స్ఫూర్తినిచ్చే జవహరిబాయి – వి. శాంతి ప్రబోధ

‘అమ్మా మీ వయసు చెప్పకండి దిష్టి తగులుతుంది అన్నాడు ఆ మధ్య నాదగ్గరకొచ్చిన టీవీ జర్నలిస్ట్‌’ అని ‘హేతువాద కుటుంబానికి దిష్టి తగులుతుందట’ భళ్ళున నవ్వేశారు 94 ఏళ్ళ జవహరిబాయి. పేరు కొత్తగా అనిపిస్తోంది కదూ…

అవును, నిజమే పేరే కాదు జీవితమూ, ఆరోగ్యమూ… అంతే. తోటి మహిళల జీవితానికి భిన్నంగా ఆవిడ జీవనం… నిత్యం జీవితాన్నుంచి నేర్చుకుంటూ… సమాజానికి తాను ఇవ్వగలిగింది ఇస్తూ… ఉత్సాహంగా… ఉల్లాసంగా… స్ఫూర్తిదాయకంగా…

సమాజం గురించి స్పష్టమైన లోతైన అవగాహన కలిగిన కుటుంబం ఆమెది. గుత్తా జ్వాల (టెన్నిస్‌), కమల్‌ కిషోర్‌ వంటి సెలబ్రిటీలను అందించిన కుటుంబం ఆమెది. కులాలు, మతాల కుమ్ములాటలతో కన్నబిడ్డలన్న మమకారం లేకుండా తెగనరికే నేటి సమాజానికి ఎంతో ముందున్న కుటుంబం ఆమెది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అంతర్జాతీయ వివాహాలను తమ కుటుంబంలోనే జరిపించిన ఉన్నతమైన గొప్ప కుటుంబం ఆమెది. హేతువాద దృక్పథంతో ముందుకు నడిచిన వసుదైక కుటుంబం ఆమెది. ఎంతో వైవిధ్యమైన జీవితంలో సంక్లిష్టమైన జీవిత అనుభవాలతో పండిన అమ్మ జవహరిబాయి గురించి క్లుప్తంగా… ఆమె మాటల్లోనే!

నన్ను చిన్నప్పుడు బుజ్జి అనేవారు. తొక్కుడుబిళ్ళ, గుడుగుడు గుంచం, గుగ్గిర గిరట (మ్యూజికల్‌ చైర్‌ లాంటి ఆట), ఉయ్యాల ఆట, కోలాటం అన్నింటికీ వెళ్ళిపోయేదాన్ని. అప్పటి రోజుల్లో పిల్లల్ని పట్టుకుపోతారు, పాడు చేస్తారు అన్న భయం ఉండేది కాదు. అందుకే వెళ్ళగలిగాం.

ఈ కులం, ఆ కులం అనుకోకుండా నన్ను చేరదీసేవారు. బ్రాహ్మలకి కాస్త కుల ఫీలింగ్‌ ఉండేది. కానీ వేరే కులాల వాళ్ళకి ఉన్నట్లు అంతగా కనిపించేది కాదు. నాకు వెండి పళ్ళెంలో అన్నం పెట్టి వెన్న, పెరి నెయ్యి వేసి పెట్టేవారు. కనగాల కుటుంబరావు అని వాళ్ళ అక్క కూతురు నా ఫ్రెండ్‌. గుగ్గిళ్ళు, కండి పెట్టేవారు, ఎంతో ప్రేమగా పలకరించేవారు. నేనిట్లా తిరుగుతానని రౌడీ అనేవాళ్ళు. ఆ రోజుల్లో సినిమా ఉండేది కాదు. తోలుబొమ్మల ఆట పెట్టేవారు. గ్రామం మధ్యలో ఆట పెడితే అందరం ఆడ మగా తేడా లేకుండా కూర్చోడానికి చాపలు పట్టుకుని వెళ్ళేవాళ్ళం. అప్పటాళ్ళకి ఎంకమ్మ, సుబ్బమ్మ,

బుల్లెమ్మ వంటి పేర్లు ఉండేవి. మా పేర్లు వాళ్ళకి విచిత్రంగా ఉండేవి.

ఇప్పుడంటే కొత్త కొత్త పేర్లు పెట్టాలని ఆలోచిస్తున్నారు. కానీ దాదాపు 95 ఏళ్ళ క్రితమే మా అమ్మానాన్నలు జి.సుబ్బారావు, లక్ష్మీ బాయి ఆనాటి సమాజంలో పెట్టే పేర్లకు భిన్నంగా మా పేర్లు పెట్టారు. జవహర్‌లాల్‌ నెహ్రుపై అభిమానంతో జవహరిబాయి అని నా పేరు పెడితే అక్కకు నరేంద్రబాయి (నరేంద్రదేవ్‌), చెల్లెళ్ళకు సువర్ణాబాయి (సువర్ణదేవ్‌ ), విఠల్‌బాయి (విఠల్‌ భాయ్‌ పటేల్‌) పెట్టారు. వెంకాయమ్మ, మల్లమ్మ వంటి దేవుడి పేర్లు ఎవరికీ లేవు.

ఆ రోజుల్లో మా ఇంట్లో ఏవో కొద్దిగా పూజలు చేసేవారు కానీ ఇప్పట్లా సత్యనారాయణ వ్రతాలు, కార్తీకమాసం పూజలు, శ్రావణమాసం పూజలు లేవు. వ్రతాలూ లేవు. మా ఇంట్లోనే కాదు నేనెరిగిన ఎవరిళ్ళల్లోనూ ఇప్పుడున్నన్ని పూజలు ఉండేవి కాదు. ఇప్పుడు మూఢభక్తి, భక్తి పేరుతో చేసే ఆడంబరాలూ… అసలు మనం ఎటు పోతున్నామని.

మేం నలుగురం ఆడపిల్లలం. నేను రెండోదాన్ని. మా నాన్న వెంటపడి నేనూ మీటింగులకు వెళ్ళేదాన్ని. మా అక్క, ఇద్దరు చెల్లెళ్ళు వచ్చేవారు కాదు. లైబ్రరీ వార్షికోత్సవాలకి, అక్కడ పెట్టే పోటీలకి వెళ్ళేదాన్ని. ఎక్కడికి వెళ్ళినా భయం ఉండేది కాదు. ఇప్పటిలాగా ఒక ఆడమనిషిని రేప్‌ చేయడం, చంపడం ఉండేది కాదు. అలా చేసేవాళ్ళని నడిరోడ్డులో షూట్‌ చేసెయ్యాలి.

మా ఊళ్ళో 7వ తరగతి వరకే ఉండేది. మా చదువు ఊళ్ళో ముగిశాక హైస్కూలుకి వద్దన్నారు నాన్న. మా పెదనాన్న మా నాన్న వెనకాల పడి ఊరికి దగ్గర్లోకి టౌన్‌లో పెట్టి మమ్మల్ని చదివించారు. ఆ తర్వాత మా నాన్న మాన్పించేశారు. మా పెదనాన్న ప్లీడరు. మా నాన్న ఆయుర్వేద డాక్టర్‌. మా చిన్నాన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, మరో చిన్నాన్న డిప్యూటీ కలెక్టర్‌.

మా నాన్న రష్యా పుస్తకాలు చదివి మార్క్సిజం చెప్పేవారు. సాయంత్రం 7 గంటలకి మాకు క్లాసు మాకు క్లాసు చెప్పేవారు. అలా చెప్పినప్పుడు మేం అటూ చూడకూడదు. ఓ సారి మా మేనమామ వస్తే చూశానని ఒక్కటేశారు మా నాన్న. అంత దీక్షగా వినేవాళ్ళం. చిన్నప్పుడు నన్ను దొరసాని అనేవారు. ఎట్లాగంటే… అప్పటి రోజుల్లో కలెక్టర్‌ తెల్లవాడు. కలెక్టర్‌ భార్యని దొరసాని అనేవారు కదా. నేనూ తెల్లగా, బలంగా ఉండేదాన్ని. దాదాపు 13 ఏళ్ళవరకు తెల్లటి గ్లాస్కో గౌన్లు వేసుకునేదాన్ని. బ్లాక్‌ ముఖమల్‌ పూలు ఉండే గౌన్లు వేసుకునేదాన్ని. ఆ తర్వాత రాట్నం వడికి దారం ఇచ్చి చీరలు నేతకు ఇచ్చి నేయించుకున్నా.

ఎక్కడున్నా కొట్లాటయి, ఎక్కడన్నా జై కాంగ్రెస్‌ కీ జై అంటే అటు పరిగెట్టుడే… పరిగెత్తుడు. మా నాన్న డాక్టర్‌ అయినా కాంగ్రెస్‌కి జై అనేవారు. బ్రిటిష్‌ గవర్నమెంట్‌తో స్వాతంత్య్రం కోసం పోరాటంలో మా ఊళ్ళో 32 మంది జైలుకి వెళ్ళారు. మా అత్తగారింట్లో నలుగురు వెళ్ళారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఎర్రకోట దగ్గరకు యుద్ధానికి వస్తుందని, సుభాష్‌ చంద్రబోస్‌ కొహిమా కొండల దగ్గర దాక్కుని యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాడు. అప్పుడు మా నాన్న తన పేరుతో రూ.30 వేలు పంపించాడు. దాంతో మా ఊరి మునసబు మా నాన్న డబ్బు అచ్చు గుద్దుతున్నాడని తప్పుడు కంప్లెయింట్‌ ఇచ్చి జైలుకి పంపాడు.

ఎక్కడి పులివర్రు, ఎక్కడి రేపల్లె తాలూకా. ఎక్కడ గుంటూరు జిల్లా. ఆ రోజుల్లో మా నాన్న కలకత్తా వెళ్ళి చదువుకుని వచ్చారు. కలకత్తాలో సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబంతో కలిసి వాళ్ళింట్లో ఉండేవారు. మా అమ్మ కడుపుతో ఉన్నప్పుడు అక్కడే ఉంది. మా చెల్లి పుట్టింది. మళ్ళీ ఆడపిల్లా అని మా నాన్న బాధపడుతుంటే ఎందుకు బాధపడతావ్‌ జిఎస్‌.రావు, కాలికి, గోటికి ఎక్కడ దెబ్బ తగిలినా జాగ్రత్తగా చూసేది ఆడపిల్లే అన్నాడట సుభాష్‌ చంద్ర బోస్‌ అన్నగారు శరత్‌ చంద్ర బోస్‌. మా నాన్నకి వాళ్ళతో బాగా మంచి సంబంధాలు ఉండేవి. అప్పుడు గ్రామాల్లో ఇంగ్లీష్‌ మాట్లాడేవాళ్ళు చాలా అరుదు. మా కుటుంబమే ఇంగ్లీష్‌ మాట్లాడేది. మా నాన్న బెంగాలీ కూడా గడగడా మాట్లాడేవారు. నేను నా కూతుళ్ళు ఉష, జ్యోత్స్నలను వాళ్ళింటికి తీసుకెళ్ళి చూసి వచ్చాను. అప్పుడు వాళ్ళు వాడిన కారు ఇప్పటికీ ఉంది.

… … …

ఆ రోజుల్లో త్వరగా పెళ్ళి చేసేవారు. కానీ నాకు 20వ ఏట పెళ్ళయింది.

మా ఇద్దరిదీ ఒకే ఊరు. కాల్వకు ఇవతల, అవతల ఉండేవాళ్ళం. మాది చదువుకున్న కుటుంబం. వాళ్ళది వ్యవసాయ కుటుంబం. మట్టిలో పనిచేయాలి అని వాళ్ళన్నయ్య సంబంధం అడగడానికి మా ఇంటికి వచ్చినపుడు అన్నారు. అప్పుడు మా నాన్న మీరు నాగలి దున్నితే మా అమ్మాయి విత్తనం నాటుతుందన్నారు. వాళ్ళది పెద్ద మేడ. మేడారు అనేవాళ్ళు. భూస్వామ్య కుటుంబం. అంతా వదిలి స్వాతంత్య్ర ఉద్యమంలో కుటుంబమంతా దూకింది. వాళ్ళ కుటుంబంలో ఇంగ్లీష్‌ వాళ్ళ స్కూల్‌కి వెళ్ళకూడదు. నూలు బట్ట కాదు ఖద్దరు బట్ట కట్టాలి అనేవారు. అటువంటి కుటుంబంలోని గుత్తా సుబ్రహ్మణ్యం గారితో నా పెళ్ళి 1947లో అమావాస్య రోజు జరిగింది. మాది కులాంతర వివాహం.

స్వాతంత్య్రం రాకుండా నేను జైలునుండి బయటకు రానని మా తోటికోడలు జైల్లోనే మలేరియాతో చనిపోయింది. తర్వాత స్వాతంత్య్ర ఉద్యమం నుండి కమ్యూనిస్టు ఉద్యమాల్లోకి దూకారు మా వాళ్ళు. మేం మా పిల్లలకు ఆస్తి ఏమీ ఇవ్వలేదు, వాళ్ళను చదివించాం.

ప్రకాశం పంతులుగారి హయాంలో 14 మందిని షూట్‌ చేయమని ఆర్డర్‌ చేశారు. వాళ్ళని కాపాడేవాళ్ళం, షెల్టర్‌ ఇచ్చేవాళ్ళం. తర్వాత కాలంలో మొక్కలు పెంచడానికి మేం సేవాగ్రాం వెళ్ళాం. ప్రభాకర్‌ జీ గాంధీగారి శిష్యుడు చాలా ప్రేమగా ఉండేవారు. ఒక ఎకరం పొలం ఇస్తాను మీరే పండించుకుని మీరే వాడుకోండి అన్నారు.

అక్కడ ఉండగా అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న ఒక కమ్యూనిస్టుకి అన్నం అందించాడు మా ఆయన. మేం ఉన్నది కాంగ్రెస్‌ ఆశ్రమం కదా… ఎవరో తహసీల్దార్‌ ఆఫీసుకు వెళ్ళి మాపై కంప్లెయింట్‌ చేశారు. మమ్మల్ని వెళ్ళిపోవాల్సిందిగా ఆదేశించారు, వ్యాన్‌ తెచ్చి ఎక్కమన్నారు. వెళ్ళనని చెప్పా. మేం ఏం తప్పు చేశామని వెళ్ళాలి, మేం వెళ్ళం అని వాళ్ళతో చాలా పోరాడా. ఆడపోలీసులను తీసుకొచ్చారు. ఆశ్రమంలోకి పోలీసులు రాకూడదు కదా…అందుకే మమ్మల్ని బయటికి రమ్మన్నారు. కృష్ణాజిల్లాలో జమీందారు మనిషిని చంపిన వాళ్ళలో ఇద్దరు నక్సలైట్ల పాత్ర ఉంది. అందుకు మేం బయటికి రావాల్సి వచ్చింది.

పిల్లిపిల్లల్ని ఇల్లిల్లు తిప్పినట్లు మేం మా పిల్లల్ని పట్టుకుని ఊరూరూ తిరిగాం. చీరాలలో స్మశానంలో ఇల్లు కట్టారు. అక్కడ దాక్కున్నాం. అక్కడిక్కూడా సిఐడి అధికారులు వచ్చారు. మా ఆయన్ని రెండు రోజులు అరెస్ట్‌ చేశారు. పిల్లని పట్టుకుని అక్కడ్నుంచి మద్రాస్‌ వెళ్ళాం. సుబ్రహ్మణ్యం గారి ముగ్గురు అన్నదమ్ములు అక్కడ లక్ష్మీభూపతి గారి 350 ఎకరాల తోట చూసుకునేవారు. వాళ్ళకే అస్తుబిస్తుగా గడుస్తోంది. నాకిక్కడ బాగోలేదు. నేను మళ్ళీ వార్ధా సేవాగ్రాం వెళ్ళాల్సిందేనని పట్టుబట్టి వెళ్ళిపోయా.

ప్రతి మీటింగుకి గాంధీగారి శిష్యులు, సుశీలా నయ్యర్‌, మణిమాల బెహన్‌…అందరూ జవహరిబాయి అంటూ

ఉండేవారు. వారి ఆలోచనలు, వాతావరణం నాకెంతో నచ్చింది. వాళ్ళు ఎంతో ఆదరంగా చూసేవారు. అందుకే తిరిగి వార్దాకి వెళ్ళాం.

గాంధీగారి శిష్యురాలు సుశీలా నయ్యర్‌ 1969లో మెడికల్‌ కాలేజి పెట్టింది. ఆవిడ చాలా ప్రేమగా ఉండేది. ఒక మహిళ డెలివరీ కాలేక చనిపోయింది. అది చూసి చలించి మెడికల్‌ కాలేజీ పెట్టింది. గ్రామస్తులకు సేవ చేయడం కోసం పెట్టింది. అది ఇప్పుడు 500 పడకల ఆస్పత్రి అయింది. ఆ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌ రసోయి చేసుకొమ్మని స్టోర్‌ బాధ్యతలు నాకు అప్పగించింది. నాకు తెలుగు, మరాఠీ, బెంగాలీ, తమిళం, హిందీ భాషలు వచ్చని.

5 రకాల వంటలు చేయాలి. మినిస్టర్‌ అయినా, బంట్రోతు అయినా అందరూ వరుసలో నిల్చొని అన్నం పెట్టించుకోవాలి. అదేవిధంగా పళ్ళెం కడిగిపెట్టాలి.

పిల్లలు పుట్టిన తర్వాత సేవాగ్రాంలోనే ఇంగ్లీష్‌ క్లాసులకు వెళ్ళి ఆ తర్వాత, తమిళం, మరాఠీ, హిందీ భాషల్ని 15 రోజుల్లోనే నేర్చుకున్నాను. అరవవాళ్ళు నన్ను చూసి ఎంతో సంతోషపడిపోయే వాళ్ళు. 3 తరగతి నుండి హిందీ చదివా.

పచ్చళ్ళు చేసేదాన్ని. టమాటా పచ్చడి కలుపుతుంటే ఆశ్రమానికి వచ్చినతను తన పెళ్ళికి ఆ పచ్చడంతా ఇవ్వమన్నాడు. సరే తీసుకెళ్ళమని ఇచ్చాను. 1300 మామిడికాయలు, 100 కిలోల టమాటా పచ్చడి చేసేదాన్ని. పచ్చళ్ళు అమ్మేదాన్నని ఎవరూ చిన్నచూపు చూసేవారు కాదు.

… … …

మా కుటుంబంలో కులాలు లేవు. అన్ని కులాలు కలిసిపోయాయి. దాదాపు 200 మంది సభ్యులు ఉన్నారు. గుత్తా సుబ్రహ్మణ్యంగారి అన్నదమ్ముల కుటుంబంలో కులం అనే మాట అడుగుపెట్టకూడదు.

స్కూల్‌ హెడ్మాస్టర్‌ మా అమ్మాయిలను కులం గురించి అడిగితే మాకు తెలియదు అని చెప్పేవారు. మా పిల్లలకి భారతీయులు అని రాసేవాళ్ళం కానీ కులం రాసేవాళ్ళం కాదు. మా మనవడి విషయంలో కోర్టు ద్వారాపెద్ద ఫైటింగే చేశాం. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇంకా కులాలు ఏమిటి అని ప్రశ్నిస్తున్నా…

మా మరిది కూతురు చైనా అబ్బాయిని చేసుకుంది. అట్లాగే మా చిన్నబ్బాయి చైనా అమ్మాయిని చేసుకున్నాడు.

… … …

నాన్న ఆయుర్వేద వైద్యుడు. ఆయన దగ్గర, ఆయుర్వేద భిషక్‌ రత్న ఆచంట లక్ష్మీపతి గారి దగ్గర కొంత వైద్యం తెలుసుకున్నాను. అదే నా కుటుంబానికి వాడేదాన్ని.

సేవాగ్రాంలో ఉన్నప్పుడు హాస్పిటల్‌ టెస్టులకు ఒక్కొక్కరికి రూ.2 చొప్పున, ఏడాదికి రూ.16 చొప్పున మా కుటుంబానికి ఇచ్చేవారు. అవి ఊరికే పోయేవి. అట్లాగే మా చిన్నబ్బాయికి రిజర్వ్‌ బ్యాంక్‌ మందులన్నీ ఉచితంగానే ఇస్తుంది. అయినా ఏనాడూ వాడుకోలేదు.

రకరకాల మూలికలు వేసి నూనె కాస్తాను. అది 20 విధాలుగా పనిచేస్తుంది. మేమంతా నేను కాసే నేనూ వాడతాము. ఉసిరి మురబ్బా, గులాబీ రేకుల పొడి, గంధం పొడి, సున్నిపిండి, పచ్చళ్ళు అన్నీ ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. చిన్నప్పుడు మా ఇంట్లో ఆంధ్రా వంటలతో పాటు బెంగాలీ వంటలు ఉండేవి. నేను ఢిల్లీ వంటలూ నేర్చుకున్నా. ఇప్పటికీ అన్ని వంటలూ చేస్తూనే ఉంటా. టీవీలో వచ్చిన వంటలూ నేర్చుకుంటా.

డిసెంబరు 2007 వరకూ ఆవులు ఉండేవి. ఆవు పాలు, నెయ్యి వాడతా. వ్యవసాయ కుటుంబంలోకి వచ్చాకే పాలు పితకడం నేర్చుకున్నా. టైలరింగ్‌ నేర్చుకున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా ఎదురొడ్డి నిలబడ్డా కానీ ఆత్మహత్య వంటి ఆలోచనలు ఏనాడూ చేయలేదు.

చాలాసేపటి నుండీ మాట్లాడుతూనే ఉన్నారు అలిసిపోయారేమో అంటే ఇంకో రెండు గంటలయినా ఇలాగే మాట్లాడగలను అని ఎంతో హుషారుగా చెప్పిన జవహరిబాయి నుండి ఈ తరం స్ఫూర్తి పొందాల్సిన అంశాలెన్నో…

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.