ఒకరి కోసం ఒకరు : అభివృద్ధిలో మానవ హక్కుల కూర్పు కొయిలీరాయ్‌ – ఆంగ్లమూలం: వసంత్‌ కన్నభిరాన్‌ – తెలుగు అనువాదం: చంద్రలత

(గత సంచిక తరువాయి…)

అయితే వాళ్ళమ్మ పూజకు వచ్చారు. అతను నాటకం వేశాడు. ఆ తరువాత…?

అతని తల్లి పూజకు వచ్చారు. పిల్లలు కూడా అనుకోకుండా వచ్చారు. అందుకని ఆ పూజ అతనికి ఎంతో సంతోష సమయం. అతనెప్పుడూ చెప్పలేదు కానీ, వాళ్ళమ్మతో అతనికి ఉన్న సంబంధం కఠినంగా ఉండేది. మొదట మా పెళ్ళి విషయం, ఆ పైన ఇల్లు అమ్మడం… ఇలాంటివన్నీ. అతని తల్లి మిగిలిన బిడ్డలతో చనువుగా ఉండి, ఇతనితో ఎక్కువ సమయం గడిపేది కాదు, ఇబ్బందుల్లో

ఉన్నప్పుడు కూడా. అది అతని మనసుకి కష్టం కలిగించినట్లుంది. కారణాలు ఏమైనా, నేను తరచి అడగలేదు.

అతను మళ్ళీ అతని పాత రోజులకు వస్తున్నట్లుగా ఉన్నాడు. అతను బెంగళూర్‌ వెళ్ళాలనుకొన్నాడు. అది మరొక సమస్య. అతని లాగానే ఉద్యోగ విరమణ చేసిన అతని మిత్రుడొకడు, అతనితో కలిసి వ్యాపారం చేసుకోవాలని బెంగుళూరుకు రమ్మని పిలుస్తూ

ఉండేవాడు. అతను నేను లేకుండా ఎక్కడికీ వెళ్ళేవాడు కాదు, ఒక్క పేకాటకి తప్ప. నేను ఎంతో నొచ్చుకునేదాన్ని. ఎంతో వత్తిడిగా కూడా ఉండేది. ఇబ్బంది పడేదాన్ని. మా స్నేహితులలో ఒక జోక్‌ ప్రచారంలో ఉండేది. నేను లేకుండా అతను ఎక్కడికీ కదలడని. అది నాకు నచ్చేది కాదు. నేను ఊపిరాడనట్లు భావించేదాన్ని.

అతను కొన్నిచోట్లకు వెళ్ళేవాడు కాదు. కొన్నిసార్లు, అతను వెళ్ళడం మానుకొంటాడని వెళ్ళేదాన్ని. అసలు ఊపిరాడేదే కాదు. అతను నన్ను ఒత్తిడి చేస్తున్నాడని అనేదాన్ని. ”లేదు, నేనేమీ ఒత్తిడి చేయడంలేదు. నీకు నచ్చకపోతే రావద్దు. నేనూ మానుకుంటాను” అనేవాడు. నేననేదాన్ని, ”ఇదిగో ఇదే ఒత్తిడి” అని. కానీ, అతనెప్పుడూ దాన్ని ఒత్తిడిగా భావించలేదు.

అతను అనుకోలేదేమో, కానీ…

కానీ నాకు తెలుసు. అది చాలా ఒత్తిడి.

మా స్నేహితుల్లో పాతుకుపోయిన జోక్‌ ఇదీ, అతను నేను లేకుండా ఎక్కడికీ వెళ్ళడు అని. కానీ నేను ప్రతిచోటకీ వెళ్ళేదానిని, నేను ప్రతిచోటకి అతను లేకుండా. నేను ఒక నాటకం చూడాలనుకొన్నా, ఒక సంగీత కార్యక్రమానికి వెళ్ళాలనుకొన్నా, ఒక స్నేహితురాలిని కలవాలనుకొన్నా, అతను రానన్నా నేను ఒంటరిగానే వెళ్ళేదానిని

మరొక చిత్రమైన విషయం ఏంటంటే, అతను నా పట్ల చాలా పొసెసివ్‌గా ఉండేవాడు. అది నాకు తెలుస్తూనే

ఉండేది. కానీ, దాన్ని వ్యక్తపరిచేవాడు కాదు. తెలుసుకదా, చిన్నప్పుడు అది బానే ఉంటుంది. కానీ, కొంత వయసు దాటాక, అదే వత్తిడి అవుతుంది. అతను దాదాపు ఏడాది నుంచి తన బెంగుళూరు ప్రయాణాన్ని వాయిదా వేస్తూ వస్తున్నాడు, నేను అతనితో రావట్లేదని. చివరికి అతను వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఇక అదే ఆఖరు. అతను వెళ్ళాడు. నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను. అతను రెండు రోజుల తర్వాత తిరిగి రావలసింది. కానీ, రాలేదు. అంతే, అతను రైలులోనే చివరి శ్వాస విడిచాడని నీకు తెలుసు కదా?

చెప్పండి…

అవును, అతను బెంగళూరులో ఉన్నాడు. ఆదివారం వెళ్ళాడు. ఆ తరువాతి శనివారం తిరిగి రావలసింది. రెండు రోజులు, రెండు నుంచి నాలుగు రోజులు. ఎందుకంటే అతను రైలు ప్రయాణం ఎంచుకున్నాడు. అక్కడ మకాం తక్కువే. జర్మన్‌ కంపెనీ రెండు రోజుల సమావేశానికి వచ్చింది. అతను వారితో భాగస్వామ్యం గురించి చర్చిండానికి వెళ్ళాడు. నీకు తెలుసు కదా, ఇదంతా నవ్వులాటలా అనిపిస్తుంది. ఆ మాటే నేను నా జ్ఞాపకాల వ్యాసంలో రాశాను. అంతకు మునుపు బిజూ అతనిని రమ్మన్నాడు. అతనితో తరచూ వెళ్ళమని అంటుండేదానిని. ”నువ్వెందుకు వెళ్ళవు? ఒక ప్రయత్నం చేయి. డబ్బు కోసం కాకపోయినా, కొంత కాలక్షేపం ఉంటుంది. నీకూ చేయడానికి ఏదో ఒక వ్యాపకం ఉంటుంది” అని అతనితో అనేదాన్ని నేను. అదీ కాక బిజూ అతనికి మంచి స్నేహితుడు. వారు ఇంగ్లండ్‌ నుంచీ, చిన్నప్పటి నుంచీ స్నేహితులు.

ఇప్పుడు అతను అన్నాడు. ”సరే నేను వెళుతున్నాను” అని.

”అతను వెళ్ళకపోతే బావుండు” అనుకున్నాను లోలోపలే. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ నేను పైకి ఏమీ అనలేదు.

అతను చేస్తున్నదేమిటో అతనికి తెలిసినంత వరకూ…

అవును. కానీ నేనేమీ అనలేదు. అతను కూడా ఆఖరి నిమిషంలో చెప్పాడు. రైలు టిక్కెట్లు కొన్న తర్వాత. ఎందుకంటే మేము, ముఖ్యంగా రేష్మి అతని రైలులో వెళ్ళనివ్వదు. అతను చాలా అహంభావి. ”నేను ఇప్పుడు రిటైర్‌ అయినవాడిని. నా వ్యాపారం బాగా సాగేటప్పుడు విమానంలో వెళ్ళవాడిని” అన్నాడు. ”నీవు వెళ్ళాలనుకొన్నప్పుడు ముందుగా చెపితే, ముందుగా తక్కువ ధరలోనే టిక్కెట్‌ తీసుకునేవాళ్ళం కదా?” అన్నాం. అప్పటికి, ఆ సమయం కూడా మించిపోయింది. అతనికి బెంగళూరు ప్రయాణం చాలా మంచి అనుభవం. అతని స్నేహితుడు, ఆయన భార్య జాగ్రత్తగా చూసుకొన్నారు.

అతను చాలా సంతోషంగా ఉన్నాడు. అతని వ్యాపార ప్రయత్నం కూడా ఫలించినట్లే. దాని గురించి మేము తరచూ మాట్లాడుతూనే ఉన్నాము. అప్పుడే చాలా వింతగా, యాదృచ్ఛికంగా ఒకటి జరిగింది. అతనికి మొబైల్‌ ఫోన్లంటే గిట్టదు. అతను ఎప్పుడూ వాడలేదు. అతని పుట్టినరోజు అక్టోబర్‌లో. అక్టోబర్‌ 6 న, నేను విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్నాను. ఆ రోజు ఒక ముఖ్యమైన అధికార కార్యక్రమం. ఆ పగలంతా అతనితో సమయం గడపలేకపోయాను. మేం ఒక సంప్రదాయం పాటిస్తాం. పుట్టినరోజు నాడు సాంప్రదాయ వంటకాలను వండి వెండి పళ్ళాలలో వడ్డిస్తాము. కానీ, ఆ పూట నాకసలు తీరికలేదు. దానికి తోడు ఆ పూట వంట మనిషి రాలేదు. ”చచ్చాంరా” అనుకున్నాను. కనీసం ”పాయేశ్‌” అయినా వండాలి కదా అనుకున్నాను. కానీ, దానికి కూడా తీరిక లేదు నాకు. నేను రేష్మికి ఫోన్‌ చేశాను. ”రేష్మి! ఏం చేయాలో నాకు తోచడం లేదు. మీ నాన్న 60వ పుట్టినరోజు. ఎంతో ముఖ్యమైనది. మీరిద్దరూ వస్తే బావుంటుంది” అన్నాను. మా అమ్మాయిలు కూడా రాలేకపోయారు. వారికీ ఏవో ఇబ్బందులు, నాకేమో తీరిక లేదు. ఏం చేయాలో తోచడంలేదు. నేను చాలా బాధపడుతున్నాను. అతనేమో, ”ఫరవాలేదు, ఫరవాలేదు” అంటున్నాడు. నాకు అతనితో గడపడానికి సమయం లేదు. ఆ కొద్ది రోజుల తర్వాతే అంతటి దుర్ఘటన జరిగింది. ఇంతలో రేష్మి, స్నేహితులు అతనికి ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వారిలో ఒక అమ్మాయి, ”రేష్మి తరపున మిమ్మల్ని ఈ పూట లంచ్‌కి తీసుకెళతాను” అని చెప్పింది. అలా వాళ్ళు అతన్ని మధ్యాహ్నం లంచ్‌కి తీసుకువెళ్ళారు. అతను రెస్టారెంట్‌ నుంచి నాతో మాట్లాడాడు.

”కొయిలీ, నీ ఆఫీసుకు దగ్గర్లో ఉన్నాం. నువ్వూ లంచ్‌కి రాకూడదూ”అంటూ. నా ఎదురుగా మనుషులు కూర్చుని ఉన్నారు. నేను అతనికి చెప్పాను. ”మనం రాత్రికి డిన్నర్‌కి వెళ్దాం” అని. అతన్ని నేను లంచ్‌లో కలవలేకపోయాను. రేష్మి అతనికి ఒక మొబైల్‌ కానుకగా పంపింది. నేను ఆఫీసు నుంచి రాగానే అతను అన్నాడు. ”చూడు రేష్మి నాకు మొబైల్‌ ఫోన్‌ పంపింది. తన ఆఫీసు నుంచి కొరియర్‌ చేసింది. పిల్లలు ఊరికే డబ్బు వృధా చేస్తారు. నేను మొబైల్‌ వాడను కదా?”

కానీ అతను ఆ రోజు మంచిగా గడిపాడు కదా!

అవును. అతను రేష్మి స్నేహితులతో మంచి సమయం గడిపాడు. అది మరిచిపోలేని పుట్టినరోజు. సాయంత్రం పనయ్యాక నేను ఫ్రెషప్‌ అయి బయటికి వెళ్దాం అనుకొన్నాను. ఇంతలో మా పెద్దమ్మాయి ఫోన్‌ చేసింది. ఒబెరాయ్‌ గ్రాండ్‌లో మా ఇద్దరికీ డిన్నర్‌ బుక్‌ చేశామని. మా అల్లుడు అక్కడ కుక్‌-డి-రిగర్జోర్‌.

అతను చెఫ్‌?

మా అమ్మాయి కూడా ఒబెరాయ్‌లోనే పనిచేసేది. ఇప్పుడు మానేసింది. అలా, వాళ్ళిద్దరూ మాకు విందు ఏర్పాటు చేశారు. అలా ఆ రోజు సాయంత్రం మేమిద్దరమూ హాయిగా గడిపాం. మా అమ్మాయిలు రాలేకపోయినా, వాళ్ళు అది ఒక ప్రత్యేకమైన పుట్టినరోజుగా గడపడానికి, చేయగలిగిన ఏర్పాట్లన్నీ చేశారు.

ఆ బెంగుళూరు ప్రయాణంలో మరొక విచిత్రం ఏంటంటే, అతను ఎప్పుడూ మొబైల్‌ వాడలేదు. అతను రేష్మిని రోమింగ్‌ ఫెసిలిటీ వేయించమంటున్నాడు. ”అమ్మా! నాన్నకు ఏమైంది? ఆయన మొబైల్‌ తీసుకువెళ్తున్నారు. రోమింగ్‌ వేయించమంటున్నారు” అంది రేష్మి. మొబైల్‌ ఉన్నప్పుడు తీసుకెళ్ళనీ అనుకున్నాను. అతను ప్రయాణమై వెళ్ళేరోజు కూడా రేష్మికి ఫోన్‌ చేసి ”రోమింగ్‌ ఉందంటావా?” అని అడిగాడు. ”అవును నాన్నా, రోమింగ్‌ వేయించాను” అంది రేష్మి. అతను నాకు, పిల్లల నంబర్లు మాత్రం చేయగలడు. ఆ మూడు నంబర్లే, లేకపోతే మాకు విషయం తెలిసేదే కాదు. కొన్ని సందర్భాల్లో కుటుంబాలకు చనిపోయినవారి విషయం తెలియడానికి చాలా రోజులు పడుతుంది. అతను రైలులో నుంచి నాతో మాట్లాడాడు. శుక్రవారం రాత్రి బెంగుళూరు నుంచి చెన్నై వెళ్ళాడు. అక్కడ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరాడు. సాయంత్రం నాతో, లైలీతో, రేష్మితో మాట్లాడాడు రైలులో నుంచి. రైలు మర్నాడు మధ్యాహ్నం ఒంటిగంటకు కలకత్తా చేరుతుందన్నాడు. ఒకవేళ ఆలస్యమయితే భోజనం చేసేస్తానన్నాడు. ”నీవు ఆ తర్వాత పనికి వెళ్ళొచ్చు” అన్నాడు. ”నేను పనికి వెళ్ళినా, మీరు రాకముందే వచ్చి ఉంటాను లెండి” అన్నాను. అదే మా ఆఖరి సంభాషణ.

అప్పుడు మీరు కలకత్తాలో ఉన్నారు..

నేను కలకత్తాలో ఉన్నాను. నేను ఢిల్లీ నుంచి వచ్చేసాను. నవ్వొచ్చే విషయం ఏమిటంటే, అతనికి నేను ఇంట్లో ఒంటరిగా

ఉండడం ఇష్టంలేదు. నేను ఢిల్లీ వెళ్ళి వచ్చినప్పటి నుంచీ అంటూనే ఉన్నాడు, ”నీవు మీ అక్క వాళ్ళింటికి వెళ్ళి

ఉండొచ్చు కదా? మీ అక్కను పిలుచుకోవచ్చు కదా?” అని. మాకప్పుడు పార్ట్‌ టైం హెల్ప్‌ మాత్రమే ఉండేది. అందుకే నేనన్నాను. ”ఏముందీ! మనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోనే ఉంటున్నాము. నేను అభద్రతగా భావించడం లేదు. సంతోషంగా

ఉన్నాను. నేనెక్కడికీ వెళ్ళను. ఎవరినీ రమ్మని పిలవను. నేను యాభై ఎనిమిదేళ్ళ వ్యక్తిని. నేను సంతోషంగా ఉన్నాను” అని. ఆ పూట మా అక్క భోజనానికి పిలిచింది. ఆమె ఇల్లు నడిచి వెళ్ళేంత దగ్గరగా ఉంటుంది.

ఆ రాత్రి అతను నాతో మాట్లాడినప్పుడు, రాత్రి భోజనం చేసేసాడు. నేను అతనికి అక్క భోజనానికి పిలిచిందని

చెప్పాను. ఆ రాత్రి అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటాననీ, పొద్దున్నే ఇంటికి వస్తాననీ చెప్పాను. నిజానికి పదకొండు గంటల సమయంలో రాత్రిపూట ఒంటరిగా నడిచి రావడం కష్టం. పైనుంచి, అది శీతాకాలం. అతను చాలా సంతోషించాడు. ”మొత్తానికి నా మాట విన్నావు” అన్నాడు. ”అదేమీ కాదు. అర్థరాత్రి పూట నడవడం ఇష్టం లేదు. నేను పొద్దున్నే ఇంటికి వచ్చేస్తాను” అన్నాను.

అతను ఎక్కడ ఉన్నాడు?

రైలులో.

అయితే అప్పుడతను బాగానే ఉన్నాడా?

మరొక చిత్రమైన విషయం ఏమిటంటే, చాలా నెలల తర్వాత, దాదాపు ఏడాది తర్వాత పాడడానికి కూర్చున్నా. మా కుటుంబమంతా సంగీతాభిమానులమని చెప్పాను కదా. నేను కూడా పాడుతాను. ఈ మధ్యన నేను పాడడం లేదని అతను తరచు ఫిర్యాదు చేస్తున్నాడు. నాకు తీరిక లేదు. కానీ అతను తరచూ పాడుతూనే ఉన్నాడు.

ఆ రాత్రి నేను దాదాపు గంటన్నర సేపు పాడుతూ కూర్చున్నా. ఆ పాటలన్నీ విరహ గీతాలే. విరహమంటే విడిపోవటం కదా. నాలో నేననుకున్నాను, ”ఓ దేవుడా! నేనెందుకు ఈ పిచ్చి పాటలు పాడుతున్నాను? రేపు బాబుల్‌ తిరిగి వచ్చాక ఇద్దరం కలిసి ప్రణయ గీతాలు పాడుకొంటాం, మేమెప్పుడూ పాడేవి”. ఇక అప్పటినుంచీ ఒక్క వాక్యం కూడా పాడలేకపోయాను. పాడాలంటే ఈ జ్ఞాపకాలన్నీ ముసురుకుంటాయి.

సరే, ఇంటికి తాళం పెట్టి అక్క వాళ్ళింటికి వెళ్ళాను. భోజనం చేశాం. చాలాసేపటి వరకు కబుర్లు చెప్పకొన్నాం. అతని లక్షణాల గురించి మాట్లాడుకున్నాం. అతను అసహనపరుడు. అతను పరుగులు పెట్టాల్సిన అవసరం లేకపోయినా, ఎప్పుడూ పరిగెత్తుతున్నట్లే

ఉండేవాడు. అక్క అతన్ని అనుకరించి చూపుతుంటే నవ్వుకొన్నాం. బహుశా అదే సమయాన అతను వెళ్ళిపోయినట్లున్నాడు. ఆ రాత్రి పన్నెండున్నర దాకా మెలకువతోనే ఉన్నాం. మేం మాట్లాడుకుంటూ ఉన్నాం. దాదాపు 4 గంటల వేళ ఫోన్‌ మోగింది. పిల్లలెవరూ ఇంట్లో లేరు. అందరం ఉలిక్కిపడి లేచాం. నేను పరిగెత్తికెళ్ళి ఫోన్‌ తీశాను. తను షేవంతి. మా అక్క కోడలు.

అప్పుడు బొంబాయిలో ఉంటోంది. ఆ పూట నేను వాళ్ళింట్లో ఉన్నానని ఆమెకు తెలియదు. పై నుంచి నా గొంతు మా అక్క గొంతులానే ఉంటుంది. అందుకే ఆమె అన్నది, ”అమ్మా, అమ్మా, రేష్మి రేష్మి”.

రేష్మి అన్న మాట వినగానే, తనకేదో కీడు జరిగిందనుకున్నాను. ”షేవంతి నేను పిన్నిని. రేష్మికి ఏమయింది? ప్రమాదమేమీ లేదు కదా?” కానీ తను ఫోన్‌ పెట్టేసింది. నేనావేళ అక్కడుంటానని ఊహించినట్లు లేదు. రేష్మి ఈ విషయాన్ని షేవంతికి చెప్పింది. మొదటి విమానంలో కలకత్తా వస్తున్నాననీ చెప్పింది. షేవంతి నా గొంతు వినగానే ఫోన్‌ పెట్టేసింది. నేననుకొన్నాను కుప్పకూలి పోతానని.

ఎక్కడో ఏదో దోవ తప్పుతోందని మీకు ఎప్పుడూ తెలుసు.

మళ్ళీ ఫోన్‌ మోగింది. అక్కా ఈసారి ఫోన్‌ నువ్వు ఎత్తు అన్నాను. అక్క ఫోన్‌ తీసింది. ఆమె చెంపలపై కన్నీరు ధారలు కట్టాయి. ”ఏమంటున్నావ్‌? ఏమంటున్నావ్‌?” ఆమె అంటోంది. రెండోసారి మోగిన ధ్వనికి మా బావగారు, వారి అక్క అందరూ లేచి వచ్చారు. అక్క నిశ్శబ్దంగా ఫోన్‌ను బావ చేతిలో పెట్టింది. ”అక్కా, రేష్మికి ఏమయింది?” అక్కను నిలదీశాను. బావ మాటల్లో బెర్హంపూర్‌ అన్న మాట దొర్లింది. నేను రేష్మిని ఎవరో ఎత్తుకుపోయి ఉంటారనుకున్నాను. నాకెందుకనిపించిందో రేష్మి బెర్హంపూర్‌ దగ్గర్లో ఉన్నట్లు ప్రమాదంలో పడినట్లు అనిపించింది. బావగారిని నిలదీశాను. రేష్మికి ఏమయ్యింది?

”రేష్మి కాదు, బాబు” బావ అన్నాడు.

”అతనికేమయ్యింది?” మా బావ ఫోన్‌ పెట్టేసి తల ఆడించాడు.

”అతను జీవించి ఉన్నాడా? జబ్బున పడ్డాడా?”

”వాళ్ళంటున్నారు, అతను ఇక లేడని”

నేను కుప్పకూలిపోలేదు. ముక్కలు ముక్కలవలేదు. రేష్మి క్షేమంగా ఉన్నదన్న రిలీఫ్‌.

నాకూ అలాంటి అనుభవం ఒకటి కలిగింది. ఒకేసారి రిలీఫ్‌, భయం కలుగుతాయి.

నిజం. నిజానికి నా చుట్టూ ఉన్న వాళ్ళంతా నా స్పందనకి ఆశ్చర్యపోయారు. నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. నిశ్శబ్దంగా

ఉన్నాను. ”చాలా దూరంలో ఉన్నాడు కదా ఇప్పుడేం చేయాలి?” అని మాత్రమే ఆలోచిస్తున్నాను.

ఏం జరిగింది?

టికెట్‌ కలెక్టర్‌ చెప్పిన దాని ప్రకారం, అతను అసౌకర్యంగా ఉన్నట్టు చెప్పాడట. రైలులో ఎవరైనా డాక్టర్‌ ఉన్నారా అని అడిగారట. తరువాతి స్టేషన్‌లో దిగిపోతానన్నారట. అప్పుడు టిటి అన్నారట, ”తరువాతి స్టేషన్‌ పల్లెటూరు. అక్కడ వైద్య సదుపాయం ఏమీ దొరకదు. గంటలో బెర్హంపూర్‌ స్టేషన్‌ ఉంది. అక్కడికి సందేశం పంపుతున్నాను. వైద్య బృందం మీ కోసం సిద్ధంగా ఉంటుంది.”

అతను నిటారుగా కూర్చున్నాడట. అతని భంగిమ నా కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది. తరచూ అలాగే కూర్చునేవాడు. అలా కూర్చుని యోగా చేసేవాడు. అతనిది మంచి శరీరము. అతను నిటారుగా కూర్చుని ప్రాణాయామం చేసేవాడు.

అతను నిటారుగా కూర్చుని ఉన్నాడు. వాళ్ళు ఒక చిన్న స్టేషన్‌లో రైలు ఆపి బెర్హంపూర్‌కి వైర్‌లెస్‌ ద్వారా సమాచారం పంపారు. ఆ విషయం చెప్పడానికి తిరిగి అతని వద్దకు వచ్చేసరికి, అతనిలో ప్రాణం లేదు. అతను నిటారుగా కూర్చుని

ఉన్నాడు.

ఒక విధంగా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా…

చాలా ప్రశాంతం. అక్కడి వాళ్ళతో పాటు టి.టి, అతని పేపరు మహమ్మద్‌ జమీల్‌, అతని పక్కన మొబైల్‌ ఉండడం గమనించారు. వాళ్ళు చాలా నంబర్లు ప్రయత్నించారు. చివరికి రేష్మి నంబరు కలిసింది. అదీ బెర్హంపూర్‌ చేరేటప్పటికి, అక్కడ ఉన్న వైద్య బృందం అతని మృతిని ప్రకటించి, ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. అప్పుడు మహమ్మద్‌ జమీల్‌ అందరికీ ఫోన్లు చేసే ప్రయత్నం చేసారు. అప్పుడు తెల్లవారుజాము 2ః30, మూడు గంటల సమయం. రేష్మి అన్నది, ”అప్పుడు నాన్న ఫోన్‌ నుంచి కాల్‌ అంటే నాన్నకు ఏదో బాలేదని అనుకొన్నా. అది తెలియపరచడానికి ఎవరో ఫోన్‌ చేశారనుకొన్నా.”

ఎందుకంటే మాకున్న పెద్ద భయం, అతను పొగ తాగడానికి రైలు తలుపు తీసి నిల్చుంటాడేమోనని. అతను పడిపోయి

ఉండొచ్చు. అతను విపరీతంగా పొగ తాగేవాడు.

ఇదీ రేష్మి మొదటి ఆలోచన. మహమ్మద్‌ జమీల్‌ అడిగాడు, ”గౌతంరాయ్‌ నీకు తెలుసా? అతను మీకు ఏమవుతాడు?”

రేష్మి చెప్పింది, ”నేను అతని కూతుర్ని”.

”అతను ఇక లేడు” చెప్పాడతను. రేష్మి అప్పుడు ఒంటరిగా ఉంది. ఎలా స్పందించాలో తెలియలేదు. ఆ తర్వాత చెప్పింది. ”అమ్మా, నేనేమీ బదులివ్వలేకపోయాను”.

రేష్మి తన ఫోన్‌ డిస్కనెక్ట్‌ చేసి, లైలీకి చెప్పింది, ”ఇదీ నాకు అందిన సమాచారం. విషయం కనుక్కో…” లైలీ వెంటనే మహమ్మద్‌ జమీల్‌తో మాట్లాడి సమాచారం తెలుసుకుంది.

”మేము బెర్హంపూర్‌లో ఉన్నాం. సాధ్యమైనంత త్వరగా ఎవరో ఒకరిని పంపండి” అని అతను చెప్పాడు. లైలీ మళ్ళీ రేష్మికి ఫోన్‌ చేసి. ”నేను కలకత్తాకి బయలు దేరుతున్నాను. నువ్వూ వచ్చేయి. అమ్మకు విషయం చెప్పాలి” అని చెప్పింది

రేష్మి ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరగా ఉండే మా అక్క కొడుక్కి ఫోన్‌ చేసింది. అలా మాకు విషయం తెలిసింది. ఇప్పుడు, నేను కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. చాలా శాంతంగా ఉన్నాను…

మనమందరం ఒక విధమైన శిక్షణను పొంది ఉంటామా అనిపిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో శాంతంగా ఉండేటట్లు.

అవునవును. నేను భగవంతునికి ఆ విషయంలో కృతజ్ఞతలు చెప్పుకొంటా. అది ఎందుకో నేను చెపుతాను. రేష్మి నుంచి ఫోన్‌ రాగానే, నేను తన పూర్వ సహోద్యోగి ఒకరికి ఆమెను ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంటికి తీసుకురమ్మని చెప్పడానికి ఫోన్‌ చేశాను. మా ఆయనకు చాలా సన్నిహితుడు. అతనన్నాడు, ”పిన్నీ, నేనిప్పుడు కలక్తాలో లేను. భువనేశ్వర్‌లో ఉంటున్నాను”. ఆ మాట వినగానే నేను బెర్హంపూర్‌ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే మా బావగారు బెర్హంపూర్‌ వెళ్ళే మార్గాలన్నీ వెతుకుతున్నారు. రైలు, విమానం, కారు. రోడ్డుమీద ప్రయాణిస్తూ బెర్హంపూర్‌ చేరడం చాలా కష్టం. నాకు భువనేశ్వర్‌ తెలుసు. బెర్హంపూర్‌ ఎక్కడ ఉందో తెలియదు. భువనేశ్వర్‌ అన్నమాట వినగానే అక్కడికి వెళ్ళాలనుకొన్నాను. రేష్మిని భువనేశ్వర్‌కు టికెట్‌ మార్చుకోమన్నాను. లైలికి కూడా అదే చెప్పాను. రేష్మి వెంటనే అంగీకరించింది. లైలి మొదట అయిష్టంగా ఉంది. నేనన్నాను, ”అతను మీ తండ్రి. మనం అక్కడికి వెళ్ళి అతన్ని కలవడమే బావుంటుంది, అన్ని విధాలుగా”.

ఇదంతా చాలా కఠినమైన ప్రయాణం.

పూర్తిగా… పూర్తిగా…

నాకూ అదే మంచిదనిపించింది నువ్వన్నట్లుగానే. కుటుంబమంతా బెర్హంపూర్‌కి వెళ్ళాలన్న ఆలోచన తెలివైనది… ఏమైనా, కుటుంబమే వెళ్ళి…

ఆ తర్వాత ఏమయ్యిందో నాకు తెలియదు. ఇద్దరూ మాట్లాడుకొని రేష్మి, లైలీ చెప్పారు, ”మేమూ వస్తున్నామమ్మా…” అని. అందరం భువనేశ్వర్‌ చేరుకున్నాం. నేను భోంచేశాను. స్నానం చేశాను. నేను పూర్తి భోజనం చేసాను, వసంత్‌…

లేదు కొయిలీ, అది అసాధారణమేమీ కాదు. అందరూ అలాగే చేస్తారు…

నాకు తెలియదు, ఎందుకలా…

కాదు, కాదు. నాకు ఈ విషయం బాగానే తెలుసును. గత రెండేళ్ళుగా సన్నిహితులైన వారిని పోగొట్టుకున్నాను. బాగా సన్నిహితులు. నేను చూశాను. భార్య, తల్లి, ఇతరులు… అందరూ కుప్పకూలిపోయారు. కానీ, అంత్యక్రియలు పూర్తయ్యాక మేం తిరిగి వచ్చాం. అందరం తిన్నాం. అందరం అతని గురించి మాట్లాడుకొన్నాం. అతని గురించి ఆలోచించాం. జీవితం కొనసాగుతోంది.

నేనలాగే భావించాను. మేము బెర్హంపూర్‌ వెళ్ళాం. నేను కథను కొంచెం తగ్గించనా? కానీ ఒక విషయం ఏమిటంటే, నేను…

లేదు, అది కాదు.

నిజంగా. నిజంగా అదొక అద్భుతం. అందరినుంచీ మాకు అందిన సాయం. అంటే, సాధారణంగా, నీవు విన్నావో లేదో తెలియదు. నస్రీన్‌ తండ్రికి యాక్సిడెంట్‌ జరిగినప్పుడు, ఆమె రోజుల తరబడి అటూ ఇటూ పరిగెత్తాల్సి వచ్చిందట.

కానీ, ఇక్కడ అతని పర్సులోంచి ఒక పైసా కూడా పోలేదు. ప్రతి చిల్లర నాణెం కూడా అలాగే ఉంది. అతని మొబైల్‌, టాయిలెట్‌ కిట్‌, అతని చెప్పులు, అన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. మహమ్మద్‌ జమీల్‌ అవన్నీ మాకు అందచేశారు. మేము వెళ్ళేసరికి అతని పోస్ట్‌మార్టం అయిపోయింది. కొత్త దుస్తుల్లో సిద్ధంగా ఉన్నాడు.

ఇవన్నీ ఇద్దరు వ్యక్తుల వలన సాధ్యమైంది. ఒకరు శ్రీ ఒబెరాయ్‌. మా అల్లుడు ఫోన్‌ చేసి విషయం చెప్పాడట. అతను ఏదో మార్పుల కోసం తాత్కాలికంగా మూసి ఉంచిన గోపాల్‌పూర్‌ ఒబెరాయ్‌ రిసార్టును వెంటనే తెరిపించి, అక్కడి మేనేజర్‌ను మేము బెర్హంపూర్‌ చేరుకునే వరకూ కనిపెట్టుకుని ఉండి అన్ని వ్యవహారాలను చూడమన్నారట. అందుచేత, తెల్లవారుజామున మేము వెళ్ళేదాకా, అతని వెంటే ఉండి, అన్ని విధులు నిర్వహించారు.

బెర్హంపూర్‌లో మెడికల్‌ కాలేజి ఉన్నది. చాలా పెద్ద ఆసుపత్రి. అతనిని అక్కడికి తీసుకువెళ్ళారు. వారంతా అతనితో పాటే

ఉన్నారు. మరొకరు నా ఆత్మీయ స్నేహితురాలు. ఆమె రేష్మి పక్కింట్లోనే ఉంటుంది. ఆమె భర్త యూకో బ్యాంకు జనరల్‌ మేనేజర్‌. నేను వారికి కూడా ఫోన్‌ చేసి విషయం చెప్పాను. రేష్మి ఒంటరిగా ఎయిర్‌ పోర్ట్‌కి వస్తోంది తోడుండమని. వారు రేష్మి పక్క భవనంలోనే

ఉంటారు.

ఈ స్నేహితుడు వెంటనే భువనేశ్వర్‌, బెర్హంపూర్‌ శాఖల బ్యాంకులకు వర్తమానం పంపారు. వారంతా వచ్చి నిలబడ్డారు. దాంతో మేము వెళ్ళేసరికి, బాబు మెటడార్లో ఉన్నాడు. కొత్త బట్టలు వేసుకొని, సిద్ధంగా. అలా అప్పుడు…

ఎప్పటికి చేరుకున్నారు?

మేము భువనేశ్వర్‌ చేరుకొనేసరికి మధ్యాహ్నమైంది. రేష్మి పదకొండున్నరకు చేరుకొంది. లైలీకి ఉదయం విమానం దొరకలేదు. వచ్చేసరికి మధ్యాహ్నం రెండయింది. మేము వెంటనే బెర్హంపూర్‌కి కారులో బయలుదేరాం. మేము చేరుకునేసరికి సాయంత్రం అయిదున్నర, ఆరు గంటలయింది. అప్పుడు మమ్మల్ని అడిగారు, అంత్యక్రియలు బెర్హంపూర్‌లో చేస్తారా? గోపాల్‌పూర్‌లోనా? అని. గోపాల్‌పూర్‌ ఒక అరగంట ప్రయాణిస్తే వస్తుంది. అందుకే నేనన్నాను గోపాల్‌పూరేనని.

గోపాల్‌పూర్‌ సముద్ర తీరాన ఉంది. అలా అడిగిన వ్యక్తి లైలీ సహోద్యోగి. అతనికి లైలీ గురించి బాగా తెలుసు. బెర్హంపూర్‌, గోపాల్‌పూర్‌ల గురించి కూడా తెలుసు.

మేము గోపాల్‌పూర్‌ బయలుదేరాం. మా బావగారు మాతో ఉన్నారు. భువనేశ్వర్‌లో ఉండే రేష్మి సహోద్యోగి మాతో వచ్చాడు. మా అక్క కొడుకు ఒడు. మేం కొద్దిమందిమి కలసి గోపాల్‌పూర్‌ చేరుకునేసరికి ఏడు, ఏడున్నర అయింది. అక్కడ ఫార్మాలిటీలు ఏమీ లేవు, కాగితాలు లేవు, ఏమీ లేవు. అవి సముద్రపు బ్యాక్‌ వాటర్‌. దట్టమైన అడవిలో ఉన్నట్లు చిమ్మచీకటి. కేవలం చందమామ, చుక్కలు, నీలాకాశం, సముద్రపు హోరు. నేనెప్పుడూ అనుకునేదాన్ని ఆరుబయట చితి ఒక భయానక అనుభవమని. నన్ను నమ్మండి, నేను అతన్ని చూశాను. నేను అతన్ని చితిమీద పెట్టడం చూశాను. చితిని నిర్మించడం చూశాను. దాదాపు అరగంటసేపు చూశాను. అప్పుడు మా బావగారన్నారు, ”మీ అమ్మాయిలను తీసుకుని నువ్వెళ్ళు. మేము చితి ఆఖరిదాకా ఉండి వస్తాం”. ఇదేదో నాటకంలోనో, సినిమాలోనో జరుగుతున్న సన్నివేశం లాగా ఉన్నది.

కానీ, నిప్పు చల్లారుతుంది. అగ్నిలో ఏదో సాంత్వన ఉంది. అదే అఖరు.

నాకనిపించింది. అతను ప్రకృతిలోకి తిరిగి వెళ్ళాడని. అలా సాంత్వనగా తోచింది. నాకు పోస్టుమార్టం రిపోర్టు, డెత్‌ సర్టిఫికెట్‌ మూడు నెలల తర్వాత అందాయి. బెర్హంపూర్‌ చిన్న ఊరు. వాళ్ళు నా సంతకం ఒకటి అడిగారు. అంతే. దేవుడి దయవల్ల ఆ నిర్ణయం తీసుకోకపోతే, కలకత్లాలో డెత్‌ సర్టిఫికెట్‌ లేకుండా అంత్యక్రియలు చేయాలంటే అటూ ఇటూ పరిగెత్తాల్సి వచ్చేది.

అది సహజ మరణం కాబట్టి డెత్‌ సర్టిఫికెట్‌ కావాలి. కానీ కలకత్తాకు తీసుకొచ్చి ఉంటే?

మా అత్తగారు, మిగిలిన అత్తింటివాళ్ళంతా మండిపడ్డారు.

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.