దారిదీపం డా. అచ్చమాంబ -వేములపల్లి సత్యవతి

20వ శతాబ్దం తెలుగుతల్లికి రెండు అపూర్వమైన కానుకలు అందచేసింది. ఆ కానుకలు తెలుగుతల్లికి వెలలేని కంఠాభరణాలు. తెలుగు మహిళలకు దారి దీపాలు. ఆ కానుకలలో ఒకటి దుర్గాబాయమ్మ, మరొకటి డా.కొమర్రాజు అచ్చమాంబ. తెలుగువారు దేశవిదేశాల్లో ఎక్కడున్నా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకోదగిన తెలుగింటి ఆడపడుచులు. ఇరువురి గమ్యం ఒక్కటే. ఆశయాలు, ఆదర్శాలు ఒక్కటే. అందుకు వారు ఎంచుకున్న దారులు వేరు వేరు. దుర్గాబాయమ్మ భారత జాతీయ కాంగ్రెస్‌ను తన కార్యక్షేత్రంగా ఎన్నుకొన్నారు. డా.అచ్చమాంబ భారత కమ్యూనిస్టు పార్టీ వేదికనెక్కి బావుటా ఎగురవేశారు. సమాజానికి ముఖ్యమైన, అవసరమైన విద్య-వైద్య రంగాల్లో నిష్ణాతులు, లబ్ద ప్రతిష్టులు. మహిళాభ్యుదయం కోసం తుదిశ్వాస విడిచేవరకు అంకితభావంతో కృషిచేశారు. అజరామర కీర్తినార్జించి ఆ ఇరువురు మహిళా మణులు ఈ లోకం నుంచి నిష్క్రమించారు.

అచ్చమాంబ 1906 అక్టోబరు 6వ తేదీన పుట్టారు. తండ్రి కొమర్రాజు లక్ష్మణరావు సంఘ సంస్కర్త, చరిత్ర పరిశోధకులు. తల్లి కోటమ్మ. మేనమామ ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్‌ కె.ఎల్‌.రావు. మేనత్త ప్రథమ మహిళా రచయిత్రిగా పేరుపొందిన బండారు అచ్చమాంబ. ఆమె 1905లో మరణించారు. తమ్ముడు లక్ష్మణరావు తన కుమార్తెకు అక్క బండారు అచ్చమాంబ పేరు పెట్టుకున్నారు. ఆమె విశాల భావాలకు,

ఉన్నత శిఖరాల అధిరోహణకు కుటుంబ నేపథ్యం కూడా కారణమేమోననిపిస్తుంది. ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కాగడా వేసి వెతికినా ఆమెలో కానరావు. సంస్కర్త లక్ష్మణరావు తన కూతురుని వైద్య విద్యకు మద్రాసు పంపారు. ఎం.బి.బి.ఎస్‌. పూర్తిచేసి ఉన్నత విద్య కోసం ఆమె ఇంగ్లాండు వెళ్ళారు. మద్రాసులో వైద్యవిద్యనభ్యసించేటప్పుడే అచ్చమాంబ కమ్యూనిస్టు పార్టీవైపు ఆకర్షితులయ్యారు. ఇంగ్లాండులో వైద్యవిద్యలో ఉత్తీర్ణురాలయి, పట్టా పుచ్చుకుని విజయవాడ వచ్చి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ప్రజలకు వైద్యాన్ని అందచేయడంలో సఫలీకృతులయ్యారు. సేవా దృష్టి ఉన్నందున అంకితభావంతో వైద్యం చేశారు. ఇప్పటి వైద్యులు (అందరూ కాదు) వైద్యశాస్త్రానికి బదులుగా ధనశాస్త్రం చదివారేమోననిపిస్తుంది. ధనార్జనే ధ్యేయంగా పెట్టుకుంటే ఆ రోజుల్లో విజయవాడ పట్టణాన్ని కొని ఉండేవారు. ప్రసూతి-శిశు పోషణ గ్రంధాన్ని రచించారు. ప్రజాశక్తి ప్రచురణాలయం దాన్ని రెండు పర్యాయాలు అచ్చు వేసింది. పదివేల కాపీలు ముద్రించేవారు. ఒక్కటి కూడా మిగలకుండా అమ్ముడుపోయేవి. ప్రసూతి కేసుల్లో అందె వేసిన చేయిగా ఆంధ్ర దేశమంతటా పేరుగాంచారు.

అచ్చమాంబగారి ఇంటికి అయ్యదేవర కాళేశ్వరరావుగారు, పుచ్చలపల్లి సుందరయ్యగారు, చండ్ర రాజేశ్వరరావుగారి లాంటి దేశభక్తులు వస్తూ ఉండేవారు. ఉప్పలపాటి లక్ష్మణరావు దంపతులు వచ్చేవారు. లక్ష్మణరావు భార్య మేరీషోలింగర్‌, విదేశీయురాలు. కవులు, కళాకారులు, రచయితలు (అభ్యుదయ) సాహితీవేత్తలు, మహిళా సంఘ నేతలు, కార్యకర్తలు, పురప్రముఖులు వస్తూ, ఇల్లు కళకళలాడుతుండేది. కూతురి పేరు బహుముఖాలుగా వ్యాప్తి చెందడం చూసిన తల్లి కోటమ్మ తనలో తానే గర్వపడుతుండేవారు. రోజూ నేనూ వారింటికి వెళ్తున్నందున కోటమ్మ గారితో సాన్నిహిత్యం ఏర్పడింది. ఒకసారి ఏదో సందర్భంలో, నాతో… అమ్మాయ్‌! అచ్చమాంబ మన దేశంలో పుట్టవలసింది కాదు అన్నారు. మరి ఎక్కడ పుట్టవలసింది మామ్మగారూ అన్నాను. రష్యాలో పుట్టవలసిందన్నారు. అవును! అలాంటి బిడ్డనుగన్న ఏ తల్లి అయినా గర్వపడకుండా ఎలా ఉంటుంది. డాక్టర్‌గారి నోటినుంచి వచ్చే ఊతపదం ‘ఏమోయ్‌’. ఎవరితో మాట్లాడవలసి వచ్చినా, చెప్పవలసి వచ్చినా ముందు ‘ఏమోయ్‌’ అని తర్వాత మాట్లాడేవారు. భర్త శాస్త్రిగారిని కూడా ‘ఏమోయ్‌’ శాస్త్రి అనేవారు. తమ భార్యలను ఆసుపత్రికి తీసుకువచ్చిన ఉన్నతోద్యోగులను, శ్రీమంతులను ఏమోయ్‌ మిస్టర్‌ అనేవారు. వారు ఆ పదం విని అవాక్కయి, వెంటనే తేరుకుని ఎస్‌ మేడమ్‌ అనేవారు. వారు అంతకుముందు ‘ఏమోయ్‌’ అని పిలవడం విని ఉండలేదు. నవ్వవలసిన సందర్భంలో పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వేవారు. తాను నవ్వడమే కాదు, ఆసుపత్రిలోని రోగులను నవ్వించేవారు. ఆ నవ్వులతో రోగుల రోగం సగం తగ్గుతుందనిపించేది. ఏ వేళలో చూసినా నవ్వు ముఖంతో కళకళలాడుతూ కనిపించేవారు. ఒకవిధంగా నవ్వుల రారాణి అనవచ్చు.

దుర్గాబాయమ్మ గురించి ఎవరో ఒకతను మరొకతన్ని అడిగారు. అందుకాయన ఆమె నవ్వగా నేను చూడలేదు. అలాగే ఆమె చేపట్టిన కార్యక్రమాలు విఫలమవగా కూడా నేను చూడలేదని సమాధానం చెప్పారు. దుర్గాబాయమ్మ గంభీరంగా ఉండేవారు.

ప్రజా నాట్యమండలి వారికి రిహార్సల్స్‌ కోసం అచ్చమాంబ తమ ఇంటిలోని ఒక గదిని ఉచితంగా ఇచ్చారు. ప్రజానాట్య మండలి పితామహుడు డా||గరికపాటి రాజారావుగారి ఆధ్వర్యంలో పాటలు, నాటకాలు, బుర్రకథలు మొదలయిన వాటి రిహార్సల్స్‌ జరుగుతుండేవి. నాటకాలలోని స్త్రీ పాత్రలను మహిళలే వేసేవారు. డా.అచ్చమాంబగారి మరదలు పద్మ వచ్చేపోయే నాయకులకు భోజన వసతి ఏర్పాట్లతో ఒకవైపు సతమతమవుతూనే నాటకాలలో పాల్గొనేది. ఏదో విధంగా వీలు కల్పించుకుని మాతోపాటు మహిళా సంఘ ప్రచారానికి వచ్చేది. కొండేపూడి రాధ కథకురాలిగా, వీరమాచనేని సరోజిని పృచ్ఛకురాలిగా, తాపీ రాజమ్మ విశ్లేషకురాలిగా కృష్ణాజిల్లా మహిళా బుర్రకథ దళం ఏర్పడింది. అల్లూరి సీతారామరాజు, వీరటాన్యా మొదలగు వాటిని బుర్రకథలుగా చెప్పేవారు. సభలలో పుత్తడిబొమ్మ పూర్ణమ్మ పాటను విన్న శ్రోతలు కంటతడి పెట్టకుండా ఉండేవారు కాదు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మహిళా సంఘ కార్యకర్తలు, రేషన్‌ దుకాణాల వద్దకు వెళ్ళి కార్డులున్నవారికి సరుకులు సక్రమంగా అందేలా కృషి చేశారు. అలాగే పొంగు, ఆటలమ్మ, స్ఫోటకం (అమ్మవారు) వంటి అంటువ్యాధులు సోకినపుడు, వైద్యం చేయడానికి వచ్చిన వారి వెంట ఉండి, మహిళలకు నచ్చచెప్పి, టీకాలు వేయించడంలోను, స్ఫోటకం పోసినవారికి వైద్యం చేయించడానికి (అమ్మవారికి కోపమొస్తుందని మహిళలు ముందుకొచ్చేవారు కాదు) వారికి నచ్చచెప్పి ఒప్పించే పని చేసేవారం. అలాగే అన్నం గంజి వంచకుండా వండాలని, దోసకాయ, బంగాళదుంప చెక్కు తీయకుండా వండాలని ప్రచారం చేసేవాళ్ళం. అలాగే మురికివాడలలో పరిశుభ్రతను గురించి ప్రచారం చేయడమే కాకుండా కొన్నికొన్ని సందర్భాలలో చీపుళ్ళు (పొరకలు) పట్టుకుని శుభ్రం చేసేవాళ్ళం.

మహిళా సంఘం సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టింది. బహు భార్యాత్వం నిషేధించాలని, భర్త ఆస్తిపై భార్యకు హక్కు

ఉండాలని, విడాకుల చట్టం చేయాలని స్త్రీ, పురుషులందరి చేత సంతకాలు చేయించడం, ప్రచారం చేయడం ప్రారంభించబడింది. పట్టణాలలోనే కాకుండా పల్లె పల్లెకూ తిరిగి ప్రచారం చేసి సంతకాలు చేయించారు. ప్రచార సమయంలో స్త్రీల స్పందన ఎలా ఉంది? పురుషులు ఏమంటున్నారు? ఇంకా ఇతరత్రా సమస్యలేమైనా ఎదుర్కొంటున్నారా? అని అడిగి తెలుసుకునేవారు డాక్టర్‌గారు. కొన్ని కొన్ని సమయాల్లో సలహాలిస్తూ ఉండేవారు. మహిళలు మేము చెప్పే మాటలను ఆసక్తిగా వినేవారు. సంతకం చేయడానికి భయపడేవారు. ఆ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అత్త, మామలు, భర్త ఏమంటారోనని భయపడేవారు. పదిమంది ఆడవారిని ఒకచోట సమావేశపరచడానికి చుక్కలు లెక్కపెట్టవలసి వచ్చేది. కొంతమంది పురుషులు కూడా సంతకాలు చేసేవారు. కొందరు మాత్రం… ఏమి చెప్పడానికి వచ్చారు? దుర్గాబాయమ్మలాగ మొగుడిని వదిలేసి జెండాలు పట్టుకుని తిరగమని, జైలుకెళ్ళమని, డా.అచ్చమాంబలాగా కాంట్రాక్టు పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్పడానికా? విడాకులు కావాలా? మీ మాటలు వింటే రేపటినుంచి మా పెళ్ళాలు మాకు, పిల్లలకు కూడా వండడం మానేసి భుజాలకు సంచులు తగిలించుకుని బయలుదేరతారు. నేనూ, నా పెళ్ళాం బాగానే ఉన్నాం. మాకు విడాకులవసరం లేదని ఇంటినుంచి తరిమి తలుపులు వేసుకునేవారు. ఇటువంటి వారి సంఖ్య బహు తక్కువ. ఇక వితంతువులయిన బామ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలయితే మీరు ఆడపుటక పుట్టలేదా? వయసులో ఉన్న పడుచు పిల్లలు భుజాలకు సంచులు తగిలించుకుని, బజార్లలో తిరగడానికి సిగ్గులేదా? మీకు మొగుడు, పిల్లలు ఉన్నారా? అని తిట్ల దండకం మొదలుపెట్టేవారు. తర్వాత వారికి 300 సంవత్సరాలకు ముందు ఉన్న సతీసహగమనాన్ని తెలిపి, అది మాన్పించిన మహనీయుడిని గురించి తెలిపి, ఆ ఆచారం కొనసాగితే మమ్మల్ని తిట్టడానికి మీరు

ఉండేవారు కాదని చెపితే విని ఆశ్చర్యపోయేవారు. డాక్టర్‌గారి ఇంట్లో సన్నజాజుల తీగ, కనకాంబరాలు మొదలైన పూల మొక్కలు, గులాబీలు ఉండేవి. ఒకరోజు నేను వెళ్ళే సమయానికి అరచేయంత వెడల్పుగా ఎర్ర గులాబి పువ్వు విచ్చుకొని ఉంది. డాక్టర్‌గారు ఆసుపత్రికి వెళ్ళే సమయం. నేను గులాబి తుంచి తెచ్చి డాక్టర్‌గారికి ఇవ్వబోయాను. అప్పటివరకూ నవ్వుతూ ఉన్న ఆమె ముఖం నా చేతిలో పువ్వు చూడగానే చిన్నబోయింది. అసంతృప్తి కొట్టొచ్చినట్లుగా కనిపించింది. మీరు తలలో పెట్టుకుంటారని తెచ్చానండి అన్నా. నా తలలో పూలు ఎన్నడైనా చూచావా? అయినా మనం పెట్టుకున్న పూలను మనం చూసుకోలేము కదా? తలలో ఒకటి, రెండు గంటలకు వాడిపోతవి. అవే చెట్టు మీద ఉంటే వాటి జీవితకాలం వరకు తాజాగా ఉండి, చూడడానికి అందంగా కనిపిస్తవి కదా! అని నా తెలివితక్కువ పనికి కోపగించుకోకుండా, సున్నితంగా ఇకముందెప్పుడూ పూలు కోయకూడదన్న హెచ్చరికను తెల్పారనిపిస్తుంది. కూరకు పనికొచ్చే అరటి చెట్లు ఉండేవి. అతిధులకు అరటి ఆకుల్లోనే భోజనం. ఎవరైనా తమ భార్యల గురించి ఆడవారికి చాదస్తాలు ఎక్కువ, పూజలని, నోములని, వ్రతాలని చేస్తుంటారు. మాన్పించడానికి, నచ్చచెబితే వినరు, అర్థం చేసుకోరని చెబితే అచ్చమాంబ గారు వాటిని అంగీకరిస్తూనే అది వారి తప్పు కాదు. వంట చేయడానికి, పిల్లల్ని కనడానికి మాత్రమే నాలుగు గోడల మధ్య బంధించిన పురుషాధిక్య సమాజానిదని చెప్పేవారు.

అభ్యుదయ రచయితల సంఘం చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారికి విజయవాడలో సన్మానం చేశారు.పంతులు గారిని అచ్చమాంబ గారి ఇంటికి తీసుకువచ్చారు. ఇల్లంతా కోలాహలంగా ఉంది. పద్మకు ఊపిరి సలపని పని. పంతులు గారికి భోజనం పెట్టే పనిని నాకు పురమాయించింది. ఆ విధంగా ఆ మహానుభావునికి నా స్వహస్తాలతో భోజనం పెట్టే అదృష్టం లభించింది. పంతులుగారు అంధులు. భోజనం పూర్తయ్యేవరకు అక్కడే ఉన్నా. రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా సంఘం సభ గుంటూరులో జరిగింది. కొండా పార్వతీదేవి గారు, వల్లభనేని సీతామహాలక్ష్మమ్మ గారు, జాస్తి సీతామహాలక్ష్మమ్మ గారు, కామేశ్వరమ్మ గారు మొదలగు కాంగ్రెస్‌ మహిళా సంఘ నాయకురాళ్ళు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ మహిళా సంఘం తరపున 20 మంది కార్యకర్తలను వెంటబెట్టుకుని డాక్టర్‌గారు ఆ మహాసభకు వెళ్ళారు. కృష్ణాజిల్లా మహిళా సంఘాన్ని గుర్తించాలని అచ్చమాంబ ప్రతిపాదించారు. వారు అంగీకరించలేదు. వాదోపవాదాలు జరిగాయి. సభ ముగిసిన తర్వాత తిరిగొచ్చాము. కృష్ణాజిల్లా మహిళా సంఘం కాటూరులో మూడు రోజుల సభ ‘నభూతో నభవిష్యత్‌’ అన్న రీతిలో అతి సమర్ధవంతంగా నిర్వహించింది. ఆ సభకు ముందు సరోజినీ నాయుడు విజయవాడ మీదుగా హైదరాబాద్‌ వెళ్తున్నారన్న విషయం డాక్టర్‌గారికి తెలిసింది. రైలు బండి వచ్చే సమయం అర్థరాత్రి 2 గంటలు. ఆ రోజు 20, 25 మందిమి డాక్టర్‌గారి వెంట స్టేషన్‌కు వెళ్ళాము. అచ్చమాంబ గారు సరోజినీ నాయుడితో మహిళ సంఘం చేస్తున్న, చేపట్టిన విషయాలను చెప్పి కాటూరులో జరిగే సభకు రావలసిందిగా కోరారు. అందుకు ఆమె అంగీకరించారు. దురదృష్టవశాత్తు సభకు రెండు, మూడు రోజులకు ముందు సరోజినీనాయుడి గారి రెండవ కుమారుడు గతించాడు. ఆమె రాలేకపోయారు. సువర్ణావకాశం చేజారిపోయింది. కాటూరులో నాగళ్ళ రాజేశ్వరమ్మగారని మహిళా సంఘ కార్యకర్త ఉండేవారు. ప్రతిభావంతురాలయిన రాజేశ్వరమ్మ గ్రామీణుల సహకారంతో సభ దిగ్విజయంగా జరగడానికి కృషి చేశారు. సభకు అచ్చమాంబతో పాటు పుచ్చలపల్లి సుందరయ్య గారి భార్య లీల (పెండ్లయిన కొత్త), మేరీషోలింగర్‌ వచ్చారు. షోలింగర్‌ను చూసి పురుషుడనుకొని కొందరు మహిళలు వెళ్ళడానికి లేచి నిలబడ్డారు. షోలింగర్‌ పురుషునివలే జుట్టును కటింగ్‌ చేయించుకునేవారు. మోకాళ్ళ వరకు నిక్కరు, మోచేతుల వరకు షర్టు ధరించేవారు. డాక్టరు గారు ఆమె స్త్రీయేనని, మన దేశం కాదని, వారి దేశంలో మహిళలు ఇలాగే ఉంటారని చెప్పడంతో అంతా కూర్చున్నారు. రైతు సంఘం వారు వేసవిలో కాలువలలో మట్టి త్రవ్వకం చేపట్టారు. ఆ పనిలో మహిళా సంఘం సభ్యులతో పాటు డాక్టర్‌ గారు కూడా పాల్గొన్నారు. కాలువ లోపలినుంచి మట్టి తట్టను తలపై ఎత్తుకుని ఒడ్డున గుమ్మరించారు. 1947కు పూర్వం లేక ముందో ఎన్నికలొచ్చాయి. (ఎందుకొచ్చింది గుర్తు లేదు). ఏలూరు నియోజకవర్గం మహిళలకు రిజర్వు సీటుగా ప్రకటించారు. కాంగ్రెస్‌ తరపున అమ్మన్న రాజా, కమ్యూనిస్టు పార్టీ తరపున అచ్చమాంబ పోటీ చేశారు. అమ్మన్న రాజా స్థానికురాలు, అంతేకాక ప్రజల్లో మంచి పేరుంది. అచ్చమాంబ విజయవాడ నుంచి వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది. డాక్టర్‌ గారి తరపున మహిళా సంఘం వెళ్ళి పనిచేసింది. అమ్మన్న రాజా గెలిచారు. పార్టీ నుంచి దూరమయిన తర్వాత విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి అఖండ విజయం సాధించారు.

మానికొండ సూర్యావతిగారి లాంటి త్యాగధనులు, లబ్ద ప్రతిష్టులయిన మహిళా సంఘ నేతల అశేష త్యాగాల వలన, దీక్షా దక్షతలు గల కార్యకర్తల కృషి వలన బహు భార్యాత్వం నిషేధింపబడింది. భర్త ఆస్తిపై భార్యకు హక్కు ఏర్పడింది. విడాకుల చట్టం చేయబడింది. కృష్ణా జిల్లా మహిళా సంఘం ఒక మాసపత్రికను నడపడానికి శ్రీకారం చుట్టింది. ఆనాటి సర్కారు పత్రికను అనతికాలంలోనే నిషేధించింది. నిరసనగా అచ్చమాంబ గారి ఇంటినుంచి మహిళల ర్యాలీ బయలుదేరింది. వేలాదిమంది మహిళలు పాల్గొన్నారు. అచ్చమాంబగారు, మానికొండ సూర్యావతిగారు నాయకత్వం వహించారు. కొంతదూరం వెళ్ళిన తర్వాత ఊరేగింపును పోలీసులు అడ్డుకొన్నారు. ఊరేగింపు తోసుకుని ముందుకు సాగింది. 144వ సెక్షన్‌ పెట్టారు. భాష్పవాయువు ప్రయోగించి ఊరేగింపును చెల్లాచెదురు చేశారు. అచ్చమాంబ. మానికొండ సూర్యావతి, కాట్రగడ్డ హనమయమ్మగారిని, కొండపల్లి కోటేశ్వరమ్మగారిని, మోటారు ఉదయం, టి.సావిత్రి, ద్రోణంరాజు అనసూయ (16 రోజుల బాలింత)ను, తాపీ రాజమ్మ (3 నెలల పాప ఉంది) గార్లతో పాటు మొత్తం 80 మందిని అరెస్టు చేసి ఆ రోజు రాత్రి నందిగామ జైలుకు తరలించారు. వారం రోజుల తర్వాత అచ్చమాంబ గారిని, మానికొండ సూర్యావతి గారిని డిటెన్యూలుగా రెండు సంవత్సరాలు జైలుకు పంపారు. మిగతావారిని విజయవాడ తీసుకొచ్చి కొద్దిమందిపై కేసులు పెట్టి, మిగతా వారిని వదిలేశారు. జైలులోనే డాక్టర్‌గారు పార్టీకి దూరమయ్యారు.

ఆసుపత్రిని నామరూపాల్లేకుండా ధ్వంసం చేశారు. ఫర్నిచర్‌ను తగులబెట్టారు. గాజు సామగ్రిని పగులగొట్టారు. ఆపరేషన్‌ పరికరాలను పనికిరాకుండా చేశారు. శిక్ష పూర్తయి వచ్చిన తర్వాత డాక్టర్‌గారు ఇంటిలోనే ప్రాక్టీస్‌ ప్రారంభించారు. ‘మనకు తెలియని మన చరిత్ర’ రాసిన రచయిత్రి మానికొండ సూర్యవతిని ఇంటర్వ్యూ చేశారు. వారి మధ్య సంభాషణలో డా.అచ్చమాంబగారి విషయం వచ్చింది. మానికొండ సూర్యావతి మాట్లాడుతూ అచ్చమాంబ మంచివారే. ఆమెకు పార్టీని వదలాలని లేదు. భర్త వత్తిడికి తలొగ్గారని చెప్పి, మేము పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేయాలి కదా! అని సమాధానం చెప్పారు. ఇంటిలో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో నా ఆరోగ్యం బాగోక నేను డాక్టర్‌గారికి చూపించుకోవడానికి వెళ్ళాను. లోపల పేషెంట్‌ బయటకు రావడం, నేను లోపలికి వెళ్ళడం జరిగింది. నన్ను చూడగానే ఆ పేషెంట్‌ను చూశావటోయ్‌ అన్నారు. ఆమె పట్టుచీర కట్టుకుని, మెడనిండా బంగారు నగలు, మోచేతి వరకు బంగారు గాజులు ధరించి ఉంది. నేనామెను డాక్టర్‌ గారికి పరిచయస్తురాలేమో, ఏదో శుభకార్యానికి వెళ్తూ డాక్టర్‌గారిని కలిసిపోవడానికి వచ్చిందేమో అనుకున్నా. అదే సంగతిని డాక్టర్‌గారికి చెప్పా. అది కాదోయ్‌! అబార్షన్‌ చేయించుకోవడానికి వచ్చింది. నెల తప్పిందట. ఇంకా పిల్లలు పుడితే, ఉన్న పిల్లలకు ఆస్తి తగ్గుతుందట అని చెప్పారు. ఆమె తాను కూర్చునే కుర్చీ చూపిస్తూ నేనీ కుర్చీలో కూర్చున్నది మనిషి ప్రాణాలు కాపాడడానికోయ్‌ తీయడానికి కాదు అన్నారు. ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ లేదు. అప్పుడు కూడా ఆమె పేదలకు వైద్యం చేయడం, సాయపడడం మానలేదు. విజయవాడలో ఏదో కాలేజిలో చదువుతున్న పేద విద్యార్థి సకాలంలో ఫీజు కట్టలేకపోయాడు. ప్రిన్సిపాల్‌ అతని పేరు తొలగిస్తామన్నారు. అతని తల్లిదండ్రులు డాక్టర్‌గారి దగ్గరకు వచ్చి లబోదిబోమని మొత్తుకున్నారు. హుటాహుటిన కాలేజీకెళ్ళారు. అతనికి కొంత సమయం ఇవ్వమని, అప్పటికీ అతను కట్టలేకపోతే తానే ఆ ఫీజు కడతానని ప్రిన్సిపాల్‌కి చెప్పారు. అయితే ప్రిన్సిపాల్‌ ససేమిరా ఒప్పుకోలేదు. డాక్టర్‌గారు ఉద్వేగభరితులయ్యారు. తిరిగి ఇంటికి వచ్చారు. అది ఆమెకు గుండెపోటుకు దారితీసింది. పోరాటమే ఆమె ఊపిరి. పోరాటంలోనే తుదిశ్వాస విడిచారు.

ఈ వార్త విన్న విజయవాడ పట్టణం విస్తుపోయింది. సముద్రం పోటెత్తిందా అన్నట్లు పట్టణం మొత్తం కదిలి డాక్టర్‌గారి ఇంటికి వచ్చింది. ఇసుక వేస్తే రాలని జన సందోహం. ఆమె అంతిమ యాత్ర శోకసంద్రమయింది. విజయవాడలోని ప్రతి ఇంటిలోనూ ఆమె వైద్యసేవలు పొందని వారు లేరు. ఈ వార్త విన్న నాకు నెత్తిన పిడుగు పడ్డట్టయింది. నా దుఃఖాన్ని పంచుకోవడానికి హైదరాబాద్‌ నారాయణగూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న జోశ్యపట్ల సుబ్బమ్మ ఇంటికి వెళ్ళా. నన్ను చూడగానే విలపిస్తూ వచ్చి కౌగలించుకుంది. ఇద్దరం బోరుబోరుమని ఏడ్చాం. సుబ్బమ్మ గారు డాక్టర్‌గారి ఆసుపత్రిలో నర్సుగా పనిచేసింది. జోశ్యపట్ల సత్యనారాయణగారిని వివాహం చేసుకోకముందు సుబ్బమ్మ గారికి హరి, ఝాన్సీ అనే ఇద్దరు పిల్లలున్నారు. భర్త పోయాడు. పిల్లల కోసం అచ్చమాంబగారి ఆసుపత్రిలో నర్సుగా చేరడం తన అదృష్టంగా భావించింది. ఆ చల్లని తల్లి ఆశ్రయంలో నిశ్చింతగా జీవితం గడిపానని, ఆ సందర్భంలో డాక్టర్‌గారు దసరా పండుగకు కుటుంబీకులందరితో పాటు కొత్త బట్టలు కొంటూ హరికి, ఝాన్సీకి కూడ కొత్త బట్టలు కొనిచ్చారని, మూడు పూటలా కడుపునిండా అన్నం పెట్టలేనిదానిని, కొత్త బట్టలు ఎలా కొనివ్వగలనని, ఆ లోటు డాక్టర్‌గారు తీర్చారని, ఆ దయామయ తల్లిని ఎలా మర్చిపోగలనని చెప్పి విలపించారు.

అచ్చమాంబ ఒక ఆరని జ్యోతి. ఆ జ్యోతి నుండి వెలువడిన వెలుతురు శాశ్వతమైనది. దాన్ని ఏ కారుచీకట్లు, కారు మేఘాలు కప్పివేయలేవు. ఆ దారి దీపం వెలుతురులో మహిళా లోకం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. మహిళలు భయపడకుండా జీవించే సమాజం కోసం కృషి సల్పుతూనే ఉంటుంది. అచ్చమాంబ అమరజీవి. ఆమె ‘ఏమోయ్‌’ పిలుపు, నవ్వితే నాలుగు దిక్కులూ ప్రతిధ్వనించే నవ్వు నా చెవులకు వినపడుతూనే ఉంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.