తీర్పు – దినవహి సత్యవతి

ఉదయం పదకొండు గంటలు కావొస్తోంది. పనంతా ముగించుకుని ఇంటికి తాళంపెట్టి నెలవారీ సరుకులు కొనడానికి దగ్గర్లోనే ఉన్న బజారుకి బయలుదేరాను.

ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న నాకు ఎవరో నన్నే గమనిస్తున్నట్లుగా అనిపించి చటుక్కున తలతిప్పి అన్ని వైపులా పరికించి చూశాను కానీ కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు.

‘అంతా నా భ్రమ’ అనుకుంటూ కొట్లోకి అడుగుపెట్టి సరుకులు కొనడంలో నిమగ్నమైపోయాను. సరుకులు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తుంటే మళ్ళీ అదే భావన కలిగింది.

‘ఒకసారైతే భ్రమ అనుకోవచ్చు కానీ మళ్ళీ మళ్ళీ అలాగే అనిపిస్తోంది, అంటే నిజంగా నన్ను ఎవరో గమనిస్తున్నారు!’ అనుకోగానే విపరీతమైన భయం వేసి నడక వేగం పెంచి ఇంటికి చేరుకుని గబగబా తాళం తీసి లోపలికి వచ్చి వెంటనే తలుపు గడియ పెట్టేసి ‘హమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకున్నాను.

…. …. ….

తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో నాకు నా అనేవాళ్ళెవరూ లేక అనాధాశ్రమంలో పెరిగాను. వాళ్ళ సహాయంతోనే పదవ తరగతి వరకు చదువుకున్నాను. ఆ పైన చదువుకుందామన్నా పరిస్థితులు అనుకూలించక మానేయవలసి వచ్చింది. అప్పటినుండి అనాధాశ్రమంలోనే చిన్నా చితకా పనులు చేసుకుంటూ ఉండిపోయాను.

‘రంగు చామన ఛాయ అయినా కనుముక్కు తీరు బాగుండి చూడగానే అందగత్తె అనిపిస్తుంది సురభి’ అని నా గురించి అనాథాశ్రమంలో అందరూ అనుకోవడం నా చెవులను సోకేది. ఇప్పుడు నా వయసు 20 సంవత్సరాలు.

అన్ని పనులు చూసుకోవడానికి ఒక మనిషి కోసం వెతుకుతుంటే రమేష్‌, చందన దంపతుల ఇంట్లో కొన్నాళ్ళ క్రితమే మంచి జీతంపైన పనికి కుదిరాను. రమేష్‌ దంపతులిద్దరూ ఉద్యోగస్థులే. తెలిసిన వాళ్ళు నా గురించి సిఫారసు చేయడంతో నేను తమ ఇంట్లోనే ఉండాలని చెప్పి అన్ని వసతులతో పాటు మంచి జీతం కూడా ఇచ్చి నన్ను పనికి కుదుర్చుకున్నారు.

ఉదయమే లేచి యజమానులకు ఫలహారం చేసి పెట్టడం, వంటచేసి ఇద్దరికీ డబ్బాలలో సర్ది ఇవ్వడం, వాళ్ళు ఆఫీసులకి వెళ్ళిపోయాక ఇంటి పనులన్నీ చేసుకోవడం, పదిరోజులకు ఒకసారి బజారుకి వెళ్ళి సరుకులు, కూరలు తేవడం… ఇవీ నా ఉద్యోగ బాధ్యతలు ఈ ఇంట్లో. యజమానులిద్దరూ కూడా నన్ను ఇంటి మనిషిలాగానే చూసుకుంటారు. చందనను ‘అక్క’ అని రమేష్‌ని ‘సార్‌’ అని పిలవడం అలవాటయింది.

జీవితం చీకూ చింతా లేకుండా చక్కగా గడిచిపోతోంది అనుకుంటున్న నాకు ఇప్పుడీ సమస్య వచ్చి పడింది…

పదిరోజుల తర్వాత మళ్ళీ నేను బజారుకి వెళుతుంటే వెనుకనుండి ”ఇదిగో మిస్‌” అని ఎవరో పిలిచినట్లై చూస్తే సన్నగా పొడుగ్గా ఉన్న ఒక కుర్రవాడు కనిపించాడు. అతడి వయసు సుమారు 20-25 సంవత్సరాలు ఉండవచ్చు అనిపించింది. అతను నన్ను చూస్తుంటే ఒక మాదిరి ఇబ్బందికరమైన భావన కలగడంతో ”ఓహో! అయితే ఈ కుర్రవాడే అయుంటాడు నన్ను గమనిస్తున్నది” అనుకుని అతడికేసి కోపంగా చూసి తలతిప్పుకుని వేగంగా ముందుకు నడవసాగాను. ఆ కుర్రవాడు కూడా వేగం పెంచి నన్ను వెంబడిస్తూ ”మిస్‌ నువ్వంటే నాకిష్టం, నిన్ను ప్రేమిస్తున్నాను…” అంటూ ఏమేమో అవాకులు చవాకులు పేలసాగాడు.

ఆ మాటలకి ‘హు! ప్రేమట… ప్రేమ! ఈ మధ్య ప్రతివారికీ ఇదొక ఆటలా తయారైంది. ముక్కు మొగం తెలియని వారిని చూడగానే ప్రేమిస్తున్నామంటూ వెంటబడి వేధించడం మామూలైపోయింది. అయినా వాళ్ళు ఇష్టపడగానే సరా? ఎదుటివారేమనుకుంటున్నారో తెలుసుకోవక్కర్లేదా’ అనుకుని అతడిని పట్టించుకోకుండా ముందుకు సాగాను.

ఆ కుర్రవాడు ”మిస్‌, మిస్‌…” అంటూ వదలకుండా నన్ను వెంబడించసాగాడు.

దాంతో చిర్రెత్తుకొచ్చి ”చూడు మిస్టర్‌ నువ్విలా వెంటబడడం ఏమీ బాగోలేదు. ఇంకోసారి ఇలా చేశావంటే పోలీసులకి ఫిర్యాదు చేయాల్సి వస్తుంది జాగ్రత్త” అని హెచ్చరించి కొట్టు రావడంతో వడివడిగా లోనికి వెళ్ళిపోయాను.

అయినప్పటికీ ఆ కుర్రవాడు నేను కనిపించినప్పుడల్లా వెంబడించి వేధించడం మాత్రం మానలేదు. ఆఖరుకి ఇంక భరించలేక చందన అక్కకి చెప్పాను విషయమంతా.

వెంటనే రమేష్‌ సార్‌ ఆ కుర్రవాడిపైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో తెలియవచ్చిన విషయాలు…

ఆ కుర్రవాడి పేరు కరణ్‌. అతడు నేను పనిచేసే ఇంటి వెనుక వీథిలో చివరగా ఉన్న ఒక పెద్ద బంగళాలో ఉంటాడు. తల్లిదండ్రులు దుబాయ్‌లో ఉంటే కరణ్‌ మాత్రం ఇక్కడే ఉండి చదువుకుంటున్నాడు. తోడుగా అతడి నాన్నమ్మ ఉంటోంది. ఆవిడ ఉనికి నామమాత్రమే అని, ఎప్పడైనా మంచి చెడు చెబ్దామని చూసినా ఆవిడ మాటల పట్టించుకోవడం కరణ్‌ ఎప్పుడో మానేశాడని వినికిడి!

కరణ్‌ డిగ్రీ ఇంకా పూర్తికాలేదు. తండ్రి పంపించే డబ్బుతో జల్సా చేస్తూ ఆఖరి సంవత్సరం పూర్తి చేయడానికి మార్చి-సెప్టెంబరు రాస్తున్నాడట…!

బాగా డబ్బూ పలుకుబడి ఉన్నవాళ్ళ అబ్బాయి అని తెలిసి ఉండడంతో, తమ వద్దకు ఫిర్యాదు వచ్చింది కాబట్టి పోలీసులు కూడా ఆ కుర్రవాడిని నామమాత్రంగా బెదిరించి వదిలిపెట్టారు.

ఈ సంగతి తెలిసి దుబాయ్‌ నుండి తండ్రి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించమని కరణ్‌ని హెచ్చరించారట! నేను ఫిర్యాదు చేయడంవల్లనే ఇంత జరిగిందనే కక్షతో నాపై పగబూని అది తీర్చుకునే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడని ఏ మాత్రం ఊహించకపోవడమే నేను చేసిన పెద్ద పొరపాటు.

అది గ్రహింపుకి వచ్చేటప్పటికే చాలా ఆలస్యమైపోయింది…

ఒకనాడు ఉదయమే లేచి యథాప్రకారంగా నేను ఇంటి బయట కడిగి ముగ్గువేస్తుంటే నాకు దగ్గరగా ”సురభీ” అని ఎవరో పిలిచినట్లనిపించింది.

‘ఇంత ఉదయాన్నే నన్ను పేరు పెట్టి పిలిచేదెవరా?’ అనుకుంటూ తలెత్తి చూశాను.

ఎప్పుడు వచ్చి నిలబడ్డాడో తెలియదు కానీ ఎదురుగా కరణ్‌! నేను తలెత్తి చూడగానే వెనుక చేతులలో దాచి తెచ్చిన యాసిడ్‌ నా ముఖంపై చిమ్మాడు.

యాసిడ్‌ దాడులు ఎక్కువవుతున్న నేపథ్యంలో దాని అమ్మకంపై ఆంక్షలు విధించబడ్డాయని చెప్పబడుతున్నప్పటికీ ఇలాంటి ఘాతుకాలు మాత్రం ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

యాసిడ్‌ ముఖంపై పడగానే చివాలున చేతిలో ముగ్గు గిన్నె విసిరి కొట్టి ”అమ్మా!” అంటూ బాధతో విలవిల్లాడుతూ ముఖంపై చేతులు కప్పుకుని కుప్పకూలిపోయాను.

అదే సమయానికి గేటులో పెట్టి ఉన్న ఆనాటి వార్తాపత్రిక తీసుకుందామని ఎదురింట్లోంచి బయటకు వస్తున్న మాధవయ్యగారు కరణ్‌ చేసిన ఘాతుకాన్ని చూసి పెద్దగా కేకలు పెట్టసాగారు.

ఆ రోజు రెండవ శనివారం సెలవు దినం కావడంతో ఇంకా నిద్రిస్తున్న రమేష్‌ దంపతులు నా హృదయవిదారకమైన అరుపులు, వెనువెంటనే మాధవయ్యగారి కేకలకి నిద్రాభంగమై ఏం జరిగిందోనని లేచి ఒక్క ఉదుటన వెలుపలికి వచ్చారు.

అప్పటికే కరణ్‌ ఆ చుట్టుపక్కల లేకుండా పారిపోయాడు.

బాధతో విలవిల్లాడుతున్న నన్ను చూసి చందన అక్క అంబులెన్స్‌ కోసం ఫోన్‌ చేయడం, నన్ను ఆస్పత్రికి తీసుకుని వెళ్ళడం చకచకా జరిగిపోయాయి.

ముఖమంతా బాగా కాలిపోవడమే కాక ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం వల్ల నా చేతులపై కూడా బొబ్బలు కట్టాయి. యాసిడ్‌తో అధికభాగం ముఖం కాలిపోవడం వల్ల చికిత్స చేయడం కష్టతరమైంది డాక్టర్లకి.

నాకు ఒక కన్ను పూర్తిగా దెబ్బతిందని తెలిపారు వైద్యులు. నా వైద్యానికి అయ్యే ఖర్చంతా రమేష్‌ దంపతులే పెట్టుకున్నారు.

కరణ్‌పై తిరిగి పోలీసులకి ఫిర్యాదు చేశారు కానీ అప్పటికే కరణ్‌ పరారీలో ఉన్న కారణాన అతడి జాడ ఒకంతట తెలియరాలేదు.

కొన్ని రోజుల అనంతరం నేను మాట్లాడగలిగిన స్థితికి రాగానే నా వాంగ్మూలం కూడా తీసుకున్న తర్వాత పోలీసులు కరణ్‌పై బలమైన కేసు నమోదు చేయడం జరిగింది.

అప్పటికే ఒకసారి ఈ విషయమై హెచ్చరించినప్పటికీ తిరిగి మళ్ళీ నేరానికి పాల్పడడంతో కరణ్‌ని వెంటనే అదుపులోకి తీసుకోవలసిందిగా పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

పోలీసులు కరణ్‌ కోసం యుద్ధప్రాతిపదికన వెదుకులాట ముమ్మరం చేసి అదుపులోకి తీసుకుని కటకటాల వెనుకకు నెట్టారు. విషయం తెలుసుకున్న కరణ్‌ తల్లిదండ్రులు హుటాహుటిన దుబాయ్‌ నుండి వచ్చారు. కొడుకుని విడిపించుకోవడానికి పేరుమోసిన లాయర్లను సంప్రదించగా అందరూ చెప్పింది ఒక్కటే…

‘కరణ్‌ని ఈ కేసులోంచి బయట పడవేయడం మాత్రం సాధ్యం కాదని అందుకు కారణం కరణ్‌ చేసిన ఘాతుకానికి ప్రత్యక్ష సాక్షులు ఉండటమేనని’.

పోనీ కనీసం బెయిల్‌పై అయినా కొడుకుని విడిపిద్దామని అతడి తల్లిదండ్రులు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. అందుకు కారణం అమానవీయమైన ఈ చర్యని తీవ్రమైన నేరం కింద పరిగణిస్తూ కోర్టు బెయిల్‌కు నిరాకరించింది.

తమ పలుకుబడి, డబ్బు ఉపయోగించి మాధవయ్యగారిని లొంగదీసుకుందామని చేసిన ప్రయత్నం కూడా బెడిసి కొట్టడంతో కరణ్‌, అతడి తల్లిదండ్రులు నిస్పృహకు లోనయ్యారు.

కేసు తీవ్రత దృష్ట్యా ప్రత్యక్ష సాక్షి అయిన మాధవయ్యగారికి ప్రాణాపాయం ఉండవచ్చునని భావించి పోలీసు రక్షణ కలుగజేయవలసిందని కోర్టుకు పెట్టుకున్న అర్జీ మంజూరు చేయబడింది.

రమేష్‌, చందన దంపతులు శక్తివంచన లేకుండా నా తరఫున వాదించడానికి మంచి లాయర్‌ని ఏర్పాటు చేసే ప్రయత్నంలో సమాజ సేవిక, న్యాయవాది కూడా అయిన సౌదామినిని సంప్రదించారు. ఆమె గతంలో ఇటువంటి వ్యాజ్యాలెన్నో (కేసులు) వాదించి తన వ్యాజ్యదారులకు (క్లయింట్లు) న్యాయం జరిగేలా చేసి మంచి న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతులు గడించియున్నారు.

…. …. ….

కోర్టులో కేసు విచారణకు వచ్చింది. నాకు చికిత్స జరుగుతున్న కారణంగా నేను కోర్టులో హాజరు కానవసరం లేదనే వెసులుబాటు కల్పించబడింది. కోర్టులో ఏం జరిగిందనే దాని గురించి చందన అక్క చెప్పిన కథనం ఇది…

కేసు విచారణకు వచ్చిన రోజున కోర్టు హాలంతా ఈ కేసులో ఏం జరుగుతుందో అని చూడడానికి వచ్చిన జనంతో క్రిక్కిరిసిపోయింది.

బాధితురాలినైన నా తరఫు న్యాయవాది సౌదామిని, ముద్దాయి అయిన కరణ్‌ తరఫున న్యాయవాది పరాంకుశంగారు తమ తమ కథనాలను జడ్జిగారికి వివరించారు.

ముద్దాయి కరణ్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. వాద ప్రతివాదాలు జరిగాయి.

మాధవయ్యగారిని, చందన, రమేష్‌లను సాక్షులుగా ప్రవేశపెట్టి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకోవడం జరిగింది. కేసు ఇలా కొంతకాలం నడిచింది.

ఇరుపక్షాల న్యాయవాదులూ కూడా తమ తమ క్లయింట్లను సమర్ధిస్తూ బలమైన వాదనలు వినిపించారు. అనంతరం కేసు తీర్పుకి వచ్చింది.

కోర్టులో ఈ కేసు నడుస్తున్న తరుణంలోనే ఎన్నో సాంఘిక సేవా సంస్థలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు నాకు తమ మద్దతు తెలిపాయి. సమాచార మాధ్యమంలో కేసు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.

జడ్జిగారి తీర్పు ఎలా ఉంటుందోననే విషయంలో ఎవరికి తోచినట్లు వారు ఊహాగానాలు చేయసాగారు.

ఈ కేసులో పేరుమోసిన జడ్జి రామబ్రహ్మంగారు తీర్పు వెలువరించనున్నారని తెలిసి అందరి ఉత్కంఠ, ఆసక్తి మరింత పెరిగాయి. అందుకు కారణం ఆయన ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా ఎన్నో సంచలనాత్మక తీర్పులు వెలువరించి ఉండటమే.

…. …. ….

ఆ రోజు తీర్పు వెలువడే రోజు కావడంతో ఎన్నడూ చూడని రీతిలో కోర్టు లోపల, బయటా కూడా జనంతో కిటకిటలాడసాగింది. జడ్జిగారు రావడంతో అందరూ లేచి నిలబడ్డారు. ఆయన కూర్చున్నాక అందరూ తమ తమ స్థానాల్లో ఆశీనులయ్యారు.

అప్పటికే కొంత కోలుకుని ఉండడంవలన, ఆ రోజు కేసు తీర్పుకి రావడం వల్ల నేను కూడా కోర్టుకు హాజరయ్యాను. కోర్టులో అడుగుపెట్టగానే ‘నాకు ఇవాళ ఇక్కడ తప్పక న్యాయం లభిస్తుంది’ అనిపించింది. కోర్టు హాలంతా ఒకసారి పరికించి చూశాను. నా ముఖంపై ముసుగు ఉండడంతో జడ్జిగారితో సహా అందరి దృష్టి సానుభూతిగా నావైపు మళ్ళింది క్షణంపాటు.

కేసు సమర్ధవంతంగా వాదించానన్న తృప్తితో, తన క్లయింటు ఏదో సాధారణ శిక్షతో బయటపడతాడన్న ధీమాతో లాయర్‌ పరాంకుశం గారు చిరునవ్వు నవ్వుకుంటున్నారు.

లాయర్‌ సౌదామిని మాత్రం తన క్లయింటు సురభికి, అంటే నాకు, న్యాయం జరుగుతుందన్న ధీమాతో, గంభీర వదనంతో కూర్చుని ఉన్నారు.

జడ్జి రామబ్రహ్మం గారు చిన్నగా గొంతు సవరించుకుని ”కేసు పూర్వాపరాలన్నీ పరిశీలించిన మీదట కోర్టు ముద్దాయి కరణ్‌ను దోషిగా నిర్థారించడమైనది. ముద్దాయి కరణ్‌ బాధితురాలు సురభిని వెంటబడి వేధించి, వలదని వారించినా ఆమె హెచ్చరికలు పెడచెవిన పెట్టి, అకారణంగా ఆమెపై కక్షబూని ఆమెపై యాసిడ్‌ చిమ్మడం వంటి ఘాతుకానికి పాల్పడడం ఘోరమైన నేరంగా కోర్టు పరిగణిస్తున్నది.

కరణ్‌ చర్యతో బాధితురాలు సురభికి తీరని అన్యాయం జరిగింది కనుక ఆమెకు న్యాయం చేయవలసిన బాధ్యత ముద్దాయి కరణ్‌, అతని తల్లిదండ్రులు తీసుకోవాలని నిర్ణయించడమైనది. ప్రస్తుతం ముద్దాయి తల్లిదండ్రులపై ఆధారపడి

ఉన్నందున అతడు చదువు పూర్తిచేసి స్వార్జితుడు కావడానికి రెండు సంవత్సరాలు మాత్రమే గడువు ఇవ్వబడుతున్నది.

ముద్దాయి కరణ్‌ స్వార్జితుడైన తదుపరి అతడికి తల్లిదండ్రులు ఎటువంటి సహాయం చేయరాదు. స్వార్జితుడైన తదుపరి నుండి బాధితురాలు సురభి జీవితకాలం పోషణ భారం ముద్దాయి కరణ్‌ వహించవలెనని నిర్ణయించడమైనది. అప్పటివరకు అనాథ అయిన సురభికి కనీస వసతులతో ఒక నివాసం ఏర్పాటు చేసి, ఆమె తన చదువు కొనసాగించడానికి తగిన ఏర్పాట్లు చేసి, ఆమె తన కాళ్ళపై తాను నిలబడేవారకు… సంరక్షణా బాధ్యత అంతా ముద్దాయి తల్లిదండ్రులు వహించవలసి ఉంటుంది.

ఈలోగా ఈ దేశం వదిలి వెళ్ళకుండా కరణ్‌, అతడి తల్లిదండ్రుల పాస్‌పోర్టులు రద్దు చేయడమైనది.

ఈ ప్రక్రియలో బాధితురాలు సురభి జీవితం ఒక దరికి చేరిన తదుపరి కూడా ముద్దాయి కరణ్‌ అతడి భవిష్యత్తుకి సంబంధించిన ఎటువంటి నిర్ణయంలోనైనా సురభి అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని ఆదేశించడమైనది.

ముద్దాయి కరణ్‌ ప్రతి నెలా కోర్టులో తప్పనిసరిగా హాజరు వేయించుకోవాలని, కోర్టుకి ప్రతి విషయం వ్రాతపూర్వక వివరణ ఇవ్వవలెనని ఆదేశించడమైనది.

ఈ ఆదేశాలలో ఏ ఒక్కటి అతిక్రమించినప్పటికీ దానిని మరింత తీవ్రమైన నేరంగా పరిగణించడం జరుగుతుందని తెలుపడమైనది. ఈ నేపధ్యంలో ముద్దాయి నుండి బాధితురాలికి ఎటువంటి హాని కలుగకుండా ఆమెకు 24 గంటలూ రక్షణ కల్పించవలసిందిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది” అని జడ్జిగారు తిరిగి ”క్షణికమైన ఆవేశంలో హేయమైన నేరాలు చేసి ఎదుటివారి జీవితాలను నరకప్రాయం చేసి, స్వల్పమైన శిక్షను అనుభవించి తప్పించుకుందామనుకునే నేరస్థులకి విధించబడే శిక్ష వారికి, అటువంటి నేరాలు చేయబూనే వారికి ఒక గుణపాఠం కావాలి. అటువంటి ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కేసులో ముద్దాయి అకృత్యానికి బలైన బాధితురాలి సంక్షేమాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటూ బాధితురాలికి న్యాయం జరిగేలా ముద్దాయి కరణ్‌కు శిక్షను ఖరారు చేయడమైనది” అంటూ తన కొసమెరుపు సందేశాన్ని జోడించి తన సుదీర్ఘమైన తీర్పును వెల్లడించారు.

జడ్జి రామబ్రహ్మంగారిచ్చిన తీర్పు విని కోర్టు ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది.

‘ఆహా ఎంత చక్కగా వివరించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా సంచలనాత్మకమైన తీర్పునిచ్చారు జడ్జిగారు’ అంటూ ప్రశంసించిన పలు స్వరాలతో పాటు ‘ఇదెక్కడి తీర్పు? కుర్రవాడు ఏదో ఆవేశంలో చేశాడే అనుకుందాము అందుకు శిక్ష మరీ ఇంతలా ఉండాలా? వాడి భవిష్యత్తును తీసుకెళ్ళి ఆ అమ్మాయి చేతులలో పెట్టేస్తే పాపం ఆ అబ్బాయి గతి ఏమవ్వాలి?” అంటూ నిరసించిన కొన్ని స్వరాలూ వినిపించాయి నాకు.

ఏదో తేలికపాటి జైలు శిక్ష అనుభవించిన తర్వాత విడుదలై వచ్చిన ఆనందంగా పెళ్ళి చేసుకుని పిల్లాపాపలతో కొడుకు సుఖమైన జీవితం అనుభవించగలడని ఎదురుచూస్తున్న కరణ్‌ తల్లిదండ్రులు ఈ తీర్పు విని శరాఘాతం తగిలిన పక్షుల్లాగా విలవిల్లాడిపోయారు.

అదే పంథాలో ఆలోచిస్తున్న లాయర్‌ పరాంకుశం గారిని కూడా ఈ అనూహ్యమైన తీర్పు తీవ్ర నిరాశకు గురిచేసింది. నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్న లాయర్‌ సౌదామినికి ఈ అమోఘమైన తీర్పు ఎంతో ఆనందం కలిగించింది.

ఈ తీర్పు గురించి అభిప్రాయం చెప్పమని నన్ను పత్రికలవారు ప్రశ్నించినపుడు ”ముందుగా నాకు ఈ కేసులో తమ సహకారం తెలిసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఒకవైపు నాలాగా ఎంతోమంది ఇటువంటి ఘాతుకాలకు బలై చేయని తప్పుకు జీవితాంతం శిక్ష అనుభవించవలసి వస్తుంటే మరోవైపు ఆ తప్పు చేసినవాళ్ళు మాత్రం కొద్దిపాటి శిక్షతో బయటపడి హాయిగా సుఖమైన జీవితాలని గడుపుదామనుకుంటున్నారు. అటువంటి కుత్సిత మనస్కులకి గౌరవనీయులైన శ్రీ రామబ్రహ్మంగారి తీర్పు ఒక మంచి గుణపాఠం అవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ తీర్పు మన న్యాయ వ్యవస్థపై నాకున్న నమ్మకాన్ని మరింత బలపరిచింది. నమస్కారం” అని చెప్పి లాయర్‌ సౌదామినితో వెళ్ళిపోయాను.

పట్టువదలని విక్రమార్కులలాగా కరణ్‌ తల్లిదండ్రులు తిరిగి పై కోర్టులో అర్జీ చేసుకున్నప్పటికీ అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. పై కోర్టు కూడా కింది కోర్టు తీర్పుని బలపరచడమే కాకుండా జడ్జి రామబ్రహ్మంగారి తీర్పును న్యాయమైనదిగా, అమోఘమైనదిగా అభివర్ణించి ప్రశంసించింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.