గతుకుల బాటల ఎంపిక: జండర్‌ రాజకీయార్థిక చిత్రం – తెలుగు అనువాదం: పి.సత్యవతి – వసంత్‌ కన్నభిరాన్‌

 

నీరా దేశాయ్‌ (1925-2009) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జన్మించారు. బొంబాయిలో పెరిగారు. బోంబే విశ్వవిద్యాలయం నుంచి 1951లో ఎం.ఏ. పూర్తిచేశారు. ఆ తర్వాత శ్రీమతి నాథూబాయ్‌ దామోదర్‌ థాకర్‌సే మహిళా విశ్వవిద్యాలయం (ఎస్‌.ఎన్‌.డి.టి.)లో సోషియాలజీ పాఠాలు చెప్పడానికి వెళ్ళారు. 1946లో ఎ.ఆర్‌.దేశాయ్‌ని కలిశారు. తర్వాత సంవత్సరానికి వారు వివాహం చేసుకున్నారు. ఉన్నత విద్యారంగంలో స్త్రీలకు గుర్తింపు దొరకడం లేదని వాదించిన కొద్దిమంది తొలి మహిళా విద్యావేత్తలలో నీరా దేశాయ్‌ ఒకరు. ఆమె రచనల్లో ”ఆధునిక భారతదేశంలో స్త్రీలు (1952), పశ్చిమ భారతదేశంలో స్త్రీ వాదం (2004) మొదలైన ముఖ్యమైనవి ఉన్నాయి.

విద్యా సంబంధిత అంశాలలో స్త్రీలు లేకపోవడాన్ని ప్రశ్నించిన తొలి విద్యావేత్తలలో ఆమె ఒకరు. ఆమె రచనలలో ”విమెన్‌ ఇన్‌ మోడర్న్‌ ఇండియా”, ”ఫెమినిజమ్‌ ఇన్‌ వెస్టర్న్‌ ఇండియా” పేర్కొనదగినవి.

నీరా దేశాయ్‌ ఇంటర్వ్యూ:

మీరు అక్షయను ఎలా కలుసుకున్నారో చెప్పండి. పోనీ మీ వివాహం దగ్గరనుంచి చెప్పండి.

అప్పుడు నా వయసు పంతొమ్మిదో, ఇరవై ఒకటో. బి.ఎ. చదువుతున్నాను. 1946లో ప్రదానం జరిగింది. 1947లో వివాహం అంటే 1947 నుంచీ 1994 వరకూ మా జీవన సాహచర్యం.

అక్షయది చాలా పెద్ద కుటుంబం. అనేక వైరుధ్యాలతో కూడిన గృహ వాతావరణం. అక్కడ ఆదర్శాలూ, సంప్రదాయాలూ సమాంతరంగా నడుస్తూ ఉండేవి. అతనికి పదకొండేళ్ళ వయసులోనే తల్లి చనిపోయింది. అప్పుడతని చెల్లెలికి ఏడాది వయసు. అక్షయ నానమ్మ వైష్ణవ మత ఛాందసురాలు. అతని తాత ఉదారస్వభావి. అయినా నన్ను కాస్త దూరం పెట్టేవాడు. నేను మాట్లాడడం, చర్చల్లో పాలుపంచుకోవడం ఇష్టం ఉండేది కాదు ఆయనకి. కొన్ని సంవత్సరాలపాటు ఆయన ఎదుట నేను ముసుగు వేసుకోవలసి వచ్చింది కూడా. అక్షయ తండ్రి ప్రముఖ రచయిత. ఆయన ముప్ఫై పైగా నవలలు, ఎనిమిది కథా సంపుటాలూ, ఒక ఆత్మకథ, వేశ్యావృత్తిపై అయిదు పరిశోధనా గ్రంథాలు, ఇంకా అనేక వ్యాసాలు వ్రాశారు. సమకాలీన సమస్యల పట్ల సానుభూతితో చేసిన ఆయన రచనలను, నా ముందు తరం వాళ్ళు, నా తరం వాళ్ళు, నా తర్వాత తరం వాళ్ళు కూడా బాగా ఇష్టపడేవారు. అనేక పురస్కారాలందుకున్న ఆయన్ని ”యుగమూర్తి” అనేవారు. ఆయన 1920, 30, 40లలో ఎక్కువగా వ్రాసారు. 1954లో ఆయన చనిపోయారు. ఒక ఎనిమిదేళ్ళు ఆయన సాహచర్యం లభించింది నాకు. ఆయన నవలల్లో చాలావరకు హిందీలోను, కొన్ని మరాఠీలోనూ, తమిళంలోనూ అనువాదమయ్యాయి. ఆయన ప్రఖ్యాత నవల ”భరేలో అగ్ని” (ఆర్పిన నిప్పు) ఆంగ్లంలో కూడా అనువాదమయింది. 1857లో జరిగిన మొదటి స్వాతంత్య్ర సమరాన్ని గురించిన నవల అది. ఆయన లౌకికవాది. గాంధీగారి సత్యాహింసలు, గ్రామ పునర్నిర్మాణ సిద్ధాంతాలను నమ్మినవాడు. మతతత్వంపైనా, గ్రామ సంస్కరణపైనా, స్వాతంత్య్రానంతరం దేశంలో పెరిగిన అవకాశవాదం పైనా వ్రాసేవాడు. ఈ వస్తువులతో భావుక ప్రేమ, త్యాగాల నేపథ్యంతో నవలలు వ్రాసేవాడాయన. బరోడా రాష్ట్ర సర్వీసులో ఉన్నత స్థాయి ఉద్యోగిగా ఎదిగాడు. ఆయనకి

ఉద్యోగంలో బదిలీలు ఎక్కువగా ఉండడంతో పిల్లల చదువులు కష్టమయ్యేది. క్షయ వ్యాధితో భార్య మరణించినప్పుడు బంధువులు ఎంత ఒత్తిడి పెట్టినా, ఆమె పట్ల ఉండే ప్రేమతో మళ్ళీ వివాహం చేసుకోలేదు. ఆయన కూతురు కూడా వివాహం చేసుకోకుండా కడవరకు తండ్రిని అంటిపెట్టుకుని ఉంది. అయితే ఈయన ఎంత ఆధునికుడైనా ఇంట్లో సంప్రదాయాలను పాటించేవాడు. అందువలన ఆయనతో చనువుగా ఉండలేకపోయేదాన్ని. నాకు బాధగా ఉండేది. పద్దెనిమిదేళ్ళ యువతిని. గుజరాతీ నవలలు, ముఖ్యంగా ఆయన వ్రాసిన నవలలు విరివిగా చదివేదాన్ని. పైగా ఆయన అభిమానిని. ఆయన సంస్కరణవాది. హరిజన వాడలకు వెళ్ళేవాడు. అన్ని కులాలతోనూ, ఇతర మతస్థులతోనూ సహపంక్తి భోజనం చేసేవాడు. అయితే తల్లికి ఇదంతా తెలియనిచ్చేవాడు కాదు. ఆమెను నొప్పించడం ఇష్టంలేక, నా జీవన శైలిలో నా భావాలలో కూడా ఆయనకు ఎక్కువ అభ్యుదయం కనిపించేదేమో నన్ను కాస్త దూరంగానే ఉంచేవాడు. అయితే కొంతకాలానికి ఆయన నా చదువు కొనసాగింపులోనూ, ఉద్యోగంలో చేరడంలోనూ నన్ను ప్రోత్సహించాడు. కుటుంబంలో ఈ ద్వంద్వ స్వభావం అంటే ”నీ పద్ధతి నువ్వు అనుసరించు, ఇతరులను నొప్పించకు, వాళ్ళకు నీవేం చేస్తున్నావో చెప్పకు” అనేది కొంతకాలం సాగింది. బయట ఎట్లా ఉన్నా ఇంట్లో మాత్రం సంప్రదాయాలు పాటించాలి. మనం అలా సర్దుకుంటూ రాజీ పడుతూ ఉంటే, అది క్రమక్రమంగా మన స్వభావం క్రింద మారిపోయి జీవితంలోని అన్ని అంశాలనూ ప్రభావితం చేస్తుందనిపించేది నాకు.

నా పుట్టింట్లో మేమంతా సన్నిహితంగా ఉంటాం. మా కుటుంబ సభ్యులంతా సంఘసేవలోనూ, రాజకీయాల్లోనూ మునిగి ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అనేది వాళ్ళకు సహజాతకమైన నమ్మకం. అందుచేత ఈ కొత్తింట్లో కుదురుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది.

మా కుటుంబంలో అందరూ విద్యావంతులు, ఉదారవాదులు. మా నాన్న వకీలు. నేను పుట్టిన వెంటనే మా తల్లిదండ్రులు బొంబాయి వచ్చేశారు. నేను అహ్మదాబాద్‌లో పుట్టినా పెరిగిందంతా బొంబాయిలోనే. నాకక్కడ స్కూలుకు వెళ్ళడమూ, తర్వాత కాలేజికి వెళ్ళడమూ చాలా ఇష్టంగా ఉండేది. మేము బొంబాయివాళ్ళం. మా అమ్మ చదివింది ఏడో క్లాసయినా బయట కార్యక్రమాలలో ఎక్కువ పాల్గొనేది. పండగలన్నీ చేసేది. జాతీయోద్యమంలో కూడా పాల్గొంది. ప్రచార భేరీలకు వెళ్ళేది, ఖాదీ అమ్మింది, బ్రిడ్జి ఆడేది. స్త్రీల క్లబ్బుకి కూడా వెళ్ళేది. ఆమె చాలా చురుకైన వ్యక్తి, అభ్యుదయ వాది. చాలా అందంగా కూడా ఉండేది. మా నాన్న నల్లగా ఉండేవాడు. ఆయన రంగే నాకు వచ్చింది. మా నాన్న చిన్నతనంలోనే ఆయన తల్లిదండ్రులు చనిపోతే కుటుంబపెద్దలే ఆయన్ను పెంచారు. పెంచడమే కాదు ఆయన తరఫున అన్ని నిర్ణయాలూ వాళ్ళే తీసుకునేవారు. ఆయనేం చెయ్యాలి, ఆయన భార్య ఏం చెయ్యాలి మొదలైనవి. ఆయనకి సర్దుకోక తప్పలేదు. వాళ్ళు మా అమ్మ మీద కూడా అధికారం చెలాయించేవాళ్ళు. ఇదంతా తప్పించుకోవడానికే మా నాన్న బొంబాయి రావాలనుకునేవారు. ఈ నిర్ణయం మా అమ్మకు బాగా లాభించింది. మా నాన్న ఆవిడ కార్యకలాపాల్లో బాగా సాయపడేవాడు. మేము అయిదుగురం తోబుట్టువులం. మా అన్న, నేను, తర్వాత ఒక చెల్లి, ఒక తమ్ముడు ఆ తర్వాత ఒక చిన్న చెల్లి. మా కుటుంబంలో పిల్లలకు ఎటువంటి ఆంక్షలూ లేవు. ఈ మధ్యనే మేము కలిసినప్పుడు మా పుట్టింట్లో మేము అనుభవించిన స్వేచ్ఛ గురించి ముచ్చటించుకున్నాము. ఇంట్లో మమ్మల్ని ‘ఎక్కడికి వెళ్తున్నావు?’, ‘ఎవరితో వెళ్ళావు?’, ‘ఏ అబ్బాయిని కలుస్తున్నావు?’, ‘ఏ అమ్మాయిని కలుస్తున్నావు?’ వంటి ప్రశ్నలు ఎప్పుడూ అడగలేదు.

అక్షయను నేను 1946 వరకూ కలవకపోయినా, అంతకు ముందు అతను వామపక్ష భావాలు కలవాడనీ, కమ్యూనిస్టనీ అతని గురించి విని ఉన్నాను. అతను కూడా నా గురించి విని ఉన్నాడు. యాదృచ్ఛికంగా మా ఇద్దరి కులాలు ఒకటే అయ్యాయి. అతను నాకన్నా పదేళ్ళు పెద్ద. అతను నన్ను 1946లో బొంబాయిలో జరిగిన కాంగ్రెస్‌ సభలో చూశాడు. నేనూ అతన్ని అప్పుడే చూశాను. మా ఇద్దరికీ ఉమ్మడిగా స్నేహితులున్నారు. వాళ్ళూ రాజకీయాల్లోనే ఉన్నారు. అక్షయ ఒక అధ్యయన కేంద్రాన్ని ప్రారంభించాడు. నేను దానికి హాజరయ్యేదాన్ని. అట్లా మేము పరస్పరం తెలుసుకున్నాము. అతను 1946లో పెళ్ళి ప్రతిపాదన తెచ్చాడు. రాజకీయంగా అతనికదొక కీలక సమయం. అప్పటికే సిపిఐతో అతనికి అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. ట్రోట్స్కీయిజం వైపు మొగ్గుతున్నాడు. అతని గాంధీ విధానం కూడా అందరికీ తెలుసు. ఒక వ్యక్తిగా అతను మృదు స్వభావి. ప్రేమాస్పదుడు. స్నేహశీలి. కుటుంబంలో చిన్నవాళ్ళందరికీ ఇష్టుడే కాక అతని తాత, నానమ్మ, తల్లిదండ్రులు కూడా అతన్ని గౌరవించేవారు. వాళ్ళంతా అతన్ని వివాహం చేసుకోమని అడుగుతున్నారు. వాళ్ళందరి దృష్టిలో ఎంతోమంది అమ్మాయిలు… అతని ముద్దుపేరు అక్షు భాయ్‌.

అయితే వసంత్‌! ఈ కథను బాగా అర్థం చేసుకోవాలి. చాలా సూక్ష్మగ్రాహ్యతతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మరి. మాపై ప్రభావం చూపించిన అంశాలెన్నో ఉన్నాయి. వాటికి మేమెట్లా సర్దుకుపోయామో, ఎట్లా ఒకరికొకరం అండగా నిలబడ్డామో చెబుతాను.

అక్షయ 1932లో బొంబాయి వచ్చాడు. వాళ్ళ నాన్నకు తరచూ బదిలీలవడం వలన అతని చదువు ఏ ఒక్కచోటా కుదురుగా కొనసాగలేదు. బరోడాలో కాలేజీలో చదివేటపుడు విద్యార్థుల చేత సమ్మె చేయించినందుకు అతన్ని కాలేజీ నుంచి బహిష్కరించారు. కానీ ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ”నీ భవిష్యత్తు చెడగొట్టడం మాకిష్టం లేదు. నువ్వు మరొక కాలేజీలో చేరవచ్చు” అని చెప్పాడు. అప్పుడు అక్షయ సూరత్‌లో ఒక సంవత్సరం చదివి బొంబాయి వచ్చి ఎల్ఫింగ్‌ స్టన్‌ కాలేజీలో డిగ్రీలో చేరాడు. ఆ సమయంలోనే అతను కమ్యూనిస్ట్‌ అయ్యాడు. పార్టీలో అయితే చేరలేదు కానీ విద్యార్థి శాఖలో చేరాడు. అప్పుడే అతనికి సి.జి.షాతో పరిచయమయింది. షా ఇండియాలో మార్క్సిస్ట్‌ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. అతను డాంగే సహచరుడు. ఆ రోజుల్లో అతనొక కింగ్‌ మేకర్‌ అని చెప్పాలి.

షా ప్రజ్ఞావంతుడు. కాలేజీ పరీక్షల్లో ఎప్పుడూ ప్రథముడిగా వచ్చేవాడు. గణిత శాస్త్రంలోనూ, సంస్కృతంలోనూ పండితుడు. ఇంగ్లీష్‌ బాగా వ్రాస్తాడు. అతనికి వివిధ రంగాలలో ఉన్న సామర్ధ్యం అందరూ ఎరిగినదే. అతని పఠనాసక్తి విపరీతం. అవివాహితుడు. అనేకమంది రాజకీయ, సామాజిక కార్యకర్తలు అతనికి బాగా తెలుసు. అక్షయకు కేవలం ఇరవై ఏళ్ళున్నప్పుడే 1935-36లో అతనితో పరిచయమయింది. అతని జ్ఞానసంపద, అంకిత భావం, అతనికున్న రాజకీయ సంబంధాలను చూసి అక్షయ అతని వలన బాగా ప్రభావితుడయ్యాడు. రాజకీయంగా వారిద్దరి మధ్య ఉండే సంబంధం క్రమంగా సామాజికంగా, వ్యక్తిగతంగా మారింది. త్వరలోనే అతను కుటుంబ సభ్యుడివలే అక్షయ తన ఇంటికి వెళ్ళినప్పుడల్లా అతనితో వెళ్ళేవాడు. షా పార్టీలో సభ్యుడు కానందువలన అతని పాత్ర ఏమిటో కొందరికే తెలిసేది. అతనొక మేధావి. పార్టీని నడిపించే మేధ అతనిది. ఆ రోజుల్లో ఎవరికైనా ఆర్థిక సాయం కావలసినా, కమ్యూనిస్టు పార్టీతో పని ఉన్నా, ఇతనే కీలకంగా ఉండేవాడు. రాజకీయోద్యమాలలో పనిచేసిన ముఖ్యులు చాలామంది

ఉండేవాళ్ళు. కానీ వారి స్వభావాల వలన జనం వారిని మర్చిపోయారు. ఇతన్ని కూడా ఎవరూ గుర్తుపెట్టుకోలేదు. అందువల్ల అతను ఆర్థికంగా, రాజకీయంగానే కాక మానసికంగా కూడా అక్షయపై ఆధారపడ్డాడు. అది అతనిలో ఒక అభద్రతా భావాన్ని కలుగజేసింది. అతను అక్షయ పట్ల ఒక స్వాధీనతా భావాన్ని పెంపొందించుకున్నాడు. అతని సమయాన్నీ, అతని శ్రమనీ తన హక్కుగా భావించేవాడు. ప్రతిరోజూ అక్షయను కలిసేవాడు. 1940 నుంచీ అక్షయ విద్యాపరమైన కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమైపోయాడు. డాక్టరేట్‌ కోసం కృషి చేస్తూ అదనంగా ప్రొఫెసర్‌ ఘర్యే(1) దగ్గర రీసెర్చి అసిస్టెంట్‌గా ఉండేవాడు. 1946లో మాకు ప్రదానం జరిగింది. 1947లో వివాహమయింది. నాకైతే ఈ స్నేహితుడి సమక్షం ప్రశాంతతను భంగపరిచే విషయంగా అనిపించేది. విసుగ్గా కూడా ఉండేది. అస్సలు సర్దుకోలేకపోయేదాన్ని. మొదట్లో నేనేం అభ్యంతరపెట్టలేదు. సర్దుకుపోవడానికే ప్రయత్నించాను. మా నాన్నలాగే ఆయన కూడా ఒక పెద్దవాడు అనుకునేదాన్ని. అతన్ని సహించాలనుకునేదాన్ని. కానీ క్రమంగా అతని ఉద్వేగభరితమైన మాటలవలన అతన్ని దూరం పెట్టడం మొదలుపెట్టాను. నా జీవితంలో కల్పించుకోనివ్వలేదు. అబ్బాయి మిహిర్‌ పుట్టాక పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. అతను మిహిర్‌ను కూడా ప్రభావితం చేయాలని చూస్తున్నాడు.

అయితే ఈ సందర్భాలన్నింటిలోనూ అక్షయ నన్ను సమర్ధించాడు. నా భావాలను అర్థం చేసుకున్నాడు. మేము దేన్నైనా వాదించి, చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేవాళ్ళం. నా తల్లిదండ్రులు కూడా ఆ సందర్భంలోని తీవ్రతను అర్థం చేసుకుని నన్ను సమర్ధించారు. మా మామగారు, మా ఆడపడుచు, ఇంకా కొంతమంది స్నేహితులు మేము ఎదుర్కొంటున్న ఒత్తిడిని అర్థం చేసుకున్నారు. ఈ అనుభవం ఎంత క్లిష్టమైనదైనా మా కుటుంబం మొత్తం నాకు అండగా నిలిచింది. సి.జి.షా మా నాన్నకు సహాధ్యాయి. వాళ్ళిద్దరూ అహ్మదాబాద్‌లో ఒకే కాలేజీలో చదువుకున్నారు.

అక్షయ నాతో పెళ్ళి ప్రతిపాదన తెచ్చినప్పుడు నేనివేవీ ఊహించలేదు. అక్షయ తండ్రి ఒక ప్రముఖ వ్యక్తి అని మాత్రం తెలుసు. వివాహం తర్వాత ఇన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు, నా తల్లిదండ్రులు కూడా అనుకోలేదు. వివాహం తర్వాత నా స్వభావమే పూర్తిగా రూపాంతరం చెందింది. అంతకుముందు నేను చాలా చురుకుగా, నిష్కపటంగా, నిస్సంకోచంగా మాట్లాడేదాన్ని. ఇంట్లో ఏదైనా వాదన జరుగుతూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నానన్న స్పృహ లేకుండా నా పద్ధతిలో నేను మాట్లాడేదాన్ని. మా నాన్న మా చదువుని బాగా ప్రోత్సహించారు. మాకు చదువు అనేది స్థాయీ చిహ్నం. మేము విలాసాల మధ్య పెరగలేదు. మధ్య తరగతి వారికి ధనం లేకపోవచ్చు కానీ చదువుంటుంది. దురదృష్టం కొద్దీ మా అన్న హైస్కూల్‌ విద్య దాటలేదు. కానీ నా మీద మా నాన్నకు పూర్తి విశ్వాసం ఉంది. అంతేకాక నేను బాగా చదువుకుంటున్నాను. ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నాను. మా నాన్న సాహితీ ప్రియుడు. మేము నవలల మీదా, అందులో పాత్రల మీదా, కొన్ని పుస్తకాల మీదా బాగా చర్చించుకునేవాళ్ళం. పెళ్ళి తర్వాత నాలో వచ్చిన మార్పుని ఆయన గమనించారు. ఒకసారి నాతో అన్నారు కూడా. ”నీరా, నువ్వు పూర్తిగా మారిపోయావు. నాకిదేం నచ్చలేదు” అని. మార్పు ఎందుకంటే నేను అన్నింటికీ సర్దుకుపోతున్నందువలన. నేను పూర్వపు నీరాను కాను. నన్ను నేను అదుపు చేసుకునేదాన్ని.

అట్లా సర్దుకుపోవడం ఎలా నేర్చుకున్నారు?

అందుకే ఇంత పెద్ద నేపథ్యం చెప్పాను మీకు. రెండు దశాబ్దాలపాటు నేనూ, నా భర్తా సంప్రదించుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాం. సర్దుకుపోవడమా? తిరగబడడమా? మేము చెయ్యదలచినది చేశాం. కానీ ఏ కొంచెమో మాత్రమే ప్రయోజనం లభించింది. ఇది కూడా చాలా చర్చల తర్వాత, చాలా తీవ్రమైన మాటల తర్వాత…

మీకు ఒకటి రెండు సంఘటనలు చెబుతాను. ఇటువంటి కొన్ని సర్దుబాట్లు మొదట్లో జరిగాయి. మేము పెళ్ళి చేసుకోబోతున్నామనుకోగానే నేను బరోడా వెళ్ళాను. అక్కడ మా ఇంటికి పూర్తిగా భిన్నమైన వాతావరణం కనబడింది. అయినా అప్పుడు నేను కాస్త అమాయకురాలిని కావడం వలన, అత్తగారింట్లో కూడా మా ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ ఉంటుందనుకున్నాను. ఒక చోట వ్రాసాను కూడా. పుట్టింటి వాతావరణానికి, అత్తింటి వాతావరణానికీ తేడా ఉంటుందనే విషయాన్ని చాలామంది ఊహించరు అని. కోడలి పట్ల వాళ్ళ ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. వాళ్ళు కోడళ్ళను సంప్రదాయాల పేరిట భయంకరమైనంత దూరంలో ఉంచుతారు. నేను అత్తమామల సమక్షంలో నా భర్తతో మాట్లాడకూడదు, ముసుగు వేసుకోవాలి, చాలా నెమ్మదిగా మాట్లాడాలి. అదే సమయంలో మా ఆడపడుచును మా మామగారు చాలా గారం చేసేవారు. ఆమెకి ఆ ఇంట్లో స్వేచ్ఛ ఉంది. నాకు దిగ్భ్రాంతి కలిగించింది. మా మామగారు ఒక సాధారణ వ్యక్తి అయితే నేనేమీ అనుకునేదాన్ని కానేమో! కానీ ఆయన ఒక మంచి రచయిత అయి ఉండి అట్లా ప్రవర్తించడాన్ని ఊహించలేకపోయాను.

ఉదయం నేను ముందు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పత్రిక చదవడానికి తీసుకుంటే నాకు సూచనలొస్తాయి ముందు అందరూ చదివాకే నేను చదవాలని. ఇవన్నీ ఎప్పటికీ ఇంకెన్నటికీ…

సూచనలెలా అందేవి?

మొదట్లో ఈ విషయం అక్షయ నాకు చెప్పలేదు. సాధారణంగా మగవాళ్ళు ఇటువంటివి పట్టించుకోరు. నేనే అర్థం చేసుకోవాలనుకుంటా! నేను అర్ధం చేసుకున్నదేమంటే అతని స్త్రీ వాదం అంతా నాతో సాహచర్యం తర్వాత పెంపొందిందే అని. అతనికి స్త్రీల బాధల్ని గురించి ఆవేదన ఉంది. అయితే రెండు భిన్నమైన కుటుంబ నేపథ్యాలు తెచ్చే సంఘర్షణలు అతను అర్థం చేసుకోలేకపోయాడు. ఒక ఆడపిల్ల పుట్టి పెరిగిన వాతావరణం స్వేచ్ఛాయుతమైనదయితే, ఆమె ఇంట్లో జరిగే సాహిత్య సంబంధమైన, రాజకీయ సంబంధమైన చర్చల్లో పాలుపంచుకోవాలనుకుంటుంది. చర్చలు జరుగుతూ ఉంటాయి కానీ మనం పాల్గొనకూడదు. ఈ విధమైన దూరం మనం అనుభవిస్తాం. కానీ మగవాళ్ళకి అర్థం కాదు అనిపించింది. అట్లా ఆ ఇంటికి వెళ్ళిన మొదటిసారి నాకు చాలా ఆశాభంగం కలిగింది.

మీ వివాహానికి ముందా? తరువాతా?

ముందే. తలమీద ముసుగు వేసుకోవడం ఫరవాలేదు. కానీ ఈ విధమైన ఆంక్షలు! అంటే మాట్లాడకుండా ఉండడం, అభిప్రాయాలు వెలిబుచ్చకుండా ఉండడం లాంటివి నాకు నచ్చలేదు. మా వివాహమైన రెండు మూడేళ్ళదాకా ఈ పరిస్థితి కొనసాగింది. మా పెళ్ళయిన అయిదు సంవత్సరాలకు మా మామగారి తల్లి మరణించింది. ఆ తరువాత మా మామగారు పోయారు. అయితే ఈ కాలంలోనే నేను అక్షయతో చాలా చర్చించాను. ఈ ఆంక్షల గురించీ, మరికొన్ని విషయాల గురించీ.

సరే మొదటిసారి వాళ్ళింటినుంచీ రాగానే అక్షయకు చెప్పాను నాకు చాలా నిరాశా నిస్పృహ కలిగాయనీ, అదొక రకమైన అణచివేతలాగా అనిపించిందనీ. ఆ విషయమే ఒకరిద్దరు స్నేహితులతో కూడా చర్చించాను. నాలాగే వాళ్ళకి కూడా ఈ విషయం బాగా అర్థం కాలేదు. బహుశా మాకు లోకం బాగా తెలియదేమో! ఇట్లా రెండు కుటుంబాల మధ్య ఉన్న ఈ తేడా సమస్యలు సృష్టిస్తుందేమో! మరొక విషయమేంటంటే వాళ్ళు వెంటనే నన్ను ఆ కుటుంబంలోకి స్వాగతించలేకపోయారు. ఇప్పుడనిపిస్తుంది, ఇదంతా జరిగిపోయిన తర్వాత అర్థం అవుతున్నట్లు.

మొదటి విషయం, వాళ్ళు ఎంపిక చేసిన అమ్మాయిని అక్షయ పెళ్ళి చేసుకోకపోవడం. రెండవది, నా కుటుంబ నేపథ్యం భిన్నమైనది. నేను చాలా చురుగ్గా ఉండి, అన్నింటిలో పాల్గొనాలనే ఉత్సాహంగా ఉండేదాన్ని. అంతేకాక బొంబాయి వంటి స్వేచ్ఛాపూరిత నగరంలో పెరిగాను. మూడవదేంటంటే మాది రిజిస్టర్‌ పెళ్ళి, సంప్రదాయబద్ధమైన పెళ్ళి కాదు. మా పెళ్ళి ఘనంగా చేయాలని రెండు కుటుంబాలూ అనుకున్నాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత రెండు కుటుంబాల్లోనూ జరుగుతున్న మొదటి వివాహం ఇది. రెండు కుటుంబాలూ ప్రముఖమైనవే. అదొక ప్రతిష్టకు సంబంధించిన విషయమయింది. ఈ విషయం గురించి మేము మా కుటుంబాలతో వాదించలేదు. నేనయితే వాదించగలిగేదాన్నే. కానీ అక్షయకి తన తాత, నానమ్మలతో వాదించడానికి భయం. అట్లా వాదిస్తే వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షకి పూనుకోవచ్చు. దాంతో అన్నింటికీ ముగింపు పెట్టేయాల్సిందే. అందుకని ముందు మేము పెళ్ళి రిజిస్టర్‌ చేసుకుని తర్వాత మా కుటుంబాలకి తెలియచేశాం. మా నాన్న ముందు కొంచెం కోపం తెచ్చుకున్నా తర్వాత అర్థం చేసుకుని ”బాగుంది” అన్నారు.

తర్వాత మేము బరోడా వెళ్ళాం. వెడుతున్నప్పుడు నేనేదో పెద్ద తప్పు చేసినట్లు అపరాధభావం కలిగింది. వాళ్ళ కలలని నేనే భగ్నం చేశానని వాళ్ళు అనుకోవచ్చు. అయితే మా మామగారు మేమిట్లా చేసినందుకు హృదయపూర్వకంగా సంతోషించారు. సంప్రదాయ వివాహానికి చాలా డబ్బు ఖర్చవుతుందనీ, చాలా సమస్యలు కూడా వస్తాయనీ ఆయనకు తెలుసు. ఆయన ప్రశాంతంగానే ”బాబూ! నువ్వు నా తల్లిదండ్రులను నొప్పించావు. కానీ నాకు సంతోషంగా ఉంది” అన్నారు. అయితే కొంతమంది సంతోషించినా ఈ సంప్రదాయ ధిక్కారం అందరికీ నచ్చలేదు. నేనూ, నా భర్తా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాం కనుక మేమిద్దరం ఎంతో సన్నిహితంగా ఉన్నట్లు భావించాము. మా పెళ్ళికి మా ఆడపడుచు కూడా వచ్చింది. తర్వాత మా ఇద్దరికీ మధ్య మైత్రి ఏర్పడింది. స్వభావాల రీత్యా మా ఇద్దరికీ తేడా ఉన్నా క్రమంగా ఇద్దరం దగ్గరయ్యాం.

ఇదంతా ఇలా ఉండగా సి.జి.షా మాకు సమస్యైపోయారు. మా ఆయన సున్నిత స్వభావుడు అని తెలిసినా నేను ఆయనతో కఠినంగా వాదించేదాన్ని. ఆయన కూడా లోలోపల దహించుకుపోతున్నారు. నాకూ, షాకూ మధ్య ఎవరో ఒకర్ని ఎంచుకోవలసిన పరిస్థితి వచ్చింది ఆయనకి. నన్నే ఎంచుకున్నాడనుకోండి. నేనంటే తనకి ప్రేమ అని తెలుసు. నా మీద ఎంత ప్రేమ ఉన్నా షా గురించి ఒక నిర్ణయం తీసుకోలేకపోయారు. ఆ నిర్ణయాన్ని నేను ఆయన మీద రుద్దవలసి వచ్చింది.

ఒక్కొక్కప్పుడు బాగా వత్తిడి కలిగేవరకూ వాదించుకోవాల్సి వచ్చేది. కానీ మా ఇద్దరి మధ్యా ఉన్న అవగాహన వల్ల సంప్రదింపులతో సమస్యని పరిష్కరించుకున్నాం.

అక్షయ సమయంపైన అదుపు కోసం, అతన్ని ఇంటికి దూరంగా ఉంచడం కోసం చేసిన ఇమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ అనుకుంటాను. ఇది ప్రతి వివాహంలోనూ జరుగుతుంటుంది.

అవును. ఇది అత్తగారి ద్వారానూ జరుగుతుంది. స్నేహితుల ద్వారానూ జరుగుతుంది.

స్నేహితుల ద్వారా అయితే మరీ కష్టం

ఇది చాలా కష్టం, వసంత్‌! చెబుతున్నాను కదా! మొదట్లో మన దారికి ఏదో అడ్డం వచ్చినట్లు అనిపిస్తుంది. కానీ అది పూర్తిగా వ్యతిరేకమైనది. కొంచెంసేపు సంభాషణ ఆపుదాం. భోజనం చేద్దామా?

మీరు మారిపోయారని మీ నాన్న అన్నారు కదా, ఆ విషయం గురించి చెప్పండి.

ఇప్పటికీ నన్ను చాలా మృదు స్వభావి అనుకుంటారు. నేను చాలా మృదువుగా మాట్లాడతాను. కోపంగా గట్టిగా మాట్లాడను. అందుకని ఏవైనా సంప్రదింపులు జరిగేటప్పుడు నన్ను ముందు పెడతారు రెండు వైపుల వారితో మాట్లాడమని. కానీ ఒకప్పుడు నేనిలా ఉండేదాన్ని కాదు.

మీరింత మెత్తగా ఎలా మారారో చెబుతున్నారు ఇందాక!

ఇంటి వాతావరణమే నన్నిలా మార్చింది. మా అత్తగారిల్లు, ఈ స్నేహితుడూ కలిసి… మీరు నమ్మరు కానీ అతను అక్షయ సమయాన్ని తన హక్కుగా భావించేవాడు. అక్షయకి స్నేహితులుగా ఎవరుండాలో నిర్ణయించేవాడు. అక్షయ గురించిన నిర్ణయాలన్నీ అతనే తీసుకునేవాడు. తనే మా సామాజిక చేతన అన్నట్లు ప్రవర్తించేవాడు. అక్షయ తన ఉద్యోగంలో ఎదిగే కొద్దీ అనేక మంది మార్క్సిస్ట్‌ స్నేహితులను కలుసుకోవాల్సి వచ్చేది. డబ్బు సంపాదించి మా ఇల్లు గడపాలి. పని చెయ్యాలి. తన ఉద్యోగంలో పైకి రావాలి. అతనికి అపారమైన పని సామర్ధ్యం ఉంది. మానసికంగానూ, శారీరకంగానూ కూడా… వాళ్ళిద్దరూ బాగా వాదించుకునేవాళ్ళు. రాజకీయాలను గురించీ, వ్యక్తిగత విషయాల గురించీ. తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆరోపణలు కూడా చేసేవాడు షా. ఇదంతా నా జీవితంలో మొదటిసారిగా చూస్తున్నాను. నేను చాలా సాధారణ కుటుంబం నుంచీ వచ్చాను. ఇటువంటి కొట్లాటలు ఎప్పుడూ చూడలేదు. మాకూ అభిప్రాయ భేదాలుండేవి. గట్టిగా మాట్లాడుకునేవాళ్ళం. కానీ ఒకరినొకరం ఎప్పుడూ అవమానించుకోలేదు. ఇక్కడ నేనొక అవరోధంగా కనబడుతున్నాను. ఇది నాకు నిజంగా పెద్ద షాకే!

అక్షయకి తన మార్గదర్శకుడి ఎడల ఎనలేని కృతజ్ఞతా భావం, భారం కూడా… వివాహం అనేది మన కార్యక్రమాలకు భంగం కలిగిస్తుంది కనుక పెళ్ళి చేసుకోకూడదని అతను అక్షయకి చెప్పేవాడు.

పెళ్ళి అనవసరమా?

అవును అది నీ మార్గానికి అడ్డంకి, నీ రాజకీయ భవిష్యత్తుకు అవరోధం…

అక్షయా, నేనూ ప్రేమించుకున్నాం, కనుక మేము పెళ్ళి చేసుకున్నాం. కలిసి ఉంటే సంతోషంగా ఉంటామనుకున్నాం. అదేదో వెసులుబాటు కోసమో, లాభం కోసమో చేసుకున్న వివాహం కాదు. అందుచేత సహజంగానే అక్షయ నాతో ఎక్కువ సమయం గడపాలనుకునేవాడు. నేను కూడా పది శాతం సమయం ఎక్కడున్నా, నాతో తొంభై శాతం గడపాలనుకునేదాన్ని. కానీ నలభై, యాభై శాతం సమయం స్నేహితుడికే పోతోంది. అతన్ని రోజూ కలవాలి. అతనితో సమయం గడపాలి. ఇదంతా భరింపరానిదిగా ఉంది. మొదట నాకు అర్ధం కాలేదు, వసంత్‌! మొదట్లో మనం సర్దుకుపోవడానికి ప్రయత్నిస్తాం. తరువాత ఆలోచించి ఏదో తప్పు జరుగుతోందనీ, మనం ఎదిరించాలనీ తెలుసుకుంటాం. నేను ఎదురు తిరగకపోవడానికి ఒక కారణం, స్నేహితుల మధ్యకు మనం వెళ్ళకూడదనే సంస్కారం.

అది రాజకీయం కూడా కదా!

సంస్కారం నన్ను స్నేహితులు కలిసి మాట్లాడుకుంటే ఫరవాలేదులే అనుకునేలా చేసింది. ”మనం బయటికి పోదాం”, ”మనం ఇంటికి పోదాం”, ”మనం ఇది చేద్దాం”, ”మనం అది చేద్దాం” అని నేను అనకూడదు అనుకునేలా చేసింది. కానీ కొంతకాలానికి అది కూడా జరిగింది. ఇటువంటి సంఘటనల వలన అక్షయ కలవరపడుతున్నాడని తెలుసుకున్నాకే అలా అనడం మొదలైంది. ఇటువంటివి జరిగినప్పుడే అసలు మనిషి బయటకొస్తాడు. ముసుగులు తొలగిపోతాయి. షా ఆరోపణలకు అక్షయ బాధపడుతున్నాడు. షా మీదున్న గౌరవంతో, ప్రేమతో కాక ఒక విధిలాగా అతనితో సమయం గడుపుతున్నాడు. అతన్ని ఆ విధి నుంచీ బయటపడేయాలి నేను. అప్పుడు మా మామగారు నాతో, ”షా అక్షయ సమయమంతా తినేస్తున్నాడు, అతన్ని నువ్వే కాపాడాల”ని చెప్పారు. ”నీరా, నువ్వు దీన్ని ఆపాలి” అన్నారాయన. నిజంగా ఆ ఘనత ఆయనదే. జీవితం ఎప్పుడూ పూలబాట కాదు. ఒక అనుబంధాన్ని సరిగ్గా నిర్వహించుకోవాలంటే ఏదో ఒక సమయంలో ”ఇంకెన్నాళ్ళో ఇలా సాగడానికి వీల్లేదు, ఇంతవరకూ చాలు” అనాలి. మన జీవితంలో గట్టి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఒకటి వస్తుంది. మా జీవితంలో ఆ సమయం మెల్లగా అప్పుడు వచ్చింది. ఇప్పుడు మరొక సంఘటన చెప్పనా? తరువాత అనుకూలాంశాలలోకి పోదాం.

ఇది చాలా ముఖ్యం

ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మా ఇద్దరి బంధం స్థిరపడేముందు మేము చేసిన పోరాటం అది. నా స్వభావంలో మెత్తదనం, రాజీతత్వం ఇందువల్లే. అక్షయకు ఏదైనా ఆహ్వానం వస్తే అతను అక్కడికి వెడుతున్నాడని మేము షా కు చెప్పలేము, చెబితే అతను చిందులేస్తాడు.

”అక్కడికెందుకు వెళ్తావు? అంటే నువ్వు రాజ్యానికి దగ్గరవుతున్నావన్నమాట” అంటూ తరువాత అతని భావజాలానికి సంబంధించిన పదజాలం అంతా ఉపయోగిస్తాడు.

మాకొక బిడ్డ కావాలనుకున్నా అప్పట్లో ఉన్న సమస్యల వలన ఆ కోరికను వాయిదా వేశాము. కానీ ఇప్పుడా సమయం వచ్చింది. బిడ్డ పుట్టుక మమ్మల్ని మరింత సన్నిహితం చేస్తుందనుకున్నాను నేను. మేము సన్నిహితంగా లేమని కాదు, బిడ్డ పుట్టడం మమ్మల్ని మానసికంగా మరింత చేరువ చేస్తుందని. మా బిడ్డపై కూడా తన స్వాధీనత్వ మనస్తత్వాన్ని ప్రయోగించడం మొదలుపెట్టాడు షా. మిహిర్‌ నా బిడ్డ. వాడిపై అతని పెత్తనం ఏమిటి? ఒకరిని స్వాధీనం చేసుకున్నది కాక మరొకరిని కూడానా? అని భయం వేసింది నాకు. మిహిర్‌ మా మధ్య ప్రధాన వివాదహేతువయ్యాడు.

మీ వివాహమైన ఎన్ని సంవత్సరాలకు మిహిర్‌ జన్మించాడు?

పది సంవత్సరాలకు.

పదేళ్ళు. అంటే ఈ సంఘర్షణ పదేళ్ళు కొనసాగిందన్నమాట.

పదేళ్ళు కొనసాగింది. ఆ పైన కూడా కొనసాగింది. మిహిర్‌ పుట్టాక షా కి మొదట్లో వాడంటే వాత్సల్యం. తాతా, నానమ్మలకి మనుమలతో అనుబంధం ఉంటుందని తెలుసు. తరువాత ఆయన వాడికి బహుమతులు తెచ్చేవాడు. ”షా అప్పుడే తాత అయ్యాడు” అని మా అమ్మా, నాన్నా ఆయన్ని ఆటపట్టించే వాళ్ళు. ”నేను తాతను కాదు బాబాయిని, అక్షయ్‌ స్నేహితుడిని” అనేవాడు వెంటనే. అంటే అతనికి ఇట్లాంటి అహంభావాలు కూడా ఉన్నాయన్నమాట. పిల్లవాడిని ప్రలోభపెడుతూ, బహుమతులిస్తూ వాడికి శిక్షణ ఇస్తున్నాడాయన.

చాలాసార్లు నేను అక్షయతో చెప్పాను. ఇలా జరగడానికి వీల్లేదు, ఆయనతో గట్టిగా ఉండమని. క్రమంగా అట్లాగే ఉంటున్నాడు. ఇది మమ్మల్ని మరింత చేరువ చేసింది. అంత సులభంగా కాదు. కానీ నెమ్మదిగా అతనికి అర్థమౌతోంది. అతను నెమ్మదస్తుడూ, త్వరగా నిర్ణయాలు తీసుకోలేడు కనుక నేనే తీసుకున్నాను. అంతేకాక షా ఆర్థికంగా కూడా తనమీదే ఆధారపడి ఉన్నాడనే సానుభూతి కూడా

ఉందతనికి. అప్పుడు నేను చెప్పాను. ”అతనికి ఆర్థిక సహాయం చెయ్యి. నాకేం అభ్యంతరం లేదు కానీ నా జీవితంలో జోక్యం చేసుకోవడం నాకు నచ్చదు” అని.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో