వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియాతి ప్రియమైన ఈశ్వరీ!

ఎటు వెళ్ళి పోయావ్‌? నడిచి నడిచీ, వెతికి వెతికీ అలసిన నీ కనురెప్పల ఊయలలోనే శాశ్వతంగా నిద్రపోయావా? ప్రతి మనిషిలోనూ మంచితనాన్ని, మనిషితనాన్ని కోరుకునేదానివి. కానీ ఈ మాయాలోకంలో అవేమీ ఉండవన్న జ్ఞాన స్పృహ కలగడంతో వెళ్ళిపోయావా? నీ నిరంతరాన్వేషణే, వెర్రి ఈ ప్రయత్నమే నీ మనసును గాయాలపాలు చేసింది కదూ!

‘ఈశ్వరి కోసం’ అని నీ స్మృతి గీతంగా, చిహ్నంగా, కొందరు మిత్రులు కలిసి ఒక పుస్తకం వేశారు. ముఖచిత్రంపై ఉన్న నిన్ను అదే మొదటిసారి చూడడం నేను. ఈశ్వరి! ఎంత అమాయకంగా, అందంగా, శాంతంగా, ప్రేమ నిండినతనంతో నువ్వు నాకెంతో నచ్చావప్పుడు. నువ్వు రాసిన కొన్ని కవితలు, నీపై రాసిన మాటలు ఉన్నాయందులో. నీ కవిత్వాన్ని నా రిసెర్చి కోసం అంతకు ముందే చదివాను. నీ మాటెంత నెమ్మదో, కవిత్వంలోనూ కన్పించింది.

‘సేల్స్‌గర్ల్‌’ కవిత నాకిష్టమైనది. ఎక్కే గడప, దిగే గడపలా ఉండే నిరంతర ప్రయత్నాలు. విసుక్కొనే, కసురుకొనే, తలుపులు ముఖాన ధడేల్మని వేసే చర్యలు, చాలా చిన్నచూపుగా చూసే చూపులు, అమ్మితే కానీ మిగలని జీవితాలు ఇవన్నీ ఆ కవితలో కన్పిస్తాయి. నువ్వు నమ్ముతానంటే ఓ మాట చెప్తాను. ఆ కవిత అప్పటివరకూ నేను ఆ రీతిన ఆలోచించనందుకు సిగ్గుపడ్తూ, అప్పట్నుంచీ నా దగ్గర ఆ సమయానికి డబ్బులుంటే, అవసరమున్నా లేకున్నా వాళ్ళకోసం కొనడం అలవాటు చేసుకున్నాను. వాళ్ళలో నువ్వ కనబడి కావొచ్చు. మంచినీళ్ళడగడం, కొద్ది మాటలు మాట్లాడడం మామూలైపోయింది.

చిన్నప్పటినుంచీ అనాథతనంతో నువ్వు పడిన కష్టాలు, ఆకలి కోసం నువ్వెన్నుకున్న మార్గంలో నువ్వు బలైన విధానం, మిత్రుల్లాగా నీ పక్కనే ఉండి కొందరు వెన్నును బాకుతో పొడిస్తే, దుఃఖంతో, పొడిబారిన తడి మనసుతో విలవిల్లాడిన నీ మనో చిత్రం నాలో కదలాడుతూనే ఉంది. మీరు ముగ్గురూ నాకు ఇష్టమైనవాళ్ళు – రేవతీదేవి, సావిత్రి, నువ్వు. తనలోని అంతరంగ యుద్ధంతో పోరాడి పోరాడి, అంతర్లోక సీమలో ప్రేమను పొందలేక తనే ఒక చిన్న గీతై మాయమై పోయింది రేవతి. సమాజంలోని అసమానతల్ని స్త్రీ పురుషుల అసమ స్థితినీ ప్రశ్నించి, ఎదిరించి సాహసోపేతమైన జీవన ప్రయాణం చేసింది సావిత్రి. పితృస్వామ్యాన్ని బందిపోటుతో పోల్చి చూపించింది. మరి నువ్వేమో, అతి సున్నితమైన భావోద్వేగాలు కలదానివి.

ఈశ్వరీ! ఎన్నింటినో, ఎన్నింటినో సహించావు, భరించావు. కానీ మిత్రులతో కలిసినప్పటి నుండీ నమ్మకం బాగా వచ్చింది. సమాజం కోసం నువ్వు కూడా ఏమైనా చెయ్యాలని తపనపడ్డావు. బాధితులకు రక్షణ కవచం కావాలను కున్నావు. కానీ ఏమయింది చివరికి. మళ్ళీ ఎదురు దెబ్బలే తగిలాయి నీకు. నువ్వు స్నేహం చేసిన వ్యక్తుల్లోనే కొందరు నిన్ను మోసం చెయ్యడం భరించలేకపోయావు. మగవాడి స్వభావం మనిషిగా కాక మగవాడిగానే ఉండటం నీకు లోతుగా గాయం అయింది. ఎవర్ని నమ్మాలో, ఎవరితో స్నేహం చెయ్యాలో అర్థంకాని స్థితిలోకి నెట్టబడ్డావు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం బతకడమే నిజాయితీగా అన్పించింది. మిత్రుల మాస్క్‌ తొడుక్కొని తోడేలు రూపాన్ని ధరించడం అస్సలు భరించలేకపోయావ్‌. నా చిన్నారి ఈశ్వరీ, విరక్తితో వెళ్ళిపోయావు కదమ్మా! నువ్వే కనుక జీవించి ఉంటే ఎన్నెన్ని కవితలు రాసేదానివో. ఎంతమందికి నీడవై, ఓదార్పువై తృప్తి నిండిన హృదయంతో బతికేదానివి. నీ చివరి అడుగుల్ని చూసి అప్పట్లో విజయవాడలో పెద్ద సంచలనమే చెలరేగింది. ఐనా తొందరపడ్డావ్‌ ఈశ్వరీ! చావెప్పటికీ పరిష్కారం కాదు. ఏదీ అపరిష్కృతంగా ఉండిపోదు. కాలం మార్పు వంతెనను భుజాన మోస్తూనే ఉంటుంది. నువ్వెప్పుడూ ఓడిపోలేదు ఈశ్వరీ. నిన్ను నిజంగా అభిమానించే మిత్రుల్ని కూడా ఆ కొద్దికాలంలోనే సంపాదించుకోగలిగావ్‌. నువ్వంత ఫెమినిస్టుగా కాకుండా ఉండుంటే, ఈ భూమ్మీద మనం కూడా కలుసుకునే వాళ్ళం. నీ అక్షరాలతో నిరంతరం స్నేహం చేస్తూనే ఉన్నాననుకో.

ఈశ్వరీ ‘ఫిర్‌ మిలేంగే’ – మనం ఎప్పటికైనా తప్పక కలుసుకుందాం తల్లీ! నీ జ్ఞాపకాలతో మనసంతా ఈ రోజు పచ్చి పుండులా అయింది.

మళ్ళీ ఇంకెప్పుడయినా కలుసు కుందాం. సరేనా!

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో