తోడులేని వంతెనపై తను – కొండవీటి సత్యవతి

”మనకు తెలియని మన చరిత్ర” పుస్తకాన్ని మొదటిసారి చూసినపుడు ఆ పేరు చాలా ఆకర్షణీయంగా అనిపించింది. చరిత్ర నిండా రాజులు, రాణులు, యుద్ధాలు, గెలిచిన భూభాగాలు చంపబడ్డ సైనికులు ఇవే ఉంటాయి. సాధారణంగా చరిత్ర నిండా పురుషులు వారి వీర గాథలు ఉంటాయి. చరిత్ర పాఠాలు చదువుతున్నప్పుడు ఆయా కాలాల్లో స్త్రీలు ఏమయ్యారు? ఏం చేసేవారు? చరిత్రలో వారెందుకు కనబడరు అనే ప్రశ్నలు రావడం సహజం. ”స్త్రీశక్తి సంఘటన” అనే ఫెమినిస్ట్‌ గ్రూప్‌” మనకు తెలియని మన చరిత్ర” అనే పుస్తకాన్ని తెచ్చేవరకు చరిత్రలో స్త్రీలెక్కడున్నారు? ఏం చేసారు? అనే ప్రశ్నలు ఎవ్వరూ లేవనెత్తినట్లులేదు. అతకు ముందు వందేళ్ళ క్రితమే భండారు అచ్చమాంబ ”అబలా సచ్చరిత్ర రత్నమాల” పేరుతో స్త్రీల చరిత్రను రాసింది. ఆమె అకాలమరణం వల్ల ఆమె తలపెట్టిన స్త్రీల సమగ్ర చరిత్ర రచన అసంపూర్ణంగా మిగిలిపోయింది. అయితే ”స్త్రీ శక్తి సంఘటన” తెలంగాణ సాయుధ పోరాటంలో స్త్రీల పాత్రకి సంబంధించి సమగ్రమైన చరిత్రని ప్రచురించన తర్వాతనే చరిత్ర పట్ల అప్పటి వరకు ఉన్న పురుషకోణం పక్కకి తొలగి స్త్రీల కోణం ఆవిష్కృతమైంది. స్త్రీవాద చరిత్రకు సంబంధించి ”మనకు తెలియని మన చరిత్ర పుస్తకం ఒక మైలురాయిగా చెప్పుకోవాలి.

కొండపల్లి కోటేశ్వరమ్మగారి గురించి రాయడానికి ఈ ఉపోద్ఘాతానికి సంబంధం ఏమిటి అనిపించొచ్చు చదువుతున్న వాళ్ళకి సంబంధం ఉంది. ఆ పుస్తకంతో నా అనుబంధం పెరగడానికి కారణం ఆ పుస్తకం నిండా ఉన్న స్ఫూర్తిదాతలైన మహిళా మూర్తులు. ఈ పుస్తకం వచ్చేవరకూ వారి గురించి, వారి పోరాటాల గురించి బయట ప్రపంచానికి తెలియకపోవడం. తెలంగాణ సాయుధ పోరాటంలో పాటకట్టి, గన్నుపట్టి, త్యాగాలెన్నో చేసిన పోరాట యోధురాండ్ర గురించి తొలిసారి చదివినపుడు ఉద్వేగంతో మనసు ఉప్పొంగింది. కొండపల్లి కోటేశ్వరమ్మ, మల్లు స్వరాజ్యం, ఐలమ్మ, మోటరు ఉదయం లాంటి నాయకురాళ్ళను కలవాలని మనసు ఉవ్విళ్ళూరేది. ఎంతమంది జీవించి ఉన్నారో తెలియదు.

”మనకు తెలియని మన చరిత్రలో”లో తను జీవితాల గురించి విప్పిచెప్పిన వారిలో కొంతమందిని కలిసే అవకాశం నాకు కలిగింది. మల్లు స్వరాజ్యం, కోటేశ్వరమ్మ, సుగుణ గార్లతో మంచి అనుబంధం కూడా ఏర్పడింది. కొండపల్లి కోటేశ్వరమ్మగారిని నేను 2002లో తొలిసారి కలిసాను. అంటే పదహారు సంవత్సరాల క్రితం కోటేశ్వరమ్మ గారి గురించి, ఆవిడ పోరాటం గురించి ‘మనకు చరిత్ర పుస్తకం’లో చదివి ఉన్నాను. అబ్బూరి ఛాయాదేవి గారనుకుంటాను కోటేశ్వరమ్మగారు విజయవాడ నుండి వచ్చేసి చండ్రరాజేశ్వరరావ్‌ ఒల్డేజ్‌ హోమ్‌లో ఉంటున్నారని చెప్పారు. ఆమెను కలవాలన్పించింది. భూమిక పత్రికలో రెగ్యులర్‌ గా వేసే ”జీవితానుభవాలు” కాలమ్‌కి ఆమెతో ఇంటర్వ్యూ తీసుకోవాలనుకున్నాను.

2001 డిశంబరులో నేను, నా ఫ్రెండ్‌ గీత కలిసి కొండాపూర్‌ వెళ్ళాం. నేను అదే మొదటిసారి సి.ఆర్‌. పౌండేషన్‌ ఓల్డేజ్‌ హోమ్‌కి వెళ్ళడం. ఆమె తన రూమ్‌లో ఒక్కరే ఉన్నారు. అప్పుటికే ఆవిడకి 78-80 మధ్య వయస్సు ఉంది. రూమ్‌లో కెళ్ళగానే నవ్వుతూ పల్కరించారు. నన్ను పరిచయం చేసుకుంటూ భూమిక పత్రిక చేతిలో పెట్టాను. ‘భూమిక’ గురించి విన్నాను. కానీ చదివినట్టు గుర్తులేదన్నారు. ‘భూమిక’లో ‘జీవితానుభవాలు’ పేరుతో ఒక శీర్షిక ఉందండి. స్ఫూర్తి దాతలైన స్త్రీల ఇంటర్వూలు వేస్తూంటాం. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చామండి.” చల్లగా నవ్వారు. ”కొత్తగా ఏముందమ్మా! చెప్పడానికి. స్త్రీశక్తి సంఘటన వాళ్ళ పుస్తకంలో వచ్చింది. కదా!” ”అవునండి వచ్చింది నేను చదివాను. ఆ ఇంటర్వ్యూ చదివాకే మీతో మాట్లాడాలనిపించింది. మీ జీవితానుభవాలు ‘భూమిక’లో వెయ్యాలనిపించింది. భూమిక గ్రామీణ స్థాయి కార్యకర్తలకు కూడా వెళ్తుంది. ముఖ్యంగా వాళ్ళు చదవాలని మా ప్రయత్నం.” అన్నానేను. ”సరేనమ్మా” అన్నారు.

కోటేశ్వరమ్మగారు ఒక చలించని స్థితిలో తన అనుభవాలను చెప్పుకుంటూ వెళ్ళారు. మధ్యలో మేము ఎక్కువ ప్రశ్నలు వెయ్యలేదు. ఆవిడనే చెప్పుకుంటూ వెళ్ళనిచ్చాం. కూతురు డా|| కరుణ మరణం గురించి చెబుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో సన్నని నీటిపోర. చందూ మరణం గురించి చెప్పినపుడు ఉద్వేగానికి గురయ్యారు. ఇన్ని సంవత్సరాలైనా ఆ విషయాలు నా జ్ఞాపకాల్లో సజీవంగానే ఉన్నాయి. 2002లో ” ఈ జీవితమే ఒక పోరాటం” పేరుతో కోటేశ్వరమ్మ గారి ఇంటర్వ్యూ భూమికలో ప్రచురించాం. అప్పుటి నుండి తనతో ఒక ఆత్మీయ సంబంధం ఏర్పడింది. రెండు, మూడుసార్లు హోమ్‌లో కలిసాను.

తాపీ ధర్మారావుగారి కోడలు తాపీ రాజమ్మ గారి గురించి ఒక సమావేశంలో కోటేశ్వరమ్మగారు మాట్లాడుతున్నారని తెలిసి సి.ఆర్‌. హోమ్‌కి వెళ్ళాను. ‘ఉద్యమ కేదారంలో పూసిన మందారం రాజమ్మ’ అంటూ చాలా ఉద్వేగపూరితమైన ఉపన్యాసం చేసారు. రాజమ్మగారితో తన అనుభవాలను ఒకదాని తర్వాత ఒకటి చెపుతూ ”విజయవాడ ప్రతి సెంటర్‌లోనూ తిరుగుతూ ప్రజాశక్తి పత్రికలనమ్ముతూ, స్త్రీల వెంటబడే రౌడీలను లెక్కచేయకుండా, ఎక్కువ పత్రికలు అమ్ముడుపోవటానికి ”పాలపేజీ లాంటిది ప్రజాశక్తి అంటూ పాడూతూ పత్రికలను ఆమ్మింది” అంటూ తాపీ రాజమ్మగారి గురించి ఎంతో ఆర్ద్రతతోను, ఆత్మీయతోను ఆ రోజు మీటింగ్‌లో కోటేశ్వరమ్మగారు చెప్పినపుడు నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ మీటింగ్‌ తర్వాత తనతో చాలా సేపు మాట్లాడాను. ఆమెతో కలిసి హోమ్‌లో భోజనం చేసాను.

ఆ తర్వాత చాలా కాలం కోటేశ్వరమ్మ గారిని కలవలేదు. 2010లో ఆవిడ హోమ్‌ విడిచి పెట్టి వైజాగ్‌ వెళ్ళిపోయారు. అబ్బూరి ఛాయాదేవిగారు సి.ఆర్‌.పౌండేషన్‌ హోమ్‌లో చేరిన తర్వాత చాలా సార్లు ఆ హోమ్‌కి వెళ్ళాను. అప్పటికే కోటేశ్వరమ్మ గారు వెళ్ళిపోయారు కానీ ఆ హోమ్‌కి వెళ్ళినప్పుడల్లా ఆవి గుర్తొస్తారు.

2012లో కోటేశ్వరమ్మ గారి ‘ఆత్మకథ’ ‘నిర్జన వారధి’ ఆవిష్కరణ సభ హైదరాబాదులో జరిగినపుడు కోటేశ్వరమ్మగారు విశాఖపట్టణం నుండి వస్తారని అనుకున్నాం. కానీ ఆవిడ ప్రయాణం చేయలేరని, మీటింగ్‌కి రారని తెలిసినపుడు చాలా డిసప్పాయంట్‌ ఆయ్యాను. ఒక పెద్ద స్క్రీన్‌ పెట్టి వైజాగ్‌లో ఉన్న ఆవిడను స్త్రీన్‌ మీద ఫోకస్‌ చేసారు. ఆ రోజు పుస్తకావిష్కరణలో ఆవిడ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారానే మాట్లాడారు. తన పుస్తకానికి ‘నిర్జనవారధి’ అని ఎందుకు పెట్టారో వివరించారు. అటునుంచి కొందరు, ఇటు నుంచి కొందరు వంతెన దిగివెళ్ళిపోయారని వంతెన నిర్జనమైందని, తాను ఒక్కతే అక్కడ నిలబడిపోయానని చెప్పినప్పుడు ఆ పేరు సూచిస్తున్న విషాదం, ఆవిడ జీవితంలో ఎదురైన దుఃఖ సమయాలు సభికుల కళ్ళల్లో నీళ్ళు తెప్పించాయి. ఆ రోజు ఆవిష్కరణ సభలో అబ్బూరి ఛాయాదేవిగారు, చేరా, ఏబికె ప్రసాద్‌, ఓల్గా, మల్లు స్వరాజ్యంగార్లందరూ ఉన్నారు. ఆ సభ చాలా ఉద్వేగ భరితంగా జరిగింది.

‘నిర్జనవారధి’ పుస్తకం చదివాక నాకు చాలా బలంగా అనిపించింది ఏమిటంటే, 2002లో నేను చేసిన ఇంటర్వ్యూలో ఆవిడ చాలా విషయాలు చెప్పలేకపోయారని, తన లోపలున్న గాయాలను ఆవిడ తన పుస్తకంలో చాలా లోతుగా తడుముకున్నారన్పించింది. అందుకే ఇంటర్వ్యూ చేసినప్పుడు కలగని దుఃఖం పుస్తకం చదివినప్పుడు చాలాసార్లు అనుభవంలోకి వచ్చింది. 10 టివి ‘అక్షరం’ ప్రొగ్రామ్‌లో ‘నిర్జనవారధి’ని పరిచయం చేసినపుడు చాలాసార్లు నా గొంతు మూగబోయింది.

అద్భుతమైన పోరాట యోధులుగా పరిణామం చెందిన కొండపల్లి కోటేశ్వరమ్మ, నంబూరి పరిపూర్ణ, లాంటి వీరవనితల వ్యక్తిగత జీవితాల్లోని సంఘర్షణలు గమనించినప్పుడు మన కుటుంబ, వివాహావ్యవస్థల్లోని బోలుతనం, అణిచివేత, పితృస్వామ్య భావజాలం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. విప్లవపార్టీల సారధులనుకునే వారి ఆచరణలోని పితృస్వామ్య భావజాలం షాక్‌లా తగులుతుంది. స్త్రీ పట్ల, తమ జీవన సహచరుల పట్ల వారు ప్రదర్శించిన బాధ్యతా రాహిత్యం ‘తమ బలహీనత’ల ముసుగులో దాచుకోవడం ఏ విధంగా చూసినా ఆమోధయోగ్యం కాదు.

కోటేశ్వరమ్మ గారి ‘నిర్జనవారధి’, నంబూరి పరిపూర్ణగారి ‘వెలుతురు దారుల్లో’ పుస్తకాలు చదివినపుడు నాకు కలిగిన అభిప్రాయం ఒక్కటే. విప్లవం కోసం, సమాజంలో పెనుమార్పుల కోసం అడవుల్లో పోరాటాలు నిర్మించిన నాయకులు తమ వ్యక్తిగత జీవితాల్లోకి ఆ విప్లవ భావాలను ఎందుకు వొంపుకోలేకపోయారో!!! విప్లవం అంటేనే స్త్రీ పురుషుల్ని విముక్తుల్ని చేసేది. మరి తమ జీవితాల్లోని స్త్రీల పట్ల వారెందుకంత కాఠిన్యం వహించారా అనిపిస్తుంది. నిర్జనవారధి చదివాక కోటేశ్వరమ్మ గారి మీద ప్రేమతో నా మనసు నిండిపోయింది.

కోటేశ్వరమ్మగారు వైజాగ్‌ వెళ్ళిపోయాక చాలాసార్లు ఆవిడని కలవాలనిపించేది. క్రితం సంవత్సరం వైళ్లినపుడు ఎలాగైనా కలవాలని ఫోన్‌ నెంబరు సంపాదించి ఇంటికెళ్ళాను. వయస్సు మీదపడడంతో నిలువెత్తు మనిషి పిట్టలాగా అయిపోయారు. అయితే అది శరీరంలో వచ్చిన మార్పు మాత్రమే. మనసు మహా చైతన్యంగా, చురుకుగా ఉంది. బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నాం. సి.ఆర్‌.పౌండేషన్‌ హోమ్‌లో తానిచ్చిన ఇంటర్వ్యూ కూడా ఆవిడకు బాగా గుర్తుంది. ‘నిర్జనవారధి’ అనేక భాషల్లోకి అనువాదమైన విషయం కూడా చెప్పారు. ఆవిడని చూడడం, మాట్లాడటం అద్భుతంగా అనిపించింది. ఆ మూర్తి, ఆ జ్ఞాపకాలు మనసులో అలాగే ముద్రపడిపోయాయి.

ఓ నెలరోజుల క్రితం హెచ్‌.బి.టి గీతారామస్వామి ఒక మీటింగ్‌లో కలిసినపుడు హఠాత్తుగా ‘కోటేశ్వరమ్మ గారు ఈ సంవత్సరం వందేళ్ళు’ పూర్తి చేసుకోబోతున్నారు. వందేళ్ళ పండగ జరుపుదామా’ అన్నారు. ”వావ్‌! గ్రేట్‌ ఐడియా గీతా! తప్పక చేద్దాం.” కొండెక్కినంత సంబరమైంది నాకు. ‘నువ్వు, నేను, వాళ్ళు కుటుంబ సభ్యులు కలిసి చేద్దాం. ఏమంటావ్‌?’ అంది. ఏమంటాను? దానికి రెండో మాట ఏముంటుంది? ”ఎస్‌. డియర్‌. నేను రెడి” ”అయితే ఆహ్వానం కోసం ఒక నోట్‌ రాయి అంది.” తప్పకుండా అని వొప్పుకున్నాను కానీ రాయలేకపోయాను పనుల వొత్తిడి వల్ల. ఉమా నూతక్కిని అడిగాను. కోటేశ్వరమ్మ గారి మీద చిన్న రైటప్‌ రాసి పంపిస్తావా? అలాగే వందేళ్ళ పండగ జరపడానికి సరిపడిన హాలు కూడా చూడమని ఉమకి చెప్పాను. నేను చిన్న వ్యాసం రాసాను కానీ ఉమ రాసింది చాలా బాగుంది. దాన్ని గీతకి, కోటేశ్వరమ్మ గారి మనవరాలు అనురాధకి పంపించాను. వాళ్ళిద్దరూ దాన్ని ఆమోదించారు. అయితే కొంచం తగ్గించి ఆహ్వాన పత్రిక లాగా తయారు చెయ్యాలనుకున్నాం. గీత, అనురాధ ఆ పనిపూర్తి చేసారు.

నేను ఈ వ్యాసం రాసేనాటికే అందరికి ఆహ్వానం అంది ఉంటుంది. ఆగస్టు 5వ తేదీన, సముద్ర తీరాన, చల్లని సాయం సమయాన కోటేశ్వరమ్మగారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, మితృలందరం కలిసి పెద్ద ఎత్తున ఒక పోరాటయోధురాలి పుట్టిన రోజు పండగను జరుపుకోబోతున్నందుకు నాకు గొప్ప సంతోషంగా ఉంది. సముద్ర కెరటాల సంగీత కచేరి వినిపించేలా ‘హవామహల్‌’ అనే అందమైన హాలును అనురాధ గుర్తించి నిర్ణయించారు. సో… ఫ్రెండ్స్‌… ఆగస్టు 5న అందమైన విశాఖ సాగర తీరాన కొండపల్లి కోటేశ్వరమ్మగారి వందేళ్ళ పుట్టిన రోజును సంబరంలాగా జరుపుకుందాం. మీరంతా తప్పక వస్తారనే ఆశిస్తూ… కోటేశ్వరమ్మకి జై… జై…. జయహో కొండపల్లి కోటేశ్వరమ్మ.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో