కరాఫ్‌ కంచరపాలెం = కేరాఫ్‌ మానవీయత – అరణ్యకృష్ణ

ఒక మనిషికి ఒకటే జీవితం అనుకుంటాం. శరీరంలో ఊపిరి ఉన్నంతకాలం ఒక మనిషి బతికుండటమే జీవితం అనుకుంటాం. క్లుప్తంగా చెప్పాలంటే జీవితం అంటే బతికుండటమే అనుకుంటాం. కానీ అనుభవాలతో లెక్కిస్తే ఒకే మనిషి ఒకే శరీరంతో ఒక దానితో ఒకటి పొంతనలేని అనేక జీవితాలు గడుపుతాడు. ఒక వ్యక్తి జీవితం ఎప్పుడూ అతని/అమె కన్నా పెద్దది, బలమైనది కూడా. జీవితం గుణపాఠాలు నేర్పి ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుందనుకుంటాం. జీవితం ఏ రకంగానూ గుణపాఠాలు నేర్పదు. అది బరబరా ఈడ్చుకుపోయే ప్రవాహం. మనిషి మీద బలప్రయోగం చేసి అతని/ఆమె జీవిత గమనాన్ని మార్చేస్తుంది. అయినా మనిషి గింజుకుంటూనే ఉంటాడు, పరిగెత్తుతూనే ఉంటాడు, ఈదుతూనే ఉంటాడు ఒక్కోసారి ప్రవాహానికి అనుగుణంగాను, మరోసారి వ్యతిరేకంగానూ! కులం వల్లనూ, మతం వల్లనూ, దైవం వల్లనూ అణచివేసే జెండర్‌ దృక్పథాల వల్లనూ సమాజం అనేది మనిషి నెత్తిమీద తిష్టవేసి కూర్చున్న, రుద్దబడిన అనివార్య భూతం. సమాజం మనిషి భుజాలమీద కాళ్ళేసుక్కూర్చుని జుట్టు పట్టుకొని గుంజుతూ మనిషిని పరిగెత్తిస్తుంటుంది. తనకు ఆ అనుభవం వద్దని, మరో ప్రత్యామ్నాయం కావాలని, ఆ సమూహం వద్దని… ఈ మనిషి కావాలని కొట్టుమిట్టాడే క్రమంలో పాము కుబుసం విడిచి మరో కొత్త చర్మాన్ని తొడుక్కున్నట్లు కొత్త పాత్రలోకి, కొత్త జీవితంలోకి మారిపోవాల్సి వస్తుంది. అలా ఒకే పుట్టుకలో అనేక జీవితాలు అనుభవించిన ఒక మనిషి కోణం నుండి చెప్పిన కథే కేరాఫ్‌ కంచరపాలెం.

మనం పట్టించుకోం కానీ ఒక పది నిమిషాలు రోడ్డుమీదికొచ్చి అటూ ఇటూ తిరుగుతూ చూస్తే ఈ సినిమా కథానాయకులైన రాజులాంటివారు అనేక మంది కనిపిస్తారు. నాకైతే నేను కూడా కనిపించాను అతనిలో. మనం మరొకటి పట్టించుకోం కానీ మనలో కూడా అనేక జీవితాలు కనిపిస్తాయి. బాల్యం, యవ్వనం, నడి వయసు, వృద్ధాప్యం… ఇవన్నీ ఒక్కో లైఫ్‌ సైకిల్‌లో ఒక్కో జీవితాన్ని ఆఫర్‌ చేస్తాయి. ఒక దశలో ప్రాణప్రదంగా మన గుండె లోపల కొట్టుకున్నవారు, రక్తంలో ప్రవహించిన వారు ఒక జ్ఞాపకంగా మిగిలిపోతుంటారు. పరికించి చూడాలే కానీ జీవితంలో ప్రతి దశ దానికదే ఒక పెద్ద చలనచిత్రం నిజానికి. కేరాఫ్‌ కంచరపాలెం సరిగ్గా ఈ వైచిత్రిని అద్భుతంగా పట్టుకుంది. కుప్పకూల్చిన విషాదంలోంచి ఫీనిక్స్‌ పక్షిలా పైకెగిసి జీవనోత్సాహపు జెండానెగరేసిన సాహసం మనలో కూడా కనిపిస్తుంది. కథానాయకుడు రాజులా ఏకాకితనపు నిస్సహాయతల నుండి, నిస్పృహ నుండి, దౌర్భల్యాల నుండి మనల్ని మనం తోడుకొని నిలబెట్టుకున్నతనమూ కనిపిస్తుంది. నిజంగా కేరాఫ్‌ కంచరపాలెం మన గతంలోకి దారి చూపించే ”రామాపురంలోకి దారి”లాంటి బోర్డు వంటిది.

ఈ సినిమా కథ కోసం దర్శకుడు పెద్దగా కసరత్తు చేసి ఉండడు. ఒక దిగువ మధ్య తరగతి జనావాసానికి వెళ్ళి దారిన పోతున్న ఓ దానయ్యని పిలిచి ”నీ కథేంటో చెప్పరా అబ్బాయ్‌” అని అడిగి తెలుసుకున్నట్లుగా ఉంటుంది. అయితే అతని ప్రజ్ఞ అంతా కూడా ఆ కథని ప్రజెంట్‌ చేసిన విధానంలోనే ఉంది. ఆ సన్నివేశాల అల్లిక అనూహ్యమైనది. సినిమా అయ్యాక కానీ మనకి తెలీదు దర్శకుడు కథని మనకే మాత్రమూ అసౌకర్యం, అనుమానం కలగకుండా ఎంత ముందెనకలు చేసి చెప్పాడు అన్నది. వివిధ జీవితాల్ని ఏకు నుండి దారం లాగినట్లు, అనేక దారాలను కలిపి ఒక వస్త్రం నేసినట్లు ఈ సినిమా పతాక సన్నివేశం తయారైంది. ఇది నిజంగా గుండె అగ్గిపెట్టెలో దాయాల్సిన పట్టు వస్త్రమే. అతి సహజ సంభాషణలు, కాస్ట్యూమ్స్‌, జనావాసాలు… ఇవన్నీ దర్శకుడి ప్రతిభావంతమైన, ప్రభావవంతమైన నెరేషన్‌లో భాగమే. ఎవరండి అక్కడ నటించింది? పాత్రధారులందరూ ప్రవర్తించారంతే. అదొక వైన్‌ షాప్‌ కావచ్చు, పాఠశాల కావచ్చు, వంతెన కింద వెలుగు నీడలు కావచ్చు, ఆడాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ బైటనే వంటలు చేసుకునే ఇరుకైన గవరపాలెం వీథి కావచ్చు. అక్కడ ‘సెట్‌’ చేసిందేమీ లేదు. అంతా ఉన్నదే చూపించారు. సినిమాల్లో భయంకర సెట్టింగులకు అలవాటు పడ్డ మన కళ్ళకి మనం నిత్య జీవితంలో చూసే ఈ సహజ వాతావరణం ఒక సాంస్కృతిక దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. పాత్రధారులు ఎవరూ డైలాగులు చెప్పలేదు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారంతే. వాళ్ళకు తెలియకుండా మనం విన్నాం అంతే అన్నట్లుంది.

విగ్రహ తయారీదారుడైన దిట్టమైన నత్తి రామ్మూర్తి నన్ను తొలిచి పారేశాడు. కిరాయి రౌడీగా బతుకుతూనే, మతం మారి బాధ్యతగా స్వస్థత సభలకెళుతూ అన్ని మతాలూ దండగని తెలుసుకున్న 22 ఏళ్ళ జోసెఫ్‌ నన్ను హత్తుకున్నాడు. నెత్తిమీద ఈకలు రాలడం మొదలైన 32 ఏళ్ళ వయసులో సెక్స్‌ వర్కర్‌తో ప్రేమలో పడ్డ గడ్డం గాడి ప్రకాశవంతమైన కళ్ళు, అమాయకమైన చిర్నవ్వు, నిజాయితీ, భావోద్వేగాలు నా కళ్ళని తడిచేశాయి. మనుషుల పట్ల ప్రేమ, కొంత భోళాతనం, దర్పాన్ని చూపించే అమ్మోరు వంటి మనుషుల్ని ప్రేమించకుండా ఉండలేం. రోజుకో క్వార్టర్‌ బాటిల్‌ తాగినా సరే, డబ్బు కోసం ఎవరో ఒకరితో పడుకున్నా సరే సెక్స్‌ వర్కర్‌కి కూడా ఒక ఆత్మాభిమాన హక్కు, గొప్ప వ్యక్తిత్వముంటుందని నిరూపించిన మానవీయత ఈ సినిమా సొంతం. మనుషుల వ్యక్తిత్వాల గురించిన మూసని పగలగొట్టడం జరిగింది.

గడ్డంగాడు ప్రేమించాల్సినంత శక్తివంతమైన కళ్ళు నిజంగానే ఆ పాత్రధారికి ఉన్నాయి. (ఆ పాత్రధారిణి ఈ సినిమా నిర్మాత కూడానట. ఆమె నిబద్ధతకి నా కరచాలనం) నలభై రెండేళ్ళ వయసులో జీవితానికి తోడుని 49 ఏళ్ళ సంస్కారవంతమైన అవివాహితుడిలో వెతుక్కొని, ధైర్యంగా వ్యక్తం చేసి, ప్రయత్నంలో తడబడ్డా నిలబడిన ఆఫీసరమ్మ పరిపక్వతకి నా జేజేలు. ఈ సినిమాలోని ముఖ్య పాత్రధారి (లీడ్‌ క్యారెక్టర్‌, హీరో కాదు) ఒక ప్రేమైక జీవి. అతగాడు ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ ప్రేమలో ఆవేశముంటుంది. అందమైన అమాయకత్వముంటుంది. ఒక పెద్దరికం ఉంటుంది. జీవితానుభవం ఇచ్చిన హుందాతనముంటుంది. ప్రతి మాటని త్రాసులో వేసి తూచినట్లు మాట్లాడే మెచ్యూరిటీ ఉంటుంది. అనుభవసారాన్నంతా క్రోడీకరించి ప్రతి భావాన్నీ సత్యంగా చెప్పగలిగే తాత్విక దృక్పథం

ఉంటుంది.

కులం, మతం, జెండర్‌ ఈ మూడూ ఈ సినిమా కథకి మూడు మూల స్తంభాలైతే దాన్ని నేర్పుగా చెప్పడమే నాలుగో స్తంభం. ఆ నేర్పరితనమే కుల, మత, జెండర్‌ పరమైన వివక్ష కలిగించే వేదనని, హింసని గుండెకి తాకేలా చెబుతుంది. సామాన్యుల జీవితాన్ని అతలాకుతలం చేసే ఈ మూడు హింసల పరాకాష్ట ఈ సినిమాలో కనబడుతుంది. ఇది ఆలోచించగలిగే వారి ఆలోచనలకి పదును పెట్టగల సినిమా. ఇప్పటివరకు ఆలోచించే శక్తిలేని వారికి చెంపదెబ్బ కొట్టగల సినిమా. విషాదాంత జీవితానికి అర్థవంతమైన ముగింపునివ్వగలిగిన సినిమా. మనిషి జీవితానికి స్నేహం ఎంతటి అవసరమో చెప్పగలిగిన సినిమా.

ఇందులో ఒకట్రెండు లోపాలు లేకపోలేదు. కానీ వాటిని చర్చిస్తే సినిమా చూడని వారికి నేను స్పాయిల్‌ స్పోర్ట్‌ కాగలనేమో అని నా భయం. అందుకే చెప్పటంలేదు.

కథాకాలపు కలగాపులగం నాకు ముందు కొంత ఆశ్చర్యం కలిగించింది. తరువాత పతాక సన్నివేశంలో దర్శకుడు ఏదో మాజిక్‌ చేయబోతున్నాడనిపించింది. కానీ చివర్లో విస్మయకరమైన అనుభూతినిచ్చాడు దర్శకుడు.

ఒక పెద్ద బేనర్‌ చేతిలోకి వెళ్ళిన ఈ సినిమాకి వారేమీ లాభరహితంగా పంపిణీ సౌకర్యం కలిగించలేదు. కానీ పెద్ద బేనర్లు కూడా మంచి చిన్న సినిమాలకి పూనిక వహించక తప్పని స్థితి పాపులర్‌ హీరోయిజపు సినిమాల ఆయువుపట్టు మీద ఈ మధ్య కాలంలో తగిలే దెబ్బలకి సంకేతం. ఇప్పటికైనా అనార్ద్ర హీరోయిజాల రక్తపాతపు హింస కాదు మానవీయ విలువల కోసం సామాజిక… జీవితంలోని హింస తెరపై కనబడితే చూసేవారిలో ఆర్ద్రమైన అనుభూతులు కలుగుతాయని గుర్తిస్తే మంచిది.

కొన్ని సినిమాల్ని మనం థియేటర్లోనే వదిలేసి వస్తాం. కేరాఫ్‌ కంచరపాలెం వంటి సినిమాల్ని మాత్రం గుండెలో దాచుకొని బైటికొస్తాం. చూడని వాళ్ళు చూడండి. చూసే సమయం లేకపోతే మీ విధులకు సెలవు పెట్టి మరీ చూడండి.

నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ అభినందనలు. ఒక మిత్రుడన్నట్లు ఇది 24 క్రాప్ట్స్‌కి సంబంధించిన సినిమా.

దర్శకుడికి నా అభినందనల కౌగిలింత!

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో