జాతిని జాతినే తవ్విపోస్తారా? -మమత కొడిదల

దారికడ్డంగా ఒక జంతువు పరిగెట్టేదాక కారు అంత మెల్లగా డ్రైవ్‌ చేస్తున్నానని అనుకోలేదు. రోడ్డు దాటేసి గులకరాళ్ళమీద నిలబడి కారు వైపు చూసింది. విండ్‌ షీల్డ్‌లోంచి ఎలా కనబడ్డానో, అక్కడే నిలబడి నా కళ్ళల్లోకి సూటిగా చూసింది. కారు ఆపేసి ఆ జంతువును చూస్తుండిపోయాను. దాని బూడిదరంగు బొచ్చు గాలికి అల్లల్లాడుతోంది. ముట్టుకుంటే ఎంత మృదువుగా ఉంటుందో! అది తన రాజ్యం అన్నట్లు ఎంత ఠీవిగా నిలబడ్డది. ”ఎంత అద్భుతంగా ఉన్నావు.” గట్టిగా అనేశాను. ఏం అర్థమయ్యిందో, ఒక్కసారిగా రోడ్డు పక్కన పొదల్లోకి దూకి మాయమయింది.

కారు మళ్ళీ స్టార్ట్‌ చేసి కొద్ది దూరం పోయాక హఠాత్తుగా తట్టింది. నన్ను మంత్రం వేసినట్టు రోడ్డు మధ్యలో ఆపేసిన ఆ జంతువు ఒక తోడేలు. అప్పుడు పుట్టింది వెన్నులో వణుకు.

ఒకసారి నా చుట్టూ చూసుకున్నాను. దిగంతానికి గోడ కట్టినట్లు ఎర్రటి కొండలు, అక్కడక్కడ ఎగుడు దిగుడుగా నల్లని రోడ్డు మైళ్ళకొద్దీ నా ముందూ వెనకాలా పరుచుకుని ఉంది. ఆ రోడ్డు మీద నా కారు తప్ప మరో వాహనం లేదు, ఎటువంటి జనసంచారమూ లేదు. ఇంతకీ నేను ఉన్నది ప్రపంచానికి ఏ మారుమూలో కాదు. అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో గ్రాండ్‌ కాన్యన్‌గా పేరుగాంచిన ప్రాంతానికి కేవలం ఓ నలభై మైళ్ళ దూరంలో ఉన్నాను. అమెరికా ఆదివాసీ తెగల్లో ప్రముఖమైన న్యావహో, హోపీ (Navajo, Hopi) తెగలకు కేటాయించిన రిజర్వేషన్‌ల ప్రాంతం ఇది.

ప్రస్తుతం అమెరికా దేశం నైరుతి భాగాన ఎన్నో వేల ఏళ్ళుగా న్యానహో ‘దేనే:’ నివసిస్తున్నారు. (Dine అంటే న్యావహో భాషలో ప్రజలు అని అర్ధం) మొట్టమొదటి న్యావహో ప్రజలకు, అగ్నిదేవుడు స్వచ్ఛమైన నీటి చెలమలనూ, మంచుకొండలనూ, ఎర్రని రాతి కొండలనూ, వేట స్థలాలనూ ఇచ్చి, మొక్కజొన్న పుప్పొడినీ, పసుపు రంగు పొడినీ చూపించి ఏది కావాలో కోరుకోమన్నాడట. వాళ్ళు మొక్కజొన్న పుప్పొడి కావాలని కోరుకున్నారట. అది మంచి నిర్ణయమని చెప్పి, మట్టిని పెళ్ళగించి పసుపు రంగు పొడిని దాచిపెడుతూ వాళ్ళతో అగ్ని ఇలా అన్నాడట, ”జాగ్రత్తగా వినండి. ఈ మట్టి, ఈ నేల, ఈ భూమి, మీ తల్లితో సమానం. ఆమె ఈ పసుపు రంగు పొడిని తనలో భద్రంగా దాచుకుంటుంది. స్వేచ్ఛగా బతకడానికి కావలసినవన్నీ ఆమె మీకు ఇస్తుంది. ఆమె మీద మసలే ప్రతిదాన్నీ గౌరవించండి. నేలను తవ్వడమంటే ఆమెను కించపరచడమే, బాధపెట్టడమే. అప్పుడు ఈ పసుపు రంగు పొడి పెనుభూతమై మిమ్మల్ని కబళిస్తుంది”.

ప్రజలు అగ్ని మాటలను జాగ్రత్తగా పాటిస్తూ, భావి తరాలతో ఆ మాటలను పంచుకుంటూ వేల ఏళ్ళ తరబడి భూమి మీద ఉన్న ప్రతిదానితో సహజీవనం చేస్తూ ఉన్నారు. తమ ఉనికికి ప్రమాదకరమైన పెనుభూతానికి ‘లీత్సో’ అని పేరు పెట్టారు.

న్యావహో తల్లులు తమ పాపాయిల బొడ్డు తాడును భూమిలో పాతిపెడతారు. అలా చేస్తే, ఆ పాపాయికి భూమితో శాశ్వత సంబంధం ఏర్పడుతుందని నమ్ముతారు. భూమిని తల్లిలా గౌరవించే ఆ ప్రజల జోలికి రాలేని లీత్సో పొడవాటి వేళ్ళతో నేల పొరల కింద పారాడుతూనే ఉంది.

… … …

న్యావహో రిజర్వేషన్‌ వైశాల్యంలో మిగతా అన్ని తెగలకు చెందిన రిజరేషన్లకంటే పెద్దది. అయితే ఇక్కడంతా రాళ్ళు రప్పలూ, ముళ్ళ పొదలు తప్ప ఇంకేవీ లేనట్లున్నాయి. అమెరికా ప్రభుత్వం ఆదివాసీ తెగలకు కొంత భూమిని కేటాయించింది కానీ ఆ భూభాగంలో స్వేచ్ఛగా తిరుగాడిన జనాన్ని రిజర్వేషన్‌ పేరిట ఒక ప్రాంతానికి పరిమితం చేసింది. కొన్ని తెగల విషయంలో తప్ప ఆ రిజర్వేషన్‌ ప్రాంతాలు చాలావరకు బీడు భూములు లేదా ఎడారి ప్రాంతాలు.

అమెరికా చరిత్రలో న్యావహో తెగ ప్రజలకు ఒక విశిష్ట స్థానం ఉంది. తెల్లవాడి రాకతో ఎన్నో తెగలు పూర్తిగా హతమయిపోగా, మరెన్నో తెగలు అలుపెరగని పోరాటాలు చేశాయి. అమెరికా సైనికులను ముప్పుతిప్పలు పెట్టిన తెగల్లో న్యావహో ఒకటి. అయితే 1860ల నాటికి దాదాపు అన్ని తెగలనూ నయానో, భయానో, మోసపుచ్చో రిజర్వేషన్లకు పరిమితం చేసింది అమెరికా ప్రభుత్వం. న్యావహో తెగ విషయంలోనైతే వారి ఆహార నిల్వలనూ, పంటలనూ, నివాస స్థలాలను ధ్వంసం చేసి ఆకలికి గురిచేసి సైన్యానికి దాసోహమయ్యేటట్లు చేశారు. 1864లో వసంత కాలంలో న్యావహో ప్రజలను వేల ఏళ్ళ నుండి నివసిస్తున్న ప్రాంతం నుంచి 300 మైళ్ళ దూరంలో వారికి కేటాయించిన రిజర్వేషన్లకు కాలినడకన తరలించింది అమెరికా ప్రభుత్వం. ఆ తరలింపునకు ముఖ్య కారణం న్యావహో ప్రజలు ఉంటున్న ప్రాంతంలో బంగారం దొరుకుతుందని ప్రభుత్వమూ, వ్యాపారులూ ఆశపడ్డారు. న్యావహో ‘లాంగ్‌వాక్‌’లో దాదాపు 9000 మంది ప్రజలు తమకు ఏ మాత్రం పరిచయం లేని ప్రాంతాలకు తరలివెళ్ళారు. దారిలో కనీసం 200 మంది చనిపోయారు. వాళ్ళు చేరుకున్న ప్రదేశంలో అప్పటికే ‘మెస్కలేరో అపాచీ’ తెగవాళ్ళను తరలించారు. అంత మందికి తిండీ, బట్టా సమకూర్చేంత స్థాయిలో ఆ ప్రదేశం లేదు. దానికి తోడుగా మెస్కలేరో తెగా, న్యావహో తెగా శత్రు తెగలు. ఒక్కచోట ఉండడం వలన వారిమధ్య గొడవలు చెలరేగేవి. 1868 నాటికి పంటలు సరిగ్గా పండకపోవడం, వరదల కారణంగా అక్కడ బతకడం దుర్భరమైపోయింది. అక్కడి వాళ్ళందరినీ ఓక్లహోమ రాష్ట్రానికి తరలించాలని ప్రయత్నాలు మొదలైనపుడు, తమను తమ పూర్వీకుల ప్రాంతానికి వెళ్ళనివ్వమని న్యావహో తెగ నాయకుడు అమెరికి సైన్యాధికారి అయిన ‘విలియం తెకుంసే’కు నచ్చచెప్పాడు. ఇరువర్గాలకూ సానుకూలంగా ఉండేట్లు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ అపరిచిత ప్రాంతానికి 50 విడి గుంపులుగా వచ్చిన న్యావహో ప్రజలు, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళేటపుడు కలసికట్టుగా తిరిగి వెళ్ళిపోయారు. అమెరికా సైన్యానికి చిక్కకుండా దాక్కుని తమ ప్రాంతాల్ని వదిలి రాకుండా ఉన్న తమ న్యావహో ప్రజలను తిరిగి కలుసుకున్నారు. కొన్ని వందల మైళ్ళ దూరంలో ఉన్న రిజర్వేషన్‌ నుంచి తిరిగి తమ స్వంత భూభాగాన్ని చేరుకోగలిగిన ఒకే ఒక తెగ ఇదే.

న్యావహో ప్రజలు వెనక్కి వచ్చాక, శాంతియుతమైన సంబంధాలు కలిగి ఉండాలని అమెరికా ఆ తెగ ప్రజలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఆ ఒప్పందం ప్రకారం అమెరికా ప్రభుత్వం న్యావహో ప్రజలకు ‘సంరక్షకుడి’గా వ్యవహరిస్తుంది. బదులుగా న్యావహో ప్రజలు తమకు కేటాయించిన భూమికి పరిమితమై ఉండాలి.

1940లో రెండవ ప్రపంచ యుద్ధంలో, అగ్ర రాజ్యాలేవీ జపాన్‌, జర్మనీ దేశాల ముట్టడిని అడ్డుకోలేకపోతున్నపుడు అమెరికా ప్రభుత్వం న్యావహో ప్రజల సహాయం కోరింది. అమెరికా తన సైన్యానికి పంపే ఆదేశాలను జపాన్‌ సైన్యం తేలికగా డీకోడ్‌ చేసేది. అప్పటికి న్యావహో భాషకు లిపి లేదు. పదాలు కూడా ఉచ్ఛారణను బట్టి ఒకే పదం వేరు వేరు అర్థాలు సూచిస్తుంది. వినడానికి కూడా, పైపులోంచి బయటకు రాబోతున్న నీళ్ళ శబ్దంలా ఉంటుంది. తమ ‘సంరక్షకుడికి’ సహాయం చెయ్యాలని న్యావహో తెగ నిర్ణయించుకుంది.

న్యావహో భాషలో పంపిన కోడ్‌ను జపాన్‌ సైన్యం డీకోడ్‌ చేయలేకపోయింది. ‘కోడ్‌ టాకర్స్‌’గానే కాకుండా యుద్ధభూమిలో కూడా సాహసవంతంగా పోరాడారు. దాదాపు ఐదు వందల మంది న్యావహో యువకులు రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. యుద్ధం ముగింపునకు ముఖ్యమైన సంఘటన అయిన ఇవో జిమా ముట్టడి, న్యావహో కోడ్‌ టాకర్స్‌ లేకపోతే విజయవంతం అయ్యేది కాదని ఆ యూనిట్‌ లీడర్‌, హోవర్డ్‌ కానర్‌ అంటారు.

ఇందులో విరక్తిగా నవ్వు పుట్టించే విషయమేంటంటే, యుద్ధంలో పాల్గొన్న ఎంతోమంది న్యావహో యువకులు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘బోర్డింగ్‌ స్కూల్‌’లో చదువుకున్నారు. అమెరికా ప్రభుత్వం ‘ఏకీకరణ’ పేరిట ఆదివాసీ పిల్లలను బలవంతంగా వాళ్ళ ఇళ్ళ నుంచి లాక్కెళ్ళి ఈ బోర్డింగ్‌ స్కూల్‌లో చేర్పించేవారు. ఆ పిల్లలు తమ మాతృ భాష మాట్లాడకుండా కేవలం ఇంగ్లీషులోనే మాట్లాడాలని కట్టుదిట్టం చేశారు. తమ స్వంత భాషలో మాట్లాడితే, విపరీతంగా కొట్టడం, నోటిని సబ్బుతో కడిగించడం వంటివి క్రూరమైన శిక్షలు విధించేవారు. అలాంటి ‘బోర్డింగ్‌ స్కూల్స్‌’ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, చివరికి ఆదివాసీ భాషమీదే ఆధారపడవలసి వచ్చింది.

న్యావహో తెగ రిజర్వేషన్‌ ప్రాంతంలోకి రాగానే తోడేలు కనపడడమే విచిత్రంగా, భయం గొలిపేదిగా అనిపించినా ఆ తరువాత ఎదురైన అనుభవానికి ఆ తోడేలు నన్ను సిద్ధం చేసినట్టుంది.

కొంతదూరం వెళ్ళాక అక్కడక్కడా డబ్బాల్లాంటి ఇళ్ళు కనిపించాయి. గాలి చెక్కిన ఎర్రని పర్వతాల, గుట్టల పక్కనే ఆ ఇళ్ళు ఉన్నాయి. కొన్ని ఇళ్ళు పాతబడిపోయి, ఒకవైపుకి ఒరిగిపోయి నివసించడానికి వీల్లేకుండా ఉన్నా ఆ ఇళ్ళ ముందు పాత కార్లు ఉన్నాయి. కొన్ని ఇళ్ళముందు పిల్లలు కూడా ఆడుకుంటున్నారు.

అక్కడక్కడ నల్లని గుట్టలు కనిపించాయి. ఎర్ర దుమ్ములో పొట్టిగా పెరిగిన ఎడారి దుబ్బుల మధ్య ఒక్క మొక్క కూడా పెరగని ఆ నలుపు గుట్టలు వికృతంగా ఉన్నాయి. అవి బొగ్గు తవ్వకాల తర్వాత వదిలేసిన గుట్టల ఆనవాళ్ళు. ఆ గుట్టలోంచి నీరు ఇంకి భూమి పొరల్లోని అక్విఫర్స్‌కు చేరుకుంటాయి. నీళ్ళు విషపూరితమౌతాయి. గనులూ, ఫ్యాక్టరీలు వంటివి అట్టడుగు వర్గాల ప్రజల మధ్య కట్టడానికి కారణం వారికి పోరాడే శక్తి ఉండదని బడా కంపెనీలు నమ్ముతాయని ఒక పర్యావరణ కార్యకర్త అన్నట్టు గుర్తు. ఈ మధ్య ‘నార్త్‌ డకోటా ఆక్సెస్‌ పైప్‌లైన్‌’ నిర్మాణం, మన జాదూగూడలో యురేనియం తవ్వకాలు, ఒడిస్సాలో ఆదివాసులు భూమిని ఆక్రమిస్తున్న మల్టీ నేషనల్‌ కంపెనీలు దీనికి ఉదాహరణ.

మరో ఇరవై మైళ్ళు ఏ జనసంచారం లేని రోడ్డు మీద ప్రయాణించిన తరువాత ‘ట్యూబా సిటీ’ చేరుకున్నాను.

‘తూవీ ట్రావెల్‌ సెంటర్‌’ అనే గ్యాస్‌స్టేషన్‌, పక్కనే ఒక షాపు కనిపించగానే కారు లోపలికి పోనిచ్చి, షాపు పక్కన కారు పార్కు చేసి లోపలికి వెళ్ళాను. అక్కడున్న మనుషులు తప్ప, షాపులోని వస్తువులూ, వాటిని అమర్చిన తీరూ అంతా మిగతా ఊర్లలోని దుకాణాల్లాగే ఉంది.

రెండు మంచినీళ్ళ బాటిళ్ళూ, కొన్ని అరటిపళ్ళూ తీసుకుని కౌంటర్‌ దగ్గరికి వెళ్ళాను. కౌంటర్లో అమ్మాయి బిల్‌ వేస్తూ నా ముఖంలోకి తేరిపార చూసి చిర్నవ్వుతోనే అడిగింది, ”రియల్‌ ఇండియన్‌ కదా మీరు?”

నాకు చాలా అలవాటైన ప్రశ్న. ఇలాంటి ప్రయాణాలు చేసిన ప్రతిసారీ కనీసం ఒక్కరి నుంచైనా నాకు ఎదురవుతుంది. వాళ్ళు నన్నూ, నేను వాళ్ళనూ తెలుసుకోవడానికి, మా మధ్య తూర్పు, పడమర అనే సరిహద్దులను కరిగించేస్తుంది.

అవునని ఒప్పుకుంటూ నవ్వి, ఆమె ఏ తెగకు చెందిందో అడుగుదామని అనుకుంటుండగా ఆమె రిసీట్‌ చించుతూ, ”రిసీట్‌ కావాలా” అని అడిగింది.

మొదట ఒద్దని తల ఆడ్డంగా ఊపి, వెంటనే అన్నాను, ”ఓ, రిసీట్‌ కావాలి. మీ ఊరొచ్చిన గుర్తుగా పెట్టుకుంటాను”.

అంతవరకూ నవ్వుతూ ఉండిన ఆమె ముఖం గంభీరంగా మారిపోయింది. ”వెళ్ళిన ప్రతిచోటా ఇట్లాంటి గుర్తులు తీసుకెళ్తారా” అని అడిగింది.

ఆమెలో ఆ మార్పు నాకు ఆశ్చర్యం కలిగించింది.

”లేదు”, ఒప్పుకున్నాను. ”మీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఇలా ప్రయాణమై వచ్చాను”.

”మా గురించి ఏం తెలుసు మీకు?”

”ఎక్కువగా తెలీదు. మీదైన ‘లాంగ్‌ వాక్‌’ గురించీ, ‘కోడ్‌ టాకర్స్‌’ గురించీ తెలుసు. భూమినీ, సమస్తాన్నీ గౌరవిస్తారని తెలుసు. మీ గురించీ, మీ సంస్కృతి గురించీ మా వాళ్ళకు చెప్పాలన్నది నా ఉద్దేశం. మీ గురించీ ఏ పుస్తకాల్లోనో చదవడం కంటే నాకు నేనే తెలుసుకోవాలని వచ్చాను”.

”లీత్సో తెలుసా?”

”తెలుసు” నాకు తెలిసిన న్యావహో గాధ ఆమెకు చెప్పాను. ”లీత్సో భూమి లోపల ఉన్నంతవరకూ అంతా బాగానే ఉంటుంది కదూ?”

ఆమె అసహనంగా కదిలింది, ”లీత్సో బయటపడి ఎన్నో ఏళ్ళయింది”.

”అంటే?”

”లీత్సో ఇప్పుడు మా నీళ్ళల్లో, మా పంటల్లో, మా పశువుల్లో, మా ఇళ్ళల్లో, మాలో, మా భావితరాల్లో ఉంది”.

ఒక్కసారిగా భూమి కంపించినట్లయింది. ”యురేనియం” అని మాత్రమే అనగలిగాను. రేడియో యాక్టివ్‌ అయిపోయిన నేల, నీళ్ళు, పశువులు, మనుషుల గురించి ‘పీటర్‌ లఫార్జ్‌’ రాసి, పాడిన పాట ‘రేడియో ఆక్టివ్‌ ఎస్కిమో’ గుర్తొచ్చింది.

”అవును. ఆ పెనుభూతం పేరు మా భాషలో లీత్సో, ప్రపంచానికి యురేనియం”.

నా వెనకాల ఇంకో కస్టమర్‌ వచ్చేసరికి ఆమెకు ధన్యవాదాలు తెలిపి దుకాణం బయటకు నడిచాను.

లీత్సో గాధ తెలిసినా ఆ కథకూ, న్యావహో రిజర్వేషన్లో జరిగిన, జరుగుతున్న దారుణాలకూ లింక్‌ పెట్టలేకపోయాను. అక్కడే ఆగి ఆమెతో ఇంకాస్త మాట్లాడాలని అనిపించింది కానీ అప్పటికే మధ్యాహ్నం మూడయింది. ఆ రోజుకి నా గమ్యస్థానం ఇంకా ఐదు గంటల దూరంలో ఉంది.

కొండా కోనల మధ్య రోడ్డు ఎలా ఉంటుందో తెలియదు. రిజర్వేషన్‌లో చాలాచోట్ల ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది. ఏదైనా చిన్న ఊర్లోకి ఎంటర్‌ అయ్యే ముందు దాకా రోడ్డు బాగానే ఉంటుంది. ఊరి గుండా వెళ్తున్నప్పుడు మాత్రం రోడ్డు మీద విపరీతమైన గతుకులుంటాయి. టైర్‌ పంక్చర్‌ అవుతుందేమో అనిపిస్తుంది. కనీసం మూడు గంటల్లో రిజర్వేషన్‌ దాటకపోతే ఆ తరువాత మెదడులో ఓ మూల గుచ్చుకునే భయాన్ని భరించడం కష్టమనిపించింది. ‘ట్యూబా సిటీ’ దాటగానే కార్లు పలుచనయ్యాయి. ఓ పది మైళ్ళ లోపల రోడ్డంతా నాదే అయిపోయింది. కారును వేగంగా పోనిచ్చాను. నీలాకాశంలో మసక చంద్రుడు రాళ్ళ గుట్టల తలల మీద పింఛంలా

ఉన్నాడు. అక్కడక్కడా రోడ్డు గుట్టలెక్కుతూ, మలుపులు తిరుగుతూ లోయల్లోకి తొంగి చూస్తోంది. గుట్ట ఎక్కినప్పుడు దూరాన విసిరేసినట్లు ఇళ్ళు కనిపిస్తున్నాయి. అంతటి ఆలోచనల్లోనూ మనసును తొలుస్తూనే ఉంది లీత్సో.

న్యావహో భాషలో పెనుభూతాన్ని ‘నీయా’ అంటారు. నీయాను అదుపులో పెట్టాలంటే దాన్ని అర్ధం చేసుకుని దానికి ఒక పేరు పెట్టాలన్నది వారి నమ్మకం. పసుపు పొడి భూతాన్ని లీత్సో అని పేరు పెట్టారు. ఇంతకీ లీత్సో అంటే ‘మనుగడకు అడ్డు పడేది’ అని అర్ధం.

సూర్యుడు పడమటింట పూర్తిగా మునిగిపోయాడు. మసక వెల్తురులో ‘గ్యాలప్‌’ అనే ఊరి దగ్గరికి వచ్చాక, ఇకపై చీకటిలోనే ప్రయాణించాల్సి ఉంటుందని తేలిపోయింది. కాలాన్ని తరమడం ఆపి, రహదారి పక్కగా ఉన్న గ్యాస్‌ స్టేషన్‌లోకి కారు మళ్ళించాను. అక్కడున్న షాపు పక్కన కారు ఆపవచ్చో లేదో అర్థం కాలేదు. పక్కనే ఒక పెద్దాయనను అడిగాను. ఆయన నవ్వేసి, ”ఇక్కడ మరీ ఎక్కువ కార్లు రావు. ఈ పక్కన ఆపుకోవచ్చు” అంటూ గులకరాళ్ళు పరిచి ఉన్న ఒక చోటును చూపించాడు. కారు పార్కు చేసి షాపులోనికి నడిచాను.

ఏం కొనాల్సిన అవసరం లేదు గానీ, ఎవరితోనైనా మాట్లాడవచ్చని అనిపించింది. షాపులో ఒక పది పన్నెండేళ్ళ అమ్మాయి ఒక కీ చెయిన్‌ బొమ్మను కొనిపించమని వాళ్ళ అమ్మ దగ్గర మారాం చేస్తోంది. ఇంకో ఇద్దరు చిన్న పిల్లలు ఆమె పక్కనే ఉన్నారు. ”ఖరీదు ఎక్కువ ఉండొచ్చు. వద్దు” అని ఆమె అన్నది. ”ఇప్పుడిప్పుడే ఇంకేమీ అడగను. ఇదొక్కటే కొనివ్వు” అని బతిమాలింది ఆ అమ్మాయి. తల్లి ఏం సమాధానం చెప్పకుండా బయటకు నడిచింది. ఆ అమ్మాయి ఆ బొమ్మను అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది. నిజానికి ఐదు డాలర్లకంటే ఎక్కువ ఖరీదు చెయ్యదు ఆ బొమ్మ. ఆ బొమ్మను కొనివ్వాలని అనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాను కూడా. కానీ తల్లీ కూతుళ్ళ మధ్యకు వెళ్ళకూడదనిపించింది. ఎంత కష్టం అనిపించినా తన కూతురికి ఒక పాఠం నేర్పించడంలో భాగమయ్యుండొచ్చు. అలా కాకపోయినా ఆ పాప ముందు తల్లిని తక్కువ చేసినట్లు అవుతుందని అనిపించింది. ఇక అక్కడ ఉండబుద్ది కాక బయటకు నడిచాను.

ఇంతకుముందు నన్ను పలకరించిన పెద్దాయన తలుపుదగ్గరే నిలబడి నన్ను చూస్తున్నాడు. ”మంచి పని చేశారు. బొమ్మను కొనిస్తారనే అనుకున్నాను”. నన్ను ఆయన అలా చదివెయ్యడం వింతగా అనిపించింది.

”మీతో కాసేపు మాట్లాడొచ్చా?” గుండె వేగంగా కొట్టుకుంటుండగా అడిగాను. ఆయన నన్ను విచిత్రంగా చూశాడు.

”ఇటు వైపు నా రోడ్‌ ట్రిప్‌లా బయల్దేరాను కానీ, ‘ట్యూబా సిటీ’లో ఒక అమ్మాయితో మాట్లాడాక నా ఆలోచనలే మారిపోయాయి. ఈ ప్రాంతం గురించి, అంటే మీ గురించి ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉంది” అన్నాను.

”తెలుసుకుని ఏం చేస్తారు?” నా కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడాయన, పక్కన ఉన్న బెంచీ వైపు ‘కూర్చుందామని’ సైగ చేస్తూ.

ఏం చెప్పాలో తోచలేదు. అవును, తెలుసుకుని ఏం చేస్తాను? పర్యావరణం గురించిన ప్రొటెస్ట్‌ మార్చ్‌ల్లో పాల్గొంటానా? నేను తెలుసుకున్నది నలుగురితో పంచుకునేందుకు వ్యాసాలూ, కథలూ రాస్తానా? ఏమో! ఏం చేస్తానో తెలియదు. ఎక్కడనుంచో వచ్చి ఈ దేశంలో స్థిరపడ్డ నాకు ఈ భూమికి చెందిన మూలవాసుల గురించి కొంతైనా తెలుసుకోవడం అవసరం అనిపించింది. ఆయనతో అదే అన్నాను.

”సరే. ఏం తెలుసుకోవాలి మీరు?”

”మిమ్మల్ని బాధపెట్టే విషయమే. యురేనియం గురించి చెప్పండి. అంటే, రెండవ ప్రపంచ యుద్ధం నుంచి…”

కొన్ని క్షణాలు ఆలోచనలు కూడదీసుకుంటున్నట్లు ఆగాడాయన. ”రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మా రిజర్వేషన్‌లో ‘వెనేడియమ్‌’ అనే ఖనిజం కోసం తవ్వకాలు జరపనివ్వాలని మా నాయకులను ప్రభుత్వం అడిగింది. ఈ ఖనిజాన్ని స్టీలుతో కలిపి యుద్ధ నౌకలకు గట్టి కవచాలను తయారు చేస్తారన్న విషయం అప్పటికే మా వాళ్ళకు తెలుసు. మా సంరక్షకుడికి మరోసారి సహాయం చెయ్యాలని నిర్ణయించుకుని ‘వెనేడియం’ గనుల్ల్లోకి వెళ్ళారు. మా ‘సంరక్షకుడు’ మాకు చెప్పకుండా దాచిన విషయమేంటంటా, ‘వెనేడియం’తో పాటు అదే రాళ్ళల్లో

ఉండే యురేనియం మీద కూడా వాళ్ళ దృష్టి ఉందని. యురేనియం పేరు చెబితే మా జనం బాధపడతారని కాదు. యురేనియం గురించి అప్పటికి మాకు ఏమీ తెలీదు. కానీ ‘సంరక్షకుడికి’ తెలుసు. యురేనియం వల్ల కలిగే ఆహార సమస్యల గురించీ, పర్యావరణ కాలుష్యం గురించీ ఆమెరికా ప్రభుత్వానికీ, తవ్వకాలు జరపడానికి మంచి అవగాహన అప్పటికే ఉంది.

హిరోషిమా, నాగసాకి నగరాల మీద ఆటంబాంబులు వేసి యుద్ధం గెలిచిన తర్వాత మరో రకమైన యుద్ధం మొదలైంది. అదే, రెండు అగ్ర రాజ్యాల మధ్య దశాబ్దాల కొద్దీ జరిగిన ప్రచ్ఛన్న యుద్ధం, మారణాయుధాల కోసం పరుగు పందెం.

అప్పట్నుంచి యురేనియం కోసం బహిరంగంగానే తవ్వకాలు జరగడం మొదలయింది. ఈ నేల గురించి బాగా తెలిసిన మా వాళ్ళకు యురేనియం ఎక్కడెక్కడ దొరుకుతుందో చూపెడితే డబ్బులు ఇస్తామని ఎర చూపారు. ఇంతకీ యురేనియం ఉన్న ప్రదేశాలను కనుక్కున్న వాళ్ళకు, ఆ ప్రైజ్‌ డబ్బులు ఇవ్వలేదు గానీ వాళ్ళకు గనుల్లో పర్మనెంటు ఉద్యోగాలైతే ఇచ్చారు. ఎన్నో ఇతర తెగలు ఆదాయం కోసం ‘కసీనో’ల మీదా, ‘గాంబ్లింగ్‌’ మీద ఆధారపడతాయి. కానీ ఆ కాలంలో న్యావహో రిజర్వేషన్‌లో కసీనోలు లేవు. న్యావహో ప్రజలు జీవిక కోసం ఎక్కువగా తమ నేలమీదే ఆధారపడేవారు. మొక్కజొన్న, బీన్స్‌ లాంటి పంటలు పండించుకోవడం, గొర్రెల పెంపకం మీద ఆధారపడేవాళ్ళం. చాలామంది రైలు పట్టాలు వేసే పనిమీదా, నగరాల్లో పనిమీదా ఎంతో దూరం ప్రయాణించేవాళ్ళు. ప్రభుత్వ ‘యురేనియం’ దాహానికి తవ్వకాలు ముమ్మరంగా మొదలైనప్పటికీ తమ కుటుంబంతో కలిసి ఉంటూ డబ్బులు కూడా బాగా వచ్చే గనిలో పనిని సంతోషంతో ఆహ్వానించాం”.

”మరి వందల ఏళ్ళ కొద్దీ పెద్దవాళ్ళు ‘లీత్సో’ గురించి భావితరాలకు చెప్తూనే ఉన్నారు కదా. ఇప్పుడెందుకు మీ వాళ్ళెవరూ ప్రజలను హెచ్చరించలేదు?”

కొంతమంది పెద్దలు ఆ తవ్వకాలను మొదట్లోనే అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కానీ వారిని ఎవరూ పట్టించుకోలేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో కొత్త ప్రపంచం పరిచయమైన ఎంతోమంది యువకుల మాటలనూ, ‘సంరక్షకుడి’ మాటలనూ, కంపెనీల మాయ మాటలనూ నమ్మిన ఎంతోమంది యువకులు ‘లీత్సో’ ఒక గాధ మాత్రమేనని కొట్టిపడేసారు. తవ్వకాల వల్ల తమ భూమికి నష్టం వాటిల్లుతుందేమోనని అనుమానించిన కొంతమందిని కూడా ”భూమిని ఏ స్థితిలో తీసుకున్నారో అదే స్థితిలో తిరిగి ఇస్తామ”ని కంపెనీలూ, ప్రభుత్వమూ మాట ఇచ్చిన తరువాత తవ్వకాలు జరగకుండా ఆపడానికి మా వాళ్ళకు ఎలాంటి కారణాలూ కనిపించలేదు.

1940ల్లో మొదలై 1980ల దాకా 1000కి పైగా ‘యురేనియం’ గనులు ‘రిజర్వేషన్‌’ అంతటా ఏర్పడ్డాయి. దాదాపు ఐదు వేలమంది న్యావహో జనం ఆ గనుల్లో పనిచేశారు. వెసులుబాటుగా ఉంటుందని ఎంతో మంది తమ కుటుంబాలని తాము పనిచేసే గనుల దగ్గరికి తరలించారు. 1960ల దాకా గని కార్మికులకు సరైన రక్షణ పరికరాలు కానీ, దుస్తులు కానీ ఉండేవి కాదు. రేడియేషన్‌ గురించి ఏ మాత్రం అవగాహన లేని ఆ కార్మికులు దుమ్ము పట్టిన దుస్తులూ, బూట్లతోనే ఇళ్ళకు వెళ్ళేవారు. ఇళ్ళ దగ్గర వారి భార్యలు ఆ దుస్తులను ఇతర దుస్తులతో కలిపి ఉతికేసేవారు. పిల్లలు గనుల బయట ఆడుకునేవారు. ‘టైలింగ్‌ పాండ్ల’లో ఈతలు కొట్టేవారు. వాళ్ళు పెంచుకునే గొర్రెలను ఆ చుట్టు పక్కలే మేతకు తీసుకెళ్ళేవారు.

గని పనిలో పేల్చినప్పుడు ముక్కలైన రాళ్ళతో ఇళ్ళు కూడా కట్టుకున్నారు. మట్టిలో కలిసిన పసుపు పొడిని మంచి సిమెంటులా తయారు చేసుకుని, ఇళ్ళల్లో నేలను చదునుగా, నున్నగా చేసుకోవడానికి ఎన్నో ఇళ్ళల్లో ఉపయోగించారు. గనులకు దూరాన ఉంటున్న తమ బంధువుల కోసం కూడా ఆ రాళ్ళనూ, మట్టినీ ట్రక్కుల్లో తోలుకెళ్ళారు.

తవ్వకాలకు పూర్వం, మా జనంలో ‘క్యాన్సర్‌’ రోగాలు ఉండేవి కాదు. అదొక మెడికల్‌ మిరకిల్‌ అని రిసెర్చర్లూ, డాక్టర్లూ భావించేవారు. ‘యురేనియం’ తవ్వకాలు మొదలైన పదేళ్ళకు పరిస్థితి తారుమారైంది. ఎంతోమంది గని కార్మికులు కడుపు నొప్పితో బాధపడుతూ చనిపోవడం మొదలైంది. మాలో ఒక అలవాటు, ఒక ‘సంస్కృతి’లా ఉంది. అదే గంభీరత! నోటిలోంచి వచ్చే ప్రతి మాటా అత్యవసరమైనదై ఉండాలనీ, బాధలు చెప్పుకోకూడదనీ అనుకుంటాం. ఎంతోమంది అలా మౌనంగా బాధ భరిస్తూ, తమ బాధకు కారణాలు తెలియకుండానే చనిపోయారు.

కొన్నేళ్ళ తర్వాత భర్తలను పోగొట్టుకున్న భార్యలు కొంతమంది చుట్టుపక్కల మగవారు ఎక్కువ సంఖ్యలో చనిపోవడాన్ని గమనించి అప్పుడు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చాలామంది కడుపు నొప్పితోనో, శ్వాసకోశ వ్యాధులతోనో చనిపోయారని ఆ సంభాషణల ద్వారా తెలుసుకున్నారు. ఆ కడుపునొప్పికి కారణం కడుపులో వచ్చిన క్యాన్సర్‌ అని వారికి త్వరలోనే అర్థమయింది. మరి కొంతమంది ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడి చనిపోయారని తెలుసుకున్నారు.

కొంతమంది పిల్లలు అంగవైకల్యంతో పుట్టడమో, మొదట సరిగ్గానే పుట్టి కొన్నేళ్ళలోనే కాళ్ళూ చేతులూ వంకర్లు తిరిగిపోవడమో మొదలయ్యింది. ఆ పరిణామాన్ని మొదట చూసిన డాక్టర్లకు ఏం జరుగుతోందో అంతుబట్టక, అది న్యావహో తెగకు సంబంధించిన వ్యాధి అని నిర్ధారించి, దానికి ‘న్యావహో న్యూరోపతి’ అనే పేరు కూడా పెట్టేశారు. అయితే కొన్ని సంవత్సరాలకు తెల్సిన విషయమేంటంటే గర్భవతులైన ఆడవాళ్ళు గొర్రెలను మేతకు తోలుకెళ్ళినపుడో, మరో పనిమీదనో ఇంటికి దూరంగా వెళ్ళినపుడు దాహమేస్తే, తరతరాలుగా మా పూర్వీకులు చేసినట్లే, నీటిగుంటల్లో దొరికిన వాన నీటిని తాగారు. నీటి గుంటలు ఇంతకు ముందు ఎంతో అరుదుగా కనిపించేవి. గనుల కోసం జరిగిన పేలుళ్ళ వలన భూమిలో ఎక్కడ బడితే అక్కడ గుంతలు ఏర్పడి వాన నీరు నిలువ ఉండడం మొదలైంది. ఆ కొత్తదనాన్ని ఏ మాత్రం సందేహించని ఆ మహిళలు తాము ఆ నీళ్ళు తాగడంతో పాటు, గొర్రెలకూ ఆ నీరు తాగించారు. అయితే ఆ నీళ్ళు యురేనియంతో కలుషితమైన నీళ్ళు. కొత్తగా పుట్టిన గొర్రె పిల్లలు గుడ్డిగానో, ఒక కాలు లేకుండానో పుడితే గాలి సోకిందేమోనని షామాన్‌తో ఆ గొర్రెలకు ‘సీడర్‌ పొగ’ పట్టించడం లాంటి పూజలు చేశారు గానీ ఆ నీళ్ళను అనుమానించలేదు.

1979 జులై నెలలో ఒకరోజు తెల్లవారుఝామున ఇక్కడికి దగ్గర్లోని ‘చర్చ్‌ రాక్‌’ అనే ఊరి జనం వరద శబ్దానికి మేలుకున్నారు. ఉత్తరాన ఎక్కడో పెద్ద వర్షం పడడం వల్ల ఊరికి పక్కనే ఉన్న ”పుయెర్కో” నది నిండి వరద వస్తోందని అనుకున్నారు. కానీ ఆ వరదలో వాన ప్రమేయం లేదు. ‘యునైటెడ్‌ న్యూక్లియర్‌’ అనే కంపెనీ ఏర్పరచిన డ్యాముకు పెద్ద గండి పడి, దాదాపు 90 మిలియన్‌ గాలన్ల రేడియో ఆక్టివ్‌ ద్రవం టైలింగ్‌ పాండ్‌ లోంచి బయటపడి ”పుయెర్కో” నదిలో కలిసింది. ఆ నీరు పారినంత మేరా పంట పొలాల్లో తెల్లగా పేరుకుపోయింది. పశువులు చచ్చిపోయాయి. దాదాపు యాభై మైళ్ళ దిగువదాకా రేడియేషన్‌ తరంగాల ప్రభావం కనిపించింది. ‘పెన్సిల్వేనియా’ రాష్ట్రంలోని ‘త్రీ మైల్‌ న్యూక్లియర్‌ రియాక్టర్‌’ తృటిలో తప్పించుకున్న ప్రమాదం గురించి మీరు వినే ఉంటారు. ప్రపంచానికీ, అమెరికా సామాన్య జనానికీ దాని గురించి కొంచెమైనా తెలుసు గానీ, ఈ పెను ప్రమాదం గురించి ఎవరికీ తెలియదు. ప్రమాదం సంభవించిన వెంటనే ఆ నీళ్ళు తాగకూడదని ‘చర్చ్‌ రాక్‌’ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం హెచ్చరికలు పంపింది కానీ, ప్రజలకు తగినంత మంచి నీటిని సరఫరా చెయ్యలేదు. ఆ ప్రమాదం జరిగిన కొన్నాళ్ళకు కొంతమంది పిల్లల్లో రేడియేషన్‌ ప్రభావం ఉందేమోనని పరీక్షించారు, కానీ వాళ్ళను తిరిగి పరీక్షించలేదు. రేడియేషన్‌ ప్రభావం కొన్నాళ్ళకో, కొన్నేళ్ళకో గానీ కనిపించదు.

ఘోర ప్రమాదం జరిగిన రెండేళ్ళకు అక్కడి యురేనియం గనిని మూసివేశారు. మూసివేతకు ఆ ప్రమాదం కారణం కాదు. అమెరికా ప్రభుత్వం దగ్గర యురేనియం నిల్వలు ఎక్కువైపోయి, తదుపరి తవ్వకాల అవసరం లేకపోయింది. అలా ఎన్నో గనుల్లో తవ్వకాలు ఆగిపోయాయి. తవ్వకాలు ఆగిపోయాయంటే, గనులను మూసివేశారని అనుకుంటారేమో! మూసివేయకుండా ఎక్కడ పనిని ఎక్కడికక్కడ ఆపివేశారు. అట్లా వదిలేయబడిన గనులు 500కు పైగా మా రిజర్వేషన్‌లో ఉన్నాయి”.

”మీ న్యావహో ప్రజలు రేడియేషన్‌ ప్రభావానికి గురైనంతగా హోపీ ప్రజలు గురవలేదు. ఎందువల్ల? లేక నేను విన్నది సరైనది కాదా?”

”మీరు సరిగ్గానే విన్నారు. యురేనియం తవ్వకాల కోసం ప్రభుత్వం హోపీ తెగను కూడా అడిగింది. కానీ వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. నేల తల్లి మీద మాకంటే వాళ్ళకు ఎక్కువ ప్రేమ

ఉన్నట్టుంది. కానీ వాళ్ళ గాలీ, నీరూ పరిశుద్ధంగా ఏమీ లేవు. మా దురాశ వాళ్ళను కూడా కష్టపెట్టింది. మీరు ఈ దారిలో వస్తున్నప్పుడు చూసి ఉండవచ్చు. ఇక్కడంతా దుమ్మూ, మట్టి దిబ్బలూ, చిన్ని పొదలు ఎక్కువ. రేడియేషన్‌ నిండిన గాలీ, దుమ్మూ వాళ్ళవైపు కూడా మళ్ళింది. రేడియేషన్‌ ప్రభావం వాళ్ళమీద కూడా కొంత ఉంది.

”ఇన్ని క్యాన్సర్‌, న్యూరోపతి మరణాలు, అంగ వైకల్యం వంటి సమస్యలన్నీ రేడియేషన్‌ ప్రభావం వలన అని తేలినప్పుడు గని కంపెనీలూ, ప్రభుత్వం గని కార్మికులకు డబ్బు చెల్లించింది కదా?”

”కొంతమందికి డబ్బు అందింది. కానీ గని కార్మికులకు మాత్రమే. ఆ కార్మికులతో కలిసి

ఉండిన కుటుంబ సభ్యులు కూడా క్యాన్సర్‌, రెస్పిరేటరీ ఫెయిల్యూర్‌ లాంటి రోగాల బారిన పడ్డారు. వాళ్ళ మాటేమిటి? గని కార్మికులకు కూడా అందరికీ కాంపెన్సేషన్‌ అందలేదు. ఇక కంపెనీలైతే కొన్ని మూతబడి నామరూపాలను మార్చుకునో, ఇతర కంపెనీలలో కలిసిపోయి కొత్త కంపెనీలుగా అవతారమెత్తాయి. కొన్ని కంపెనీలు దివాళా ఎత్తేశాయి”.

”ఈ ప్రాంతాన్ని చూస్తుంటే ఇండియాలో మా ఊరు గుర్తొస్తోంది. అక్కడంతా ఎర్ర దుమ్ము. పంటలు పండుతాయి కానీ అక్కడంతా పేద రైతులూ, నిరుపేద కూలీలే ఎక్కువ. ఎడారిలా అనిపిస్తుంది. ఇక్కడ మీకు నీళ్ళు బాగానే దొరుకుతాయా?”

”గనులకు ముందు కూడా కొంచెం నీటి కొరత ఉండేది. కానీ వాన నీటి గుంటల ద్వారా, వాగుల ద్వారా ఎలాగోలా అందరికీ నీళ్ళు దొరికేవి. బొగ్గు, యురేనియం లాంటి గనుల కోసం, వాటిని ప్రాసెస్‌ చేసే ప్లాంట్ల కోసం మాకు దొరికే కొద్ది నీటిని కూడా తరలించారు. ఇక మిగిలిన నీళ్ళు రేడియేషన్‌తో కలుషితమయ్యాయి. నీళ్ళు పట్టుకోవడానికి మైళ్ళకొద్దీ ప్రయాణించాల్సిన అవసరం చాలా మందికి ఉంది. ఒక కుటుంబం రోజుకు ఓ పది గ్యాలన్ల నీళ్ళు మాత్రమే ఉపయోగించాల్సిన అవస్థ మా రిజర్వేషన్‌లో చాలా మందికే ఉంది. రేడియేషన్‌ నీళ్ళ వల్లా, నల్లగా మారిన నీళ్ళవల్లా కొన్ని స్కూల్స్‌ ఇప్పటికే మూత పడుతున్నాయి.”

”ఈ ప్రశ్నలతో మిమ్మల్ని కష్టపెట్టాను. క్షమించాలి.”

”మా న్యావహో తెగకు మరో స్వభావం ఉంది రెలిజియన్స్‌ మా స్వభావాల్లో నిండిపోయింది. ఎన్నో అడ్డంకులను దాటుకుని ఇక్కడిదాకా వచ్చాం. ఇంకా ఎన్ని అడ్డంకులున్నా, మా మనుగడ సాగిపోతూనే ఉంటుంది. ఇంకో విషయం ఇక్కడ మళ్ళీ కొత్తరకం యురేనియం తవ్వకాలు మొదలుపెట్టాలని చూస్తున్నారు తెలుసా?” బెంచీమీద నుంచి లేస్తూ అడిగారాయన.

”లీచ్‌ మైనింగ్‌?” నేను కూడా లేచాను.

”అవును. ఉన్న కొద్ది ఆక్సిజనూ, సోడియం బైకార్బనేట్‌నూ కలిపిన నీళ్ళను కొన్ని వేల అడుగుల లోతు భూమిలోకి పంపి, యురేనియం కలిసి ఉన్న ద్రావకాన్ని బయటకు తోడుతారట. ఇది చాలా సురక్షితమైన ప్రాసెస్‌ అని మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ముందు ఇప్పటిదాకా నాశనం చేసిన భూమిని సరిచెయ్యండి అని మేం గట్టిగా చెప్తున్నాం. మా తెగ నాయకత్వం కూడా ఇదే మాటమీద పట్టుదలతో ఉంది. ఎప్పుడైనా అసహాయంగా అనిపిస్తుంది కానీ, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రేడియేషన్‌తో నిండిన ఇళ్ళను పెకిలించి కొత్తవాటిని కట్టించుకున్నాం. మా పోరాటాలతో కొంతమందికైనా కాంపెన్సేషన్‌ వచ్చింది. ఈ కొన్ని విజయాలతోనే ఉత్సాహంగా ఉన్నాం. పోరాటం చెయ్యాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. కంపెనీలూ, ప్రభుత్వమూ మాలోంచి ఇంకా ఎంత ప్రాణాన్ని పిండుకోవాలా అని చూస్తున్నాయి. మేమూ, మా ముందు తరాలూ వీళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండాలి. లీత్సోను బయటకు రప్పించాం. మా అజాగ్రత్తకు ఫలితాలను ఇంకొన్ని తరాలదాకా భరించాల్సిందే”.

నాతో అంత సమయం గడిపినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుని బయల్దేరాను.

చీకట్లో కారు లైట్ల వెలుతురులో ముందున్న రోడ్డు మాత్రమే కనిపిస్తోంది. రోడ్డుకు ఇరువైపులా గుట్టలూ, పొదలూ కనిపించడంలేదు గానీ వాటి ఉనికి తెలుస్తూనే ఉంది. ‘చర్చ్‌ రాక్‌’ను దాటాక హఠాత్తుగా ట్రాఫిక్‌ ఎక్కువైంది. న్యూ మెక్సికో రాష్ట్రంలోని అల్బుకర్కీ నగర శివార్లలో ఉన్న హోటల్లో ఆ రాత్రి గడిపి, పొద్దున్నే లేచి ఆ ప్రయాణంలో చివరి మజిలీ అయిన మెస్కలెరో నగరం వైపు బయల్దేరాను.

మెస్కలెరోలో ఆగలేకపోయాను. ఏదో ఉత్సవం జరుగుతున్నట్లుగా ఉందక్కడ. అక్కడికి వెళ్ళాక తెలిసింది. ఐస్‌ స్కేటింగ్‌ రిజార్ట్‌ అది. మెసలేరో అపాచీలను మరోసారి వచ్చినప్పుడు కలవాలని నిర్ణయం తీసుకుంటూ టెక్సస్‌ రాష్ట్రంలోని ఎల్‌ పాసో నగరం వైపు బయల్దేరాను.

సగం దూరం రాగానే అలమగోర్దో నగరం కనిపించింది. ఆ నగరం చుట్టుపక్కలే మొట్టమొదటి ఆటంబాంబును పరీక్షించారు. ఆ ఆటంబాంబుకూ, హిరోషిమా, నాగసాకిల మీద వేసిన ఆటంబాంబులకు ముడిసరుకైన యురేనియం న్యావహో గనుల నుంచి వచ్చిందే. నిన్న మాట్లాడిన పెద్దాయన అన్న చివరి మాటలు గుర్తొచ్చాయి. ”ఆటంబాంబు ప్రభావం జపాన్‌ ప్రజలమీద హఠాత్తుగా వచ్చిపడితే, స్లో పాయిజన్‌లాగా కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని నాశనం చేస్తోంది”.

… … …

లీత్సో తన పొడవాటి టెంటకిల్స్‌తో భారతదేశాన్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. జాదూగడలో ‘టైలింగ్‌ పాండ్స్‌’కు గండి పడి నీళ్ళు బయటపడి, రేడియేషన్‌ బారినపడిన ఎన్నో కేసులు చూసిన తర్వాత కూడా, కడప జిల్లా తుమ్మలపల్లిలో మరో యురేనియం గనినీ, ప్రాసెసింగ్‌ యూనిట్‌నూ 2012లో ప్రారంభించారు. ఈ మధ్యే టైలింగ్‌ నీరు చుట్టుపక్కల ఉన్న కొన్ని పొలాల్లోకి పారి తెల్ల లవణాలతో నిండిన నీరు చాళ్ళు చాళ్ళుగా ఎర్ర మట్టిలో కలుస్తోంది. కొన్ని పశువులు చనిపోయాయి. చుట్టుపక్కల ఊర్ల ప్రజలకు తలనొప్పులూ, శరీరమంతా కాలిన గుర్తులు కనిపిస్తున్నాయి. పంటలు కూడా సరిగ్గా పండడం లేదు. అరటి తోటల్లో ఎన్నో అరటిమొక్కలు ఎదుగుదల లేకుండా చిన్న మొక్కలుగానో, ఎండిపోవడమో జరుగుతోంది. అప్పులు చేసి పంటలు వేసుకున్న రైతులు ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. తుమ్మలపల్లి చుట్టూ కొన్ని పదుల మైళ్ళ దూరంలోనే ప్రొద్దుటూరు, పులివెందుల వంటి కొన్ని ముఖ్య పట్టణాలు

ఉన్నాయి. యురేనియం గనులు దూరంగా ఉన్నాయని ఈ పట్టణాల్లో ప్రజలు ధైర్యంగా ఉండవచ్చు. ఇక్కడ గాలి దుమారాలు ఎక్కువ. ఒకచోట ఆవిరి నింపుకున్న మేఘాలు మరోచోట వర్షిస్తాయి. గాలికీ, నీటికీ, మేఘాలకూ యాభై మైళ్ళ ప్రయాణం ఓ లెక్క కాదు. ప్రపంచీకరణకైతే భూమి చుట్టు కొలత కూడా లెక్క కాదు. రేడియేషన్‌ ప్రభావంలో ఉన్న పొలాల్లో పండిన పంటలు ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళవచ్చు. మన చుట్టుపక్కల ఉన్న గనులనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఈ తవ్వకాలు జరగకుండా ఆపాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది.

ఒక్క యురేనియం మైనింగ్‌ అనే కాదు. మన తిండీ, బట్టా, నీడకు అవసరమైన వాటినన్నింటినీ భూమి మనకు ఇవ్వగలదు. ఈ భూమికి తెలిసింది ఇచ్చుకోవడం. కేవలం పుచ్చుకోవడం తెలిసిన మనం మనతోపాటు ఈ భూమినే సర్వనాశనం చేస్తున్నాం. న్యావహో తెగ సభ్యుడూ, యురేనియం మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘క్లీ బెనెల్లి (Klee Belly)’ అన్నట్లు, ప్రకృతితో యుద్ధంలో ఎవరు విజేత అన్న ప్రశ్న మనందరం వేసుకోవాలి. ఆ ప్రశ్నకు జవాబు మనకు తెలిసిందే!!!

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో