉంటారు. శాంతికి కొడుకు పుట్టాడన్న శుభవార్తను భర్త కుమార్‌కి చెప్పాలని ఫోన్‌ చేయగా ఏమీ సమాధానం ఉండదు. శాంతి బాధపడుతుంది. సిజేరియన్‌ కావడంతో ఎలాగో మూడు నెలలకు కోలుకుంటుంది. మూడు నెలల తర్వాత కుమార్‌ ఒకరోజు హఠాత్తుగా శాంతి దగ్గరికి వస్తాడు. ఆమె తన భర్త వచ్చినందుకు సంతోషపడుతుంది. అన్ని నెలల తర్వాత వచ్చిన కుమార్‌ కనీసం శాంతిని ఎలా ఉన్నావని, ఆరోగ్యం ఎలా ఉందని కూడా అడుగడు. ”నేను చెప్పినట్లు వినకుండా, అబార్షన్‌ చేయించుకోకుండా, బిడ్డకు ఎందుకు కన్నావని” అడుగుతాడు.

కొడుకును చూసి మురిసిపోతాడనుకున్న శాంతికి కుమార్‌ ప్రవర్తనతో కోపం వచ్చినా అణచుకుంటుంది. బాబును ఎత్తుకోమని కుమార్‌కి బలవంతంగా ఇచ్చినా ఎత్తుకోకుండా, ముట్టుకోకుండా అలాగే చూసి వెళ్ళిపోతాడు. కనీసం శాంతికి ఇన్నాళ్ళు ఎలా గడిచింది, ఖర్చులకు ఏమైనా డబ్బులు ఇద్దామని కూడా ఆలోచించడు. ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన భర్తను చూసి సంతోషపడినా, అతని ప్రవర్తనకు బాధపడుతుంది. ఆమె అమ్మమ్మ ”నేను వీలైనంత కాలం నీ దగ్గరే నీకు తోడుగా ఉంటానమ్మా, ఏమీ బాధపడకు” అని ధైర్యం చెప్తుంది. అమ్మమ్మ ఇచ్చిన ధైర్యంతో శాంతి తన కొడుకుని చూసి మురిసిపోతూ తన బాధను దిగమింగుకుంటూ ఉంటుంది. కుమార్‌ అదే పోకడ. శాంతి తండ్రి, తమ్ముళ్ళు ఆమెకు కొడుకు పుట్టాడని తెలిసినా ఏమీ పట్టనట్లుగా ఉంటారు. అక్కడ చుట్టుపక్కలవారు బాబుకి 21వ రోజున తలా ఒక డ్రెస్‌ తీసుకువస్తారు. అలా తన జీవితాన్ని సాగిస్తున్న క్రమంలో… ఓ రోజు శాంతి భర్త కుమార్‌ నుండి ఫోన్‌… ఏంటంటే ”నీకు పుట్టిన ఆ కొడుకు ముక్కు నాలాగా లేదు, వాడు నాకు పుట్టలేదు. నీకు ఇంకెవరితోనో సంబంధముందని” అంటాడు. దాంతో ఇక తను భరిస్తున్న నిశ్శబ్దానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి అతనికి ఎలాగైనా సమాధానం చెప్పాలనుకుంటుంది శాంతి. ”నీ సంగతి ఎలా చూడాలో నాకు తెలుసు. నిన్ను వదలను, పోలీసులకు ఫిర్యాదు చేస్తాను” అని చెప్తుంది. ”దిక్కున్నచోట చెప్పుకో… పోలీసులకు ఫిర్యాదు చేసిన తెల్లారే నేను ఆత్మహత్య చేసుకుంటానని” బెదిరిస్తాడు. దాంతో అతను నిజంగా చనిపోతాడేమోనని, అతని కూతుళ్ళకు తండ్రి కరువవుతాడని భావించిన శాంతి వెనక్కి తగ్గుతుంది. ”అసలు లోకం నన్నే నిందిస్తుంది. ఇంత ఉన్నత చదువు చదివి, పెళ్ళై, పిల్లలున్న వ్యక్తిని చేసుకోవడానికి సిగ్గులేదా అని సమాజం నన్నే నిందిస్తుంది. అవును! నేను చేసింది తప్పే. నాకు అవిటితనం ఉన్నంత మాత్రాన ఎవరూ ఆదరించరని భయపడ్డాను. కుమార్‌ ఒక్కడే సర్వస్వమనుకున్నాను. నేను చేసింది తప్పే… ముమ్మాటికీ నాదే తప్పు. కుమార్‌లాంటి వ్యక్తుల కపట ప్రేమను నమ్మి మోసపోయాను. శరీరంలో ఏదో ఒక అవయవం సరిగా లేనంత మాత్రాన, ఆత్మన్యూనతకు గురి కావలసిన అవసరం లేదు. నాలాంటి ఆడపిల్లలు సమాజంలో ఎందరో ఉన్నారు. వారు కుమార్‌ లాంటి వ్యక్తుల బారిన పడకుండా ఉండాలి, ఆలోచించి అడుగెయ్యాలి. వికలాంగురాలినని కూడా చూడకుండా అవసరం తీర్చుకుని, అన్యాయంగా వదిలేసిన కుమార్‌లాంటి నీచుడు నాకు అవసరం లేదు” అని బాధపడుతుంది.

”చదివిన చదువుతోనే నా భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటాను. నా కొడుకును పెంచి, మరో కుమార్‌లా తయారు కాకుండా చేస్తాను. నాలాంటి అణగారిన ఆడపిల్లల భవిష్యత్తుకి నావంతుగా సహాయపడతాను” అని మనసులో దృఢంగా నిశ్చయించుకుంటుంది. శాంతి కొడుక్కి 8 నెలల వయస్సు. ఆమె ఒక ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా చేరుతుంది. వచ్చిన జీతంతో కొడుకుని చూసుకుంటుంది. అమ్మమ్మ సహకారంతో తన జీవితాన్ని ముందుకు నడుపుకుంటూ, ప్రభుత్వ ఉపాధ్యాయినిగా ఉద్యోగాన్ని సంపాదించుకుని కుమార్‌ జాడ పట్టించుకోకుండా ఎక్కడో దూరంగా జీవితాన్ని సాగిస్తుంది. కానీ, ఎప్పటికైనా తన తండ్రిని, తమ్ముళ్ళనీ కలుసుకోవాలనే కోరికతో…

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.