అస్తిత్వం, హక్కులు లేకుండా పోయిన మహిళా రైతులు – Satyavati

నా చిన్నతనంలో నేనెప్పుడూ అనుకునేదాన్ని మా ఇంట్లో ఆడవాళ్ళెవరూ పొలానికి ఎందుకెళ్ళరని. మా అమ్మగాని, పిన్నమ్మ, పెద్దమ్మలు కానీ ఎప్పుడూ పొలానికెళ్ళినట్లు నేను చూడలేదు. మా తాతకి బోలెడంత పొలముండేది. మా నాన్న మాత్రం ఎప్పుడూ పొలంలోనే ఉండేవాడు. నారుమళ్ళు వేయడం, దుక్కి దున్నడం, నాట్లేయడం, కలుపు తీయడం, కోతలు కోయడం ఈ పనులన్నింట్లోను మా కుటుంబంలోని ఆడవాళ్ళు పాల్గొనేవారు కాదు కానీ… మాలపల్లెలోని మహిళలు అందరూ తప్పనిసరిగా వెళ్ళేవాళ్ళు. స్కూల్‌కి వెళ్ళే సమయంలో గుంపులు గుంపులుగా దళిత మహిళలు పొలాలవైపు కదలడం చూస్తుండేదాన్ని. నడుం ఒంచి నాట్లేయడం గమనించేదాన్ని. గమ్మత్తు ఏమిటంటే… పొలాలు మా కుటుంబానివి… ఆ పొలాల్లో చాకిరీ మాత్రం దళిత కుటుంబాలది. నాట్లేసే ఆడవాళ్ళకి కట్టలందించే పని పురుషులు చేస్తారు. ఒంచిన నడుం ఎత్తకుండా చకచకా నాట్లేసే స్త్రీల శ్రమైక జీవన సౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. పల్లెల్లో పుట్టిన వాళ్ళెవరూ ఈ దృశ్యాలను మిస్‌ అయ్యే ఛాన్సు లేదు. వ్యవసాయంలో మహిళలు చేసే పని అనంతమైంది, విలువలేనిది. వాళ్ళలో ఉనికినివ్వనిది. వ్యవసాయం గురించి ఎవరు మాట్లాడినా, ఏ చట్టం చేసినా, ఏ విధాన నిర్ణయం చేసినా అందరి కళ్ళకి రూపు కట్టేది ఒకే రూపం. తలకి తువాలు చుట్టుకొని, పంచె కట్టుకుని, భుజాన నాగలితో కనిపించే రైతు బొమ్మే మన కళ్ళకి కనబడుతుంది. నాట్లేసే మహిళ గానీ, కోతలు కోసే మహిళ గానీ మన ఊహల్లోకి కూడా రాదు. ఇన్‌విసిబుల్‌…కనబడరు.

మన కడుపుకింత అన్నంపెట్టే రైతన్న అంటాం గానీ, మన కడుపు నింపుతున్న రైతక్క అనం. స్త్రీలు ఇంట్లో చేసే పనికి ఎలా గుర్తింపు లేదో, మగ్గం నేసే చోట నేతన్నని గుర్తించినట్టు నేతక్కని ఎలా గుర్తించమో, వ్యవసాయంలో కూడా రైతక్క ఉనికిని చాలా సహజంగా అందరం మర్చిపోతాం. ఇది చాలా అన్యాయమైన విషయం. అసమానతల ప్రపంచంలో రైతక్కలకు జరుగుతున్న దారుణమైన అన్యాయం. నిజానికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 42 శాతం మంది స్త్రీలు వ్యవసాయ రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. భారతదేశం తీసుకుంటే దాదాపు అరవై శాతం మంది స్త్రీలు వ్యవసాయ రంగంలో ఉన్నారు. అంతేకాదు, పొలం పనుల్లో ముఖ్యమైన పనుల్ని మహిళలే చేస్తుంటారు. విత్తులు చల్లడం, నాట్లు వేయడం, కలుపు తియ్యడం, పంటను కోయడం లాంటి నడుం ఒంచి చేయాల్సిన పనుల్ని మహిళలే చేస్తున్నారు. నడుం ఒంచక్కరలేనివి, నిలబడి చెయ్యగలిగిన పనుల్ని పురుషులు చేస్తుంటారు. అయినప్పటికీ వ్యవసాయంలో స్త్రీల ఉనికి ప్రస్తావనకు రాకపోవడం వెనక ఉన్నది పితృస్వామ్యం తప్ప మరొకటి కాదు.

స్త్రీలు లేనిదే వ్యవసాయం లేదన్నది నగ్న సత్యం. అయిష్టంగానైనా సర్వులూ ఒప్పుకోవాల్సిన నిష్టుర సత్యం. నేతక్క లేనిదే బట్ట నెయ్యలేనట్లే, రైతక్క లేనిదే వ్యవసాయం జరగదు. ఇంత ప్రముఖమైన పాత్రను వ్యవసాయంలో స్త్రీలు పోషిస్తున్నప్పటికీ వారికి రైతులుగా గుర్తింపు లేదు. స్త్రీల చేతిలో భూమి లేదు, వ్యవసాయానికి సంబంధించి నిర్ణయాధికారం లేదు. ఆదాయాల మీద ఎలాంటి అధికారమూ లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో, గ్రామాల్లో పురుషులు దూరప్రాంతాలకు పనులకోసం వలస పోతున్న సందర్భంలో ఆ కుటుంబానికి చెందిన వ్యవసాయం స్త్రీల చేతుల్లోకి వస్తున్నది. మన రాష్ట్రంలో, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 26 శాతం భూకమతాలు స్త్రీల చేతుల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఒక కోటి 36 లక్షల కోట్ల భూకమతాలుంటే దానిలో 36.5 లక్షల కమతాలను మహిళలే నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ వారికి రైతులుగా గుర్తింపు లేదు.

తొంభైలలో వచ్చిన నూతన ఆర్థిక విధానాలు, కొత్త వ్యవసాయ విధానాలు వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. ఆహార పంటల స్థానంలో వ్యాపార పంటలొచ్చాయి. వ్యాపార పంటల ఊబిలోకి దిగిన రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రైతు ఆత్మహత్యల వల్ల ఆయా కుటుంబాల్లోని స్త్రీలు తమ కుటుంబాలను పోషించాల్సిన పరిస్థితుల్లోకి, అప్పు తీర్చాల్సిన దుస్థితిలోకి నెట్టేయబడ్డారు. చాలాసార్లు భర్తల మరణం ద్వారా ఒదిలేసిన వ్యవసాయాన్ని తమ భుజాల మీద వేసుకుంటున్నారు. వ్యవసాయం చేస్తున్నారు.

వ్యవసాయంలో ఇంత ప్రముఖమైన పాత్ర పోషిస్తున్న మహిళలను రైతులుగా గుర్తించకపోవడం ఒక కుట్ర అయితే వారి సమస్యలను అస్సలు పట్టించుకోకుండా మౌనం వహించడం మరో దుర్మార్గం.

దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు ప్రమాదకరంగా పెరిగిపోయిన నేపథ్యంలో, వ్యవసాయంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉనికి లేని మహిళా రైతులు ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలు కోకొల్లలు. భర్తల హఠాన్మరణాలతో దిక్కుతోచని స్థితిలో కుటుంబాన్ని పోషించాల్సి రావడం, అప్పులు తీర్చాల్సిన బాధ్యత మీద పడడం ఇవన్నీ ఆమెను తీవ్రంగా కుంగదీస్తాయి. రెక్కాడితే కానీ డొక్కాడని రైతక్కల గురించి అందరం ఆలోచించాలి. అస్తిత్వం లేదని రైతక్కల రూపురేఖలు వ్యవసాయ రంగంలో ప్రస్ఫుటంగా కనబడేలా కృషి చేయాల్సిన బాధ్యత, వాళ్ళు పండించిన ధాన్యాలను అన్నం రూపంలో సుష్టుగా తిని తేన్చుతున్న మనందరి మీద ఖచ్చితంగా ఉంది. మహిళా రైతుల్ని రైతులుగా గుర్తించేలా పెద్ద ఎత్తున కృషి జరగాలి.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.