చైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారులు – పిల్లల భద్రత – సత్యవతి

ఉదయం పేపర్‌ తిరగేస్తే కంటికి కనిపించే వార్తలు ఆ రోజంతా మనసును వెంటాడుతుంటాయి. స్త్రీల మీద, పిల్లల మీద జరుగుతున్న లైంగిక అత్యాచారాలు, వేధింపులు అడ్డూ, అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తు ఆశాకిరణాలు ఈ దేశానికి విశిష్ట సంపదగా, సంతోషంగా, సంబరంగా ఎదగాల్సిన పిల్లలు ఇంట్లో, ఇంటి బయట, పాఠశాలల్లో ఎదుర్కొంటున్న హింస, లైంగిక వేధింపులు మనసును కల్లోల పరుస్తున్నాయి. పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం తెలియని అమాయక బాలబాలికలు క్రూరమైన హింసల మధ్య భయం భయంగా బతకడం చాలా దుఃఖం కలిగిస్తున్నది.

స్త్రీలకి, పిల్లలకి భద్రమైనవిగా ప్రచారంలో ఉన్న కుటుంబాల్లో హింస పెచ్చరిల్లడం ప్రమాద ఘటికలను మోగిస్తున్నది. జాతీయ స్థాయి గణాంకాలు చెబుతున్నది ఏమిటంటే పిల్లలు తమ స్వంత ఇంటిలోనే, స్వంత బంధువుల వల్లనే లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురవుతున్నారు. తాతలు, మామయ్యలు, మేనమామలు, బావలు, బాబాయిలు, అన్నదమ్ములు… వీళ్ళంతా బాలలకు చాలా ఇష్టమైన బంధువర్గాలు. పిల్లలు సంకోచం లేకుండా నమ్ముతారు వీళ్ళను. తమని అమాయకంగా నమ్మిన పిల్లల్నే ఈ బంధువులు టార్గెట్‌ చేసుకుని వారిమీద వేధింపులకు, లైంగిక హింసలకు పాల్పడుతున్నారని జాతీయ స్థాయి గణాంకాలు చెబుతున్నాయి. బయట వ్యక్తుల్ని పిల్లలు తొందరగా నమ్మరు. పాఠశాలల్లో కూడా పిల్లల నమ్మకాన్ని పొందినవాళ్ళే పిల్లలమీద వేధింపులకు పాల్పడుతున్నారు. బెదిరించి, భయపెట్టి తమ అకృత్యాలను కొనసాగిస్తారు.

ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో పిల్లలకు తెలియదు. తమమీద ప్రేమ చూపించే వాళ్ళను చాలా తేలిగ్గా నమ్మేస్తారు. ఒక చాక్‌లెట్‌, ఒక ఐస్‌క్రీం ఆశ వీళ్ళని తేలిగ్గా కుట్రదారుడి బుట్టలో పడేస్తాయి. ఈనాటి కుటుంబ జీవితం ఎవరినీ ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేదు. టీవీలు, సెల్‌ఫోన్‌లు, చాటింగ్‌లు వెరసి టెక్నాలజీ మనుషుల్ని ఒంటరి జీవులుగా మార్చేస్తాయి. పిల్లల జీవితాల్లో జరుగుతున్న సంక్షోభాలను పసిగట్టి వారికి వెన్నుదన్నుగా ఉండే వెసులుబాట్లు క్రమంగా దూరమైపోవడం అత్యంత విషాదకరం. తండ్రుల దుర్వ్యసనాలు, తల్లుల జీవన పోరాటాలు పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పెద్దల జీవన శైలులు కూడా పిల్లల్ని ప్రమాదపుటంచుల్లోకి నెట్టేస్తున్నాయి.

ఇటీవల జీడిమెట్లలో జరిగిన ఒక కేసు గురించి తప్పక ప్రస్తావించాలి. కొంతమంది సోషల్‌ వర్క్‌ విద్యార్థులు తమ పనిలో భాగంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో సెషన్‌ తీసుకున్నారు. ఎవరైనా తన పర్సనల్‌ పార్ట్స్‌ని స్పృశించారా? తమకు ఇబ్బందికరంగా అనిపించిందా? అని రాయమని అడిగినప్పుడు ఒక బాలిక ఏదో రాయాలని ప్రయత్నించి రాయలేదని, రాసింది కొట్టేసిందని రిసోర్స్‌పర్సన్‌గా ఉన్న విద్యార్థిని అర్థం చేసుకుంది. ఆ పాపతో విడిగా మాట్లాడినప్పుడు తన ఇంట్లోనే ఆ పాప అనుభవిస్తున్న లైంగిక హింస గురించి చెప్పింది. తల్లిదండ్రులు లేని ఆ పాప తన పిన్ని ఇంట్లో ఉంటోంది. పిన్ని కోసం రాత్రిళ్ళు ఆమె ఇంటికొచ్చే ఒక వ్యక్తి ఆ పాప మీద లైంగిక అత్యాచారం చేశాడని, ఎప్పుడూ తన బట్టలు విప్పమంటాడని, తన చెల్లెలు పట్ల కూడా అంతే చేస్తాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని అన్నీ వివరంగా చెప్పింది. ఛైల్డ్‌ లైన్‌, సి.డబ్ల్యూ.సి, డిసిపి సహకారంతో ఆ పాపను రక్షించడం జరిగింది. ఆ పాపని హోంలో ఉంచడం వల్ల సి.డబ్ల్యూసి తన భవిష్యత్తు, చదువు గురించి నిర్ణయం తీసుకోగలుగుతుంది.

ఇటీవల ఇలాంటివే ఎన్నో కేసులు వెలుగులోకి వచ్చాయి. పాఠశాల దశ నుండి పిల్లలకి అన్ని అంశాల పట్ల అవగాహన కలిగిస్తే, వాళ్ళు తమ మీద జరుగుతున్న హింసని అర్థం చేసుకోవడమే కాక, తమ బాధను పంచుకోగలుగుతారు. ఒక విద్యార్థి చేసిన ఒక ప్రయత్నం. ఆ బాలిక పడుతున్న హింసకి ఫుల్‌స్టాప్‌ పెట్టగలిగిందంటే ఎంతమంది పిల్లలు మౌనంగా తమ దుఃఖాలను దిగమింగుతున్నారో అర్థమవుతుంది. అసలు ఈ అంశాలన్నీ పిల్లల పాఠ్యపుస్తకాల్లో పాఠాలు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీలు, పిల్లల రక్షణ కోసం అమలులో కొచ్చిన చట్టాల గురించి, సపోర్ట్‌ సిస్టమ్స్‌ గురించిన సమాచారం పిల్లలకి చదువు ద్వారా, పాఠ్యాంశాల ద్వారా అందినప్పుడు వారిలో అవగాహనా పెరుగుతుంది, తమ పట్ల జరిగే హింసల్ని, వేధింపుల్ని అర్థం చేసుకోగలుగుతారు. 1098 లాంటి ఛైల్డ్‌ లైన్‌ నంబరుని వాళ్ళకు దగ్గరగా తీసుకెళ్ళి మీకు ఎలాంటి సమస్య ఎదురైనా 1098 కి కాల్‌ చేయండి అని చెప్పి భరోసా ఇచ్చినప్పుడు పిల్లలు సాధికారులవుతారు.

పిల్లలకు సంబంధించి అమలులో ఉన్న వ్యవస్థలు, సంస్థల గురించి రాయాలంటే, ముందుగా పేర్కొనవలసింది ప్రతి పోలీస్‌స్టేషన్‌లోను ఉండే ఛైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జిల్లా శిశు సంరక్షణాధికారి, ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌. బాలల భద్రత, సంక్షేమం కోసం ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్‌స్టేషన్‌లో ఉండే ఛైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పాత్ర చాలా ముఖ్యమైనది. ఆయా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పిల్లల మీద అఘాయిత్యం జరిగినా సి.డబ్ల్యూ.సి కి చాలా ముఖ్యమైన బాధ్యత ఉంటుంది. పిల్లల భద్రతకు సంబంధించి మిగిలిన వ్యవస్థలు, సంస్థలతో కలిసి పాఠశాలల్లో చైతన్యపరిచే కార్యక్రమాలు చేయడం, ప్రివెన్షన్‌ మీద ఫోకస్‌తో పనిచెయ్యడం చేయాలి.

పోలీస్‌స్టేషన్‌లో ఉండే ఛైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పిల్లలతో వ్యవహరించే ప్రతి సందర్భంలోను మామూలు దుస్తుల్లోనే

ఉండాలి. యూనిఫాం పిల్లల్ని భయపెడుతుంది. సి.డబ్ల్యూ.ఓ.గా పనిచేస్తున్న అధికారికి పిల్లలకు సంబంధించిన సహాయ సంస్థలు, సి.డబ్ల్యూ.సి.ల సమాచారం అంతా తెలిసి ఉండాలి. వారి ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే పిల్లల అంశాల మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థల వివరాలన్నీ ఉంచుకోవాలి. పిల్లల్ని ఉంచే హోమ్స్‌, జె.జె.బోర్డు మెంబర్ల వివరాలు ఉండాలి. ముఖ్యంగా బాధిత పిల్లల స్టేట్‌మెంట్‌ను పోలీస్‌స్టేషన్‌లో రికార్డు చేయకూడదు. పిల్లలకి అనువుగా, భయపడకుండా ఉండే స్థలాల్లోనే రికార్డు చేయాలి.

బాలబాలికల మీద విచ్చలవిడిగా పెరిగిపోతున్న లైంగిక హింసలు, అఘాయిత్యాల నేపథ్యంలో ప్రతి పోలీస్‌స్టేషన్‌లోను ఉండే ఛైల్డ్‌ వెల్ఫేర్‌ అధికారి పిల్లలతో జెండర్‌ సెన్సిటివిటీతోను, సున్నితంగాను వ్యవహరించాలి. ఇటీవల ఒక పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు డ్రెస్సులో ఉన్న అధికారి పిల్లల్ని గద్దించి, చాలా మొరటుగా ప్రశ్నించిన సందర్భంలో ఇదంతా రాయాల్సి వచ్చింది. ప్రజలు, పోలీసులు, పిల్లల రక్షణ కోసం ఉన్న వ్యవస్థలు, ఎన్జీఓలు అందరం కలిసి పిల్లల్ని రక్షించుకోవాలి. వారిపట్ల సున్నితంగా వ్యవహరించాలి.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో