జెండర్‌ ఏమిటో తెలుసుకుందాం – కమలా భాసిన్‌

 

(గత సంచిక తరువాయి…)

మతం, కులం, వర్గం ఇతర గుర్తింపులు జెండర్‌ని, జెండర్‌ సంబంధాలని ఎలా ప్రభావితం చేస్తాయి?

మనందరికీ పలు గుర్తింపులుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి స్త్రీ కావడంతో బాటు హిందువు కావచ్చు, మధ్య తరగతికి చెంది ఉండవచ్చు. ఉన్నత లేదా తక్కువ కులానికి చెంది ఉండవచ్చు. వివాహిత అయి ఉండవచ్చు. జెండర్‌కీ, ఇతర గుర్తింపులకీ మధ్య సంబంధాలు ఉంటాయి. సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు జాతి, కులం, వయస్సు, వైవాహిక స్థితి వంటివి జెండర్‌ని ప్రభావితం చేస్తాయి. తిరిగి జెండర్‌ ద్వారా ప్రభావానికి గురవుతాయి. సమాజంలో స్త్రీలందరూ పురుషులందరికీ పరాధీనులు కారు. ఉదాహరణకు ఒక ధనిక స్త్రీ తన వర్గం కారణంగా తన ఇంటిలో పనిచేసే పురుషునిపై ఆధిపత్యం చెలాయించే స్థితిలో

ఉంటుంది. ఈ ఉదాహరణలో ఈ స్త్రీ జెండర్‌ కంటే ఆమె వర్గం ముఖ్యమయినది. మరో ఉదాహరణలో తక్కువ కులం/వర్గానికి చెందిన స్త్రీ ఉన్నత కుటుంబానికి చెందిన పురుషుల ద్వారా రెండు విధాల దోపిడీకి గురి కావచ్చు. ఉదాహరణకు భారతదేశంలోని కొన్ని సమాజాలలో తక్కువ కులాల పెళ్ళికూతురు మొదటి రాత్రి ఉన్నత వర్గానికి చెందిన భూస్వామితో పడుకోవాల్సిన పరిస్థితి ఉండేది.

వివిధ మతాల ఆధారంగా ఏర్పడిన వివిధ పౌరచట్టాలు కూడా జెండర్‌ సంబంధాలను ప్రభావితం చేస్తాయి.

ఉదాహరణకు ముస్లిం పౌరచట్టం బహుభార్యత్వాన్ని అనుమతిస్తుంది. పురుషులు ఏకపక్షంగా విడాకులు ఇవ్వవచ్చు. క్రిస్టియన్‌ పౌరచట్టం ప్రకారం వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడన్న కారణంగా భర్త నుంచి విడాకులు పొందే వీలు లేదు. హిందూ చట్టం ప్రకారం రెండు భిన్న మతాలకు చెందిన తల్లిదండ్రుల పిల్లలను దత్తత తీసుకునే వీలు లేదు. ఇలా ఎన్నో ఉన్నాయి. పురుషుడి ఆస్థి హక్కునీ, వారసత్వపు హక్కునీ అన్ని మతాలు సమర్ధిస్తాయి.

”దోపిడీకి గురయ్యే వర్గాలను అణిచి ఉంచడానికి పాలకవర్గాలు అత్యాచారం రూపంలో లైంగిక దోపిడీకి పాల్పడుతుంటాయి. తిరుగుబాటు చేసిన పేద రైతాంగం, వ్యవసాయ కూలీలను శిక్షించడానికి భూస్వాములు, పోలీసులు, పురుషులను కొట్టడం, వాళ్ళ గుడిసెలను తగులబెట్టడంతో సంతృప్తి చెందరు; అనేక సందర్భాలలో వాళ్ళ స్త్రీలను బలాత్కరిస్తారు. ఎందుకని? అత్యాచారానికి పాల్పడే వాళ్ళ అణచివేయబడిన లైంగిక కోర్కెలు ఈ విధంగా అత్యాచారాలలో బయటపడతాయన్న వాదన సరైనది కాదు. వాస్తవానికి ఈ చర్యలకీ, లైంగికతకీ ఎటువంటి సంబంధమూ లేదు. అలాగే అసలు లక్ష్యం స్త్రీలు కాదు, పేద వర్గాలకు చెందిన వారి పురుషులు. ఏ ఆస్తీ మిగలని పేద ప్రజల ఏకైక సొత్తుగా వారి స్త్రీలను పరిగణిస్తారు. వారి స్త్రీలను అత్యాచారానికి గురిచెయ్యడంతో పేద ప్రజలకు అసలు ఆస్తి అంటూ లేదని, అధికారం అంటూ లేదని నిరూపించ చూస్తారు. పేద స్త్రీల పట్ల భూస్వాములు, పోలీసులు జరిపే ఈ లైంగిక దౌర్జన్యం ద్వారా పేదవర్గానికి చెందిన పురుషులను దెబ్బతీయాలని చూస్తారు. గ్రామీణ ప్రాంతాలలో ఎప్పటినుంచో ఉన్న, లేదా కొత్తగా రూపుదిద్దుకుంటున్న అధికార సంబంధాలు బలపడడానికి ఇది దోహదపడుతుంది. ఇక్కడ వర్గపాలన, స్త్రీల అణచివేత ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. భూమి ఉన్నవాడే ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీలకు కూడా యజమాని అవుతాడు” – మరియా మీన్‌

అదేవిధంగా వేరు వేరు జాతులు, కులాల మధ్య తేడాలు ఉండవచ్చు. ‘ఉన్నత’ కులం స్త్రీకి ‘తక్కువ’ కులం స్త్రీతో పోలిస్తే ఆంక్షలు ఎక్కువ. కుల ఆధిక్యాన్ని, స్వచ్ఛతనీ కాపాడే భారం వారిపై ఉంటుంది. ‘ఉన్నత’ కులాలలో కుల స్వచ్ఛతని కాపాడడం, ఆస్తి నియంత్రణ, కొడుకుల ద్వారా ఆస్తి వారసత్వం ఉండడం వల్ల పురుష ఆధిపత్యం, లేదా పితృస్వామ్యం ఎక్కువ. ఈ కారణం వల్లనే ‘ఉన్నత’ కుల కుటుంబాలు తమ స్త్రీలపై, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళ కదలికలపై నియంత్రణ విధించి తద్వారా వారి లైంగికతను నియంత్రిస్తాయి. ‘తక్కువ’ కులాలకు స్వచ్ఛతను కాపాడనవసరం లేదు కాబట్టి వారి స్త్రీలపై ఈ స్థాయిలో పరిమితులు ఉండవు.

భిన్న వర్గాలకు చెందిన స్త్రీ, పురుష సామాజిక, ఆర్థిక, రాజకీయ హోదాలలో కూడా తేడా ఉంటుంది. బూర్జువా లేదా సంపన్న వర్గాలకు చెందిన వారికి ఆర్థిక వనరులు, విద్య, సమాచారం అందుబాటులో ఉంటాయి. వాళ్ళు సామాజిక, ఆర్థిక, మతపర సంస్థలను నియంత్రిస్తారు. శ్రామిక వర్గానికి చెందిన ప్రజలకు ఇటువంటి అవకాశాలు ఉండవు. బూర్జువాజీ స్త్రీకి, శ్రామిక వర్గ స్త్రీకి మధ్య ముఖ్యమైన తేడాను ఎంగెల్స్‌ గమనించాడు. అతడి విశ్లేషణ ప్రకారం బూర్జువాజీ స్త్రీ బయట పనిచెయ్యదు. ఆమె భర్తమీద పూర్తిగా ఆధారపడి ఉంది. ఆమె కూడా అతడి ఆస్థి అవుతుంది. వారసులను కనటం వరకే ఆమె పని. కార్మిక వర్గ స్త్రీ కార్మికురాలు కావడం వల్ల కొంత ఆర్థిక స్వాతంత్య్రం కలిగి ఉంటుంది. ఆ మేరకు ఆమె కొంత అణచివేత నుంచి విముక్తి పొందగలుగుతుంది.

శ్రామిక వర్గ స్త్రీలు పరదా లేదా స్త్రీలు, పురుషులు వేరువేరుగా ఉండడం వంటి అలవాట్లు పాటించరు. జీవన సంపాదన కోసం వాళ్ళు బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది. చిన్న రైతాంగ కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడంతోనే తమ స్త్రీలను బయటి పనికి వెళ్ళొద్దని ఆంక్షలు పెడతారు. అనేక పితృస్వామ్య సమాజాలలో స్త్రీలు ఇళ్ళలో ఉండడం, పరాధీనులుగా ఉండడం, వేరుగా ఉండడం సామాజిక హోదాకు గుర్తుగా భావిస్తారు.

”జెండర్‌ ఆధారంగా శ్రమ విభజన” అన్న పదాన్ని వివరిస్తారా?

స్త్రీలు, పురుషులు ఏం చెయ్యాలి, ఏం చెయ్యగలరు అన్న సమాజ భావనల ఆధారంగా స్త్రీ, పురుషులకు విభిన్న పాత్రలు, బాధ్యతలు, పనులు కేటాయించడాన్ని జెండర్‌ ఆధారంగా శ్రమవిభజన అంటారు. ఆడపిల్లలకు-మగపిల్లలకు; స్త్రీలకు-పురుషులకు వారి వ్యక్తిగత ఎంపిక, సామర్ధ్యాల ఆధారంగా కాకుండా జెండర్‌ పాత్రలనుగుణంగా విభిన్న పనులు, బాధ్యతలు అప్పగిస్తారు. అన్ని పనులను మూడు వర్గాలుగా విభజించవచ్చు. – ఉత్పాదక పని, పునరుత్పాదక పని, సామాజిక పని. జెండర్‌ ఆధార శ్రమ విభజన ఈ మూడు వర్గాలలో ఎలా ఉంటుందో చూద్దాం.

ఉత్పాదక పని: ఉత్పాదక పని అంటే వినియోగానికీ, వాణిజ్యానికీ వస్తువులను, సేవలను ఉత్పత్తి చేసే పని. ఫ్యాక్టరీలు, ఆఫీసులు, క్షేత్రాలలో చేసే పనులన్నీ ఈ కోవలోకి వస్తాయి. దేశాల స్థూల జాతీయోత్పత్తి లెక్కగట్టేటప్పుడు వీటినే తీసుకుంటారు. ఉత్పాదక పనులలో స్త్రీ, పురుషులు పాలుపంచుకొన్నప్పటికీ జెండర్‌ ఆధారిత శ్రమ విభజన కొనసాగుతుంది. ఎక్కువ నైపుణ్యంతో కూడిన, ఎక్కువ వేతనం లభించే పనులు పురుషులు చేస్తారు. సాధారణంగా స్త్రీలు చేసే ఉత్పాదక పనులు వారు ఇంటిలో చేసే పనికి విస్తరణగా ఉంటాయి. వ్యవసాయరంగంలో స్త్రీలు చేసే ఉత్పాదక పనికి ఆర్థిక విలువ కట్టరు, దానిని ఇంటి పనిలో భాగంగా చూస్తారు. స్త్రీల ఉత్పాదక పనికి తక్కువ ప్రాముఖ్యతను, తక్కువ విలువను ఇస్తారు. పితృస్వామ్య భావాల ప్రకారం కుటుంబ పోషణ భారం పురుషులది కాబట్టి స్త్రీకి ఉపాధి ఇవ్వటం అంత ముఖ్యమైనది కాదని భావిస్తారు. ఈ కారణం వల్లనే పురుష ఉపాధికి అధిక ప్రాముఖ్యత, ప్రాధాన్యతనిస్తారు.

పునరుత్పత్తి పనులు రెండు రకాలు: ఒకటి శరీర సంబంధమైనది, రెండు సామాజికమైనది. శారీరకంగా పునరుత్పత్తి అంటే కొత్త జీవికి జన్మనివ్వటం. ఈ పనిని స్త్రీలు మాత్రమే చెయ్యగలరు. ఆ కొత్తజీవి బతికి, పెరగడానికి అవసరమయ్యే సంరక్షణ, పోషణకు సంబంధించిన పనులను సామాజిక పునరుత్పత్తి పనులుగా చెప్పవచ్చు. కాబట్టి పునరుత్పత్తి పనులు అంటే మానవ శ్రమను తిరిగి ఉత్పత్తి చేసే పనులని పేర్కొనవచ్చు. పిల్లల సంరక్షణ, వంట, తినిపించడం, బట్టలుతకడం, శుభ్రం చేయడం, సాకటం, ఇతర గృహ సంబంధ పనులన్నీ ఈ కోవకే వస్తాయి. మానవ మనుగడకు ఈ పనులన్నీ అవసరమైనప్పటికీ వాటిని పనిగా గుర్తించరు. దానికి ఆర్థిక విలువ లెక్కకట్టరు. కాబట్టి ఇవి కనబడని పనులు, గుర్తింపులేని పనులు, వేతనం లేని పనులు. ప్రపంచవ్యాప్తంగా ఈ పునరుత్పత్తి పనులను ప్రధానంగా స్త్రీలు, బాలికలు చేస్తారు.

సామాజిక పనులు: అంటే నిత్య జీవనానికి అవసరమయ్యే పనులు. ప్రజాపాలన (గవర్నెన్స్‌), సామాజిక, సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించటం, వాటిల్లో పాల్గొనడం, సామాజిక సేవలు, రోడ్లు, బడులు, ఆరోగ్య సేవలు వంటి సామాజిక సౌకర్యాలు వంటివన్నీ సామాజిక పనులలోకి వస్తాయి. స్త్రీలు, పురుషులు కూడా ఈ పనుల్లో పాల్గొంటారు. కానీ ఇది ‘ఆడవాళ్ళు’ చేసే పనులు, ‘మగవాళ్ళు’ చేసే పనులు అనే నిర్వచనాలు చేసే నియమాలకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి జెండర్‌ ఆధారంగా శ్రమవిభజన అనేది ఒక్క ఇంటికే పరిమితమయిన పునరుత్పత్తి పనులలో కాక ఇంటి బయట జరిగే అనేక

ఉత్పాదక, సామాజిక పనులలో కూడా కొనసాగుతుంది. జెండర్‌ అసమానతలను కొనసాగించడానికి, బలోపేతం చేయడానికి దోహదం చేసే అంశాలను అర్థం చేసుకోవడంలో జెండర్‌ ఆధారిత శ్రమ విభజన అన్నది ప్రధాన అవగాహనగా భావింపబడుతున్నది.

ఈ విభజన ఫలితంగా కాలక్రమేణా నైపుణ్యాలలో సైతం జెండర్‌ విభజన ఏర్పడుతోంది. స్త్రీలు, పురుషులు; బాలురు, బాలికలు తమ జెండర్‌ పాత్రలకు అనువైనవని భావించే నైపుణ్యాలను మాత్రమే నేర్చుకుంటారు. ఈ విధంగా స్త్రీ, పురుషులు; బాలురు, బాలికలలో భిన్న అభిరుచులు, నైపుణ్యాలు పెంపొందించి ఆ తర్వాత అవి వారికి మాత్రమే పరిమితమైనవని అంటారు.

స్త్రీ, పురుషుల శ్రమకు ఒకే రకమైన విలువ, ప్రతిఫలం లభించదు. కాబట్టి జెండర్‌ ఆధారిత వారి మధ్య అసమానతలు, తారతమ్యాలకు దారితీస్తుంది. ఈనాటికీ సమాన పనికి, స్త్రీ పురుషులకు సమాన వేతనం లభించడం లేదు. ఇంటి పనికి వేతనం ఎలాగూ లేదు. పని/ఆర్థిక విధానంలో మాంద్యం ఏర్పడితే మొదట

ఉద్యోగాలు కోల్పోయేది మహిళలే.

ఉత్పాదక పనులలో (ప్రత్యేకించి గృహ ఆధార ఉత్పత్తిలో) కొన్ని పనులు స్త్రీలకి, కొన్ని పనులు పురుషులకి కేటాయించడం వల్ల వనరులపైన, శ్రమఫలం పైన ఆధిపత్యం, నియంత్రణ పురుషులకి లభిస్తోంది. జెండర్‌ ఆధారిత ఈ రకమైన శ్రమ విభజన ఫలితంగా పురుషులు భూమి, సాంకేతిక విజ్ఞానం, అప్పులు, ఉత్పత్తుల అమ్మకం ద్వారా వచ్చే డబ్బు వంటి వాటిపై నియంత్రణ సాధిస్తారు. సాధారణంగా స్త్రీలు మనుగడ అవసరాల కోసం ఉత్పత్త చేపడితే, పురుషులు వాణిజ్యపరంగా నగదు కోసం ఉత్పత్తి చేపడతారు.

జెండర్‌: జెండర్‌ సంబంధాల మాదిరిగానే జెండర్‌ ఆధారిత శ్రమ విభజన కూడా అంతటా ఒకే రకంగా ఉండదు. అది సంస్కృతి, ప్రాంతం, కాలం బట్టి ఉంటుంది. జెండర్‌ ఆధారిత శ్రమ విభజనను సవాల్‌ చేయడమంటే సమాజంలో స్త్రీగా, ‘పురుషుడి’గా పరిగణింపబడే విధానాన్ని సవాలు చెయ్యటమే.

స్త్రీల ఉత్పాదక, పునరుత్పాదక పనికి సాధారణంగా చెప్పుకోదగ్గ ఆర్థిక విలువ ఉండదు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యు.ఎన్‌.డి.పి.) మానవ అభివృద్ది నివేదిక, 1995 ప్రకారం స్త్రీల కనబడని శ్రమ, వేతనం లేని శ్రమ విలువ సంవత్సరానికి 11 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లు.

”భర్త జేబులో ‘వస్తువుల రాణి’ అయిన డబ్బు ఉంటుంది, కానీ భార్య చేసే పనికి ఎటువంటి వేతనం ఉండదు. బానిసకు ఇచ్చినట్టుగానే ఆమెకి ఉండడానికి స్థలం, తినడానికి తిండి ఇస్తే చాలు. గృహిణి పనిగంటలు, పని పరిస్థితులు, సెలవులు, తీరిక సమయం వంటి వాటికి ఎటువంటి ఒప్పందమూ ఉండదు. వైవాహిక ఒప్పందాన్ని ఉపాధి ఒప్పందంతో పోల్చడానికి వీల్లేదు. సమ్మె చేసే హక్కు లేదు; గృహిణులకు సంఘీభావం తెలిపే సంస్థ లేదు. వాళ్ళందరూ ఎవరికి వారే ఒంటరివారు. గృహిణులుగా తాము చేసే పని ఆధారంగా వారికి ఎటువంటి సామాజిక బాధ్యత లేదు. అదేవిధంగా భర్తల నియంతృత్వం, హింసల నుంచి వారిని కాపాడే చట్టమేమీ లేదు. ఇంటిలోని మానవ హక్కులను గమనించే వాళ్ళెవరూ లేరు. కాబట్టి అవన్నీ వ్యక్తిగత విషయాలైపోతాయి. భౌతికపరమైన రక్షణకు హామీ లేనప్పుడు కూడా బయటి వారెవరూ దాంట్లో జోక్యం చేసుకోరు.

”భార్య భర్తకు సేవ చేయాలి, అంతేకాదు అతడి ఆజ్ఞలను పాటించాలి. చట్టం ద్వారా అతడు వాటిని సాధించుకోగలడు. క్లుప్తంగా చెప్పాలంటే గృహిణి అంటే భర్త ఆధీనంలోని వేతనం లేని కూలి. జీవితాంతమూ, ఇరవై నాలుగు గంటలూ ఆమె అతడికి కట్టుబడి ఉండాలి. అంతేకాదు ఆమె శరీరం మొత్తం, ఆమె లైంగికత, పిల్లలను కనే శక్తి, ఆమె మానసిక స్థితి, ఆమె భావాలు అన్నీ అతడి ఆధీనంలోనివే. అదే సమయంలో ఆమె తన భర్తకు, పిల్లలకు అవసరమయ్యే అన్ని పనులు చేసే సేవకురాలు, బానిస. ఆమెకు లోలోపల ఎటువంటి భావన లేకపోయినా ప్రేమను వ్యక్తం చేయడం కూడా ఇందులో భాగం. ప్రేమతో పనిచేయాలి. ఇక్కడ పనే ప్రేమ అవుతుంది. పరిస్థితి ఎప్పుడూ భరించలేనిదిగా ఉండదు; కానీ అది అలా మారదని ఎవ్వరూ హామీ ఇవ్వలేరు”.- క్లాడియా వాన్‌ వెర్ల్‌హాఫ్‌

సమాజంలో ‘శూద్రులు’ లేదా ‘తక్కువ’ కులం వాళ్ళు చేసే పనులను స్త్రీలు కుటుంబంలో చేస్తారు. ప్రతి కుటుంబంలోనూ స్త్రీలు ‘శూద్రులు’ అయితే, పురుషులు ‘ద్విజులు’ లేదా ‘ఉన్నతకులం’ వారు. బూర్జువా, లేదా ఉన్నత కుటుంబంలో సైతం స్త్రీలు సేవలు చేసేవాళ్ళు. అందుకే ‘శూద్రులు’ మాదిరిగా స్త్రీలు కూడా ఉన్న ఆశయాలకు అనర్హులవుతారు. ఈ నీచ పనులు అంత ముఖ్యమైనవి కావని, అంత విలువైనవి కావని భావించడం వల్ల ఇటువంటి పనులను ఇంటిలో చేసినందుకు స్త్రీలకు ఎటువంటి గుర్తింపూ, వేతనమూ లభించదు. ఇంటి బయట చేసినపుడు తక్కువ వేతనం మాత్రమే లభిస్తుంది.

సాధారణంగా స్త్రీ ఇంటి బయట చేసే పని ఇంటి పనికి విస్తరణ అవుతుంది. ఉదాహరణకు అధిక సంఖ్యలో స్త్రీలు కిండర్‌ గార్డెన్‌ లేదా ప్రాథమిక పాఠశాల టీచర్లుగా, నర్సులుగా, ఎయిర్‌ హోస్టెస్‌లుగా పనిచేస్తుంటారు. అధికారం, పెత్తనం, నియంత్రణ గల

ఉద్యోగాలు పురుషులు చేసేవిగా; రక్షణ, పోషణ, సేవ గల ఉద్యోగాలు స్త్రీలు చేసేవిగా పరిగణించబడతాయి. స్త్రీలు ఇంటిలో పరాధీనులు. వారు ఇంటి బయట కూడా పరాధీనులుగానే కొనసాగుతారు. పురుషులు ఇంటిలో నియంత్రణ, అధికార స్థాయిలో ఉంటారు. బయట ప్రపంచంలో కూడా అదే రకమైన ఉద్యోగాలు చేస్తారు. పురుషులు మరింత ఎక్కువ చదువుకుని ఉంటారు. మరింత ఎక్కువ శిక్షణ పొంది ఉంటారు. వారికి బయట పని, ఇంటి పని చేయాల్సిన రెట్టింపు భారం ఉండదు. కాబట్టి వృత్తి ఉపాధులలో వారు స్త్రీల కంటే వేగంగా పైకి ఎగబాకుతారు.

”మనం పీల్చే గాలి మాదిరి స్త్రీ చేసే ప్రతి పని ఫలవంతంగా ఉండి, ఉచితంగా లభించాలి. ఇది కేవలం పిల్లల్ని కనడం, పెంచడానికి మాత్రమే పరిమితం కాదు; ఇది ఇంటి పనికి, వేతనం మీద చేసే పనికి కూడా వర్తిస్తుంది. పనిచేసే తోటివారి ఉద్వేగాలను పట్టించుకోవడం, స్నేహపూర్వకంగా ఉండడం, అణిగి ఉండడం, ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉండడం, అన్ని గాయాలను నయం చేయడం, లైంగికంగా వాడుకోబడటాన్ని అంగీకరించటం, అన్నింటినీ తిరిగి చక్కగా సర్దడం, బాధ్యత, ఆత్మత్యాగం కలిగి ఉండడం, ఆచితూచి ఖర్చు చేయడం, గొప్పలు చెప్పుకోకపోవడం, ఇతరుల కోసం తనను తాను కుంచించుకోవటం, ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూనే కనబడకుండా ఉండటం, అన్ని అవసరాలకు ఉపయోగపడడంతో పాటు ‘బురద లోంచి బండిని బయటకు లాగే’ కార్యదక్షత కలిగి ఉండడం, సిపాయి మాదిరి క్రమశిక్షణ, ఓరిమి కలిగి ఉండడం వంటివన్నీ కూడా స్త్రీలు చేయాల్సిన పనిలో భాగంగా పరిగణించబడతాయి”- క్లాడియా వాన్‌ వెర్ల్‌హాఫ్‌.

”ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత వాళ్ళు ఇచ్చిన మొదటి ఉత్తర్వు పురుషులు రుమీ టోపీ పెట్టుకొని, గడ్డాలు పెంచాలనీ; స్త్రీలు పరదా వేసుకుని, ఇళ్ళకు పరిమితమై ఉండాలనీ; స్త్రీలు ఉద్యోగాలు చేయకూడదనీ, సామూహిక స్నానపు గదులను ఉపయోగించుకోకూడదని. కొత్తగా అధికారంలోకి వచ్చిన రాజకీయ వర్గానికి, అది అమలు చేసే జెండర్‌ విధానాలకి మధ్య సంబంధం చిత్రంగా ఉంటుంది. ఇది జెండర్‌ ఆధారిత శ్రమ విభజనను బలోపేతం చేస్తుంది. జెండర్‌ ఆధారిత శ్రమ విభజన దానంతట అదే ఏర్పడే విధానం కాదు. జెండర్‌ ఆధారంగా నిర్మితమైన ఉత్పత్తి, వినియోగం, పంపిణీ వ్యవస్థలో అది ఒక భాగం”. -వసంత కన్నాభిరాన్‌.

జెండర్‌ ఆధారిత శ్రమ విభజన ఈ విధమైన గణాంకాలకు దారితీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సీనియర్‌ యాజమాన్య స్థాయిలో స్త్రీలు 14 శాతం మాత్రమే (యు.ఎన్‌.డి.పి. మానవ అభివృద్ధి నివేదిక, 1995). స్త్రీల జీతాలు, పురుషుల జీతాల నిష్పత్తి అమెరికాలో ఇప్పటికీ 3:5గానే ఉంది. ఇది గత వంద సంవత్సరాలుగా మారలేదు. ప్రపంచంలో అత్యంత పేదలు, నిరక్షరాస్యులు అయిన ప్రజలలో 70 శాతం స్త్రీలే.

మారియా మీన్‌ ప్రకారం జెండర్‌ ఆధారిత పని విభజనను కుటుంబంలోని సమస్యగా పరిగణించకూడదు. సమాజ నిర్మాణమంతటికీ సంబంధించిన సమస్య ఇది.

స్త్రీ, పురుషుల మధ్య తారతమ్యాలతో పని విభజన, వాటికి సంబంధించిన పలు అంశాలు ప్రధాన ఉత్పత్తి సంబంధాలలో భాగమవుతాయి. అంటే ఒక ప్రత్యేక సమాజం, కాలం యొక్క వర్గ సంబంధాలలో భాగమై విస్తృత జాతీయ, అంతర్జాతీయ శ్రమ విభజనలో భాగమవుతాయి. ఫెమినిస్టు చరిత్రకారిణి జాన్‌కెల్లీ ప్రకారం ఆస్తి సంబంధాలను, స్త్రీల సంబంధాలను జెండర్‌ ఆధారిత శ్రమ విభజన, జెండర్‌ విభేదాలను నిర్ణయించే అంశాలుగా పరిగణించాలి. ఇల్లు, బయట ప్రపంచం ఎంత వేరుగా అయితే అంతగా పని, ఆస్తి రెండుగా విభజించబడుతుంది. మనుగడ కోసం ఉత్పత్తి, వాణిజ్యం కోసం ఉత్పత్తి ఉంటాయి. జెండర్‌ ఆధారిత శ్రమ విభజనను ఇవి ప్రభావితం చేస్తాయి.

కానీ చాలామంది జెండర్‌ ఆధారిత శ్రమ విభజనను సహజమైనదిగా పరిగణిస్తారు. స్త్రీలు పిల్లలకు జన్మనిచ్చి, వాళ్ళకు తల్లిపాలు తాపుతారు. కాబట్టి వారి పోషణ, సంరక్షణ బాధ్యతలను వారే బాగా చేపట్టగలుగుతారు కదా?

‘బాగా చేపట్టగలుగుతారు’ అన్న మీ పదప్రయోగం బాగుంది. పిల్లల్ని కనటానికి స్త్రీకి గర్భసంచి, పాలు తాపటానికి స్థనాలు

ఉన్నాయి. కానీ పిల్లల పోషణ, సంరక్షణ చేపట్టడానికి వారికి ప్రత్యేకమైన అవయవాలు ఏమీ లేవు. కాబట్టి ఇతరుల సంరక్షణ చేపట్టడం వారికి ‘సహజం’ ఏమీ కాదు. వేతనం ఉండే సందర్భాలలో ఊడవడం, శుభ్రం చేయటం, ఉతకడం, వంట వంటి పనులన్నీ మగవాళ్ళు చేయగలుగుతున్నారన్నది మనం మరిచిపోకూడదు. కాబట్టి పునరుత్పాదక పనులు చేయడం, చేయకపోవడానికి భౌతికపరమైన, సహజ కారణాలేమీ లేవు.

ప్రస్తుత జెండర్‌ సంబంధాలు, జెండర్‌ ఆధారిత శ్రమ విభజన స్త్రీ శరీర నిర్మాణం ఆధారంగా రూపొందిన ‘సహజమైన అంశాలు’గా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఎవరూ శరీరాలను మించి ఆలోచించే సాహసం చేయటం లేదు. అంతే కాకుండా అంతా ప్రకృతికి ఆపాదిస్తే పితృస్వామ్య హక్కులను ప్రశ్నించాల్సిన, సవాలు చేయాల్సిన అవసరం ఉండదు. అన్ని బాధ్యతల నుండి తప్పించుకోవచ్చు. జెండర్‌ విభేదాలు సహజ నిర్మితమని, జెండర్‌ సంబంధాలు, జెండర్‌ ఆధారిత శ్రమ విభజన సహజమైనవేమీ కాదని వర్క్‌షాప్‌లలో చూపించినపుడు ఈ కారణం వల్లనే పురుషులు ఎంతో తలకిందులవుతారు, ఆందోళనకు గురవుతారు, కోపానికి గురవుతారు. వాళ్ళకి ఏవో హక్కులు సంక్రమించాయి, కాబట్టి ఎల్లకాలమూ అవి అలా కొనసాగాల్సిందే. లింగ ఆధారంగా ఉన్న అసమానతలను అంతం చేయడం ఫెమినిజం, మహిళా

ఉద్యమాల రాజకీయాల ముందు ఉన్న సవాల్‌. ‘సహజమైనవి’గా భావించబడుతున్న ఈ విభేదాలు, ఈ పని విభజన మారిన ఉదాహరణలు అంతగా విస్తృతంగా లేకపోయినప్పటికీ అనేక సమాజాలలో ప్రస్తుతం మనకు దొరుకుతాయి.

స్రీలను ఇంటికి పరిమితం చేయడం, పురుషులు బయట తిరగటం వల్ల వాళ్ళమీద ఉండే సామాజిక కట్టుబాట్ల వల్ల ఈ విధమైన శ్రమ విభజన ఏర్పడి ఉంటుందంటారా?

ఇది ముఖ్యమైన ప్రశ్న. అదే సమయంలో సంక్లిష్టమైనది కూడా. దీనికి సమాధానమివ్వటం అంత తేలిక కాదు. ముందుగా ఇంటా, బయటా ప్రపంచాలకు మధ్య ఉన్న విభజనను అర్థం చేసుకోవాలి. స్త్రీలు ఇంటికి పరిమితమై

ఉండాలి. పురుషులు బయటి వ్యవహారాలు చూస్తూనే ఇంటిని కూడా నియంత్రిస్తారు. అయితే పారిశ్రామిక విప్లవానికి ముందు ఈ విభజన అంత తీవ్రంగా ఉండేది కాదు. ఉత్పత్తి చాలావరకు ఇంటిలో జరిగేది. కుటుంబ సభ్యులందరూ దానిలో పాల్గొనేవారు. ప్రతి ఒక్కరూ ‘కుటుంబ పోషకులే’. పునరుత్పత్తికీ, ఉత్పత్తికీ ఇల్లు కేంద్రంగా ఉండేది. స్త్రీ, పురుషుల మధ్య సహకారం, ఒకరికొకరు తోడ్పడటం

ఉండేది. మనుగడకి తప్పనిసరి కాబట్టి స్త్రీల నైపుణ్యాలకు, జ్ఞానానికి, తరువాత తరానికి జన్మనిచ్చే శక్తికి ఎంతో విలువ ఉండేది. ఈపాత విధానం అనేక రకాలుగా స్త్రీ కేంద్రంగా ఉండేది. వలస పాలిత అమెరికాలోని గృహ ఆధారిత ఆర్థిక విధానంలో స్త్రీ ప్రముఖ పాత్ర పోషించేది కాబట్టి నినబరపaఅస-ఔశీఎaఅ్ణ్ణ అన్న పదం విస్తృతంగా వాడుకలో ఉండేది. (నబరపaఅస అన్న పదానికి గృహ వ్యవహారాలు చూడటం, నిర్వహించటం అని అర్థం).

మార్కెట్‌ ఆర్థిక విధానం, పారిశ్రామికీకరణలలో ఇంటికీ, బయటికీ మధ్య ఉన్న ఐక్యత దెబ్బతిన్నది. ప్రకృతి, మానవుల మధ్య సామరస్యత కూడా దెబ్బతింది. ఉత్పత్తి కేవలం మనుగడ కోసమే కాదు… మార్కెట్‌ కోసం, లాభాల కోసం కూడా ఉత్పత్తి మొదలయింది. క్రమేపీ ఉత్పత్తి వేరుపడి ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలలోకి మారింది. మామూలు ప్రజల జీవితాలను ప్రకృతికి బదులు మార్కెట్‌ శాసించసాగింది.

”ఆర్థిక పురుషుడు” ఇంటి నుంచి బయటపడగా, ‘గృహ స్త్రీ’ అందులోనే ఉండిపోయింది. మగపిల్లలు బడులు, విశ్వవిద్యాలయాలకు వెళ్ళి బయట ప్రపంచానికి అవసరమైన విద్యలూ, నైపుణ్యాలూ నేర్చుకుంటుండగా ఆడపిల్లలు ఇంటిలో ఉండిపోయి ‘ఇంటికి’ సంబంధించిన నైపుణ్యాలు నేర్చుకోసాగారు.

”పాత విధానంలో మహిళలకు ఉన్న ఉత్పత్తి నైపుణ్యాల వల్ల మాత్రమే ఆమెకు ప్రాధాన్యత లభించలేదు. నయంచేసే మూలికలు ఆమెకు తెలుసు. జబ్బుపడ్డ బిడ్డను లాలించే పాటలు ఆమెకు తెలుసు. గర్బధారణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసు. ఆమె వీటిల్లో ప్రత్యేకమైన నైపుణ్యం కనబరిస్తే ప్రసవాలు చేసే మంత్రసాని అయ్యేది, మూలికా వైద్యురాలు అయ్యేది, ‘విజ్ఞురాలు’ అయ్యేది. ఆమె ఖ్యాతి ఇంటినుంచి ఇంటికి, ఊరునుంచి ఊరుకి వ్యాపించేది. పిల్లలను పెంచటం, సాధారణ జబ్బులను నయం చేయటం, జబ్బుపడ్డ వారి సంరక్షణ చూడటం వంటి నైపుణ్యాలను స్త్రీలందరూ తమ తల్లుల నుండి, అవ్వల నుండి నేర్చుకునేవారు” – బార్బరా ఎహ్‌రెన్‌ రీచ్‌, డైడర్‌ ఇంగ్లీష్‌

మార్కెటీకరణ, పారిశ్రామికీకరణ వల్ల యూరప్‌లో సంభవించిన పరిణామాలే దక్షిణ ఆసియాలోనూ సంభవించాయి. ఇక్కడ కూడా విద్యతో పాటు ఉత్పత్తి కూడా ఇంటినుంచి వేరయ్యింది. అంతకు ముందు చాలామంది తమ జ్ఞానాన్ని, తమకు అవసరమైన నైపుణ్యాన్ని ఇంటిలోనే నేర్చుకునేవారు. మనుగడకు అవసరమైన నైపుణ్యాలు, పనులను ఆడపిల్లలు, మగపిల్లలు ఇంటిలోనే నేర్చుకునేవారు.

దక్షిణ ఆసియాలోని కొన్ని మారుమూల రైతాంగ వర్గాలలోనూ, గిరిజనులు, ఆదివాసులలోనూ ఇప్పటికీ గృహ ఆధారంగా చాలావరకు ఉత్పత్తి జరుగుతోంది. ఇప్పటికీ వాళ్ళ ఆర్థిక విధానం చాలావరకు మనుగడ ఆధారిత ఆర్థిక విధానమే. అధిక ఉత్పత్తిని, ఇంటిలో ఉత్పత్తి చేయని వస్తువులతో స్థానిక సంతలో మార్చుకునేవారు. స్త్రీ, పురుషులు గృహ పనులలో సమానంగా పాలుపంచుకునేవారు; ఇంటా, బయట అంటూ అంతగా విభజన ఉండేది కాదు. ఇతర వర్గాలు, ప్రజలతో పోలిస్తే వీరిలో స్త్రీ, పురుషుల మధ్య అంతగా అసమానతలు కూడా ఉండేవి కావు. క్రమేపీ ఈ వర్గాలు కూడా మార్కెట్‌ ఆర్థిక విధానంలో భాగమవుతూ ”పితృస్వామ్య” భావాల ప్రభావానికి గురవుతున్నాయి.

”ఉత్పత్తి విధానంలో మార్పుల కారణంగా ఇల్లు ఆర్థిక ఉత్పత్తికి కేంద్రంగా ఉండడం మారిపోయి, ఆర్థిక ఉత్పత్తిలో హృదయంలేని ప్రపంచం నుంచి ఆశ్రయం పొందేదిగా, బయటి ప్రపంచం నుంచి సేద తీరేదిగా చూడబడుతోంది. పునరుత్పత్తి ఇంటిలో ఉండిపోయి, ఉత్పత్తి బయటికి కదిలిపోయింది. గృహ యజమాన్యం తన ప్రజా స్వభావాన్ని కోల్పోతోంది. అది ఇక సమాజానికి సంబంధించిన విషయం కాదు. అది ఒక వ్యక్తిగత సేవగా మారుతోంది. ఎంగెల్స్‌ చెప్పినట్లు భార్య సామాజిక ఉత్పత్తిలో భాగస్వామిగా కాక ప్రధాన సేవికగా మారుతోంది”.- అలిసన్‌ యు.జగ్గర్‌

ఇంటా, బయటా అన్న ఈ విభజన కారణంగా పురుషునికి కొత్త ప్రపంచాలు, కొత్త అవకాశాలు తలుపులు తెరవగా, స్త్రీ విధులు, ప్రాంతం పరిమితమవుతాయి. ఒకవిధంగా చెప్పాలంటే స్త్రీ-కేంద్ర విధానానికి ఇక చరమదశ. ఇంటా, బయటా మధ్య ఈ విభజన ఫలితంగా స్త్రీలు సమాజం నుండి, ఇతర స్త్రీ, పురుషుల నుంచి వేరు చేయబడతారు. ఒంటరి వారవుతారు.

”స్త్రీల సాంప్రదాయ ఉత్పత్తి నైపుణ్యాలైన నేత, బట్టల తయారీ, ఆహార ఉత్పత్తుల తయారీ వంటివి ఫ్యాక్టరీలలోకి తరలిపోయాయి. శ్రామిక వర్గ స్త్రీలు ఇవే పనులను ఇంటిలో బదులు ఇప్పుడు ఫ్యాక్టరీలలో చేస్తుండవచ్చు. కానీ ఉత్పత్తి ప్రక్రియపై ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి నియంత్రణలేదు. వాళ్ళ పాత నైపుణ్యాలు మరుగున పడిపోతాయి. కాల ప్రవాహంలో నయం చేయటమన్న స్త్రీత్వపు పని కూడా సరుకుగా మారి మార్కెట్‌లో అమ్మకానికి పెట్టబడుతుంది. ఇంటిలో తయారుచేసిన మూలికా మందు స్థానాన్ని బహుళజాతి మందు కంపెనీలు తయారేచేసే రసాయనిక ఉత్పత్తులు ఆక్రమిస్తాయి. మంత్రసానుల స్థానాన్ని సర్జన్లు ఆక్రమిస్తారు” – బార్బర్‌ ఎహ్‌ రెన్‌ రీచ్‌, డైడర్‌ ఇంగ్లీష్‌

(ఇంకా ఉంది…)

Share
This entry was posted in సమాచారం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.