ఉద్యమ కేదారంలో పూసిన మందారం – తాపీ రాజమ్మ

రాజమ్మగారూ, నేనూ ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా విజయవాడ గురించి, విజయవాడలో ఆవిర్భవించిన ఉద్యమాల ప్రాభవాల గురించి వినిపిస్తూ ఉండేది. విజయవాడ వీథివీథి తనను పలకరిస్తున్నట్లుగా కనిపిస్తోందని చిరునవ్వుతో పలికేది.

”విజయవాడంటే.. ‘నీకెంతిష్టం’ రాజమ్మా?” అని నేనంటే నీకు లేదా? అని అడిగేది.

గంగానదిలాగ పుచ్చలపల్లి సుందరయ్యగారు, యమునానదిలాగ చండ్ర రాజేశ్వరరావు గారు, సరస్వతీ నదిలాగ (అంతర్వాహిని) మద్దుకూరి చంద్రశేఖరరావు గారు ఆ నగరంలో సంగమించారనీ తరంగించీ ప్రవహించీ ఆ నగరాన్ని

శుభ్రపరచారనీ… మానవజాతి మనుగడకై మంచి పంటలు పండించను యోగించారనీ చెప్పింది. కుళ్ళు కంపు కొట్టే పాత ఆచారాలనూ, విర్రవీగి తిరిగే రౌడీ మూకలనూ అణచడానికి, అంతం చేయడానికి యువతీ యువకులను ఉత్తేజపరిచింది వారేనని చెప్పింది. వారు నగరంలోనే కాక రాష్ట్రమంతటా పర్యటిస్తూ ప్రజాసంఘాలు నెలకొల్పారని, ఆ సంఘాల అభివృద్ధి కోసం ఆఫీసులను పెట్టాలని, ప్రజలను చైతన్యపరచడానికి పత్రికలను నడపాలని యోచించారని తెలిపింది.

ఆ మహనీయులు వారికున్న ఆస్తులను అమ్మి సొమ్ముగా మార్చి వాటి నిర్మాణం కోసం, వాటిని నడపడం కోసం వినియోగించారని చెప్పింది. ఆ త్యాగమూర్తులు భోగభాగ్యాల కోసం, అధికారాల కోసం చూడలేదనీ వాటిపై వారికి ఎటువంటి వ్యామోహం లేదనీ, స్వాతంత్య్ర సముపార్జన కోసం, సమ సమాజ నిర్మాణం కోసం వారు చూశారనీ, పనిచేశారనీ చెప్పింది.

ఆ నిరాడంబరులు నిర్మించిన ఆఫీసులకు వచ్చే యువకులతోను, వారు జరిపే సభలకొచ్చే జనంతోనూ సందడించిన వీధులూ… వారిచ్చిన స్ఫూర్తితో ఎర్ర జెండాల తలపాగాలెట్టుకుని అందగించిన ఇంద్రకీలాద్రి పర్వతాలూ అందరికీ సుస్వాగతమంటుంటే… ఆ నగరంవైపు చూడనివారు ఉంటారా? అని అడిగింది.

‘ఎర్ర జెండాల రెపరెపలతో కనువిందు చేసే విజయవాడంటే నాకెంతో ఇష్టం. నీక్కూడా ఇష్టమే. కాదంటావా?’ అని అడుగుతూనే ఇలా వినిపించింది.

‘నేను కర్నూలు జిల్లాలో పుట్టినా, కమ్యూనిస్టు పార్టీ నన్ను కన్నతల్లి కంటే మిన్నగా పెద్దదాన్ని చేసింది. ఆ పార్టీకి విజయవాడ కేంద్రమైంది. నాలాంటి వారికోసం రాజకీయ పాఠశాలలు నడిపింది. ఆత్మీయంగా పెంచిన అమ్మనూ, విద్యా బుద్ధులు నేర్పిన పాఠశాలనూ విస్మరించే మనుషులు ఉంటారా? అని ప్రశ్నించింది. ఇలా నా స్మృతిపథంలోని రాజమ్మను చూస్తుంటేనూ, రాజమ్మకు ఇష్టమైన విజయవాడను తలుచుకుంటుంటేనూ… నా మనసులోకి ఎన్నో ఆలోచనలు చొరబడుతున్నాయి. రాజమ్మా, నేనూ సాహిత్య సాంస్కృతిక రంగాల్లోకి వెళ్ళడానికి మమ్మల్ని ఉత్సాహపరిచీ నచ్చచెప్పీ మేము ఆ రంగాల్లోకి ప్రవేశించడానికి దోహదం చేసిన మద్దుకూరి చంద్రం గారు, శ్రీ శ్రీ సాహిత్యాన్ని గురించి మాకు చెబుతూ.. శ్రీ శ్రీ బాల్యాన్ని గురించి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి.

”శ్రీ శ్రీ 1910లో ఏప్రిల్‌ 30న విశాఖపట్నంలో అప్పల కొండమ్మ అనే ఆమెకు పుట్టాడట. శ్రీ శ్రీ పుట్టిన ఆరు మాసాలకే అప్పల కొండమ్మ చనిపోయిందట. శ్రీ శ్రీ ఎందరో తల్లుల పాలు తాగుతూ ఎదుగుతున్నాడట. శ్రీ శ్రీ తండ్రి సుభద్రమ్మ అనే ఆమెను రెండవసారి పెండ్లి చేసుకున్నాడట. సవతి తల్లి సుభద్రమ్మ శ్రీ శ్రీని కుమారునిగా చూడక పరాయివాడిగా చూస్తూ బాధపెడుతోందని బంధువుల్లో కొందరు అంటూ ఉండేవారట. బంధువులంటున్నట్లు కాకుండా సుభద్రమ్మ శ్రీశ్రీని కన్నతల్లికంటే ఎక్కువగా చూసేదట. ఆమె ప్రేమతో పెరుగుతున్న శ్రీ శ్రీ బంధువులను లెక్కచేయక ఆమెను మరింత ప్రేమగా చూసేవాడట” అంటూ చెప్పారు.

ఈ కారణాల వల్లే శ్రీ శ్రీ సాహిత్యంలో ముఖ్యంగా మహా ప్రస్థానంలో మాతృస్పర్శ తొంగి చూస్తుందని పరిశీలకులు అన్నట్లుగా చంద్రంగారు చెబుతూ శ్రీశ్రీ కవిత్వంలోని రసధునీ, మణిఖనీ, జననీ, కవితా, ఓ కవితా… అనేవి వినిపించారు.

చంద్రంగారు చెప్పిన శ్రీ శ్రీ బాల్యాన్ని గుర్తు చేసుకుంటుంటే… తాపీ రాజమ్మ కూడా కన్నతల్లికి దూరమైనా… కమ్మూనిస్టు పార్టీకి చేరువై ఆ పార్టీ నాయకులకు అభిమాన పుత్రికై ఆ పార్టీకి కేంద్రమైన విజయవాడను పుట్టిల్లుగా భావిస్తుందేమో… కన్నవారిగా పార్టీ నేతలను చూస్తూ విజయవాడలోనే ఎక్కువ రోజులు ఉండాలని కోరుకుంటుందేమో అనిపించింది.

”ఎగరేసిన ఎర్రని జెండా… రుద్రాలికనైన జ్వాలిక

కావాలోయ్‌ నవకవనానికి” అంటాడు శ్రీ శ్రీ

శ్రీ శ్రీ గానాన్ని గానం చేసిన రాజమ్మ విజయవాడ వీథుల్లో ఎర్రజెండాను ఎగరేసిన రాజమ్మ విప్లవం వర్ధిల్లాలని నినదించిన రాజమ్మ ”విజయవాడ వీథి వీథి నన్ను పలకరిస్తున్నట్లు కనిపిస్తుంది” అనడానికి గల కారణాలైనవి కొన్ని నా కండ్లకు కనిపిస్తున్నాయి.

తొలి రాష్ట్ర కమ్యూనిస్టు మహాసభ గాంధీనగరం జింఖానా గ్రౌండ్స్‌లో జరుగుతున్నప్పుడు రాజమ్మ సభా వేదికపై ప్రజా కళాకారులతో కలిసి ఫాసిస్టు వ్యతిరేక గీతాలను పాడి, ప్రదర్శనల్లో పాల్గొని హిట్లర్‌, ముస్సోలిని ఇంత దుర్మార్గులా…? అనేటట్లుగా ప్రేక్షకులను ముగ్ధులను చేసింది. రెండో ప్రపంచ యుద్ధాన్ని గురించి ఆలోచింపచేసింది. విజయవాడ ప్రతి సెంటరులోనూ తిరుగుతూ… ప్రజాశక్తి పత్రికలను అమ్ముతూ స్త్రీల వెంటబడే రౌడీలను లెక్కచేయకుండాను, భయపడకుండాను ఎక్కువ పత్రికలు అమ్ముడుపోవడానికి ‘పాలపేణి లాంటిది ప్రజాశక్తి’ అంటూ పాడుతూ పత్రికలను అమ్మింది.

హనుమంతరాయ గ్రంథాలయంలో మహాకవి గురజాడ వర్ధంతిని అభ్యుదయ రచయితల సంఘం జరుపుతుంటే…ఆ సభలో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథను గానంచేసి బాల్యవివాహాలు నశించాలని పిలుపునిచ్చింది. దేశభక్తి గీతం పాడి దేశభక్తిని రేకెత్తించింది. దేశభక్తి గీతం ప్రార్థనా గీతం కావాలనే సంకల్పం పెద్దలకు కలిగించింది. మొగల్రాజపురంలో ప్రజాశక్తి నగరం ఏర్పడడానికి సహకరించింది. ఆ నగరంలో కమ్యూన్‌ నడిపే బుల్లెమ్మగారికి కుమార్తెగా తోడ్పడుతూ కమ్యూన్‌ నడపడానికి శక్తివంచన లేకుండా పనిచేసింది. అక్కడ భోజనం చేసే కామ్రేడ్లకు వేళకు భోజనం సమకూర్చుతూ, పెడుతూ వారికి తల్లిగా, చెల్లిగా కనిపిస్తూ వారి మన్ననలను అందుకుంటూ అక్కడే కొన్నాళ్ళు ఉంది.

సూర్యారావుపేట (డాక్టర్‌ అచ్చమాంబగారి ఇంటి సమీపాన)లో మహిళా సంఘం ఆఫీసులో పనిచేస్తూ అక్కడుంటూ అచ్చమాంబ, మానుకొండ సూర్యావతి లాంటి మహిళా కార్యకర్తలకు తన సహకారాన్ని అందించింది. రాష్ట్ర మహిళా మహాసభ జరుగుతుంటే, వేయిమందితో నడుస్తున్న ఊరేగింపులో పాల్గొని ”ఈనాడే స్త్రీలంతా ఏకమవ్వాలి. ధారాళంగా శక్తిని ధారబోయాలి. పోరాటముల మధ్య పోరి గెలవాలి” అంటూ నినాదాలిస్తూ పోలీసుల లాఠీదెబ్బలు తింటూ జైలుకెళ్ళి సమరయోధురాలనిపించుకుంది.

ఈ విధంగా విజయవాడలో 1943 నుంచి జరిగిన అఖిల భారత రైతు మహాసభ దగ్గర నుండి 1948 వరకు పార్టీ జరిపిన అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ నటిగా, గాయనిగా, వాలంటీరుగా, కార్యకర్తగా పనిచేసింది. రాజమ్మ నిస్వార్ధంగా నిబద్దతతో పనిచేసింది అనిపించుకుంది.

రాజమ్మను విజయవాడ వీథి వీథి పలకరించడానికి కారణాలు ఇవేనేమో? అని నేను అనుకుంటున్న సమయంలోనే.. రాజమ్మను మరణించేవరకూ విజయవాడే కాకుండా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలు సైతం స్వాగతం పలికాయి కదా? అనే ప్రశ్న నా ముందుకొచ్చింది.

మన్యపు వీరుడు అల్లూరి సీతారామరాజు కథను, దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేసిన ఆ వీరుని విప్లవాగ్నిని బుర్రకథ రగడలో పొదిగి రాజకీయాలలో మేళవించి దేశభక్తి పెంపొందగా రాగయక్తంగా కథాగానం చేస్తూ వందల వేదికలపై రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో పార్టీ నిర్ణయించిన స్థలాల్లో డక్కపై తాళం వేస్తూ వినిపించినందుకూ…

తెలంగాణ సాయుధ పోరాటాన్ని బలపర్చుతూ ”దున్నేవానికే అన్ని హక్కులంటూ, దోచేవానికి దోహదం ఈయమంటూ” మా భూమి నాటకంలో సీతమ్మై, పోరాటయోధులకు ఊతమిస్తూ… ”ఒక వీరుడు మరణిస్తే… వేలకొలది ప్రభవింతురు. ఒక నెత్తుటి బొట్టులోన ప్రళయాగ్నులు” అంటూ సమరయోధులకు విశ్వాసాన్ని కలిగిస్తూ రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల్లో వందల సంఖ్యలో నాటక ప్రదర్శనలలో పాల్గొన్నందుకూ…

రాష్ట్ర మహిళా సంఘ కార్యవర్గ సభ్యురాలిగా మహిళాభ్యుదయం కోసం, మహిళా సంఘం పెరిగేదాని కోసం మూఢనమ్మకాలు, మూఢాచారాలు నశించేదాని కోసం గ్రామాల్లోనూ, పట్నాల్లోనూ పాటలు పాడుతూ, ప్రసంగిస్తూ మహిళా సంఘ సభ్యత్వాన్ని పెంచుతూ, విరాళాలు స్వీకరిస్తూ పట్టుదలగా పనిచేసినందుకూ…

మంచిని పెంచే తత్వం గల రాజమ్మను మంది ప్రేమిస్తూ అవసరమనుకున్నప్పుడు ఆహ్వానిస్తున్నారనేదే… ఆ ప్రశ్నకు సమాధానమనుకున్నాను.

తెలుగువారి కళా, సంస్కృతీ దీప్తి చెందడం కోసం, కమ్యూనిస్టు పార్టీ విలువలు దశదిశలా నింపడం కోసం అవిశ్రాంతంగా పనిచేసిన తాపీ రాజమ్మ నా స్నేహితురాలు కావడం నా అదృష్టంగా భావించాను.

1952లో కమ్యూనిస్టు పార్టీపైనున్న నిషేధాలను ప్రభుత్వం వారు తొలగించారనీ, అజ్ఞాతవాసం చేసే నాయకులు, జైళ్ళలో ఉన్న నాయకులు బైటికొస్తున్నారనీ, పార్టీ ప్రముఖులు విజయవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారనే వార్తను విన్న తాపీ రాజమ్మ అంబరమంత సంబరంతో సభావేదిక దగ్గరికొచ్చింది.

ప్రజాకంటకుడు పళని యప్పన్‌ చేతికి చిక్కకుండా ప్రాణాలతో బైటికొచ్చిన తన ప్రియతమ నాయకులను చూసింది. ఆనందాశ్రువులు రాల్చుతూ చెంగుచెంగున వేదికనెక్కింది. తన మామగారు (తాపీ ధర్మారావు) ఇచ్చిన బంగారు ఆభరణాలను వంటిపై నుండి తీసి (శ్రీనివాసునకు భక్తులు సమర్పిస్తున్నట్లుగా) సుందరయ్యగారికిస్తూ ‘వందనం’ అంది. కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారుమోగుతుండగా సభలో ఓ పెద్దాయన లేచి రాజమ్మవైపు చూస్తూ… ఈమె ”ఉద్యమ కేదారంలో పూసిన మందారం” అన్నాడు. ఆ మాట విన్న నాకూ ఆనందం కలిగింది. రాజమ్మ కళ్ళనుండి జారినట్లుగానే నా కళ్ళనుండీ ఆనందాశ్రువులు రాలాయి. ఇలా సమసమాజ నిర్మాణం కోసం రాజమ్మేసిన అడుగులనూ అంకితభావంతో రాజమ్మ నడిచిన తీరునూ చూస్తుంటే… నా గొంతు నుండి నా పెదవుల మీదికి… శ్రీ శ్రీ రాసిన

”పసిడి రెక్కలు విసిరి కాలం

పారిపోయిన జాడలేవి?

ఏవి తల్లీ” అన్నవి వచ్చాయి.

ఏవి తల్లీ? నిరుడు పూసిన ఎర్ర మందారాలు.

ఎక్కడమ్మా రౌడీలనణచిన యువకిశోరాలు. అనేవి

అప్రయత్నంగా పెదవులు దాటి బైటకొచ్చాయి.

ముద్దమందారంలాగా పెద్దలకు కనిపించిన రాజమ్మ ఈ లోకాన్ని వీడి అమరురాలయ్యే రెండు రోజుల ముందు కూడా తన చిన్న కుమార్తెను ”దేశమును ప్రేమించు”మనే గురజాడ వారి దేశభక్తి గీతాన్ని గానం చేయమని కోరిందట. కుమార్తె పాడుతుంటే… ”వరస తప్పినట్లుందమ్మా!” అందట. వరస వినిపించడానికి ప్రయత్నించి ”గొంతు సహకరించడం లేదమ్మా!” అందట. మరణశయ్య పైన నరకయాతన పడుతూ కూడా దేశభక్తినీ, సంగీత, సాహిత్యాలను మరిచిపోని రాజమ్మ అమరురాలైనా… మరో లోకానికి వెళ్ళినా మరచిపోలేమనిపిస్తుంది.

”మరో ప్రపంచం పిలిచిందంటూ” మరచిపోని, మరణంలేని సాహిత్యాన్నిచ్చిన శ్రీ శ్రీని మహాప్రస్థానం అట్టమీదున్న ఫోటోలు చూస్తూ ఇక్కడ కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు శ్రీ శ్రీ శతజయంతి ఉత్సవాలు జరుపుతున్నారు కదా!

మరో లోకమంటూ ఒకటుంటే… అమరులైన మా వాళ్ళంతా అక్కడుంటే… అమరురాలైన అక్కడున్న మా రాజమ్మ శ్రీ శ్రీ కవితలను గానం చేసిన రాజమ్మ శ్రీ శ్రీని చూస్తూ శతజయంతి ఉత్సవాలను గురించి యోచించకుండా ఉంటుందా? ఉండదు గాక ఉండదు.

మద్దుకూరి చంద్రం గారితో సంప్రదిస్తుంది. ఉత్సవ ఏర్పాట్లను సుంకర సత్యం గారిని చేయమని కోరుతుంది. తాతాజీ అధ్యక్షతను, ఆరుద్ర, ఆత్రేయ, కృష్ణశాస్త్రి మొదలైనవారి ఉపన్యాసాలతో గరికిపాటి రాజారావుగారి ”పొలాలనన్నీ హలాల దున్ని” అనే గేయ నృత్యంతో, శ్రీ శ్రీ గారి శతజయంతి మహసభ జరుగుతోందని, అమరులంతా ఆహ్వానితులేనంటూ ప్రకటన చేయిస్తుంది. నిండుసభలో ఉన్నతాసనంపై శ్రీ శ్రీని కూర్చోబెట్టి తుమ్మల వెంకట్రామయ్యగారితో ఇంతలేసి కళ్ళతో చూస్తున్న శ్రీ శ్రీకి ఘనసత్కారం చేయిస్తుంది. తాను…”

ఆనందం అర్ణవమైతే… అనురాగం అంబరమైతే

అనురాగపు అంచులు చూస్తాం… ఆనందపు లోతులు తీస్తాం”

అనే గీతం గానం చేస్తుంది. అమరలోకంలో మహాకవి శతజయంతి అందంగా జరిగిందని పత్రికలతో అనిపిస్తుంది… అని అనుకుంటుంటే… నా మనసుకు ఏదో తృప్తి ఉంది.

ఈ ఊహల నుండి వాస్తవంలోకొచ్చిన నేను

”నిజంగానే నిజంగానే నిఖిలలోకం హసిస్తుందా?

మానవాళికి నిజంగానే మంచికాలం రహిస్తుందా?”

అనుకుంటూ… సృజనాత్మకమైన వచన, పద్య, కవితా ప్రక్రియల్లో సూరీడై వెలుగుతూ… యువకవిగా, మహాకవిగా పిలిపించుకుంటున్న శ్రీ శ్రీని ఆశయం, త్యాగం ఆభరణాలుగా అలంకరించుకుని ఉద్యమ కేదారంలో పూసిన మందారం అనిపించుకున్న తాపీ రాజమ్మని నా… జ్ఞాపకాల్లో చూస్తూ… విప్లవాభివందనాలర్పిస్తున్నాను.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.