ఏమిటి ఈయన ప్రత్యేకత – గొల్లపూడి మారుతీరావు

రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీకాంతరావు. రేడియో సంగీతానికి ఆయన ఒక శయ్యను రూపుదిద్దారు.

నేను ఆలిండియా రేడియోలో చేరేనాటికి నాకు 23 సంవత్సరాలు. రజనీగారికి 43. నా ముందు మహానుభావులైన ఆఫీసర్లు – బాలాంత్రపు రజనీకాంతరావు, యండమూరి సత్యనారాయణరావు, దాశరథి, బుచ్చిబాబు – ఇలా. ఇక పండిత ప్రకండుల బృందం ఆ తరానికే మకుటాయమానం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, స్థానం నరసింహారావు, మునిమాణిక్యం నరసింహారావు, నాయని సుబ్బారావు, బందా కనకలింగేశ్వరరావు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, డాక్టర్‌ జీవీ కృష్ణారావు – ఈ జాబితా అపూర్వం. వీరందరూ తేలికగా మాకంటే 30-35 సంవత్సరాలు పెద్దవారు. ఓ తరాన్ని జాగృతం చేసిన అద్భుతమైన ప్రక్రియలకు ఆద్యులు.

భారతదేశంలోని అన్ని ప్రక్రియలకు తగిన ప్రాధాన్యం కల్పించాలనే దురాశతో – ఆయా రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వృద్ధులందరినీ రేడియోలోకి ఆహ్వానించారు పెద్దలు. వీరెవరికీ మాధ్యమం మీద ఒడుపు గాని, అవగాహన గానీ, తర్ఫీదు గానీ లేనివారు. రిటైరై పెన్షన్‌ పుచ్చుకుంటున్న మహానుభావులు. ఆ మాటకొస్తే మాకే ఇంకా తర్ఫీదు లేదు. ఉద్యోగంలో చేరిన ఒక్కొక్క బ్యాచ్‌ను ఢిల్లీ పంపుతున్నారు. ఇదొక రకమైన అవ్యవస్థ. అయితే ‘అసమర్ధత’ తెలుస్తోంది, మార్గం తెలియడంలేదు.

ఈ దశలో మాకంటే కేవలం 12 సంవత్సరాల ముందు – ఒక కార్యశూరుడు – మాధ్యమం అదృష్టవశాత్తూ దక్షిణాది ప్రసార మాధ్యమంలో అడుగుపెట్టారు. ఆయన పేరు బాలాంత్రపు రజనీకాంతరావు.

ఆ రోజుల్లో మద్రాసు రేడియో స్టేషన్‌ అంటే తెలుగువారి పుట్ట. 1941లో చేరిన రజనీకాంతరావుగారు 1947 ఆగస్టు 14 అర్థరాత్రి అటు పార్లమెంటులో నెహ్రు ఈ దేశ స్వాతంత్య్రాన్ని గురించి ఉపన్యాసం ఇస్తుంటే ఇక్కడ – మద్రాసులో కేవలం 26 ఏళ్ళ యువకుడు 1947 ఆగస్టు 15 తెల్లవారుజామున ఎలుగెత్తి ‘మ్రోయింపు జయభేరి’ అని నగారా మ్రోయించారు.

ఎందరికి దొరుకుతుంది ఈ అదృష్టం. ‘మాదీ స్వతంత్ర దేశం’ అని టంగుటూరి సూర్యకుమారి మైకుల ముందు ఉరిమింది. ఆ రోజు కమాండర్‌ – ఇన్‌చీఫ్‌ రోడ్డులో ఉన్న రేడియో స్టేషన్‌లో లేనిదెవరు? కొత్తగా పెళ్ళయిన బుచ్చిబాబు తన భార్యతో సహా స్టూడియోలో ఉన్నారు. అదొక ఆవేశం. మరో 40 ఏళ్ళ తర్వాత టంగుటూరి సూర్యకుమారికి ఇంగ్లండు కెంట్‌లో ఒక పార్టీలో ఈ విషయం చెప్పి పులకించాను.

రేడియో స్టేషన్‌ అంటే – ఆ రోజుల్లో దాదాపు సగం సంగీతం. ఏం సంగీతం? మరిచిపోవద్దు, మద్రాసులో సంగీతం అంటే వర్ణం, కీర్తన, జావళి వగైరా, మామూలు పాటలంటే సినిమా తైతక్కలు. కానీ రేడియో సంగీతానికి ఒక నిలకడని, నిబ్బరాన్ని, సంగీత ప్రాధాన్యాన్నీ, అంతకుమించి ప్రత్యేకమైన ‘ఆకాశవాణి బాణీ’ని ఏర్పరచిన బ్రహ్మ రజనీకాంతరావు.దీన్ని ఇంకా చాలా రేడియో కేంద్రాలు ఇప్పటికీ పట్టుకోలేదంటే తమరు నన్ను క్షమించాలి – బాణీ.

‘ఊపరె-ఊపరె ఉయ్యాల… చిన్నారి పొన్నారి ఉయ్యాల’ వంటి రజని పాటలు (ఎస్‌.వరలక్ష్మి గారు పాడారు) నాకు బహిఃప్రాణం. మరో 35 సంవత్సరాల తర్వాత – జీవితం నాకు అవకాశమిచ్చి వరలక్ష్మమ్మగారూ (నాకంటే 12 ఏళ్ళు పెద్ద) నేనూ భార్యాభర్తలుగా నటించినపుడు ఈ పాటని ఆమె చెవిలో గుర్తుచేసి పాడించుకుని పులకించాను. అలాగే పాకాల సావిత్రీదేవి, శాంతకుమారి, టంగుటూరి సూర్యకుమారి, ఏ.పీ. కోమల – ఇలా ఎందరో. వీరంతా నేను రేడియోలో చేరడానికి పెట్టుబడులు. ఆయనతో ‘బావొచ్చాడు’, ‘అతిథిశాల’ వంటి ఎన్నో సంగీత రూపకాలలో తలదూర్చిన అనుభవం ఉంది.

ఇక నా కథకు వస్తాను. రజనీకాంతరావుగారు అప్పుడే స్టేషన్‌ డైరెక్టర్‌గా వచ్చారు. నాకు పిడుగులాంటి వార్త, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోషన్‌ ఇచ్చి నన్ను శంబల్పూరు (ఒరిస్సా) బదిలీ చేశారని. ముమ్మరంగా సినీ రచన సాగుతున్న సమయం. రజనీగారి గదిలోకి నా రాజీనామా కాగితంతో వెళ్ళాను. రజనీగారు తీరికగా నా రాజీనామా పత్రం చదివారు. చదివి అడ్డంగా చించేశారు. ‘తప్పనిసరిగా వెళ్ళండి. ఉద్యోగం మానేయవద్దు. అవసరమైతే ముందు ముందు చూద్దురుగానీ’ అన్నారు. బయటికి నడిచాను. ఆ తర్వాత మరో 12 సంవత్సరాలు పనిచేసి – మరో ప్రమోషన్‌తో కడపలో అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌నై, అనుకోకుండా నటుడినై రాజీనామా చేశాను.

ఇప్పటికీ – ఆయన ఏ 40 ఏళ్ళ కిందటో – ఇంకా వెనుకనో రచించి, బాణీ కూర్చి, పాడించిన (బాల మురళీకృఫ్ణ, శ్రీరంగం గోపాలరత్నం) ‘మన ప్రేమ’ పాట ఒక్కటే కేవలం 70 సంవత్సరాలు రేడియో నడకనీ, వయ్యారాన్నీ రజనీ రచనా పాటవాన్నీ, రేడియోతనాన్నీ తెలియజేస్తూ జెండా ఊపుతున్నట్టుంటుంది. రజనీకాంతరావు గారు రేడియో సంగీతానికి ఒక శయ్యను రూపుదిద్దారు. రేడియోకి ఒక రజనీ చాలడు. ప్రతి కేంద్రానికీ కావాలి. ఈ మాథ్యమానికి కావాలి. ఇప్పటికీ కావాలి.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.