బెనాజ్‌ – మహాసముద్రం దేవకి

ఇరాక్‌లోని ఓ మోస్తరు పల్లెటూరది. ఆ ఊర్లో మధ్య తరగతి కుర్దిష్‌ కుటుంబానికి చెందిన ఓ ఇంట్లో పండగ వాతావరణం కన్పిస్తూ ఉంది.

ఆ ఇంటి యజమాని మహ్మద్‌, అతని తమ్ముడు ఆరిమహ్మద్‌ కుటుంబాలు లండన్‌కు బయలుదేరుతున్నాయి. వాళ్ళను సాగనంపడానికి వచ్చిన బంధువులతో ఇల్లు కళకళలాడుతూ ఉంది.

వంటింట్లో నుంచి మసాలా వాసనలు సగం ఊరుదాకా వ్యాపించాయి. ఇంటి వసారాలో వేసిన కుర్చీల్లో మగవాళ్ళు కూర్చుని

ఉన్నారు. నడవలో చాపలమీద కూర్చున్న ఆడవాళ్ళు గలగల మాట్లాడుకుంటున్నారు.

అన్ని వస్తువులు ఎంతో జాగ్రత్తగా సర్దినా మహ్మద్‌ భార్య సాహినాకు ఇంకో ఏదో పని మిగిలిపోయినట్లే అనిపిస్తోంది. వచ్చినవాళ్ళతో మాట్లాడుతూ ఇటూ అటూ హడావిడిగా తిరుగుతూ ఉంది. పిల్లలు వాళ్ళ వాళ్ళకు కావలసిన వస్తువుల్ని ఒకరికొకరు పోటీపడి భద్రంగా సూట్‌కేసుల్లో సర్దుకుంటున్నారు.

కొంతసేపటికి భోజనాల కార్యక్రమం మొదలైంది. మటన్‌ పలావ్‌, చికెన్‌ ఫ్రై, కైమా ఉండలు, కొవ్వు గోంగూర, పొట్ట పేగులు కలిపి వండిన కట్టీబాజీ (బోటీ), సేరువాలతో పాటు డబుల్‌ కా మీఠా, ఖర్జూరాలతో చేసి హల్వా… అందరూ తృప్తిగా భోంచేశారు. భోజన కార్యక్రమం ఎంత తొందరగా మొదలుపెట్టినా ముగిసేవరకు మూడుగంటలైంది. బంధువులతో పాటు ఊర్లో ఒక్కరిని కూడా వదలకుండా పిలిచారు మరి!

ఒక పక్క మిగిలిన వంటకాలు, పాత్రల అప్పగింతలు జరుగుతుండగానే రెండు కుటుంబాలకు చెందిన సూట్‌కేసులు ట్రక్‌లో పెట్టేశారు. ఊరిపెద్ద, దగ్గర బంధువు అయిన బాబా అహ్మద్‌కు ఇంటి గురించిన జాగ్రత్తలు చెప్పి తాళాల గుత్తిని అతని చేతిలో పెట్టాడు మహ్మద్‌. అతను తప్ప మిగిలిన వాళ్ళందరూ కార్లలో కూర్చున్నారు. తలలు లెక్కపెట్టుకున్నారు. ఒకరు తక్కువ. ఎవరా అని చూశారు. మహ్మద్‌ పెద్ద కూతురు బెనాజ్‌ మహ్మద్‌ కారులో లేదు.

బెనాజ్‌ కోసం సాహినా కిందికి దిగింది. ఇంటివైపు చూసింది. పెద్ద తాళం వేలాడుతూ కన్పించింది. ‘బెనాజ్‌ మా ఇంట్లో ఉంది, వచ్చేస్తుంది’ అంటూ బెనాజ్‌ స్నేహితురాలు ఖుర్షీద్‌ ఎదురొచ్చింది.

పక్కింటికి దారి తీసిన తల్లికి కూతురు బెనాజ్‌ను చూడగానే ఒళ్ళు మండుకొచ్చింది.

‘ఉదయం నుంచి తయారవుతూనే ఉన్నావు. ఇంకా నీ సింగారానికి మనిల్లూ, టైమూ సరిపోలేదా? మళ్ళీ వీళ్ళింటి అద్దం ముందు చేరావు. లే లే’ అంది కోపంగా.

పదకొండేండ్ల బెనాజ్‌ మరోసారి అద్దంలో చూసుకొని పెదాలకు రంగు అద్దుకుంటూ తుదిమెరుగులు దిద్దుకుంటుంటే తల్లికి బాగా కోపం వచ్చింది.

‘అల్లా నీకు మంచి రంగిచ్చాడు. ఎర్రటి పెదాలిచ్చాడు. మళ్ళీ వాటికి రంగులద్దడమెందుకు? మీ నాన్న చూశాడంటే నిన్నిప్పుడే నిలువునా చంపేస్తాడు. ఆయన చూడకముందే కారెక్కు’ అంది ఈసడింపుగా. అద్దం ముందు నుంచి లేచేదాకా అక్కడి నుంచి కదలలేదామె. ఇద్దరూ ఒకేసారి బైటికి నడిచారు.

ఖుర్షీద్‌ వచ్చి బెనాజ్‌ చెయ్యిపట్టుకొని నిలబడింది. తల్లి భర్తవైపు చూసింది. తనకు బై చెప్పడానికి వచ్చిన గుంపులో నిలబడి తన అక్క కొడుకు సలీంకు ఏదో చెప్తున్నాడు మహ్మద్‌.

‘బతికిపోయింది. లేకుంటే లేట్‌ చేసినందుకటుంచి ఆ వేషం చూసి అందరిముందే లాగి ఒకటిచ్చేవాడు’ అనుకొంది సాహినా. ఖుర్షీద్‌ చేతినుంచి కూతురి చేతిని లాక్కొని ఆదరాబాదరాగా తన చేతిలో ఉన్న బురఖాను కూతురికి తగిలించి కారులోకి నెట్టింది.

అలా 1998లో లండన్‌ చేరిన అన్నదమ్ములిద్దరూ అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నాక తమ తోబుట్టువుల కుటుంబాల్ని కూడా లండన్‌కు పిలిపించుకున్నారు.

….

బెనాజ్‌ మహ్మద్‌కు ఒక అన్న, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. అందరూ స్కూళ్ళకు పోవడం మొదలుపెట్టారు. బెనాజ్‌కు అందంగా అలంకరించుకోవడమంటే చాలా ఇష్టం. లండన్‌లో అమ్మాయిలు చిట్టి పొట్టి గౌన్లతో స్వేచ్ఛగా తిరుగుతుంటే వాళ్ళనలా చూస్తూ ఉండిపోయేది. బురఖా వేసుకొని నడిచి వెళ్తుంటే బెనాజ్‌కు చాలా సిగ్గనిపించేది.

సంప్రదాయకమైన కుర్దిష్‌ ఫ్యామిలీ వాళ్ళది. ఆడపిల్లలకు చాలా ఆంక్షలుండేవి. పదేండ్ల వయసులోనే ఆడపిల్లల్ని బురఖా వేసుకోమనేవాళ్ళు.

ఒత్తైన, పొడవైన కురులు, అందమైన కళ్ళు, నిమ్మపండులాంటి చక్కని రంగు, సంపెంగ ముక్కుతో అందమంతా తన సొత్తే అన్నట్లుండేది బెనాజ్‌. సహజంగానే అలంకరణ పట్ల మోజున్న బెనాజ్‌ ఇంట్లోవాళ్ళకు భయపడి బురఖా తొడుక్కున్నా ఇంటి మలుపు తిరగ్గానే దాన్ని తీసి స్కూల్‌ బ్యాగ్‌లో కుక్కుకునేది కసిగా. ఇంగ్లీషువాళ్ళు ఆడా మగా తేడా లేకుండా స్వేచ్ఛగా విహంగాల్లా సంచరిస్తుంటే బెనాజ్‌కు తమ కుటుంబ సంప్రదాయాల పట్ల ఆ వయసుకే వ్యతిరేక భావాలు చోటు చేసుకోవడం మొదలైంది.

ఒకసారి బెనాజ్‌కు, చెల్లెలు బెకల్‌కు స్కూలు నుంచి వచ్చేటప్పుడు చిన్న గొడవ జరిగింది. బురఖా బ్యాగ్‌లో కుక్కుకునేటప్పుడు తన టిఫిన్‌ బాక్స్‌ను పట్టుకోమని బెకల్‌ను అడిగింది. అక్కడొచ్చింది గొడవ. ఆ కోపంతో ఇంటికొచ్చిన బెకల్‌ అక్క బురఖా సంగతి తల్లికి చెప్పింది. ఉక్రోషంతో చెప్పేటప్పుడు ముందు వెనకల చూసుకోలేదు బెకల్‌. అది కాస్తా తండ్రి చెవిలో పడింది. అంతే వెంటనే ప్యాంటుకున్న బెల్టు తీసుకుని బెనాజ్‌ను చర్మం ఊడేంతగా కొట్టాడాయన.

తండ్రి విశ్వరూపం బెనాజ్‌కు చిన్నప్పటినుంచీ తెలిసిందే. కానీ ఈసారి మరింతగా రెచ్చిపోయాడాయన. ఇంటిల్లిపాదీ ఈ రోజు బెనాజ్‌ను చంపేయడం ఖాయం అనుకున్నారు. అయినా అడ్డుపడడానికి తల్లి కూడా సాహసించలేదు. నాయనమ్మ కూడా చూస్తూ ఊరుకుండిపోయింది. కొట్టి కొట్టీ అలసిపోయాడేమో! బెల్టు పడేసి కోపంగా వెళ్ళిపోయాడు. బెనాజ్‌ వీపుమీద, భుజాల మీద వాతలు తేలాయి. అది చూసి తల్లి బాధతో తల్లడిల్లిపోయింది. ఆ రాత్రి అన్నం కూడా తినలేకపోయింది. అది కూడా భర్త పాలిట తప్పే అయింది. ఆమెను కూడా జుట్టు పట్టుకొని లాగి మరీ కొట్టాడాయన.

మహ్మద్‌కు భయపడి, వెక్కి వెక్కి ఏడుస్తున్న బెనాజ్‌ను ఆ రాత్రి ఎవరూ పలకరించలేదు. తినమని అడగలేదు. దగ్గరికి కూడా వెళ్ళలేదు. ఏడ్చి ఏడ్చి ఏ అర్థరాత్రో నిద్రపోయిన బెనాజ్‌ను ఉదయం స్కూలుకు టైం అవుతున్నా ఎవరూ లేపలేదు కూడా.

భర్త ఆఫీసుకు, పిల్లలందరూ స్కూలుకు వెళ్ళిపోయారు. సాహినా భయపడుతూనే మెల్లగా కూతురి దగ్గర చేరింది. కుర్దూ వంశ గౌరవం ఎలాంటిదో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసింది. ఇంటి పరువు పోయేలా ప్రవర్తిస్తే తట్టుకునే ఓర్పు, క్షమించే గుణం ఆ ఇంటి మగవాళ్ళకు లేదంది. జాగ్రత్తగా మసలుకోమని హితవు పలికింది. దగ్గరుండి స్నానం చేయించింది. తల దువ్వింది. అన్నం పెట్టింది. తండ్రిపట్ల ద్వేషభావమున్న బెనాజ్‌కు తల్లి సాక్షాత్తు దేవతలాగా అన్పించింది.

బెనాజ్‌ స్కూలుకు వెళ్ళలేదన్న విషయాన్ని ఆ రాత్రి పిల్లల్నడిగి తెలుసుకున్నాడు మహ్మద్‌. బెనాజ్‌ను దగ్గరికి పిలిచాడు. రాత్రి కొట్టినందుకు పశ్చాత్తాపంతో పిలుస్తున్నాడనుకొని దగ్గరికి వెళ్ళిన బెనాజ్‌ను ఎందుకు స్కూలుకు వెళ్ళలేదంటూ ఆ చెంప ఈ చెంప వాయించాడు. వెధవ్వేషాలేస్తే ఊరుకోనని హెచ్చరించాడు.

ఆ రోజు నుంచి తల్లి కోరిక మేర ఎంతో భయభక్తులతో మసలసాగింది. కానీ తండ్రి పట్ల తనకున్న అయిష్టత, ద్వేషం రోజురోజుకు పెనువృక్షంలా పెరిగిపోయింది. పామును చూస్తే దూరంగా పరిగెత్తినట్లు తండ్రి ఇంట్లో ఉంటే ఆయన కంటబడకుండా జాగ్రత్తపడేది.

పెద్ద చెల్లెలు బెకల్‌, చిన్న చెల్లెలు బెనీల్‌ అక్క పట్ల తండ్రి వ్యవహరించిన తీరును కళ్ళారా చూసినవాళ్ళు కావడం వల్ల కాబోలు! చిన్నప్పటినుంచే కుటుంబ ఆచారాలకు అనుగుణంగా నడుచుకోసాగారు. బెనాజ్‌కు మాత్రం ఇంగ్లీషు అమ్మాయిలను చూసినప్పుడల్లా ఎంత అదృష్టవంతులో అనుకునేది. తాము కూడా అలా ఉంటే ఎంత బావుణ్ణు అని బాధపడేది.

తల్లిదండ్రులు ఎన్ని ఆంక్షలు విధించినా, మతపరమైన కట్టుబాట్లనే సంకెళ్ళను ఎంత గట్టిగా బిగించినా బెనాజ్‌కున్న సౌందర్యోపాసన ముందు అవి సడలిపోసాగాయి. తనకు క్లాస్‌మేట్‌, స్నేహితురాలు అయిన లిండ్‌సే ద్వారా తెప్పించుకుని బురఖా కింద వేసుకునే స్లీవ్‌లెస్‌ జాకెట్ల గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు. ఆమె హెయిర్‌ స్టైల్‌ను ఎవ్వరూ చూసి ఎరుగరు.

ఇంటికి రాగానే తన గదిలో దూరి స్నానం చేసి వాళ్ళ పద్ధతికి అనుగుణంగా మారినాక గాని బయటికి వచ్చేది కాదు.

బెనాజ్‌ పధ్నాలుగేండ్ల వయసప్పుడు ఒకసారి హెయిర్‌ స్ప్రే వాడిందని తెలిసి మహ్మద్‌ వయసులో ఉన్న అమ్మాయని కూడా చూడకుండా చావబాదాడు. పెద్ద కూతురు పాశ్చాత్య పద్ధతులకు అనుగుణంగా మారుతోందని, అలా మారడానికి వీల్లేదని ఒకసారి భార్యను కొట్టి మరీ హెచ్చరించాడు. తండ్రి తన కారణంగా తల్లిని కొడుతుంటే తలొంచుకుని నిలబడిపోయింది బెనాజ్‌.

అన్న వదినను హెచ్చరించడం చూసిన మహ్మద్‌ తమ్ముడు అరీ మహ్మద్‌ కూడా ‘అదే నా కూతురైతే చంపి బూడిద చేసుండేవాడినంటూ’ అగ్నికి ఆజ్యం పోశాడు. బెనాజ్‌ వల్లనే ఈ అవమానం ఎదుర్కోవాల్సి వచ్చిందని భావించిన మహ్మద్‌ దెయ్యం పట్టినవాడిలా ఊగిపోతూ చేతులు నొప్పి పెట్టేదాకా బెనాజ్‌ను కొట్టి వదిలిపెట్టాడు. అప్పుడు బెనాజ్‌ వయసు పదహారు.

తండ్రి అలా మాటిమాటికీ తనకంటే చిన్నవాళ్ళ ముందు అవమానపరచడం భరించలేకపోయిన బెనాజ్‌ ఆ రోజు స్కూలుకు వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదు. ఇంట్లో వాళ్ళు తెలిసిన అన్నిచోట్లా వెదికారు. మర్నాడు స్కూల్లో వాకబు చేశారు. స్కూలుకూ వెళ్ళలేదని తెలిసింది.

రెండు రోజుల తర్వాత బెనాజ్‌ పెద్ద చెల్లెలైన బెకల్‌ ద్వారా బెనాజ్‌ తన స్నేహితురాలైన లిండ్‌సే ఇంట్లో ఉన్నట్లు తెలిసింది. మహ్మద్‌ ఆ రోజే తన పెద్ద కొడుకు ద్వారా బెనాజ్‌కు ఒక ఆడియో టేప్‌ను పంపించాడు.

‘నువ్వు వెంటనే ఇంటికి రానట్లయితే ఇంటిల్లిపాదినీ చంపి నేనూ చచ్చిపోతాను’ అని ఉందా టేప్‌లో. అది విన్న బెనాజ్‌

ఉన్నపళంగా ఇంటికి బయల్దేరి వచ్చింది. ఇంటికొచ్చినాక తండ్రి తనను ఏమీ అనలేదు కానీ ఆమె అన్న ఆజాద్‌ పిచ్చెత్తినవాడిలా చాకు తీసుకుని బెనాజ్‌ పైకి చంపుతానంటూ దండెత్తాడు. గాయాలతో హాస్పిటల్‌లో చేరిన బెనాజ్‌ కోలుకోవడానికి చాలారోజులే పట్టింది.

మచ్చలేని తన జీవితంపైన తండ్రి, అన్న, బాబాయిలు సంప్రదాయం పేరుతో చేస్తున్న దాడిని ఓర్చుకోలేకపోయింది బెనాజ్‌. తీవ్రమైన మనస్థాపానికి గురైంది. వాళ్ళపైన ఒక విధమైన కసిని పెంచుకొంది. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కానీ ఆ పోలీసులెవరూ ఆమె మొరను ఆలకించలేదు.

పద్దెనిమిదేండ్ల బెనాజ్‌ 2005లో తనను, తన ప్రాణ స్నేహితుడైన రహమత్‌ను తన తండ్రి చంపే ప్రయత్నంలో

ఉన్నాడని మళ్ళీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బెనాజ్‌ను క్యారెక్టర్‌ లేని స్త్రీగా భావించిన ఆ పోలీసులు ఆమె లిఖిత పూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును బుట్టదాఖలు చేశారు.

ఒక స్థితిలో బెనాజ్‌ను తమ ఆచారాలకు అనుగుణంగా కట్టడి చేయడం కష్టమనుకున్న ఇంట్లో వాళ్ళు ఆమెకు పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నారు. ఆమె తన బాయ్‌ ఫ్రెండ్‌ అయిన 29 ఏళ్ళ రహమత్‌ సులేమన్‌ను తప్ప మరెవరినీ పెళ్ళి చేసుకోనని కరాఖండిగా చెప్పింది. ఆ అబ్బాయి ఇరాక్‌ కుర్దూ వంశానికి చెందినవాడు కాదు. ఇరాన్‌ కుర్దూ ముస్లిం కావడం, అలాంటి వాడిని చేసుకుంటానని పట్టుబట్టడం కుటుంబీకులందరి దృష్టిలో తీరని నేరమైంది. అప్పుడే బెనాజ్‌ను చంపేయడం తప్ప మరోదారి లేదని తండ్రి, బాబాయిలు నిశ్చయించుకున్నారు.

కొత్త సంవత్సరం సందర్భంగా అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది బెనాజ్‌. తండ్రి ప్రోద్భలంతో ఆమె అమ్మమ్మ బెనాజ్‌కు బలవంతంగా బ్రాందీ తాగించింది. చేతులకు గ్లౌస్‌ తొడుక్కుని గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించింది.

అపాయాన్ని పసిగట్టిన బెనాజ్‌ కిటికీ అద్దాలను పగలగొట్టి బయటపడింది. గాజు ముక్కలు గుచ్చుకోవడం వల్ల బెనాజ్‌కు గాయాలయ్యాయి. హాస్పిటల్లో జాయిన్‌ అయింది. పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. వాళ్ళు పట్టించుకోకపోగా వాళ్ళ అమ్మమ్మ ఫిర్యాదును అనుసరించి విండోను పగలగొట్టినందుకు గానూ జరిమానా విధించారు.

హాస్పిటల్‌ బెడ్‌ మీద ఉండగానే బెనాజ్‌ తనపైన నిజంగానే హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక వీడియో టేప్‌ను తన స్నేహితుని ద్వారా పోలీసులకు పంపింది. తనకెదురైన పరిస్థితిని, దానివల్ల కలిగిన భయాన్ని అందులో వివరించింది. తనపైన దాడిచేసి ప్రతిసారీ గుర్తుగా మిగిలిపోయిన గాయాల్ని కూడా వీడియోలో ఫోకస్‌ చేసింది. అదే బెనాజ్‌ తన ప్రాణం కాపాడుకోవడానికి చేసిన చివరి ప్రయత్నం. దాన్ని కూడా పోలీసులు పట్టించుకోలేదు.

ఇన్ని ప్రయత్నాలు చేసి విఫలమైన బెనాజ్‌ ఇంట్లో వాళ్ళతో సర్దుకుపోవడం కంటే వేరే దారి లేదని హాస్పిటల్‌ నుంచి నేరుగా ఇంటికే వచ్చింది. తనను క్షమించమని, తల్లిదండ్రులు చెప్పినట్లే నడుచుకుంటానని, తన స్నేహితుని కూడా కలవనని అందరిముందూ ప్రమాణం చేసింది.

ఆమె తండ్రి, బాబాయ్‌లు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వెనకాడే రకాలు కాదు. ఒకరోజు బలవంతంగా బెనాజ్‌కు చెల్లెళ్ళను తోడిచ్చి మార్కెట్‌కు పంపారు. మిగిలిన కుటుంబ సభ్యులంతా హాలులో సమావేశమయ్యారు. బెనాజ్‌ను చంపే విషయమై చర్చ కొనసాగుతూ ఉంది. బెనాజ్‌ తల్లి కళ్ళనీళ్ళ పర్యంతమైంది. అయినా ఆమె మాట ఏం చెల్లుతుంది. వీలైతే తల్లిని కూడా మట్టుపెట్టడానికి సిద్ధమే వాళ్ళు.

తండ్రికి తన ప్రవర్తన ద్వారా తీరని వేదనను మిగిల్చిన తన పెద్ద చెల్లెల్ని తానే అంతం చేస్తానని పెద్ద కొడుకన్నాడు. మార్కెట్‌ నుంచి రాగానే ఆ పని పూర్తి చేస్తానన్నాడు. తల్లి అతన్ని వారించింది. భర్తకు నచ్చచెప్పి అతనిని శాంతపరచి ఎలాగైనా కూతుర్ని బతికించుకోవాలనే ప్రయత్నంలో ఉంది సాహినా. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది.

ఒకరోజు సాహినా స్నానం చేసి వచ్చేలోపల బూట్‌ లేస్‌ను గొంతుకు బిగించి చంపి ముగ్గురు మగవాళ్ళు బెనాజ్‌ శవాన్ని సూట్‌కేస్‌లో పెట్టి పెరట్లో పాతిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు.

కుర్దూ కుటుంబాల్లోని స్త్రీల పట్ల జరుగుతున్న దాడుల గురించి బెనాజ్‌కే కాదు ఆమె బాయ్‌ఫ్రెండ్‌కు కూడా ముందే తెలుసు.

ఒక దశాబ్ద కాలంలో దాదాపు 25 మంది స్త్రీలు వాళ్ళ బంధువుల చేతుల్లో హతమయ్యారు. కుటుంబానికి మచ్చ తెస్తున్నారన్న ఏకైక కారణంతో రక్త సంబంధాన్ని కూడా లెక్కపెట్టకుండా అతి కిరాతకంగా చంపబడ్డారు వాళ్ళు.

‘షారియా’ లా అనే పేరుతో పిలవబడుతున్న ఇస్లామిక్‌ ‘లా’ను బ్రిటన్‌లో ఉన్న ముస్లిం కమ్యూనిటీలు ప్రాక్టీసు చేస్తున్నాయి.

ఇరానియన్‌ అండ్‌ కుర్దిష్‌ ఉమెన్స్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌కు అధ్యక్షురాలైన డయానా నామ్మి ఇస్లాం ఆచారాలను పాటించక పోవడం వల్ల హతమైన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా లండన్‌లోనే పెద్ద సంఖ్యలో ఉన్నట్లు పేర్కొంది.

బెనాజ్‌ నుంచి ఎలాంటి వర్తమానం లేకపోయేసరికి ఆమె స్నేహితుడు సులేమాన్‌కు అనుమానమొచ్చింది.

1.8 మిలియన్‌ ముస్లింలున్న లండన్‌లో మతాచారాలకు విరుద్ధంగా నడుచుకున్నారన్న కారణంతో హత్య చేయబడ్డ వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళ లిస్టులో బెనాజ్‌ కూడా చేరిపోయిందేమోనని సులేమాన్‌ భయం. అందుకే బెనాజ్‌ తండ్రి, చిన్నాన్నల పైన పోలీసు కేసు దాఖలు చేశారు.

ప్రాణ భయంతో బెనాజ్‌ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని పోలీసులు ఆమె హత్యానంతరం ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టి నిజాల్ని బయటికి లాగారు.

బెనాజ్‌ నిజంగానే హత్య చేయబడిందని తెలిసిన సులేమాన్‌ ‘నా భవిష్యత్తు, నా ఆశ, నా ఆశయం, నా సంతోషం, సర్వస్వం బెనాజే అనుకున్నాను. ఆమెలేని జీవితం నాకు శూన్యంతో సమానం’ అంటూ పోలీసుల ముందు భోరున విలపించాడు.

ఇంటరాగేషన్‌ సందర్భంగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పిన మొదటి వ్యక్తి బెనాజ్‌తో ఎప్పుడూ గిల్లికజ్జాలు పెట్టుకొనే ఆమె పెద్ద చెల్లెలు బెకర్‌ కావడం విశేషం.

ఇరాకీ ముస్లిం ఆచారాలను తు.చ. తప్పకుండా పాటించే బెకల్‌ సాక్ష్యం చెప్పే సందర్భంలో కూడా నల్లటి బురఖా ధరించి ఉంది.

ఆమె నోటి వాక్కు కొన్ని నిజాల్ని బయటపెట్టి అక్క ఆత్మకు శాంతి కల్గించింది. కానీ నల్లటి బురఖా వెనక మిణుకు మిణుకుమంటున్న ఆమె కళ్ళల్లో కదలాడుతున్న తన జీవితానికి సంబంధించిన భయాన్ని మాత్రం ఎవరూ గమనించే స్థితిలో లేరు.

Share
This entry was posted in కధలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో